Saturday, February 28, 2015

గాథాసప్తశతి

గాథాసప్తశతి

గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఇది ప్రాకృత భాషలో రచింపబడింది.  
    
ఈ గ్రంధములో హాలుని విరచితములు అధికం.  పల్లెజీవనము, ఆనాటిప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు, ప్రకృతి వర్ణణలు ఈ గాథలలో కనపడుతూంటాయి.  సప్తశతి గాధలలో చాలామట్టుకు శృంగార ప్రధానంగా ఉంటాయి. స్వేచ్చగా, అరమరికలు లేకుండా ఉండే పల్లెజీవుల ప్రణయకలాపాలు అవి.  గోదావరి, నర్మద నదీతీరాలలో వికసించిన కవిత్వం ఇది.  ఈ కావ్యం అమృతమధురం అని హాలుడే స్వయంగా చెప్పాడు.  ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.  వాటిలో ఉన్న ఆ కవిత్వం వల్లే అవి రెండువేల సంవత్సరాలుగా నిలిచిఉన్నాయి అనిపించకమానదు. 

గాథాసప్తశతి ప్రభావం భారతీయసాహిత్యంపై ఎంతోఉంది. కాళిదాసు వర్ణణలపై, తమిళ సంగం సాహిత్యంపై, కబీర్, సూరదాస్ వంటి భక్తికవులపైనా గాధాసప్తశతి ప్రభావం ఉన్నట్లు నేడు గుర్తించ గలుగుతున్నారు.  

కావ్యాలంకార శాస్త్రాల్ని రచించిన  అనేక మీమాంసకులను గాథాసప్తశతి ప్రభావితం చేసింది.  ధ్వని సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఆనందవర్ధనుడు ఆ సిద్దాంతానికి మద్దతుగా గాథాసప్తశతి నుంచి అనేక ఉదాహరణలు తీసుకొని తన “ద్వన్యాలోకం” గ్రంధంలో ఉటంకించాడు.  

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గాథాసప్తశతికి అపూర్వమైన ఆదరణ లభీస్తుంది.  ఎందుకంటే ప్రపంచం అంతటా కవిత్వాన్ని మత, రాజకీయ భావజాలాలనుంచి విముక్తిచేయాలనే ప్రయత్నం జరుగుతున్నది.  ఈ ప్రయత్నంలో భాగంగానే,   సూఫీ సాహిత్యం, మధ్యయుగపు చైనీస్ కవిత్వం, గాథాసప్తశతి వంటి రచనలు గొప్ప గౌరవం పొందుతున్నాయి

గాథాసప్తశతిని తెలుగులో అనేకమంది అనువదించారు. శ్రీనాథుడు తన యౌవనారంభంలో గాథాసప్తశతిని అనువదించాను అని చెప్పుకొన్నాడు కానీ వాటిలో ఒక్క గాథ అనువాదం తప్పమరేవీ  లభ్యంలో లేవు.  
1930 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు అంతర్జాలంలో దొరుకుతాయి. 2012లో శ్రీ నరాల రామారెడ్డి, సంస్కృతమూలచ్ఛాయలను ఇస్తూ,  గాథాత్రిశతి పేరిట మూడు వందల గాథలను తెనిగించారు. 

ఇటీవలి కాలంలో శ్రీ దీవిసుబ్బారావు తెలుగులోకి గాథాసప్తశతిని అనువదించారు. ప్రముఖ కథకుడు శ్రీ తల్లావఝుల పతంజలిశాస్త్రి గారు కొన్ని గాథలను అనువదించారు.  శ్రీ కొలకలూరి ఇనాక్ గారు తమ ఒక రచనకు గాథలు అన్న పేరు పెట్టుకొన్నారు.  

Hala’s Sattasai పేరుతో Peter Khoroche & Herman Tieken లు చేసిన గాథాసప్తశతి అనువాదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణపొంది ప్రమాణికంగా పరిగణింపబడుతున్నది.   


ఈ గాథలన్నీ కొండవంటివి.  కొండను అద్దంలో చూపించటంలో ఎవరి అద్దం వారిదే ఎవరి అర్ధం వారిదే. ఈ క్రింది ఇవ్వబడిన గాథకు భార్యమొఖము మామూలుగానే ఒక చందమామ. మసి అంటుకొన్న తరువాత మచ్చలతోకూడిన చందమామలా అయ్యింది అని ఒక భాష్యము. దీనికి వివిధ కవులు చేసిన అనువాదాలు ఇలా ఉన్నాయి. 

