Monday, November 27, 2017

నన్ను క్షమించవూ......

నన్ను క్షమించవూ......

సంతలో నెమలీకలు అమ్ముతోన్న
ఒక వ్యక్తిని చూసాను

అలా అమ్మటం చట్టరీత్యా నేరమని
అతనితో చెప్పాలనుకొన్నాను

"చిరుగులు పడ్డ మాసిన దుస్తులు
కపాలానికి చర్మం తొడిగినట్లున్న మొఖం
తాడుకి వేలాడుతోన్న పగిలిన కళ్లజోడు
చెప్పులుకూడా లేని కాళ్లతో"
అతని రూపం చూసాకా
చెప్పబుద్ది కాలేదు.

అవసరం లేకపోయినా
ఓ నాలుగు నెమలీకలు కొనుక్కొని
మౌనంగా వచ్చేసాను

నెమలీ నెమలీ
నన్ను క్షమిస్తావు కదూ!

బొల్లోజు బాబా

Friday, November 24, 2017

మోహం


ఆమె నీడ
నగ్నంగా మారి
నన్ను కౌగిలించుకొంది
బిరుతెక్కిన కుచాగ్రాలు
గుచ్చుకొంటున్నాయి
వృత్తిధర్మం ఎరిగిన
వేశ్యలా
నన్ను నేను విప్పుకొని
అర్పించుకొన్నాను
ఖాళీ గవ్వలోని ఇసకలా
కాఫిన్ బాక్స్ లోని దేహంలా
ఆమె నీడలో ఒదిగిపోయి
కొత్తలోకాలకు ప్రయాణం కట్టాను.
బొల్లోజు బాబా

Thursday, November 9, 2017

లోకం


చక్కగా పరిగెడుతున్నాడు
అందరూ చప్పట్లు కొడుతున్నారు
ఎవరో దారిపై
నూనె కుమ్మరించారు
జారి పడ్డాడు
లేచి నిలబడి
అందరకూ నమస్కరించి
వెనుతిరిగాడతను
ఓటమి అతనిది కాదు
బొల్లోజు బాబా

Tuesday, November 7, 2017

మతం


తనతో విభేధించిన
వారిని కూడా దేవుడు
కంటికి రెప్పలా చూసుకొని
రక్షణ కల్పిస్తాడు కదా!
మరి ఆయన భక్తులేమిటి
ఇలా కాల్చి చంపుతున్నారు?
వీళ్ళ చేష్టలకు సిగ్గుపడి
దేవుడు నాస్తిక మతం పుచ్చుకొన్నా
ఆశ్చర్యపడక్కర లేదు.
బొల్లోజు బాబా

Friday, November 3, 2017

ఫ్రాగ్మెంట్స్1.
ఆకాశం
తన పెదాలకు
ఏడురంగుల లిప్ స్టిక్
కొట్టుకొంది
2.
ఒంపులన్నీ
సరిగ్గా ఉన్నాయో లేదొ
ఆఖరుసారి అద్దంలో చూసుకొని
బయటకు అడుగుపెట్టింది
నెలవంక
3.
యానాం ఎలా వెళ్లాలి
కాకినాడ మీదుగానా రాజమండ్రి మీంచా?
కవిత్వ సంధ్యను ఎలా చేరుకొన్నా
ఆ సౌందర్యం లోంచి
బయటకు రాలేరు.
4.
ఫెళఫెళార్భాటాలతో
విరిగిముక్కలయింది
ఇంద్రధనుసు
నీవు మౌనం దాల్చటంతో
5.
విద్య మద్యం
ఇక్కడ MRP ధరలకే
అమ్మబడును.
ఉరేసుకోవటానికి "పెర్మిట్ రూమ్"
సదుపాయం కూడా కలదు
బొల్లోజు బాబా

Wednesday, November 1, 2017

అదేహ ప్రేయసి


నీ జ్ఞాపకాలు నిండిన రాత్రివేళ
నిర్నిద్ర దేహం
అస్వప్న జలాలలో పయనించే
గూటి పడవ అవుతుంది.
నీ రూపం, నీ నవ్వు, నీ వీడ్కోలు
నా మూసుకొన్న కనురెప్పల వెనుక
అద్దం ముందు పిచ్చుకలా
రెక్కలు ఆడిస్తూ, పొడుస్తూ,
మిథ్యా ప్రియునితో రమిస్తున్నాయి
బయటకి వెళ్ళిపోండి అని
చెప్పాలనుకొంటాను వాటితో
ఈ భారాన్ని నేను మోయలేను
అని అరవాలనుకొంటాను.
నీ చుంబనంలో బంధీ అయిన
నా పెదవులు తెరుచుకోవు.
నా గొంతులో కూడా
నువ్వే చిక్కుకొని ఉన్నావు.
బొల్లోజు బాబా