Wednesday, April 26, 2017

ఫ్రాగ్మెంట్స్

ఫ్రాగ్మెంట్స్

1.
అస్థిత్వం అనేది
గోనె సంచిలో తీసుకెళ్ళి
ఊరిచివర విడిచినా
తోకతిప్పుకుంటూ వచ్చి చేరే
పిల్లిపిల్లలాంటిది.

2.
ఏకాంత సాయింత్రాలతో
జీవితం నిండిపోయింది
నిరీక్షణ దీపస్థంభంలా
దారిచూపుతోంది.

3.
చెంచాలు గజమాలను
మోసుకెళుతున్నారు.
ఏ జన్మలో చేసుకొన్న పాపమో అని
పూవులు దుఃఖపడుతున్నాయి.

4.
ఒక్కో విప్లవంలోంచి
ఒక్కో నియంత పుట్టుకొచ్చినట్లు
ఒక్కో విత్తనం లోంచి
ఒక్కో ఉరికొయ్య మొలకెత్తుతోంది.

5.
చచ్చిపోయిన సీతాకోకను
బ్రతికించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన
ఆ పిలగాడికి
అది ఎందుకు బ్రతకటం లేదో
ప్యూపానుంచి సీతాకోక రావటం
చూసాకనే అర్ధమైంది

బొల్లోజు బాబా

Sunday, April 23, 2017

జీవించటమే.......


ఓ రోజు హఠాత్తుగా ఒకదారి తన గమ్యాన్ని మరచిపోయింది. చాలా బెంగ పట్టుకొంది దానికి, గమ్యం లేని జీవితమేమిటని. తన గమ్యాన్ని వెతుక్కొంటూ ప్రయాణం కట్టిందా దారి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతోంది.
పిట్టల్ని పెంచే కులవృత్తిని కోల్పోయి ఏదో ఫాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఓ ముసలి చెట్టును అడిగింది "నా గమ్యాన్ని ఎక్కడైనా చూసావా" అని. "తూర్పువైపున బోల్డన్ని గమ్యాలుంటాయని మా పూర్వీకులు చెప్పేవారు ఆ వైపు ప్రయత్నించు" అంది ఆ చెట్టు. అటుగా కదిలింది. పొద్దున్నుంచీ ఏమీ తినలేదేమో నిస్సత్తువ ఆవరిస్తోంది.
ఎదురుపడ్డ ఒక ఎర్రనత్తను అడిగితే "నన్ను అనుసరించు" అంటూ వెనుకకు నడవటం మొదలెట్టింది. దారికి దాని వాలకంపై అనుమానం వేసి ముందుకు సాగింది.
చీకటి పడింది. అడవి గుండా ప్రయాణం. ఏవేవో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. దారికి భయం వేసింది. అయినా సరే గమ్యాన్ని కనుక్కోవాలన్న నిశ్చయం సడలలేదు. ఆకలి చలిలా కొరుకుతుంది.
కొందరు దారిదోపిడి దొంగలు పొదలమాటునుండి మీదపడి దారిని బంధించారు. ఓపికలేక ప్రతిఘటించలేకపోయింది. గమ్యం లేదని గమనించి ఒదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
తెల్లారింది. నెమ్మదిగా అన్వేషణ కొనసాగించింది దారి. ఏదో ఊరు కనిపించింది. పాత ఫ్లెక్సిలతో చేసిన గూళ్ళలో మనుషులు జీవిస్తున్నారు. వస్తూన్న ఒక వ్యక్తిని దాహం అడిగింది. నీళ్ళు తాగుతూ అతన్ని చూసింది. ఒక కాలు లేదు అతనికి. ఏమైంది అని ప్రశ్నించింది. "రైల్లో పల్లీలమ్ముతాను, ఓ రోజు ఆక్సిడెంట్ అయ్యింది" అన్నాడు. అతని లేని కాలును చేతిలోకి తీసుకొని తడిమింది. కన్నీళ్ళు వచ్చాయి. ఆకలి వల్ల ఎక్కువ బాధపడలేక పోయింది.
వెళ్ళిపోతున్న అతని వెనుక చేరి బుట్టలోంచి గుప్పెడుపల్లీలలను దొంగిలించి గబగబా నోట్లో కుక్కుకొంది. రైలుపట్టాలకు అంటుకొన్న రక్తం జ్ఞాపకాలు గొంతుకడ్డుపడ్డాయి. కుంటుకొంటూ పడమరవైపు వెళుతోన్న అతన్ని చూస్తుంటే అర్ధమైంది గమ్యం అంటే ఏమిటో. ఇంకెప్పుడూ అది గమ్యం కొరకు అన్వేషించలేదు.
బొల్లోజు బాబా

