Monday, January 24, 2022

సుజాత - థెరిగాథ .

 సుజాత - థెరిగాథ

.
అన్నిరోజుల్లాగే ఆరోజు కూడా మొదలైంది
చక్కని దుస్తులు ధరించాం, అల్పాహారాలు తిన్నాం
తినుబండారాలు, పానీయాలు మూటగట్టుకొని
బృందావనానికి వ్యాహ్యాళికి బయలుదేరాం
అంజనా వనాన్ని దాటేటపుడు
“ఆరామాన్ని దర్శించటానికి రా” అని ఎవరో
పిలుస్తున్నట్లు వినిపించింది
తలుపు తెరిచాం
అక్కడ ఆయన
నాకెలా తెలిసింది?
ఆ కళ్ళు
మౌనంగా ఎదురుగా కూర్చొన్నాను
బుద్ధభగవానుడు ధమ్మను బోధించారు.
నువ్వే
సిద్ధంగా ఉన్నావా మరి?
అన్నిరోజుల్లాగే ఈ రోజు కూడా మొదలయ్యిందా?
.
సుజాత ఒక సంపన్న వర్గ స్త్రీ. ఆమె తల్లిదండ్రులు ఒక చక్కని ధనవంతుడైన అబ్బాయికిచ్చి పెళ్ళి చేసారు. ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని సాగిస్తున్న సుజాత ఒకనాడు బుద్ధభగవానుని దర్శించి, ఆయన బోధనలు విని సన్యసించాలని నిర్ణయించుకొంటుంది. భర్త, అత్తమామల అనుమతితో మఠవాసినిగా మారింది.
అనువాదం
బొల్లోజు బాబా

. రోహిణి – పరిభ్రమించే నక్షత్రం



నేను ఇంతవరకూ ఎన్నో అనువాదాలు చేసాను. ఇన్నాళ్ళకు ఈ విషయంలో ఒక awe struck moment ఎదురయింది.
థేరీగాథలకు Anagarika Mahendra, Charles Hallisey, C.A.F. Rhys Davids Susan Murcott లు చేసిన ఇంగ్లీషు అనువాదాలనుండి వాటిని ఇప్పటికే పూర్తిగా అనువదించాను. ఆ గాథలకు ఎండ్ నోట్స్ లు రాస్తున్నపుడు The First Free Women (2020) పేరుతో Matty Weingast థెరిగాథలకు చేసిన అనువాదం కంటబడింది. అది చదువుతున్నప్పుడు I was so excited and spellbound.
ఇప్పటివరకూ థెరిగాథలకు నే చూసిన అనువాదాలన్నీ యధాతధానువాదాలు. Susan Murcott అనువాదం మాత్రం కొంత కవితాత్మకంగా ఉంటుంది.
ఇక Matty Weingast చేసిన అనువాదం పూర్తిగా స్వేచ్ఛగా, కవితాత్మకంగా సాగుతుంది. మాతృకలోని ఆత్మనుమాత్రమే తీసుకొని దానిని నిలువెత్తు కవితగా పోతపోసాడు. ఇది చాలా కొత్తగా మూలానికి ఏమాత్రం సంబంధంలేనట్టు కనిపిస్తున్నా, సారంమాత్రం మాతృకదే అనే విషయం పరిశీలించి చూస్తే తప్ప అర్ధంకాదు.
అనువాదం/అనుసృజన ఇంత గొప్పగా చెయ్యొచ్చా అని అనిపించింది.
రోహిణి అనే థెరిగాథకు ఆత్మ ధమ్మపథం విశిష్టతను చెప్పటం. దాన్ని Matty Weingast ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి....
.
రోహిణి – పరిభ్రమించే నక్షత్రం
.
దుస్తులు తొడుక్కునంత మాత్రాన
నువ్వు వస్త్రంగా మారిపోవు
భిక్షాపాత్రను మోసుకుతిరిగినంత మాత్రాన
నీకు నువ్వు శూన్యంగా మారవు
సూర్యుడు నీకు వందనమిడడు
చెట్లు నీ పాదాలముందు పువ్వులు కురిపించవు
పిలిచినంత మాత్రాన పక్షులు కూ అని బదులివ్వవు
పథం నీ పెద్దపెద్ద తప్పులను కూడా భరిస్తుంది
పథం నీ పశ్చాత్తాపాలకు కూడా చోటు ఇస్తుంది
అయినప్పటికీ నువ్వుమాత్రం రాత్రికి రాత్రి
నీ దుస్తుల వస్త్రంగా మారిపోలేవు
అది చాలా నెమ్మదిగా మొదలౌతుంది
చాలాసార్లు నువ్వు గమనించవు కూడా
నీ చర్మంపై వాన చుక్క స్పర్శలా
సొరుగులో కత్తిలా
నీజీవితపు ఆఖరువి కాని తదుపరి
ఐదు క్షణాల్లా- అలా
నువ్వు నీ దుస్తుల వస్త్రంగా మారటం
చాలా నిశ్శబ్దంగా మొదలౌతుంది
పథం అనేది పటంలోని గీత కాదు
అది గొప్పగా ప్రకాశించే ఒక ప్రపంచం
నువ్వు ఎక్కడనుంచైనా దానిలోకి ప్రవేశించవచ్చు
ప్రవేశించాకా
ఒకటి రెండు సార్లు నువ్వు బయటకు నెట్టివేయబడొచ్చు
దాని వెలుపలి పొరల్ని ఛేదించగలిగితే
నా సహచరీ!
అప్పుడు నీకు అందుతుంది
పథం పలికే ఆహ్వానం
అదే పథం యొక్క సారం, స్వభావం
Matty Weingast




