Wednesday, December 31, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నా మిత్రులకూ, వారి మిత్రులకూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ స్నేహానికి ధన్యవాదములు.

Saturday, December 27, 2014

S/o మాణిక్యం -- ప్రతిభావంతమైన కవిత్వం

           
                  ప్రముఖ కవి శ్రీ సీతారాం  1995లో వెలువరించిన కవితా సంకలనం పేరు S/o మాణిక్యం.  కవిగా సీతారాం నిర్వచనాలకు లొంగడు. జీవించిన క్షణాలను నేర్పుగా కవిత్వంలోకి వొంపుతాడు. అంతర్ముఖత్వము, మార్మికత, అధివాస్తవికతలు  ఇతని కవిత్వానికి లోతైన గాఢత నిస్తాయి. దానిమ్మకాయ వొలుచుకు తిన్నట్లు సీతారాం కవిత్వాన్ని ఓపికగా పొరలుపొరలుగా విప్పుకోవాలి.  సామాజికాంశాల సారాన్ని వైయక్తిక అనుభవాల ద్వారా వ్యక్తీకరిస్తుంది ఇతని కవిత్వం. 

          ఈ సంకలనంలోని కవితలు, మానవ వేదనజీవనానుభవాలు, సమాజపు పోకడల వల్ల మారుతున్న సాంస్కృతిక అస్థిత్వము గురించిన చింతనలతో కూడి చదువుతున్నప్పుడు నిండైన కవిత్వానుభూతిని కలిగిస్తాయి. కొన్ని కవితల్లో మోనిర్మాణ శైలి కనిపించినా ఇతని కవిత్వాన్ని మోకవిత్వంతో పోల్చలేం. 

నా కాలాన్ని నువ్ మొదలెట్టావ్ సరే
కలకాలముంటుందా నాపై
నీ మెత్తటి నవ్వు ...... (నాలుగ్గంటల యాభైనిమిషాలప్పుడు)

నిన్నకూడా ఇలాగే కూర్చొని
నిలబడి
నడిచీ
కొంత నవ్వీ
ఎవరితోనో పోయి
తిరిగివస్తూ కూడా
ఇవన్నీ ఇలాగే ఎందుకున్నాయి ....... (అలవాటు-ఆత్మహత్యాచారిక) --- వంటి వాక్యాలు సీతారాంని మోనీడగా అనుకొనేలా చేస్తాయికొందరు  సీతారాం కవిత్వాన్ని పాత చితి-కొత్త చింత అని విమర్శించారు కూడా.  “మోకవిత్వంలో ఉండే కొరుకుడుపడని తనం, అధిసున్నితత్వం సీతారాం కవిత్వంలో కనిపించదు. సీతారాం కవిత్వంలో చాలా చోట్ల వాక్యాలు గరుకు గరుకు గా తగుల్తాయి.

నాచుట్టూ ఉన్న పిల్లల్లో నేనొక్కడ్నేగా
మంచిబట్టలు లేనివాడ్ని
కాళ్ళకు చెప్పుల్లేక మట్టి తొడుక్కున్న వాడ్ని
నెల నెలా డబ్బులు ఇవ్వలేక వాళ్ళలాగా
నీ ప్రేమకు దూరమయ్యాను ....... (గుడ్నై ట్టీచర్)

ఏ వచ్చీపోయే విమానంలోనూ నీ శవపేటిక దిగక
మనిషి రాకపోతే పోయే
తన శవాన్నైనా పంపకపోయాడా
అంటూ
ఆ విమానాలు దిగే స్థలంలో నిలబడి చూస్తున్నా........ (పంకజవల్లి కన్నీళ్ళు) ----- లాంటి వాక్యాలను మోకవిత్వంలో చూడలేంఅలాంటి వాక్యాలు వ్రాయటానికి సామాజిక నేపథ్యం కూడా కారణమౌతుంది

          ఆర్ధిక, రాజకీయ కారణాలుగా మారుతున్న సామాజిక స్థితిగతులు, సాంస్కృతిక పరిణామాలు ఈ సంకలనంలో అనేక కవితలలో ప్రతిబింబించాయి.

//నువ్వేమైనా మహా అన్దగత్తెవా?
నిన్ను అమ్ముకునేందుకు
అంచేత నిన్నీ సంసారపు డస్ట్ బిన్లో
వేశాను ................. (సూపర్ మోడల్)

//చరిత్రకోసం మనం కొందరం
హిందువుల మయ్యాం
ముస్లిములమూ అయ్యాం
కానీ, మనుషులం కాలేక పోయాం
ఎవరి పదవులకోసమో
మనం చిక్కటి నెత్తుటి మతాలమయ్యాం//........(ఇలా చివరకి మతాలమయ్యాం కదా)

//నీ తండ్రి నిస్సహాయతని వెక్కింరింతలో శిక్షిస్తూ
ఎవరికో రెండో పెళ్ళానివయ్యావట కదా
నీ కోరికలేదీ తీరనందుకే
పిల్లల సంచిలోని కనేపేగును తొలగించుకొన్నావటగా
ఆడపిల్లలు పుడతారని భీతిల్లావా
నీకెప్పుడూ చెప్పలేదు గానీ
అప్పట్లోనే పెళ్లాడాను నిన్ను
కానీ, నీ హృదయాన్ని ఎవరికో ఉత్తరాల్లోరాసి
నా చేతులతోనే పంపుతుంటే
నీతో చెప్పకుండా వచ్చేశాను ............. (తమిళగీతం)    ---- లాంటి కవితలు సమాజ పోకడలను, ఆధునిక జీవన అవ్యవస్థలను ఎత్తిచూపుతాయి.   కొన్ని కథనాత్మకశైలిలో వ్రాసినా ఎక్కడా కవిత్వ సాంద్రత తగ్గినట్లనిపించదు.

          జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు కవిలో అలజడి కలిగిస్తాయిఆలోచనలు రేకెత్తిస్తాయి. సామాన్య కవి వాటిని కథనాత్మక శైలిలో చెప్పగలడుకానీ పరిణితి చెందిన కవిమాత్రమే దానికి ఒక తాత్విక దృక్కోణాన్ని అద్ది కవిత్వీకరిస్తాడు.   “S/o మాణిక్యంసంకలనంలోని కొన్ని కవితలలో అలాంటి సందర్భాలలోని మానవ వేదన  ఆర్థ్రంగా ఆవిష్కృతమై మంచి అనుభూతిని కలిగిస్తుంది.

పొత్తిళ్ళలో పువ్వులాంటి పాప
లేత చిరునవ్వు కాసేపు
లేత ఏడుపు కొంచెం సేపే
నవ్వుకి ఆకలి లేదు
పాప ఏడ్చిందంటే ఆకలికి పిలుపునిచ్చిందనే
ఎదురుగా ప్రయాణికులూ-పులులూ
***
పులులు చూస్తున్న కొద్దీ
ఆమె వస్తువుగా మారిపోతుంది
పోనీ, నువ్వు
పాలు నిండిన వక్షాలనే అనుకొన్నావా?
***
అవి
పసికందుల
అన్నం ముద్దలూ కావచ్చు. ........... (ఓ రైలు ప్రయాణికుడి సందేహానికి?)


తీగల్లోంచి
వాటి గొంతుల్లోంచి వొంపిన మాటల్లో
స్వరాలు గుర్తు పట్టుకున్నాక
మాట్లాడే మాటలకు అర్ధాలుండవు
సంభాషణంతా చెప్పని మాటల్లో మిగుల్తుంటుంది
మాట్లాడనంతసేపూ
మాటలకివతలో అవతలో సంచరిస్తాం
తీరా ముగించాక మొదలవుతాయి
చెప్పాల్సిన మాటలన్నీ.   ..........  (ఫోనో పోనీమ్)

          ఈ సంకలనంలో కనిపించే అనేక కవితలలో స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందిదీన్ని కొందరు కవిత్వ భాషలో Burden of Woman” అని అంటారు కానీ చాలా సందర్భాలలో కవితలలో కనిపించే ఆమె”  నిజజీవిత స్త్రీ కాకపోవచ్చు, కవిచూసే ఒకానొక జీవనపార్శ్వానికి ప్రతినిధో లేక ప్రతీకో

ఓనాటి సాయంకాలం ఆమె వేళ్ళు
చదరంగం బల్లమీద వేగంగా కదిలినప్పుడు
నా పావులన్నీ ఓటమి అంచుల మీద పోరాడుతూ
పరాజయం నీడలోకి కూలాక
ఆమె గెలుపుని
నా ఓడిపోయిన పెదవుల్తో నవ్వాను//............ (అనుభవ గీతంలోకి...!)

గడపలో కూర్చున్నాను
నా వెనుక
గదిలో ఆమె గొంతు
ఎప్పుడొచ్చిందో తెలీదు
తల తిప్పుదును కదా
నా చేతిలో
ఆమె తింటూ తింటూ ఉన్న
బిస్కట్ ముక్క
పిచ్చివాడ్ని
ఆ రాత్రంతా నిఘంటువులు
వెతికాను.  ....................... (సగం తుంచిన బిస్కట్ ముక్క)

          అజంతా కవిత్వానికి మృత్యువు ఒక కాన్వాస్అనేకమంది కవులు మృత్యువుని నేరుగానో పరోక్షంగానో స్పృశిస్తూ కవితలు వ్రాసారు S/o మాణిక్యం సంకలనంలో కూడా మృత్యువుని ధ్వనించే అనేక పదచిత్రాలు, ప్రతీకలు కనిపిస్తాయి.

//ఎవరికి దొరికాడు మనిషి
ఒక్క చావుకి తప్ప// ..... (అనుకోకుండా వెళ్తున్నా.....)

//దుఃఖమెప్పుడూ దేహంలోనే ఉంటుంది
గుండెప్పుడూ దుఃఖ నదిమీది నౌకలా
అటూ ఇటూ ఊగుతూనే//
నువ్వు దుఃఖాన్ని నవ్వుతూ ఉండు
నా మరణ వార్త వినేదాకా. ......... (ఆ తరువాత)

// అతనూ చనిపోతాడు
ఆమెకంటే ముందో వెనకో//
పోతూ పోతూ ఈ లోకానికి ఒక మాట
మా ఇద్దర్నీ అక్కడే కాల్చండి
అది చెట్టవుతుంది
నేను నీడనవుతాను అని.  .......... (అతనూ-ఆవిడా)........ పై వాక్యాలు ఎప్పుడో వచ్చే మృత్యువు పై భీతితో వ్రాసినవి కావుఇక్కడ మృత్యువు మాత్రమే పూడ్చగలిగే ఒక శూన్యం గురించి చెపుతున్నాడు కవి.  ఇది వైయక్తిక అనుభవం కాదు, సామాజికమైనది, సార్వజనీనమైనది. సమాజ శిఖరంపై నిల్చొని మృత్యుగీతాన్ని ఎలుగెత్తి పాడేవాడికి బతుకుతున్న క్షణాల పట్ల ఎక్కువ అవగాహన ఉంటుంది.

          ఈ కవిత్వంలో ఒక అనుభూతిలోకం ఉంది, మానసిక స్థితిని అధివాస్తవికపద్దతిలో చిత్రించిన వైనం ఉంది, అందమైన పదచిత్రాలున్నాయి, నూతన అభివ్యక్తి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే Intellectual Poetry ఇది.

