Monday, January 30, 2017

పూడిక

పెద్ద యంత్రం తొండంతో చెరువు పూడిక తీస్తోంది గతాన్ని పొరలు పొరలుగా తొలగించి పారేస్తోంది. రేపో మాపో చెరువులోకి కొత్తనీరు ఎక్కుతుంది సృష్టి అపూర్వ రాగాన్ని ఎత్తుకొంటుంది కొత్తచేపలు కిలకలు వేస్తాయి తామర దుంపలు కొత్త మోసులెత్తుతాయి కెరటాలు నురగలై తిరగబడతాయి గుండె నిండా అస్కలిత వీర్యాలు, అవాంఛిత స్వప్నాలు చెరగని మరకలు, విరిగిన వాక్యాలు ఘనీభవించిన కన్నీరు. గుండె పూడిక ఎవరైనా తీస్తే బాగుణ్ణు! బొల్లోజు బాబా

చక్కగా ప్రేమించుకోక.....


పాపాయిని ఎత్తుకొన్నాను
నేను నచ్చలేదేమో
దూదిలాంటి మెత్తని చేతుల్తో
నా మొఖాన్ని తోసేస్తుంది
పలుచని గోళ్ళతో నా బుగ్గల్ని గిల్లుతోంది
కాళ్లతో తన్నుతోంది
వాళ్ళమ్మకు ఇచ్చేసాను
తను ఎత్తుకొన్నాక
సొట్టబుగ్గలతో బోసినోటితో
నన్ను చూస్తూ నవ్వుతోంది పాపాయి.
ఒక్కసారిగా అనిపించింది
తిరస్కరించిన తరువాత
ద్వేషించక్కర లేదని
చక్కగా ప్రేమించుకోవచ్చనీ!
బొల్లోజు బాబా

Wednesday, January 25, 2017

మా నాన్నా - నేనూ


మా అక్కని ఒంటరిగా ఎప్పుడూ
బయటకు పంపేవాడు కాదు మా నాన్న
ఇప్పుడు నేనూ అంతే
మా అమ్మాయి బయటకు వెళతానంటే
తమ్ముణ్ణి తోడుగా తీసుకెళ్లమంటున్నాను.
కరువు కాలంలో పావలా తగ్గుతుందని
మూడు కిలోమీటర్లు సైకిలు తొక్కుకొని
పెద్దమార్కెట్లో సంత చేసేవాడు మా నాన్న
ఇపుడు నేనూ అంతే
ఏడాదికోసారి ఉల్లిపాయల క్యూలో
గంటలతరబడి నిలుచుంటున్నాను
సమాజం పట్ల ఆవేశం కలిగినపుడు
హిందూ పత్రికకు ఓ ఉత్తరం వ్రాసి పారేసి
ప్రపంచం మారిపోతుంది అని కలలు కనేవాడు
ఇప్పుడు నేనూ అంతే
ఆవేశాన్ని అక్షరాలలోకి ఒంపుకొంటాను
ఇంకేం చేయాలో తెలియక.
పాతబస్తీ అల్లర్లని రేడియోలో విన్నప్పుడు
పార్టిషన్ నాటి ఘర్షణల రక్తగాయాల్ని
కథలు కథలు గా వినిపించేవాడు మా నాన్న.
ఇప్పుడు నేనూ అంతే
టివిలో నేటి మారణహోమాల్ని చూసినపుడు
క్రుసేడ్లనుంచి సద్దాం వరకూ చరిత్రను ఏకరువుపెట్టి
బటర్ ఫ్లై సిద్దాంతాన్ని ఎగరేస్తాను నిస్సిగ్గుగా
మా ఇద్దరి జీవితాల మధ్యా
నాలుగు దశాబ్దాల దూరం పరుచుకొని ఉంది
మేమిద్దరం రకరకాల పాలకుల్ని మార్చాం కూడా
బొల్లోజు బాబా

Sunday, January 22, 2017

MindYou said
I do not have consistency
Isnt it?

See how
the sunlight coming through
the window is broken into pieces
as lattice.

Who am I after all?

