Friday, March 31, 2017

Sister Anonymous

Putting her two hands in his armpits she lifted him up from toilet seat and brushed his teeth, washed his body blotted with towel, dressed him carefully moved him to the bed and made him lay down on it While searching the tablets she asked "you said your son is asking you to come home, why dont you go?" With tear filled eyes He was staring at the cieling for mentioning his son who stopped even ringing him. Bolloju Baba

Thursday, March 30, 2017

ఉగాది కవిసమ్మేళనంలో కవితా పఠనం

ఆంధ్రప్రదేష్ భాషా సాంస్కృతిక శాఖవారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో కవితాగానం మరియు మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి గారిచే సన్మానం.
ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ జి.వి. పూర్ణచంద్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.



వసంతసేన ఏమంది?

శీతవేళ సెలవు తీసుకొన్నాక
వసంతసేన మల్లెలపల్లకిలో అరుదెంచింది
కోయిలలు, మామిడిపూతలు, వేపచిగుర్లు, 
వెన్నెల రాత్రులు ఆమె  సైన్యం

ఆమెకు పదార్చనచేయటానికి కవులు
అక్షరసుమాల్ని సమాయత్తం చేసుకొన్నారు.
శుకపికములు ఆమెకు స్వాగతగీతాలాలపించాయి.
ఆమె బంగారు మేని తేజస్సు చుట్టూ పరిభ్రమించే
సీతాకోకలు దివ్యత్వాన్ని పొందుతున్నాయి.
నులివెచ్చని కాంతి తన కిరణాల వేళ్లతో
ఆమెను తాకి మురిసిపోతోంది
కోయిలలు తమ శ్రావ్య గళాలతో
ఆమె సౌందర్యాన్ని గానం చేస్తున్నాయి
ఆమె రాకకు పులకించిన తరువులు 
కొత్తపూతల పుప్పొడులను రాల్చుకొన్నాయి

తేనెలూరు చూపులతో పరికించి చూసిన వసంతసేన 
"కాలం ఒక్కటే శాశ్వతం.... ప్రేమే సత్యం" అని అంది.

నిజమే కదా!
అనాదిగా సమస్త ప్రకృతీ ఆమె మాటల్లో 
లయం అయ్యే ఉంది.
పుడమి సంగీతాన్ని నూత్నసృష్టి, మృత్యువు
నిత్యం శ్రుతిచేస్తూనే ఉన్నాయి.
జీవితపు దారులను ప్రేమ తన పరిమళాలతో
ప్రకాశింపచేస్తూనే ఉంది

మిత్రమా!
కాలానికో, ప్రేమకో వినమ్రంగా నమస్కరించి
అస్థిత్వాన్నో ఆత్మనో ఆనందంగా 
సమర్పించుకోవటంలో ఎంతటి
జీవనమాధుర్యముంది!

బొల్లోజు బాబా



Monday, March 27, 2017

దోసిలిలో నది కవితా సంపుటిపై వ్రాసిన సమీక్ష

శ్రీ దాట్ల దేవదానం రాజు గారి దోసిలిలో నది కవితా సంపుటిపై వ్రాసిన సమీక్ష ఆంధ్రప్రభ లో.   ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.  




పూర్తిపాఠం ఇది

దోసిలినిండా కవిత్వం

మట్టినీ ఆకాశాన్నీ
నదినీ పర్వతాన్నీ
కరుణనీ మానవతనీ
ఒక సమూహం కోసం
ఏకాంతంగా ప్రేమించేవాడే కవి ...... అన్న వాక్యాలు దాట్ల దేవదానం రాజు ఇటీవల వెలువరించినదోసిలిలో నదికవితాసంపుటి  లోనివిపై వాక్యాలకు సంపుటిలోని కవిత్వం నిలువెత్తు దర్పణం పడుతుందివైయక్తికంగా ఉంటూనే, సామాజికంగా పలకటం ఆధునిక కవిత్వలక్షణంఅత్యంత సంక్లిష్టమైన గుణాన్ని దాదేరా ఒక కవితలో
కవిత్వం ఒక తపస్సు
ఒక దీపస్తంభం .....  అన్న అలతి అలతి పదాలలో నిర్వచిస్తాడు. ఆత్మ దర్శనం కోసం చేసే తపస్సు వైయక్తికమైనదిదారిచూపటం కోసం దీపస్తంభమై నిలబడటం సామాజికంరెంటినీ సమన్వయపరుస్తూ సృజించేదే ఉత్తమకవిత్వంగా నిలుస్తుంది, “దోసిలిలో నదిగా మారుతుంది.

