Saturday, June 28, 2008

ఓ నా ప్రియ గృహమా!


(నేపుట్టి పెరిగిన ఇంటికి వెళ్లినపుడు)


ఓ నా ప్రియ గృహమా!
నీ జుట్టులోకి వేళ్లూన్చి నిమిరి
నాలుగేళ్లవుతుంది.

నిన్నెంత ఇష్టపడుతున్నానో
నీ వియోగంలోనే క్లారిటీ వచ్చింది.
నీలోకి నడవటం అంటే
నా ఆత్మలోకం లో సంచరించటమే!


"రేపు మీ రిజల్ట్స్ వస్తాయట" తెలిసిందా అంటూ
నాన్నింకా నా బాధ్యతల్ని
గుర్తుచేస్తున్నట్టే ఉంది.
"వంటయిపోయింది వడ్డించేయమంటావా" అంటూ
అమ్మింకా కడుపు తడుముతున్నట్లే ఉంది.


కట్టె కాలగా మిగిలిన బూడిద రూపంలా గతం.
గోడల నిండా జ్ఞాపకాలు,
గదులనిండా అనుభవాలు.
నిశ్శబ్ధంలోకి పురాస్మృతులు ప్రవహించాయి.
ఉద్విగ్నంతో గాలి వణికింది.

ఒక తరం వెళ్లిపోయింది.
క్యూ కొంచెం ముందుకు జరిగింది.
ఒక శకం ముగిసింది.
కాలం ఆకుల స్వప్నాలు రాల్చుకుంది.

హృదయానికి వేలాడే జ్ఞాపకాలు
మనసుని చీల్చుకొని వచ్చే పాత గురుతులు
చెట్లు పీల్చుకొన్న సూర్యరశ్మెక్కడికి పోగలదు?



ఇక్కడే కదా
నిస్సహాయతకు, ఉత్సుకతకూ మద్యెక్కడో
నా శైశవం పుష్పించింది.

ఇక్కడే కదా
భుజానికి తగిలించిన స్కూలు బేగ్ కి
భుజానికెత్తుకున్న బాధ్యతకూ మద్యెక్కడో
నా బాల్యం వలికిన అత్తరయ్యింది.

ఇక్కడే కదా
రసాయిన కల్లోల కడలికీ
నిశ్చల తటాకానికీ మద్యెక్కడో
నా యవ్వనం శలవుతీసుకుంది.

కాంక్షా తీరాలకై వెతుకులాటలో
నేపోగొట్టుకొన్న గుప్పెడు మట్టిలో
నిన్ను నేను కోల్పోయాను.
కానీ
నీ సాంగత్య జాలంలో నా అస్థిత్వ శకలాలు
ఇంకా చిక్కుకొనే ఉన్నాయ్.

బొల్లోజు బాబా

Tuesday, June 24, 2008

ఇన్విజిలేటర్ మనోగతం

ఇన్విజిలేటర్ మనోగతం

యేడాది జీవితకాలాన్ని
పదికాగితాలు నిర్ధేశిస్తాయిక్కడ .

పరీక్ష వ్రాయటం అంటే
విజ్జానాన్నినెత్తి కెత్తుకొని,
మూడు గంటల మొహాన
కుమ్మరించటమే.

ఈ మూడు గంటల కోసమేకదా
మనసుని పంజరంలోపెట్టేసి,
శరీరాన్ని శుష్కింపచేసి
మెదడుని గచ్చకాయని చేసి
కాలమనే గచ్చుపై అరగదీయటం.

తెలిసిన ప్రశ్నలొస్తే
గంటల ముల్లు తూరీగ రెక్కలు
ధరిస్తుంది.
ప్రశ్నలు ప్రశ్నలలాగె మిగిలితే
సెకండ్లముల్లు నత్తగుల్లని
తొడుక్కుంటుంది.

పరిక్షా హాలులో
అప్పుడప్పుడు, అక్కడక్కడా
సంజ్ఞలు, సంకేతాలు,
గుసగుసలు, దొంగచూపులు,
వాళ్లందరినీ దొంగలను,
నన్నేమో పోలీసును చేస్తాయి
ఎంత నైతిక హీనత్వం?


