Friday, July 7, 2017

వలసపక్షుల గానం


ఓ రద్దీట్రాఫిక్ లో
రెండు చీమలు కలుసుకొని
కాసేపు ముద్దులాడుకొని
విడిపోయినట్లుగా మనమూ
కలుసుకొని విడిపోతూంటాం.
ఉద్యోగమో, వివాహమో, అనంతశయనమో
ఏదైనా కానీ
కలయికను లోపలనుంచి తొలిచి
వియోగ శిల్పాన్ని సృష్టించే అద్భుత శిల్పులు.
ఎప్పుడు కలుసుకొన్నామో
సమయాలు సందర్భాలు ఉంటాయికానీ
ఎప్పుడు ఒకరి హృదయంలో ఒకరు
మనుష్యులమై మొలకెత్తామో
తారీఖులు దస్తావేజులు ఉండవు
ఎందుకు కలుసుకొన్నామో
కారణాలు అవసరాలు తెలుస్తుంటాయి
ఎందుకు ఒకరి దూరం
దిగంతాలవరకూ పరుచుకొనే విషాదం
అవుతుందో ఎన్నటికీ తెలియదు
నదిలో కొట్టుకు పోతున్న దుంగపై
కాసేపు వాలి
పేరు, ప్రవర చెప్పుకొనే వలసపక్షులు
చేసే గానమిది.
బొల్లోజు బాబా

Time has come......


కొలతలుగానో మమతలుగానో
చూడబడే ఆమె
నెలకో మూడురోజులు 
ఓ రక్తగర్భ అనీ
రక్తాశ్రువులు చిందించే
ఓ గాయగర్భ కూడా అని
మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది.
ఋతుమతి, పుష్పవతి
ఏకవస్త్ర, త్రిరాత్ర అంటూ
సౌందర్యాత్మక భాషలో కప్పెట్టిన
కొన్ని దైహిక ధర్మాల పట్ల
అసున్నితత్వం పొందాల్సిన సమయం వచ్చింది
ఇన్ సెనిరేటర్ లోకి విసిరిన
నాప్కిన్ తో పాటు
కొన్ని బిడియాల్ని, సంకోచాల్ని
వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది
ఆమెక్కూడా!
.
బొల్లోజు బాబా