The husband laughed at his wife’s face
Which, smudged with soot
That stuck to her hand from kitchen work,
Looked more than ever like the moon. [14] (Peter Khoroche & Herman Tieken)

వంట యింటి పనులనంటిన మసిచేయి
సోకియుండ జంద్ర సుందరముగ 
నింపుగొల్పుచున్న ఇల్లాలి మోమును
భర్త నవ్వుచున్నవాడు చూచి ---- రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ

పులుముకొని వంటపని మసి మలినమైన
చివురుచేత సంస్పృష్టము చెలువమోము
హరిణలాంఛనునునుగోము నాముకొనియె
ననుచు నుల్లసిల్లె బ్రియుండు హాసమొలుక – గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి
(సంస్పృష్టము = తాకిన, హరిణ = తెల్లని, 


వంటవార్పుల మునిగిన వారిజాక్ష
కురులనెగద్రోయ మలినితకరముతోడ
ముఖముమసియంటి సకళంకపూర్ణచంద్రు
పగిదిభాసింప – నాథుడు పరిహసించె      ---- నరాల రామారెడ్డి

వంటింటి పనుల్లో
మసి అంటుకున్న చేయి తగిలి
చంద్రబింబంలా మెరిసిపోతున్న
ఇల్లాలిమోము చూసి
మొగుడు ముసిముసి నవ్వులు
నవ్వుతున్నాడు              ------ దీవి సుబ్బారావు

వంటింటి పనిలో చేతిమసి ముఖానికంటుకొని
మునుపటికంటె మరింత ఎక్కువగా చందమామను
పోలిన భార్య మోమును చూసి 
భర్త ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు --- బొల్లోజు బాబా


అన్నింటిలోను శ్రీ గట్టి లక్ష్మినరశింహ శాస్త్రి గారి అనువాదం  గ్రాంధికంగా సాగుతుంది.  వారికంటే 14 ఏళ్ళ ముందు వ్రాసిన శ్రీ రాళ్ళపల్లి వారి అనువాదం కొంచెం సరళంగా ఉండటం గమనార్హం.  ఇటీవలికాలంలో వచ్చిన అనువాదాల్లో రామారెడ్డిగారి తెనిగింపు తేటగీతి పద్దతిలో, సుబ్బారావుగారి అనువాదం వచనకవిత్వరూపంలోను ఉన్నాయి.  

జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రామారెడ్డిగారి గాథ లో “సకళంకపూర్ణచంద్రు” అన్న ప్రయోగం ద్వారా మచ్చలతో కూడిన చంద్రుడు అన్న అర్ధం వచ్చి, Peter Khoroche & Herman Tieken అనువాదానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.  

(కవిసంధ్య పత్రికలో ఇకపై ప్రతినెలా  గాథాసప్తశతి లో ఉన్న – దేవతల ప్రస్తావన, ప్రకృతి వర్ణణలు, అపురూప సౌందర్యవతులు, నారీమనోహరులు, ప్రేమగాథలు, అన్యోన్య దంపతులు, జీవితానుభవాలు అనే వివిధ అంశాలతో కూడిన గాథలకు నేను చేసిన,  వివరణలతో కూడిన అనువాదాల పరంపర ఉంటుంది. -- బొల్లోజు బాబా)  

Sunday, February 15, 2015

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ – కొప్పర్తి


నువ్వెళ్లిపోయాకా రక్తకన్నీరు కార్చుకొన్నాను నేను.  నా విషాదం పెరిగిపోయింది.  నీ నిష్క్రమణ మాత్రమే కారణం కాదు. నీతో పాటు నా నేత్రాలు కూడా నన్ను విడిచిపోయాయి.  ఇపుడు నేనెలా ఏడ్చేదీ? ---- రూమీ

