Wednesday, December 31, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు - బొల్లోజు బాబా


నా మిత్రులకూ, వారి మిత్రులకూ

నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ స్నేహానికి ధన్యవాదములు.
*******

ఈ క్రింద మరి కొన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు*


నీ కొరకై నా ఆకాంక్ష.
ఈ నూతన సంవత్సర దినాన నీ కోసం నేను కోరే కోర్కెలు.

నీ హృదయంలో శాంతి
కుటుంబము, మిత్రుల నుండి ప్రేమ
నీ మార్గాన్ని నడిపించే విశ్వాసం నిరంతరమూ వెన్నాడే ఆశ
రోజుల్ని వెలిగించే సూర్యకాంతి
దేవలోకపు
తారల అనుగ్రహం.
రేపున్నదని తెలిపే ఇంద్రధనస్సులు.
కరుణను పలికించే కన్నీటి చుక్కా
ప్రేమను నింపుకొనే హృదయం
అన్నింటినీ మించి
నీచేయిలో నాచేతి స్పర్శా
నీవు తడబడినపుడు,
నీకు ఆనందం అందించటానికి
ప్రేమనందించటానికి,
నాతో పంచుకొన్న నీ స్నేహపు మధురిమల్ని
తిరిగి ఇవ్వటానికి నేనున్నాను అనే జ్ఞానం

సదా నీవెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ
*******మరొక కొత్త సంవత్సరం మనముందుంది

మరొక సంవత్సర ఆనందం తెచ్చింది.
బాధల్నీ, భయాల్నీ, అనుమానాల్నీ విడనాడి
ప్రేమించుకుందాం, ఆనందిద్దాం, పంచుకుందాం.
*******


ఈ కొత్తసంవత్సరాన్ని ఈశ్వరుడు మనకు ప్రసాదించాడు.
ప్రతీదినమూ నూత్నోత్సాహంతో జీవించటానికై
ఎత్తులకు ఎదుగుతూ, ఉత్తమంగా ఉండటానికై.

*******ఈ నూతన సంవత్సర దినాన.
నీ ప్రేమ నీడలో ఊయలలూగుతూ
నీ పెదవుల మృధుత్వాన్ని స్పర్శిస్తూ
నిన్ను నా హృదయానికి దగ్గరగా తీసుకొంటూ
నీ సమక్షంలో నేను ఒక అనంత స్వప్నాన్ని
స్వప్నిస్తున్నాను,

*******


నీవు స్వప్నించాలనుకొన్న ప్రపంచాలను స్వప్నించు
నీవు ప్రయాణించాలనుకొన్న దూరాలను సాగించు.
నీవెలా ఉండాలనుకొన్నావో అలానే ఆవిష్కరించుకో
ఎందుకంటే
నీ చేతిలో ఉన్నది ఒక్క జీవితమే
నీవు ఏపని చేయాలనుకొన్నా
ఉన్నది ఒక్క అవకాశం మాత్రమే.

*******


రాబోయే సంవత్సరంలో నీ కలలన్నీ
నిజంకావాలని ............
*******


శుభాశీస్సుల కవాతు
మిమ్ములను వెతుక్కూంటూ వస్తున్నది.
*******


ఒక నూతన సంవత్సరం విచ్చుకొంటూంది
-- ఇంకా పూర్తిగా విచ్చుకోని రేకల వెనుక సౌందర్యాన్ని దాచుకొన్న కుసుమంలా.
*******


ఓ పుస్తకాన్ని మనం తెరుస్తాం.
దానిపై కొన్ని మాటల్ని వ్రాసుకుంటాం.
ఆ పుస్తకం పేరు అవకాశం.
దాని మొదటి పేజీ నూతన సంవత్సర దినం
*******


మరో అవకాసం వచ్చింది.
తప్పులను సరిదిద్దుకోవటానికై
శాంతిని పెంపొందించుకోవటానికై
ఒక సంతోష తరువుని నాటటానికై
మరిన్ని ఆనందగీతాల్ని ఆలపించటానికై.
*******


ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం
వెలుగులు చిమ్మే బాణాసంచా కాంతులలో
పాత సంవత్సరానికి ముద్దులతో వీడ్కోలు పలికి
కొత్త సంవత్సరాన్ని సాదరంగా పిలుద్దాం
*******


విషాదం రేపటి బాధల్ని తగ్గించలేదు.
నేటి ఆనందాల్ని మింగేస్తుంది.
మిత్రమా,
నీ బాధల్ని తరిమికొట్టే
నూతన సంవత్సరాన్ని కాంతులతో
సంగీతంతో అహ్వానిద్దాం రా.
*******


ఈ కొత్త సంవత్సరం
నీవు నడిచిన అన్ని సంవత్సరాలలో కెల్లా
ఉత్తమమైనది గా ఉండాలనీ
ప్రతీ క్షణం గతించిన ఘడియ కన్నా మెరుగ్గా సాగాలనీ
నీ తీయని స్వప్నాలు ఫలించాలనీ
ప్రతి దీవననూ గుర్తించి, ఆనందించగలిగే
అవకాసం కలగాలనీ
ఆకాంక్షిస్తున్నాను.

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మరెన్నో.

*******


నీకివే నా శుభాకాంక్షలు
నూతన ఆశయాలు గుభాళించే క్షణాలు అన్నీ ఫలించాలి నీ ప్రతీ నడకలో
నూతన సంవత్సర శుభాకాంక్షలు
*******


ఈ కొత్త సంవత్సరపు ప్రతీరోజూ
అష్టైశ్వరపు దీప కాంతులలో ప్రకాశించాలని
ఆకాంక్షిస్తూ
*******


నూతన సంవత్సరపు ఈ పచ్చని క్షణాన
ఆకుల వర్ణాలు భువంతా పరచుకోనీ.
*******


కొత్త ప్రమాణాలు,
కొత్త వాగ్ధానాలు
కొత్త నిర్ణయాలు
*******


అరవిరిసిన సుమాల అద్భుత స్ఫూర్తితో
నూతన సంవత్సర శుభాకాంక్షలు
*******


మేల్కొను, ఉదయించు, ఒక కొత్త ప్రపంచంలోకి
ఐశ్వర్యాలు ఆనందాలూ వర్షించనీ.
*******


నీ భవిష్య దినాలలో శాంతి పల్లవించుగాక!
*******


మన స్నేహం ఒక గులాబీ వంటిది.
మృధురేకల క్షణాలెన్నో
ఈ సమయంలో గుభాళిస్తున్నాయి.
ఒకటే తేడా, గులాబీ వాడిపోతుంది.
*******జీవించటానికి వేడుక చెయ్యి లేదా వేడుక కోసమే జీవించు.

*******


ఈ సంవత్సరం
జీవనాద్భుతాలను ఆస్వాదించే అదృష్టం కలుగుతుందని ఆశిస్తూ......
*******


మార్గాన్ని కాంతిమయం చేస్తున్న కొత్త సంవత్సరానికి
ఆహ్వానం
*******బొల్లోజు బాబా

*
వెబ్ లో దొరికిన కొన్ని గ్రీటింగులకు తెలుగు అనువాదం మాత్రమే నా స్వంతం కావు

Monday, December 29, 2008

స్వేచ్ఛ

1. స్వేచ్ఛ

చీకటి గదిలో కూర్చొని
సీసాలో బంధించిన
మిణుగురులను చూస్తూ
మురిసిపోతుంది మా అమ్మాయి.

ఆరు బయటకు వచ్చి
సీసా మూత తీసాను.
ఆకాశం సీసా నిండా మిణుగురులే!
చిన్నారి కళ్లల్లో వెన్నెల మెరుపు.2. వెన్నెల సీమ

కొబ్బరాకుల వెనుక
నిశ్శబ్ధ చంద్రోదయం.
వెన్నెల చక్కిలి గిలికి
రాలిన కొబ్బరి పూత.బొల్లోజు బాబా

Tuesday, December 23, 2008

నాచుట్టూ రెండు దేశాలు

బజారులన్నీ జనాలతో బలిసినయ్.
డబ్బు, డబ్బు, డబ్బు
కుంభవృష్టి గా కురుస్తూంది.
కొనుగోలు శక్తి మధ్యాహ్నపు టెండై
ప్రకాశిస్తోంది.

భాషతో నిమిత్తం లేకుండా
సర్వాంగాలతో సంభాషించే ఆటకత్తెలా
మూలాలకు దూరమైన ధనం
వింతైన నృత్యం చేస్తూంటుంది.

ప్రపంచ కుబేరుల జాబితాలో మనవాళ్ళు .
ఏటా పెరుగుతున్న కోటీశ్వరుల సంఖ్య.
లక్షల ఎల్కేజీ చదువులకై బారులు తీరిన జనం.
కొత్తకారు టెస్ట్ డ్రైవ్ కై పోటీ.
అక్షయ తృతీయనాడు స్వర్ణ విస్ఫోటనం.
రాడో వాచీలు, రేబాన్ అద్దాలు, పెద్ద తెర టీవీలు, కోట్లు పలికే విల్లాలు
రవ్వల దుద్దులూ, డిజైనర్ దుస్తులూ, డిజిటల్ దినాలు.
పబ్బులూ, డిస్కోతెక్ లూ, ఏరోడ్రోములు, హెలికాప్టర్లు,
చలువరాతి హర్మ్యాలు , ఇంద్ర భోగాలు, చంద్రయానాలు. .

నా దేశపు దరిద్రమంతా ఎక్కడకు పోయింది?

చేటలోని రోజుల శిశువు ఎర్రని ఎండలో భయం భయంగా చూస్తుంటూంది.
బోరుబావిలో పడిన గ్రీజు మరకల బాల్యానికి ఊపిరాడదు.
కూరగాయల్ని కొనలేనితనం దాకలో చారై మరుగుతా ఉంటాది.
సెంటు స్థలం కోసమై పోరాడే ప్రాణాన్ని తూటా తన్నుకు పోతాది.
అమ్మకానికి శిశువులు, ఇక్కడ స్త్రీ గర్భాగారం.
రోడ్డు పక్క డేరాలనిండా నిర్వాసిత గిరిజనులు.
హైవే పక్క మెరుపుల చీర చెయ్యూపుతూంటుంది.
"బ్లడీ బెగ్గెర్స్ బ్లడీ ఇండియా" BMW కారు అద్దం పైకి లేచింది.
ద్రావకం మింగిన కంసాలి , నూలు పోగుకు ఉరేసుకొన్న నేతకాడు,
పురుగుమందూ-పత్తిరైతూ, లాడ్జీలో కుటుంబం సెన్సెక్స్ హత్య
ఇక్కడ చావంటే ఎక్స్ గ్రేషియా - ఎక్స్ గ్రేషియా కోసమే చస్తారు.

నా దేశపు సౌభాగ్యమంతా ఎక్కడికి పోయింది?

ఇక్కడ రెండు దేశాలు కనపడుతున్నాయి
ఒకటి సంపన్న భారతం
మరోటి దరిద్ర భారతం.