Friday, January 21, 2022

భద్ద కుండలకేశ

 భద్ద కుండలకేశ

శిరోముండనం గావించుకొని
దుమ్ముపట్టిన దుస్తులు ధరించి
తప్పులు లేనిచోట తప్పులు ఉన్నాయని
తప్పులు ఉన్నచోట వాటికి అంధురాలినై
సంచరించేదానిని
యాభై ఐదేండ్లపాటు
అంగ, మగధ, వజ్జీ, కాశి, కోశల రాజ్యాల
నలుమూలలా పర్యటించాను
ఆ రాజ్య ప్రజలు ఇచ్చిన భిక్షను తిన్నాను
ఒకనాడు
నిర్మలమైన బుద్ధభగవానుడు శిష్యులతో కలసి వుండగా
గృధ్రకూటపర్వతం వద్ద చూసాను
ఎదురుగా మోకాళ్లపై కూర్చొని
చేతులు జోడించి భక్తితో నమస్కరించాను
“రా భద్దా” అన్నారాయన
ఆ క్షణమే నా దమ్మ దీక్షా స్వీకారం జరిగింది
తధాగతుడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన భద్ధ
అన్ని బంధనాలనుంచి విముక్తమయింది.
***
రాజగృహలో ఒక వడ్డీవ్యాపారస్తుని కుమార్తె భద్ద. ఒకరోజు పురవీధిలో మరణదండన విధించటానికి తీసుకొని వెళుతున్న ఒక దొంగను చూసి మనసుపారేసుకొని, అతనిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పటంతో- భద్ధ తండ్రి తలారులకు భారీగా లంచాలిచ్చి ఆ దొంగను రహస్యంగా విడిపించి ఇంటికి తీసుకొని వచ్చి, స్నానం చెయించి, అలంకరించి, కూతురు ముందు నిలబెట్టాడు. ఆ దొంగ పేరు సత్తుక. ఇంతచేసినప్పటికీ ఇతనిలో ఏ మార్పు రాక, భద్ధ ఒంటిపై ఉన్న నగలను ఎలా దొంగిలించాలా అని ఆలోచించసాగాడు.
మరణ దండన నుండి తప్పించుకొన్నందుకు కొండదేవతకు మొక్కుకున్నానని, అది తీర్చుకొనటానికి అని భద్దను నమ్మించి ఆమెను ఒక పెద్దకొండపైకి తీసుకొనివెళ్ళాడు సత్తుక. అక్కడ ఆమె ఒంటిపై ఉన్న నగలను దొంగిలించి ఆ కొండపైనుండి క్రిందకు త్రోసేసి చంపెయ్యాలని అతని పథకం. అతని పన్నాగాన్ని గ్రహించిన భద్ధ, మిమ్ములను చివరిసారిగా ఒకసారి కౌగిలించుకోవాలని ఉన్నది నా ఆఖరుకోర్కె తీర్చమని అని అడిగి, కౌగిలించుకొని క్షణకాలంలో అతనిని ఆ కొండపైనుంచి త్రోసి చంపివేసింది.