          S/o మాణిక్యం సంకలనంలో  మొత్తం 76 కవితలున్నాయి. కొన్నింటికి  పాదవిభజన చేయలేదు.   ఈ పుస్తకానికి శ్రీ ప్రసేన్, శ్రీ రమణమూర్తి లు ముందుమాటలు, శ్రీ సీతారాం, శ్రీ వంశీకృష్ణ, శ్రీమతి కె. అంజనీ బాల, శ్రీమతి వి. శ్రీదేవి లు వెనుక మాటలు వ్రాసారు. కవర్ పేజ్ శ్రీ అక్బర్ డిజైన్ చేసారుకాపీల కొరకు జుగాష్ విలి, లిటరరీ సర్కిల్, చెంచుపేట, తెనాలి -2.  (పుస్తకంలో ఉన్న పాత అడ్రసు)
                                                                                                                                                                 
బొల్లోజు బాబా 

Friday, December 26, 2014

ప్రశాంతత


కనుల లోతుల్లోకి
ఒక దృశ్యం
రాలి పగిలి
శకలాలై వర్షించింది
హృదయం 
తన జలాల్ని
తానే పైకి లేపి
నౌకల్ని లోనికి
లాగేసుకొంది.

ప్రశాంతత
అనంత నీలిమలా.....

బొల్లోజు బాబా

Sunday, December 21, 2014

నీకసలు స్వప్నించే అర్హత ఉందా.....



నా పెదవుల్ని
నీ పెదవుల మధ్యకు తీసుకొని
ఒక గాఢ చుంబనం
నా చేతులు నీ భుజాల్ని
గట్టిగా పట్టుకొన్నాయి.
మూసుకొన్న కనుల వెనుక......

రాత్రిరోడ్డుపై నల్లని ప్రయాణం
వానల్ని మింగిన వాగు గలగలలు
చల్లని గాలులతో శ్వాసిస్తోన్న తరువులు
బొట్లుబొట్లుగా అరుస్తోన్న నిద్రరాని పిట్ట
చలిగాలికి స్వరం పెంచిన కొలను కప్ప
మీదపడి మరణించిన సాయింత్రాన్ని
మోసుకు సాగే హృదయం.

విరిగిన కిరణాలతో ఉదయించింది
అదే సూరీడా లేక వేరే సూర్యుడా!
స్పర్శలోంచి సుఖం ప్రవహించినట్లుగా
దుఖఃస్వప్నం లోంచి  స్మృతులు
సీతాకోకచిలుకలై పైకెగురుతాయి.

“నీకసలు స్వప్నించే అర్హత ఉందా”
అనడిగావు కదూ!
నిన్నూ నన్నూ
ప్రేమలోనో క్షమలోనో
కలుపుతున్నవి ఈ స్వప్నాలే కదా!
నేను స్వప్నిస్తున్నాను కనుకనే
నువ్వొచ్చి వెళిపోతున్న విషయం
పదే పదే గుర్తుకొస్తోంది.


బొల్లోజు బాబా

Saturday, December 20, 2014

ప్రకృతి


వానపాములు తూనీగలు
తొండలు కప్పలు పిట్టలు
గుంటనక్కలు రాబందులు
ఒకదానికొకటి గోరుముద్దలు
తినిపించుకొనేవి. 
అన్నింటినీ మింగేసి
మనిషి మనిషిని తింటున్నాడు.
పాపం! జగమేలే పరమాత్మ
ఎవరితో మొరపెట్టుకొంటుంది?

బొల్లోజు బాబా

Wednesday, December 3, 2014

బాబా కవిత్వంలోని జీవనది అదే! ---- అఫ్సర్



జీవనది లోపలికి  ప్రవహించడం అనే అనుభవం ఎలా వుంటుందో అనుభవించి పలవరించాలంటే ఈ పుస్తకంలోకి అడుగు పెట్టాలి మీరు! అయితే, ఏ కొంతైనా తడవడానికి మీరు సిద్ధంగా వుంటేనే ఈ జీవనది మిమ్మల్ని తనలోకి స్వీకరిస్తుంది. బొల్లోజు బాబా “ఆకుపచ్చ తడిగీతం” ఇప్పుడు రెండో సారి చదువుతున్నప్పుడు వొక కవిని కేవలం కవిగా కాకుండా poet as a self గా చూడడం ఎలానో అర్థమవుతోంది, మనకి తెలీదు కానీ కవిత్వం కూడా వొకprivacy statement.  దాని Intensity ని ఇప్పటివరకూ వేరే వేరే రూపాల్లో చెప్పడానికి నిరాకరిస్తూ, లేదా సంకోచిస్తూ వచ్చిన విషయాల్ని  చెప్పడం కోసమే self అనే తన సందుకని తెరుస్తూ వెళ్తాడు. బాబా కవిత్వంలోని జీవనది అదే! జీవితం ఆయన్ని ఎంతగా తడిపిందో అదంతా అక్షరాల్లో పిండే శక్తి ఆయనకి వుంది. వొక సాయంత్రం మీరు ఆ నది పక్కన నడుస్తూ వెళుతున్నప్పుడు గాలీ, నదీ గుసగుసలాడుకుంటున్నప్పుడు, ఆకాశం దానికి సాక్ష్యంగా నిల్చొని వున్నప్పుడు ఈ కవి విన్నాడని ఇదిగో ఈ కవిత్వంలో తెలుస్తోంది!         ----- అఫ్సర్

ఆకుపచ్చని తడిగీతం కవితా సంకలనాన్ని ఈ క్రింది లింకు లో పొందవచ్చు

https://www.scribd.com/doc/248711440/Akupachani-tadi-geetham


Tuesday, November 25, 2014

ఇస్మాయిల్ గారి గురించి మరోసారి.....