బొల్లోజు బాబా

Thursday, December 18, 2008

సంవత్సరీకాలు


నీవిక లేవన్న వాస్తవానికి
చెట్టుతొర్రలో పక్షిపిల్ల ఆర్తనాదంలా
హృదయం కీచుమంది.

మెతుకు వృధా, బతుకు వృధా అంటూ
తీతువు పిట్ట అరుచుకుంటూ సాగింది.

ఆ లోహ క్షణాల రంపపు కోతకు
నిలువెత్తు జీవన వృక్షమూ
కన్నీరు చిమ్ముకుంటూ నేలకొరిగింది.

కాలం ఎంత చిత్రమైనది!
నీవులేవన్న వాస్తవం
ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది.

కలలూ, కన్నీళ్లు
ధరలు, దరిద్రాల వంటి
దినసరి వెచ్చాల్ని ఖర్చుచేసుకొంటూ
ఎంతదూరం నడిచేసాను!


బొల్లోజు బాబా

Sunday, December 14, 2008

బుల్లి కవితలు పార్ట్ II

ఆవకాయ్.కాంలో ప్రచురింపబడిన నా కవితలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
http://www.aavakaaya.com/articles.aspx?a=l&categoryId=1


1. వాయిదా

నెలవంకా నేలా
ముచ్చట్లాడుకొంటున్నాయి.

ఎందుకనో నెలవంక గొంతు
పున్నమినాటంత బలంగా లేదు.
నేల తన గాలి ఊసులతో
ఊదర కొడుతుంది.

చీకటి చాపను మడుచుకొంటూ
పొద్దుపొడిచింది

చర్చలు వాయిదా పడ్డాయి.

By బొల్లోజు బాబా, Nov 5 2008 7:28PM2. సాఫల్యం

ఏం బుద్ది పుడుతుందో
కొద్దికొద్దిగా నన్ను శ్వాసించటం
మొదలు పెడతావు.
నెమ్మది నెమ్మదిగా నన్ను
ప్రేమించానని తెలుసుకొంటావు.

ఆ క్షణమొక పుష్పమై
నీ మది కిటికీలోంచి తొంగిచూసి
నాకై వెతుకుతుంది.

నీ జీవితంతో నాస్వప్నాలు ఫలించాయి.

By బొల్లోజు బాబా, Nov 12 2008 4:09PM


3. మార్పు

చాలా కాలం తరువాత కలిసాం.
నా హృదయంలో ముద్రించుకొన్న
ఆ "నువ్వుని" నీలో ఎంత
శోధించినా కనిపించలేదు.

మనం కలుసుకోకుండా ఉంటే
ఎంత బాగుణ్ణు!

By బొల్లోజు బాబా, Dec 12 2008 5:16PM


బొల్లోజు బాబా


బ్లాగ్మిత్రులకు బ్లాగర్స్ డే శుభాకాంక్షలు


బ్లాగ్మిత్రులకు బ్లాగర్స్ డే శుభాకాంక్షలు

Tuesday, December 9, 2008

బుల్లి కవితలు పార్ట్ I

ఆవకాయ్.కాంలో ప్రచురింపబడిన నా కవితలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ కవితలపై వచ్చిన కామెంట్లను క్రిందఇవ్వబడిన లింకులో చూడగలరు.
http://www.aavakaaya.com/articles.aspx?a=l&categoryId=1


1
దొమ్మరి పిల్ల
మృత్యు తీగపై మోళీ కట్టే బాలిక
అడుగులో అడుగేసుకొంటూ నడుస్తూంది.
ఆమె పట్టుకొన్న వెదురుగడకు
ఒకవైపు జీవిక, మరో వైపు బాల్యం
వేలాడుతున్నాయి.

చిన్న అపశ్రుతి
రోడ్డుపై రక్తపు మరక.

దేముడు
పని ఇంకెప్పటికి నేర్చుకొంటాడూ?

By బొల్లోజు బాబా, Dec 7 2008 7:౫౩


2
సాంగత్యం
బయట
ఉరుములు మెరుపులతో
కుంభవృష్టిగా వాన.
అర్ధ నిమీలిత నేత్రాలతో
ప్రశాంతంగా నిద్రిస్తున్న నీవు .
సన్నిధిలో ఎంతటి
భరోసా ఉంటుంది.

కామెంట్లు 3
By బొల్లోజు బాబా, Nov 30 2008 7:59PM


3
ఆటో లోంచి పాట
మూడు చక్రాల స్పీకరు బాక్సు
ఏదో పాటను మోసుకుంటూ
సాగిపోతోంది.

మద్దెల అడుగుల చప్పుడు
దాని రాకనూ, పోకనూ
చక్కని శబ్దచిత్రంగా లిఖించింది.

పిట్టలు ముసిరిన చెట్టు
సంజెవేళలో వెదచిమ్మే
మువ్వల శబ్దాల్ని
రోడ్డుపై చల్లుకుంటూ పోతోంది ఆటో.

హడావిడిలో పట్టించుకోంగానీ
ఆ పాటకు జ్ఞాపకమేదో రేగుతాది
కలలో మెసలటానికి.

కామెంట్లు 3
By బొల్లోజు బాబా, Nov 25 2008 4:48AMబొల్లోజు బాబా

Friday, December 5, 2008

ప్రవాసి కలలు


చీకటి పడింది
పగటి వేషం తీసేసి
సుగంధ స్వప్నాల లోతుల్లోకి
నిశ్శబ్ధంగా జారిపోయాను.

కొబ్బరి పుల్ల తో కత్తి యుద్దం చేస్తుండగా
చెడ్డీ జారిన తమ్ముణ్ణి చూస్తూ
" షేమ్ షేమ్ పప్పీ షేమ్" అంటూ
పువ్వులా నవ్వుతుంది పాపాయి.
ఆ నవ్వుల పరిమళంలో తడుస్తూ
నువ్వూ నేనూ.

చెడ్డి పైకి లాక్కొని
కాంతారావు కాస్తా రాజనాలగా మారిపోయాడు.
మనిద్దరి చుట్టూ వాళ్లిద్దరూ
గిర.. గిర.. గిర.. గిర...


పూర్వానుభవాల్ని స్వప్నాల్లో
చూసుకొంటోంది హృదయం
వసంతార్భాటాల్ని విత్తనాల్లో
దాచుకొన్న వనంలా.

బొల్లోజు బాబాMonday, December 1, 2008

అనుమానప్పక్షి

లేగ దూడ
కట్రాట గుంజుకు పోయింది.
దాచేసుకొన్న పాలను
చేపుతోంది ఆవు.
దూడ మెడలో గంట
దొంగలిద్దరినీ పట్టించేసింది.

మట్టుపైని అణుగుకోడి
ముక్కుతో గుడ్లను మరోసారి
లెక్కెట్టుకొని, దగ్గరకు లాక్కొంది.బొల్లోజు బాబా


Thursday, November 27, 2008

హేమంత్ కార్కర్ కు అశ్రు నివాళి

మిత్రమా
నిన్నెందుకలా సంబోధిస్తున్నానో కూడా
నాకు తెలియటం లేదు.
నిన్నటివరకూ నీగురించి తెలియదు
నిన్నెప్పుడూ చూడలేదు
అయినప్పటికీ.....
నా ఆత్మీయ మిత్రమా
ఎందుకు ఉదయంనుంచీ
పదే పదే గుర్తుకు వస్తున్నావు?
ఎందుకు నీకై
హృదయం మౌనంగా రోదిస్తుంది?

కనురెప్పల మాటున
పలుచని నీటి పొరపై ఎన్నో దృశ్యాలు
లుక లుక లాడుతున్నాయి.
నీలం షర్టులో నీవు
హెల్మెట్ ధరిస్తూ, జాకెట్ సరిచేసుకొంటూ
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ
ఎవరికో దిశా నిర్ధేశం చేస్తూన్న
దృశ్యాలు పదే పదే
కుత కుత లాడుతున్నాయి.

నిన్నటి దాకా
అగ్ని వర్షం కురిపించిన
నీ కనులు తృప్తి నిండిన
నిశ్శబ్ధాన్ని ధరించాయి.
వదరుబోతు మృత్యువు
ఎదురుచూడని నిబ్బరమది.

ఒక నమ్మకం, ఒక భరోసా
కలిగించాలంటే ప్రాణమివ్వటం కంటే
మరేదీ ఉండదనుకొన్నావా?

నువ్వు మాత్రం మరొక శవం కాదు
ఎందుకంటే
నీవు నడిచిన ఐడియాలజీ మార్గం
నా జాతిని ప్రభావితం చేస్తుంది.
చేస్తూనే ఉంటుంది.

(ముంబాయి టెర్రరిస్టు దాడులలో చనిపోయిన, నిజాయతీ పరుడైన ఏ.టి.ఎస్. అధికారి శ్రీ హేమంత్ కార్కర్ మరియు ఇతర సిబ్బంది ఆత్మ శాంతికి )

Tuesday, November 25, 2008

వంశవృక్షం

ఒక వృక్షం
ఇష్టంతోనో, అయిష్టంగానో
కొమ్మలు రెమ్మలుగా విడిపోయి
నలుదిక్కులకూ చెదిరిపోవటం
ఎంతటి అనివార్యమిపుడు!

అవసరపడో, అనురాగంతోనో
ఆ కొమ్మలన్నీతమ పువ్వుల, తుమ్మెదల
సమేతంగా గుమిగూడటం
ఎంతటి అబ్బురం!

తమలో ప్రవహిస్తున్న పత్రహరితపు
మూలాల్నీ, మార్గాల్నీ
తెలుసుకోవటం, తెలియచెప్పటం
ఎంతటి సంబరం!

అన్ని వర్ణాలూ
ధవళ కాంతిలోకి కుప్పకూలినట్లుగా
అన్ని శాఖలూ
వంశమనే అద్దంలో ఒదిగిపోవటం
ఎంతటి లీలా వినోదం!

నాస్టాల్జిక్ పొత్తిలిలో
కేరింతలు కొడుతున్న
వృక్షశకలాలను సమయం
చెర్నకోలై అదిలించటం
ఎంతటి ఛిధ్ర దృశ్య విషాదం!

బొల్లోజు బాబా

Thursday, November 20, 2008

నైట్ షిఫ్ట్ కేబిన్ మాస్టర్

పట్టాలపై రైలుబండి
మిణుగురుల దండలా మెరుస్తోంది.
నిదురించే ప్రయాణీకులు
గమ్యాల్ని స్వప్నిస్తున్నారు.

వాడు మాత్రం
నిద్రను నిలువునా పాతరేసి
ఎరుపు ఆకుపచ్చ కాంతుల చేతులతో
ప్రతి రైలునూ నిలుపుతూ, పంపుతూ ఉంటాడు.