Bolloju Baba

Friday, January 20, 2017

చిత్తం


స్థిరత్వం
లేదన్నావు కదూ!
కిటికీలోంచి వచ్చిన
సూర్యకాంతే
ఊసలు ఊసలుగా
ముక్కలయింది
ఇక నేనెంత?

బొల్లోజు బాబా

Thursday, January 19, 2017

సిస్టర్ అనామిక


అతని
రెండు రెక్కల్లో చేతులు ఉంచి
టాయిలెట్ సీట్ నుంచి లేపి
పళ్ళుతోమి స్నానం చేయించి
ఒళ్ళుతుడిచి బట్టలు తొడిగి
జాగ్రత్తగా నడిపించి
మంచంపై పడుకోబెట్టి
“మీ అబ్బాయి రమ్మంటున్నాడని అన్నారుగా
వెళ్ళొచ్చు కదా?” అందామె
మాత్రలు వెతుకుతో
నీటిపొర నిండిన కళ్ళతో
సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడతను
ఫోన్ కూడా చేయటం మానుకొన్న
బబ్లూ గాడిని గుర్తుచేసినందుకు.
బొల్లోజు బాబా
(ఈ కవిత సారంగ పత్రికలో మొదటగా ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

Monday, January 9, 2017

నిశ్శబ్ద ప్రపంచం ----- The Quiet World by Jeffrey McDanielఒకరికళ్లలోకి మరొకరు  మరింత ఎక్కువసేపు
చూసుకొంటూ ఉండటానికి
ఇంకా మూగవాళ్లను సంతృప్తి పరచటానికి
ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ  రోజుకి  సరిగ్గా
నూట అరవై ఏడు పదాలను మాత్రమే
కేటాయించాలని నిర్ణయం తీసుకొంది.

ఫోన్ మ్రోగినప్పుడు ఎత్తి హలో చెప్పకుండా
చెవిదగ్గరపెట్టుకొంటాను
రెస్టారెంటులో చికెన్ సూపు ను వేలుతో చూపిస్తాను.
ఈ కొత్త విధానానికి కొద్దికొద్దిగా అలవాటు పడుతున్నాను.

బాగా రాత్రయ్యాకా నా సుదూర ప్రేయసికి ఫోన్ చేసి
"నేనీ రోజు యాభై తొమ్మిది పదాలు మాత్రమే వాడాను
మిగిలినవి నీ కొరకు దాచి ఉంచాను" అంటాను.
ఆమె స్పందించకపోతే
తన పదాలన్నీ ఖర్చయిపోయాయని అర్ధమౌతుంది
నెమ్మదిగా లోస్వరంతో "I Love You" అంటాను
ముప్పై రెండో సారి.
తరువాత అలా కూర్చొని ఒకరి శ్వాసను మరొకరు
అలా వింటూ ఉండిపోతాం.

