Tuesday, July 29, 2008

ఒకే ఒక ఆశ చాలు.......

వనంలో కార్చిచ్చు కదిలింది
అగ్నికీలలు వేన వేల నాలుకలతో
ఊగిపోతున్నాయి.

చెట్ల ఆకులు, పూవులూ,
వసివాడని మొగ్గలూ
మసివాడి పోయాయి.
పక్షులు ప్రశాంత తీరాలకై
ఎగిరిపోయాయి.
వేడిని తాళలేక
పులుగూ పుట్రా పరుగులెట్టాయ్.

అరణ్యం అగ్నిదుప్పటి
కప్పుకున్నట్టుంది.
నేలపై బూడిద ఎండలా
పరచుకొంది.

పచ్చని దృశ్య విధ్వంసం పూర్తయింది.
************

మనసుకు ఒక
అపజయం గుచ్చుకుంది.

వేన వేల నిరాశానీడలు
కదలాడుతున్నాయి.
స్వప్నాలూ, సౌరభాలు
మసివాడిపోయాయి.
సుఖ సంతోషాలు
విలాస విలాసాలకై ఎగిరిపోయాయి.
నిస్పృహా బూడిద
హృదంతా పరచుకొంది.

వెచ్చని దృశ్యం భళ్లున బద్దలయింది.
***********
ఆ మరునాడు
వనంలో మిగిలిన
ఒకే ఒక విత్తనం పగిలింది
పున:సృష్టి జరపడానికై.

ఆ మరునాడు
మదిలో జనించిన
ఒకే ఒక ఆశ రగిలింది
పునరుజ్జీవనం ఇవ్వటానికై.

బొల్లోజు బాబా

Tuesday, July 22, 2008

యూజర్ నేమ్ : మనిషి - పాస్ వర్డ్: మానవత్వంఓ యూజర్ నేమూ, పాస్ వర్డూ
ఇచ్చి దేముడు నన్నీలోకంలోకి దించాడు.

పాస్ వర్డెక్కడ మరచిపోతానోనని
హృదయంపై పచ్చబొట్టుగా వేయించుకున్నాను కూడా.

బాల్యం వరకూ హృదయం నాతోనే ఉంది
ఆ తరువాతే కనిపించకుండా పోయింది.
ఎక్కడైనా పారేసుకున్నానో లేక
ఎవరైనా ఎత్తుకుపోయారో నాకు గుర్తు లేదు.
అక్కడి నుండే కష్టాలు మొదలయ్యాయి.

పచ్చనితీరాలకై నే వలస పోయేటప్పుడు
అప్పటిదాకా నన్ను రెప్పలా కాపాడిన
నాలుగు వృద్ధ నయనాల జల భాషను
డీకోడ్ చెయ్యలేక పోయాను - పాస్ వర్డ్ లేక.

కారీర్ కడ్డం పడుతుందని
చిదిపించేసిన రెండునెలల పిండం
ఏదో చెప్ప ప్రయత్నించింది
రాంగ్ పాస్ వర్డ్ - ఆడియో ఫైల్యూర్.

"తాతయ్యపోయినప్పుడు నువ్వూ, పెదనాన్నా
ఎందుకు దెబ్బలాడుకున్నారు" అని
ఆర్ధిక మర్మాలు తెలియని నాకూతురు అడిగినపుడు
పాస్ వర్డ్ మర్చిపోవటం వల్లేనని
చెప్పలేకపోయాను.

అంతెందుకు
శ్రీశ్రీ వర్ణించిన బిచ్చగత్తె ప్రతీరోజూ
నా ఒక్కరి ముందే చేయి చాపుతాది.
పాస్ వర్డ్ లేదని పర్సు తెరచుకోదు.

అంతా తెలుస్తూనే ఉంది
కానీ ఏమీ చెయ్యలేని తనం.

జీవితం ఫోల్డర్ లోని శాంతి అనే ఫైలు
ఎంత ప్రయత్నించినా తెరుచుకోవటం లేదు.

దేవుడా
దయచేసి నా పాస్ వర్డ్
రిట్రీవ్ చేసి పెట్టవూ?

బొల్లోజు బాబా

(మెటఫర్స్ లేకుండా ఎందుకు వ్రాయలేరు అని ఆత్మీయంగా ప్రశ్నించిన సాయిసాహితి గారికి)

Monday, July 21, 2008

నిరీక్షణఅమలిన చింతనో లేక
అలౌకికానందమో తెలీదుకానీ
ఆత్మరహిత దేహాన్ని
నిరీక్షణలు, నిరీక్షణలుగా
శిల్పీకరించుకోవటంలో
ఎంతానందముందనుకున్నావ్!