నిర్మలమైన భావధార, చిక్కని అనుభూతి, ఇజాలతో సంబంధం లేని జీవనస్పర్శలు, తేటగా కనిపిస్తూనే లోతుగా తాకే వాక్యాలు దాదెరా కవిత్వలక్షణాలుపడవప్రయాణం, వానచినుకులు, రాజకీయనాయకుల వాగ్దానాలు, మట్టి, వెన్నెల వంటి సాధారణ వస్తువులు అసాధారణ కవితలుగా మారటం సంపుటిలోని అనేక కవితలలో చూడొచ్చు.
ఒక కాంతిగురించిఅనే కవితలో 
వెన్నెల వెలుగుల్ని
మంచిగంధంలా
అరగదీసి రంగరించి
తెలుగింటి ముగ్గులా
బొటనవేలు....చూపుడువేలు సందున
శబ్దమై జారితే
కవిత్వమౌతుంది. ...... అంటాడువెన్నెల, గంధం, ముగ్గు అనే మూడు పదాలతో సాధించిన పదచిత్రం  బిగుతైన నిర్మాణానికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

కడియం పూలనర్సరీలకు ప్రసిద్ది. ఊరిమీదుగా బస్సులో ప్రయాణిస్తున్నా ఒక పరిమళకాంతి మొహానికి తాకుతుంది.  “పరిమళ కంకణంఅనే కవితలో  ఊరిని
మట్టి మంచి గంథంలోంచి
మొలకెత్తి
గాలికి అంకితమైన
పరిమళాల కొలువు.... కడియం .....” అని చేసిన వర్ణనాసౌరభం హృదయానికి ఆహ్లాదకరంగా తాకకమానదు.

ఒక సభలో ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారి ప్రసంగం విన్నతరువాత వ్రాసిన కవితలో అనుభవాన్ని అద్భుతంగా ఇలా వర్ణిస్తారు దాదెరా.
ఒళ్ళంతా కళ్ళై
కవిత్వ సౌందర్యాన్ని వీక్షించాను
లుప్తమైన నూనెలో
వత్తిని అటూ ఇటూ జరుపుకొని
నన్ను నేను వెలిగించుకొన్నాను
చిరుదీపపు వెలుగులో
అలౌకికానందాన్ని పదిలపరచుకొన్నాను  (ప్రేరణ).  చిన్నచిన్న మాటలతో గొప్ప కవిత్వసౌందర్యాన్ని దర్శింపచేస్తాడుతనని తాను కవిత్వంతో వెలిగించుకోవటం అనేది అమేయమైన అలౌకికానందం. దాన్ని గొప్ప వొడుపుతో అక్షరాలలోకి వొంపి మనకందిస్తాడు.

జబ్బుకు మందేదీఅనే కవితలో ఒక వ్యక్తి స్వశక్తితో ఎదుగుతూ, పేరుతెచ్చుకొంటున్నపుడు చుట్టూ ఉండే కొంతమంది ప్రదర్శించే అసూయా, ద్వేషాలను వర్ణిస్తూ అలాంటి వ్యక్తుల గురించి  చివరలో
నీది రోగమేనని వైద్యుడూ చెప్పడు
నిన్ను నయం చేసే మందులుండవు
నేను నిన్ను కాపాడలేను  అని అంటాడుచిత్రంగా ఇదే సంపుటిలోనిసహృదయంఅనే కవిత అదే వస్తువును అవతలి పక్షం నుంచి చెపుతూ....
కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకొని
వేదన దిగమింగక్కర్లేదు
చీకటిలో కుమిలిపోనక్కర్లేదు
వాడి ఎదుగుదలను స్వాగతిద్దాం  అంటూ మొదలౌతుంది. ఎదుటివాని ఎదుగుదలకు అసూయచెందే జంతుస్థితినుండి మనుషులు సహృదయత కలిగిన ఉన్నతదశకు ఎదగాలని కవి ఆశిస్తున్నట్లు భావించాలి.

బియాస్ నది మృతులపై వ్రాసిన స్మృతిగీతంలో
కరకెరటమూ
సముదాయించి ఒడ్డు చేర్చలేదు
ప్రవాహపు నావ
అలలపై కూర్చుండబెట్టి
సేద తీర్చలేదు//
అగమ్య పథాన
జలఖడ్గం గుండెల్ని చీల్చింది (దుఃఖరసం).... అంటూ అలనాటి విషాదాన్ని శోకదృశ్యచిత్రాలుగా, పదునైన వ్యక్తీకరణలతో కనులముందు నిలిపి అనుకంప రగిలిస్తాడు.

తెలుగునేల రెండురాష్ట్రాలుగా విడిపోవటం పట్ల కవులందరూ అటో, ఇటో హృదయానుగతంగా స్పందించారుకవికూడా సమాజంలో భాగమే కనుక చుట్టూ జరిగే సంఘటనలకు తనవంతు బాద్యతగా స్పందించక తప్పదుఅందులో మినహాయింపు ఉండదు సందర్భాన్ని పురస్కరించుకొని  వ్రాసినకొత్త లోకాలుఅనే కవితలో
ఒక మేఘం కింద
ఉదయాలు రెండు
విడి ముద్దులు మధురం.”  అంటూ రెండు రాష్ట్రాలను రెండు కొత్తలోకాలుగా ఆవిష్కరించి ఆహ్వానించటం జరిగింది.

సంపుటిలోఉనికిఅనే కవిత రైతువెతల్ని ఎత్తిచూపుతుందిరుణ మాఫీ పేరుతో రైతులలో లేనిపోని ఆశలు కల్పించి, వాగ్ధానభంగం కావించిన నాయకులను ఉద్దేశించి
ప్రపంచం ఎప్పుడూ ఉంటుంది
రైతు కూడా ..... అని అనటం ద్వారా వారి అధికారం అశాశ్వతమని పరోక్షంగా హెచ్చరిస్తాడు.

మోహం, పరిమళం ఆచూకీ, తీరంగూడు, పడవ, సగం తర్వాత వంటి కవితలు సున్నితమైన జీవనానుభవాలకు చక్కని కవిత్వరూపాలు

పుస్తకంలో మొత్తం 37 కవితలున్నాయి. దీనికి ముందుమాటలు శ్రీ ఎం. నారాయణ శర్మ, డా.సీతారాం లు వ్రాసారు. ముఖచిత్రం శ్రీ ముమ్మిడి చిన్నారి సమకూర్చారు

సరళంగా ఉంటూనే లోతైన అభివ్యక్తిని, ఆలోచింపచేసే తత్వాన్ని పొదుగుకొన్నదోసిలిలో నది”  మంచికవిత్వాన్ని ఇష్టపడేవారందరికీ నచ్చుతుంది.

వెల: 60 రూపాయిలు
కాపీల కొరకు
దాట్లదేవదానం రాజు
8-1-048 ఉదయిని
జిక్రియనగర్
యానాం – 533464
ఫోన్: 9440105987

బొల్లోజు బాబా - 9849320443

Friday, March 24, 2017

ఇసక లారీ


జీవం కోల్పోయి
ఎండిన కన్నీటి చారికలా
మిగిలిపోయిన నది
యూనిట్లు యూనిట్లుగా తరలించబడుతోంది
ఎడారి నగరాల నిర్మాణం కొరకు
మెలికలు తిరిగి, లుంగచుట్టుకొని
తరుచ్ఛాయల్ని తలచుకొంటూ
బుల్ డోజర్ కింద ఆదీవాసీ చేసిన
అరణ్యరోదనను గుర్తుచేసుకొంటూ
అపుడెపుడో మేసిన వెన్నెల్ని
చందమామ రజనుగా రోడ్డుపై కార్చుకొంటూ
క్షతగాత్ర నది
ట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోంది
నగరం వైపు

బొల్లోజు బాబా

Monday, March 20, 2017

"వెలుతురు తెర" పుస్తకంపై సమీక్ష

ఆంధ్రభూమిలో నా "వెలుతురు తెర" పుస్తకంపై వచ్చిన సమీక్ష. మిత్రులు శ్రీ రవికాంత్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
వెలుతురుతెర పుస్తకం కినిగెలో ఈ క్రింది లింకులో లభిస్తుంది.

