Monday, July 7, 2008

ఆకాశం తెరచుకుందిచీకటి అలముకున్న త్రోవలో
హృదయనేత్రం వెలుగురేఖకై
తడుముకుంటోంది.

దూరం నుంచి వినిపించే
గానమాధుర్యంతో
గాలిపరిమళిస్తోంది.
పరిమళోన్మత్తుడనై నేను
మూర్చనలు పోయాను.

ఆకాశం తెరచుకొంది.
ఒక్క విధ్యుల్లత,
నూలుపోగులాంటి
ఒక్క మెరుపు మెరిసింది.
ఓవర్ ఎక్స్ పోజ్ చేయబడ్డ ఫోటోలా
దృశ్యం తళుక్కు మంది.

అవ్యక్త స్వప్నాలను
స్థిరీకరించే వెలుగు
లిప్తపాటు జిగేల్ మంది.

అది నీ దరహాసమా ప్రభూ?
******నే ధరించిన
దుస్తులు మాసిపోయాయి.
అబద్దాలు, దొంగనవ్వులు, మోసాలు
కపట ప్రేమలు, ఈశ్వర ధిక్కారం
అనే మురికి చేరింది.

దుస్తుల్ని చిలక్కొయ్యకు తగిలించి
నీ ప్రేమ లీలామృతధారలకై
వెతుకులాట మొదలెట్టాను.
అన్ని ప్రశ్నలకూ సమాధానం
నీవని తెలుసుకున్నాను.
నే పుష్పింపచేసుకున్న
నా అజ్ఞానం నాకు గోచరమయింది.
నీ వళ్లోకి నన్నిచ్చేసుకోవటానికై చేసే
నిరీక్షణలో నే కూరుకుపోయాను ప్రభూ!


ఇంతలో
నీ అడుగుల మెత్తని చప్పుడు.
గాలి పరిమళించటం తెలుస్తోంది.
ప్రభూ
నీ సంజ్ఞతో కాబోలు
హృదయంపై వాలిన పిట్టలు
రివ్వున ఎగిరిపోయాయి.
ఇక హృదయవనంలో ఏ సవ్వడీ లేదు,
తీవ్ర తేజస్సుతో ప్రకాశించే నిశ్శబ్ధం తప్ప.
ఇంతవరకూ లతల్లా పెనవేసుకున్న
బంధాలు అంధకారంలో లీనమయ్యాయ్.

ఆకాశం తెరచుకుంది.
అమృత బిందువులుగా
నీ కరుణ వర్షించింది.
నా చుట్టూ వెలుగు,
ఆత్మను వెలిగించే వెలుగు
అంత:శాంతిని పంచే వెలుగు
భువంతా పరచుకుంది.

అపుడు నాలోని ప్రతిమొగ్గా
వసంతమై ప్రవహించింది.
నాలోని ప్రతి శబ్ధమూ
రాగాల రెక్కలని తొడుక్కుంది.
నాలోని ప్రతీ వర్ణమూ
శోభా రంజితమయింది.

ప్రభూ
నీ దయా పరిమళ స్పర్శ
నన్ను పారవశ్యానికి
శాశ్వత బంధీని చేసేసింది.
ఇక ఈ విపంచిక
నిన్నే గానం చేస్తో
వెలుగుని కప్పుకున్న
పగలులా సంచరిస్తోంది.
********

అందరూ కన్నీళ్ళతో నా దేహాన్ని
ఓదారుస్తున్నారు - పిచ్చివాళ్లు
ఇది అభినందించాల్సిన సందర్భమని
ఎప్పటికి తెలుసుకుంటారు?బొల్లోజు బాబా{రవీంద్రుని గీతాంజలి మళ్లీ చదివి, ఆ భావజాలంలోంచి బయటకు వచ్చి చూసుకుంటే చేతిలో ఈ కవిత ఉంది.)

12 comments:

 1. కవిత చదవగానే రవీంద్రుడు గుర్తోచ్చాడు. కింద చూస్తే మీ సంతకంతో పాటూ ఆ మాటలే ఉన్నాయ్. గొప్ప కవిత్వానికి ప్రేరణ మహాగోప్ప కవిత్వమైతే రెంటినీ ప్రేమించాల్సిందే!