వాడూపిన పచ్చ జండాకి
వేయి స్వప్నాల్ని కడుపులో మోస్తున్న
ఇనుప అనకొండా భారంగా కదుల్తుంది.

ప్రయాణీకులు నిదురలో గమ్యాల్ని
పలవరిస్తూ ఉంటారు.

నూటనాలుగు జ్వరంతో ఉన్న వాడి కూతురుపై
కలిగిన ఆలోచనల్ని గౌతమీ ఎక్స్ ప్రెస్
తన చక్రాల పాదాలతో తొక్కేస్తుంది.
ఇంటివద్ద సగం ఖాళీగా ఉండే మంచపు తలపుల్ని
గూడ్సుబండి ఎక్కించుకు తీస్కుపోతుంది.
నిదురలో వీని మెడచుట్టూ చేతులువేసి
దగ్గరకు లాక్కొనే జీవనానురాగాలకు
వీడెప్పుడూ ఓ జీవిత కాలం లేటే.

ఒక్కోరాత్రి అరవై, డభ్బై రైళ్లను పంపించి
తెల్లారేసరికల్లా వీడో రైలు చక్రంలా మారిపోతాడు.

అదేపట్టాపై, అదే చక్రం అనంత దూరాలు సాగినట్లుగా
ఎరుపు, ఆకుపచ్చ కాంతుల మధ్య వీని జీవితం
జీవరాహిత్య గూడ్సు బండిలా సాగుతూంటుంది .

పట్టాకు చక్రానికి మధ్య నలిగిన రూపాయి బిళ్లలా
షిఫ్టుకీ, షిఫ్టుకీ మధ్య వీడి జీవగడియారం చితికి
ఎపుడో వచ్చే వృద్ధాప్యాన్ని ఇపుడే బోనస్ గా అందిస్తుంది.

నిదురించే ప్రయాణీకులు
గమ్యాలను మాత్రమే స్వప్నిస్తూంటారు.

వీని ఒక్క పొరపాటు
వేయి శవాలను పీల్చుకొనే మూడడుగుల నేలనే సత్యం
వీడి నరాలలో పాదరస ప్రవాహాల్ని పరుగులెట్టిస్తుంది.

తప్పుకొన్న పట్టాలమధ్య పొంచిఉన్న ప్రమాదాన్ని గుర్తించి
వీడో నిలువెత్తు ఎర్రజెండాయై
పరిగెత్తే రైలుకు ఎదురెల్తూవేసిన వెర్రికేకలు
అసహనపు ప్రయాణీకుల తిట్లలో కరిగిపోతాయి.

మెలుకువ గాజు పెంకులపై
వీడు చేసిన తపస్సు ఫలితంగా
నిదురించే ప్రయాణీకులు
తమ తమ గమ్యాలలోకి మేల్కొంటారు.

బొల్లోజు బాబా

Friday, November 14, 2008

నువ్వు నువ్వే- నేను నేనే

నేనో పాతికసంవత్సరాలపాటు
వెతికి వెతికి నిన్ను చేరుకుంటాను.
నువ్వో ఇరవై వసంతాలలో నాకై
చూసి చూసి నన్ను ఆహ్వానిస్తావు.

అంతవరకూ మనం జీవించినకాలమంతా
నిలువునా కుప్పకూలుతుంది.

సహజీవనమనే కొత్తవేషం కడతాం.

శరీరాలు ఒకదానికొకటి
ఎంతవెలిగించుకొని కరిగించుకొన్నా
ఎవరి పరిమళాలు వారివే!

ఎన్ని స్వాంతనలూ, ధైర్యాలూ,
ఓదార్పులూ ఇచ్చిపుచ్చుకొన్నాఎడారులూ,
ఎడారులకొనలవేలాడే మృగతృష్ణలూ,
నీవి నీవే! నావి నావే.

ఇరువురి ఆశల్ని, ఆశయాల్ని
ఎంతఒకే తెరపై చిత్రించినా
ఎవరి వర్ణాలు వారివే!

తమబరువుని తామే
మోసుకుతిరిగే మేఘాల్లా
ఎవరి శ్వాసభారాన్ని వాళ్ళే మోసుకోవాలి.

సముద్రం తరపుననీళ్ళు వకాల్తా తీస్కొని
ఎట్లైతే ఆటుపోట్లని నృష్టించలేదో
అలాగే
ఒకరి దప్పిక, ఆకలి, నొప్పులను
మరొకరు పూరింపలేరు.

ఎన్ని రోజులు కలిపి మండించినా
ఎన్ని రోజాల్ని కలిసి పండించినా
నువ్వు నువ్వే, నేను నేనే.
నేనే నువ్వు అనుకోవటం
నువ్వే నేను అనుకోవటమంతమాయ.

అయినా సరే
లోకం దృష్టిలో మనిద్దరిదీ
ఎప్పటికీ అన్యోన్యదాంపత్యమే.

బొల్లోజు బాబా

Monday, November 10, 2008

ఈ కవితకు పేరు సూచించండి.

విరగకాచినవెన్నెల్లో
మరొక్కపొగడపువ్వు కూడా
పట్టేట్టు లేదు.

రాత్రయితే చాలు
ఋతువు తప్పని
వలసపక్షుల్లా
నీ జ్ఞాపకాలు
హృదయంపై వాలతాయి.

హృదయతరువుపై
మరొక్కవసంతం కూడా
పట్టేట్టు లేదు.


చుంబనంలో
మోహావేశంలో
మూసుకొన్న
కన్నియనయనాల్లా
హృదయం తీయగా
వణుకుతుంది.

పొగడ పూల పరిమళంలో
వెన్నెల జలకాలాడుతూంది.బొల్లోజు బాబా

Wednesday, November 5, 2008

నగర మర్యాద + ఈమాట, ఆంధ్రభూమి లలో పడిన నా కవితల లింకులు.

బ్లాగ్మిత్రులకు, పెద్దలకు
ఈమాట వెబ్ పత్రిక యొక్క దశమ వార్షికోత్సవ సంచికలో ప్రచురింపబడిన " సార్ గారండీ, సార్ గారండీ" అనే కవిత మరియు మూడు నవంబరు న ఆంధ్రభూమి సాహితి పేజీలో ప్రచురింపబడిన " మట్టికనుల నా పల్లె" అనే కవితల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. (పేజీ చివరలో ఉంటుంది)
నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞుడనై ఉంటాను.
ధన్యవాదములతో
భవదీయుడు
బొల్లోజు బాబా

http://www.eemaata.com/em/issues/200811/1348.html

http://andhrabhoomi.net/sahiti.htmlనగర మర్యాద

రహదారికిరుపక్కలా చెట్లు క్రమేపీ తగ్గి
హోర్డింగులు మొదలైతే
నగరంలోకి ప్రవేశిస్తున్నామన్నమాటే.
రకరకాల రంగుల్లో, వింతైన వెలుగులతో
హోర్డింగులు వంగి వంగి స్వాగతం పలుతూంటాయి.

నోరూరించే రుచులూ, ఇంటిని మరిపించే ఆతిధ్యం అంటూ
కొన్ని హోర్డింగులు అత్యంత అతి వినయంతో ఆహ్వానిస్తాయి.

"తలతిరుగుడా అయితే పక్షవాతం కావొచ్చు" అంటూ మన క్షేమం కోరుతూ
కిడ్నీలెక్కడ దొంగిలింపబడతాయో చెపుతూంటాయి.

వేయబోయే కొత్త వేషాలకు దుస్తులు మావద్దే కొనుక్కోమని
కొన్ని హోర్దింగులు ప్రాకులాడుతూంటాయి.

మేమమ్మే చదువులే టౌనులో బెస్టంటూ
మీర్రాకపోతే మామీద ఒట్టంటూ కొన్ని ప్రాధేయపడతాయి.

మాదే " అసలైన అనువంశీక షాపంటూ" కొన్ని దీనంగా నమ్మబలుకుతాయి.

నిక్కచ్చైన KD బంగారం మావద్ద మాత్రమే లభ్యం
రండి రండి రండంటూ మరికొన్ని గారాలు పోతాయి.

"మిక్సీ కొనండి మారుతీ కారు ఖచ్చితంగా పొందండి" అంటూ
కొన్ని హోర్డింగులు రోడ్డు గుద్ది మరీ, సాదరంగా పిలుస్తాయి.

ఆఖరుకు చస్తే
మార్చురీ వేను ఫోను నంబర్లతో సహా (ఉపయోగపడే సమాచారమిది)
హోర్డింగులు ఆత్మీయంగా, సవివరంగా, సవినయంగా,
తెలుపుతూ నగరానికి ఆహ్వానిస్తాయి.

తెచ్చుకొన్న చమురు ఇంకి పోయేదాకా
నగరమన్నాకా, ఆమాత్రం మర్యాద చేయద్దూ మరి?


బొల్లోజు బాబా


Saturday, November 1, 2008

ప్రొడిగల్ సన్స్

కాలేజీ చదువులకని
ఇల్లు విడిచిన పిల్లలు
ఇంకా తిరిగి రారు.

వృద్దాశ్రమంలో అంతా బాగానే ఉంటుంది.
వేళకు తిండి, వైద్యం, కాలక్షేపం.
కానీ
మెలుకువ నిద్రపొడవునా వ్యాపిస్తూంటుంది.

చలిచేతుల్ని
అనుభవాల చుట్టూ వేసి
వెచ్చచేసుకోవాల్సిందే.

జ్ఞాపకాల్ని వింటూ కొవ్వత్తి
రాత్రిలోకి వలికిపోతుంది.
కాలం నిండా ఘనీభవించిన చీకటి.

ఇసుక గడియారంలోని
ఒంటరి ఎడారి ధార
భారంగా జారుతుంది.

గాలి తన బరువుని
చెట్లపై ఈడ్చుకుంటూ సాగుతూంటుంది.

పాదముద్రలను
కెరటం నోట కరచుకు పోయింది.
మౌనం పంజరంలా
దేహంపై దిగింది.

కాలేజీ చదువులకని
ఇల్లువిడిచిన పిల్లలు వచ్చారు.

బొల్లోజు బాబా

Sunday, October 26, 2008

పల్లె కన్నీరు వినిపించిన శ్రీ గోరటి వెంకన్నకు వందనాలు


పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల....... అన్న పాటను శ్రీగోరటి వెంకన్న బహుళ జాతి కంపనీలు ఏవిధంగా పల్లెపల్లెలకు విస్తరించి అక్కడి జీవన విధానాన్ని, వృత్తుల్ని ఎలా ఛిద్రం చేసాయో చాలా ఆర్ధ్రంగా, వింటున్నప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీరు జాల్వారే విధంగా వ్రాసారు.
ఈ పాట నిండా ఆయన తీసుకొన్న ప్రతీకలు,సామ్యాలు, వాడిన పదాలు పాటలోని వస్తువుకు గొప్ప బలాన్ని, స్ఫష్టతను చేకూర్చి చెప్పే విషయం శ్రోతకు చాలా సూటిగా చేరేలా చేస్తాయి.

