Friday, October 2, 2026

నీ డబ్బు నువ్వే ఉంచుకో … (ఫ్రెంచి యానాం కథలు)

(ఈ కథ అక్టోబరు 2026 నెల విశాలాక్షి పత్రికలో ప్రచురింపబడింది.  ఎడిటర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను -  బొల్లోజు బాబా)


స్వేచ్ఛ, సమానత్వం, పాలనా క్రమశిక్షణను తమతో తీసుకొచ్చిన ఫ్రెంచివారి ప్రపంచం ఒకవైపు; శతాబ్దాల నమ్మకాలు, ఆచారాలు, ధార్మిక విశ్వాసాలతో జీవిస్తున్న స్థానిక సమాజం మరోవైపు—ఆ రెండు ప్రపంచాల మేళవింపులో నిత్యం సంఘర్షించుకొంటూ  రూపుదిద్దుకున్న విచిత్రమైన సంధిస్థలం యానాం.

కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790లలో పెద్ద ఎత్తున వ్యాపారం చేసి సంపన్నుడయ్యాడు. తరువాత యానాంలోకి మకాం మార్చి, అక్కడా వ్యాపారాన్ని విస్తరించి మరింత ఐశ్వర్యం సంపాదించాడు. అతని కుమారుడు మన్యం వెంకటరత్నం కూడా తండ్రి బాటలోనే నడిచి యానాంలో అత్యంత ధనిక వ్యాపారిగా ఎదిగాడు. ఫ్రెంచివారితో వ్యాపారం చేయడమే కాక, వారి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. అతని వ్యాపారాలు యానాంతో పాటు చుట్టుపక్కల బ్రిటిష్ ప్రాంతాలకూ విస్తరించాయి. ఫ్రెంచి దొరలతో ఉన్న ఆర్థిక సంబంధాలు అతనికి వ్యాపార లాభాలతో పాటు ప్రత్యేకమైన పలుకుబడినీ తెచ్చిపెట్టాయి.  ఫ్రెంచి ప్రభుత్వం అతనికి జమీందారు హోదా కూడా కల్పించింది.  ఈ హోదా కలిగినవారికి,  వెండి రాజదండాన్ని కలిగి ఉండటం, రెండు కాగడాలతో   పల్లకిలో తిరగడం లాంటి గౌరవ చిహ్నాలు ఉంటాయి.

యానాం నడిబొడ్డున కోటను తలపించే విశాలమైన మేడలో వెంకటరత్నం నివసించేవాడు. ఎత్తైన గోడలు, బరువైన కలప తలుపులు, ఇరువైపులా చిన్న ఫిరంగులు, వాకిట్లో ఇత్తడి దీపస్తంభాలు—ఆ ఇంటి దర్పాన్ని చాటేవి. మసూచితో భార్య చనిపోయిన తర్వాత, పనివాళ్లు ఎంతమంది ఉన్నా ఆ విశాలమైన మేడలో వెంకటరత్నం ఒంటరిగానే జీవించేవాడు.

లోపలికి అడుగుపెడితే అతని సంపద మరింత స్పష్టంగా కనిపించేది. యూరోపియన్ గడియారం, బర్మా టేకు మెట్లు, ఖరీదైన సామాన్లు, భారీ గాజు షాండ్లియర్లు, రంగురంగుల తివాచీలు, విదేశీ గాజు దీపాలు—ఆ మేడంతా అతని వైభవాన్ని చాటేవి.

ఇంటి వెనుక విశాలమైన పెరడు. ఒక మూల రాతి గట్టుతో బావి, మరో మూల తులసికోట. వెనుక కొబ్బరి, మామిడి, పనస చెట్లు; వాటి కింద పనివాళ్ల చిన్న గదులు వరుసగా ఉండేవి. పెరడు చివర గుర్రాల శాల, పక్కనే పల్లకీలు నిలిపే కొట్టు. ముందుభాగం జమీందారు వైభవాన్ని చూపిస్తే, వెనుకభాగం ఆ వైభవాన్ని మోసే మనుషుల ప్రపంచాన్ని దాచేది.

ఆ ఇంట్లోనే పనిచేసేవాడు తోట గవన్ను.

గవన్ను ఉదయం చీకట్లు తొలగకముందే లేచేవాడు. బావి నుంచి నీళ్లు తోడి పెద్ద రాతి తొట్టెలో పోయడం, గుర్రాల కొట్టం శుభ్రం చేయడం, చెట్లకు నీళ్లు పెట్టడం ఇతని రోజువారీ పని. గవన్ను భార్య పేరు గురవమ్మ. 

వీరి పదేళ్ల కూతురి పేరు మంగ.  అప్పుడే వికసిస్తున్న పారిజాతం.

ఆమెకు ప్రపంచం అంటే తండ్రి పని చేసే ఆ పెరడు, తల్లి వంటింటి పొగ, గోదావరి గట్టు, సాయంత్రం ఆడుకునే మట్టి బొమ్మలు, తలలో పెట్టుకునే మల్లెపూలు, పండుగరోజు దొరికే పటిక బెల్లం ముక్క.

ఉదయం తల్లి పక్కచాప మడిచి పెట్టుకునేలోపే మంగ నిద్రలేచి ఉండేది. కళ్లను రుద్దుకుంటూ బయటకు వచ్చి బావి దగ్గర కూర్చునేది. తల్లి నీళ్లు తోడుతుంటే తాడును పట్టుకుని సహాయం చేస్తాననేది.

