Wednesday, December 4, 2019

తదుపరి ఎత్తు ఎవరిదీ?

తదుపరి ఎత్తు ఎవరిదీ?
పార్కులో ఒక మూల
సిమెంటు బెంచీపై ఒక వృద్ధుడు కూచొని
రెండువైపులా ఎత్తులు తానే వేసుకొంటూ
చెస్ ఆడుతున్నాడు.
తెల్లరాజు, నల్ల రాణి ఎవరూ చూడకుండా
ముద్దులు పెట్టుకొని
ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.
పల్లీల బుట్ట పట్టుకొన్న భటుడు
ఒక్కొక్కరి వద్దా కాసేపాగి ముందుకు
సాగుతున్నాడు.
బరువు తగ్గాలని ఏనుగు
గాల్లో చేతులు ఊపుకొంటూ
బోర్డంతా అటూ ఇటూ వాకింగ్ చేస్తోంది
అమెరికన్ స్వీట్ కాన్ బండి గంట
పదే పదే మోగిస్తున్నాడు మరో బంటు
చెట్టుకింద కూర్చొన్న శకటం తాత
కమ్యూనిస్ట్ మానిఫెస్టో గురించిన కథలేవో
చెపుతున్నాడు చుట్టూ చేరిన కుర్ర భటులకు.
పెదాలపై రెండువేళ్ళు ఉంచుకొని
దీర్ఘంగా ఆలోచిస్తున్నాడా వృద్ధ ఆటగాడు
పిల్ల బంట్లు జారుడు బల్లపై
కేరింతలు కేరింతలుగా జారుతున్నారు
హాండ్ బాగ్ లోని కండోమ్ పాకెట్ ను
బయటకు తీసి రెండు వేళ్ళ మధ్యా తిప్పుతూ
ఎవరికో చూపిస్తోంది ఒక ఆడ బంటు
గుర్రం పరిగెత్తీ పరిగెత్తీ
పడమట లోయలో కరిగిపోయింది
మసక చీకటి మెల్లమెల్లగా
నాగమల్లి పూల పరిమళంతో కలిసి వీస్తోంది.
వృద్ధ ఆటగాడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.
తదుపరి ఎత్తుకోసం.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment