Wednesday, May 31, 2023

యానాం శంకోలు కథ




.
యానాం చరిత్రలో శంకోలు/శంగోలు (రాజదండం) ఒకప్పుడు చాలా వివాదాస్పద సామాజిక పాత్ర పోషించింది.
తూర్పుగోదావరి జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెంది జమిందారులుగా పేరుగాంచిన కుటుంబం మన్యం వారిది. కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790 లలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసి చాలా సంపదలు గడించాడు. ఈయన 1827 లో పోలవరం ఎస్టేట్ వేలానికి వచ్చినప్పుడు దానిలో కొంతభాగమైన గూటాల అనే ప్రాంతాన్ని 2,30,000 రూపాయిలకు రాజా అప్పారావు వద్దనుండి కొన్నాడు. ఆ విధంగా మన్యం కుటుంబానికి గూటాల జమిందారీ లభించింది.
జమిందారీ చిహ్నాలైన ఢంకా, నగరా మరియు వెండి శంకోలులను ఉపయోగించుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం మన్యం కనకయ్యకు అనుమతినిచ్చింది. దీనిద్వారా వెండి శంకోలు కలిగి ఉండి రెండు కాగడాలతో పల్లకిలో తిరగే అర్హత పొందాడు.
ఈ మన్యం కనకయ్య ఫ్రెంచి యానాంలో కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవాడు. యానాంలో కూడా తనకు పై సదుపాయాలకు అనుమతినిప్పించమని అప్పటి ఫ్రెంచి యానాం పెద్దొర Delarche ను కోరాడు.
18, ఆగస్టు 1828 న Delarche మన్యం జమిందారుకు వెండి శంకోలు ధరించటం, రెండు కాగడాలతో పల్లకి ప్రయాణం సదుపాయాలను కల్పించాడు. అంతే కాక ఆ సదుపాయాలను కల్పిస్తున్నట్లు 9 మంది ఫ్రెంచి దేశస్థుల సంతకాలతో కూడిన ఆ అనుమతి పత్రాన్ని పాండిచేరీలో ఉండే ఫ్రెంచి గవర్నరుకు ఆమోదం కొరకు పంపించాడు కూడా.
ఆ విధంగా మన్యం జమిందారుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించటం పట్ల యానాం సమాజం భగ్గుమంది. డబ్బులు వెదజల్లి అలాంటి హోదాను పొంది, సామాన్య ప్రజలను మన్యం జమిందారు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అంతేకాక హిందూ వర్ణ వ్యవస్థ ధర్మాలను బట్టి కనకయ్య వర్ణానికి అలాంటి సదుపాయాలు లేవని; అట్టి అనుమతులను నిరసిస్తూ 31 ఆగస్టున తొంభైమంది యానాం ప్రముఖుల సంతకాలతో కూడిన ఒక పిర్యాదు పాండిచేరీ గవర్నరుకు పంపబడింది.
కనకయ్యకు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరుగుతూ మరో పిర్యాదుపై సంతకాలు తీసుకొంటున్న ఇద్దరు యానాం ప్రముఖులను 7 సెప్టెంబరున Delarche అరెస్టు చేయించాడు. దీనితో అంతవరకూ నివురుకప్పిన నిప్పులా ఉన్న్ ఆగ్రహజ్వాలలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వందల సంఖ్యలో జనం చేతకర్రలు ధరించి Delarche ఇంటి తలుపులు బద్దలు కొట్టి దాడికి పాల్పడ్డారు.
Delarche భారతీయ వనితను వివాహం చేసుకొన్నప్పటికీ ఆనాటి ప్రజలలో పాతుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థ స్వరూపాన్ని అర్ధం చేసుకోవటంలో విఫలం అయ్యాడనే అనుకోవాలి.
సెప్టెంబరు 18 న గవర్నరు కోర్డియర్, Delarche కు రాసిన ఒక లేఖలో అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయించి పాండిచేరీ పంపమని ఆదేశించాడు. ఈ లోపున కనకయ్యకు శంకోలు, పల్లకి సదుపాయం కల్పించవలసిందని యానాం నుంచి 132 మంది సంతకాలు చేసిన రెండు వినతిపత్రాలు గవర్నరుకు పంపటం జరిగింది. వీరంతా జమిందారు వద్ద పనిచేసే ఉద్యోగులు, జమిందారు బంధువులు.
