Saturday, January 31, 2009

టేబుల్ పై చేతి వాచీ

టేబుల్ పై చేతి వాచీ
నెలవు తప్పిన కలువలా ఉంది.

ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
అపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ
ఒక్క అడుగు కూడా తిరిగి రాదు కదా!

దాని డయల్ నూతిలో
అనుభవాలు, జ్ఞాపకాలు, కాలపు తునకలు,
మాగ్గట్స్ లా లుకలుకలాడు తున్నాయ్.
ఎంత జీవితాన్ని ముక్కలు ముక్కలుగా
కత్తిరించి ఉంటాయో కదా దీని ముళ్ళు.

టేబుల్ పై చేతి వాచీ
కాలం లా ముసలిదైపోయింది.

ఎంతకాలాన్ని
నిరీక్షణలు, నిస్ఫ్రుహలు, అసహనాలుగా
పోతలు పోసి ఉంటుందో కదా వాచీ.

ఎన్నిటిక్కట్టు ముక్కల్ని చింపిందో.
ఎన్ని సిగరెట్ పీకల్ని రాల్చుకొందో కదా!
ఎన్ని నిలుపుకోలేని
వాగ్ధానాల్ని పరిహసించి ఉంటుందో కదా.

టేబుల్ పై చేతి వాచీ
అపుడూ, ఇపుడూ అదే మోనాలిసా నవ్వుతో.

గంటల్ని రోజులుగా,
రోజుల్ని ఋతువులుగా
కొన్నింటిని వేగంగా, మరి కొన్నింటిని నీరసంగా
మార్చుకొంటూ సాగిపోయిందీ వాచీ.
కాలాన్ని బంధించాననుకొన్నడు మనిషి, కానీ
దీని డయల్ ఊబిలో పీకలోతు కూరుకుపోయాడు.

టేబుల్ పై చేతి వాచీ
ఒకనాటి పెళ్ళి కానుక.

ఒక వనాన్ని పొడుం చేయగల
ఒడ్రంగి పిట్ట ముక్కంత బలంగా
ఒక జీవితాన్ని పొడుచుకుంటూ
పోయిందీ ముల్లు గర్ర.

దీని రేడియం అంకెల నక్షత్రాల వెలుగులో
రాత్రులు కూడా మినుకు మినుకు మంటూ మెరిసేవి.

టేబుల్ పై చేతి వాచీ
ఇల్లు ఖాళీ చేసేపుడు డ్రాయర్ సొరుగులో దొరికింది.
మా నాన్న పోయిన మూడోరోజున అది ఆగిపోయి ఉంది.
యుద్దానంతరం విస్మరింపబడే సమరయోధునిలా.


బొల్లోజు బాబా

కవిత కొద్ది మార్పులతో ఈమాట జనవరి సంచికలో ప్రచురింపబడినది. సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో
లింకు ఇక్కడ http://www.eemaata.com/em/issues/200901/1394.html

Sunday, January 25, 2009

సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్


ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్నశ్రీ సోమసుందర్ గారు నిత్యయవ్వనుడు, నిత్యోత్సాహి. తెలుగు సాహిత్యక్షేత్రంలో కురువృద్దుడు. వయసు 84 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని తన ఉఛ్వాస నిశ్వాసాలుగా వెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు.

శ్రీ సోమసుందర్ గారు కవిగా, కధకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతోగత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు. సాహితీక్షేత్రంలో వీరు సహస్రబాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా అగుపిస్తారు.

జననం - విద్యాభ్యాసం
శ్రీ సోమసుందర్ గారు తూర్పుగోదారి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం అనే గ్రామంలో శ్రీ కాళూరి సూర్యప్రకాశరావు, శ్రీమతి వెంకాయమ్మలకు 18-11-1924న అష్టమ సంతానంగా జన్మించారు. తన పినతల్లిగారైన శ్రీమతి ఆవంత్స వెంకాయమ్మగారికి సంతానం లేకపోవటం వలన చిన్నతనంలోనే శ్రీ సోమసుందర్ గారు వారింటికి దత్తుకు వెళ్లారు. ఆవిధంగా కాళ్ళూరి అనే ఇంటి పేరు ఆవంత్సగా మారింది.

తనను దత్తత తీసుకున్న వారికి మెండైన సాహిత్యాభిలాష కలిగిఉండటంవల్ల, చిన్నతనం నుంచే సంస్కృత కావ్యాలు, శతకాలు, అమరకోశం వంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం వీరికి కలిగింది. కానీ విధి వశాత్తు వీరి దత్తత తల్లితండ్రులు వీరికి పదేళ్ళ వయసుండ గానే పరమపదించారు. అయినప్పటికీ వీరి చిన్నారి మనసుపై ఆ పుణ్య దంపతులు వేసిన సాహిత్య ముద్ర మాత్రం అలానే నిలిచిపోయింది. వీరి ప్రాధమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943 లో కాకినాడ పి.ఆర్.కళాశాలలో ఉన్నత విద్య నభ్యసించారు.


దేశ భక్తి

ఆ కాలం లో స్వాతంత్ర్యం కోసం జరిపే పోరాటానికి ఆ బాలగోపాలమూ ఉత్తేజితమై సర్వం త్యజించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపేవారు. శ్రీ సోమసుందర్ గారు కూడా అప్పుడు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. 1942 లో విద్యార్ధులను కూడదీసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెచేసారు. వీరి చర్యలకు ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం వీరిని లాకప్పులో పెట్టి, రోజూ స్టేషనుకు వచ్చి సంతకం చేయాలన్న షరతుపై విడుదల చేసింది.

శ్రీ సోమసుందర్ గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పోలీసుదెబ్బలకు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అప్పుడు వ్రాసిన వీరి మొదటి గీతంలో ఎంతటి గొప్ప దేశ భక్తి ఉందో గమనించండి.

రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ...........

ఇక్కడ తన శరీరాన్ని కాకుల్ని గద్దలనూ తినివేయమంటున్నారేమిటా అనుకోవచ్చు కానీ అది అనన్యమైన దేశభక్తిగా గ్రహించాలి, ఎందుకంటే తను చనిపోయిన తరువాత తన శరీరం కూడా బ్రిటిష్ వారికి దక్కకూడదనే తీవ్ర స్వాతంత్ర్య కాంక్ష. (ఇది వారు స్వయంగా చెప్పిన విశ్లేషణ).

వీరు స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్ధి నాయకుడిగా, కమ్యూనిష్టు పార్టీ సభ్యునిగా తనదైన గొప్పపాత్రను పోషించారు. సామ్రాజ్య వాద శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 1954 వరకూ వీరు కమ్యూనిష్టు పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించారు. తరువాత తరువాత రాజకీయాలు, సాహిత్య వ్యాసంగము ఏకకాలంలో నిర్వహించటం వలన , తనకెంతో ప్రీతిపాత్రమైన సాహిత్యానికి తగిన న్యాయం చేయలేకపోతున్నానని ఆత్మపరిశీలన చేసుకొని, క్రమక్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు.

సాహితీ ప్రయాణం
వీరు ఫోర్తు ఫారం చదువుతున్న రోజుల్లో పద్య ప్రక్రియపై మోజు కలిగి, చందస్సును క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. ఈ ప్రక్రియలో ప్రతీ రోజూ అభ్యాసం కొరకు తాను వ్రాసిన వివిధ పద్యాలను మిత్రులకు, ఉపాద్యాయులకు చూపేవారు. 1943 వరకూ కూడా భావకవిత్వం వీరికి తారసపడలేదు. భావకవిత్వాన్ని చదివిన తరువాత వీరు తనదైన వచనా శైలిని అలవరచుకొన్నారు. వీరు కమ్యూనిష్టు కార్యకర్తగా పనిచేసారు కనుక ఆ భావజాలం వీరి కవిత్వంలో అంతర్లీనంగా జాలువారుతుంది. వీరి కవిత్వానికి మానవుడే ప్రాతిపదిక, సమాజమే నేపధ్యం..

వజ్రాయుధం నుండి ఆమ్రపర్ణి వరకూ సుమారు ఆరున్నర దశాబ్ధాల పాటు శ్రీ సోమసుందర్ చేసిన కవితాయానంలో సమాజ సంకుల సమరమే అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఈ కవి మానవుని విస్మరించి, ఆకాశంలో విహరించిన సందర్భాలు కనపడవు.

వీరు 1969-73 ల మద్య కాకినాడకు మకాం మార్చి ' కళా కేళి " అనే సాహిత్య పత్రికను నడిపారు. (వీరు పిఠాపురంలో నివసిస్తున్న ఇంటి పేరు కూడా "కళాకేళి నికేతన్””") ఈ ప్రక్రియలో వీరు కొంత ఆర్ధికంగా నష్టపోయి, కొంత భూమిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఈ కాలం మినహా మిగిలిన జీవితకాలమంతటిలో, వీరు ప్రతిఏటా ఒకటో రెండో పుస్తకాలు చొప్పున రాస్తూనే ఉన్నారు.

1975 లో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి కళా ప్రపూర్ణ అవార్డును పొందినపుడు, వారి అభిమానులు కాకినాడలో సన్మానం జరిపారు. దానికి విచ్చేసిన దేవులపల్లి, వీరికి ప్రత్యేకంగా కబురు పెట్టించి కాకినాడ రప్పించుకొన్నారు. ఆ రోజు జరిగిన సభకు శ్రీ సోమసుందర్ అధ్యక్ష్యత వహించారు. ఆ సభలో దేవులపల్లి ఒక చీటిపై " మీరు నా కవిత్వంపై విమర్శనాత్మక పుస్తకం వ్రాయాలి" అని కోరారు. దానిని పైకి మైకులో చదవమని దేవులపల్లి కోరగా వీరు మైకు తీసుకొని "మీ సాహిత్యం పై నేను పుస్తకం వ్రాయటం నాకు సాద్యమా? "అని అడిగారు. దానికి దేవులపల్లి మరలా మరో చీటిపై " మీరు వ్రాయగలరు, మీకా సమర్ధత ఉంది వ్రాయండి ఇది నా ఆజ్ఞ అనుకోండి" అని వ్రాసి ఇచ్చి, దాన్ని కూడా చదవమని సైగ చేసి చెప్పారట. ఆవిధంగా ఆవిర్భవించిన గ్రంధమే "క్రిష్ణశాస్త్రి కవితాత్మ".

తెలుగు విమర్శనా సాహిత్యంలో ఇంతటి ఉత్తమ విమర్శ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారి కవితాత్మను పట్టుకొన్న గొప్ప పుస్తకమిది. కృష్ణ శాస్త్రి గారి పై వ్రాసిన పుస్తకాలలో ఒకదానికి ప్రైజు ఇవ్వదలచి పోటీ పెడితే, పోటికి పంపించబడ్డ 15 పుస్తకాలలో శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన "కృష్ణ శాస్త్రి కవితాత్మ" అనే ఈ పుస్తకం మొదటి బహుమతి గెలుచుకోవటం వీరి సునిశిత పరిశీలనా శక్తికీ, రచనా పటిమకు నిదర్శనం.

ఇంత సుదీర్ఘకాలంగా మీరు సాహిత్యాన్ని ఎలా సృష్టించగలుగుతున్నారని అడిగినప్పుడు వారు చిరునవ్వు నవ్వి " రాయలేకుండా ఉండలేక. ఏమీ రాయకపోతే ఆరోజు దుర్దినంగా ఉంటుంది" అన్న వారి మాటలను బట్టి, వారు కవిత్వం వ్రాయటం ఒక పూవు సుగంధాలను విరజిమ్మినట్లు, చెట్లు వసంతాన్ని ధరించటం లాగా ఒక సహజ లక్షణమా అని అనిపించక మానదు
శ్రీ సోమసుందర్ గారు జీవితమే కవిత్వం అని నమ్మి, జీవితాన్నే కవిత్వానికి అంకితం చేసిన వ్యక్తి, శతాధిక గ్రంధ కర్త. కొందరు కవులు తాము వ్రాసిన ఒకటి రెండు రచనలతో వచ్చిన కీర్తితో జీవితాన్ని వెళ్లదీస్తారు. కానీ శ్రీ సోమసుందర్ గారి రచనలు అసంఖ్యాకం. దేని ప్రతిభ దానిదే, దేని సౌరభం దానిదే. ్సామాన్య మానవుడిని కవిత్వంలో ఆవిష్కరించటానికై వీరు కవిత్వాన్ని నిత్యాగ్నిహోత్రంగా పాటించారు.

ఆరున్నర దశాబ్ధాల వీరి సాహితీయాత్రలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రళయాలు, కరువులు, ఎన్నో కనిపిస్తాయి. జాతి చైతన్యాన్ని కవితా చైతన్యంగా సమర్ధ వంతంగా తర్జుమా చేసిన అభ్యుదయ కవిగా శ్రీ సోమసుందర్ గారికి తెలుగు సాహిత్యంలో సాటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

వీరు సాహిత్యజీవితంలో అందుకోవలసిన శిఖరాలు అందుకోలేదని నిర్ధ్వంద్వంగా చెప్పవచ్చును. అకాడమీ ప్రైజులు, అవార్డులు వీరి దరి చేరకపోవటానికి కారణం శ్రీ సోమసుందర్ గారు ఎన్నడూ రాజకీయనాయకుల దగ్గర, అధికార పీఠాల్లో ఉన్నవారిదగ్గర తలవంచి నిలబడలేదు.

వ్యక్తిత్వం
శ్రీ సోమసుందర్ అభ్యుదయ కవి. తెలంగాణా ఉద్యమాన్ని కోస్తా ప్రాంతం నుండి సమర్ధించి కవిత్వం వెలువరించిన మహామనీషి శ్రీ సోమసుందర్ గారు. అప్పట్లో " ఖబడ్దార్ హే నిజాం పాదుషా .... ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురని " గర్జించిన సాహసి.

శ్రీ సోమసుందర్ గారి వ్యక్తిత్వంలో మరొక విశిష్టమైన అంశం ఏమిటంటే వీరు చాచే నిష్కల్మష స్నేహ హస్తం. వీరి సమకాలీనులలో ఎవరికైనా ఏదైనా అవార్డు వచ్చినట్లయితే వారిని అభినందిస్తూ వ్యాసమో, పుస్తకమో వ్రాసి ఆ అవార్డేదో తనకే వచ్చినంత ఆనందించటం వీరి కల్మషమెరుగని మనస్సుకు అద్దం పడుతుంది.

వీరు ఎందరో కవులను ప్రోత్సహించారు. అలనాటి ఓలేటి శశాంక మొదలు ఈ నాటి అరుణ్ బవేరా వరకూ.

ఇస్మాయిల్, మిరియాలరామకృష్ణ, మల్లిక్, చందుసుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ వంటి చాలా మందిని వీరు వెన్ను తట్టి ముందుకు నడిపించారు.

వీరికి రెండు పార్శ్వాలు. ఒకటి రచనా వ్యాసంగం. రెండవది తన రచనల్లో దేన్నైతే ప్రవచించారో దానికోసం నిరంతర పోరాటం. దానిలో భాగంగా శ్రీ సోమసుందర్ గారు ప్రతీ ఏటా ఐదుగురు కవులకు ఆరువేల రూపాయిల నగదు బహుమతిని, తాను నెలకొల్పిన సోమసుందర్ లిటరరీ ట్రస్టు ద్వారా అందచేస్తున్నారు.

2006 లో వీరి ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆధునిక మహిళా సాహిత్య సదస్సు జరిపారు. దానికి రాష్ట్రం నలుమూలలనుంచీ అనేక మంది కవయిత్రులు విచ్చేసి పాల్గొన్నారు.

పాత కొత్త తరాల వారధి
1953 వరదలకు చలించిపోయిన సోమ సుందర్ గారు వ్రాసిన గోదావరి జలప్రళయం అనే కావ్యంలోని కొన్ని కరుణ రస ప్రధాన పద్య పాదాల ను చూస్తే వీరి కవితా శక్తిని గుర్తించవచ్చును.

ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమన్యాయమే తల్లీ...

2004 లో వీరు రచించిన అక్షర నాదం అనే కవితా సంపుటిలోని కొన్ని పద చిత్రాల ను గమనించినట్లయితే వీరి ప్రతిభ, వీరేవిధంగా రెండు తరాలకు వారధిగా ఉన్నారనే విషయం సుస్ఫష్టమౌతుంది.

గ్లోబలైజేషన్ తో ఈ భూమి రజస్వలై
నవవరాన్వేషణలో మిటకరిస్తుంది......
హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ తో
అవతరించిన క్లోనింగ్ కోడె దూడ
' అంబా" అని అరవడం
గ్రాంధికమని నిషేదిస్తుంది. (నేటిని ఏటికి విడిచి అనే కవితనుంచి )


నేడు నా ముని వాకిట
పూచిన గులాబి పరిమళం నిండా
బాంబుల విషధూమం నింపింది పడమటి గాలి (సమరం కాదిది మరణం అనే కవితనుంచి )

ఇన్ని జంత్ర స్వరాల నాదాలలోంచి
ఎన్ని వెన్నెల మైదానాలు - ఎలా తెరుచుకున్నాయి?
దూరంలో మసకబారిన కొండలు
బూడిద బుంగలు (బితోవెన్ సంగీతంపై వ్రాసిన మూన్ లైట్ సొనాటా అనే కవిత నుంచి)

వంకవంకల వయ్యారాలతో
తల్లిలా పవళించిన ఏటి ఒడిలో
నిటారుగా నిలచిన కొబ్బరి తోట....
రేగిన జుత్తుతో ఊరికే మారాంచేసే
పిల్లవాడి వెర్రి ఊగిసలాట...... (ఏటి వడిలో కొబ్బరి తోట అనే కవిత నుంచి)


వీరి కవిత్వంలో సరళత, అదే సమయంలో అర్ధ గాంభీర్యతా , ఉదత్తమైన లోతైన భావాలు, మానవత్వపు పరిమళాలు పుష్కలంగా పొర్లాడుతూంటాయి.

బానిసల దేశం, గోదావరి ప్రళయం, రక్తాక్షి, హిరోషిమా, రక్షరేఖ, సీకింగ్ మై బ్రోకెన్ వింగ్, వంటి వీరి రచనలలో ఆయా సంఘటనలకు, సందర్భాలకు ఒక కవి తన హృదయమంతటితోనూ స్పందించిన విధానాన్ని దర్శించవచ్చు.

అంధురాలికోసం బిథోవెన్ సృష్టించిన వెన్నెల, సౌరాష్ట్రంలో జరిగిన నరమేధం, ఎన్నటికీ పూర్తికాని సోమశిల ప్రోజెక్టూ, ఖుజరహో శిల్ప విన్యాసం, సొమాలియాలో అన్నార్తులూ, సైగల్ గానమాధుర్యం ఇవీ వీరి కవితా వస్తువులు. వీటిలో ఏ ఒక్కటీ కూడా ఈ మట్టిని , గాలిని విడిచి సాము చెయ్యవు.

అవార్డులు
వీరు 1979 లో సోవియట్ లాండ్ నెహ్రూబహుమతి పొందారు. రాజాలక్ష్మీ ఫౌండేషను అవార్డు, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు. 2008 సంవత్సరానికి గానూ ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం వీరిని వరించి వన్నెకెక్కింది.

శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి ఇంతవరకూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాకపోవటం ఆశ్చర్యకరం. ప్రభుత్వ పరంగా వీరికి జరిగిన అన్యాయం పెరుమాళ్ల కెరుక. కవిత్వం సోమసుందర్ కెరుక.


వీరి రచనల పట్టిక
వీరింతవరకూ 77 పుస్తకాలు రచించారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి.
వీరు ప్రస్తుతం తన స్వీయచరిత్ర రెండవ భాగాన్ని వ్రాస్తున్నారు.