కవిత్వంలో రక్తం అనేది ఎక్కువగా యుద్దానికి, ప్రమాదానికి, ఉద్రేకానికి, భీభత్సానికి,  ధైర్యానికి ప్రతీకగా ఉంటుంది.  కన్నీరు దుఃఖం, వేదన, ప్రేమ, ఉప్పొంగే ఆనందం, కృతజ్ఞతలను సూచిస్తుంది.   పైనున్న రూమీ వాక్యంలో రక్తకన్నీరు అనే పదబంధంలో,  నేత్రాలు పోవటం అనే భీభత్సం, ప్రేయసి ఎడబాటు యొక్క వేదన ఏకకాలంలో ఇమిడిపోవటం చూడొచ్చు.  “గతమంతా తడిచె రక్తమున కాకుంటె కన్నీళ్ళులతో”..... అన్న శ్రీశ్రీ వాక్యంలో  రక్తమంటే యుద్ధాలనీ, కన్నీళ్ళు దాని తాలూకు దుఃఖమనీ అర్ధం చెప్పుకోవచ్చు.
          రక్తం, కన్నీళ్లను పోలుస్తూ కొప్పర్తి వ్రాసిన “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” అనే కవిత,  రక్తం కన్నా కన్నీరే ఉత్కృష్టమైనదని ప్రతిపాదిస్తుంది.  రక్తమనేది మనిషి అస్థిత్వానికే తప్ప మనిషితనానికి చిరునామా కాదని, కన్నీళ్ళే మనిషిని మనిషిగా నిరూపిస్తాయని ఈ కవిత చెపుతుంది.  లోతైన తాత్వికత, మంచి శిల్పం, తర్కం నిండిన ఈ కవితను చదివినపుడు గొప్ప పఠనానుభూతి కలుగుతుంది.  ఆలోచనలు విస్తరిస్తాయి. 
అవును
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి//...... అంటూ మొదలయ్యే కవితావాక్యాలు కవిత సారాంశాన్నంతా ముందే చెప్పేస్తాయి.
 
          ఇక మొగ్గ ఒక్కొక్క రేకు విచ్చుకొన్నట్లుగా ఒక్కో వాక్యం, తేటగా, ఏ శషభిషలు లేకుండా  కవితా వస్తువును ఆవిష్కరిస్తాయి.  మెట్లు మెట్లుగా అనుభూతి శిఖరం వైపు నడిపిస్తాయి. 
          ఈ కవితను మూడు భాగాలుగా విభజిస్తే, మొదటి భాగంలో రక్తం ఏ ఏ సందర్భాలలో చిందించబడతాయో చెపుతాడు కవి,  రెండవ భాగంలో కన్నీళ్ళు ఏ ఏ సమయాల్లో చిప్పిల్లుతాయో చెపుతాడు, మూడవ భాగంలో రక్తం కన్నీళ్ళకంటే ఎందుకు గొప్పదో ముక్తాయిస్తాడు. మంచి ఎత్తుగడ, తార్కికంగా సాగే నడక, ఆలోచనాత్మక ముగింపులతో ఉండే కొప్పర్తి కవితలు తెలుగుసాహిత్యంలో  ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఈ కవిత మినహాయింపేమీ కాదు.
రక్తాన్నెక్కించగలరు కానీ
కన్నీళ్ళనెవరైనా ఎక్కించగలరా...... అనే ప్రశ్నతో ముగుస్తుందీ కవిత.  నిజమే కదా రక్తంతో ముడిపడిన సందర్భాలన్నీ దాదాపు బయటనుంచి వచ్చేవే, కానీ కన్నీటి సమయాల్ని మాత్రం ఎవరికి వారు తోడుకోవాల్సిందే.  అందుకనే  ఒకచోట “మనలోంచి మనం తవ్వుకొనే తెల్లటి మణులు కన్నీళ్ళు” అంటాడు కొప్పర్తి.