"నీ చేతులతో బిందె ఎత్తగలవా?" అని తల్లి నవ్వేది.

"పెద్దదైనాక ఎత్తుతా."

"పెద్దదైనాక ఏం చేస్తావు?" మంగ కాసేపు ఆలోచించి,

"నాన్నలా పని చేయను." అనేది.

"అయితే?"

"నీలా ఇంట్లో ఉంటా."

తల్లి నవ్వేది.

"అది కూడా పని కాదా?"

మంగకు ఆ ప్రశ్న అర్థం కాదు.

ఆమె నవ్వేది.

ఆ నవ్వు తల్లికి ప్రపంచంలోనే పెద్ద సంపద.

***

మన్యం వెంకటరత్నం ఇంటికి ఫ్రెంచి అధికారులు వచ్చినప్పుడు గవన్ను దూరంగా నిలబడి గమనించేవాడు. తెల్లటి దుస్తులు, మెరిసే తోలుబూట్లు, బంగారు జేబుగడియారాలు, వెండిపాత్రల్లో పానీయాలు—వారి ప్రతి వస్తువులోనూ అతనికి ఒక పరాయి ప్రపంచం కనిపించేది. వెంకటరత్నం మాత్రం వారి ముందు ఒంగి, ఎంతో వినయంగా మాట్లాడేవాడు. అధికారులు కూడా అతనితో అదే మర్యాదను చూపేవారు. వారి మాటల్లో, చూపుల్లో ఆ పరస్పర మర్యాద వెనుక ఒకరి అవసరంలో మరొకరి ప్రయోజనం దాగి ఉన్నట్టు గవన్నుకు స్పష్టంగా కనిపించేది.

1856 ప్రాంతంలో వెంకటరత్నానికి జబ్బు చేసింది. మొదట జ్వరం, తర్వాత ఒళ్లంతా నొప్పులు. మందులు మారాయి, వైద్యులు మారారు. జబ్బు తగ్గకపోయే కొద్దీ పూజలు, మొక్కులు, ఉపవాసాలు పెరిగాయి. అయినా ఫలితం లేదు. కళ్లు లోపలకు పోయాయి, చర్మం పాలిపోయింది. పగలూ రాత్రీ తేడా లేకుండా దగ్గు వేధించేది. ఎంతమంది ఫ్రెంచి వైద్యులు చూసినా జబ్బు  తగ్గలేదు.

“తనకు డబ్బుంది. భూములున్నాయి. మేడ ఉంది. సేవకులు ఉన్నారు ఫ్రెంచి దొరలతో పరిచయం ఉంది.” కానీ మరణం ముందు ఇవేవీ తనకు రక్షణ ఇవ్వవని మొదటిసారి అతనికి అనిపించింది. "ఇది సాధారణ జబ్బు కాదు" అని ఎవరో ఒకరు చెప్పిన మాట అతని మనసులో విత్తనంలా పడి పెరగసాగింది.

అప్పుడు అతని ఇంట్లోకి వచ్చారు ముగ్గురు మంత్రగాళ్లు—షేక్ లాలా, ఆదినారాయణుడు, బావాజి.

వాళ్ల దుస్తులు, మాట తీరు, కదలికలు కూడా సాధారణంగా లేవు. నుదుటిపై పెద్దపెద్ద కుంకుమ బొట్లు, నల్ల దారాలు, నిమ్మకాయలు,  ఎవో తెలియని మూలికలు.  వాళ్ల దగ్గరున్న ప్రతి వస్తువూ ఒక రహస్యాన్ని మోస్తున్నట్టుండేది. ఎవరితోనూ నేరుగా కళ్లలోకి చూడరు.

వాళ్లు లోపలికి రాగానే ఇల్లంతా కలియదిరిగారు. ఏవేవో దిక్కులు చూస్తూ, చేతులతో గాలిలో గీతలు గీస్తూ వింతగా ప్రవర్తించారు. మొదటి రోజే వాళ్లు వెంకటరత్నం నాడిని పట్టి ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకొని కొద్దిసేపు మౌనంగా ఒక మాట చెప్పారు.

"ఇది జబ్బు కాదు."

వెంకటరత్నం కళ్లు పెద్దవయ్యాయి.

"మరి?"

"చేతబడి."

ఆ మాట వినగానే వెంకటరత్నం కళ్లలో భయం మెరిసింది.

"ఎవరు చేశారు?"

మంత్రగాళ్లు వెంటనే పేరు చెప్పలేదు.

అది వారి విద్యలో మొదటి నియమంలా కనిపించింది.

ముందు భయపెట్టాలి. తర్వాత పరిష్కారం చెప్పాలి.

"అది తెలుసుకోవడం కష్టం. కానీ పరిహారం చేయకపోతే ప్రమాదం తప్పదు" అన్నారు.

జమీందారుకు నమ్మకం కుదరలేదు. ఆయన ముఖంలో అనుమానం చూసిన ఆదినారాయణుడు, పళ్లు పటపట కొరుకుతూ తన సంచిలోంచి ఒక నిమ్మకాయ తీశాడు. దానికి గుండుసూదులు గుచ్చి, ఏవో మంత్రాలు చదువుతూ కత్తితో రెండు ముక్కలుగా కోశాడు. కోయగానే ఆ నిమ్మకాయలోంచి నెత్తురు లాంటి ఎర్రటి నీరు కారింది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న నల్లటి మట్టిని గాలిలోకి చల్లాడు. "మేం చదివే మంత్రం పూర్తికాగానే మీ ఇంటిపై రాళ్లు వర్షిస్తాయి చూసుకోండి" అని వణికిపోయే స్వరంతో అరిచాడు షేక్ లాలా.

