Sunday, March 29, 2026

71. వృద్ధ స్త్రీలు - Old women by సచ్చిదానందన్



ప్రముఖ కవి శ్రీ కె. సచ్చిదానందన్ నూరు కవితలను అనువదించి నాలుగేళ్ళు కావొస్తుంది. దానికి వారు బ్లర్బ్ కూడా ఇచ్చారు. పుస్తకంగా తీసుకురావటం ఎందుకో కార్యరూపం దాల్చటం లేదు. ఈ ఏడు నా సొంత కవిత్వం తెచ్చే పనిలో ఉన్నాను. కనీసం వచ్చేఏడాది తప్పక తేవాలి .... నాకు నచ్చిన ఒక గొప్పకవిత దానిలోంచి....

.
71. వృద్ధ స్త్రీలు - Old women by సచ్చిదానందన్
 
వయసుడిగిన స్త్రీలు మంత్ర దండం చేతబూని
గాల్లో ఎగురుకుంటూ తిరగరు
అడవిలో ఉంటూ అర్ధంకాని శకునాలను చెప్పరు
 
ప్రశాంతమైన సాయం సమయాలలో
ఖాళీ పార్కు బెంచీపై కూర్చొని
పావురాలను పేర్లతో పిలుస్తూ గింజలు
విసురుతూ వాటిని ముద్దుచేస్తుంటారు,
ప్రభుత్వ ఆస్పత్రుల పొడవైన క్యూలలో
అలల్లా కంపిస్తూ నిలుచుని ఉంటారు లేదా
పోస్ట్ ఆఫీసులలో ఎన్నడో
పరదేశంలో మరణించిన
కొడుకు నుంచి ఉత్తరం కొరకు
వట్టిపోయిన మబ్బులా ఎదురుచూస్తుంటారు

వీధులు సంచరించేటపుడు
వాన తుంపరలా గొణుక్కుంటూ.
ఆకాశంలోకి విసిరినది ఏదో
ఇంకా క్రిందకి తిరిగిరానట్లు రెప్పవేయక
అలా పైకి చూస్తూనే ఉంటారు
షాపు అరుగులపై కలలు లేని నిద్రలో
డిసంబరు రాత్రుల్లా వారు వణికిపోతుంటారు

సగం మూసుకుపోయిన వారి కళ్ళల్లో
ఇంకా ఊయలలున్నాయి.
అలసిపోతున్న వారి జ్ఞాపకాలలో
ఇంకా కలువలు, క్రిస్టమస్ లు ఉన్నాయి.
వారి చర్మంపై ఒక్కో ముడతకూ
ఒక్కో జానపదకథ ఉంది.
వారి జారిపోయిన రొమ్ములలో
ఎవరికీ అక్కరలేదు కానీ
ఇంకా మూడు తరాలకు సరిపడా పాలున్నాయి

అన్ని ఉదయాలు వారిని చీకట్లో వదిలివేసాయి
వారికి చావంటే భయం లేదు
వారేనాడో మరణించారు.

వృద్ధ స్త్రీలు ఒకప్పుడు మహాద్వీపాలు
వారిలో దట్టమైన అరణ్యాలు, సరస్సులు, పర్వతాలు
అగ్నిపర్వతాలు ఇంకా కల్లోల అగాథాలు ఉండేవి
భూమి చల్లారకమునుపు అగ్నిగోళంగాఉన్నపుడు
వారు కరిగిపోయారు, కుచించుకుపోయారు
ఉత్త మేప్ లు గా మిగిలిపోయారు

వారిని నువ్వు ఇపుడు మడతపెట్టవచ్చు
జేబులో పెట్టుకోవచ్చు:
ఎవరికి తెలుసు, నీ ఇంటికి వెళ్ళే దారి చూపటంలో
వారు నీకు సహాయపడొచ్చు

Old women -2007 by Satchidanandan K.

అనువాదం: బొల్లోజు బాబా








No comments:

Post a Comment