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Sunday, January 8, 2017

యానాం కవులు


సాహిత్యపరంగా ఘనతవహించిన ఇంజరం, పిఠాపురం, రాజమండ్రి, కోనసీమ వంటి ప్రాంతాలనడుమ ఉన్న యానాం సహజంగానే ఆ వాసనలను పుణికిపుచ్చుకొంది. తెలుగు సాహిత్యానికి వన్నెతెచ్చిన సాహితీవేత్తలలో శ్రీ చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి ప్రముఖమైనవారు. వీరు పదేండ్ల వయసులో విద్యాభ్యాసనిమిత్తమై ఫ్రెంచి యానాం వచ్చారు. 18 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు యానాం వెంకటేశ్వర స్వామిపై వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాలున్నాయని స్థానిక పండితులు విమర్శించటంతో, పౌరుషం వచ్చి వారణాసి వెళ్ళి సంస్కృత వ్యాకరణాన్ని నేర్చుకొని వచ్చారట. తరువాత వీరు కాకినాడకు మకాం వెళిపోయారు. యానాంలో పని చేసిన ఫ్రెంచి దేశస్థులలో సొన్నరెట్ మినహా ఎవరూ రచనా వ్యాసంగాన్ని నెరపినట్లు తెలియరాదు.
1908 లో జన్మించిన శ్రీ గెల్లా శ్రీనివాసరావు మంచి కవి. తను వ్రాసిన కవితలను శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రికి చూపినపుడు ఆయన వాటిని ఎంతగానో మెచ్చుకొని ప్రశంసించేవారట. 1932 లో జన్మించిన శ్రీ బొల్లోజు బసవలింగం చిన్నవయసులోనే వ్రాసిన “రాణి దుర్గావతి” అనే పద్యకావ్యం పలువురి పండితుల ప్రశంసలు పొందింది. తదుపరి వీరు అనేక నాటకాలు వ్రాసారు.
శ్రీమతి పంతగడ శేషమ్మ గారు యాభైసంవత్సరాల క్రితమే టాగోర్ గీతాంజలి, ఫ్రూట్ గేదరింగ్ పుస్తకాలను తెలుగులోకి అనువదించిన గొప్ప ప్రతిభావంతురాలు. వీరి భర్త శ్రీ పంతగడ బాలకృష్ణ రాసిన సాహిత్యవ్యాసాలు భారతి పత్రికలో వచ్చేవి.
ఫ్రెంచి యానాంలో పండితులకు, విధ్వాంసులకు కొదవలేదు. ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రి, సమతం కృష్ణయ్య, మహేంద్రవాడ వీర గణపతి శాస్త్రి, వంటెద్దు సుబ్బారాయుడు, శ్రీమతి కందర్ప వెంకట నరసమ్మ వంటి వారు గొప్ప పాండిత్యప్రకర్షను ప్రదర్శించేవారు. శ్రీ టి. శ్రీరామ చంద్రకీర్తి గారు “వెంకటేశ్వర శతకం” వ్రాసారు. యానానికి సమీపాన కల కరప గ్రామానికి చెందిన కోట్ర శ్యామల కామశాస్త్రి కూర్చిన “ఆంధ్ర వాచస్పత్యం” అనే బృహత్ నిఘంటువు నిర్మాణం ఆర్ధిక కారణాలవల్ల మధ్యలో ఆగిపోయినపుడు 1940 లలో యానాం ప్రజలు భూరి విరాళాలు ఇచ్చి ముందుకు నడిపించి తమ సాహిత్యాభిలాషను చాటుకొన్నారు.
ఇక ఆధునిక తెలుగు సాహిత్యరంగానికి యానాం కవులు అందించిన తోడ్పాటు తక్కువేమీ కాదు. శిఖామణి, దాట్ల దేవదానం రాజు, కె. విజయ లక్ష్మి, పి.ఎల్. ఆర్. స్వామి, చెల్లి రాం, బొల్లోజు బాబా, ముమ్మిడి నాగవరప్రసాద్, పొనుగుమట్ల అశోక్ కుమార్ లాంటి యానాం కవులు చేస్తున్న కృషి తెలుగు కవిత్వచరిత్రలో కొన్ని పుటలను సొంతం చేసుకొన్నదనటంలో అతిశయోక్తి లేదు.