పరీక్షవగానే పిల్లలకెంత రిలీఫో!
తొమ్మిదినెలల బరువుని
దించుకొన్న తల్లి కన్నులలోని
వెలుగంత రిలీఫ్.

బొల్లోజు బాబా

Tuesday, June 17, 2008

కొంచెం ఇటు తిరిగి ఏడవండి


(కుటుంబ సభ్యుడు చనిపోగా ఆ షాక్ లో, దు:ఖంతో ఏడుస్తున్న ఒకరిని, " కొంచెం ఇటు తిరిగి ఏడవండి ప్లీజ్" అన్నాట్ట ఓ టీవీ చానెల్ రిపోర్టర్ )


గుండె నెత్తిన పడిన పిడుగు రేపిన
బూడిదను కళ్లు వర్షిస్తున్నాయి.

శోక తటాకానికి గండిపడి కన్నీటిమట్టం
ప్రమాద స్థాయిలను దాటిపోయింది.

విధి వెలిగించిన దు:ఖ జ్వాల
సర్వం దహించగా,
రోదన వాసన గుప్పుమంటుంది.
ఏడుపు భాష్ప వాయువై గదంతా పరచుకొంది.

ఇంతలో
"కొంచెం ఇటు తిరిగి ఏడవండి ప్లీజ్" అన్న నీ మాట,

మానవత్వపు చన్మొనపై కాల్చిన మేకులా దిగింది.
జీవితపు కనుపాపపై మందుపాతరలా పేలింది.
కెమేరా కన్ను విస్తుపోయి చూస్తూండిపోయింది.


నాకు తెలియకడుగుతాను తమ్ముడూ,
సెన్సేషన్ ని, సెక్సునీ, భక్తినీ, భయాల్నీ లాగే
ఏడుపుని కూడా ప్రేక్షకులకు
అందంగా అందించాలనుకున్నావా?

శోకం ఒక జ్వాలా ప్రవాహం,
శోకం ఒక నిప్పుల ఉప్పెన,
శోకం ఒక కుంభవృష్టి,
పట్టి ప్యాకింగు చేయబూనటం..............

శంఖు స్థాపనలు, బహుమతి ప్రధానాలు,
నంగి ముంగి కబుర్ల ఇంటర్య్వూలు,
కల్లబొల్లి మాటల ఉపన్యాసాలు తీసి తీసి
ఏడుపును కూడా
మంచి యాంగిల్లో తియ్యాలనిపించిందా?

దు:ఖానికి ఏంగిల్ ఉండదు తమ్ముడూ,
అదో మహా వలయం
సర్వ వ్యాపితం, సర్వ శక్తిమయం.

బొల్లోజు బాబా

Thursday, June 12, 2008

నిర్మాల్యం

నిర్మాల్యం

(రాత్రివేళలో నగరాల్ని శుభ్రంచేసే వాళ్లను చూసి)


ఒక పగలు ముదుసలై కాల గర్భంలో కలసి పోయాకా

వాళ్లు రోడ్లపై గంగానదీ ప్రవాహమౌతారు.


మనమేమో

ఆరోజు అనలేకపోయిన మాటలను,

చెయ్యలేకపోయిన పనులను, కలలు కలలు గా

నెమరువేసుకొంటూంటాం.

దేహం నిద్రాదేవి పొత్తిళ్లలో పాపాయవుతుంది.


వాళ్లు మాత్రం

నగరం విసర్జించిన నాగరికతను

ఏరిపారేస్తూంటారు.


నిషిద్ద కారీ బ్యాగుల్ని, వ్యర్ధ జీవాల్ని, జీవవ్యర్ధాల్ని,

పుటుక ధన్యమైందనుకొంటున్న సిగరెట్ పీకల్ని,

గుట్కా సాషేల్ని, కిళ్లీ పెంటికల్ని,

కన్యత్వాన్ని కోల్పోయిన కండోముల్నీ

మత్తు వదిలించుకున్న మద్యం బాటిళ్లని,

చరిత్రలో కలసిపోయిన వార్తల శకలాల్ని,

ప్లాస్టిక్ పువ్వుల్నీ, నవ్వుల్నీ, లవ్వుల్నీ, ఒకటేమిటి,

నగరం విసర్జించిన నాగరికతను

వాళ్లు ఏరిపారేస్తూంటారు.