ఈమద్య ప్రచురించిన వీరి పుస్తకం పేరు " దేశి సారస్వతము-సమాజ వాస్తవికత. " దేశి సాహిత్యంలో ఉండే సామాజిక స్పృహపై వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంధం.
వజ్రాయుధం: నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితాసంకలనం. 1946 అక్టోబరు 26న దొడ్డి కొమరయ్య మరణంపై వ్రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవు తుంది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించింది. 1956 లో శ్రీసంజీవరెడ్డి ప్రభుత్వం నిషేదాన్ని ఎత్తివేసింది. ఇది ఇప్పటికి 5 ముద్రణలు పొందింది. అనంతపురం యూనివర్సిటీ వారు దీనిని టెక్ట్స్ బుక్ గా పెట్టుకొన్నారు.
కాహళి : ఇవి ఆంధ్రరాష్ట్ర ఉద్యమ సమయంలో వ్రాసిన కవితలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమిస్తున్న సమయంలో వారానికి ఒకటి చొప్పున "జ్వాల" అనే వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. 1953 లో పుస్తక రూపంగా వచ్చాయి.
గోదావరి జల ప్రళయం: 1953 లో వచ్చిన గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో, శ్రీ సోమసుందర్ గారు రాజమండ్రి, అమలాపురం, కపిలేశ్వరం వంటి ప్రాంతాలను సందర్శించి అప్పటి గోదావరి భీభత్సాన్ని కరుణరసార్ధ్రంగా కవిత్వీకరించారు.
రక్తాక్షి : ఫ్యూడల్ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశత్వాలు, అమానుషత్వాలను కధా వస్తువుగా తీసుకొని చేసిన చందోబద్ద కావ్యం. ఈ కావ్య ప్రత్యేకత ఏమిటంటే ఆధునిక కాలంలో విశ్మరింపబడ్డ ప్రాచీన చందస్సును తీసుకొని రచించటం. ఉదా: శ్రీ వృత్తం, వనితా వృత్తం వంటివి. రక్తాక్షి కావ్యంలో రెండు భాగాలు ఉంటాయి. 1. సచితానందం 2. రక్తాక్షి
మేఘరంజని: 1954 లో వెలువడ్డ కధాకావ్యం. దీర్ఘ వచన పద్యం. మొత్తం ఆరు చాప్టర్లు ఉంటాయి.
సోమరసం-సుందరకాండ: ఇది తాత్విక చింతనామయ కావ్యం. ఏమిటీ లోకం, ఏమిటీ భాదలు వంటి ప్రశ్నలు, వాటికి కవి కనుగొన్న సమాధానాలతో ఈ కావ్యం రచింపబడింది.
మిణుగురులు: అద్బుతమైన పదచిత్రాలతో కూడిన ఆధునిక కవితాసంకలనం.
అనలకిరీటం: 1975 లో వెలువడిన కవితా సంపుటి. Progressive and Revolutionary భావాల Concealed expressions తో కూడిన కవితల పుస్తకం. (శ్రీ సోమసుందర్ గారి మాటలలో)
వెన్నెలలో కోనసీమ : 1977 లో అమలాపురంలో ఆవిష్కరింపబడిన గీత సంపుటి. సంగీతానికి అనుకూలంగా ఉండే గీతాల రచన. ఈ గీతాలలో చాలావాటిని రేడియోలలో పాటలుగా పాడారు.
రాలిన ముత్యాలు: మిని కవితల ఉద్యమానికి ముందే లఘుకవితల పేరిట వ్రాసినటువంటి చిన్ని చిన్ని కవితలు.
మాఊరు మారింది: శ్రీసోమసుందర్ గారు ఎమర్జన్సీని బలపరిచారు. ఈ విషయం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలవరపరచి, వీరితో భేటీ అయి అయిదురోజులపాటు చర్చించగా, వీరు ఎమర్జన్సీ కి వ్యతిరేకంగా తన భావాలను మార్చుకొని, ఒక స్టేట్ మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ భావ పరిణామక్రమంలో వ్రాసిన 7 భాగాల కావ్యమే మావూరు మారింది. దీనిలో ప్రణాళికల ద్వారా గ్రామాలే విధంగా మారాయి అని వివరిస్తూ వ్రాసినటువంటి కావ్యం.
ఆగతనికి శుభారంభం : వచన కవితలు
బృహత్కావ్యాలు (నాలుగు సుదీర్ఘ కవితలు): నాలుగు దీర్ఘకావ్యాలు. సుమారు 300 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో అక్షయతరంగిణి, కాలం వీలునామా, ముక్తఛ్ఛాయ, అరచే లోయలు అనే నాలుగు దీర్ఘ కవితలు ఉంటాయి. దీనిలో ముక్తఛ్చాయ లో మననుంచి మన నీడ విడిపోవటం, అసలు మననీడ అంటే ఏమిటి అనే విషయాలపై తాత్విక, భౌతిక చింతనలతో కూడిన భావాలుంటాయి.
ఒక్క కొండలో వేయి శిల్పాలు: 120 పేజీల దీర్ఘ కవితల సంకలనం
ఆంగ్ల సీమలో ఆమని వీణలు (యాత్రా సాహిత్యం): 1983 లో వీరు ఆంగ్లసీమలో చేసిన ప్రయాణ విశేషాలతో కూడిన ట్రావెలాగ్.
గంధ మాదనం: రచనా కాలం 1995/96. హనుమంతుడు సీతను అన్వేషించటానికి వెళ్లినపుడు మద్యలో మకాంచేసిన పర్వతం పేరు గంధమాదనం. జీవితం యొక్క అన్వేషణకు గ్రంధాలయం ప్రాతిపదిక అనే భావనతో వ్రాసిన దీర్ఘకావ్యం.
చేతావని: చేతావని అంటే వార్నింగ్ (1994). బాబ్రిమసీదు కూల్చినపుడు వ్రాసిన దీర్ఘ కావ్యం. 50 పేజీలు.
దోనా పాలా: ఇది ఒక ప్రదేశం పేరు. గోవా ప్రయాణంలో వ్రాసిన కవితలు.
రక్షరేఖ: బాబ్రి మసీదు కూలగొట్టిన తరువాత బొంబాయిలో (ముంబాయి) మతకలహాలు చెలరేగాయి. ఇలాంటి మతకలహాలు పాకిస్తాను విడిపోయినప్పుడు కూడా జరగలేదు. వాటికి స్పందిస్తూ వ్రాసినటువంటి దీర్ఘ కవితా సంపుటి.
హృదయంలో హిరోషిమా: 1997 లో హీరోషిమా ఉదంతాన్ని స్మరించుకొంటూ వ్రాసిన కవితలు.
ధూప ఛ్చాయ: నక్సలైట్లు రైలుపెట్టిని కాల్చివేస్తే దాన్ని నేపధ్యంగా తీసుకొని వ్రాసిన దీర్ఘకావ్యం.
జీవన లిపి : 120 పేజీల సంపూర్ణ కావ్యం. మానవుడు విప్లవానికై జరిపేకృషి అనే అంశంపై వ్రాసిన దీర్ఘకావ్యం.
సీకింగ్ మై బ్రోకెన్ వింగ్ :దేశంలో అతివాద పార్టీలన్ని (left wing) విడిపోతున్నాయి. దాన్ని సింబలైజ్ చేస్తూ వ్రాసిన అన్వేషాత్మకమైన దీర్ఘ కవిత.
సోమసుందర్ కధలు : 1984 లో ప్రచురింపబడిన శ్రీ సోమసుందర్ గారి బానిసల దేశం వగైరా కధలు.
బుద్దదేవ్ బోస్: శ్రీ బుద్దదేవ్ బోస్ అనే ఆయన ప్రముఖ బెంగాలీ కవి. వీరి మోనోగ్రాఫ్ మరియు కొన్ని కవితల యొక్క అనువాదాలతో కూడిన రచన.
లియోనార్డో డావిన్సీ: డావిన్సీజీవిత చరిత్ర. ఆయనను ఒక సంపూర్ణ మానవునిగా దర్శింపచేసే పుస్తకం.
హంసధ్వని: భారతీయ ఆధునిక సంగీతకారుల జీవితచిత్రణలు. (బిస్మిల్ల, బడేముల్లా తదితరులు).
కాజీ నజ్రుల్ ఇస్లాం: శ్రీ ఖాజీ, బెంగాలీ విప్లవకవి. వీరి కవిత్వాన్ని, జీవితాన్ని ఈ పుస్తకంద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.
కాళిదాసు రామకధ: రచనా కాలం 1990 లు. రఘువంశంలో కాళిదాసు చెప్పిన రామకధకు, వాల్మీకి రామకధకు గల సునిశితమైన వ్యత్యాసాలను తెలుపుతూ వ్రాసిన విశ్లేషాత్మక పుస్తకం.
రుధిరజ్యోతిర్ధర్శనం: శ్రీరంగం నారాయణ బాబు కవిత్వం లోతు పాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూపించిన గొప్ప విమర్శనాత్మక గ్రంధం.
జాతికి జ్ఞాన నేత్రం: శ్రీకొడవటిగంటి కుటుంబరావు రచనలపై చేసిన విశ్లేషణాత్మకమైన గ్రంధం.
కవిత్వం కాలాతీత కాంతిరేఖ: ఆధునిక కవిత్వానికి ఉండవలసిన లక్షణాలపై సూత్రీకరణ చేస్తూ వ్రాసిన విశ్లేషణాత్మకమైన 200 పేజీల గ్రంధం.
ఆధునిక కావ్య ప్రకాళిక: ఇతరుల పుస్తకాలకు వ్రాసిన పీఠికలలో కొన్నింటిని ఏర్చి కూర్చి చేసిన సంకలనం.
అమృత వర్షిణి: తిలక్ కవిత్వంపై వ్రాసిన విమర్శనాత్మక వ్యాసావళి.
సాహిత్యంలో సంశయ కల్లోలం: విరసం ఆవిర్భవించిన కొత్తలో విజయనగరం నుంచి చిత్తూరుదాకా ప్రయాణించి సభలు జరిపి, ఆ సభల్లో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు ఇచ్చిన సమాధానాల సంకలనం. ఆ ఆ ప్రదేశాలలో వారి సందేహాలను చిన్న చిన్న స్లిప్పులపై తీసుకొని, వాటికి సమాధానాలను పత్రికా ముఖంగా ఇచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించి ఈ పుస్తకంగా ప్రచురించారు.
అక్షర సుమార్చన: తిక్కన, వేమన ఇత్యాదులపై వ్రాసిన వ్యాసావళి. శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య గారికి అంకితమీయబడినది.
పురిపండా ఎత్తిన పులి పంజా: పురిపండా అప్పలస్వామి వారిపై వ్రాసిన వ్యాస సంపుటి.
నూరు శరత్తులు : 1990 లకి నూరేళ్ళు నిండిన (కృ.శా., విశ్వనాధ మొ.)వారిపై వ్రాసిన వ్రాసావళి.
ఆ తరం కవితా తరంగాలు: భావకవుల తరువాత వచ్చిన పఠాభి, పాలగుమ్మి పద్మరాజు, వంటి వారిపై వ్రాసిన వ్యాసావళి.
నారాయణ చక్రం: డా: సి. నారాయణ రెడ్డి కవిత్వంపై విశ్లేణాత్మకంగా వ్రాసిన గ్రంధం.
గోపుర దీపాలు : చలం పురూరవ పై వ్రాసిన పుస్తకం.
కృష్ణశాస్త్రి కవితాత్మ: కృష్ణశాస్త్రి కవిత్వంపై సమగ్ర విమర్శ.
గురజాడ గురుత్వాకర్షణ: గురజాడ పై వ్రాసిన పుస్తకం. పూర్రిచర్డ్ అనే మాటపై పరిశోధన ఉంటుంది.
శరచ్చంద్రిక : శ్రీ శ్రీ నుంచి కుందుర్తి వరకూ ఆధునిక కవులపై వ్రాసిన పరిశీలనాత్మక వ్యాసావళి.
ఉర్దూసాహిత్యంలో ఉన్నత శిఖరాలు: కబీర్ నుంచి ఖైఫీ అహ్మద్ దాకా ఉండిన గొప్ప గొప్ప కవులను గురించి పరిచయంచేస్తూ వ్రాసిన పుస్తకం.
శేషేంద్ర జాలం: శేషేంద్ర కవిత్వంపై వ్రాసిన వ్యాసావళి.
అగ్నివీణ ఆలాపించిన అణుసంగీతం: అనిసెట్టి సుబ్బారావు కవిత్వం పై వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.
కవితా కల్పవల్లి: ఆధునిక కవిత్వం-విమర్శనాత్మక విశ్లేషణ.
ఆగామి శతాబ్ధానికి ఆహ్వానం: వ్యాసాలు.
చరమ దశాబ్ది-కవితా రసాబ్ధి: 90 లలో కవిత్వంపై వచ్చిన వ్యాసావళి.
అక్షర నాదం: 2004 కవితా సంపుటి.
ఆమ్రపర్ణి: కావ్యం
జీవన లిపి: సంపూర్ణ కావ్యం
చిన్మయ లహరి: స్వీయ కవితా సంపుటి.
మనస్సంగీతం: పాటల సంపుటి.
విషవలయం: నాటకం. 1980 లలో అనేక పరిషత్తులలో బహుమతులు సాధించిన గొప్ప నాటకం
లేఖలు: సినీనటుడు రమణారెడ్డికి శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన లేఖలను నెల్లూరులోని వీరి అభిమానులు పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.
నగరం నుంచి గగనం దాకా మనిషి: వివిధ పత్రికలలో చుట్టు-చూపు అనే పేరుతో వచ్చిన వ్యాసాలన్నింటిని సంగ్రహపరచి ప్రచురించిన పుస్తకం. సుమారు 250 పేజీలు.
మంది-మనిషి: వ్యాస సంపుటి .

