Monday, October 26, 2015

పక్షి ప్రేమికులు


ప్రతీరోజూ అతను
తట్టనిండా కొంత దయను
మోసుకొని వచ్చి ప్లాట్ ఫార్మ్ పై పేర్చి
ఒక మూలగా కూర్చొని
దారిన పోయే వాళ్ళ కళ్ళలోకి
చూస్తుంటాడు.
దయంటే ఏమీ కాదూ
వాని జీవితంలోని కొంత భాగమూ,
కొన్ని చెమట చుక్కలు,
కాస్త పల్లెటూరి మట్టీ అంతే!
వాటిని తీసుకొని,
సారెపై బుడగలా ఉబ్బించి, నిప్పుల్లో కాల్చి
తట్టలోకి ఎత్తుకొని పట్నం వచ్చి
ప్లాట్ ఫారం పై అమ్మకానికి పెడతాడు.
కరంటు తీగలమీద పక్షులు
ఆ పల్లెటూరి మట్టిని
విప్పారిన నేత్రాలతో చూస్తూంటాయి.
మట్టితో చేసిన ఆ పక్షిగూళ్ళను
ఎవరెవరో దయాళువులు
ఒక్కొక్కటిగా కొనుక్కుంటారు
ఇంటి బయట వేలాడదీయటానికి.
సాయింత్రానికి ఖాళీతట్టను
భుజానికి తగిలించుకొని
బయలుదేరేటపుడు
పక్షులు అతని తలపై తిరుగుతూ
అరుస్తూ, ఆనందంగా సాగనంపుతాయి.
బొల్లొజు బాబా
Published in Surya telugu dialy Monday, 26-10-2015

Thursday, October 8, 2015

అసమానతలు


వేకువని
తలోముక్కా చక్కగా
పంచుకొన్నాయి ప క్షు లు

కిరణాల్ని
ఏ పేచీ లేకుండా పత్రాల సంచుల్తో
పంచుకొన్నాయి తరువులు

ఇంధ్రధనసుని
పొరలు పొరలుగా ఒలుచుకొని
పంచుకొన్నాయి పూలు

పూలనీ
పుప్పొడి గుప్పెళ్ళతో
పంచుకొన్నాయి తుమ్మెదలు

పంచుకోవటం
మనిషెప్పటికి నేర్చుకొంటాడు?

Thursday, October 1, 2015

ఒక మేధావిని కలిసాను - చార్లెస్ బుకొవ్ స్కి

I Met A Genius- Charles Bukowski

ఈరోజు రైల్లో
నేనో మేధావిని కలిసాను
ఆరేళ్ళ వయసుంటుందేమో
అతను నా పక్కనే కూర్చున్నాడు
రైలు సముద్రతీరం వెంబడి వెళుతోంది
సముద్రాన్ని చూస్తూ అన్నాడతను
“పెద్ద అందంగా ఏం లేదని”

అవును నిజమే కదా అనిపించింది
మొదటిసారిగా

మూలం: చార్లెస్ బుకొవ్ స్కీ   - అనువాదం: బొల్లోజు బాబా