Tuesday, September 27, 2016

"మేకింగ్ చార్జీలు లేవు" అనబడే ఒక సామాజిక వైఫల్యం


ఈ రోజు మార్కెట్ సెంటర్ లో
మహాకవి కనిపించాడు.
గాల్లో ఏదో వ్రాస్తున్నట్లు వేళ్ళు తిప్పుతూ
తనలో తనే ఏదో మాట్లాడుకొంటూ
ఓ విస్మృత సామ్రాజ్యంలా నడుచుకుపోతున్నాడు

మార్కెట్ నిండా మహాకవి పద్యాల్ని
చైనా వస్తువుల్లా కుప్పలు పోసి అమ్ముతున్నారు.
ఎవరో కుర్రవాడు మహాకవి వెంటబడి
"సార్ తీసుకోండి సార్, నాణ్యమైన కవితలు సర్"
అంటూ ప్రాధేయపడుతున్నాడు.
"పొద్దున్న నుంచీ ఏమీ తినలేదు సర్" అరచాడా కుర్రవాడు
"నేనుకూడా" అని గొణుక్కుంటూ సాగిపోయాడు మహాకవి.

నియాన్ లైట్ల వెలుగులో షాపుకు వేలాడదీసిన
కవిత్వ పుస్తకాల్ని చూస్తూ ఓ క్షణం ఆగాడు మహాకవి
"రండి సార్ రండి నిన్నే వచ్చిన సరుకు"
అంటూ షాపువాడు పిలుస్తున్నాడు.
మహాకవి వడివడిగా ముందుకు కదిలాడు.

మహాకవి కవిత్వ ఆథరైజ్డ్ షో రూమ్ వద్ద
క్యూలైన్ కొంచెం కొంచెం పెద్దదవుతూంది.
కులవృత్తిని కోల్పోయిన ఒకనాటి మహాకవి
సెక్యూరిటీ గార్డు వేషమెత్తి షోరూమ్ కి
కాపలా కాస్తున్నాడు.

"బ్రహ్మాండమైన ఆఫర్
మేకింగ్ చార్జీలు లేవు మహాప్రస్థానం 2.0" అంటో
వీధిమలుపు వద్ద రంగురంగుల హోర్డింగ్
విద్యుత్ కాంతులలో వెలిగిపోతుంది.

కొంతమంది యువకులు మహాకవిని గుర్తించి
అతనితో సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నిస్తుంటే
"నేను కాదు, నాకేం తెలీదు" అంటూ వారిని తప్పించుకొని
జారిపోయిన ఫాంటును పైకి లాక్కుంటూ
గుంపులోకలిసిపోయి మాయమయ్యాడా మహాకవి

బొల్లోజు బాబా

ఈ కవిత సూర్య దినపత్రికలో ప్రచురింపబడినది. ప్రచురణకు స్వీకరించిన ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

Tuesday, September 13, 2016

"వెలుతురు తెర" పుస్తక పరిచయం


నా వెలుతురు తెర పుస్తకంపై సుపర్ణ మహి చేసిన రివ్యూ ఈ క్రింది లింకులో చూడవచ్చును






Monday, September 12, 2016

శ్రీ నారాయణ శర్మ గారికి ధన్యవాదాలతో

ఉపాధ్యాయ దినోత్సవం నాడు మంచి కానుక ఇచ్చారు ఎం.నారయణ శర్మ గారు.
శర్మ గారు వ్రాసిన ఒక చాలా మంచి వ్యాసంలో నేను వ్రాసిన మూల్యాంకనం అనే కవితకు చోటు కల్పించినందుకు సదా కృతజ్ఞుడను . హాప్పీస్ :-)