ఈ రోజు ప్రముఖ కవి ఇస్మాయిల్ గారి 11 వ వర్ధంతి.  ఆ సందర్భం గా ఆయన గురించి ఇదివరలో వ్రాసిన ఒక వ్యాసం మరలా ............
భవదీయుడు
బొల్లోజు బాబా

ఇస్మాయిల్  కవిత్వం,  కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు

అప్పుడు నేను పి.జి. విద్యార్ధిని.  కవిత్వం అంటే తిలక్, ఇస్మాయిల్, శిఖామణి, చలం అని అనుకొనే రోజులవి. అప్పటికి అచ్చయిన నా కొన్ని కవితలను ఇస్మాయిల్ గారికి చూపించాలని నా తాపత్రయం.  మిత్రుని ద్వారా ఓ రోజు ఆయనకు పరిచయం చేయించుకొన్నాను.  పసుపు పచ్చని దేహచ్ఛాయ, ఎత్తైన విగ్రహం, సన్నని స్వరం, రంగులు చిమ్మే సాదా దుస్తులతో ఆయనను చూడగానే కవిత్వంతో నిండిన గౌరవం కలిగింది.  కుశలప్రశ్నలయ్యాకా నా కవితల గురించి ఆయనన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తే.  “నీ కవిత్వంలో స్పార్క్ ఉంది.  ఆవేశాన్ని పదాలలోకి ఒంపేప్పుడు తేలికైన పదాల్ని ఎంచుకోవాలి.  భావాన్ని మరింత క్లుప్తంగా చెప్పగలగాలి” అన్నారు.  ఇది జరిగి సుమారు పదిహేను సంవత్సరాలు అయ్యింది.  ఇప్పటిదాకా వ్రాసిన నా కవితలను తరచి చూసుకొంటే క్లుప్తత, పదాల ఎంపిక విషయంలో ఆయన పరిశీలన ఎంతటి సూక్ష్మమో తెలుస్తూంటుంది.
చాలా కాలం కవిత్వానికి దూరంగా ఉండటం వలన, ఆయనను కలుసుకోవటం అదే మొదలు మరియు చివరు అయ్యింది నాకు.   ఇదిగో ఇప్పటికి మరలా ఇలా........


ఇస్మాయిల్

ఇస్మాయిల్ గారు 26 మే, 1928 న జన్మించారు.  వీరు కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసారు.  25 నవంబర్, 2003 న ఆయన అనంత నిశ్శబ్దం లోకి జారిపోయారు.

కవిగా, విమర్శకునిగా ఇస్మాయిల్ గారు పోషించిన పాత్ర తెలుగు సాహితీవనంలో నిలువెత్తు పొగడచెట్టై పరిమళాలు చిందిస్తూనే ఉంటుంది.  ఆయన రచించినవి పదిపుస్తకాలే కావొచ్చు, అన్నీ కలిపి ఓ మూడు, నాలుగొందల పేజీల సారస్వతమే అవ్వొచ్చు, కానీ వాటి ముద్ర మాత్రం తెలుగు సాహిత్యంపై ఏ నాటికీ చెరగనిది.



ఇస్మాయిల్ కవిత్వం


ఇస్మాయిల్ గారనగానే రెండు విషయాలు చాలామంది స్మరణకు వస్తాయి.  మొదటిది “’చెట్టు నా ఆదర్శం” అన్న ఇస్మాయిల్, రెండవది ఆయన ఆంధ్రదేశానికి పరిచయం చేసిన హైకూ.  ఇస్మాయిల్ కవిత్వ భాష విశిష్టమైనది.  క్లిష్టపదాలు, పొడుగు వాక్యాలు ఉండవు. ఛందస్సులు, లయ శయ్యల వంటివి కనపడవు.  అయినప్పటికి ఈయన కవిత్వం ఒక అనుభూతిని పదచిత్రాల ద్వారా పఠితకు ప్రసారం చేసి అతనూ అనుభూతి చెందేలా చేస్తుంది, అదీ ఎంతో నిశ్శబ్దం గా.


సౌందర్యారాధన, మానవత్వంపై విశ్వాసం, స్వేచ్ఛాశీలత, ప్రకృతి ఉపాసన ఆయన కవిత్వానికి కాన్వాసు.  మన దైనందిక విషయాలను, చిన్న చిన్న అనుభవాల్నీ, అపుడపుడూ ప్రకృతి కరుణించే సుందర దృశ్యాలకు, కరుణ తాత్వికలను అద్ది కవిత్వంగా మలచి మనకందించారు. ఇస్మాయిల్ కవిత్వంలో ఇజాలు, వాదనల వంటి శృంఖలాలు కనిపించవు. కేవలం కవిత్వం మాత్రమే వినిపిస్తూంటుంది.  జీవితోత్సవాన్ని ఎన్నికోణాల్లో ఆనందించవచ్చో అన్ని కోణాల్నీ ఆయన తన కవిత్వంలో ఆవిష్కరించారు. అందుకనే ఇస్మాయిల్ గారి పుస్తకాలను వరుసగా చదువుతున్నపుడు ఇతివృత్త సంబంధమైన మొనాటనీ కనిపించదు.

ఆయన కవిత్వంలో పదచిత్రాల సౌందర్యం పరిమళిస్తూంటుంది.  పదచిత్రాల్ని ఎవరైనా కల్పన చేయగలరు.  కానీ ఒక దృశ్యాన్ని నలుగురూ చూసే దృష్టితో కాక కొత్తగా దర్శించి దాన్ని పదచిత్రంగా మలచటం ఇస్మాయిల్ గారికే చెల్లింది. ఒక్కోసారి ఈయన “ఇలా ఎలా” చూడగలిగారబ్బా అని విస్మయంతో ఆశ్చర్యపడక తప్పదు.  ఈ క్రింది ఉదాహరణలను చూస్తే అర్ధం అవుతుంది ఆయన విలక్షణ వీక్షణం.