దేవదేవుని ప్రసాదాన్ని అందరికీ తినిపించిన

పాలిథీను అడ్డాకుల్ని, భక్తిమైకు నిశ్శబ్ధతని,

పిల్లవాణ్ణి స్కూలుకు వెళ్లేలా చేసిన చాక్లెట్ల రేపర్లని,

పెన్నుముక్కల్నీ, జ్జానభారానికి అలసిన కన్నీటి చుక్కల్నీ,

ఇంజక్షను సిరంజీల్ని, బాధల బేండేజీల్ని,

అబార్షండ్ శిశువునీ, రక్తాన్ని, చీమునీ, దు:ఖాన్ని, దోపిడీని,

ప్లాస్టిక్ విస్తరాకుపై మిగిలిన మెతుకుల్నీ,

పాలకంటే ఎక్కువ ఖరీదైన నీటిని దాచిన బాటిల్స్ నీ,

వాహనాల గొట్రుకు ఉక్కిరిబిక్కిరై

పండుటాకుతో కలసి రాలిపోయిన పచ్చనాకునీ,

ఒకటేమిటి

నగరం విసర్జించిన నాగరికతను,

వాళ్లు చీపుళ్లతో, తట్టలతో ఏరిపారేస్తారు.


అపుడు నగరం స్నానం చేసినంత ఫ్రెష్ గా తయారై

మరో రేపు (రేప్ ?) కి సిద్దమవుతుంది.





బొల్లోజు బాబా

Sunday, June 8, 2008

బత్తి బంద్ గురించి మేం చేసిన ప్రచారం

బత్తి బంద్ గురించి మాకాలేజీలో మేం చేసిన ప్రచారం గురించి ఈ క్రింది లింకులో చూడగలరు.

http://yanamgurimchi.blogspot.com/

బొల్లోజు బాబా

Monday, June 2, 2008

వైచిత్రి

వైచిత్రి

రాష్ట్రాన్ని కుదిపేసిన
పైశాచిక హత్యోదంత నిందితుల్ని
శిక్షించాలని కోరుతూ
ఒక సమూహం రోడ్డుపై ప్రవహిస్తూవుంది

'శిక్షించాలి శిక్షించాలి
నిందితుల్ని శిక్షించాలి'
ఆక్రోశిత హృదయాల వేదన
రోడ్డుపై నల్ల కెరటమై ఘోషిస్తూవుంది.


ఎర్ర సముద్రం నిలువునా చీలి
మోజెస్ కి దారిచ్చినట్లుగా
ఉరుకుల పరుగుల నగర జీవనం
ఆ సమూహానికి దారి ఇస్తూంది.

ఆ సమూహం ప్రచండ భానుడిలా జ్వలిస్తూ

రోడ్డుపై నల్ల కాంతై ప్రకాశిస్తూవుంది.

సహృదయులు కొంతమంది
ప్లకార్డులు అందిపుచ్చుకున్నారు.


కొంతమంది తమ బిడ్డల్ని
ఒళ్లోకి లాక్కుంటున్నారు.

మరికొందరు అంతా ఈశ్వరేచ్ఛ
అనుకుంటూ సాగిపోయారు.

నిరసన జ్వాలలు
డ్రాయింగు రూములోకి ప్రత్యక్షప్రసారమవగా,
చానెల్ మార్చేసి నేరాలు - పాపాలు సీరియల్
ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది.

శాలువాలకై ప్రాకులాడే ఔత్సాహికుడు
సమూహపు ముందువరసకై
తెగ ఆరాట పడిపోతున్నాడు.

"అబ్బో ఎన్నిఓట్లో" అనుకున్న నాయకుడు
తన రంగు విప్పేసి, నల్లరంగు తొడుక్కుని
కొత్తరాగం అందుకొన్నాడు.

కొంతమంది నవ్వుకుంటున్నారు.

బొల్లోజు బాబా