కొమ్మను తాకగానే పాటను
స్రవించిన కోయిలలా
చెమ్మను తాకగానే దళాల్ని
ప్రసవించిన విత్తనంలా ......
అత్యంత ప్రకృతిసహజంగా
నా ఈ నిరీక్షణా శిల్పాల మద్య
రెమ్మకూ రెమ్మకూ మద్య తిరుగాడే తుమ్మెదల్లా
నీ జ్జాపకాలు తిరుగాడుతూంటాయి.

బొల్లోజు బాబా

Tuesday, July 15, 2008

పుస్తకంలోకి నడవటం అంటే.......

ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
దోసెడు అక్షరాల్ని
కాలానికి అర్ఘ్యమిస్తాడు.
పిడికెడు ఆలోచనల్ని ఒడిసిపట్టుకొని
పుస్తకపుటలపై చల్లుతాడు.

ఎప్పుడో, ఎక్కడో, ఎవరో
ఒకడు
పుస్తకాన్ని తెరుస్తాడు.

ఒక జీవనది వాని గుండెల్లోకి
ప్రవహించటం మొదలౌతుంది.

ఒక సంగీతమేఘం
తేనె పాటల్ని వర్షిస్తూంటుంది.

రాగ స్పర్శకు వాని మనోయవనికపై
అపరిచిత అరణ్యం మొలకెత్తుతుంది.
వేన వేల స్వప్నాల పిట్టలు
రివ్వుమంటో ఎగిరి వచ్చి
మనో వనాన వాల్తాయి.
వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతాయి.
పరిమళపు భ్రమరాలు ఝుమ్మంటో
వాడిని చుట్టుముడతాయి.

దివా సంధ్యలు, గెలుపోటములు,
సుఖ, దు:ఖాలు, రాగ ద్వేషాలు
అనుభూతి తరువులపై వాలిన
జంట పిచ్చుకలౌతాయి.

కెలడియోస్కోపులో ని
రంగురంగు గాజుముక్కలల్లే
అవే అక్షరాలు అసంఖ్యాక చిత్రాల్ని
ఆవిష్కరిస్తూంటాయి.

ఒక నన్నయ, ఒక వేమన, ఒక గురజాడ
లిప్తపాటు మెరిసి మాయమవుతారు.

నవరసాలూ వాటి దేహాల్ని లాక్కొచ్చి
కనుల వాకిట నిలిపి
రసావిష్కరణ జరిపిస్తాయి.

శత సహస్త్ర శిరఛ్ఛేద
ఖడ్గ పరిహాసం తళుక్కుమంటుంది.

తరాల్ని కలిపే రుధిరామృతం
కాల రేఖ పై లీలగా జారుతుంది.
*************

ఏదైనా పుస్తకంలోకి నడవటమంటే
పరిచిత పాత్రలలోకి
మనల్ని మనం ఒంపు కోవటమే కదా!

బొల్లోజు బాబా

Thursday, July 10, 2008

పెయింటరు

ఒకప్పుడు
గోడలు, బేనర్లు, సైన్ బోర్డులు
కటౌట్లపై వాడి సంతకం
ఆకాశం అంచున వేలాడే సూర్యబింబంలా
వెలిగిపోతూండేది.

నీలిమందు నీళ్లల్లో ముంచిన పురికొస సాయంతో
వాడు గీసిన సరళ రేఖల మధ్య అక్షరాలు
గూటిలోని గువ్వల్లా ఒదిగిపోయేవి.

కుంచె లోని ఉడుత వెంట్రుకలమధ్య వర్ణాలు
సుశిక్షిత సైనిక కవాతులా కదిలేవి.

బేసిక్ కలర్స్ నుంచి డిరైవ్డ్ రంగుల్ని
సృష్టించటం వాడికి మాత్రమే తెలిసిన రసవిద్య.

అతను గీసిన చిత్రాల ముందు
ఎవరెవరో పారేసుకొన్న
పదిపన్నెండు కళ్లూ, రెండుమూడు హృదయాలూ,
ప్రతీ రోజూ తుడుపులో దొరుకుతూండేవి.

కొత్తవారికి వాడిరాతలు
నిశ్శబ్ధంగా, నిర్ధుష్టంగా దారిచూపేవి.

వాడి చెక్కపెట్టి నిండా రంగురంగుల డబ్బాలే!
ఇంద్ర ధనుస్సుని నిలువునా చీరి
ఒక్కోముక్కనీ ఒక్కో డబ్బాలో వేసుకున్నాడా అనిపించేది.
పెట్టిలో వివిధ సైజుల్లో బ్రష్ లుండేవి
సన్నని గీతనుండి, ఆకాశమంత పెద్ద రేఖ వరకూ
గీయటానికై.

వాని బట్టలపై, వంటిపై, హృదయంపై
చిలికిన రంగుల మరకలు
వాడికో గొప్ప దివ్యత్వాన్నిస్తున్నట్లు
మురిసిపోయేవి.