ఎక్కడెక్కణ్ణించో ఎగిరి వచ్చిన కాకులు చింతచెట్టులో నల్లగా అస్తమిస్తాయి /

ప్రణయక్రీడలో మన అంగాల పాచికల్ని మహోద్రేకంతో విసిరి నక్షత్రాల పావుల్ని రాత్రల్లా నడిపించాం గుర్తుందా! /

కిటికీలోంచి చూస్తే వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు /

తొలిసంజె నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు /

ఊగుతోంది వేయి పిర్రల సముద్రం /

మూగిన బంధుమిత్రులు మోసుకుపోయి అతణ్ణి విత్తనంలా పాతారు /

భూమి బుగ్గపై చల్లటి నవ్వు సొట్టలా బావి /

ఉదయాలు అనాది నుంచీ సూర్య శిశువును ఎన్నివిధాలుగా ఎగరేసి పట్టుకొన్నాయో/

నీడల విసనకర్రను విప్పి ఎండలో సేదదీరుస్తుంది చెట్టు ----- ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన
కవితలనన్నీ టైప్ చెయ్యవలసి ఉంటుంది. ఎన్ని పదచిత్రాలు, ఎన్నెన్ని సునిశిత దృశ్యాలు.


బుద్దిగా ప్రేమించుకోక
యుద్దమెందుకు చేస్తారో
నాకర్ధం కాదు.



పై వాక్యాల సారాంసమే ఇస్మాయిల్ కవిత్వమూ, జీవితమూను.  జీవితానందాల్ని గానం చేసే కవికి, వానిని పాడుచేసే మనుష్యులను చూస్తే ఇలాకాక వేరెలా అనిపిస్తుందీ!

తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)


ఆత్మహత్యకు ఎంత అద్బుత నిర్వచనం.  ఈ గుప్పెడు వాక్యాలలో,  ఒక అమ్మాయి జీవితంలో ఓడి పోవటం,  తద్వారా ఎదుర్కోవలసి వచ్చిన సామాజిక వివక్ష, నిత్యం ముల్లై బాధించిన ఈ ప్రపంచాన్ని ఇక ఏమాత్రమూ తప్పించుకోలేని దోషిగా నిలబెట్ట టమూ – ఎంతగొప్పగా ఇమిడి పోయాయి.



సెలయేరా సెలయేరా

గలగలమంటో నిత్యం
ఎలా పాడ గలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్లు
పాడకుంటే ఎలా?

జీవితంలోని కష్టాలను కప్పిపుచ్చు కొని ఆనందంగా ఉండక తప్పదు అని ప్రవచించే ఈ కవితే ఇస్మాయిల్ గారి జీవితాదర్శం.  ఆయనకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా చిరు నవ్వు ను, సంతృప్తిని వీడ లేదంటారు సన్నిహితులు. అందుకేనేమో ఓ కవితలో ఇలా అన్నారు.


నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
డబ్బెందుకు?
కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని
ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత!
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది.

సూర్యకిరణాలు, చంద మామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, ఇవీ ఇస్మాయిల్ కవితాలోకపు డబ్బులు.  వారి సతీమణిని మరో కవితలో వర్ణించిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది.

మా ఆవిడ ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తిపట్టుకొంటుంది
ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది.
ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది.

ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది......


నా ఇల్లు, నా సంసారం అనుకుంటూ నిత్యం శ్రమించే ఇల్లాలిని ఇంతకన్నా గొప్పగా వర్ణించే వాక్యాలు తెలుగు సాహిత్యంలో లేవు అంటే అతిశయోక్తి కాదు.

ఇస్మాయిల్ గారు తన పద్యాల్ని తెరుచుకొన్న పద్యాలు అన్నపుడు, మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా అంటూ తెలుగు సాహిత్యవిమర్శనా లోకంలో
కొంత అలజడి రేగింది.  అలా
అన్నప్పుడు ఇస్మాయిల్ గారి ఉద్దేశ్యం ఒక కవిత చదవగానే పాఠకుడు ఆ పద్యానికి కంటిన్యూ అవుతారనీ, అంటే అతను కవితను తనంతట తానుగా కొనసాగించుకొనే అవకాశం ఉంటుందని.  అలాంటి "ఓపెన్ నెస్" ఈయన కవితలలో ఉండి పాఠకుల కల్పనా శక్తికి పని కల్పించటం ద్వారా అవి మరింతగా వారి హృదయంలోకి ఇంకటం జరుగుతుంది.

స్త్రీవాద కవిత్వాన్ని ఇస్మాయిల్ గారు అహ్వానించలేదన్న అపవాదు వారిపై ఉంది.  కానీ నిజానికి ఆయన ఉద్దేశ్యం కవిత్వం ప్రకృతిని ప్రతిబింబిస్తుందనీ, స్త్రీ ప్రకృతికి దగ్గర కనుక వారికి కవిత్వం వ్రాసే అవసరం రాకపోవచ్చుననీ మాత్రమే అన్నారు.  ఆ తరువాత వచ్చిన స్త్రీవాద కవిత్వాన్ని చూసిన ఆయన, కవిత్వం అనేది అంతర్గతకల్లోలాల వల్ల జనిస్తుంది, ఈనాడు స్త్రీలకు కూడా ఈ మానసిక అశాంతి తప్పటం లేదన్న మాట అని అభిప్రాయ పడ్డారు.

జ్ఞాపకాలూ – అనుభవాలు


ఇస్మాయిల్ గారితో వివిధ ప్రముఖుల అనుభవాలు, అభిప్రాయాలు  వారి మాటల్లోనే ..........

