Monday, March 30, 2009

ఫ్రాగ్మెంట్స్ 2

1.

పావుగంటగా ఆలోచనలేమీ లేవు
యవ్వనం ఫోల్డర్ ఓపెను చేసా!
నీ పరిమళం చుట్టుముట్టింది.

*******

2.

కోరికకు సాఫల్యానికి
మధ్య అగాధం.
చితిలో ఇంకా నిప్పుంది.
పోరాడాల్సిందే!
*******


3.

నిన్నటి రోజాలు
ఎక్కడకు పోయినయ్?
కుసుమం వికసించటంలోనే
దాని చావుంది.
*******


4.

భాయ్
నేను చెప్పే ఈ విషయాన్ని
ప్రపంచం నమ్మటంలేదు.
మనిద్దరం ఒకే వేర్లని కలిగి ఉన్నాం.
********

5.

నగ్న తరువులు --
పత్రాల, పుష్పాల దుస్తులు లేవు.
వసంతం వస్తోంది.

బొల్లోజు బాబా



ఏమంటావూ?

సోక్రటిస్ తాతా!
చావు, బతుకు లలో ఏది ఉత్తమ మార్గమో?
అంటూ గొప్ప సందేహాన్ని ఒదిలి పోయావు.
ఆ ప్రశ్నకు జవాబింకా దొరక లేదు.


కాల మౌన గిలిటిన్ అతిసున్నితంగా
తనపని చేసుకుపోతోంది తప్ప
ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు.

ఏ ఒక్క ఆత్మా తిరిగొచ్చి
"ఇదీ సంగతి" అని చెప్పిన పాపానా పోలేదు.

మృత్యు పాత్రిక ఒంపులలో జీవితం
సుబ్బరంగా ఇమిడిపోతూనే ఉంది.

కొత్త అనుభవాలనూ, ఆలోచనలనూ
యాచించే బిక్ష పాత్ర
రోజూ ఉదయిస్తూనే ఉంది.

స్వప్నాల హంసలు ఖాళీ గాలిలోకి
అలా అదృశ్యమౌతూనే ఉన్నాయి.

తాతా
కొంపతీసి అంతా మిథ్యే నంటావా?
అన్నీ ఇక్కడే నంటావా?

బొల్లోజు బాబా



Sunday, March 15, 2009

ఫ్రాగ్మేమ్త్స్ 2

పొద్దు తిరుగుడు పువ్వుకు

మెడపట్టేసిందట.

ఇట్టే అయిపోయే

శీతాకాల పగల్ల్లు మరి.

*********


కోయిల తదుపరి కూతకై

నిశ్శబ్ధం చెవులు రిక్కించి మరీ

ఎదురుచూస్తోంది.

*********

ఒక వేకువ


కోడి కూసింది
ఈకల మెరుపు
ఆకాశానికి విస్తరించింది.

చుక్కల్నీ చంద్రుణ్ణీ
చంకనేసుకొని రాత్రి
చల్లగా జారుకుంది.


పారిజాతం పూల
ఎర్రెర్రని గొట్టాల్లోంచి
ఎట్టకేలకు ఉదయసంధ్య
విడుదలైంది.

నిద్రగన్నేరు చెట్టు
ఆకుల పిడికిళ్లను తెరచి
కిరణాల గింజల్ని
ఏరుకోవటం మొదలెట్టింది.

బొల్లోజు బాబా

Thursday, March 5, 2009

ఫ్రాగ్మెంట్స్

1. గిల్టీ

బండి చక్రం క్రింద
తొండ పడింది
చూస్తూండగానే
దాన్ని గద్ద తన్నుకుపోయింది.
అయిదేళ్ళ మా పాప కళ్ళల్లో
కళ్ళు పెట్టి చూడలేకున్నాను.

****************



2.
దేవుని పటానికి
ప్లాస్టిక్ దండ.
ఎన్నటికీ వాడని
కోపం.

************



౩.

వర్షం వెలిసింది
పక్షులు ఇంకా
ధ్వనించటం లేదు.


౩.
రోడ్డుపై
పేడేరుకొనే పిల్లగాని చమట
కుండీలో
గులాబీల్ని పూయించింది.


4.

వసంతం చివరి రోజున
జన్మించిన సీతాకోక చిలుక
చీమలకు చిక్కింది.
ఇంద్రధనస్సు చచ్చిపోయింది.


బొల్లోజు బాబా