ఇంత జరిగాక భద్ధకు ఇంటికి వెళ్ళటానికి మొఖం చెల్లక, శ్వేతాంబర జైన మతంలో చేరి సంచార సన్యాసిగా జీవనం ప్రారంభించింది. అప్పట్లో జైనమతం తీసుకోవాలంటే తలపై జుత్తును చేతితో పెకలించుకోవాలి. ఆ విధంగా చేయటంవలన కేశాలు చిక్కులు పడటంతో అప్పటినుండి బద్ధకు బద్ధ కుండలకేశ అనే పేరు వచ్చింది. ఈమె జైనబోధనలను మొక్కవోని దీక్షతో సంపూర్ణంగా అధ్యయనం చేసి దేశసంచారానికి బయలుదేరింది.
ఏదైనా ఊరు వెళితే అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఒక నేరేడు కొమ్మను పాతి తనతో ఆథ్యాత్మికంగా వాదించేవారికొరకు ఎదురుచూసేది. ఆ ఊరిలో ఎవరైనా ఈమె తో వాదించాలనుకొంటే ఆ నేరేడు కొమ్మను తొలగించి, ఈమెతో వేదాంత చర్చ చేసేవారు. అలా ఈమె యాభై ఏండ్లపాటు ప్రాచీన ఉత్తరభారతదేశంలోని అనేక పట్టణాలు సంచరించి ఎందరినో తన వాదనాపటిమతో ఓడించి దిగ్విజయయాత్ర జరుపుతూ ఒకనాడు శ్రావస్తి వచ్చింది. అక్కడ బుద్ధుని శిష్యుడైన సరిపుత్త తో వాదనకు దిగింది. వీరిరువుతూ హోరాహోరిగా వేదాంత చర్చ చేసారు.
సరిపుత్త జ్ఞానసంపత్తిని గ్రహించిన భద్ధకుండలకేశ అతనిని గురువుగా ఉండమని కోరింది. సరిపుత్త బుద్ధునివద్దకు వెళ్ళమని చెప్పటంతో, భద్ధకుండలకేశ గృద్ధకూటపర్వతంపై ఉన్న బుద్ధభగవానుని చేరి నమస్కరించగానే, ఆయన “రా భద్ధా” అన్నాడట. ఆ మాటే భద్ధ కు బుద్ధుడు నేరుగా ఇచ్చిన దీక్షగా పరిగణిస్తారు.
అనువాదం
బొల్లోజు బాబా












Monday, January 3, 2022

విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకాలు స్టాల్ నంబర్ 25 26 27 లలో లభిస్తున్నాయి

 విజయవాడ పుస్తక ప్రదర్శనలో

ఈ పుస్తకాలు
స్టాల్ నంబర్ 25 26 27 లలో లభిస్తున్నాయి
ప్రాచీనపట్టణాలు, తూర్పుగోదావరి జిల్లా
మెకంజీ కైఫియ్యతులు, తూర్పుగోదావరి జిల్లా
పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655
దయచేసి ఆదరించగలరు.
బొల్లోజు బాబా