"ఓం భీం... కాళీ... రక్త కాళీ..." అంటూ శరీరాన్ని వింతగా ఊపుతూ మంత్రాలు జపించారు ముగ్గురూ. వాళ్ల అరుపులు ముగిసేసరికి, నిజంగానే ఆ పెద్ద మేడ పెంకుల మీద "టపటప... దభదభ" మంటూ రాళ్ల వర్షం కురిసింది! ఎక్కడినుంచి వస్తున్నాయో ఎవరూ చూడలేదు, పిడికెడంత రాళ్లు మండువా లోగిలిలో పడుతున్నాయి.

రాళ్ల వర్షం చూసి గజగజ వణికిపోతూ, మంచం మీద నుంచి కిందకు దిగి, ఆ మంత్రగాళ్ల చేతులు పట్టుకొని. "నన్ను బతికించండి స్వామీ... నా ప్రాణాలు నిలపండి... మీకు ఎంత డబ్బయినా ఇస్తాను" అని వెక్కి వెక్కి ఏడ్చాడు.  ఆ క్షణం నుంచి వెంకటరత్నం వారి చేతుల్లోకి జారిపోయాడు.

మరుసటి రోజు నుంచి ఆ మేడ స్వరూపమే మారిపోయింది. తలుపులన్నీ మూసేశారు. పగలు కూడా ఇంట్లో చిమ్మచీకటి. ఎక్కడ చూసినా సాంబ్రాణి పొగ, గుప్పుమనే సారాయి వాసన, నిమ్మకాయల చెత్త, తెగనరికిన కోళ్ల నెత్తురు మరకలు. కొన్ని సార్లు మేకల అరుపులు,  ఎనిమిది రోజుల పాటు ఇంట్లో నిరంతరంగా క్షుద్ర పూజలు జరిగాయి. ఆ మంత్రగాళ్ల అరుపులు, వాళ్లు కొట్టే చేసే శబ్దాలు బయటకు వినిపించకుండా తలుపులు కిటికీలు అన్నీ బిగించి మూసేసారు. పనివాళ్లు దూరంగా ఉండేవారు.

ఎనిమిదో రోజు అమావాస్య రాత్రి మంత్రగాళ్లు తోటలో వెంకటరత్నంతో  ఏదో పూజ చేయించారు. పూజముగిసాక బావాజి రెండు చేతులు నేలకేసి బాదుకుంటూ, జుట్టు పీక్కొంటూ శ్వాస పీల్చటం కష్టమై రొప్పుతున్నాడు.  అప్పుడు షేక్ లాలా వాడి తల మీద చేయి పెట్టి, "ఎవరు నువ్వు? ఈ జమీందారు గారిని ఏం చేయాలని వచ్చావు?" అని గద్దించాడు.

బావాజి వికృతంగా నవ్వుతూ, బొంగురుబోయిన గొంతుతో అరిచాడు.... "నేను చావును! ఓయ్ జమీందారు! నువ్వొక నెల రోజుల్లో చనిపోతావు.  ఇప్పటికే ఆలస్యమయ్యింది. తొందరగా భూతశాంతి చేయించు. నాకు రక్తం కావాలి... స్వచ్ఛమైన రక్తం కావాలి..."

"ఏం రక్తం కావాలి?" అని అడిగాడు ఆదినారాయణుడు.

"పచ్చి నెత్తురు! ఓ మానవ కన్యను బలి ఇవ్వు! అప్పుడే నిన్ను వదిలేస్తా!" అని అరిచి స్పృహ తప్పి పడిపోయాడు.

ఆ మాటలు వినగానే జమీందారు ముఖం  పాలిపోయింది.  

"ఇది సాధారణ దెయ్యం కాదు.  మానవ కన్యతో పరిహారం చేయాలి." అన్నాడు షేక్ లాలా.  ఆ మాటకు గదిలో  చీకటి ఒక్కసారిగా ఎక్కువైనట్టనిపించింది.

మంత్రగాళ్లకు ఆ కన్య ఎక్కడ దొరుకుతుందో వెతకాల్సిన అవసరం లేదు. అదే మేడలో పనిచేస్తున్న తోట గవన్ను కూతురు మంగ వారి కళ్లకు అప్పటికే పడింది. పదేళ్ల చిన్నారి. సన్నటి శరీరం, రెండు జడలు, చేతులకు చవక గాజులు, తండ్రి పని చేసే మేడలోనే పరుగులు తీస్తూ పెరిగిన పిల్ల. భయపడటం ఇంకా నేర్చుకోని వయసు.

ఆమెకు ఆ ఇంటి రాజకీయాలు తెలియవు. తన తండ్రి ఎవరి కోసం పని చేస్తున్నాడో, జమీందారికి తన మీద ఎంత అధికారం ఉందో, మంత్రగాళ్లకు తన ప్రాణం ఎందుకు అవసరమో ఆమెకు తెలియదు.

ఆమెకు తెలిసింది ఒక్కటే—

మరుసటి రోజు తల్లి తనకు కొత్త పరికిణి కడుతుందట.

***

మే 15, 1856 మధ్యాహ్నం సూర్యుడు మండుతున్నాడు.. కొబ్బరి ఆకుల మధ్య నుంచి పడుతున్న కాంతి చిన్న చిన్న ముక్కలుగా నేలమీద చెల్లాచెదురౌతుంది.