శ్రీ సోమసుందర్ గారి వద్ద ప్రస్తుతం ఇంకా 10 పుస్తకాలవరకూ అముద్రితంగా ఉన్నాయి. త్వరలో వెలువరించాలన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

(91 వ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగు సాహితీ మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో --- పాత పోస్టే మరో సారి)
బొల్లోజు బాబాMonday, January 19, 2009

సాగర తీర సాయింత్రం


ఈ సముద్రం ఒక దట్టమైన నీలి కలువై
తన రేకల అలల అంచులతో
అచల ఏకాంత తీర సైకత మౌనాన్ని ముద్దిడి
తన హృదయలోతుల్లో జనించిన గవ్వల పుప్పొడితో
అభిషిక్తం చేస్తోంది, ఒకానొక ఆదిమ లాలసగా.

మానవజాతి కర్మజలాలన్నీ
ఈ సువిశాల కాలపాత్రికలో
కెరటాలు కెరటాలు గా మరుగుతున్నాయి.

నిర్జన సాగర మైదానాల అనంత దూరాల్ని
ప్రయాణించి అలసిన గాలి మేని నిండా చమట జిడ్డు.

గవ్వల శూన్యపు నిర్జీవ హోరులో
సరుగుడు చెట్ల గాలి ఊళలపై
నీలాంబరపు పారదర్శకతపై
నిర్లిప్త శిలల మౌన చర్మంపై
ఈ లోతైన క్షణాల కలంతో
ఈ సాగర తీర సాయింత్రం తన
మృత్యుగీతాన్ని లిఖించుకొంటోంది.

సూర్యుని కొల్లగొట్టి పిటపిటలాడుతూ
ప్రకాశించిన పగలు పగుళ్లు తీసింది.
పగుళ్లలోంచి రాత్రి మౌన చీకట్లు ఊరుతున్నాయి.
చలితడి ప్రవహిస్తూంది. వెలుగు వర్ణాలు కారిపోతున్నాయి.

వార్ధక్యంతో వంగిపోయిన
ఈ సాయింత్రానికవతల సుదూరంగా
వెన్నెల సంగీతంతోనూ, నిశ్శబ్ధ అలల పరిమళంతోనూ
నీ జ్ఞాపకమొకటి నా స్వప్న దారులలో
మిల మిలా మెరుస్తూ జ్వలిస్తూంది.

బొల్లోజు బాబా

Monday, January 12, 2009

అంతరించిపోతున్న పిచ్చుకలపై........నువ్విక్కడికి రావటం లేదంటే
ఎక్కడో ఉండే ఉంటావులే
అనుకున్నానింతకాలమూ
అక్కడా లేవట కదా! మరెక్కడికి పోయావూ?

రెక్కల టపటపల గమకాల్ని పలికిస్తూ
మెరుపు వేగంతో అటూ ఇటూ ఎగురుతో
మా పచ్చని హృదయాలపై వాలేదానివి.

ఇంటి చూరుకు వేలాడదీసిన
వరి కంకుల కుంచె ఓ నక్షత్రమై
నీకు ప్రేమగా స్వాగతం పలికేది.

నీ అవిశ్రాంత మైధున సంగీతానికి
ఊరు మొత్తం ముసిముసి నవ్వులతో
సిగ్గుపడుతూ మురిసిపోయేది.

చూరు అంచునో లేక మిద్దె కంతల్లోనో
నీవు నిర్మించుకొన్న స్వర్గంవైపు
ఎవరైనా తొంగిచూస్తే, వాని తలపై గింగిర్లు కొడుతూ,
అరుస్తూ నీవు చేసే హడావిడికి
గాలి కూడా బిత్తర పోయేది.

మట్టిలో పొర్లాడుతూ చేసిన ఇసుక స్నానాలు
చాతీపై నల్ల మచ్చతో నీ లైంగిక ద్విరూపకతా
పెరట్లో సస్యరక్షణ గావించిన నీ ఉక్కు ముక్కు
గాయపడ్డ నీ దేహాన్ని సంరక్షించిన మా బాల్యాలు
నా కిటికీ పై వాలి పాటలు పాడి తుర్రుమన్న
ఆ క్షణాలన్నీ, తమ గాలిపెదాలతో
ఈ బొమ్మల పుస్తక పుటల్ని రెపరెప లాడిస్తున్నాయి.

పెంకుటిళ్లు, నిద్ర పగుళ్లలోంచి
కారిపోయిన స్వప్నాలైన వేళ
అవని మొహంపై రసాయిన దాడి నేపధ్యంలో
సెల్ ఫోన్ రేడియేషన్ కనిపించని మృత్యువలై
నిన్నో ఎడ్రస్ లేని ఉత్తరాన్ని చేసేసిందా?

నువ్వు వస్తావని, గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
తరువాత 'మీవంతు' అంటూ
భయపెడుతూంది.

బొల్లోజు బాబా

Thursday, January 8, 2009

విశ్వకవి రవీంద్రుని స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదం 201-326

ఈ సీరిస్ లోని రెండవభాగానికి స్పందించిన నిషిగంధగారికి, భైరవభట్లగారికి, రవిగారికి, పద్మార్పిత గారికి ధన్యవాదములు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
ఇది మూడవ భాగము . ఇందులో 201-326 వరకు పద్యపాదాలుంటాయి.


201
కందిరీగ తన తేనెటీగ మిత్రుల గూడు
ఇరుకైనదని భావిస్తుంటే
దాని తేనెటీగ మిత్రులు చిన్న ఇల్లు
కట్టుకొమ్మని సలహా ఇస్తున్నారు.

202
"నీ అలలను నేను నిలువరించలేను" ఒడ్డు అంది నదితో
“నీ పాదముద్రలను నా హృదిలో నిలుపుకోనీ"

203
చిన్నారి పుడమి ఘోషలో, దినం
సమస్త లోకాల మౌనాన్ని మింగేసింది.

204
గాలి లోని అనంతాన్ని,
నేలపైని సౌందర్యాన్ని,
రెంటిలోని కవిత్వాన్ని
గీతం పలికిస్తున్నది.
దాని పదాలు, నడయాడే అర్ధాలు,
తేలియాడే సంగీతము.

205
సూర్యుడు పశ్చిమాన కృంగిపోయే వేళ
తన ఉదయపు తూరుపు
మౌనంతో ఎదురుగా నిలుచుంటుంది.

206
నాలోకానికి నన్ను నేను తప్పుగా చూపించుకొని
దాన్ని నా విరోధి గా చేసుకోకుండా చూడు ప్రభూ!

207
పొగడ్త నన్ను సిగ్గుపరుస్తుంది.
కానీ నేను దాన్ని రహస్యంగా యాచిస్తూంటాను.

208
ఏ వ్యాపకమూ లేనప్పటి నా నిర్వ్యాపకం
తన ప్రశాంత లోతులలో కలత చెందకుండు గాక!
మౌన జలాల సముద్ర తీర సాయింత్రంలా.

209
కన్యామణీ!
నీ ముగ్ధత్వం తటాకపు నీలిమ వలె
తత్వ లోతుల్ని ఆవిష్కరిస్తోంది.

210
శ్రేష్ఠత్వం ఒంటరిగా రాదు
సపరివార సమేతంగా విచ్చేస్తుంది.

211
ఈశ్వరుని కుడి చేయి బహు మృధువైనది
కానీ ఎడమచేయి బహు కౄరమైనది.
212
నా ఉదయపు తారలకు
అర్ధంకాని భాషలో మాట్లాడుతో
అపరిచిత తరువుల లోకి
నా సాయింత్రం అరుదెంచింది.

213
రాత్రి చీకటి తిత్తి
సువర్ణోదయంగా పగిలింది.