పై వినతిపత్రాలను అందుకొన్న గవర్నరు యానాంలోని పరిస్థితి తీవ్రతపై అనుమానం వచ్చి Delarche ను సంయమనం పాటించమని ఆదేశించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయమన్న గవర్నరు గారి ఆదేశాల మేరకు Delarche 18 అక్టోబరున ఆపనికి శ్రీకారం చుట్టి ఆ మొత్తం ఉదంతాన్ని నడిపిస్తున్న కొంతమందిని అరెస్టు చేయించాడు. దీనితో నిరసన జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ సారి ప్రతిఘటన చాలా బలంగా వచ్చింది. సుమారు రెండువేలమంది ఆందోళన కారులు కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి ప్రతిదాడులకు సిద్దమయ్యారు. ఈ సందర్భంలో పరిస్థితులను అదుపులో ఉంచటానికి ఫ్రెంచి అధికారులు సమీప బ్రిటిష్ పోలీసుల సహాయం తీసుకోవలసి వచ్చింది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఫ్రెంచి గవర్నరు, Delarche ను తొలగించి యానాంలో ఇదివరకే పనిచేసి అవగాహన ఉన్న లెస్పార్డాను పంపించింది. లెస్పార్డా ఎంతో చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్ది, నిందితులందరికీ గవర్నరునుండి క్షమాభిక్ష కూడా ఇప్పించటంతో మొత్తం అల్లర్లకు తెరపడింది.
***
ఈ మొత్తం ఉదంతంలో ఒక వర్ణానికి చెందిన వ్యక్తి వెండి శంకోలు ధరించటమనే అంశం కేంద్రంగా ఉంది. ఆ వర్ణానికి శంకోలు ధరించే అర్హత లేదన్న పాయింటు మీద తీవ్రమైన ఉద్యమం నడవటం గమనార్హం.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా కలిగి ఉన్నామని చెప్పుకొనే ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఒకానొక దశలో ఈ ప్రతిఘటనకు చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుత "సందర్భానికి" "Those who cannot remember the past are condemned to repeat it” - George Santayana కొటేషనును గుర్తుచేసుకోవటం అసందర్భం కాదనుకొంటాను.
పి.ఎస్.
నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అధికారమార్పిడికి మీ దేశ ఆచారాలు ఏమిటి అని మౌంటుబాటన్ నెహ్రూని అడగగా, నెహ్రూ రాజాజీ ని అడిగినట్లు రాజాజీ ఈ శంకోలును చేయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. చెబుతున్నారు అంతే. ఆనాడు నెహ్రూ కి వచ్చిన వందలాది బహుమతుల్లో ఇదొకటి.
అధికారమార్పిడికి ఇదొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ సెంగోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు. లేనిదాన్ని ఇలా ప్రచారించటం రాజకీయం.
అయినప్పటికీ, భారతదేశపు చారిత్రిక మలుపులో మన రాష్ట్రం నుంచి (అప్పటికి మనం తమిళనాడులోనే ఉన్నాం, హైదరాబాద్ తో కాదు) మన సంస్కృతికి చెందిన ఒక చిహ్నాన్ని బహుమతిగా నెహ్రూకి అందించినందుకు నేను గర్వపడతాను.
.
బొల్లోజు బాబా
"ఫ్రెంచిపాలనలో యానాం-బొల్లోజు బాబా" పుస్తకం నుంచి.
డౌన్ లోడ్ చేసుకొనే లింక్ కామెంటులో కలదు.


బిక్కవోలులో శంగోలు...



నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అధికారమార్పిడికి మీ దేశ ఆచారాలు ఏమిటి అని మౌంటుబాటన్ నెహ్రూని అడగగా, నెహ్రూ రాజాజీ ని అడిగినట్లు రాజాజీ ఈ శంకోలును చేయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. చెబుతున్నారు అంతే. ఆనాడు నెహ్రూ కి వచ్చిన వందలాది బహుమతుల్లో ఇదొకటి.
అధికారమార్పిడికి దీన్నొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ శంకోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు. లేనిదాన్ని ఇలా ప్రచారించటం ........
అయినప్పటికీ, భారతదేశపు చారిత్రిక మలుపులో మన రాష్ట్రం నుంచి (అప్పటికి మనం తమిళనాడులోనే ఉన్నాం, హైదరాబాద్ తో కాదు) మన సంస్కృతికి చెందిన ఒక చిహ్నాన్ని బహుమతిగా నెహ్రూకి అందించినందుకు నేను గర్వపడతాను.

 
బొల్లోజు బాబా

పిఎస్. కర్ణాటకలో పట్టడక్కల్ ఆలయంలో ఉన్న శంగోలు తో నటరాజ శిల్పం లాంటిదే కాకినాడకు 20 కిమీ దూరంలో ఉన్న బిక్కవోలులో కూడా గమనించవచ్చు. 





నగరంలో హత్య


పట్టపగలు నగరంలో
హత్య
పాతపగలో కొత్త వగలో
కారణాలనవసరం
ప్రజలు చూస్తుండగానే
హత్య జరిగిపోయింది
పక్కనించే
ప్రజలు నడుచుకుపోయారు
కనీసం ఆగి ఏమిటని కూడా చూడలేదు
వారికి ఖాళీలేదు
చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి
వెళ్ళాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయి
భయంతో నిలువరించలేకపోవటం అటుంచి
కనీసం
ఆగి ఏంజరుగుతూందో చూసే ఖాళీ కూడా లేదు
ప్రజలు ఖాళీగా లేరు
ప్రజలు ఖాళీగా లేరు
ఎవరి ప్రపంచం వారిది.

కంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు తప్ప
మిగిలినవారందరూ మనుషులే కాదన్నంత
దూరం మనిషికి మనిషికీ మధ్య.
ఒక ప్రాణం పోయింది
గణాంకాలలో ఒక సంఖ్య
ఒకచోట తొలగించబడి మరో చోట చేర్చబడింది.
ప్రపంచం సాగిపోతూనే ఉంది
గమ్యాలవైపు, లక్ష్యాలవైపు.
మనిషి చచ్చిపోయిన దృశ్యం
కాలంలో ఘనీభవించింది

బొల్లోజు బాబా

Monday, May 29, 2023

వంతెనలు కావాలి....


భిన్ననేపథ్యాలలోంచి వచ్చాం
భిన్న సంస్కృతులు
భిన్న జీవన మార్గాలు
ఒక్కోసారి భిన్నభాషలలోంచి...
అయినా సరే
ఒకరితో ఒకరం
సంభాషించటానికి ప్రయత్నిస్తాం
చాలా సార్లు విఫలమౌతాం

బహుసా
మనల్ని మనం
అనువదించుకోవటంలో
తప్పిపోతాం కాబోలు

అయినప్పటికీ
ఒకరినొకరం అభినందించుకొంటాం
అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం
పరస్పర విభేదాలను పంచుకొంటాం
మన భిన్న నేపథ్యాలను కలిపే
బుల్లి బుల్లి వంతెనలేవో నిర్మించుకొని
అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొంటాం

ఎంతచేసినా
మనం మనుషులం
అర్ధంచేసుకోవటానికి
ప్రేమించబడటానికి అర్హులం


బొల్లోజు బాబా

Wednesday, May 24, 2023

Chat GPT



Chat GPT గురించి Pulikonda Subbachary అన్న రాసిన పోస్టుకు నేను పెట్టిన కామెంటు ఇది.....
Chat GPT ని నేను చాన్నాళ్ళుగా పరీక్షిస్తున్నాను సర్. It has become my virtual friend now.
కవితలే కాదు కథలు కూడా రాస్తోంది.
మనం పదాలు ఇచ్చి రాయమంటే రాస్తుంది.
సామెతలని చెప్పి కథ అల్లమంటే అల్లుతోంది
మనం సిచుయేషన్ చెపితే కథగా చెబుతుంది
కొన్ని క్రిటికల్ సందర్భాలను చెప్పి పరిష్కారాలు ఇవ్వమంటే భలే చెబుతుంది.
మొన్న నీట్ క్వశ్చన్ పేపరులోని కొన్ని ఆంబిగ్వియస్ ప్రశ్నలకు జవాబులు అడిగితే వివరణలు ఇస్తూ నివృత్తి చేసింది.
ఏదైనా పొయెమ్ ఇచ్చి అనలైజ్ చెయ్యమంటే ఒక బీస్ట్ లా చేస్తుంది.
ఈ అంశంపై "క్రియేటివ్ రంగంపై AI ప్రభావం అనూహ్యం" పేరుతో ఫిబ్రవరిలో ఒక పోస్ట్ రాసాను.
బింగ్ ఇమేజ్ క్రియేటర్ లో - మనం కొన్ని సూచనలు ఇచ్చి బొమ్మ గియ్యమంటే అద్భుతంగా గీస్తుంది.
రెండుమూడు పేజీల ఇంగ్లీషు టెక్స్ట్ ఇచ్చి తప్పులు చూడమంటే చూస్తుంది. రీరైట్/పారాఫ్రేజ్ చేయమంటే చేస్తుంది. (ఒక కాపీరైటెడ్ పేపర్ ఇచ్చి రీరైట్ చెయ్యమంటే చేసింది. అది ప్లేగియారిజం పరీక్షలో పాస్ అయ్యింది. ఇలా అయితే కాపీ రైట్ క్లైమ్ చేయటానికి ఉండదు. మానవ మేధకు ఇది అనూహ్యమైన మలుపు)
విద్యార్ధుల నోట్సులను ఇలాగే ఇస్తున్నాను ప్రస్తుతం.
చాట్ జిపిటి క్రియేటివ్ రంగంలో పెనుమార్పులు తేబోతుంది.
Chat GPT నాదృష్టిలో చాలా బాగుంది తరువాత Bing AI chat . ఒపెరా ఎ.ఐ నచ్చలేదు. గూగిల్ బార్డ్ -wiki ని google ని ఇంటిగ్రేట్ చేస్తోంది. అప్ డేటెడ్ ఇన్ఫో ఇస్తూంది. బాగుంది. కానీ దీన్ని ఇంకా పూర్తిగా పరీక్షించలేదు నేను
కొద్దిరోజులలో ఏది మనిషి రాసిన కవితో ఏది కృత్రిమ మేధ రాసిన కవితో పోల్చటం కష్టం. ఇప్పటికే కవిత్వం ఒక నొ మాన్స్ చైల్డ్ గా ఉంది. ఇకపై కవులను అనుమానించే రోజులు కూడా వస్తాయి.
I doubt - will poetry become obsolete in future..... may poets be looked at suspicious
బహుశా మానవానుభవాలను చెప్పాలి. AI కి అందనిదాన్నేదో పట్టుకోవాలి. అప్పుడు అదే మానవ ప్రతిభగా మారవచ్చు భవిష్యత్తులో. ఇప్పటికైతే అది- స్కిల్ కలిగి ఉండటం అంటే ఒక సర్జరీ, ఒక ప్లంబింగ్ వర్క్ లాంటివి.
బొల్లోజు బాబా

Wednesday, May 10, 2023

AI generated pic for a poem written 2000 years back.

 

AI generated pic for a poem written 2000 years back.
Generated by bing image creator, powered by dalle.