మంగ అక్కడే వేపచెట్టు కింద కూర్చుని, మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేస్తూ, తనలో తాను ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకొంటోంది.

సరిగ్గా అప్పుడే ఆదినారాయణుడు, బావాజి పెరట్లోకి వచ్చారు. వాళ్ల చేతిలో ఒక ఇత్తడి గ్లాసు ఉంది. అందులో ఏదో ఎర్రటి పానకం లాంటిది ఉంది. వాళ్లు మెల్లగా మంగ దగ్గరకు వచ్చి  “మంగా ఇదిగో, ఈ  ప్రసాదం తీసుకో... అమ్మవారు కలలోకొచ్చి నీకు మంచి బొమ్మలు ఇస్తుంది" అని చెబుతూ ఆ గ్లాసును ఆమె చేతికిచ్చారు. ఆ గ్లాసును నోటికి రాసుకుని గటగటా తాగేసింది మంగ.

తాగిన పది నిమిషాలకే మంగలో మార్పు మొదలైంది. కళ్లు ఎర్రబడ్డాయి. నడక తడబడింది. చేతిలో ఉన్న మట్టి బొమ్మ కింద పడిపోయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, అడుగులు వేయలేక, తూలుకుంటూ వచ్చి తల్లి ఒళ్ళో పడిపోయింది.

"అమ్మా... కడుపు కాలిపోతోందే... అమ్మా గొంతు మండిపోతోందే..." అంటూ విలవిల్లాడిపోయింది. ఆ చిన్ని పెదవులు నల్లగా మారిపోయాయి.

గురవమ్మకు  గుండె ఆగినంత పనైంది. చేతిలో ఉన్న గిన్నెలు కింద పడేసింది.   బిడ్డను గుండెలకు హత్తుకుని, "ఏమైందే తల్లీ? ఏమైందిరా ?" అంటూ పెద్దపెద్దగా ఏడుస్తూ అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విని మొగుడు గవన్ను పరిగెత్తుకుంటూ వచ్చాడు. బిడ్డ పరిస్థితి చూసి వాడు నెత్తి బాదుకున్నాడు.

వరుసగా రెండు రోజులు మంగ నరకయాతన అనుభవించింది. కడుపులో పేగులు కాలిపోతున్నట్టుగా మెలికలు తిరుగుతూ, శరీరం అదుపుతప్పి ఎగిరెగిరి పడేది.  జమీందారుగారు అనారోగ్యంతో ఉండి బాధపడుతుంటే మీ ఏడుపులు పెడబొబ్బలు ఏంటి అంటూ వారిని ఒక చీకటి కొట్లో బంధించి బయటకు వెళ్లనివ్వలేదు జమీందారు మనుషులు. మూడోరోజు రాత్రిపూట గురవమ్మ చేతుల్లో అమ్మా అమ్మా అంటూ మూలుగుతూ మంగ ప్రాణాలు విడిచింది.

ఆమె ఏడుస్తూ నేలపై కూలబడింది.

"నా మంగను నాకు తెచ్చివ్వండి!" ఎవరిని అడుగుతోందో ఆమెకే తెలియదు.

మంత్రగాళ్లనా? జమీందారునా? దేవుడినా? ఫ్రెంచి దొరలనా?

గవన్ను కళ్లలో కన్నీళ్లు లేవు. మంగ శవాన్ని పట్టుకుని కూర్చున్నాడు. జమీందారు మనుషులు వచ్చి శవాన్ని లాక్కున్నారు. గురవమ్మ అడ్డం పడింది. ఆమెను పక్కకు తోసేశారు. తెల్లవారక ముందే  ఊరి చివర ఎవరికీ తెలియకుండా దహనం చేశారు. ఒక పసిప్రాణం కాలి బూడిదైపోయింది.

***

మంగ మరణించిన రోజు నుంచి తోట గవన్ను ఇంట్లో వెలుగు తగ్గిపోయింది. మంగ తల్లి గురవమ్మ పగలంతా కూతురికి ఎప్పటికి తొడగలేని కొత్త పరికిణీని ఒడిలో పెట్టుకుని కూర్చునేది.  దాన్ని వేళ్లతో నిమురుతూ కన్నీళ్లు కార్చుతూ బాధపడేది.  గవన్ను ఎవరితో మాట్లాడేవాడు కాదు.

ఒకరోజు మేడ వెనుకనున్న చిన్న గదిలో ఆమె పొయ్యి మీద కుండ పెట్టి వంట చేస్తుండగా, పక్కనుంచి మంత్రగాళ్లలో ఇద్దరు నిలబడి మెల్లగా మాట్లాడుకోవటం వినిపించింది . స్పష్టంగా వినిపించలేదు.  "మందు", "పాప", "బలి" అనే మాటలు  మాత్రం ఆమె చెవికి తగిలాయి. వెంటనే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. గోడకు చెవి ఆనించి మరింత శ్రద్ధగా విన్నది.

" మందు పనిచేసింది..." అని ఒక స్వరం వినిపించింది. "ఇక బలి పూర్తయినట్టే." మరొకడు నెమ్మదిగా అన్నాడు, "జమీందారు గారికి చెప్పాలి... ఆయనకు ప్రమాదం తొలగిందని." గరవమ్మ  శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది.  ఆ మాటలు విన్న వెంటనే ఆమెకు ఇంకేమీ వినిపించలేదు.  మధ్యాహ్నం తన కళ్లముందు మత్తుగా తూలుతూ ఇంటికి వచ్చిన మంగ, ఆ తర్వాత రెండు రోజులు నరకయాతన పడటం, వైద్యుడిని పిలవనివ్వకపోవడం,  శవాన్ని వెంట వెంటనే దహనం చేయడం—అన్నీ కలిపిచూస్తే ఆమెకు నిజం అర్థమౌతోంది.