  కాకపోతే ఒక దాన్ని అభినందిచొచ్చు, రెండోదాన్ని ఆరాధించక తప్పదు. అందుకే గీతాంజలికి నా ఆరాధన, మీకు నా అభినందన తెలుపుతున్నాను.

  ReplyDelete
 2. బాబా గారూ మీ కవిత నాకు బాగా నచ్చింది.నేను రవీంద్రుని గీతాంజలిని ఇంతవరకూ చదవలేదు.చలం గారి అనువాదం నా దగ్గర ఉండాలి.వెదకి తీసి చదువుతాను.కృతజ్ఞతలు.

  ReplyDelete
 3. కళావాచస్పతి జగ్గయ్య కూడ గీతాంజలిని తెనిగించారు!

  ReplyDelete
 4. bhaavakavi baaabaajI bhEsh. chaalaa baagumdi

  ReplyDelete
 5. బాబా గారు, అద్భుతం అన్న మాట కంటే గొప్ప మాట ఏదైనా ఉంటే చెప్తారా కొంచెం?

  మీరీ బ్లాగు మొదలెట్టకపోయుంటే ఎంత మంచి కవిత్వం మిస్ అయిపోయేవాళ్లమో అనిపిస్తొంది నాకు. అవార్డు స్థాయిలో ఉంటోంది మీ కవిత్వం!

  ReplyDelete
 6. బాబా గారు,
  మహేష్ గారు చెప్పినట్లు మీ కవిత అభినందనలకు ముమ్మాటికి అర్హమైనదే. అందులో అతిశయోక్తి ఏమీ లేదు.
  రవీంద్రుని గీతాంజలిలో మహత్తు ఏమిటో కానీ, చదివిన ప్రతిసారీ ఒక కొత్తలోకాన్ని నాకు పరిచయం చేస్తుంది. మీ కవితని ఇప్పటికి చాలా సార్లు చదివాను. అందులో ఏదో ప్రత్యేకత ఉంది. గీతాంజలిలా చదివిన ప్రతీసారి ఏదో అవ్యక్తానుభూతిని నాకు ప్రసాదిస్తూనే ఉంది. అభినందించడం అనేది చాలా చిన్న మాట. అంతకన్నా పెద్ద మాటలు నా నిఘంటువులో లేనందుకు నన్ను క్షమించండి.

  ReplyDelete
 7. ప్చ్,బాబా గారు,కొన్ని ప్రతీకలు అబ్బో బెమ్మాండం అనుకున్నా,రవీంద్రగీత,చలం రాత,శ్రీశ్రీ పదజాలం మీ మార్కును ముసుకులోకి నెట్టాయి.మీసొంత గొంతు వినిపించండి.

  ReplyDelete
 8. బాబా గారు, అద్భుతంగా ఉంది. మధ్యలో కాస్త తిలక్ గారి టచ్ కనిపించిందనుకోండి.

  చలం గారి గీతాంజలి అనువాదం ఈ మధ్య 9 వ తరగతి తెలుగు వాచకంలో చదివాను. కాసేపు ఎక్కడున్నానో కూడా మర్చిపొయాను. అంత అద్భుతంగా ఉంది.

  జగ్గయ్య గారి అనువాదాల కోసం వెతుకుతున్నాను. ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు.

  ఐతే నాకు 'గీతాంజలి ' కంటే గార్డినర్, క్రెసెంట్ మూన్ ఇంకా ఇష్టం ఎందుకో.

  ReplyDelete
 9. మహేష్ గారికి,
  మీ అభినందనలకు శతకోటి ధన్యవాదములు.

  నరసింహ గారికి,
  రవీంద్రుని గీతాంజలి తప్పని సరిగా ప్రతిఒక్కరూ చదవాల్సిన పుస్తకమని నా అభిప్రాయం సారు. నాకవిత మీకు ఆ ప్రేరణ ను ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.

  నెటిజను గారికి,
  అవును సారు, రవీంద్రుని గీతాంజలిని మొదట అనిసెట్టో లేక బెల్లంకొండో ఎవరో అనువదించారు. చానాళ్ల క్రితం దానిని చూసాను కూడా. తరువాత జగ్గయ్య చేసారనుకుంటా. చివరలో చలం అనువదించారు. ఈ మూడింటిలో జగ్గయ్యదితప్ప రెండింటిని నేను చదివాను. వాటిలో చలం అనువాదమే అద్వితీయంగా ఉంది.