కాకినాడలో శ్రీ కాళోజీ

తెలంగాణా రాష్ట్రంలో శ్రీ కాళోజీ జన్మదినసందర్భంగా పత్రికలలో వ్యాసాలు, సాహితీ సంస్థల ఆధ్వర్యంలో సమాలోచనలు, స్కూళ్ళలో పిల్లల సమక్షంలో సభలు అన్నీ చూస్తుంటే, కన్నుల పండుగలా అనిపించింది. మహాకవిని తలచుకొంటున్న మిత్రులకు అభినందనలు, శుభాకాంక్షలు.
ఈ మధ్య ఒక సభలో ఓ పెద్దాయన చెప్పిన ఒక ఉదంతం - కవిత్వభాషగా ఏది ఉండాలి (ప్రజల భాష లేక గ్రాంధిక భాషా ) అని కవులు దిశానిర్ధేశం పొందటానికి 1950 లలో కాకినాడ పి.ఆర్. కాలేజీలో రెండుమూడు సభలు జరుపుకొన్నారట. తెలుగునాట నలుమూలలనుంచీ వచ్చిన కవులు, పండితులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాడుకొంటున్న సమయంలో, చివరి సభకు విచ్చేసిన శ్రీ కాళోజీ గారు - "ప్రజల భాషే కవిత్వ భాషగా ఉండాలి, అది సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబించాలి" అంటూ ఉపన్యసించి అందరినీ ఒప్పించారట. ఆ సభలో పాల్గొన్న శ్రీ సోమసుందర్ గారు ఈ మాటలకు ప్రభావితమై, తన కవిత్వ భాషను సవరించుకొని, ప్రజలభాషలో వ్రాయటం మొదలుపెట్టారట.
వినటానికి ఆశ్చర్యం కలిగించేదిగా ఉన్నప్పటికీ, ఆ తరువాత ఓ యాభైఏళ్ళ కాళోజీ జీవితాన్ని, సాహిత్యాన్ని పరిశీలిస్తే వారి మాటల లోతు, నిబద్దతలు అర్ధమౌతాయి. గొప్ప ఫలవంతమైన కవిత్వజీవనం వారిది. వారి స్మృతికి వందనాలు
భవదీయుడు
బొల్లోజు బాబా
పి.ఎస్. ఆంధ్రప్రదేష్ లో ఇంత ......"ఐక్యంగా"...... అంతటి గౌరవం, ఘనతను పొందే సమఉజ్జీ అయిన సాహితీవేత్త ఎవరా అని ఆలోచనలో పడిపోయాను ఇపుడు నేను.
"స్వేచ్ఛావిహంగాలు" పై సాక్షిలో వచ్చిన స్వీయపరిచయం. ఎడిటర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.

https://www.facebook.com/bolloju.baba/posts/10207204272169920?pnref=story 
Dated 12 Sep 2016
EPAPER.SAKSHI.COM

Wednesday, September 7, 2016

రూమీ వాక్యాలు

ఏది ఎక్కువ విలువైనది,   కిక్కిరిసిన జన సందోహమా లేక స్వచ్ఛమైన నీ ఏకాంతమా?     ---- రూమీ

ప్రతి చెట్టు ఆకు మరోలోకపు సందేశాన్ని మోసుకొస్తుంది.   చూడు రాలిపోతున్న ప్రతి ఆకు ఒక దీవెనే    ---- రూమీ

మరో లోకం లోకి ఎగురుకుంటా పో.  మోయగలిగినంత సంపదల్ని తీసుకుపో,  రోదించకు   ---- రూమీ

నేను నిజం చెపుతున్నాను, నువ్వు చూసే ప్రతీదీ స్వప్నం వలే అదృశ్యమైపోతుంది    ---- రూమీ

ప్రియమైన ఈశ్వరుడా,  ప్రేమికులందరిని తృప్తిపరచు.  వారికి సుఖాంతాలను ఇవ్వు.  వారి జీవితాలను పండగగా మార్చు.  నీ దయాకాంతి లో వారి హృదయాల్ని నృత్యం  చేయనీ.    ---- రూమీ

నీకు ఏది ఇచ్చినా అది తిరిగి నావద్దకు వస్తుందని నాకు తెలుసు. అందుకే నీకు నా జీవితాన్ని ఇచ్చేస్తున్నాను, నువ్వు తిరిగి నా వద్దకు వస్తావన్న ఆశతో     ---- రూమీ

సూర్యునితో పాటు ఉదయించు.  నిద్ర అనే గుహనుండి బయటకురా. అపుడే ముల్లు గులాబీగా విస్తరించగలదు.    ---- రూమీ  