కానీ ఇప్పుడు
వినైల్ ప్రింట్లు, ఫ్లెక్స్ బేనర్లు
ఫొటోషాపులు, కోరల్ డ్రాలు
అన్నివైపుల్నుంచీ కమ్ముకొనే
శీతవేళలా వాడిని మింగేసాయ్.
వాడి ఉపాధి స్వప్నంలా జారిపోయింది.

వాని జీవితంలోకి
థిన్నర్ కలుపని చిక్కని నల్ల రంగు ఎగజిమ్మింది.

ఎప్పుడో ఎక్కడో వాడు
రోడ్డుపై క్రీస్తులానో, సాయిబాబాలానో
కళాత్మకంగా మన దారి కడ్డంపడతాడు.

ఇంకేం చేయాలో తెలీక!


బొల్లోజు బాబా

( పెయింటరు మిత్రుడు పట్నాల రమణ ప్రసాద్ కి)

Monday, July 7, 2008

ఆకాశం తెరచుకుందిచీకటి అలముకున్న త్రోవలో
హృదయనేత్రం వెలుగురేఖకై
తడుముకుంటోంది.

దూరం నుంచి వినిపించే
గానమాధుర్యంతో
గాలిపరిమళిస్తోంది.
పరిమళోన్మత్తుడనై నేను
మూర్చనలు పోయాను.

ఆకాశం తెరచుకొంది.
ఒక్క విధ్యుల్లత,
నూలుపోగులాంటి
ఒక్క మెరుపు మెరిసింది.
ఓవర్ ఎక్స్ పోజ్ చేయబడ్డ ఫోటోలా
దృశ్యం తళుక్కు మంది.

అవ్యక్త స్వప్నాలను
స్థిరీకరించే వెలుగు
లిప్తపాటు జిగేల్ మంది.

అది నీ దరహాసమా ప్రభూ?
******నే ధరించిన
దుస్తులు మాసిపోయాయి.
అబద్దాలు, దొంగనవ్వులు, మోసాలు
కపట ప్రేమలు, ఈశ్వర ధిక్కారం
అనే మురికి చేరింది.

దుస్తుల్ని చిలక్కొయ్యకు తగిలించి
నీ ప్రేమ లీలామృతధారలకై
వెతుకులాట మొదలెట్టాను.
అన్ని ప్రశ్నలకూ సమాధానం
నీవని తెలుసుకున్నాను.
నే పుష్పింపచేసుకున్న
నా అజ్ఞానం నాకు గోచరమయింది.
నీ వళ్లోకి నన్నిచ్చేసుకోవటానికై చేసే
నిరీక్షణలో నే కూరుకుపోయాను ప్రభూ!


ఇంతలో
నీ అడుగుల మెత్తని చప్పుడు.
గాలి పరిమళించటం తెలుస్తోంది.
ప్రభూ
నీ సంజ్ఞతో కాబోలు
హృదయంపై వాలిన పిట్టలు
రివ్వున ఎగిరిపోయాయి.
ఇక హృదయవనంలో ఏ సవ్వడీ లేదు,
తీవ్ర తేజస్సుతో ప్రకాశించే నిశ్శబ్ధం తప్ప.
ఇంతవరకూ లతల్లా పెనవేసుకున్న
బంధాలు అంధకారంలో లీనమయ్యాయ్.

ఆకాశం తెరచుకుంది.
అమృత బిందువులుగా
నీ కరుణ వర్షించింది.
నా చుట్టూ వెలుగు,
ఆత్మను వెలిగించే వెలుగు
అంత:శాంతిని పంచే వెలుగు
భువంతా పరచుకుంది.

అపుడు నాలోని ప్రతిమొగ్గా
వసంతమై ప్రవహించింది.
నాలోని ప్రతి శబ్ధమూ
రాగాల రెక్కలని తొడుక్కుంది.
నాలోని ప్రతీ వర్ణమూ
శోభా రంజితమయింది.

ప్రభూ
నీ దయా పరిమళ స్పర్శ
నన్ను పారవశ్యానికి
శాశ్వత బంధీని చేసేసింది.
ఇక ఈ విపంచిక
నిన్నే గానం చేస్తో
వెలుగుని కప్పుకున్న
పగలులా సంచరిస్తోంది.
********

అందరూ కన్నీళ్ళతో నా దేహాన్ని
ఓదారుస్తున్నారు - పిచ్చివాళ్లు
ఇది అభినందించాల్సిన సందర్భమని
ఎప్పటికి తెలుసుకుంటారు?బొల్లోజు బాబా{రవీంద్రుని గీతాంజలి మళ్లీ చదివి, ఆ భావజాలంలోంచి బయటకు వచ్చి చూసుకుంటే చేతిలో ఈ కవిత ఉంది.)