మానవతా విలువలకు, స్వావలంబనకు ఆలవాలంగా ఉండే పల్లెలు నేడు సామ్రాజ్యవాద విస్తరణ ఫలితంగా తన స్వతంత్రతను, స్వచ్చతను కోల్పోయి, ఎవరిపై ఆధారపడకుండా ఇంతవరకూ బ్రతికిన తనబిడ్డలు వృత్తులు కోల్పోవటంతో పరాయి పంచన బతుకుతుండటాన్ని చూస్తూ ఈ విశాల భారత దేశంలోని ఒక పల్లె కన్నీరు పెడుతుంది, అంటూ గొప్ప ఎత్తుగడతో ఈ పాట మొదలౌతుంది. బహుళ జాతి కంపనీల విస్తరణను, సామ్రాజ్యవాదాన్ని ఈ కవి ఇక్కడ కనిపించని కుట్రలు గా వర్ణిస్తాడు. చేతి వృత్తుల చేతులిరిగిపోవటం వల్ల గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసి పోయిందని బాధపడతాడు.

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

లోహ పాత్రల ఇంద్రజాలంతో కుండల వాడకం మాయమైపోయింది . కుమ్మరి వాళ్ళు మట్టి పిసుక్కునే వామిలో తుమ్మలు మొలిచాయి అని అనటం ద్వారా వారు పని లేక చాలా కాలంగా ఉంటున్నారన్న విషయాన్ని కవి చాలా కరుణ ఉట్టిపడేలా చెపుతాడు.
నాగళ్ళ ఆరులు, కొడవల్ల కక్కులు, బండి వరలు, చేసే కమ్మరికి పనిలేక కొలిమిలో దుమ్ముపేరుకొంది పెద్ద బాడిస మొద్దుబారింది అనటంలో ఆకులం ప్రస్తుతం అనుభవిస్తున్న దైన్యం కళ్ల ముందు నిలుస్తుంది.
సాలెల మగ్గం కీళ్ళు విరిగి మూలకూర్చున్నదట. ఉపాధి మూలకూర్చున్నప్పుడు ఆత్మాభిమానం కల కుటుంబపెద్దకు ఆత్మహత్య మినహా మరో మార్గం కనిపించకపోవటం అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి.

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతు బావులెందుకెండే నా పల్లెల్లోనా

పల్లెలకు ప్రధాన ఆధారం వ్యవసాయం. అటువంటి వ్యవసాయంలో పెద్ద చిన్న రైతుల మధ్య తేడా ఈ పాదంలో చూడవచ్చును. బలిసిన దొరల పెద్దబోరు పొద్దంతా నీటిని భూమిలోతుల్లోంచి తోడుతున్నప్పుడు, చిన్నరైతు సేద్యానికుపయోగపడే బావులు, వాగులు వంకలు, మడుగులు తమ కళను కోల్పోయాయట. వీటిపైనే ఆధారపడే చాకలివానికి కూడా గడ్డుకాలమొచ్చింది అని కవి చెపుతున్నాడు. ఆ వాక్యంలో కూలిపోయినవి అన్న ఒక్క పదంద్వారా ఎంతటి విషాదాన్ని కవి పలికించాడో గమనించవచ్చు.

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పల్లెల్లో ఆటవిడుపుకోసం సేవించే కల్లుల స్థానంలో కల్తీకల్లు, బీర్లు, విస్కీలు, పెప్సీలు వచ్చిచేరాయి అనటంలో స్థానిక వనరుల విస్మరణ, కంపెనీల విస్తరణ, బలిసిన దొరలకే ధనం చేరుకోవటం వంటి విషయాల పట్ల కవి ఆవేదన చెందుతున్నాడు.

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

ఈ పాదంలో కవి సాయిబు పోరలని వర్ణించినా ఆ పోలికలన్నీ గ్రామాల్లో కాలువలలో, చెరువులలో, చేపలు, రొయ్యలు పట్టుకొని జీవనాన్ని సాగించే పల్లీయులకు కూడా వర్తిస్తుంది. రొయ్యల, చేపల పెంపకం, పెద్ద పెద్ద మరబోట్ల తో ఫిషింగ్ రంగాల్లోకి బడా స్వాములు కాలూనటంతో, ఈ పల్లీయులు కూడా చాలా చోట్ల ఉపాధి కోల్పోయి చెల్లా చెదురైనారు. తల్లికీ, ఊరికీ దూరంగా ఉన్న ఆ పోరలు తమ ఆకలి రొట్టెముక్కలతో తీర్చుకొన్నారా అయ్యో! వాటితో వారాకలి తీరిందా అని ప్రశ్నించడం, మూలాలు మరువని కవి, తడిని కోల్పోని మనిషి మాత్రమే చేయగలడు.

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

పల్లెల్లో వ్యవసాయాధారిత మరో కులం వడ్రంగి కులం. వీరు నాగళ్లు, బళ్లు చేస్తూ జీవిస్తూంటారు. పల్లే బావురుమంటున్నప్పుడు వీరికి పల్లెల్లో పని లేక ఫర్నీచరు పనులు, తాపీ పనులను వెతుక్కుంటూ పట్నాలకు వలసపోయారన్న విషయాన్ని కవి చెపుతున్నాడు.
ఆ సామూలంతా కూసూనేటి అన్న వాక్యం లో పోతులూరి వీరబ్రహ్మం పోలిక తీసుకు రావటం కవికి వారిపై కల అభిమానంగా అనుకోవచ్చు. వాకిలి పొక్కిలి లేసిందనటంలో గొప్ప పదచిత్రాన్ని గమనించవచ్చును.

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి , సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

పల్లెల్లో టైలర్ పాత్ర ఒకనాడు ఎలా ఉండేదో, పదిమందికి తలలో నాలుకలా ఎలా ఉండేవాడో వంశీ లేడిస్ టైలర్ సినిమాలో చూడవచ్చు (కామెడీ కోణాన్ని పక్కనపెట్టి). అలాంటి టైలర్ ఈ రోజు రెడిమెడు దుస్తులు పల్లెల్లోకి కూడా చొచ్చుకు పోవటం వలన వాని పాత్ర కుచించుకుపోయింది. రెక్కల బనీన్లు, సోడెలాగులు (పిక్క లాగులు) ఇప్పుడు వాడేవారేరి? ఆ నేపధ్యంలో కుట్టుమిషన్ల చప్పుళ్ళు ఆగిపోయాయని కవి చెపుతున్నాడు.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ.

ఈ మద్య కాలంలో బయలు దేరిన ఒక విచిత్ర పరిణామమిది. చెన్నై బాంబేల నుంచి కంపనీ నగలను సేల్స్ వ్యక్తులు తీసుకువచ్చి, అమ్మి పెట్టమని స్థానిక వ్యాపారస్తుల కప్పగించి, వాయిదాల పద్దతులలో డబ్బు వసూలు చేసుకుంటూంటారు. వాటిలో బంగారమెంతుంటుందో దేముడికే తెలియాలి. ఈ సేల్స్ వ్యక్తులు కూడా స్థానికంగా పాతుకుపోయిన డబ్బున్న వ్యాపారులనే తప్ప సామాన్య జీవనం గడిపే స్వర్ణ కారులను నమ్మరు. మరి అలాంటి నగలు చెర్నాకోలలై స్వర్ణకారులను తరుముతున్నప్పుడు, వీరు పల్లెల్ని విడిచి పట్నాలలో కూలిపనులు చేసుకొంటున్నారు. కొంతమంది పల్లెల్ని వీడలేక, కూలిపనులు చేయలేక వారు వృత్తి పరంగా ఉపయోగించే ద్రావకం లేదా సైనేడ్ లను తాగి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
ఇక పట్నాలలో అయితే మరొక పద్దతి. Exchange Offer లతో పెద్ద పెద్ద షాపులు, "మీరీరోజు ఎంత బంగారమైతే కొంటారో, దాన్నిచ్చేసి అంతే బరువున్న మరొక వస్తువుని మీరెప్పుడైనా వచ్చి పట్టుకు వెళ్ళొచ్చు" అంటూ కొనుగోలుదారుడిని ఆకర్షిస్తూంటాయి.
ఇలాంటి పరిస్థితులలో, బంగారం తీసుకొని వారం తరువాత వస్తువిస్తాననే పేద కంసాలినెవరు నమ్ముతారు?
కూలిపోయిన స్వర్ణకారుల వృత్తిని కవి ఇక్కడ చాలా ఆర్ధ్రంగా ఆవిష్కరించాడు.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది.

కవి స్వయంగా మాదిగ కులానికి చెందినవాడవటం వలన (తప్పయితే కరక్ట్ చేయండి) ఆకులం ఎలాచితికి పోయిందో గొప్ప ప్రతీకలతో కళ్లముందు నిలుపుతున్నాడు. నోరుతెరవటం చావుకు చిహ్నం,భంగపడటం అవమానానికి, నిండమునగటం మరలా చావు/ఓటమికి చిహ్నం, పదునారిపోవటం పూర్వవైభవాన్ని కోల్పోవటం. బాటాలు, లోటో ల దాడిలో ఆ వృత్తికి చెందిన వివిధ పరికరాలు పనుల్లేక ఏవిధంగా తల్లడిల్లుతున్నాయో అద్బుతమైన పదచిత్రాలతో కవి ఎంతో ఆర్ధ్రంగా చెప్పాడు.

పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

తోలు డప్పు స్థానంలో ప్లాస్టిక్కు డప్పు వచ్చి దాన్ని పాతరేసిందని చెప్పటం. పాతరేకు, పాతరేసి అన్న మాటలలో ధ్వని సౌందర్యం కంటే హింసాత్మక ముట్టడే ఎక్కువ వినిపిస్తుంది.

పూసలోల్ల తాలాము కప్పలు, కాశిలో కలసి ఖతమౌతున్నవి.
అంటూ పూసలోళ్ల జీవనోపాధి ఏవిధంగా ఆవిరయ్యిందో కవి ఆవేదనచెందుతాడు.


ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదో నా పల్లెల్లోనా.

పల్లెటూర్లలో ఎద్దుబండి ఉన్నదంటే పాటలో చెప్పినట్ట్లు ఏడాదంతా పని దొరిదేది. అన్ని కాలాలలోనూ పనులుండేవి. ఇటుక, దాయ, పెంట తోలటం (ఇంటివద్ద పోగుపడిన పెంట అమ్ముకోవటం), అరకదున్నటం, ధాన్యం తోలటం, కుప్పనూర్పుళ్లు వంటివి. ఏ కాలానికి తగ్గ పనులు ఆ కాలంలో చేసుకుంటూ ఆ యజమాని తన కుటుంబాన్ని గౌరవంగా నడుపుకొనేవాడు. కానీ టాటా ట్రాక్టరు వచ్చి దీన్ని గుద్దితే ఈ బండి ఎగిరిపడ్డదట. ఆ పడ్డంలో ఒక కుటుంబం దాని క్రిందపడి చితికి పోయిందన్న విషయాన్ని కవి మనముందుంచుతాడు.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ అన్న ప్రశ్నకు పంటపొలాల మందుల చెత్తర వాసన అని చెపుతూనే అప్పు రైతు మెడమీద కత్తై కూర్చుంది అంటు రెంటికీ ఒక అవినాభావ సంబంధాన్ని చాలా అద్బుతంగా ఆవిష్కరిస్తారు. ఈ నేలపై ఆర్ధికంగా బలహీనమైన వారు బ్రతికే నెలవును కోల్పోతున్నారన్న సత్యాన్ని అద్భుతమైన ఉపమానంతో కవి ముడిపెడతాడు.