కెమిష్ట్రీ ఆఫ్‌ టియర్స్‌ (“యాభై ఏళ్ళ వాన” సంకలనం నుండి)

అవును
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి
బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దేన్‌ వాటర్‌
నిజమే కావచ్చు
బట్‌ నాట్‌ థిక్కర్‌ దేన్‌ టియర్స్‌

సూది గుచ్చుకున్నపుడు, బ్లేడు కోసుకున్నపుడు
రక్తం ఉబుకుతుంది
రక్తం ఉరలుతుంది
కత్తివేటుకు రక్తం ఉవ్వెత్తున లేచిపడుతుంది
రక్తం కళ్లచూడాలంటే
రాయి కర్ర సూది బ్లేడు కత్తి బుల్లెట్‌
ఏదో ఒకటి ప్రయోగింపబడాలి

అందరి రక్తం ఎర్రగానే ఉండడంతో
అందరూ ఒకటేనని ఒకప్పుడు చెప్పేవాళ్ళు
నిజమే రక్తం మనందరినీ ఒకటి చేసింది
ఒకే గొడుగు కిందకు తెచ్చింది

అందరిలోను ఒకే రక్తం ప్రవహిస్తోంది
ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది
అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం
నియంతను నరికినా అదే రక్తం
తెల్లవాణ్ణి నల్లవాణ్ణి
డబ్బులున్నవాణ్ణి లేనివాణ్ణి
మంచివాణ్ణి చెడ్డవాణ్ణి
ఎవర్ని ఎవర్ని నరికినా
అదే రక్తం చిందుతున్నప్పుడు
మనిషికి రక్తం అస్తిత్వాన్నిస్తున్నదే కానీ
మనిషితనానికి చిరునామా అవుతున్నదా

మంచి రక్తం చెడు రక్తం
అంటూ ఉంటాయి కానీ
మహామనిషి రక్తం
మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా

అందుకే
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

లోలోపలి మనిషితనానికి
బాహ్యరూపం కన్నీళ్ళు
ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు

తెలుసా
మనిషిలో కన్నీళ్ళ రహస్య తటకాలున్నాయి
నదీమూలాల్లాంటి కన్నీటి చెలమలున్నాయి
ఒకరు రాయి విసరనక్కరలేదు
మరొకరు కత్తి దూయనక్కరలేదు
గాయపరచేదైనా అనునయించేదైనా
చిన్నమాట చాలు
కళ్ళదోనెల్లో నీళ్ళు కదలాడుతాయి
చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి
చూస్తున్న తెరమీద ఒక్క సన్నివేశం చాలు, కన్నీళ్ళకి
కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి
జీవితంలో ముంచి తీసిన కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి
నిజానికి ఇవి కూడా అక్కరలేదు
ఒక్క ఊహ
వణికించి తొణికించే ఒక్క ఊహచాలు, కన్నీళ్ళకి

గుండె బరువెక్కి
ఒక దుఃఖపు గుటక గొంతును పట్టేసి
కన్నీళ్ళు తొణికిసలాడాయా, నువ్వు మనిషివి

కళ్ళు వర్షించినపుడు
మనిషి నల్లమబ్బుల ఆకాశం
కళ్ళల్లోకి నీళ్ళు తోడుకున్నపుడు
మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం
మనలోంచి మనం తవ్వుకునే
తెల్లటి మణులు కన్నీళ్ళు

రక్తంలా కన్నీళ్ళు అనుక్షణం తయారు కావు
రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు
మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ
ఉండాలని ఎవరు చెప్పగలరు
రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది
కళ్ళు చిప్పిల్లాలంటే
రసాయనిక చర్య జరగాల్సిందే

మనుషులందర్నీ ఒకటిగా కలిపిన రక్తం
కణసముదాయాలుగా విడిపోయింది
పాజిటివ్‌గా నెగిటివ్‌గా పాలిపోయింది
కన్నీళ్లు మాత్రం వర్షపు నీళ్లలా
స్వచ్ఛంగా ఉండిపోయాయి

యుద్ధ బీభత్స ప్రతీక - రక్తం
యుద్ధ విధ్వంస స్మృతి - కన్నీళ్లు
యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది
స్మృతుల్లో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి

హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ
దాని ఉనికిని చాటేది మాత్రం కన్నీళ్ళే

రక్త హీనత ఉన్నట్టే
దుఃఖ లేమి కూడా ఉంటుంది
రక్తాన్ని ఎక్కించగలరు కానీ
కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా
                     
                   -----కొప్పర్తి


ఈ వ్యాసం సారంగ పత్రికలో ఈ లింకులో ప్రచురితమైనది
http://magazine.saarangabooks.com/2015/02/05/%E0%B0%95%E0%B1%86%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%86%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D/