ఆమె గోడకు ఆనుకుంది. చేతులు వణికుతున్నాయి. పొయ్యి మీద కుండ పొంగిపోతోంది. పొగ కళ్లలోకి వస్తోంది.  ఆమెకు పొగ కనిపించలేదు. మంగ ముఖమే కనిపించింది. ఆ చిన్న ముఖం. చివరిసారి తనవైపు తిరిగి చూసిన కళ్లూ. "అమ్మా..." అని పలికిన ఆ ఒక్క మాట.

ఆ రాత్రి గవన్ను ఇంటికి వచ్చినప్పుడు గురవమ్మ అతని కోసం ఎదురుచూస్తోంది. అతను లోపలికి రాగానే ఆమె తలుపు మూసి గడియ పెట్టింది. చాలాసేపు మాట రాలేదు. చివరకు వణుకుతున్న గొంతుతో, "మన మంగను వాళ్లే చంపారు" అంది. గవన్ను ఆమె ముఖం వైపు చూశాడు. "ఏమంటున్నావు?" అని అడిగాడు. ఆమె తన చెవులతో విన్న మాటలన్నీ చెప్పింది.

గవన్ను కొద్దిసేపు మాటలేకుండా కూర్చున్నాడు. మంగ చనిపోయినప్పటి నుంచి తనలో తిరుగుతున్న అనుమానాలకు ఒక్కసారిగా రూపం వచ్చింది. అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి "జమీందారు బతకాలంటే మన పిల్ల చావాలా గవన్నూ?"

గవన్ను ఒక్కసారిగా లేచి గోడను గట్టిగా కొట్టాడు. మళ్లీ కొట్టాడు. అతని వేళ్లకు రక్తం కారింది. అతనికి నొప్పి తెలియలేదు. తన కూతురి చావుకు కారణమైన మనుషులు అదే మేడలో ఉన్నారు.

బయట కాపలాదారుల అడుగుల శబ్దం వినిపించగానే గవన్ను ఆగిపోయాడు. అతని కోపం కళ్లలోనే మిగిలిపోయింది. తలుపు వైపు చూసి మళ్లీ కూర్చున్నాడు. పేదవాడి కోపానికి కూడా ఒక గోడ ఉంటుంది.

మంగ చనిపోలేదు; మంగను చంపారు. తన కూతురి ప్రాణం మరొక మనిషి ప్రాణానికి బలిగా పెట్టారనే విషయం వాళ్ళిద్దరికీ అర్థమైంది.  ఇక ఎంతమాత్రం ఆ జమీందారు కొలువులో ఉండబుద్ధి కాక బయటకు  వచ్చేసారు.

జరిగిన విషయాన్ని గవన్ను కొందరు కులపెద్దల దృష్టికి తీసుకువెళ్ళాడు. కొద్దిసేపు అందరూ మౌనంగా ఉండిపోయారు. చివరకు కులపెద్ద చింతల కోటయ్య గట్టిగా అన్నాడు, “మనం కోర్టుకు వెళ్లాలి. ఇది ఒక్క పాపకు జరిగిన అన్యాయం కాదు—మన కులానికి జరిగిన అవమానం. ఈరోజు మనం మౌనంగా ఉంటే, రేపు ఇదే మనలో మరొకరికి జరుగుతుంది. ఇది మన కులగౌరవానికి సంబంధించిన విషయం. కోర్టుకు వెల్దాం.  అక్కడే తేల్చుకుందాం.”

గవన్ను కళ్లలో నీళ్లు తిరిగాయి. తన బాధకు తనతోపాటు నిలబడే వాళ్లు ఉన్నారన్న భావన అతనికి కొంత ధైర్యాన్ని ఇచ్చింది.

***

కేసు యానాం కోర్టుకు వెళ్లింది. గవన్ను ఇచ్చిన ఫిర్యాదులో మంగకు ఏదో మందు తాగించారని దానివల్ల ఆమె చనిపోయిందని ఆరోపించారు. మంత్రగాళ్లు విచారణకు హాజరయ్యారు. జమీందారు పేరు కూడా కేసులో ఉంది. మంత్రగాళ్ల మాటలకు గవన్ను భార్య సాక్ష్యం. మంగ మరణానికి అసలు కారణం ఏమిటి? శవపరీక్ష చేయడానికి శరీరం లేదు. అప్పటికే దహనమైపోవటం వల్ల ఆమె శరీరంలో విషం ఉందో లేదో పరీక్షించే అవకాశం లేదు.

యానాం కోర్టు జడ్జి De Saint Hilaire  కేసును విచారించాడు. సాక్ష్యాలు విన్నాడు.

 “నీ కూతురికి మందు ఎవరు ఇచ్చారు? నువ్వు చూశావా?”

“చూడలేదు.”

“అయితే నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి?”

గురవమ్మ కొద్దిసేపు జడ్జిని చూసింది. “నా కూతురు చనిపోతుంటే నేను చూసాను.”

జడ్జి మౌనంగా ఉన్నాడు.

“అంతే నాకు సాక్ష్యం.”