  దుర్గేశ్వరా గారికి,
  మీ స్పందకు ధన్యవాదములు.

  సుజాత గారు,
  మీరు మీరు ఇస్తున్న ప్రోత్సాహమే నాచే ఇలా ఇంకా వ్రాయిస్తున్నట్లు భావిస్తున్నాను. మీకు సదా కృతజ్ఞుడను.

  ప్రతాప్ గారు,
  రవీంద్రుని గీతాంజలి నేను కూడా చాలా సార్లు చదివాను. చదువుతున్న ప్రతీసారి మీరన్నట్లు కొత్త అర్ధాలు కనిపించేవి. అలా ఈ మధ్య చదివినప్పుడు కలిగిన ఫీల్ ని ఇలా అక్షరబద్దం చేసాను. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

  రాజేంద్ర గారికి,
  మీ అభిమానానికి ధన్యవాదములు. పైన చెప్పినట్లుగా, ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని హృదయంతో చదివితే దాని ప్రభావం కొద్దిరోజులు హాంట్ చేస్తూనే ఉంటుంది. ఆ భావజాలంలోంచి బయటపడటానికి కొంత టైము పడుతుంది. సరిగ్గా అలా బయటపడే సమయంలో వ్రాసిన కవిత ఇది.
  ఈ కవితలో " ఆకాశం తెరుచుకుంది, నిరీక్షణలో కూరుకు పోయాను " అన్న రెండు పద భంధాలను మాత్రమే నేరుగా స్వేచ్చగా వాడుకున్నాను ( ఇవే నన్ను బాగా భాధించిన వాక్యాలు).
  i think this poem is a "frail imitation of the feel" అంతే తప్ప కాపీ కాదు. మాతృక లోని భావాలను తీసుకున్నాను.

  ఇక నా మార్కు అంటారా.
  దుస్తులు మాసిపోయాయి అనే స్టాంజా నాదే. (కొంచెం సెల్ఫ్ పిటీతో ఉంటుంది చూడండి). గీతాంజలిలో ఎక్కడా సెల్ఫ్ పిటీ ఉండదు.
  ఆఖరున కవి చచ్చిపోవటం/ఆత్మ సాక్ష్యాత్కారం పొందటం అనేది కూడా నా మార్కే. గీతాంజలి ఎక్కడా పెసిమిజం ఉండదు.
  ఈ కవిత నేను కావాలనే, వ్రాయాలనె ఆ శైలిలో వ్రాయటం జరిగింది. గమనించగలరు.
  మీ సూచన పాటించి ఇకపై ఇటువంటి ప్రయోగాలు చెయదలచుకోలేదు. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు సదా కృతజ్ఞుడను.

  రవిగారు,
  పొద్దులో స్ట్రే బర్డ్స్ అనువాదం చూసాను. చాలా బాగుందండి.
  మీరుచెప్పిన వాటిని చదవటానికి ప్రయత్నిస్తాను. స్పందించినందుకు చాలా చాలా ధన్యవాదములు.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 10. భావ పరంపరని అంత పొడవుగా కొనసాగించడం చాలా కష్టమైన ప్రక్రియ. చాలా బాగా రాసారు. ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఎలా చెప్పాలో తెలియడం లేదు... ఇంకో సారి చదువుకుంటాను...
  అప్పుడప్పుడు మనకి మనం ఆరాధించేవాళ్ళలా చెయ్యాలని ఉంటుంది.. నేనే వాళ్ళ లాగా రాస్తే, ఆలోచిస్తే, మాట్లాడితే ఇలా చెయ్యాలనిపిస్తుంది... అభిమానంతో,ఆరాధనతో... అలా వాళ్ళని మనం సజీవంగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నామేమో కదా...! అలాంటి ప్రయత్నాలని జడ్జ్ చెయ్యకూడదని నమ్ముతాను.. మీ ముచ్చట్లు తీర్చుకోండి... వాళ్ళు మిగిల్చిన అనుభూతిలో తడిచిపోండి... మీరు అలా తడిచిపోతుంటే పరవశంతో నాలాంటి వాళ్ళు చూడాలనే అనుకుంటారు :-)

  ReplyDelete
 11. beautiful exelent

  ReplyDelete