214
అల్పవిషయాలైన పొగమంచు, ఆవిర్లకు
ఆశ ఇంద్రధనుసు రంగులద్దుతుంది.

215
తన సుమాలనే తిరిగి
మానవుని కాన్కలుగా పొందటానికై
ఈశ్వరుడు కాచుకొని ఉన్నాడు.

216
నా శోకపుటాలోచనలు
తమ పేర్లేమిటని అడుగుతో
నన్ను వేధిస్తున్నాయి.

217
ఫలాల సేవలు విలువైనవి
పుష్పాల సేవలు ఇంపైనవి.
కానీ నా సేవ!
వినమ్ర భక్తి నీడలో కొలువుండే
ఆకుల చాకిరీ వలే ఉంచు, ప్రభూ!

218
సోమరి గాలులలో తన తెరచాపను
విప్పుకుంది నా హృదయం,
సాంత్వనిచ్చే ఏదో దీవికై.

219
జనులు కౄరులు, కానీ
మానవుడు దయాళువు.

220
నన్ను నీ పాత్రికను చేసుకొని
నా నిండుతనాన్ని స్వీకరించు, ప్రభూ!

221
మర్త్యలోకం తనప్రేమను తిరస్కరించినందుకు
ఎవరో అమర్త్యుడు చేసే రోదనే, ఈ తుఫాను.

222
మృత్యువు ఒక పగులు కాదు
అందుకే ప్రపంచం కారిపోదు.

223
పోగొట్టుకొన్న ప్రేమలతో జీవితం
మరింత సుసంపన్నమయింది.

224
మిత్రమా! నీ హృదయం,
సూర్యోదయంతో కలిసి వెలుగుతోంది.
సూర్యాస్తమయపు ఏకాకి హిమగిరిలా.

225
మృత్యు జలసూత్రం
జీవితపు నిశ్చల జలాలను
ఆటాడిస్తూంటుంది.

226
నీవు తప్ప మరేమీ లేని వారు
వారు తప్ప మరేమీ లేని వారిని చూసి
నవ్వుకొంటున్నారు, ప్రభూ!

227
స్వీయ సంగీతం లోనే
జీవనోద్యమానికి విశ్రాంతి.

228
పదఘట్టనలు భూధూళి ని
మాత్రమే రేపగలవు
పంటలను కాదు.

229
రాత్రి వేళ సాగర కెరటాలపై
సంతకం చేయకుండానే అంతరించే
కాంతి తళుకుల వంటివి మన పేర్లు.

230
గులాబీని చూసే కళ్లున్న వాడిని
ముళ్లనీ చూడనివ్వండి.
231
పక్షి రెక్కలను స్వర్ణంతో అలంకరించిచూడండి.
ఇక అది ఎప్పటికీ ఆకాశాన ఎగరదు.

232
అపరిచిత జలాలలో కూడ
మన ప్రాంతపు కలువ అంతే అందంగా
వికసిస్తోంది, మరో పేరుతో.

233
హృదయం దృష్టిలో దూరమంటే
దిగంతాలు కలుసుకొనే చోటే!

234
చందమామ కాంతి ఆకాశమంతటికీ
మచ్చలు తనకు మాత్రమే!
235
దీన్ని ఉదయమనకు లేదా
నిన్నటి పేరేదో పెట్టి తిరస్కరించకు.
మొదటి సారిగా చూసే అనామక
నూత్న శిశువులా దీన్ని స్వీకరించు.

236
జ్వాలకు సహోదరులైన
పొగ పటాటోపంతో నింగికీ
బూడిద నేలనూ చేరాయి.

237
"నీ హృదయంలో ఎప్పటికీ నన్నుంచుకోవూ?”
అంది వాన చినుకు మల్లియతో రహస్యంగా.
"అయ్యోరాత" అని నిట్టూర్చి, మల్లియ నేలరాలింది.

238
పిరికి ఆలోచనల్లారా
నన్ను చూసి భయపడకండి.
నేనో కవిని.

239
కీచురాళ్ల శబ్ధాలతో నా హృదయపు
పలచని నిశ్శబ్ధం నిండిపోయింది.
మసక వెన్నెల మేళం.

240
తారాచువ్వలు నింగికి లేస్తూ
నక్షత్రాలను చేసిన పరిహాసం
వాటివెనుకనే నేలను చేరింది.

241
నా దైనందిక కిక్కిరిసిన యాత్రల నుండి నన్ను
సాయింకాలపు ఏకాంతంలోకి నడిపించావు .
దాని అర్ధం కోసమై, నిశ్చల రాత్రంతా
అలా ఎదురుచూస్తూనే ఉన్నాను, ప్రభూ.

242
ఈ జీవితం ఓ సముద్ర యానం.
మనం ఒకే ఇరుకు ఓడ లో కలుసుకుంటాం.
మృత్యువనే తీరాన్ని చేరి
మన మన భిన్న లోకాలలోకి వెళిపోతాం.

243
భ్రమలనే తన నదులలో
సత్య ప్రవాహం పారుతూంటుంది.

244
కాలసంద్రంలో ఒకానొక మధురఘడియకై
నా హృదయం ఇంటిబెంగ పెట్టుకొంది.


245
పుడమి ప్రతిధ్వనించే
ఉదయకాంతే, పక్షిపాట.

246
“నను ముద్దిడేంత స్వాతిశయమా నీకు"
ఉదయకిరణాలు అడిగాయి వెన్నముద్దను.

247
"నిన్నే గానం చేస్తూ పూజించటమెలా?"
సూర్యుని అడిగింది ఓ చిన్ని పూవు.
'స్వచ్ఛమైన నీ నిశ్శబ్ధం ద్వారా"
బదులిచ్చాడు సూర్యుడు.

248
మనిషి ఒక జంతువు అనుకొంటే
మృగం కన్నా హీనుడు అతను.

249
కరిమబ్బుల్ని కాంతి ముద్దిడగా
అవి దేవలోక సుమాలైనాయి.

250
పిడి మొద్దుగా ఉందని కత్తి అంచు
పరిహాసమాడకుండు గాక!

251
రాత్రి మౌనం ఒక సుదూర దీపంలా
తన పాలపుంత కాంతితో వెలుగుతోంది.

252
జీవితమనే సుందర ద్వీపం చుట్టూ
రేయింబవళ్ల అనంత మృత్యుగీతం
సాగరమై ఉబుకుతోంది.

253
ఈ పర్వత శ్రేణి ఓ పుష్పంలా లేదూ?
తన రేకల గిరులతో సూర్యకాంతిని పీల్చుకొంటో!

254
అవాస్తవం అంటే
తప్పుడు భాష్యం చెప్పబడ్డ వాస్తవం,
తప్పుడు చోట చేయబడ్డ వక్కాణింపు.

255
హృదయమా! నీ సౌందర్యాన్ని
ప్రాపంచిక చలనాలలో దర్శించు.
జలాలనూ, గాలిని ప్రతిబింబించే పడవలా.

256
కళ్ళు తమ అద్దాలకు గర్విస్తున్నాయట
తమ దృష్టికి కాక.
257
నేను నాదైన ఈ చిన్న ప్రపంచంలో నివసిస్తూ,
దాన్ని త్యజించటానికై సంకోచిస్తూ ఉంటాను, ప్రభూ!
నన్ను నీ లోకంలోకి తోడ్కొని నా సర్వస్వాన్ని
సంతోషంగా కోల్పోయే స్వేచ్ఛనీయవా, దేవా!

258
అధికారంలో పెరిగినంతమాత్రాన
అబద్దం ఏనాటికీ సత్యంగా ఎదగలేదు.

259
శుభదినపు హరిత ప్రపంచాన్ని
తన గాన కెరటాలతో తాకేందుకు
నా హృదయం ఉవ్విళ్ళూరుతోంది.

260
ఒడ్డున పెరిగే గడ్డిపోచా నక్షత్రాలను ప్రేమించు.
నీ స్వప్నాలు సుమాలుగా వికసిస్తాయి.

261
ప్రభూ!
నీ సంగీతం ఒక కరవాలం వలె ఈ బజార్ల
రణగొణ ధ్వనులను సమూలంగా చీల్చేయనీ.

262
ఈ గలగలలాడే ఆకులు, నా హృదయాన్ని
చిన్నారి శిశువు చేతివేళ్లలా స్పృశిస్తున్నాయి.

263
నా హృదయ విషాదం
తన పెండ్లి కుమార్తె మోము తెరవంటిది.
రాత్రి అది తొలగింపబడేందుకై
ఎదురుచూస్తోంది. (ఇది 98 పద్యమే)

264
చిరు కుసుమం
దుమ్ములో పడి ఉంది.
అది సీతాకోక చిలుక మార్గాన్ని
వెంబడించిందట.

265
దారుల ప్రపంచంలో నేనున్నాను. రాత్రి వచ్చి,
నీ లోకమనే ఇంటితలుపు తెరుస్తుంది, ప్రభూ!
266
నీ సమక్షంలో పాటలు పాడాను.
ఆ సాయింత్రపు గాలివాన దారిలో
నీ దీపాన్ని మోసుకుంటో సాగిపోనీ, ప్రభూ!

267
నా ప్రియతమా!
నిన్ను నా ఇంటిలో ఉండమనలేదు.
నా అనంత ఏకాంతంలోకి రమ్మంటున్నాను.
268
చావు జీవితానికి చెంది ఉంది పుట్టుకలానే.
అడుగు తీసి వేయటమే నడకైనట్లు.

269
పూవులు, సూర్యకాంతులతో నీ గుసగుసల
సారాంసం లీలగా తెలుసుకొన్నాను.
మృత్యువు, బాధలతో నీ సంభాషణల జ్ఞానాన్ని
భోధించవా ప్రభూ!

270
ఉదయచుంబనానికి రాత్రి పూవు ఆలస్యమైంది.
వణుకుతూ, నిట్టూరుస్తూ, నేలరాలింది.

271
సమస్త శోకాలలోనూ నాకు
జగన్మాత జోలపాట వినిపించును.

272
నా మట్టి నేస్తమా!
నీ తీరానికి నేనో అపరిచితుడనై వచ్చాను.
నీ గృహంలో ఓ అతిధి వలె వశించాను.
ఓ మిత్రుని వలె శలవు తీసుకొంటున్నాను.

273
తారల నిశ్శబ్ధపుటంచున మెరిసే
సూర్యాస్తమయానంతర తళుకులా
నా నిష్క్రమణానంతరం నా ఆలోచనలు
నిను చుట్టుముడతాయి.