·        ఎందుకు బతకాలి అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం నాకిప్పటికీ గుర్తుంది.  స్టాఫ్ రూం కిటికీ లోంచి బయటకు చూస్తూ “ఎండ వెచ్చగా ఉంది, పచ్చిక పచ్చగా ఉంది – ఇక్కడింత హాయిగా ఉంటే, బతక టానికేమయ్యిందయ్యా నీకు? అన్నారు. – విన్నకోట రవిశంకర్

·        ఎనభైయవ దశకంలో కాకినాడలో నెల నెలా వెన్నెల పేరుతో జరిగే సాహితీసమావేశాలకు ఇస్మాయిల్ వచ్చేవారు.  సమావేశమంతా అన్ని గంటలూ మౌనంగా ఉండే ఆయన, మధ్యలో జేబులోంచి ఒక తెల్లటి కాగితం మడత విప్పి ఒక కవిత చదివి వినిపించేవారు. ఆ కవితను రెండవ సారి కూడా చదివేవారు కాదు.  ఆ సభలో ఆయన పార్టిసిపేషను అంతే.  కానీ చివరిదాకా అలా అందరి కబుర్లనూ ఆస్వాదిస్తూ ఉండేవారు. – వాడ్రేవు వీర లక్ష్మీ దేవి

·        చాలా ఏళ్ల క్రితం నేను కాకినాడ వెళ్లినప్పుడు రోజల్లా విడుపు లేకుండా మాట్లాడుకున్న గంటలు, ఆయన నామీద చూపించిన ఆప్యాయత, వీధరుగు మీద విశ్రాంతిగా కూర్చుని తిరగేసిన పుస్తకాలు, ఆయనా, వాళ్లావిడ మాకిచ్చిన ఆతిథ్యం నాకిప్పటికీ గుర్తొస్తాయి.  అన్ని గంటలసేపు ఆయనతో మాట్లాడినా ఆయన తన కవిత్వాన్ని గురించి ఏమీ చెప్పలేదు.  చదివి వినిపించలేదు. వాటన్నిటికన్నా కూడా ఇప్పటికీ నన్ను పట్టుకొనేది ఆయన పద్యాల్లోని నిశ్శబ్దమే. --- వెల్చేరు నారాయణరావు

·        ఇస్మాయిల్ గారిని ఒక ప్రశ్న అడిగారు “ఒక మైనారిటీ మతస్తునిగా సమాజంలో సాహిత్య రంగంలో మీ అనుభవమేమిటి” అని.  దానికి ఇస్మాయిల్ గారి సమాధానం

“మతం గురించి  కులం గురించి ఆలోచన నాకెప్పుడూ రాలేదు.  నేను మొదట్నుంచి అందరిలో ఒకణ్ణిగా, తెలుగువాణ్ణిగా  ఫీలవుతూ వచ్చాను..... నా మైనారిటీ మతం నాకు ’హేండీకేప్’ కాలేదు”  ---సి. ధర్మారావు


·        ఇస్మాయిల్ కవిగారి స్నానం గురించి – ఆ
వ్రతవిధానం కనీసంగా ఒక గంటన్నర పడుతుంది. ... సెంట్లు పౌడర్లు స్నోలు అద్దుకుని ధౌత వస్త్రాలతో కడిగిన ముత్యంలా ఈయన గది బయటికొచ్చేవారు.  --- సి. ధర్మారావు.

·        రేడియో కవి సమ్మేళనంలో కవులంతా కొత్త సంవత్సరం మీద ఊగిపోతూ పద్యాలు చదివితే, ఈయన మాత్రం తాపీగా పదేళ్ల క్రితం వచ్చిన తన పాత పుస్తకాల నుంచి కవితలు వినిపించటం లాంటిది కూడా ఆయనకే చెల్లింది (ఉగాది మీద పద్యాలు రాయటమేమిటి?)  -- విన్నకోట రవిశంకర్

·        ఇస్మాయిల్ కుటుంబం ఆ ఇంట్లోకి మారి మూడే రోజులైంది.  ఇంకా సామాన్లు సర్దుకోలేదు.  మాకు చాయ్ ఇవ్వాలని ఆయన తాపత్రయం.  పాలకోసం వాళ్లబ్బాయి వెళ్లాడు.  ఆయన మమ్మల్ని చూసి ప్రసన్నవదనుడైనా, ఆ పొరల వెనుక ఏదో వేదన లాంటిది కనిపించింది.  అనారోగ్యంగా ఉన్నా, వద్దన్నా కారు దాకా వచ్చారు.  మళ్లీ ఎప్పుడు చూస్తామో ఆయన్ని అనిపించింది.  మరో వారంరోజుల్లోనే చూడలేని లోకాలకు వెళ్లిపోతారనుకోలేదు.  --  డా. ఎన్. గోపి

ఇస్మాయిల్ ఉత్తరాలు
·        ఇస్మాయిల్ గార్ని తలుచుకోగానే తక్షణం గుర్తొచ్చేవి ఆయన ఆకుపచ్చ అక్షరాలే.  శిధిల నేత్రాలు అనే నా కవిత అచ్చులో చూసి “ఇది తెలుగు పద్యంలా లేదు” అంటూ మెచ్చుకుంటూ రాశారాయన.  – అఫ్సర్


·        ఆయన చిన్నతమ్ముడు వజీర్ రెహ్మాన్, నలుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు మరణించిన కొంతకాలానికి ఆయన మూడో తమ్ముడు చనిపోయారు.  అప్పుడు ఇస్మాయిల్ గారు ఉత్తరం రాస్తూ “ఈ వరస కింది నుంచి మొదలైనట్టుంది.  మనకి ఆట్టే దూరం లేదు” అన్నారు.  అన్నట్టుగానే అదే వరుసలో మరణాలు జరిగాయి –స్మైల్