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై

బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

పల్లెల్లో పల్లవించే జానపద కళలు ఎలా అంతరించిపోయినయో కవి కన్నీరొలికించేలా ఇక్కడ వర్ణిస్తాడు. హార్మోనియం చెదలు పట్టిందట, యక్షగాన పంతులు ఉప్పరి పని చేసుకొంటున్నాడు, తమ కళకు పోషణ లభించక. బుడగ జంగాలు పాతబట్టలమ్ముకుంటున్నారట. ఎందుకంటే పల్లె మొత్తం దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఈ కళలకు ఆదరణ ఎక్కడ చూపించగలదు? పాత బట్టల మూటలమ్ముకొంటున్నారు అని చెప్పటం ద్వారా పల్లె దరిద్రాన్ని కూడా అన్యాపదేశంగా చెపుతున్నాడిక్కడ కవి.


పిండిలా వెన్నెల కురిసే వేళ రచ్చబండపై ఊరు ఊసులు చెప్పుకొనే ఆ పాతరోజులు తలచుకొని, ప్రస్తుతం భోజనం చేసాకా ఒక్కడు కూడా బయట తిరగటం లేదేమిటబ్బా ఇదేమి చిత్రమో అంటూ ప్రశ్నించి, స్టార్ టీవీ సకిలిస్తాఉంది , సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మా నాపల్లెల్లోకు అని సమాధానాన్ని ఇస్తారు. (బహుసా కొన్ని నక్సలైట్ ప్రభావిత ప్రాంతలలో పరిస్థితులను కూడా చెప్పుతూ ఉండవచ్చు)

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

బహుళ జాతి మాయలు, కుటీర పరిశ్రమలు పెట్టక పోవటం అంటూ కనిపించని కుట్రలను పాట చివరి పాదంలో కవి స్పష్టం చేస్తాడు. ఈ పరిస్థితులకు సూచ్య ప్రాయంగా పరిష్కారాన్ని కూడా సూచిస్తాడు కవి.

ఈ పాటలోని శభ్దసౌందర్యం ఈ పాటకు గొప్ప అందాన్నిస్తుంది. చిన్నచిన్న అచ్చ తెలుగు పదాలు పాటనిండా పరచుకొంటాయి. వింటున్నప్పుడు వీనులకు ఒక వింతైన అనుభూతిని మిగులుస్తాయి. కానీ ఈ పాటలోని పదాల వెనుకున్న వాస్తవం, దైన్యం, నిస్సహాయత అంతకు నూరురెట్లు ప్రకాశవంతంగా ఒక కరుణార్ధ్ర దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.
ఈ పాట వందేమాతరం శ్రీనివాస్ గొంతునుండి వింటున్నప్పుడు కొన్ని చోట్ల ఆ గాన గంభీరతకు ఒళ్ళు జలదరిస్తుంది. (ఉదా: యాచకులు నా బుడగా జంగాలు అన్న చోట).

ఏ కాలంలోని కవైనా ఆయా కాలాల రాజకీయ ఆర్ధిక పరిస్థితులను, తన రాతల్లో ప్రతిబింబింప చేస్తాడు. ఆ వచ్చే మార్పులు మంచి వైపుకైతే సంబరపడిపోతాడు. అవి సగటు మానవజీవనానికి విఘాతం కలిగించేవైతే ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాటికి పరిష్కారాలు తనపరిధిలో ప్రతిపాదిస్తాడు. ఈ పాటలో శ్రీ గోరటి వెంకన్న గారు సరిగ్గా అదే చేసారు. మారుతున్న పరిస్థితులలో కూలిపోతున్న ఉపాధులు, నలిగిపోతున్న బ్రతుకుల గురించి వారి పరిశీలనలను ఎంతో ఆర్ధ్రంగా ఆవిష్కరించారు. వారికి ఈ బ్లాగ్ముఖంగా వందనాలు తెలియచేసుకొంటున్నాను.

Thursday, October 23, 2008

ఒక జ్ఞాపకం.......


ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో

హృదయంలో విరిసిన సన్నజాజుల గానంలా
ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

గుప్పిట రహస్యాలను విప్పిన నూత్న యవ్వన వనాల
పరిమళాలు విరజిమ్మే శీతాకాల రాత్రులలో
నీ సాంగత్యపు కొలిమిలో నన్ను నేను
వెచ్చచేసుకొని, కరిగించుకొని మరిగించుకొనే క్షణాన
వర్షించిన సౌందర్యానందం నిన్నూ నన్నూ
ఆకాశపుటంచుల వరకూ విసిరికొట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

రొచ్చులు, రోతలూ, రేషన్లు, నెలసరి వాయిదాలూ
ఇంకా కబళించని రోజులలో
వెన్నెల పిట్టలు వాలిన పొగడ చెట్టు క్రింద
రాలిపడే పొగడపూల వానలో తడుస్తూ
పెదవులతో దేహవీణియలను మీటుకుంటూ
ఆ గానలోకంలో విచ్చలవిడిగా విహరించి
కనిపెట్టిన రహస్యాలను దాచుకొంటూ
దోచుకొంటూ, పంచుకొంటూ పరువులిడిన దూరాల
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

పోటీలు, పోలికలూ, పధకాలు, పన్నాగాల వలల్లో
ఇంకా చిక్కుకోని ఆ అకలుషిత దినాల్లో
పట్టుకుచ్చులతో స్పృశించే నారింజ కాంతుల రాత్రిలో
వాంఛ, అంగీకారం పెనవేసుకొన్న క్షణాన
నీ కురులమల్లియలను కాల్చేలా నా శ్వాస జ్వలించేవేళ
విచ్చుకొన్న పెదవులు, సగంమూసిన కనులతో
నీ సౌందర్యం శాటిన్ తెరై నా హృదయంపై పరచుకొన్నప్పుడు
ఒక అదృశ్య హస్తం నిన్నూ నన్నూ ఎత్తుకపోయి
కాలరహిత, ఆలోచనారహిత, చేతనారహిత స్థితిలో కప్పెట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
********************

ఏమిటీ పరధ్యానం! వింటున్నారా?
స్కూలు ఫీజ్ కట్టటానికి రేపే ఆఖరు రోజుట.
చంటిదాన్ని హాస్పటల్ కి తీసుకెళ్ళాలి నంబరుబుక్ చేసారా?

జ్ఞాపకం హాయిగా సలుపుతుంది
వాస్తవం ముల్లుగర్రై పొడుస్తుంది.

బొల్లోజు బాబా

Sunday, October 19, 2008

ఒకానొక రెడ్ లైట్ ఏరియా


నాలుగు రోడ్ల కూడలి
పరాకాష్టకు చేరుకున్న ఒకానొక
వికృత క్రీడ యొక్క భీభత్సావృత కూపం.

జీవితం లైంగికంగా వ్యాప్తిచెందే
అంటురోగమయిన చోట
కన్నెలు మల్లెలవుతాయి
మల్లెలు కత్తులవుతాయి.

ఇక్కడ స్త్రీ చర్మం గజాల్లెక్కనా
గంటల్లెక్కనా వ్యాపారం చేయబడుతుంది.
ఇక్కడ అసూర్యంపశ్యల మాంసం
దేహాల్లెక్కన వడ్డీకి తిప్పబడుతుంది.

వర్ణ, వర్గ, కుల, మతాలనబడే
సభ్యసమాజపు శిలాతెరలు ఇక్కడ
దేహాలమద్య కనిపించని మంచుపొరలవుతాయి.

కిలికించితాలు, చెక్కిళ్ళ సిగ్గుదొంతరలు,
సుఖమనిపించే విరహాలు, పరిష్వంగ పులకింతలు,
అవన్నీ ఇక్కడి జీవన పరాజితుల
గుండెల్లో కలల శిలాజాలు.

ముత్యం భస్మమయినట్లు
స్వప్నయవ్వనం కాలిపోగానే, వాస్తవం
అనకొండాలా మృత్యుకౌగిలించుకుంటుంది.

పింప్ లు పిండుకోగా స్థనాల్లో
మిగిలింది రక్త గడ్డలొక్కటే.
నిత్యం వందల డైనోసార్ పందుల
రత్యానంతరం దేహాల్లో మిగిలింది
రోదనా ప్రవాహమొక్కటే.

కసుగాయల చెక్కిళ్లు చిదిమితే
కారేది పాలు కాదు ఎయిడ్స్ మాత్రమే.
ఎడారి కొమ్మలు పుష్పించేదిక
వేదనా బూడిద మాత్రమే.

ప్రపంచ ప్రాచీన వృత్తి ఇక్కడి
వ్రణ యోనులకు జీవనాధారమై
అదే మృత్యుదాతయై విరాజిల్లుతుంది.

సమాన ఆస్తి హక్కు, 30% రిజర్వేషన్ల వల్ల ఏం లాభం?
జీవన పరిస్థితులు మెరుగుపర్చాలి కానీ?


బొల్లోజు బాబా

(ఒకానొక రెడ్ లైట్ ఏరియా చూసి చలించి)

Tuesday, October 14, 2008

శలవుల్లో కాలేజీ


శలవుల్లో కాలేజీ
పక్షులెగిరి పోయిన వేడాంతంగళ్ లా ఉంది.

ఇసిక తుఫానులో తడిచిన
ఖర్జూరపు చెట్టులా
కాలేజీ గదుల కళ్ళపై ధూళి పొర
పరచుకొంది.

సరస్వతీ దేవికి నిద్రా భంగం కాకూడదని కామోసు
ఇస్మాయిల్* నడచిన చెట్టుపై చిలకల సందడి
విరామం తీసుకుంది.

ఉపన్యాసాల పావురాళ్ళను ఎగరేసే
తరగతి గదులు వర్జించిన పక్షిగూళ్ళై
నిశ్శబ్ధాన్ని ధరించాయి.

తమపై వ్రాసిన ప్రేమరాతలను
చదువుకొంటున్న చెక్క బల్లలు
వసంతంలో భ్రమరాలతో తమ సరాగాల్ని
తలపోసుకొంటున్నాయి.

శలవుల్లో కాలేజీ మొత్తం
విత్తనాలకై ఎండబెట్టిన బీరకాయలా
పొడిపొడిగా ఉంది.