Friday, April 21, 2017

భూమిని మింగిన పిల్లగాడు --- The Lad who swallowed Earth by Sri. K. Satchidanandan

భూమిని మింగిన పిల్లగాడు --- The Lad who swallowed Earth by Sri. K. Satchidanandan
తినటానికి ఏమీలేక ఆ నల్ల పిలగాడు
గుప్పెడు మట్టిని మింగాడు
వాళ్ళమ్మ బెత్తం తీసుకొని
రావటం చూసి నోరు తెరిచాడు
ఆ చిన్నినోటిలో ఆమె
ముల్లోకాలు కనిపించాయి
బంగారంతో చేసిన యుద్ధవిమానాలతో ఒకటి
దోచుకొన్న సంపద, జ్ఞానాలతో రెండవది
ఆకలి, ఈగలు, మృత్యువులతో మూడవది.
ఆ నోరు నింపటానికి పిడికెడు మెతుకులు లేక
"నోరు ముయ్యి" అని బిగ్గరగా అరచిందామె.
ఆ తరువాత వారు
ఖర్కశంగా ఇద్దరు గెరిల్లాల ప్రాణాలు తీసిన
జైలుగది చల్లని నేలపై ఉన్నారు.
మూలం: The Lad who swallowed Earth by Sri. K. Satchidanandan
అనువాదం: బొల్లోజు బాబా

వేడుక


పాపం పసివాడు
లోకం
ఎదురుపడ్డప్పుడల్లా
శోకంతో
కన్నీరు మున్నీరయ్యేవాడు
వాడి బాధ చూడలేక
ఓ దేవత వాడి నేత్రాలపై
బీజాక్షరాలను లిఖించి
కన్నీటి బిందువులు కవిత్వంగా మారే
వరమిచ్చింది
విషయాన్ని పసికట్టిన లోకం
మరిన్ని దృశ్యాలను
అతని కళ్ళలోకి వంపి
కవిత్వాన్ని పిండుకొంటోంది
వేడుకగా
బొల్లోజు బాబా