·        ప్రజాతంత్రలో నా ’విస్మృతి’ కవిత అచ్చుకాగానే కవిత నచ్చిందని చెపుతూ రాసిన ఉత్తరంతో పాటు “ఇంకెక్కడా ఖాళీ దొరకనట్టు అనంతపురం వెళ్లారేమిటి? అక్కడసలే గాడిదలు ఎక్కువ” అంటూ ఓ చెణుకు. ఇస్మాయిల్ గారు అనంతపురం కాలేజీలో పనిచేసారు – కల్పనా రెంటాల

·        పతంజలి శాస్త్రి కి ఇస్మాయిల్ గారు తమ కుమారుని పెళ్ళికి ఆహ్వానిస్తూ వ్రాసిన ఉత్తరం ”ధర్మపత్ని సమేత: ఇస్మాయిల్ కవి: స్వపుత్రస్య పరిణయ మహోత్సవం....... అంటూ సరదాగా సంస్కృతంలో సాగుతుంది.

·        ఆయన నాకు రాసిన కార్డు (26-10-2003) ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడ్తున్నట్టు అనిపించింది.  “ నా ఆరోగ్యం కూడా నన్ను మర్చిపోయింది.  చాలా జబ్బుపడ్డాను” అని  –  యాకూబ్

ప్రముఖుల అభిప్రాయాలు
·    
        మేం (ఉభయులం) స్వేచ్ఛా భావుకులం, అభయులం, నిత్యబాలలం, నిత్యసంతోషులం, మాకులం విమల విశ్వశాంతి కులం, మంచి జీవన శిల్పులం, నాకు ఇస్మాయిల్ అంటే ఇష్టమంత ఇష్టం  -- పి.వి. నరసింహారావు

·        అతని ప్రతికవితలోను ఒక మనోహరత్వాన్ని, ఒక హృదయరంజకత్వాన్ని అనుభవించాకనే నేను ఆయన మొదటి కావ్యాన్ని ప్రచురించాను  -  సోమసుందర్

·        తనకు పోటీగా ఎన్ని ప్రబల కవి సిద్దాంతాలు ఉన్నా, తనదైన వాదాన్ని కడదాకా నిలిపిన గొప్ప కవి,
కవిత్వాన్ని మానవతా ప్రబోధ సాధనంగా మహోన్నత శిఖరాలపై నిలిపాడు ఇస్మాయిల్  -- సి.నా.రె.

·        సాదీ మహాకవి ఒక మాటంటాడు " జ్ఞానవంతులకు పచ్చని చెట్టులోని ఒక్కొక్క ఆకు ఒకో దివ్యజ్ఞాన ప్రపంచంలాగ కనిపిస్తుందని" , నిజంగా ఈ మాటలకు  నూటికి నూరు పాళ్లూ సరిపోయే తెలుగు కవి ఇస్మాయిల్ మాత్రమే  -- శిఖామణి

·        ఒక రుషిలాగ, సూఫీ కవిలాగ, ఒక హైకూగా ఇస్మాయిల్ బతికాడు.  తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్య చరిత్ర పుటల మీద పచ్చని సంతకంలా ఇస్మాయిల్ పది కాలాలు పదిలంగా ఉంటాడు  -  ఎండ్లూరి సుధాకర్

·        ఈయన సదా బాలకుడిగా లోకాన్ని చూసాడు, నిత్య నూతనుడిలా జీవించాడు  -- స్మైల్

·    

          వెయ్యి సంవత్సరాల సాహిత్య జీవితంలో తెలుగులో ఇలాంటి కవి మరొకరు లేరు  - వేల్చేరు నారాయణరావు
·      
          ఇస్మాయిల్ ఎందుకు విశిష్టకవి అయ్యారంటే, ఏ వ్యాసం ద్వారానో, విస్తృతమైన నవలద్వారానో, కధ ద్వారానో, వార్తా కధనం ద్వారానో చెప్పదగిన ఆవేశకావేషాలను, సిద్దాంత చర్చలను, ఒక నిలువెత్తు పద్యంలా పోతపొయ్యటానికి ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

·        నేను పెద్ద సాహిత్య విమర్శకుడిని కాదు కాని, శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వాన్ని మరో మలుపు దాటించిన వాడు ఇస్మాయిల్ అని నేను గట్టిగా నమ్ముతాను  --   సి. ధర్మారావు.

·        సాదా సీదాగా ఉండే ఇస్మాయిల్ కవిత్వానికి అంతశక్తి ఎక్కణ్ణించి వచ్చిందంటే ’నిబద్దత లేకపోవడమే ఆయన  కవిత్వ శక్తికి కారణం” అని ఆయన (అఫ్సర్ తండ్రిగారు) లెనిన్ అన్నమాటని గుర్తుచేసేవారు  -- అఫ్సర్

ఆణిముత్యాలు

ఇస్మాయిల్ గారు వివిధ సందర్భాలలో వెలువరించిన అభిప్రాయాలు


·        క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?


·        అనుభూతి ఎప్పుడూ వైయక్తికమే. అనుభవ వస్తువు ఒకటైనా, ఎవరి అనుభూతి వారిది. అది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఒకరి అనుభూతిలా మరొకరి అనుభూతి ఉండదు. ఈ నవనవోన్మేషమైన అనుభూతిని ఆవిష్కరించటమే కవి కర్తవ్యం

·                కవి అనుభవాల్ని తనలో ఇంకించుకుని, అంతర్దర్శి ఐననాడే మంచి కవిత్వం జనిస్తుంది.

·                అనుభూతులు శబ్ద ప్రపంచానికి చెందినవి కావు. ఈ నిశ్శబ్దాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం  కూడా అంతే.