శ్రీ శిఖామణి ( Sikhamani Sanjeeva Rao )
సమకాలీన తెలుగుకవులలో శిఖామణి మేరుసమానుడు. వీరి మొదటి కవితా సంపుటి “మువ్వల చేతికర్ర” 1987 లో వెలువడింది. ఇది తెలుగుసాహితీలోకంలో అప్పట్లో ఒక సంచలనం. అప్పటివరకూ వచ్చిన అనుభూతి కవిత్వాన్ని శిఖామణి కవిత్వం భూమార్గం పట్టించింది. సామాజిక వాస్తవికతను, వైయక్తిక అనుభూతుల నేపథ్యంలో కరుణ రసార్థ్రంగా ఆవిష్కరించటం శిఖామణీ కవిత్వ విశిష్టత. ఉపమను ఇంత అందంగా, లోతుగా, విస్త్రుతంగా వాడుకొన్న మరొక ఆధునిక కవి కనిపించరు. శిఖామణి ఇంతవరకు చిలక్కొయ్య, కిర్రుచెప్పుల భాష, నల్లగేటు నందివర్ధనం చెట్టు, తవ్వకం, గిజిగాడు, పొద్దున్నే కవిగొంతు మొదలైన ఎనిమిది కవిత్వసంపుటులు వెలువరించారు.
దళిత సాహిత్యతత్వం, వివిధ, సమాంతర, తెలుగు-మరాఠీ దళితకవిత్వం, వాగర్థ, అభిజ్ఞ, స్మరణిక వంటి అనేక సాహిత్యవిమర్శనా గ్రంథాలను రచించారు. శిఖామణి కవిత్వాన్ని “ బ్లాక్ రైన్ బో”, “సెలెక్టెడ్ పొయెమ్స్” పేరుతో వేగుంట మోహన ప్రసాద్ ఇంగ్లీషులోకి అనువదించారు. ఎంపిక చేసిన కవితలను హిందీలోకి “ఘంఘ్రూవాలి ఛడీ” పేరుతో డా.ఎం. రంగయ్యగారు, మళయాళంలోకి ఎల్.ఆర్. స్వామి గారు, కన్నడంలోకి వీరభద్రగౌడ గారు భాషాంతరీకరణ చేసారు. దళిత కవిగా స్పందించాల్సిన సందర్భాలలో స్పందిస్తూనే, విశ్వమానవ కవిగా శిఖామణి తన కవిత్వం, విమర్శ, పీఠికలు, ఉపన్యాసాల ద్వారా తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తున్నారు.
వీరు ఆంధ్రదేశంలో దాదాపు అన్ని సంస్థలనుండి పురస్కారాలను, సత్కారాలను పొందారు. వీటిలో -ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు, ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సాహితీపురస్కారం, ఆంధ్రప్రదేష్ ప్రభుత్వ జాషువా పురస్కారం ప్రముఖమైనవి. ప్రస్తుతం యానాం కేంద్రంగా స్వీయసంపాదకత్వంలో “కవి సంధ్య” ద్వైమాసిక కవిత్వ పత్రికను నడుపుతున్నారు.
శ్రీ దాట్ల దేవదానం రాజు ( Datla Devadanam Raju )
1997 లో “వానరాని కాలం” తో కవిగా సాహితీలోకంలో ప్రవేశించి 2002 లో “దాట్ల దేవదానం రాజు కథలు” పేరుతొ కథల సంపుటి తీసుకొచ్చి తన కలానికి రెండువైపులా పదును అని నిరూపించుకొన్న యానాం కవి శ్రీ దాట్ల దేవదానం రాజు. ఇటు కవిత్వాన్ని అటు కథలను చక్కని శైలితో, లోతైన ఆలోచనలతో వెలువరిస్తూ నేడు ఆంధ్రదేశం గర్వించదగిన స్థాయికి చేరి తన యశస్సుతో యానానికి వన్నెతెచ్చిన నిత్య సాహిత్య కృషీవలుడు, యానాం సందర్శించే సాహితీ ప్రియులపాలిట చలివేంద్రం శ్రీ రాజు గారు.
నిర్మలమైన భావధార, చిక్కని అనుభూతి, ఇజాలతో సంబంధం లేని జీవన స్పర్శలు, తేటగా కనిపిస్తూనే లోతుగా తాకే వాక్యాలు రాజుగారి కవిత్వ లక్షణాలు. యానాం సామాజిక, చారిత్రిక నేపథ్యంతో వ్రాసిన “యానాం కథలు”, “కల్యాణపురం” కథాసంపుటుల ద్వారా రాజు గారు తెలుగుసాహిత్యంలో యానానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టారు.