పత్రాలు చూశాడు. చివరికి సాక్ష్యం సరిపోదని భావించి కేసును కొట్టివేశాడు.  మంత్రగాళ్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. జమీందారు ప్రస్తావన లేనే లేదు. ఆ తీర్పుకు గవన్ను భార్య ఒక్కసారిగా నేలమీద కూలబడింది. ఆమె నోటి నుంచి మాట రాలేదు. కొద్దిసేపటికి తన తలను రెండు చేతులతో పట్టుకుని "అయితే నా మంగను ఎవరు చంపారు?" అని అరచింది. ఎవరూ సమాధానం చెప్పలేదు. గవన్ను తల వంచుకుని నిలబడ్డాడు. అందరికీ అర్థమైంది జమీందారు పలుకుబడి పనిచేసిందని.  అతని వెనుక నిలిచిన కుల పెద్దలు ఒకరినొకరు చూసుకొన్నారు. కులపెద్ద చింతల కోటయ్య దవడ బిగించాడు. “ఇది తీర్పుకాదు, ఇది ఇక్కడితో ముగిసిపోకూడదు" అన్నాడు. ఆ మాట ఆ రాత్రే యానాంలో ఇంటింటికీ చేరింది.

ఆ రాత్రి యానాం నిద్రపోలేదు.

సూర్యుడు అస్తమించిన తర్వాత వీధుల్లో గుంపులు కదలడం మొదలైంది. కుల పెద్దల పిలుపుతో గవన్ను సామాజిక వర్గానికి చెందినవారు గుంపులుగా చేరారు. మొదట మాటలు వినిపించాయి. తర్వాత అరుపులు. "న్యాయం కావాలి!" "పాపను చంపినవారిని శిక్షించాలి!" అంటూ నినాదాలు మొదలయ్యాయి. కొందరు చేతుల్లో కర్రలు పట్టుకున్నారు.

జనం యానాం కోర్టు జడ్జి ఇంటి వైపు కదిలారు. గుమ్మం ముందు ఉన్న పూల కుండలను ఒకరి తర్వాత ఒకరు నేలకేసి కొట్టారు. ఇంటి కిటికీ వెనుక నుంచి ఒక తెల్లని ముఖం బయటికి తొంగిచూసింది. వెంటనే గుంపులోంచి ఎవరో రాయి విసిరారు. రాయి కిటికీ అద్దాన్ని పగలగొట్టి లోపల పడింది. అద్దం ముక్కలు నేలమీద చెల్లాచెదురయ్యాయి. ఇంట్లో మహిళల అరుపులు వినిపించాయి. జడ్జి కుటుంబం వెనుక గదుల్లోకి వెళ్లి తలుపులు మూసుకుంది.

అక్కడితో గుంపు ఆగలేదు. మన్యం వెంకటరత్నం ఆస్తులపై దాడి జరిగింది. మేడకు చెందిన ఒక గిడ్డంగి తలుపులు పగలగొట్టబడ్డాయి. వాకిట్లో వెలుగుతున్న ఇత్తడి దీపస్తంభాన్ని కూలదోసారు.  బయట కట్టిన ఎద్దుల బండ్లకు తాళ్లు తెంచేశారు. కొంత సామాను వీధిలోకి విసిరేశారు.   ఫ్రెంచి పోలీసులు దూరంగా నిలబడి పరిస్థితిని గమనించారు. తుపాకులు చేతుల్లో ఉన్నా, అంత పెద్ద గుంపుపై కాల్పులు జరపడానికి వెనుకంజ వేశారు. ఒక చిన్న పాప మరణం మీద మొదలైన ఆగ్రహం ఇప్పుడు జమీందారు ఇంటిపై దాటి, అతనికి అండగా నిలిచిన అధికార వ్యవస్థ మీదకు మళ్లింది.

మరుసటి ఉదయం పెద్దొర కార్యాలయాల్లో నివేదికలు తయారయ్యాయి. పాండిచేరీ పంపించారు. జడ్జి ఇంటిపై దాడి, కిటికీలు పగలగొట్టడం, జమీందారు ఆస్తుల ధ్వంసం, రాత్రి గుంపుల రహస్య కదలికలు—అన్నీ అధికారిక నివేదికలలో నమోదయ్యాయి. యానాం నుంచి పాండిచేరీకి వెళ్లిన వాటిలో "శాంతిభద్రతలకు ముప్పు" అనే మాటలు ఉండవచ్చు; ఆ పత్రాల వెనుక ఉన్న రాయని వాక్యం మాత్రం ఒక్కటే—"ఒక పేద పిల్లకు న్యాయం జరగలేదు." అని.

అయితే యానాంలో ప్రజల ఆగ్రహం కూడా ఆగలేదు. గవన్ను, అతని భార్య, కుల పెద్దలు   అధికారులకు ఫిర్యాదులు పంపారు. యానాం కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాండిచేరీకి ఫిర్యాదులు వెళ్లాయి. "స్థానిక పలుకుబడితో కేసు ప్రభావితమైంది" అనే ఆరోపణలు వినిపించాయి. అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి కేసు వెళ్లింది. కేసు పత్రాలను మరోసారి పరిశీలించాలని  ఫ్రెంచి గవర్నరు ఆదేశించాడు. అలా పాండిచేరీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజెల్ హ్యూబర్ వద్దకు ఈ కేసు చేరింది.

