Monday, May 17, 2010

పిడిబాకు

ప్రశాంతతను
గాయపరచే పిడిబాకు
మళ్లా ప్రత్యక్షమైంది

దెబ్బకు స్వప్నం కాస్తా వాస్తవంగా
వాస్తవం కాస్తా మహా ఎడారిగా
మహా ఎడారి కాస్తా మృగతృష్ణగా
రంగులు మార్చేసాయి

ఆ నిర్జలోష్ణ కాసారపుటొడ్డున
రాళ్లు విసురుతో నా ఆత్మ

పిడి బాకు అంచున తృష్ణా బిందువు
పిడి బాకు అంచున మృగకాంక్షా శ్వాస
అచ్చోటనే రుధిర జాతర.
నరక సౌఖ్యం, స్వర్గ బాధ పెనవేసుకొన్న
సృష్టి సౌందర్య విస్ఫొటనం కూడా అక్కడే


తలుపు భళ్లున తెరచా
ఈ సమయం లో వచ్చావేమిటీ!
అందామె ఆశ్చర్యపడుతో
నెత్తురు నింపుకొన్న నా క్షణాల్ని
చూపించా!


గాయపడ్డ నా గీతాన్ని
తన దేహంలోకి తీసుకొని
స్వస్థ పరచిందామె ....ప్రేమతో....




బొల్లోజు బాబా