·        పదచిత్రమనేది ఐంద్రియకం (sensuous). ఇంద్రియ జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. హేతుబుద్ధికి సంబంధించింది కాదు. లోతైన అనుభూతుల్నీ(feelings), భావాల్నీ(emotions) ఆవాహించే శక్తి పదచిత్రానికుంది.

·        లేబిల్స్ ఉపయోగించడం నాకిష్టం లేదు. అందుకనే నా కవిత్వానికి పేరు పెట్టనీయలేదు

·        ప్రస్తుతం తయారవుతున్న కవిత్వాన్ని రెండు రకాలుగా విశాలంగా వర్గీకరించవచ్చు ననుకుంటాను. poetry of ideas (అభిప్రాయ కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం).

·        మినీ కవిత్వం రాస్తున్న యువకవులు చమత్కారమే కవిత్వం అనుకుంటున్నారు. చమత్కారం వేరు, కవిత్వం వేరు.

·        కవిత్వం వల్ల కొంపలు కాల్తాయి. విప్లవాలు వస్తాయి అని మీరనుకున్నట్టయితే నిరాశ కోసం సిద్ధపడండి. అది చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.

·        బ్రహ్మాండం బద్దలయ్యే సంఘటనలకి బ్రహ్మాండం బద్ధలయే కవిత్వం పుడ్తుందని ఆశించడం అమాయకత్వం.

·        ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు.  సాహిత్యంలో రాజకీయ కాలుష్యాన్ని మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను.  కమ్యూనిష్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువరచయితలు, జబ్బుపడి సాహిత్యపరంగా శవ ప్రాయులయ్యారు.  ఆ అకవిత్వ కల్మషం దేశమంతా అలముకొంది.  ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు.  దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్ఛకోసమూ, రచయితల వ్యక్తి ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభైయ్యేళ్ల బట్టి పోరు సాగిస్తున్నాను.

·        కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు.దాని సామ్రాజ్యమే వేరు.

·        కవిత్వమనేది కవి సంపూర్ణ అస్తిత్వంలోంచి ఉద్భవిస్తుంది. నేను బ్రాహ్మణుణ్ణి లేదా దళితుడిని అని జీవితాన్ని కుంచింపజేసుకున్నవాడు కవిత్వమేం రాయగలడు?


·        జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని.  ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.


ఇస్మాయిల్  రచనలు
1. చెట్టు నా ఆదర్శం  2. మృత్యువృక్షం  3. చిలకలు వాలిన చెట్టు  4. రాత్రి వచ్చిన రహస్యపు వాన  5. బాల్చీలో చంద్రోదయం  6. కప్పల నిశ్శబ్దం   7. రెండో ప్రతిపాదన (అనుసృష్టి)  8. కరుణ ముఖ్యం  9.  కవిత్వంలో నిశ్శబ్దం (ఒక వ్యాసం) 10. పల్లెలో మా పాత ఇల్లు  (రివ్యూ)

చివరి మూడు రచనలలో, మొదటి రెండూ సాహితీ విమర్శనా వ్యాస సంపుటులు, చివరది ఆయన మరణానంతరం, అభిమానులు వెలువ రించిన కవితాసంకలనం.  (హైపర్ లింకులు కలిగిఉన్న పుస్తకాల పేర్లపై క్లిక్ చేసినట్లయితే ఆ పుస్తకాలను ఈమాట వారి ఆర్చైవులలో చదువుకొనవచ్చును)

కవితా పఠనం చేస్తున్న ఇస్మాయిల్ గారి వీడియో కోసం ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి



అవార్డులు/రివార్డులు

·        1989లో ఇస్మాయిల్ గారి షష్టిపూర్తి, రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి గారి చేతులమీదుగా జరగటం ఒక గొప్ప విశేషం.
·        1999 లో కళాసాగర్ వారి విశిష్ట పురస్కారాన్ని అందుకొన్నారు
·        15-6-2003 హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “చెట్టంత కవికి పిట్టంత సత్కారం” పేరిట ఇస్మాయిల్ అభినందన సభ జరిగింది.
·        కవిత్వంలో నిశ్శబ్దం   అన్న సాహిత్య వ్యాసాలకు తెలుగు విశ్వవిద్యాలయం వారు అవార్డు నిచ్చారు.


చివరగా

కీర్తి శేషుడైన కవి
కాలతీరాన
కాసేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్లిపోయాడు

అన్న ఆయన కవితావాక్యాలలోని కవి ఎవరనేది ఇన్నాళ్లకు అర్ధం అయ్యింది.  ఆయన ఎవరో కాదు ఇస్మాయిల్ గారే.
చెట్టు నా ఆదర్శం అని ప్రకటించుకొన్న ఇస్మాయిల్  గారి కవిత్వం తెలుగు సాహిత్య చరిత్ర లో చిరస్థాయిగా నిలుస్తుంది
.

ఆయన సాహిత్య శకటాన్ని ఎక్కడ ఆపారో దాన్ని అక్కడి నుండి కొనసాగించటం తదుపరి కర్తవ్యం, భుజానికెత్తుకోవలసిన ఇంకొక పని  -  ఆయన ఎంతో ప్రేమతో, ఓపికతో నెరవేర్చినదే – ఎందరో సదా బాలకుల రాకకు అనుకూలంగా దారిని సుగమం చేయటం  -   అన్న తమ్మినేని యదుకుల భూషణ్ గారి మాటలు స్మరించుకొందాం.


Acknowledgements
1.     Md. రెహ్మాన్  లెక్చరర్, కాకినాడ (ఇస్మాయిల్ గారి బంధువు)
2.     అంతర్జాలంలో పైన ఉటంకింపబడిన  లింకులలోని ఇస్మాయిల్ గారి వివిధ రచనలు
3.     సలాం ఇస్మాయిల్ – వ్యాస సంపుటి

4.     Tribute to Ismail –DVD by Indraganti’s Family