Sunday, March 19, 2017

అయితే ఏంటటా?


అవును నిజమే
చీరకింద తలగడ ఏదో కుక్కుకొని
నెలలునిండిన దానిలా
నటిస్తూ అడుక్కొంటోంది ఆమె.
జనాల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది.. తప్పే!
పాయింటుబ్లాంకులో నీ సంతకాలు పెట్టించుకొందా లేక
ఉపాధికల్పన పేరుతో నీ భూములు లాక్కొందా?
నీలా జరుగుబాటు లేనివాళ్ళు
చచ్చిపోవాలా ఏమిటీ?
బొల్లోజు బాబా

Saturday, March 18, 2017

పదే పదే పునఃసృష్టి....


ప్రతీదీ ఏదోఒకదానిలోకి
తెరుచుకొంటుంది.
కిటికీ ప్రపంచంలోకి 
ప్రపంచం అసమానతల్లోకి
అసమానతలు రక్తంలోకి
రక్తం తిరుగుబాటులోకి
తిరుగుబాటు భానోదయంలోకి
భానోదయం కిటికిలోకి
ప్రతీదీ ఏదో ఒకదానిలోకి
తెరుచుకొంటూనే ఉంది
అనంతంగా....
బొల్లోజు బాబా

Friday, March 17, 2017

పరిమళించిన ప్రేమ.....


ఖాళీ రేకుడబ్బాలో మట్టి నింపి
గులాబి మొక్కను పెంచుతోంది మా అమ్మాయి
స్కూలునుంచి వచ్చాకా
దానికి నీళ్ళు పోస్తూ, ఆకుల్ని సుతారంగా
నిమురుతూ మురిసిపోతుంది.
మొగ్గలేమైనా వచ్చాయా అని ప్రతిరోజూ
జాగ్రత్తగా పరిశీలిస్తుంది
"ఏ రంగు గులాబీలను పూస్తుంది
ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది" అంటూ
వాళ్లమ్మను ఆరాలు తీస్తుంటుంది .
ఒక రోజు
తనకు బిగుతైన గౌనుల్ని బ్యాగ్గులో పెట్టుకొని
స్కూలుకు తీసుకెళ్ళింది ఏదో చారిటీ ప్రోగ్రాం అంటూ

మర్నాడు ఉదయం ఒక గులాబీ
నవ్వుతూ ప్రత్యక్ష్యమయ్యింది ఆ మొక్కకు.
చప్పట్లు కొడుతూ ఆనందిస్తోంది మా అమ్మాయి
ఆ దృశ్యాన్ని
బహుసా ఎక్కడో ఎవరో ఓ పాప
తనకు సరిగ్గా సరిపోయిన గౌనును చూసుకొని
మురిసిపోయినప్పటి ఆనందం కావచ్చు
ఆ గులాబీ.

బొల్లోజు బాబా

Friday, March 10, 2017

ఎప్పటికీ పుట్టని కొడుకు కోసం ప్రార్ధన - Prayer for the Son Who Will Never Be Born by Luis Rogelio Nogueras (క్యూబన్ కవి)