గుండెతెరచాప, మట్టికాళ్ళు, ముద్రబల్ల, లోపలిదీపం, నదిచుట్టూ నేను, నాలుగోపాదం, పాఠం పూర్తయ్యాక, దోసిలిలో నది వీరి ఇతర కవితాసంపుటాలు. నాలుగోపాదం తమిళ్, కన్నడం, మళయాలం, ఫ్రెంచి భాషలలోకి అనువాదింపబడి మంచి పేరుతెచ్చుకొంది. పుదుచ్చేరి ప్రభుత్వం నుండి కళైమామణి, తెలుగురత్న పురస్కారాల్ని అందుకొన్నారు. దాదేరా పేరుతో సాహిత్య పురస్కారాలను ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఒక ఉత్తమ కవికి, కథకునికి పురస్కారాలు అందిస్తున్నారు.
శ్రీమతి కె. విజయలక్ష్మి ( Vijaya Lakshmi )
చక్కని కవిత్వం, మేలైన అనువాదాలతో శ్రీమతి కె. విజయలక్ష్మి గారు తెలుగు సాహిత్యాన్ని పరిమళింపచేస్తున్నారు. వీరు 2005 లో “కదిలేమేఘం” పేరుతో కవితాసంపుటి తీసుకొచ్చారు. ప్రముఖ తమిళకవి అమృత గణేషన్ పుస్తకాన్ని “ఊయలలో సూర్యుడు” గా తెలుగులోకి అనువదించారు. విజయలక్ష్మిగారి కవిత్వంలో సందేశాత్మక సామాజిక ప్రయోజనం అంతర్లీనంగా కనిపిస్తుంది.
బలహీనవర్గాలపట్ల సహానుభూతి, సమాజపోకడలపై తనదైన వ్యాఖ్యానం, లోతైన వివేచనతో కూడిన హృదయసంస్కారం వీరికవిత్వ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. స్త్రీవాదదృక్పథంతో ప్రత్యేకించి కవితలు వ్రాయకపోయినా వీరికవిత్వంలో స్త్రీవాదం స్వాభావికంగా పలుకుతుంది. వృత్తిపరంగా తెలుగు అధ్యాపకురాలు కావటంతో వీరి కవిత్వం చక్కని పదచిత్రాలు, ఉపమానాలు, భాషాగరిమ, భావపటిమలతో ఉంటూ అలరిస్తుంది.
శ్రీ పి. ఎల్. ఆర్ . స్వామి ( Prl Swamy )
పి.ఆర్.ఎల్ స్వామి గారు 2005 లో “పొత్తిళ్ళలోంచి” తొలి కవితాసంపుటి వెలువరించారు. తరువాత “కాయితం పడవ” పేరుతో హైకూల సంపుటి తీసుకొచ్చారు. “గుమ్మం తెర” “స్వామినీలు” అనే రెండు పుస్తకాలు ప్రస్తుతం ప్రింటులో ఉన్నాయి.
ఎటువంటి సిద్దాంతపోకడలకూ పోకుండా తనదైన శైలిలో సామాజికాంశాలను భావవ్యక్తీకరణ చేయటం స్వామి గారి కవిత్వరీతి.
పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి కళైమామణి, తెలుగురత్న పురస్కారాల్ని పొందారు. వచన కవితాధారణ శ్రీ స్వామి గారి ప్రత్యేకత. వివిధ కవుల వందలాది కవితలను ధారణ చేసి భావయుక్తంగా ఆశువుగా చదువుతూ, శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తారు. ఓలేటి పార్వతీశం గారి ప్రోత్సాహంతో దూరదర్శన్ లో కూడా చాలాసార్లు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ రంగంలో వీరు చూపించిన ప్రతిభకు గుర్తింపుగా “వచన కవితధారణా చక్రవర్తి” అన్న బిరుదును పొందారు.
ఇతరుల కవితలను ధారణావధానాలు చేస్తూ, కలకాలం నిలిచిపోయే చక్కని మృధువైన కవిత్వం వ్రాస్తూ స్వామి గారు తన అసమాన ప్రతిభ తో తెలుగు సాహితీలోకంలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు.
చెల్లి రామ్ ( Ram Poet )