274
సాయింకాల విశ్రాంతి నా హృదయంలో కాంతులీనుతోంది.
ఎన్నో ప్రేమరహస్యాలను, ఆరాత్రి నా చెవిలో తెలిపింది.

275
చీకటిలో ఉన్న శిశువును నేను.
రాత్రి దుప్పటి లో చేతులు చాచి
నీకై తడుముకొంటున్నాను, తల్లీ!

276
నా దిన చర్య పూర్తయింది.
నా మోము నీ ఒడిలో దాచుకొని
స్వప్నించనీ, తల్లీ!

277
కలిసున్నంత సేపూ
దీపం వెలుగుతూనే ఉంటుంది.
విడిపోయే సమయానికే
అది కొండెక్కుతుంది.278
ఓ ప్రపంచమా!
“ప్రేమికుడు" అన్న ఒక్క పదాన్ని
నా పార్ధివ దేహ మౌనంపై ఉంచెదవా!

279
ఈ లోకాన్ని ప్రేమించినపుడే
దానిలో జీవించగలం.

280
మృతులకు అమరకీర్తిని
మనుజులకు అమృత ప్రేమను
కరుణించు ప్రభూ!

281
ఉదయాంతాన తల్లిని చూసి నవ్వి
నిదుర మత్తు ఇంకా వదలక
మరలి పరుండిన శిశువు లా
నిను నే దర్శించాను, ప్రభూ.

282
నేను మరల మరల మరణిస్తాను.

283
ప్రభూ, నేను జనసందోహం మధ్య నడుస్తున్నపుడు
మేడ మీంచి వినిపిస్తున్న నీ దరహాసాన్ని చూసాను.
రణగొణ ధ్వనుల్ని మరచి, నీ గానంలో మునిగిపోయాను.

284
ద్రాక్షరసంతో నింపబడిన పాత్రికలా
జీవితం ప్రేమతో నిండి ఉన్నది.

285
వాళ్ళు వారి వారి దీపాలను వెలిగించుకొని
తామే వ్రాసుకొన్న గీతాలను
తమ ఆలయాల్లో గానం చేస్తున్నారు.
కానీ పక్షులు,
నీవు కరుణించిన ఉదయకాంతిలో
నీ నామాన్నే గానం చేస్తున్నాయి.
నీ నామమే బ్రహ్మానందము కాదూ!

286
నీ నిశ్శబ్ధం నడుమ నన్ను నడిపించి
గీతాలతో నా హృదయాన్ని నింపేయి, ప్రభూ!

287
మతాబు వెలుగుల లోకాన్ని
కోరుకొనే వారిని అలానే జీవించనీ.
నా హృదయం మాత్రం
నీ నక్షత్రాలకై నిరీక్షిస్తున్నది, ప్రభూ!


288
నా జీవితాన్ని ప్రేమవేదన పెనవేసుకొని
లోతు తెలియని సంద్రంలా గానం చేసింది.
ప్రేమానందం తన పూవనంలో పరిమళించే
కోయిల పాటలను పాడి వినిపించింది.

289
నీ ఇచ్ఛ అదే అయితే దీపాన్ని నిలిపివేయి ప్రభూ,
నేను నీ అంధకారాన్ని తెలుసుకొని, ప్రేమించాలి కదా!

290
దినాంతాన నేను నీముందు నిలుచున్నపుడు
నీవు నా గాయాల మచ్చలను చూస్తావు,
నేను గాయపడి, స్వస్థత పొందానని గ్రహిస్తావు.

291
ఏదో ఒకనాడు మరో ప్రపంచపు సూర్యోదయాన
నీ ముందు మోకరిల్లి నేను నీ పాటలను ఆలపిస్తాను.
నిను అప్పటికే నేను చూసి ఉంటాను, ప్రభో!
మట్టి కాంతిలోనో, మానవ ప్రేమలోనో!

292
ఆనాటి మేఘాలు
వర్షించటానికో, లేక తుఫాను సృష్టించటానికో కాక
నా సాయింసంధ్యాకాశాన్ని వర్ణమయం చేసేందుకు
అలా తేలుతూ వస్తున్నాయి.

293
సత్యబీజాల వ్యాప్తిని విచ్ఛిన్నం చేసే
గాలివానను, సత్యమే స్వశక్తితో ఎదిరిస్తోంది.

294
రాత్రి వచ్చిన గాలివాన ఈ ఉదయాన్ని
స్వర్ణ శాంతి కిరీటంతో అలంకరించింది.

295
సత్యం చివరిమాటను వెంటేసుకొచ్చినట్లు అగుపిస్తుంది
కానీ, తుదిపలుకు, మలిపలుకుకు జన్మనిస్తుంది.

296
కీర్తి క్షయింపలేని సత్య ధారి
ఎంతటి ధన్యజీవి!
297
ప్రభూ, నన్ను నీకు అర్పించుకొన్ననాడు
నీ నామమాధుర్యంతో నాహృదయం నిండిపోయింది.
పొగమంచు కరిగినపుడు, బయటపడ్డ భానోదయంలా!

298
ఈ మౌన రాత్రిలో
అమ్మ అనురాగము
పిల్లవాని అల్లరి పగలు
దాగి ఉన్నాయి.
299
మానవుడు నవ్వినపుడు ఈ లోకం హర్షించింది.
పరిహసించినపుడు అది భీతినొందింది.

300
మానవుడు జ్ఞానంతో
తన బాల్యాన్ని తిరిగి పొందేదాకా
ఈశ్వరుడు ఎదురుచూస్తాడు.

301
ప్రభూ!
ఈ లోకం నీ ప్రేమ రూపమని గ్రహించనీ
అపుడు
నాప్రేమ కూడా పాలుపంచుకొంటుంది.

302
నా హృదయపు శిశిర దినాలపై
నీ సూర్యోదయం నవ్వులు చిందిస్తోంది.
నా వసంతాగమనం పట్ల రవంత
అనుమానం లేకుండా!

303
ఈశ్వరుడు
తన ప్రేమలో అశాశ్వతాన్ని ముద్దు చేస్తూంటాడు
మానవుడు అనంతం కొరకై వెతుకుతూంటాడు.

304
నిష్ఫల వత్సరాల ఎడారి ఇసుకలలో
మోక్ష తరుణం కోసమై నీవు సాగెదవు.

305
ఈశ్వరుని మౌనం మానవ ఆలోచనలను
మాటలుగా ఫలింపచేయును.

306
నిత్య పధికుడా! నా పాటల దారిలో
నీ పాదముద్రలను పోల్చుకొనినావా?

307
నీ ఘనతను నీ పిల్లలమైన మాలో పొందుపరచిన
నిన్ను సిగ్గు పడేటట్లు మమ్ము చేయనీయకు ప్రభూ!
308
దినం సంతోషరహితంగా ఉంది.
కారు మబ్బుల క్రింది కాంతిపుంజం
తన పాలిన బుగ్గలపై కన్నీళ్లులతో
శిక్షింపబడిన బాలునివలె ఉంది.
గాయపడ్డ ప్రపంచ రోదనను గాలి వినిపిస్తోంది.
కానీ నాకు తెలుసు నేను నా మిత్రుని
కలుసుకోవటానికై వెళుతున్నానని.309
ఈ రాత్రి, కొబ్బరాకులు గలగల మంటున్నాయి.
సాగరం ఎగసి పడుతోంది.
చందమామ ఈ ప్రపంచపు హృదయ రాజ్ఞి యైంది.
ఏ తెలియని దిగంతాలనుంచి ఈ బాధించే
ప్రేమ రహస్యాన్ని నీవు తీసుకొచ్చావూ!
నా మౌనంలోకి.

310
నేను స్వప్నిస్తున్నాను. ఒక నక్షత్రాన్ని, ఒక వెలుతురు ద్వీపాన్ని. నేనచటే పుడతానట, నా జీవిత కాల తపస్సు అచటే ఫలించునట, శరత్కాల సూర్యకాంతిలో పండిన వరిచేనులా!

311
నిరర్ధక మూగ సమూహాలు నీ ఘనతను
శ్లాఘిస్తూ జపించిన మధుర కీర్తనలా అన్నట్లు
వానలో తడచిన మట్టి వాసన లేచింది, ప్రభూ!

312
ప్రేమ ఎప్పుడైనా ఓడిపోవచ్చునన్న నిజం
మనమెప్పటికీ ఆమోదించలేని ఒక సత్యం.

313
మన జీవాత్మ ఆర్జించిన సంపదను
మృత్యువు దోచుకుపోలేదనీ
ఆత్మైశ్వర్యం ఆత్మలోనే ఉన్నదనీ
ఒక నాటికి తెలుసుకొంటాము.

314
వసివాడని నా గతకాల పూలను సజ్జలో వేసుకొని.
ఈశ్వరుడు నా సాయింసంధ్యలోకి ప్రవేశించేను.

315
నా జీవన తంత్రులన్నీ శ్రుతి చేయబడినపుడు
నీ ప్రతీ స్పర్శకూ, ప్రేమ సంగీతం పెల్లుబుకుతుంది, ప్రభూ!

316
సత్యనిరతుడనై ఉండేట్లు కరుణించు ప్రభూ!
అపుడు చావు అనే సత్యం నాకు భోధపడుతుంది.

317
అవమానింపబడిన మనిషి విజయం కోసం
మానవ చరిత్ర ఓపికగా నిరీక్షిస్తోంది.
318
పంటకోసిన ఒంటరి పొలాల పై పడే
ఉదయపు మౌన రవికిరణాలలా
నా హృదయంపై ఈ క్షణం, నీ తీక్షణ
దృక్కులు ప్రసరిస్తున్నాయి ప్రభూ!

319
ఎగసిపడే ఈ వెర్రికేకల సంద్రంలో
సురాగాల ద్వీపం కొరకై నే నిరీక్షిస్తున్నాను.
320
అనిర్వచనీయమైన
చీకటిపై సూర్యాస్తమయం
గానం చేసిన గంభీర కీర్తన తోనే
రాత్రి ఆలాపన మొదలైంది.

321
నేను కీర్తి శిఖరాన్నధిరోహించాను.
ఆ నిష్ఫలఎత్తు, శీతగాలులలో మరుగులేకుండెను.
నన్ను నడిపించు మార్గదర్శీ!
ఎక్కడైతే జీవితపు ఫలాలు ఆత్మ జ్ఞానముగా పరిపక్వమౌతాయో,
అట్టి ప్రశాంత లోయల్లోకి
చీకటి పడేలోపు నన్ను తీసుకు వెళ్ళు.

