Sunday, December 31, 2017

చీకటి దిష్టిబొమ్మ


జీవితకాలం శ్రమించి
చిత్రించుకొన్న చిత్తరువులో
కరిగి ప్రవహించే గడియారం
కనుల చివర నిలిచిన అశ్రుబిందువు
వేదనో నవ్వో తెలియని పెదవుల రహస్యలిపి
తుప్పుపట్టిన కిటికీ చువ్వలు
అయిందేదో అయిపోయింది
ఎండిన పూజాపత్రిని ఏట్లో కలిపినట్లు
నిన్ను బాధించిన క్షణాలను మరచిపో.
పట్టుబడిన ఎలుకలను ఊరవతల విడిచినట్లు
నిన్ను బాధించిన వ్యక్తులను మరచిపో.
మాయబుట్టని పొలిమేర చెట్టుకు కట్టినట్లు
నువ్వు బాధించిన సందర్భాలను మరచిపో.
గతాన్నొక గాలిపటం చేసి ఎగరేసి
దాని దారం తెంపేయ్
వెలుతురును అడ్డుకొంటున్న
చీకటి దిష్టిబొమ్మను దహనం చేసేయ్
కొబ్బరి పాకుడు లాంటి మెత్తని గిట్టలతో లేగదూడ
మొదటిసారిగా ఎలా నిలబడుతోందో చూడు
పాదం బరువుకు ఒరిగిన పచ్చిక మెల్లమెల్లగా
ఎలా నిటారుగా తలెత్తుకొంటుందో చూడు
బొల్లోజు బాబా

Thursday, December 21, 2017

పతంగుల రుతువు - 'Kite Season' by Eunice de Souza


చెట్లకు తోరణాల్లా వేలాడుతున్నాయి
రంగురంగుల పతంగులు
చెట్లకు తోరణాల్లా వేలాడుతున్నాయి
పక్షులు
గాజురజను పూసిన దారానికి
రెక్కో కాలో చిక్కుకొని
source: "Kites Season" by Eunice de souza
అనువాదం: బొల్లోజు బాబా

Tuesday, December 5, 2017

ఫ్రాగ్మెంట్స్


1.
కొత్తవిలువలతో
వ్యామోహాలతో
ఆక్రమింపబడిన కాలమిది
దేహాలలో పాల బదులు
ఇనుప గుప్పెళ్ళతో పూలను పిండి
వండిన అత్తరు ప్రవహిస్తోంది
2.
నీవు వెళ్ళిపోయాకా
ఈ దేహం నిర్జీవ నెమలీకలా ఉంది
నడివేసవిలో వడగాలిలా ఒంటరిగా
వీధులలో సంచరిస్తోంది
3.
ఎంతో స్వచ్చంగా బోసి నవ్వులతో
ఇక్కడికి వస్తాం
మురికి మురికిగా మారి
ఏడుస్తూ నిష్క్రమిస్తాం
4.
కాలం అప్పుడప్పుడూ కాసేపాగి
తన సెల్ఫీ తానే తీసుకొంటోంది
ఒక్కో ఫొటో
రక్తమూ కన్నీళ్ళు నింపుకొన్న
కవిత్వమై చరిత్రలోకి ఇంకిపోతోంది
5.
ఓ రాజకీయనాయకుడు
రెండువేళ్ళూ పైకెత్తి గాల్లో
అటూ ఇటూ ఊపుతున్నాడు
ఎవరి విజయమో తెలియని
వెర్రిజనం కూడా ఊపుతున్నారు
బొల్లోజు బాబా

Monday, December 4, 2017

మిత్రులకు ఆహ్వానం
అవకాశం ఉన్న మిత్రులు తప్పక హాజరు అవుతారని ఆశిస్తున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా

Friday, December 1, 2017

A B C D లు


A ఫర్ ఆపిల్ కి
మైనం కోటింగ్ తో
ఊపిరాట్టం లేదు
B ఫర్ బాల్
ఒత్తిడి భరించలేక
లేని గ్రౌండ్ లో ఉరేసుకొంది
C ఫర్ కాట్
బాగ్ పైపర్ వాయించుకొంటూ
గుహ వైపు వెళుతోంది
D ఫర్ డాల్
వాణిజ్య ప్రకటనలకు
తైతెక్కలాడుతోంది
బొల్లోజు బాబా