తెరవెనుక నుంచి ఎవరో మనల్ని గమనిస్తున్నారు.  నిజానికి మనమిక్కడ లేము.  ఇది మన ఛాయ.    ---- రూమీ

నీకు అనుకూలంగా నిన్నందరూ మోసగించారు అన్నట్లుగా జీవించు   ---- రూమీ

దినాంతాన ఆత్మ మురికినీరులా అయి,  సన్నని స్వరంతో ధన్యవాదాలు, ధన్యవాదాలు అంటుంది   ---- రూమీ

నా హృదయ మార్గంలో ఆత్మ చందమామ కనిపించింది.   ఆ ప్రయాణం ఎంత అమూల్యమైనది!   ---- రూమీ

వేదన ఒక బహుమతి.  దానిలోనే దయ దాగిఉంది.    ---- రూమీ

నిన్ను చూస్తూ ఉండటం నన్ను స్వస్థ పరుస్తుంది   ---- రూమీ

కాంతిని కౌగలించుకో,  నీ వాంఛాపవనాలకు అవతల ఉన్న దారుల్ని అది నీకు చూపనీ   ---- రూమీ

వేణువుఊదేవాని ఊపిరి వేణువుకు చెందుతుందా?   ---- రూమీ

Friday, September 2, 2016

రవీంద్రుని క్రిసెంట్ మూన్


2009 లో రవీంద్రుని క్రిసెంట్ మూన్ అనువదించాను. చాలామట్టుకు నా బ్లాగులో పోస్ట్ చేసాను.
ఒక మిత్రుడు వాటిని చదివి ఇవి చిన్నపిల్లలపై వ్రాసిన గీతాలు, వీటిలో భాష సరళంగా లలితంగా ఉండటం సముచితం, కానీ నువ్వు గంభీరమైన, కఠినమైన పదాల్ని ఎక్కువగా ఉపయోగించావు అన్నాడు. అతని అభిప్రాయం కరక్టే అనిపించింది. మిగిలినవి సరిచూద్దామని అనుకొన్నాను కానీ ఆసక్తి, వీలు చిక్కలేదు.
మిత్రుడు Kks Kiran చలం గీతాంజలిలో కూడా ఉన్న ఒక క్రిసెంట్ మూన్ అనువాదాన్ని తన వాల్ పై పోస్ట్ చేసారు. అదే గీతానికి 2009 నేను చేసిన అనువాదమిది.
3. మూలం -- విశ్వకవి రవీంద్రుని క్రిసెంట్ మూన్ Source
శిశువు కళ్లపై వాలే నిద్ర
ఎక్కడనుంచి ఎలా వస్తుందో ఎవరికైనా తెలుసా?
ఓ ఇంద్రజాలిక గ్రామం చెంత
అడవి నీడల మధ్య మిణుగురుల కాంతిలో
మిల మిల మెరిసే రెండు సిగ్గు మొగ్గలు వేళ్లాడుతున్నవట.
శిశువు కళ్లని ముద్దుపెట్టుకోవటానికి నిద్ర అక్కడినించి
బయలుదేరి వస్తుందని అంటారు.
నిదురించే శిశువు పెదవులపై కదలాడే ఆ చిరునవ్వు
ఎక్కడ పుడుతుందో ఎవరికైనా తెలుసా?
పారిపోతున్న శరన్మేఘాంచలాన్ని
నెలవంక తొలికిరణ మొకటి తాకిందట.
అక్కడ ఆనాటి మంచుకడిగిన ఉదయస్వప్నంలో
ఈ నవ్వుకు తొలి జననమని అంటారు.
నిదురించే శిశువు పెదవులపై కదలాడే ఆ చిరునవ్వుకి.
శిశువు మేనిపై మెరిసే మిసిమి
ఇన్నాళ్లూ ఎక్కడ దాగి ఉందో ఎవరికైనా తెలుసా?
శిశువు తల్లి కన్యగా ఉండినపుడు
ఆమె హృదయంలొ మృదుల మౌన కోర్కెవలే నిగూఢంగా దాగిఉన్న ప్రేమే
శిశువు మేనిపై మెరిసే మిసిమి గా వికసించిందంటారు.
తెలుగు అనువాదం--- బొల్లోజు బాబా
మొత్తం అనువాదాన్ని ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.