కోతకోసిన వరిచేను దుబ్బుల
జీవరాహిత్యం గ్రవుండులోని
పాదముద్రలలోకి ప్రవహించింది.

విద్యార్ధుల్లేని కాలేజీ
తలతెగిన వృక్షంలా, వృక్షాల్ని నరికిన వనంలా
వనాల్ని మింగిన శిశిరంలా ఉంది.
అచ్చు
పగలు చూస్తే రాత్రి కవితలోకొచ్చేలా.బొల్లోజు బాబా*ఇస్మాయిల్ గారు మాకాలేజీలో పనిచేసారు

Friday, October 10, 2008

సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్

ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్నశ్రీ సోమసుందర్ గారు నిత్యయవ్వనుడు, నిత్యోత్సాహి. తెలుగు సాహిత్యక్షేత్రంలో కురువృద్దుడు. వయసు 84 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని తన ఉఛ్వాస నిశ్వాసాలుగా వెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు.

శ్రీ సోమసుందర్ గారు కవిగా, కధకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతోగత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు. సాహితీక్షేత్రంలో వీరు సహస్రబాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా అగుపిస్తారు.

జననం - విద్యాభ్యాసం
శ్రీ సోమసుందర్ గారు తూర్పుగోదారి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం అనే గ్రామంలో శ్రీ కాళూరి సూర్యప్రకాశరావు, శ్రీమతి వెంకాయమ్మలకు 18-11-1924 అష్టమ సంతానంగా జన్మించారు. తన పినతల్లిగారైన శ్రీమతి ఆవంత్స వెంకాయమ్మగారికి సంతానం లేకపోవటం వలన చిన్నతనంలోనే శ్రీ సోమసుందర్ గారు వారింటికి దత్తుకు వెళ్లారు. ఆవిధంగా కాళ్ళూరి అనే ఇంటి పేరు ఆవంత్సగా మారింది.

తనను దత్తత తీసుకున్న వారికి మెండైన సాహిత్యాభిలాష కలిగిఉండటంవల్ల, చిన్నతనం నుంచే సంస్కృత కావ్యాలు, శతకాలు, అమరకోశం వంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం వీరికి కలిగింది. కానీ విధి వశాత్తు వీరి దత్తత తల్లితండ్రులు వీరికి పదేళ్ళ వయసుండ గానే పరమపదించారు. అయినప్పటికీ వీరి చిన్నారి మనసుపై పుణ్య దంపతులు వేసిన సాహిత్య ముద్ర మాత్రం అలానే నిలిచిపోయింది. వీరి ప్రాధమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943 లో కాకినాడ పి.ఆర్.కళాశాలలో ఉన్నత విద్య నభ్యసించారు.

దేశ భక్తి
కాలం లో స్వాతంత్ర్యం కోసం జరిపే పోరాటానికి బాలగోపాలమూ ఉత్తేజితమై సర్వం త్యజించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపేవారు. శ్రీ సోమసుందర్ గారు కూడా అప్పుడు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. 1942 లో విద్యార్ధులను కూడదీసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెచేసారు. వీరి చర్యలకు ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం వీరిని లాకప్పులో పెట్టి, రోజూ స్టేషనుకు వచ్చి సంతకం చేయాలన్న షరతుపై విడుదల చేసింది.

శ్రీ సోమసుందర్ గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పోలీసుదెబ్బలకు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అప్పుడు వ్రాసిన వీరి మొదటి గీతంలో ఎంతటి గొప్ప దేశ భక్తి ఉందో గమనించండి.

రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ...........

ఇక్కడ తన శరీరాన్ని కాకుల్ని గద్దలనూ తినివేయమంటున్నారేమిటా అనుకోవచ్చు కానీ అది అనన్యమైన దేశభక్తిగా గ్రహించాలి, ఎందుకంటే తను చనిపోయిన తరువాత తన శరీరం కూడా బ్రిటిష్ వారికి దక్కకూడదనే తీవ్ర స్వాతంత్ర్య కాంక్ష. (ఇది వారు స్వయంగా చెప్పిన విశ్లేషణ).

వీరు స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్ధి నాయకుడిగా, కమ్యూనిష్టు పార్టీ సభ్యునిగా తనదైన గొప్పపాత్రను పోషించారు. సామ్రాజ్య వాద శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 1954 వరకూ వీరు కమ్యూనిష్టు పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించారు. తరువాత తరువాత రాజకీయాలు, సాహిత్య వ్యాసంగము ఏకకాలంలో నిర్వహించటం వలన , తనకెంతో ప్రీతిపాత్రమైన సాహిత్యానికి తగిన న్యాయం చేయలేకపోతున్నానని ఆత్మపరిశీలన చేసుకొని, క్రమక్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు.

సాహితీ ప్రయాణం
వీరు ఫోర్తు ఫారం చదువుతున్న రోజుల్లో పద్య ప్రక్రియపై మోజు కలిగి, చందస్సును క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. ప్రక్రియలో ప్రతీ రోజూ అభ్యాసం కొరకు తాను వ్రాసిన వివిధ పద్యాలను మిత్రులకు, ఉపాద్యాయులకు చూపేవారు. 1943 వరకూ కూడా భావకవిత్వం వీరికి తారసపడలేదు. భావకవిత్వాన్ని చదివిన తరువాత వీరు తనదైన వచనా శైలిని అలవరచుకొన్నారు. వీరు కమ్యూనిష్టు కార్యకర్తగా పనిచేసారు కనుక భావజాలం వీరి కవిత్వంలో అంతర్లీనంగా జాలువారుతుంది. వీరి కవిత్వానికి మానవుడే ప్రాతిపదిక, సమాజమే నేపధ్యం..

వజ్రాయుధం నుండి ఆమ్రపర్ణి వరకూ సుమారు ఆరున్నర దశాబ్ధాల పాటు శ్రీ సోమసుందర్ చేసిన కవితాయానంలో సమాజ సంకుల సమరమే అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది. కవి మానవుని విస్మరించి, ఆకాశంలో విహరించిన సందర్భాలు కనపడవు.

వీరు 1969-73 మద్య పిఠాపురం నుండి కాకినాడకు మకాం మార్చి ' కళా కేళి " అనే సాహిత్య పత్రికను నడిపారు. (వీరు పిఠాపురంలో నివసిస్తున్న ఇంటి పేరు కూడా "కళాకేళి నికేతన్”) ప్రక్రియలో వీరు కొంత ఆర్ధికంగా నష్టపోయి, కొంత భూమిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. కాలం మినహా మిగిలిన జీవితకాలమంతటిలో, వీరు ప్రతిఏటా ఒకటో రెండో పుస్తకాలు చొప్పున రాస్తూనే ఉన్నారు.

1975 లో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి కళా ప్రపూర్ణ అవార్డును పొందినపుడు, వారి అభిమానులు కాకినాడలో సన్మానం జరిపారు. దానికి విచ్చేసిన దేవులపల్లి, వీరికి ప్రత్యేకంగా కబురు పెట్టించి కాకినాడ రప్పించుకొన్నారు. రోజు జరిగిన సభకు శ్రీ సోమసుందర్ అధ్యక్ష్యత వహించారు. సభలో దేవులపల్లి ఒక చీటిపై " మీరు నా కవిత్వంపై విమర్శనాత్మక పుస్తకం వ్రాయాలి" అని కోరారు. దానిని పైకి మైకులో చదవమని దేవులపల్లి కోరగా వీరు మైకు తీసుకొని "మీ సాహిత్యం పై నేను పుస్తకం వ్రాయటం నాకు సాద్యమా? "అని అడిగారు. దానికి దేవులపల్లి మరలా మరో చీటిపై " మీరు వ్రాయగలరు, మీకా సమర్ధత ఉంది వ్రాయండి ఇది నా ఆజ్ఞ అనుకోండి" అని వ్రాసి ఇచ్చి, దాన్ని కూడా చదవమని సైగ చేసి చెప్పారట. ఆవిధంగా ఆవిర్భవించిన గ్రంధమే "క్రిష్ణశాస్త్రి కవితాత్మ".

తెలుగు విమర్శనా సాహిత్యంలో ఇంతటి ఉత్తమ విమర్శ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారి కవితాత్మను పట్టుకొన్న గొప్ప పుస్తకమిది. కృష్ణ శాస్త్రి గారి పై వ్రాసిన పుస్తకాలలో ఒకదానికి ప్రైజు ఇవ్వదలచి పోటీ పెడితే, పోటికి పంపించబడ్డ 15 పుస్తకాలలో శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన "కృష్ణ శాస్త్రి కవితాత్మ" అనే పుస్తకం మొదటి బహుమతి గెలుచుకోవటం వీరి సునిశిత పరిశీలనా శక్తికీ, రచనా పటిమకు నిదర్శనం.

ఇంత సుదీర్ఘకాలంగా మీరు సాహిత్యాన్ని ఎలా సృష్టించగలుగుతున్నారని అడిగినప్పుడు వారు చిరునవ్వు నవ్వి " రాయలేకుండా ఉండలేక. ఏమీ రాయకపోతే ఆరోజు దుర్దినంగా ఉంటుంది" అన్న వారి మాటలను బట్టి, వారు కవిత్వం వ్రాయటం, ఒక పూవు వికసించటం లాగా, చెట్లు వసంతాన్ని ధరించటం లాగా. ఒక సహజ క్రియా అని అనిపిస్తుంది.

శ్రీ సోమసుందర్ గారు జీవితమే కవిత్వం అని నమ్మి, జీవితాన్నే కవిత్వానికి అంకితం చేసిన వ్యక్తి, శతాధిక గ్రంధ కర్త. కొందరు కవులు తాము వ్రాసిన ఒకటి రెండు రచనలతో వచ్చిన కీర్తితో జీవితాన్ని వెళ్లదీస్తారు. కానీ శ్రీ సోమసుందర్ గారి రచనలు అసంఖ్యాకం. దేని ప్రతిభ దానిదే, దేని సౌరభం దానిదే. సామాన్య మానవుని కవిత్వం లో ఆవిష్కరించటానికై వీరు కవిత్వాన్ని నిత్యాగ్నిహోత్రంగా పాటించారు.