సి.హెచ్. రాం “కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం” పేరుతో కవితా సంకలనం తీసుకు వచ్చారు. పదునైన అభివ్యక్తి, నిశితమైన పరిశీలన, వాక్యవాక్యానా కనిపించే దళిత దృక్పధం రాం కవిత్వానికి చక్కని గుర్తింపు తెచ్చాయి. అంబేద్కరిజాన్ని కవిత్వంలో ప్రతిభావంతంగా ప్రకటించే తెలుగు కవిత్వాన్ని ఎంచవలసి వచ్చినప్పుడు రాం కవిత్వాన్ని ఎవరూ విస్మరించలేరు.
అనాది గాయాల సలపరింతలను పిక్కటిల్లే గొంతుకతో రామ్ కవిత్వం ఎలుగెత్తినా అంతర్లీనంగా కరుణనిండిన తడేదో గుండెను తడుముతూంటుంది. ఆ విలక్షణతే- ఒక్క పుస్తకం మాత్రమే తీసుకొచ్చినా రామ్ కవిత్వానికి తెలుగు సాహిత్యంలో అజరామరమైన స్థానాన్ని కల్పించింది. రామ్ తన కవిత్వ గానాన్ని మరిన్ని సంపుటాలుగా విస్తరింపచేస్తాడని ఆశిద్దాం.
బొల్లోజు బాబా ( Bolloju Baba )
2009 లో “ఆకుపచ్చని తడిగీతం” గా తెలుగు సాహితీలోకంలోకి ప్రవేశించాడు బొల్లోజు బాబా. శిఖామణి సాంగత్య ప్రభావం తనపై ఉందనే బొల్లోజు బాబా- 2016 లో “వెలుతురు తెర” పేరుతో స్వీయ కవితా సంపుటి, టాగోర్ స్ట్రే బర్డ్స్ ను అనువదించి “స్వేచ్ఛా విహంగాలు” గా తీసుకు వచ్చాడు. వివిధ ప్రపంచ కవుల కవితానువాదాలు, కవిత్వ పరిచయాలు, విమర్శనా వ్యాసాలతో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొంటున్నాడు.
ముమ్మిడి చిన్నారి ( Chinnari Mummidi )
ముమ్మిడి చిన్నారి మంచి భావనా పటిమ కలిగిన కవి. అతని కవిత్వంలో అభివ్యక్తి సూటిగా, శైలి సరళంగా, పదచిత్రాలు నూతనంగా ఉంటాయి. స్వతహాగా ప్రముఖ చిత్రకారుడు కావటంతో ఇతని కవిత్వంలో భావచిత్రాలు అందంగా కొత్త వర్ణణల వర్ణాలతో అలరిస్తాయి. కవితకు అనూహ్యమైన ముగింపు నివ్వటం చిన్నారి కవిత్వలక్షణం.
 ఇతని డైరీలలో కొన్ని వందల హైకూలు ఉన్నాయి. పేరుగాంచిన ప్రముఖ హైకూ కవుల హైకూలకు ఏమాత్రమూ తీసిపోవవి. ఓ రెండు కవిత్వ సంపుటులకు సరిపడా చక్కని కవితలున్నాయి.
పొగ త్రాగటానికి వ్యతిరేకంగా వ్రాసిన అద్బుతమైన హైకూ శతకం ఇతని డైరీలో నిద్రిస్తుంది. ఒక్కో హైకూ నొ స్మోకింగ్ బోర్డుకు చక్కని ప్రత్యామ్నాయంగా వాడుకోదగ్గవి. త్వరలో చక్కని సంపుటితో తన కవిత్వాన్ని తీసుకువస్తాడని భావిద్దాం.
శ్రీ పొనుగుమట్ల అశోక్ కుమార్ ( Ashok Kumar Ponugumatla )
అశోక్ కవిత్వంలో సామాజిక స్పృహ సహజధారలా ప్రవహిస్తుంది. లోకంలో కనిపించే అన్యాయాలు, రాజకీయ వికృత క్రీడలపై అశోక్ కుమార్ కలం నిప్పుల వర్షం కురిపిస్తుంది. లోతైన భావనలను గొప్ప వొడుపుతో అక్షరాలలోకి వొంపి అందిస్తాడు. అశోక్ కవిత్వం ఆవేశపరుస్తుంది, ఆలోచింపచేస్తుంది ఒక సామాజిక మార్పుకు ప్రేరణగా నిలుస్తుంది. సామాజిక అనుభవాన్ని కవిత్వం చేయటంలో అశోక్ గొప్ప పరిణితి సాధించాడు. జిల్లాలో జరిగే పలువేదికలలో తన గళాన్ని, దృక్పధాన్ని బలంగా వినిపించే యానాం కవి శ్రీ అశోక్ కుమార్.