Friday, April 14, 2017

ఎలుగెత్తి చాటుదాం

ఎలుగెత్తి చాటుదాం
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
అసంఖ్యాక హృదయాలలో
నిత్యం ప్రకాశించే మార్తాండ తేజుడని
చదువు సమీకరించు పోరాడు అన్న మూడు పదాలలో
మన జీవితాలకు దిశానిర్ధేశనం చేసిన
ఆధునిక భోధి సత్వుడని
వీధి కుళాయి నీళ్ళు తాగనివ్వని వివక్షా తిమిరంతో
జ్ఞానమనే కాంతిఖడ్గంతో సమరం చేసిన
అవిశ్రాంత యోధుడనీ, అలుపెరుగని ధీరుడనీ
"మేం హరిజనులమైతే మీరంతా దెయ్యం బిడ్డలా" అని ప్రశ్నించి
పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని
ముక్కుసూటిగా ఎదుర్కొన్న ధీశాలి అని
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
ఎన్ని యుగాలైనా కొండెక్కని పరిమళ దీపమని
మనుస్మృతిలోని నిచ్చెనమెట్లని మొదటగా గుర్తించి దాన్ని
తగలెయ్యమని పిలుపునిచ్చిన గొప్ప సామాజిక శాస్త్రవేత్త అని
హిందూ భావజాలాన్ని ఒక చారిత్రాత్మక మలుపుతిప్పిన చరితార్ధుడని
దేశంలో సగభాగానికి సమానహక్కులు
పోరాడి సాధించిపెట్టిన గొప్ప మానవతా వాది అని
దేశ మహిళలందరకూ ప్రాతఃస్మరణీయుడనీ
తన జాతిపై జరుగుతున్న అణచివేతను లండన్ సమావేశంలో
నిప్పులాంటి స్పష్టతతో ప్రపంచానికి ఎరుకపరచి
తన ప్రజకు ప్రత్యేక అస్థిత్వాన్ని సాధించిపెట్టిన రాజనీతిజ్ఞుడనీ
దీన జనోద్దారకుడనీ
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
అంబేద్కరిజం అంటే ఆ మహనీయుని
వెన్నెముకతో చేసిన వజ్రాయుధమనీ
స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అనే మూడు సింహాలను
భారత రాజ్యాంగంగా మలచి సామాన్యుడికి కాపలాగా పెట్టిన
అనితర సాధ్యుడనీ, అపార విద్యాపారంగతుడనీ
మానవజాతికి వన్నెతెచ్చిన మేధో శిఖరమని
ఈ శతాబ్దపు మూర్తీభవించిన జ్ఞాన స్వరూపమని
దళిత బహుజనుల జీవితాలలో నీలికాంతులతో వెలిగే ఆరంజ్యోతి అనీ
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కర్ అంటే ఆత్మవిశ్వాసమనీ
జై భీమ్ అంటే దారిచూపే చూపుడు వేలని
ఎలుగెత్తి చాటుదాం అందరం
బొల్లోజు బాబా
(డా. బి.ఆర్. అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా)

Friday, April 7, 2017

కీమో థెరపీ


ఇంట్లోకి ఇంకా అడుగుపెట్టనే లేదు
తల వెంట్రుకల చుట్ట
బండి చక్రంలా గాలికి
దొర్లుకొంటూ దొర్లుకొంటూ వచ్చి
గడప వద్ద ఆగింది
పెను దుఃఖం
ఒక ఆలింగనం
ఎడతెగని కన్నీరు
వెంట్రుకల్ని ఒక్కొక్కటీ
రాల్చుకొంటూన్న తరువు
మెల్లమెల్లగా
గతంలోకి కూరుకుపోతోంది.
కటిక రాత్రి
జుట్టుపట్టుకొని ఈడ్చుకుపోతూంటే
తెగిన చీకటి దారాల్లా వెంట్రుకలు
ఎల్లెడలా మృత్యుశైత్యం
ఒక వేదన
భయప్రవాహం
విచ్చుకొన్న ఓదార్పు తెరచాప
బొల్లోజు బాబా

Thursday, April 6, 2017

నాలుగు స్తంభాలు


మొన్నో నలుగురు వ్యక్తులు
కొండపై రాత్రివిందుచేసుకొన్నాకా
ఉదయానికల్లా కొండ మాయమైందట
ఆ నలుగురే
నదీవిహార యాత్రజరిపిన మర్నాటికల్లా
నదీ, నదీ గర్భపు ఇసుకా అదృశ్యమయ్యాయని
ఆశ్చర్యంగా చెప్పుకొన్నారు
వాళ్ళే
చెట్టపట్టాలేస్కొని పంటచేలల్లో
తిరుగాడిన సాయింత్రానికల్లా
పచ్చని చేలన్నీ కనిపించకుండా పోయాయట
ఈరోజు వాళ్లకో కొత్త ఊహ పుట్టిందట
అందరూ గుసగుసలుగా చెప్పుకొంటున్నారు.
వివరాలింకా బయటపడలేదు
ఇంతలో…
"అలా జరగటానికి వీల్లేదు" అంటూ
రోడ్డుపై ఒకడు గొణుక్కుంటూ
గాల్లో ఏవో రాతలు వ్రాసుకొంటూ
అడ్డొచ్చిన నన్ను తోసుకొని సాగిపోయాడు
ఎలా జరగటానికి వీల్లేదటా? అని ఆలోచించాను
వెంటనే స్ఫురించింది
అవునవును
నాకూ అన్పిస్తోంది
ఖచ్చితంగా అలా జరగటానికి వీల్లేదు
బొల్లోజు బాబా