ఆరున్నర దశాబ్ధాల వీరి సాహితీయాత్రలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రళయాలు, కరువులు, ఎన్నో కనిపిస్తాయి. జాతి చైతన్యాన్ని కవితా చైతన్యంగా సమర్ధ వంతంగా తర్జుమా చేసిన అభ్యుదయ కవిగా శ్రీ సోమసుందర్ గారికి తెలుగు సాహిత్యంలో సాటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

వీరు సాహిత్యజీవితంలో అందుకోవలసిన శిఖరాలు అందుకోలేదని నిర్ధ్వంద్వంగా చెప్పవచ్చును. అకాడమీ ప్రైజులు, అవార్డులు వీరి దరి చేరకపోవటానికి కారణం శ్రీ సోమసుందర్ గారు ఎన్నడూ రాజకీయనాయకుల దగ్గర, అధికార పీఠాల్లో ఉన్నవారిదగ్గర తలవంచి నిలబడలేదు.
వ్యక్తిత్వం
శ్రీ సోమసుందర్ అభ్యుదయ కవి. తెలంగాణా ఉద్యమాన్ని కోస్తా ప్రాంతం నుండి సమర్ధించి కవిత్వం వెలువరించిన మహామనీషి శ్రీ సోమసుందర్ గారు. అప్పట్లో " ఖబడ్దార్ హే నిజాం పాదుషా .... ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురని " గర్జించిన సాహసి.

శ్రీ సోమసుందర్ గారి వ్యక్తిత్వంలో మరొక విశిష్టమైన అంశం ఏమిటంటే వీరు చాచే నిష్కల్మష స్నేహ హస్తం. వీరి సమకాలీనులలో ఎవరికైనా ఏదైనా అవార్డు వచ్చినట్లయితే వారిని అభినందిస్తూ వ్యాసమో, పుస్తకమో వ్రాసి అవార్డేదో తనకే వచ్చినంత ఆనందించటం వీరి కల్మషమెరుగని మనస్సుకు అద్దం పడుతుంది.

వీరు ఎందరో కవులను ప్రోత్సహించారు. అలనాటి ఓలేటి శశాంక మొదలు నాటి అరుణ్ బవేరా వరకూ.

ఇస్మాయిల్, మిరియాలరామకృష్ణ, మల్లిక్, చందుసుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ వంటి చాలా మందిని వీరు వెన్ను తట్టి ముందుకు నడిపించారు.

వీరికి రెండు పార్శ్వాలు. ఒకటి రచనా వ్యాసంగం. రెండవది తన రచనల్లో దేన్నైతే ప్రవచించారో దానికోసం నిరంతర పోరాటం. దానిలో భాగంగా శ్రీ సోమసుందర్ గారు ప్రతీ ఏటా ఐదుగురు కవులకు ఆరువేల రూపాయిల నగదు బహుమతిని, తాను నెలకొల్పిన సోమసుందర్ లిటరరీ ట్రస్టు ద్వారా అందచేస్తున్నారు.

2006 లో వీరి ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆధునిక మహిళా సాహిత్య సదస్సు జరిపారు. దానికి రాష్ట్రం నలుమూలలనుంచీ అనేక మంది కవయిత్రులు విచ్చేసి పాల్గొన్నారు.

పాత కొత్త తరాల వారధి
1953 వరదలకు చలించిపోయిన సోమ సుందర్ గారు వ్రాసిన గోదావరి జలప్రళయం అనే కావ్యంలోని కొన్ని కరుణ రస ప్రధాన పద్య పాదాల ను చూస్తే వీరి కవితా శక్తిని గుర్తించవచ్చును.

ఏమమ్మా, ప్రళయమువలె పొంగి గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమన్యాయమే తల్లీ...

2004 లో వీరు రచించిన అక్షర నాదం అనే కవితా సంపుటిలోని కొన్ని పద చిత్రాల ను గమనించినట్లయితే వీరి ప్రతిభ, వీరేవిధంగా రెండు తరాలకు వారధిగా ఉన్నారనే విషయం సుస్ఫష్టమౌతుంది.

గ్లోబలైజేషన్ తో భూమి రజస్వలై
నవవరాన్వేషణలో మిటకరిస్తుంది......
హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ తో
అవతరించిన క్లోనింగ్ కోడె దూడ
' అంబా" అని అరవడం
గ్రాంధికమని నిషేదిస్తుంది. (నేటిని ఏటికి విడిచి అనే కవితనుంచి )


నేడు నా ముని వాకిట
పూచిన గులాబి పరిమళం నిండా
బాంబుల విషధూమం నింపింది పడమటి గాలి (సమరం కాదిది మరణం అనే కవితనుంచి )

ఇన్ని జంత్ర స్వరాల నాదాలలోంచి
ఎన్ని వెన్నెల మైదానాలు - ఎలా తెరుచుకున్నాయి?
దూరంలో మసకబారిన కొండలు
బూడిద బుంగలు (బితోవెన్ సంగీతంపై వ్రాసిన మూన్ లైట్ సొనాటా అనే కవిత నుంచి)

వంకవంకల వయ్యారాలతో
తల్లిలా పవళించిన ఏటి ఒడిలో
నిటారుగా నిలచిన కొబ్బరి తోట....
రేగిన జుత్తుతో ఊరికే మారాంచేసే
పిల్లవాడి వెర్రి ఊగిసలాట...... (ఏటి వడిలో కొబ్బరి తోట అనే కవిత నుంచి)


వీరి కవిత్వంలో సరళత, అదే సమయంలో అర్ధ గాంభీర్యతా , ఉదత్తమైన లోతైన భావాలు, మానవత్వపు పరిమళాలు పుష్కలంగా పొర్లాడుతూంటాయి.

బానిసల దేశం, గోదావరి ప్రళయం, రక్తాక్షి, హిరోషిమా, రక్షరేఖ, సీకింగ్ మై బ్రోకెన్ వింగ్, వంటి వీరి రచనలలో ఆయా సంఘటనలకు, సందర్భాలకు ఒక కవి తన హృదయమంతటితోనూ స్పందించిన విధానాన్ని దర్శించవచ్చు.

అంధురాలికోసం బిథోవెన్ సృష్టించిన వెన్నెల, సౌరాష్ట్రంలో జరిగిన నరమేధం, ఎన్నటికీ పూర్తికాని సోమశిల ప్రోజెక్టూ, ఖుజరహో శిల్ప విన్యాసం, సొమాలియాలో అన్నార్తులూ, సైగల్ గానమాధుర్యం ఇవీ వీరి కవితా వస్తువులు. వీటిలో ఒక్కటీ కూడా మట్టిని , గాలిని విడిచి సాము చెయ్యవు.
అవార్డులు
వీరు 1979 లో సోవియట్ లాండ్ నెహ్రూబహుమతి పొందారు. రాజాలక్ష్మీ ఫౌండేషను అవార్డు, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు. 2008 సంవత్సరానికి గానూ ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం వీరిని వరించి వన్నెకెక్కింది.

శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి ఇంతవరకూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాకపోవటం ఆశ్చర్యకరం. ప్రభుత్వ పరంగా వీరికి జరిగిన అన్యాయం పెరుమాళ్ల కెరుక. కవిత్వం సోమసుందర్ కెరుక.


వీరి రచనల పట్టిక
వీరింతవరకూ 77 పుస్తకాలు రచించారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి.
వీరు ప్రస్తుతం తన స్వీయచరిత్ర రెండవ భాగాన్ని వ్రాస్తున్నారు.
ఈమద్య ప్రచురించిన వీరి పుస్తకం పేరు " దేశి సారస్వతము-సమాజ వాస్తవికత. " దేశి సాహిత్యంలో ఉండే సామాజిక స్పృహపై వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంధం.


వజ్రాయుధం: నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితాసంకలనం. 1946 అక్టోబరు 26 దొడ్డి కొమరయ్య మరణంపై వ్రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవు తుంది. పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించింది. 1956 లో శ్రీసంజీవరెడ్డి ప్రభుత్వం నిషేదాన్ని ఎత్తివేసింది. ఇది ఇప్పటికి 5 ముద్రణలు పొందింది. అనంతపురం యూనివర్సిటీ వారు దీనిని టెక్ట్స్ బుక్ గా పెట్టుకొన్నారు.
కాహళి : ఇవి ఆంధ్రరాష్ట్ర ఉద్యమ సమయంలో వ్రాసిన కవితలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమిస్తున్న సమయంలో వారానికి ఒకటి చొప్పున "జ్వాల" అనే వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. 1953 లో పుస్తక రూపంగా వచ్చాయి.
గోదావరి జల ప్రళయం: 1953 లో వచ్చిన గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో, శ్రీ సోమసుందర్ గారు రాజమండ్రి, అమలాపురం, కపిలేశ్వరం వంటి ప్రాంతాలను సందర్శించి అప్పటి గోదావరి భీభత్సాన్ని కరుణరసార్ధ్రంగా కవిత్వీకరించారు.
రక్తాక్షి : ఫ్యూడల్ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశత్వాలు, అమానుషత్వాలను కధా వస్తువుగా తీసుకొని చేసిన చందోబద్ద కావ్యం. కావ్య ప్రత్యేకత ఏమిటంటే ఆధునిక కాలంలో విశ్మరింపబడ్డ ప్రాచీన చందస్సును తీసుకొని రచించటం. ఉదా: శ్రీ వృత్తం, వనితా వృత్తం వంటివి. రక్తాక్షి కావ్యంలో రెండు భాగాలు ఉంటాయి. 1. సచితానందం 2. రక్తాక్షి
మేఘరంజని: 1954 లో వెలువడ్డ కధాకావ్యం. దీర్ఘ వచన పద్యం. మొత్తం ఆరు చాప్టర్లు ఉంటాయి.
సోమరసం-సుందరకాండ: ఇది తాత్విక చింతనామయ కావ్యం. ఏమిటీ లోకం, ఏమిటీ భాదలు వంటి ప్రశ్నలు, వాటికి కవి కనుగొన్న సమాధానాలతో కావ్యం రచింపబడింది.
మిణుగురులు: అద్బుతమైన పదచిత్రాలతో కూడిన ఆధునిక కవితాసంకలనం.
అనలకిరీటం: 1975 లో వెలువడిన కవితా సంపుటి. Progressive and Revolutionary భావాల Concealed expressions తో కూడిన కవితల పుస్తకం. (శ్రీ సోమసుందర్ గారి మాటలలో)
వెన్నెలలో కోనసీమ : 1977 లో అమలాపురంలో ఆవిష్కరింపబడిన గీత సంపుటి. సంగీతానికి అనుకూలంగా ఉండే గీతాల రచన. గీతాలలో చాలావాటిని రేడియోలలో పాటలుగా పాడారు.
రాలిన ముత్యాలు: మిని కవితల ఉద్యమానికి ముందే లఘుకవితల పేరిట వ్రాసినటువంటి చిన్ని చిన్ని కవితలు.
మాఊరు మారింది: శ్రీసోమసుందర్ గారు ఎమర్జన్సీని బలపరిచారు. విషయం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలవరపరచి, వీరితో భేటీ అయి అయిదురోజులపాటు చర్చించగా, వీరు ఎమర్జన్సీ కి వ్యతిరేకంగా తన భావాలను మార్చుకొని, ఒక స్టేట్ మెంట్ ఇవ్వటం జరిగింది. భావ పరిణామక్రమంలో వ్రాసిన 7 భాగాల కావ్యమే మావూరు మారింది. దీనిలో ప్రణాళికల ద్వారా గ్రామాలే విధంగా మారాయి అని వివరిస్తూ వ్రాసినటువంటి కావ్యం.
ఆగతనికి శుభారంభం : వచన కవితలు
బృహత్కావ్యాలు (నాలుగు సుదీర్ఘ కవితలు): నాలుగు దీర్ఘకావ్యాలు. సుమారు 300 పేజీల పుస్తకం. పుస్తకంలో అక్షయతరంగిణి, కాలం వీలునామా, ముక్తఛ్ఛాయ, అరచే లోయలు అనే నాలుగు దీర్ఘ కవితలు ఉంటాయి. దీనిలో ముక్తఛ్చాయ లో మననుంచి మన నీడ విడిపోవటం, అసలు మననీడ అంటే ఏమిటి అనే విషయాలపై తాత్విక, భౌతిక చింతనలతో కూడిన భావాలుంటాయి.
ఆధునిక కవిత్వం: వ్యాసావళి
క్షితిజ రేఖలు: అయిదు దీర్ఘ కావ్యాలు.
మార్క్సిజము-కవిత్వం: వ్యాసావళి