***

కోర్టు తీర్పు తదనంతర పరిణామాల పట్ల మన్యం వెంకటరత్నం అసహనానికి గురయ్యాడు.  కాకినాడ ఇంగ్లీషు వైద్యులు ఆరోగ్యం మెరుగవటం కొరకు కొంతకాలం ఉదకమండలం వెళ్లి విశ్రాంతి తీసుకొమ్మని  చెప్పి ఉండటంతో ఆ రాత్రే మన్యం వెంకటరత్నం ఉదకమండలం ప్రయాణం కట్టాడు.  ఉదయం వెలుతురు పడకముందే మేడ వెనుక భాగంలో బండ్లు సిద్ధమయ్యాయి. పెట్టెలు కట్టారు. బట్టలు సర్దారు. మందుల పెట్టెను ఒక సేవకుడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. వెంకటరత్నం బలహీనంగా బయటికి వచ్చి బండిలోకి ఎక్కాడు.

అతను వెళ్లిపోయినా జమీన్ వ్యవహారాలు ఆగలేదు. వాటి బాధ్యత దివాన్ బులుసు శ్యామశాస్త్రిపై పడింది. యానాం జమీన్ లెక్కలు, భూములు, ఆదాయ వ్యవహారాలు, ఫ్రెంచి అధికారులతో సంప్రదింపులు—అన్నీ దివాన్ చూసుకునేవాడు. అప్పుడప్పుడు ఉదకమండలానికి వెళ్లి జమీందారుకు పరిస్థితులు వివరించేవాడు. జమీందారు భౌతికంగా దూరంగా ఉన్నా, ఆయన  పెత్తనం దివాన్ ద్వారా యానాంలో కొనసాగుతూనే ఉంది.

***

రిజెల్ హ్యూబర్ ముందు ఉన్నది ఒక విచిత్రమైన కేసు. ఒకవైపు శవం లేదు. మరోవైపు కుట్ర గురించి తల్లి విన్న మాటలు మాటలు మాత్రమే సాక్ష్యం.  ఒకవైపు స్థానిక కోర్టు నిందితులను విడుదల చేసింది. మరోవైపు ప్రజల తీవ్ర నిరసన ఉంది. ఒకవైపు మన్యం వెంకటరత్నంలాంటి  పలుకుబడి కలిగిన జమీందారు. మరోవైపు శోకం తప్ప మరేమీ మిగలని పేద తల్లి ఆమె వైపు నిలిచిన   ప్రజల ఆగ్రహం.

హ్యూబర్ కేసును తిరిగి పరిశీలించాడు. పత్రాలను చదివాడు. వాంగ్మూలాలను పరిశీలించాడు. సాక్షులను మళ్లీ విచారించాడు. యానాం కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం జరిగిన పరిణామాలను కూడా పరిశీలించాడు.

“గురవమ్మ వాంగ్మూలాన్ని చదివిన తర్వాత హ్యూబర్ కొద్దిసేపు పత్రాన్ని పక్కన పెట్టాడు. ఆ వాంగ్మూలంలో చట్టపరమైన మాటల కంటే ఒక తల్లి తన కూతురి చివరి ఘడియలను చెప్పిన తీరు అతని దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.”

కేసులోని సాక్ష్యాలను, నిందితుల వాంగ్మూలాలను, మంగ మరణానికి దారితీసిన పరిస్థితులను మరోసారి బేరీజు వేసిన తరువాత, చివరకు తన నిర్ణయాన్ని వెలువరించాడు. 

మంత్రగాళ్లకు మూడు నెలల జైలు శిక్ష విధించాడు. మొత్తం కేసుకు ప్రధాన బిందువుగా ఉన్న మన్యం వెంకటరత్నం జమీందారు  మంగ తల్లికి వెయ్యి రూపాయల పరిహారం చెల్లించాలని కూడా తీర్పు చెప్పాడు. అప్పటికి మంగ చనిపోయి రెండేళ్లు.

***

హ్యూబర్ తీర్పు వెలువడిన తర్వాత మన్యం వెంకటరత్నం  ఉదకమండలం నుండి యానాంకు తిరిగి వచ్చాడు.

ఒక రోజు ఉదయం శివాలయంలో పూజలు ముగించుకుని ఆయన పల్లకీలో ఇంటికి వస్తున్నాడు. ముందు వెండి శంకోలు మెరుస్తోంది. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి.   పల్లకీ మోసే బోయీలు సమంగా అడుగులు వేస్తున్నారు. ముందుగా సేవకులు, వెనుక కొందరు అనుచరులు నడుస్తున్నారు. పల్లకీ మీద రంగురంగుల వస్త్రాలు, అంచుల్లో వెండి అలంకరణలు. వెంకటరత్నం లోపల కూర్చుని అప్పుడప్పుడూ బయటకు చూస్తున్నాడు

అప్పుడే గుంపు మధ్య నుంచి ఒక స్త్రీ దూసుకొచ్చింది.

ఆమె జుట్టు చెదిరిపోయింది. చీర కొంగు బొడ్లో దోపి ఉంది.   కళ్లలో ఎన్నాళ్ల నుంచో నిద్ర లేదు. ముఖంలో భయం లేదు.

ఆమె మంగ తల్లి  గురవమ్మ.

ఆమె చేతిలో న్యాయస్థానం ఇచ్చిన పరిహారం— వెయ్యి రూపాయలు. ఎన్నాళ్లనుంచో చేతితో పట్టుకొని ఉన్నట్లు నాణాల సంచి నలిగి మట్టిగొట్టుకు పోయి ఉన్నాయి.