శ్రీ ఆకెళ్ల రవిప్రకాష్ ( Ravi Prakash )
తొంభైలలో ప్రముఖ కవి శ్రీ ఆకెళ్ల రవిప్రకాష్ గారు యానం పరిపాలనాధికారిగా సేవలందించారు. అంతవరకూ స్తబ్దుగా ఉన్న యానాం సాహిత్యవాతావరణాన్ని కాంతివంతం చేసారు. వీరి కృషి కారణంగానే యానాంలో ప్రభుత్వంతరపున ఉగాది ఉత్సవాలు నిర్వహించటం ప్రారంభమైంది. అప్పటిదాకా వేరు వేరు దిక్కులలో ఉన్న యానాం కవులు ఒక వేదికపై కలుసుకొని తమ భావాలను పంచుకోవటం మొదలైంది.
శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్ అప్పట్లో ఇస్మాయిల్, స్మైల్, త్రిపుర, సదాశివరావు వంటి అనేకమంది ప్రముఖ సాహితీవేత్తలను యానానికి ఆహ్వానించి రోజులు, వారాల తరబడి రాచమర్యాదలతో చూసుకొనేవారు. అనేక సాహితీ చర్చలు జరిగేవి. వీటిలో శ్రీ దాట్ల దేవదానం రాజు ఇంకా ఇతర స్థానిక కవులు కూడా పాలుపంచు కొనేవారు. ఆ రకంగా యానానికి సంబంధించి ఆకెళ్ళ రవిప్రకాష్ - కవి, కవిపోషకుడు అయిన కృష్ణదేవరాయల వంటివారు.
యానాంలో పనిచేసిన కాలంలో రవిప్రకాష్ "ఇసకగుడి" కవిత్వ సంపుటిని వెలువరించారు. వీరి కవిత్వం లో అస్పష్టఛాయలు ఉండవు, స్వేచ్ఛగా, పదచిత్రాల సౌందర్యంతో సాంద్రంగా ఉంటుంది. శ్రీ రవిప్రకాష్ ఇంతవరకూ ఓ కొత్త మొహంజొదారో, ఇసకగుడి, ప్రేమప్రతిపాదన వంటి కవితాసంపుటులను వెలువరించారు. జన్మతః యానాం కవి కాకపోయినా శ్రీ రవిప్రకాష్ గారు చేసిన సేవను యానాం సాహితీసమాజం ఎన్నటికీ మరచిపోలేదు.
శ్రీ Madhunapantula Satyanarayanamurthy , కొండూరి రామరాజు, నృశింహదేవ శ్రీనివాస శర్మ, Mohibullah Khan, ఐ ఎస్ గిరి తదితర ప్రభృతులు యానాంలో జరిగే సాహితీకార్యక్రమాలలో పాల్గొంటూ ఆయా సభలను దిగ్విజయం చేస్తున్నారు.
శ్రీ పొనుగుమట్ల విష్ణుమూర్తిగారు “జనమిత్ర” పత్రిక సంపాదకుడిగా, రచయితగా, అనువాదకునిగా తెలుగుసాహిత్యానికి తమవైన సేవలు అందిస్తున్నారు. ఎనభైలలో కీ.శే. చింతకాయల బాలకృష్ణ “ఈ వేళ” పేరుతో ఒక పత్రిక నడిపారు. (ఈ వ్యాసకర్త మొదటి రచన అందులొనే ప్రచురింపబడింది).
కీ.శే. చెల్లి కృష్ణమూర్తి గారి మనవడు Surendra Dev Chelli ఇప్పుడిప్పుడే చక్కని కవిగా పేరుతెచ్చుకొంటున్నాడు. యానాం నుంచి యువకవులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం శ్రీ శిఖామణి, శ్రీ దాట్ల దేవదానం రాజు చేస్తున్న సాహిత్యకృషి, యానాంలో వీరు జరుపుతున్న జాతీయస్థాయి సభలు నేటి యువతరానికి ప్రేరణగా నిలిచి మరింతమంది యువకవులు తయారవుతారని ఆశిద్దాం.
Box Item
యానాం చరిత్ర పుస్తకాలు
శ్రీ దాట్ల దేవదానంరాజు విస్త్రుతమైన అధ్యయనం చేసి “యానాం చరిత్ర” పేరుతో యానాం చారిత్రిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను గ్రంధస్థం చేసారు. ఆనాటి అనేక అరుదైన ఛాయాచిత్రాలు వీరీ పుస్తకంలో పొందుపరిచారు.
 బొల్లోజు బాబా “యానాం విమోచనోద్యమం”, “ఫ్రెంచి పాలనలో యానాం” పుస్తకాల ద్వారా యానాం వలసపాలనాచరిత్రను వెలికితీసారు.
 శ్రీమతి కె. విజయలక్ష్మి “ పుదుచ్చేరి ఒక చారిత్రిక విజ్ఞానకరదీపిక” పేరుతో పుదుచ్చేరి, మాహె, కారైకాల్, యానం ల చరిత్రను సంక్షిప్తంగా పుస్తకరూపంలోకి తెచ్చారు. ఈ పుస్తకాలు యానాం చారిత్రిక ప్రాధాన్యతను, విశిష్టతను సమగ్రంగా అధ్యయనం చేయటానికి దోహదపడతాయి.
బొల్లోజు బాబా
(పై వ్యాసం "కవి సంథ్య" ద్వైమాసిక పత్రికలో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