మనం చాలా పేదవాళ్లం బిడ్డా చాలా పేదవాళ్ళం
ఎలుకలు కూడా మనపై జాలి పడేవి.
ప్రతీ ఉదయం మీ నాన్న టౌనుకెళ్ళి
ఎవరైనా శక్తికలవారు పని ఇస్తారేమోనని చూసేవాడు
- గుప్పెడు బియ్యం కొరకు పసులకొట్టం శుభ్రం చేసే పనైనా సరే.
యాచనల్ని, మూలుగుల్ని వినకుండా, కనీసం ఆగకుండా
శక్తివంతులు ముందుకు సాగిపోయేవారు.
మురికిదుస్తులవెనుక బక్కచిక్కిన దేహంతో
రాత్రెపుడో మీ నాన్న వచ్చేవారు వెలవెలబోతూ
నేను ఏడ్చేదాన్ని.
అప్పుడే నేను ప్రార్ధించాను
మాతృత్వాన్ని, గర్భధారణ శక్తిని ఇచ్చే Jizo ని
నిన్ను ఈ ప్రపంచంలోకి పంపించవద్దని, నా బిడ్డా
నిన్ను ఈ ఆకలి, అవమానాలకు అప్పగించవద్దనీ.
దయగల దైవం నా మొర ఆలకించింది.
అలా ఏళ్లు గడిచిపోయాయి నిస్సారంగా.
నా రొమ్ములు ఎండిపోయాయి
మీ నాన్న చనిపోయాడు
నేను ముసలిదాన్నయిపోయాను.
నేనూ ముగింపుకొరకు ఎదురుచూస్తున్నాను
నల్లనిదుప్పటి విసిరి కనులు కప్పే రాత్రికొరకు
ఎదురుచూసే సూర్యాస్తమయంలా.
Jizo కు ధన్యవాదాలు
కనీసం నువ్వైనా యజమానుల కొరడా దెబ్బలు,
ఈ బాధాకరమైన కుక్కబ్రతుకు తప్పించుకొన్నావు.
ఏదీ, ఎవ్వరూ నిన్ను బాధించలేరు.
నేర్పుకల బాణం సుదూర గద్దను చేరలేకపోయింది
ఈ లోకపు బాధలు ఏవీ నిన్ను చేరలేవు.
అనువాదం: బొల్లోజు బాబా

Tuesday, March 7, 2017

ఫ్రాగ్మెంట్స్



1.
కాలంలా ఒకసారి
మొఖం చూపించి పారిపోదు కాంతి
ఇక్కడిక్కడే తారాడుతుంది
పువ్వుల్లోనో, నవ్వుల్లోనో

2.
అందమైన సీతాకోకలు
గాల్లో తేలిగ్గా అలా ఎగిరే దృశ్యం
హాయిగా అనిపించేది
ఒకరోజు
రైల్వే ట్రాక్ పై చెత్త ఏరుకొంటున్న
మురికిబట్టల సీతాకోకను
చూసే వరకూ.....

3.
పెద్ద చేప వలలో చిక్కింది
భారంగా ఒడ్డుకీడ్చుకొచ్చారు.
అదృశ్య కన్నీళ్ళకు
సంద్రం అనాదిగా ఉప్పుతేరుతూనే ఉంది.

4.
పూవులపై సీతాకోకల్ని
చిత్రించిందెవరో!
ఏవి పూలు?
ఏవి ప్రతిబింబాలు?

5.
జీవితకాల నిరీక్షణ తరువాత
నాకర్ధమైంది
నీవు రాకుండా ఉండటమే
నాకు ఇష్టమని!

Sunday, March 5, 2017

Stains on our hands.....



The little boy
is shooting at every one
with his toy pistol
purchased at a local fair.
Mom, Dad, Sis are acting dead a while
The little boy is laughing aloud
chasing them joyfully to fire at

Mankind is weaning on the thoughts like
gun means amusement
cruelty is pleasure.