పల్లకీ ముందుకు దూకింది. సంచిలోని నాణాలను నోట్లను జమీందారు ముఖం వైపు విసిరి, " ఈ డబ్బు నువ్వే ఉంచుకో!  నువ్వసలు మనిషివేనా.  నా బిడ్డ ప్రాణానికి వెలకడతావా?" అని అరిచింది.  ఈ హఠాత్పరిణామానికి వాయిద్యాలు  ఆగిపోయాయి. . ఆమె రెండు చేతులతో తన గుండెలు బాదుకుంది. తర్వాత నేలలోని మట్టిని గుప్పెడు గుప్పెడుగా తీసుకుని వెంకటరత్నం వైపు రువ్వింది. "నీ డబ్బు నువ్వే ఉంచుకో! నాకు డబ్బు అక్కర్లేదు. నా బిడ్డను నాకు తెచ్చివ్వు! నా మంగను తిరిగి తెచ్చివ్వు! అది నీ వల్లే చనిపోయింది...

మట్టిని తీసుకొని జమీందారు వైపు గాల్లోకి విసురుతూ

"నువ్వు నాశనం అయిపోతావు! నా బిడ్డను చంపిన  పాపం నిన్ను వదలదు. నీ ఇంటిని వదలదు! నీ పిల్లలను కట్టికుడుపుతుంది! నీ వంశం నిలవదు!" అంటూ చేతులు ఆకాశం వైపు ఎత్తి శపించింది. వెంటనే మళ్లీ నేలపై కూర్చుని, "మంగ... నా మంగ..." అంటూ విలపించింది.

పల్లకీ చుట్టూ నిలబడ్డవాళ్లు కదలకుండా చూస్తున్నారు. కొందరి కళ్లలో నీళ్లు. కొందరి ముఖాల్లో భయం. మరికొందరి ముఖాల్లో ఆగ్రహం. వెంకటరత్నం మాత్రం క్షణం పాటు ఆమె వైపు చూసి, వెంటనే ముఖం తిప్పుకున్నాడు.

ఎక్కడినుంచో పరుగుపరుగున వచ్చిన గవన్ను భార్యను రెండుచేతులతో దగ్గరకు తీసుకొని, ఓదారుస్తూ దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు.

ఆ రోజు యానాం వీధిలో న్యాయం, పాపం, సంపద, దుఃఖం అన్నీ ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచాయి.

ఆమె శాపం నిజమైందా?

దానికి చరిత్ర దగ్గర సమాధానం లేదు.

 తరువాతి తరాలు ఒక కథను మాత్రం చెప్పుకుంటూ వచ్చాయి. మన్యం వెంకటరత్నం వంశానికి చాలా తరాలపాటు సంతానం కలగలేదని, దత్తత తీసుకున్నప్పటికీ వారు ఆస్తిని నిలబెట్టుకోలేకపోయారని, క్రమంగా ఆ జమీందారీ కరిగిపోయి ఆ వంశమే అంతరించిపోయిందని యానాం ప్రజలు చెప్పుకునేవారు.

అది నిజంగానే మంగ తల్లి శాపం వల్ల జరిగిందా, లేక తర్వాతి రోజుల్లో ఆ శాపానికి అలా ఒక కథ రూపం వచ్చిందా అన్నది చెప్పలేం.  ఆ రోజు ఆమె జమీందారు మీద రువ్విన మట్టి, ఆమె నోటి నుంచి వచ్చిన శాపం మాత్రం ప్రజల జ్ఞాపకాలలో నిలిచి పోయాయి. ఆ తర్వాత ఆ వంశానికి ఎదురైన కష్టాలు, దాని క్రమంగా వచ్చిన పతనం—అన్నీ మంగ తల్లి ఆ శాపంతోనే ముడిపడ్డాయి. కాలం గడిచేకొద్దీ ఆ శాపం మరింత బలమైన కథగా మారింది. చివరికి ఆ వంశం గురించి చెప్పేటప్పుడు మంగ తల్లి శాపాన్ని చెప్పకుండా ఆ కథనం పూర్తయ్యేది కాదు.

 

బొల్లోజు బాబా


చరిత్ర: ఈ కథకు ప్రధాన ఆధారం 25 మార్చి 1859న పాండిచేరీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రిజెల్ హ్యూబర్ ఇచ్చిన తీర్పు నివేదిక. అందులో 1856లో, యానాం జమీందారు మన్యం వెంకటరత్నం అనారోగ్యం, షేక్ లాలా, ఆదినారాయణుడు, బావాజి అనే ముగ్గురు మంత్రగాళ్లను ఆశ్రయించడం, 15 మే 1856న తోట గవన్ను పదేళ్ల కుమార్తె మంగకు వారు ఎదో పదార్థం తాగించడం, ఆమె తరువాత మరణించడం, గవన్ను యానాం కోర్టులో ఫిర్యాదు చేయడం, వంటి సంఘటనలు నమోదయ్యాయి. స్థానిక జడ్జి De Saint Hilaire కేసును కొట్టివేసి మంత్రగాళ్లను విడుదల చేయగా, చెలరేగిన ఘర్షణలు, ఫిర్యాదులపై హ్యూబర్ పునర్విచారణ చేసి 1859 మార్చి 25న మంత్రగాళ్లకు మూడు నెలల జైలు శిక్ష విధించి మంగ తల్లికి వెయ్యి రూపాయల పరిహారం ఇప్పించటం లాంటి వివరాలు నమోదై ఉన్నాయి.

పాత్రలు, వాటి వ్యక్తిగత జీవితం, సంభాషణలు, భావోద్వేగాలు, కథనం కోసం కల్పించినవి.