Saturday, January 7, 2017

కులం -- Caste by Lal Singh Dilనన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా?
వేరే కులానికి
చెందినప్పటికి కూడా ప్రేమిస్తున్నావా!

కానీ
మన పెద్దలు
వారి శవాలను కూడా ఒకే చోటులో
కాల్చరన్న విషయం నీకు తెలుసా!

Translated into English by Nirupama Dutt
అనువాదం: బొల్లోజు బాబా

Friday, January 6, 2017

అనేక పనుల మధ్య ---- "Among Many Tasks" by Tadeusz Rosewiczఖాళీ చిక్కని
అనేక పనుల మధ్య
నేను మర్చేపోయాను
చనిపోతూ ఉండటం కూడా
తప్పనిసరి అని.

భలే చిత్రంగా
ఈ బాధ్యతను విస్మరించాను
లేదా పైపైన నిర్వహిస్తున్నాను.

రేపట్నుంచి
అంతా సర్దుకొంటుంది
తెలివిగా, ఆశావహంగా,  శ్రద్ధగా
మరణించటం మొదలుపెడతాను
సమయాన్ని వృధా చేయకుండా.

అనువాదం: బొల్లోజు బాబా

విజయవాడ బుక్ ఫెస్టివల్ లో

Tuesday, January 3, 2017

ఫ్రాగ్మెంట్స్


1.
ఈ అపార్ట్ మెంట్ కిటికీ
ఓ తెరుచుకొన్న గాయం.
బరువైన వక్షోజాలు
బలమైన ఊరువులతో
ప్రపంచం
ఓ ఆటకత్తై ఆకర్షిస్తోంది.


2.
కాకులన్నీ శిబిచక్రవర్తులై
బలిసిన గద్దలకు
బోన్ లెస్ మాంసాన్ని
డోర్ డెలివరీ చేస్తున్నాయి
బ్యాంకు క్యూలలో నించొని మరీ!

3.
Life is like that....

అమ్ముడు పోని గులాబీలు
వాడి, ఎండిపోయాయి
ధరతక్కువ ప్లాస్టిక్ పూలతో
లోకం నిండిపోయింది.

4.
అక్కడో కోపోద్రిక్త సమూహం
రాజుగారి దిష్టిబొమ్మను తగలేస్తూంది.
అనాదిగా నరహంతక రాజ్యానికి
బలయిన అసంఖ్యాక ఆత్మలు
పడీ పడీ నవ్వుకొంటున్నాయి.

5.
ఏది తేలికైనది?
ప్రపంచం అనే భారాన్ని
మోయక్కరలేని స్వప్నమా!
హృదయం అనే ఫంగస్ ను
వదిలించుకొన్న సత్యమా!

బొల్లోజు బాబా