322
సాయింకాల మసక వెలుతురులో ఈ ప్రపంచం వింతైన సొబగులద్దుకొంది.
తరువుల మూలాలు చీకట్లో కలసి పోయాయి.
చెట్ల అగ్రాలు శిరా మరకల వలెనున్నాయి.
ఉదయం వరకూ ఆగి నీ నగర సౌందర్యాన్ని
వెలుగులో చూస్తాను, ప్రభూ!

323
నేను బాధపడ్డాను. నిరాశచెందాను. మృత్యువుని చూసాను.
నీ ఘనమైన లోకంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది ప్రభూ!

324
నాజీవితములోని కొన్ని ప్రదేశాలు ఖాళీగానూ, మౌనంగానూ ఉండేవి.
నా తీరికలేని రోజులకు గాలినీ, వెలుతురునీ అందించిన ఆరుబయళ్లవి.

325
నన్ను పట్టుకొని నా మృత్యువుని నిలుపుచేసే
నా అసంపూర్ణ గతంనుండి నన్ను విముక్తుడిని చేయి ప్రభూ!

326
నీప్రేమలో నాకు విశ్వాసము కలదనెడి మాటే నా చివరిమాట.

బొల్లోజు బాబా

Tuesday, January 6, 2009

విశ్వకవి రవీంద్రుని స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదం 101-200

పూర్ణిమ గారికి, సుజాత గారికి, ఆత్రేయగారికి, మెయిల్ పంపిన కొత్త పాళీగారికి, సుఅనానిమస్ గారికి, గిరీష్ గారికి, ధన్యవాదములు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

ఇది రెండవ భాగము. ఇందులో 101-200 వరకు పద్యపాదాలుంటాయి.
101

ధూళి నిత్యం పరాభవాల్ని పొందుతుంది.

బదులుగా తన సుమాలను సమర్పించుకొంటుంది.

102

పూలు సేకరించటానికై ఆగి పోకు

నడుస్తూనే ఉండు. అపుడు

వాటంతటవే నీ మార్గం

పొడవునా వికసిస్తూంటాయి.

103

వేళ్లు భూమిలోకి విస్తరించిన కొమ్మలు

కొమ్మలు గాలి లోకి చొచ్చుకొన్న వేళ్లు.

104

సుదూర వేసవి సంగీతం

తన పూర్వ కులాయాన్ని అన్వేషిస్తూ

చలికి గజగజ లాడుతుంది.

105

నీ జేబులోని అర్హతలను ఎరువిచ్చి

నీ మిత్రుని అవమానించకు.

106

వృద్దతరువు చుట్టూ పట్టిన నాచులా

అనామక దినాల స్పర్శ

నా హృదయాన్ని అంటి పెట్టుకొనే ఉంది.

107

ప్రతిధ్వని తన మూలాన్ని వెక్కిరిస్తుంది

అదే తన మాతృక అని నిరూపించటానికై.

108

ఈశ్వరుని ప్రత్యేక దీవెనలు తమకున్నాయని

శ్రీమంతులు చెప్పుకొంటూంటే

ఆయన తలదించుకొన్నాడు.

109

నా దీపం ఇంకా వెలిగింపబడలేదు.

నా నీడ నా మార్గం పైనే పడుతోంది.

110

తన మౌన కోలాహలాన్ని

నిమజ్జనం చేయటానికై

మనిషి రణగొణ ధ్వనుల

సమూహంలో దూరాడు.

111

అలసటలో ముగిసేది మృత్యువు మాత్రమే

సంపూర్ణ ముగింపు అనంతంలోనే ఉంది.

112

సూర్యుడు ఉత్త వెలుగు దుస్తులనే

ధరించి ఉన్నాడు.

మేఘాలు మాత్రం మెరుపుల

పటాటోపం ప్రదర్శిస్తున్నాయి.

113

చేయి చాచి తారలను అందుకోయత్నించే

పిల్లల కేకల వలే ఉన్నాయి పర్వతాలు .

114

ప్రేమరాహిత్యపు రహదారి

సమూహంలో కూడా ఒంటరిదే.

115

అధికారం తన తుంటరి పనులను శ్లాఘించుకొంటోంది.

రాలే పండుటాకులు, కదిలే మేఘాలూ నవ్వుకొన్నాయి.

116

సూర్యకాంతిలో పుడమి

వసంత మోహినిలా ఉందీవేళ.

ఒక ఆదిమ పల్లె పదాన్ని

విస్మరింపబడ్డ స్వరంతో అది

ఝుంకారం చేస్తోంది.

117

తాను పెరిగే మహా ప్రపంచంతో

సమాన విలువను కలిగి ఉంది గడ్డిపరక .

118

స్వప్నం మాట్లాడే భార్య

నిద్ర మౌనంగా భరించే భర్త

119

వర్ణము తప్పుతున్న పగలుని ముద్దిడి

చెవిలో రహస్యంగా అంది రాత్రి.

"నేను మృత్యువుని, నీ తల్లిని, నీకు నూతనోదయాన్నీయబోతున్నాను"

120

నిశి రాతిరీ!

దీపమార్పిన నా ప్రియురాలి స్పర్శలా

నీ సౌందర్యం నాకు తెలుస్తోంది.

121

నేమోసుకు తిరిగే నా ప్రపంచం

నా వైఫల్యాల లోకాలన్నింటినీ

క్షేమంగానే చూసుకొంటూంది.

122

మిత్రమా,

సాయింత్రపు వేళ సాగర తీరాన కూర్చొని

అలలను ఆలకించినపుడు నీ ఘనమైన ఆలోచనల

మౌనాన్ని దర్శించగలిగాను.

123

చేపను గాల్లోకి ఎగరేసుకుపోవటం

ఒక దయాపూరిత చర్య అని భావిస్తుంది పక్షి.

124

చంద్రునితో సూర్యుడు పంపించిన

ప్రేమలేఖలకు తన జవాబును

గరికపై కన్నీళులతో రచించింది - రాత్రి.

125

ఉత్తముడు జన్మత: బాలుడే

తన ఘనమైన బాల్యాన్ని

ప్రపంచానికిచ్చేసి వెళ్ళి పోతాడు.

126

నీటి నృత్య హేల మాత్రమే

గులక రాళ్లకు నునుపుదనాన్నిస్తాయి.

సమ్మెట దెబ్బలు కావు.

127

తేనీగలు మకరందాన్ని గ్రోలి

తమ కృతజ్ఞతను ఝుమ్మనిపిస్తో సాగిపోతాయి.

సొగసరి సీతాకోక చిలుకకు తెలుసు

పూవులే తనకు ఋణపడ్డాయన్న విషయం.

128

వాచాలిగా ఉండటం సులభమే

సంపూర్ణ సత్యావిష్కరణకై

కాచుకొని ఉండలేనపుడు.

129

నీ విలాసమెచటా? అని

సాద్యం అడిగింది అసంభవాన్ని.

"దుర్భలుల స్వప్నాలలో"

జవాబు వచ్చింది.

130

అన్ని తప్పిదాలకూ

నీ తలుపులు మూసివేస్తే

సత్యం నిను చేరజాలదు.

131

నా హృదయ విషాదం వెనుక

ఏవో గుసగుసలు వినబడుతూన్నాయ్

-చూడలేకున్నాను.

132

శ్రమే విశ్రాంతికి వ్యాపకం.

సాగర నిశ్చలత

కెరటాలై పడిలేస్తూంటుంది.

133

ప్రేమలో పత్రం పుష్పమౌతుంది

ఆరాధనలో పుష్పం ఫలమౌతుంది.

134

కొమ్మల్ని ఫలింపచేసినందుకు

మట్టి లోని వేళ్లు పారితోషకాన్ని కోరవు.

135

వర్షించే సాయింకాలపు గాలి అలజడి రేపుతోంది.

ఊగే కొమ్మలను చూస్తూ,

అద్భుతాల పట్ల అలా ఆలోచిస్తూ ఉండి పోయినాను.

136

వేళ కాని చీకట్లలో మేల్కొని

అరుస్తూ, క్రీడించే మహా శిశువువలె

ఉంది నడి రేయి తుఫాను.

137

తుఫాను యొక్క ఒకే ఒక

చెలికత్తెవైన సంద్రమా

నీ ప్రియుని వెంబడిస్తూ నీవు రేపే

కెరటాలెంత నిష్ఫలమైనవి.

138

నా శూన్యతకు నాకు సిగ్గేస్తుంది" పదం అంది పని తో

నిన్ను చూస్తుంటే నేనెంత పేదరాలినో

నాకు తెలుస్తూంది" పని అంది పదంతో

139

కాలం అంటే పరివర్తన మనెడి ఐశ్వర్యం

కానీ, గడియారపు ప్రహసనంలో అది

ఉత్త మార్పే తప్ప ఐశ్వర్యం అవుట లేదు.

140

వాస్తవాల దుస్తులు సత్యానికి

చాలా బిగుతుగా ఉంటాయి.

కల్పన అనే దుస్తులు దానికి ఎంతో హాయి.

141

మార్గమా!

అక్కడకీ, ఇక్కడకీ ప్రయాణించేపుడు

నీ పట్ల నాకు విసుగు కలిగేది.

ఇప్పుడు నువ్వు నన్ను అన్ని చోట్లకూ

తీసుకువెళుతున్నావు కదా!

నీ ప్రేమలో బంధింపబడ్డాను.

142

నా జీవితపు తెలియని చీకట్లలో

అనంతనక్షత్రాలలో ఒకటి

నన్ను నడిపిస్తుందని భావించనీ, ప్రభూ!

143

మగువా!

నా ప్రపంచాన్ని నీ సొగసరి

అంగుళులతో స్పృశించావు , అంతే

ప్రశాంతత సంగీతమై పల్లవించింది.

144

కాల శిధిలాల మధ్య ఒక విషాద స్వరం

గూడుకట్టుకొని ఉంది.

నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ - అది

రాత్రివేళల పాడుతూంటుంది.

145

జ్వలించే అగ్ని తన తేజస్సుతో నన్ను హెచ్చరించి

నివురు మూసిన నిప్పునుండి నన్ను రక్షిస్తుంది.