Bolloju Baba

ఒక మంచి కవిత పోలికలు – విన్నకోట రవిశంకర్

ఒక మంచి కవిత
పోలికలు – విన్నకోట రవిశంకర్
తన అనుభవాలను తన ఆలోచనలను వాటి ద్వారా తాను గుర్తించిన విశ్వసత్యాలను కవిత్వంలో ఆవిష్కరించాలనే తపనేకాని కవిత్వం ద్వారా ఏదో ఒక లాభం పొందుదామనే ఆశ ఇతనిలో కనిపించదు. అందుకే ఈ నాటి కవిలోకంలో రవిశంకర్ అరుదైన కవి -- చేరా 
*****
పునరపి మరణం పునరపి జననం అనేది ఒక ఉదాత్తభావన. అలా అనుకోకపోతే గతించిపోయిన ప్రియమైన వారి వియోగాన్ని తట్టుకొని ఈ జీవనయానాన్ని కొనసాగించటం రసహీనంగా అనిపిస్తుంది. ఇంట్లో పసిపాదాలతో తారాడే పిల్లలు నిజానికి ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దల జన్యువులకు కొనసాగింపు. వారిలో ఆ పెద్దలను చూసుకోవటం ఒక ముచ్చట. అలాంటి ఒక జీవనానుభవాన్ని కవిత్వం చేస్తుంది విన్నకోట రవిశంకర్ "పోలికలు" అన్న కవిత.
కవిత ఎత్తుగడే ఎంతో గొప్పగా ఉంటుంది. "దారితప్పిన ఒక జ్ఞాపకాన్ని ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది" అంటూ మొదలవుతుంది కవిత. జ్ఞాపకాలు అనేవి ఒక ప్రవాహసదృశమని, అందులో మరుగున పడుతున్న కొన్నింటిని దారితప్పిన జ్ఞాపకాలుగా వర్ణించటం, అలాంటి ఒక జ్ఞాపకాన్ని ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చిందనటం- ఈ పసిపిల్ల ఏం చేసిందో ఒక సంపూర్ణ చిత్రంగా మనకళ్లముందు నిలుపుతాడు కవి.
రెండవ ఖండికలో ఆ పసిపిల్ల ఎవరి స్మృతులను వెతికి తెచ్చిందో వర్ణిస్తారు రవిశంకర్
మూడవ ఖండికలో, ఈ పిల్లను ఆ గతించిన పెద్దలందరూ ప్రేమతో సంతకాలు చేసి పంపిన బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ అనటం ఒక గొప్ప పోలిక.
"మూసిన ఆ పాప గుప్పెట్లో ఉన్నది ఆ పెద్దల సందేశం కావచ్చు" అంటూ కవిత ముగిసే సరికి.... మనం కూడా మన పిల్లలలో కనిపించే పెద్దల పోలికలను మానసికంగా వెతకటానికి ప్రయత్నిస్తాం.
ఒక కవిత ముగిసాకా కూడా కొనసాగటం అంటే ఇదే కదా!
పోలికలు
దారితప్పిన ఒక జ్ఞాపకాన్ని
ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది
గతకాలపు చీకటిగదిలో పారేసుకొన్న ఒక విలువైన అనుభవాన్ని
అతి సహనంతో ఇది వెతికి తెచ్చింది.
ఎన్నాళ్లక్రితమో బూడిదగా మారి
నీళ్ళల్లో కలిసిపోయినవాళ్ళు
దీని పాలబుగ్గల్లోంచి మళ్ళీ పలకరించారు
పటాలుగామారి, కాలంలో
ఒకచోట నిలిచిపోయిన వాళ్ళు
దీని పసికళ్ళల్లో సజీవంగా కదిలారు.
ఎంతమంది గతించినవాళ్ళ ఆనవాళ్ళని
ఇంత చిన్ని శరీరంలో దొంతర్లు దొంతర్లుగా దాచిందో
ఇది వాళ్లందరూ ప్రేమతో సంతకాలుచేసి పంపిన
బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ లాగ ఉంది.
వివరణకందని దీని చిన్ని పెదవులమీది చిరునవ్వు
తమకు లభించిన ఈ కొనసాగింపుకి
వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు
మూసిన దీని గుప్పిట్లో దాచిఉంచింది
విప్పిచెప్పలేని వాళ్ళ సందేశం కావొచ్చు
----- విన్నకోట రవిశంకర్
.
బొల్లోజు బాబా

Thursday, March 2, 2017

రక్తం మరకలు



తీర్థంలో కొన్న బొమ్మతుపాకీతో
ఆ పిలగాడు ఒక్కొక్కరిపై
కాల్పులు జరుపుతున్నాడు.
అమ్మ, నాన్న, అక్కా కాసేపు
చచ్చిపోయినట్లు నటిస్తున్నారు.
పడీ పడీ నవ్వుతున్నాడా పిలగాడు
ఉత్సాహంగా తరుముతూ కాలుస్తున్నాడు

తుపాకీ అంటే వినోదమనీ
హింసే సంతోషమనీ
మానవజాతి ఉగ్గుపాలతో నేర్చుకొంటోంది

బొల్లోజు బాబా