ఒక్క కొండలో వేయి శిల్పాలు: 120 పేజీల దీర్ఘ కవితల సంకలనం
ఆంగ్ల సీమలో ఆమని వీణలు (యాత్రా సాహిత్యం): 1983 లో వీరు ఆంగ్లసీమలో చేసిన ప్రయాణ విశేషాలతో కూడిన ట్రావెలాగ్.
గంధ మాదనం: రచనా కాలం 1995/96. హనుమంతుడు సీతను అన్వేషించటానికి వెళ్లినపుడు మద్యలో మకాంచేసిన పర్వతం పేరు గంధమాదనం. జీవితం యొక్క అన్వేషణకు గ్రంధాలయం ప్రాతిపదిక అనే భావనతో వ్రాసిన దీర్ఘకావ్యం.
చేతావని: చేతావని అంటే వార్నింగ్ (1994). బాబ్రిమసీదు కూల్చినపుడు వ్రాసిన దీర్ఘ కావ్యం. 50 పేజీలు.
దోనా పాలా: ఇది ఒక ప్రదేశం పేరు. గోవా ప్రయాణంలో వ్రాసిన కవితలు.
రక్షరేఖ: బాబ్రి మసీదు కూలగొట్టిన తరువాత బొంబాయిలో (ముంబాయి) మతకలహాలు చెలరేగాయి. ఇలాంటి మతకలహాలు పాకిస్తాను విడిపోయినప్పుడు కూడా జరగలేదు. వాటికి స్పందిస్తూ వ్రాసినటువంటి దీర్ఘ కవితా సంపుటి.
హృదయంలో హిరోషిమా: 1997 లో హీరోషిమా ఉదంతాన్ని స్మరించుకొంటూ వ్రాసిన కవితలు.
ధూప ఛ్చాయ: నక్సలైట్లు రైలుపెట్టిని కాల్చివేస్తే దాన్ని నేపధ్యంగా తీసుకొని వ్రాసిన దీర్ఘకావ్యం.
జీవన లిపి : 120 పేజీల సంపూర్ణ కావ్యం. మానవుడు విప్లవానికై జరిపేకృషి అనే అంశంపై వ్రాసిన దీర్ఘకావ్యం.
సీకింగ్ మై బ్రోకెన్ వింగ్ :దేశంలో అతివాద పార్టీలన్ని (left wing) విడిపోతున్నాయి. దాన్ని సింబలైజ్ చేస్తూ వ్రాసిన అన్వేషాత్మకమైన దీర్ఘ కవిత.
సోమసుందర్ కధలు : 1984 లో ప్రచురింపబడిన శ్రీ సోమసుందర్ గారి బానిసల దేశం వగైరా కధలు.
బుద్దదేవ్ బోస్: శ్రీ బుద్దదేవ్ బోస్ అనే ఆయన ప్రముఖ బెంగాలీ కవి. వీరి మోనోగ్రాఫ్ మరియు కొన్ని కవితల యొక్క అనువాదాలతో కూడిన రచన.
లియోనార్డో డావిన్సీ: డావిన్సీజీవిత చరిత్ర. ఆయనను ఒక సంపూర్ణ మానవునిగా దర్శింపచేసే పుస్తకం.
హంసధ్వని: భారతీయ ఆధునిక సంగీతకారుల జీవితచిత్రణలు. (బిస్మిల్ల, బడేముల్లా తదితరులు).
కాజీ నజ్రుల్ ఇస్లాం: శ్రీ ఖాజీ, బెంగాలీ విప్లవకవి. వీరి కవిత్వాన్ని, జీవితాన్ని పుస్తకంద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.
కాళిదాసు రామకధ: రచనా కాలం 1990 లు. రఘువంశంలో కాళిదాసు చెప్పిన రామకధకు, వాల్మీకి రామకధకు గల సునిశితమైన వ్యత్యాసాలను తెలుపుతూ వ్రాసిన విశ్లేషాత్మక పుస్తకం.
రుధిరజ్యోతిర్ధర్శనం: శ్రీరంగం నారాయణ బాబు కవిత్వం లోతు పాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూపించిన గొప్ప విమర్శనాత్మక గ్రంధం. నారాయణ బాబు గొప్ప కవేమీ కాదు అని వ్యాఖ్యానించిన శ్రీ శ్రీ తో విభేదించి , శ్రీ సోమసుందర్ నారాయణ బాబు వ్రాసిన రుధిర జ్యోతి కావ్య సౌందర్యాన్ని పుస్తకంద్వారా తెలుగు ప్రజలకు పరిచయం చేసారు. కారణం చేతనే శ్రీ శ్రీ కి సోమసుందర్ గారికి అభిప్రాయ బేధాలు పొడచూపాయి.
జాతికి జ్ఞాన నేత్రం: శ్రీకొడవటిగంటి కుటుంబరావు రచనలపై చేసిన విశ్లేషణాత్మకమైన గ్రంధం.
కవిత్వం కాలాతీత కాంతిరేఖ: ఆధునిక కవిత్వానికి ఉండవలసిన లక్షణాలపై సూత్రీకరణ చేస్తూ వ్రాసిన విశ్లేషణాత్మకమైన 200 పేజీల గ్రంధం.
ఆధునిక కావ్య ప్రకాళిక: ఇతరుల పుస్తకాలకు వ్రాసిన పీఠికలలో కొన్నింటిని ఏర్చి కూర్చి చేసిన సంకలనం.
అమృత వర్షిణి: తిలక్ కవిత్వంపై వ్రాసిన విమర్శనాత్మక వ్యాసావళి.
సాహిత్యంలో సంశయ కల్లోలం: విరసం ఆవిర్భవించిన కొత్తలో విజయనగరం నుంచి చిత్తూరుదాకా ప్రయాణించి సభలు జరిపి, సభల్లో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు ఇచ్చిన సమాధానాల సంకలనం. ప్రదేశాలలో వారి సందేహాలను చిన్న చిన్న స్లిప్పులపై తీసుకొని, వాటికి సమాధానాలను పత్రికా ముఖంగా ఇచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించి పుస్తకంగా ప్రచురించారు.
అక్షర సుమార్చన: తిక్కన, వేమన ఇత్యాదులపై వ్రాసిన వ్యాసావళి. శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య గారికి అంకితమీయబడినది.
పురిపండా ఎత్తిన పులి పంజా: పురిపండా అప్పలస్వామి వారిపై వ్రాసిన వ్యాస సంపుటి.
నూరు శరత్తులు : 1990 లకి నూరేళ్ళు నిండిన (కృ.శా., విశ్వనాధ మొ.)వారిపై వ్రాసిన వ్రాసావళి.
తరం కవితా తరంగాలు: భావకవుల తరువాత వచ్చిన పఠాభి, పాలగుమ్మి పద్మరాజు, వంటి వారిపై వ్రాసిన వ్యాసావళి.
నారాయణ చక్రం: డా: సి. నారాయణ రెడ్డి కవిత్వంపై విశ్లేణాత్మకంగా వ్రాసిన గ్రంధం.
గోపుర దీపాలు : చలం పురూరవ పై వ్రాసిన పుస్తకం.
కృష్ణశాస్త్రి కవితాత్మ: కృష్ణశాస్త్రి కవిత్వంపై సమగ్ర విమర్శ.
గురజాడ గురుత్వాకర్షణ: గురజాడ పై వ్రాసిన పుస్తకం. పూర్రిచర్డ్ అనే మాటపై పరిశోధన ఉంటుంది.
శరచ్చంద్రిక : శ్రీ శ్రీ నుంచి కుందుర్తి వరకూ ఆధునిక కవులపై వ్రాసిన పరిశీలనాత్మక వ్యాసావళి.
ఉర్దూసాహిత్యంలో ఉన్నత శిఖరాలు: కబీర్ నుంచి ఖైఫీ అహ్మద్ దాకా ఉండిన గొప్ప గొప్ప కవులను గురించి పరిచయంచేస్తూ వ్రాసిన పుస్తకం.
శేషేంద్ర జాలం: శేషేంద్ర కవిత్వంపై వ్రాసిన వ్యాసావళి.
అగ్నివీణ ఆలాపించిన అణుసంగీతం: అనిసెట్టి సుబ్బారావు కవిత్వం పై వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.
కవితా కల్పవల్లి: ఆధునిక కవిత్వం-విమర్శనాత్మక విశ్లేషణ.
ఆగామి శతాబ్ధానికి ఆహ్వానం: వ్యాసాలు.
చరమ దశాబ్ది-కవితా రసాబ్ధి: 90 లలో కవిత్వంపై వచ్చిన వ్యాసావళి.
అక్షర నాదం: 2004 లో వెలువరించిన కవితా సంపుటి.
ఆమ్రపర్ణి: కావ్యం
జీవన లిపి: సంపూర్ణ కావ్యం
చిన్మయ లహరి: స్వీయ కవితా సంపుటి.
మనస్సంగీతం: పాటల సంపుటి.
విషవలయం: నాటకం. 1980 లలో అనేక పరిషత్తులలో బహుమతులు సాధించిన గొప్ప నాటకం
సోమసుందర్ లేఖలు: సినీనటుడు రమణారెడ్డికి శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన లేఖలను నెల్లూరులోని వీరి అభిమానులు పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.
నగరం నుంచి గగనం దాకా మనిషి: వివిధ పత్రికలలో చుట్టు-చూపు అనే పేరుతో వచ్చిన వ్యాసాలన్నింటిని సంగ్రహపరచి ప్రచురించిన పుస్తకం. సుమారు 250 పేజీలు.
మంది-మనిషి: వ్యాస సంపుటి .


శ్రీ సోమసుందర్ గారి వద్ద ప్రస్తుతం ఇంకా 10 పుస్తకాలవరకూ అముద్రితంగా ఉన్నాయి. త్వరలో వెలువరించాలన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.


బొల్లోజు బాబా