146

ఆకాశం నిండా నా నక్షత్రాలే

పాపం, నా ఇంటిలోని చిరుదీపం

వెలిగింపబడనే లేదు.

147

మృతపదాల ధూళి నీ దేహంపై పరుచుకుంది.

నీ ఆత్మను మౌనంతో కడిగివేయి

148

జీవితంలోని ఖాళీలలోంచి విషాద

మృత్యు సంగీతం వినిపిస్తూంది.

149

ఉదయాన

లోకంతన కాంతి హృదయాన్ని తెరచింది.

! నా మనసా ప్రేమ నింపుకొని రా

దానిని ఆహ్వానించేందుకు.

150

ఆకులతో కూడి

నా ఆలోచనలు గలగల లాడుతున్నాయి.

సూర్యకాంతి స్పర్శకు నా హృదయం గానం చేస్తోంది.

కాల చీకట్లలోకీ, వినీల విశ్వంలోకీ

అనుభవాలతో తేలుతూ

సాగుతున్నందుకు నాజీవితం సంతసిస్తూంది.

151

మహాబలుని శక్తి

పిల్లతెమ్మెరలో ఉంది.

తుఫానులో కాదు.

152

ఒక స్వప్నంలో ప్రపంచమంతా

చెల్లాచెదురై బాధ పెడుతూ ఉండింది.

మెలుకవ వచ్చేసరికి అవన్నీ నీలో చేరాయి.

నాకెంతో తేలికగా ఉంది , ప్రభూ.

153

నా బాధ్యతను ఎవరు తీసుకొంటారు?"

అడిగింది అస్తమిస్తున్న రవిబింబం.

నాకు చేతనైన సాయం చేస్తాను ప్రభూ"

అంది మట్టి దీపం.

154

తుంచిన రేకలతో

పుష్ప సౌందర్యాన్ని

పునర్నించలేవు, మిత్రమా!

155

నిదురించే పక్షుల్ని ఇముడ్చుకునే కులాయంలా

నీ స్వరాన్ని నిశ్శబ్ధం మోస్తూంటుంది.

156

ఉత్తములు నిర్భయంగా

అర్భకులతో కలసి నడుస్తారు.

మధ్యస్థులే దూరంగా ఉంచుతారు.

157

రహస్యంగా పూలను పుష్పించే రాత్రి

మెచ్చుకోళ్లను పగలుకు వదిలేస్తుంది.

158

తనకోరల చిక్కిన వారు

అటునిటు గుంజుకొనుట

కృతఘ్నతగా భావించును-అధికారం.

159

మన పూర్ణత్వానికి సంతోషించినపుడే

మన ఫలాల వియోగాన్ని స్వాగతించగలం.

160

వానచినుకులు భూమిని ముద్దాడి

రహస్యంగా ఇలా అన్నాయి.

"మేము ఇంటిబెంగ పెట్టుకొన్న నీ పిల్లలం తల్లీ

స్వర్గం నుండి నీకొరకై తిరిగొచ్చేసాం"

161

మంచుబిందువుల్ని పట్టుకొంటునట్లు నటిస్తూ

ఈగల్ని చిక్కించుకుంటూంది సాలెగూడు.

162

మోహమా!

నీవు వేదనా దీపాన్ని చేబూని

వచ్చినపుడు నీ మోము చూసి నీవే

బ్రహ్మానందమని పోల్చుకొన్నాను.

163

'నీ కాంతులు ఒకనాటికి అంతమౌనని విజ్ఞులు అనెదరు" మిణుగురు అంది నక్షత్రాలతో.

నక్షత్రాలు ప్రత్యుత్తరమీయలేదు.

164

సాయం సంధ్య వేళలో

ఉదయరాగపు విహంగం

నా నిశ్శబ్ధపు గూటికి చేరును.

165

నా మదిలోని ఆలోచనలు

ఆకాశంలోపక్షుల గుంపులా కదుల్తూన్నాయి.

వాని రెక్కల చప్పుడు నాకు వినిపిస్తోంది.

166

తనకు నీరందించటానికి మాత్రమే

నది ఉందని అనుకోవటం

కాలువకు ఎంత ఇష్టమో!

167

ప్రపంచం తన వేదనతో

నా హృదయాన్ని ముద్దాడి

బదులుగా గీతాల్ని కోరింది.

168

ఏది నన్ను వేదనకు గురిచేస్తున్నది

బయటకు రావాలని ప్రయత్నిస్తున్న జీవాత్మా లేక

లోనికి రావటానికై , మది తడుతున్న లోకాత్మ యా?

169

ఆలోచన తన పదాల్ని తానే

నెమరువేసుకుంటూ ఎదుగును.

170

నిశ్శబ్ధ ఘడియలో

నా హృదయ ఖాళీ పాత్రను ముంచాను.

నీ ప్రేమతో అది నిండింది, ప్రభూ.

171

పని ఉండనీ, ఉండకపోనీ

"ఎదో ఒకటి చేద్దాం" అనవలసివస్తే

వెంటనే తుంటరితనం చిగురిస్తుంది.

172

తన అనామక పుష్పాన్ని నాదని చెప్పుకోవటానికి

పొద్దుతిరుగుడు మొక్క సిగ్గుపడింది.

ఉదయించిన రవి , ఆ చిరుసుమాన్ని చూసి నవ్వి,

"సౌఖ్యమా, నా ప్రియతమా" అన్నాడు.

173

విధిలా నన్ను ముందుకు తోస్తున్నదెవరు?

నా వీపున స్వారీ చేస్తున్న నేనే.

174

సుదూర కొండల మాటున

దాగున్న మేఘాలు

నదుల నీటి పాత్రికలను

నింపుతోఉన్నాయి.

175

నడుస్తూన్నపుడు నా బిందెలోని నీరు

కొద్దికొద్దిగా చిందిపోయాయి.

ఇంటికి చేరేసరికి కొంచెమే మిగిలినయ్.

176

బిందె లోని జలం తళుక్కు మంటూంది.

సముద్రపు నీరు గంభీరంగా ఉన్నది.

సిద్దాంతాలు తేట పదాలలో ఉంటాయి.

పరమ సత్యం గొప్ప నిశ్శబ్ధాన్ని ధరించును.

177

నీ దరహాసం నీ పొలాలలోని సుమాలు.

నీ మాటలు నీ పర్వతాల సరుగుడు చెట్ల గుసగుసలు

నీ హృదయం మాత్రం

మేమందరమూ ఎరిగిన లలన.

178

అల్ప వస్తువులను నా ఆత్మీయులకై

విడిచిపెడతాను.

శ్రేష్టమైనవి అందరి కోసము.

179

మగువా!

నీవు ప్రపంచపు హృదయాన్ని

నీ అశ్రువుల లోతులతో చుట్టుముట్టావు

భూమిని ఆవరించిన సాగరంలా.

180

నవ్వుతో నను

పలకరిస్తున్నది సూర్యకాంతి .

దాని పాపిష్టి సోదరి యైన వాన

నామదితో ఊసులాడుతోంది.

181

ఉదయ సుమం రేకలు రాల్చుకొంది.

సాయింత్రానికల్లా అది

స్వర్ణ స్మృతి ఫలమైంది.

182

తన పాదముద్రల జ్ఞాపకాలను

నిశ్శబ్ధంగా ఆలకించే రాత్రిపూట

రహదారిని నెను.

183

సాయింకాలపు ఆకాశమంటే నాకు

ఒక గవాక్షం

ఒక వెలిగించిన దీపం

ఒక నిరీక్షణ.

184

మంచి చేయటంలో తలమునకలైన వానికి

మంచిగా ఉండే తీరికుండదు.

185

వానలు నిండుకున్న

శరత్కాల మేఘాన్ని నేను

నా నిండుతనమంతా

పండిన వరిచేలల్లో ఉంది.

186

వాళ్లు అసహ్యించుకొన్నారు, చంపేసారు.

ప్రజలు వారిని పొగిడారు.

దేముడు సిగ్గుపడి

జ్ఞాపకాలని హడావిడిగా

పచ్చగడ్డి క్రింద కప్పెట్టేసాడు.

187

బండగా కనిపించే కాలి వేళ్లు

ఒకప్పటి కోమలమైన చేతివేళ్లే.

188

చీకటి వెలుగు వైపుకు

ప్రయాణిస్తుంది. కానీ

అంధత్వం మరణం వైపుకు.

189

ప్రపంచం కుట్రపన్ని తనస్థానాన్ని

కైవసం చేసుకోగలదని

పెంపుడు కుక్కకు అనుమానం.

190

నా హృదయమా!

నిశ్చలంగా ఉండు, ధూళి రేపకు.

ప్రపంచం నిన్ను చేరే

మార్గాన్ని గుర్తించనీ.

191

వేగం పుంజుకొంటున్న బాణంతో

"నీ స్వేఛ్ఛ నాదేనంది" ధనుస్సు.

192

మగువా! నీ నవ్వులో

జీవిత జలసూత్రపు సంగీతముంది.

193

తర్కంతో కూడిన మనసంటే

అన్ని వైపులా పదునున్న కత్తివంటిది.

దాన్నుపయోగించే చేయి

నిత్యం రక్తమోడుతూంటుంది.

194

తన గొప్ప నక్షత్రాలకంటే

మానవుని చిరుదీపం మెరుగ్గా

వెలగడం ఈశ్వరునికి ఎంతో ఇష్టం.

195

సౌందర్య సంగీతంచే మచ్చికచేయబడ్డ

మహోగ్ర అరణ్య తుఫాన్ల లోకమే ప్రపంచం.

196

"నా హృదయం నీ చుంబనపు స్వర్ణ బరిణె"

రవితో అంది సాయంసంధ్యా మేఘం

197

బంధించాలనుకుంటే సౌందర్యం వాడిపోవచ్చు.

స్వేచ్ఛనిచ్చిననాడు అదే నిన్ను వరించవచ్చు.

198

చీకట్లో వినిపించే

చిమ్మెట రొద, వానచినుకు చిటపటలు

నా గతించిన యవ్వన స్వప్నాల గలగలలు.

199

అన్ని నక్షత్రాల్నీ కోల్పోయిన ఉదయపు ఆకాశంతో

నా మంచుబిందువు పడిపోయిందని" సుమం

ఏడుస్తూ చెప్పుకొంటూంది.

200

"ఇది నా పూవు, నా చావు" అంటూ ఏడ్చుచున్నది

జ్వాలలో పగిలి కాల్తున్న కట్టె.
బొల్లోజు బాబా