Thursday, June 25, 2009

ప్చ్


బలాన్నంతా కూడదీసుకొని
దూరంగా విసిరేసిన ఓ స్వప్నం
మెల్లమెల్లగా కనుమరుగైంది
ఎగిరే పక్షికూతలా.

అక్కడ ఆ చీకటి చలిలో
అదిచేసే దుర్భల ఆర్తనాదం
లీలగా వినిపిస్తోంది.
లేదు అవును లేదు అవును అవును.
అవును అదింకా నన్ను ప్రేమిస్తూనే ఉంది.

ఎపుడో ఒకప్పుడు
అది ఓ రెక్కల గుర్రమై
ఎగురుకుంటూ వచ్చి
నన్నెక్కించుకొని
ఆ కొండపై దింపుతాది.

అప్పటికి ఈ ప్రపంచం
ఇంకా లోయలోనే ఉంటుంది.

బొల్లోజు బాబా

Saturday, June 20, 2009

పోలవరం నిర్వాసితుల కోసం....

నాకు పెద్దగా లెక్కలు రావు
ఎన్నివందల స్మశానాలో
ఎన్ని లక్షల శవాలో
ఎన్నికోట్ల వెలుతురు గింజలో
నే చెప్పలేను.


రెండు కొండల మధ్య సూర్యుని చూపి
అది ఏ సంధ్యంటే ఎవరుమాత్రం
ఏం చెప్పగలరు!


లక్షల సంవత్సరాల
కన్నీళ్లు, నెత్తురులు
ఇంకించుకొన్న ఈ నేల
ఇకపై తన పరిమళాల తూనీగల్ని
ఎగరేయదంటే, ఎందుకో
హృదయంలో ఇసుక నింపినట్టుంది.
ఇంకా తవ్వబడని ఓ నాగరికతను
జల సమాధి చేసేస్తుందీ నేల.


ఏడుతరాల అన్వేషణలో ఎవరో
ఓ మానవుడు ఇక్కడకు వస్తే
ఇక ఈ నేల ఏమిచూపగలదూ
నిలువెత్తు అంధకార జలస్థంభాన్ని తప్ప.

ఈ మట్టినే నమ్ముకొన్న
చెట్టు ఇకపై పాడదు.
పిట్ట ఇకపై పూయదు.

మనిషి మాత్రం
ఇక్కడ తన్ను తాను నరుక్కొని
మరెక్కడో పాతుకొంటున్నాడు.
ఆ రక్తరహిత జననం కోసం
తట్టా బుట్టా సర్ధుకొంటూ, ఈ నేలతో
తన అనుబంధాల్ని, అనుభవాల్ని
ఎలా తీసుకెళ్లాలో తెలీక
అలా వానలో తడుస్తున్నాడు.

సుళ్లుతిరిగే మౌనంపై
శూన్యంలోంచి కురిసే వాన
సూదులతో గుచ్చే ముళ్లవాన.


తడిచేవానికే తెలుస్తుంది
తడి పదునెలా ఉంటుందో.


బొల్లోజు బాబా

(పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో కనుమరుగయ్యే వందల ఊళ్లను, నిర్వాసితులయ్యే లక్షల స్థానికులను తలచుకొని)

Wednesday, June 17, 2009

ఫ్రాగ్మెంట్స్ 4


1

"బాబూ! ఒక స్ట్రిప్ పిల్స్ ఇవ్వు"
జీన్స్ లో ఆమె
బైక్ పై అతను.
రసాయిన సమానత్వం.
*******

2

పాతికేళ్లలో ప్రపంచం
ఎంతమారిపోయినా
మావూరి తాటి ముంజెలకు
ఇంకా అదే రుచి.
*******

3

సీసాలో ద్రవంలా
లోకపు అన్ని వంకరలనూ
ఇముడ్చుకొన్న నాడు
సంకెళ్లు కూడా సుఖంగా ఉంటాయి.
*********

4

ఖాళీ చేసిన ఇంటివాసన
గుండెగొంతులో
బిలబిలా జారే
సారాయి గరగర.
*******


బొల్లోజు బాబా

Friday, June 5, 2009

అప్పుడు - ఎందుకు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

నా బుజ్జాయీ,
నీకు నేను రంగుల బొమ్మలు తెచ్చినపుడు అర్ధమయింది
మేఘాలు, జలాలపై అట్టి రంగుల నాట్యం ఎందుకుందో
పూవులు భిన్న వర్ణాలను ఎందుకు అద్దుకొన్నాయో!
నీకు రంగుల బొమ్మలు ఇచ్చినపుడు నాకర్ధమయింది.

నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు తెలుసుకొన్నాను.
ఆకులలో సంగీతం ఎందుకుందో! ఆలకించే పుడమి హృదయానికి
అలలు తమ బృందగానాన్ని ఎందుకు వినిపిస్తాయో!
నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు అర్ధమయింది.

మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు తెలిసింది.
సుమపాత్రికలో మధువు ఎందుకుందో!
రహస్యంగా ఫలాలు అమృతంతో ఎందుకు నింపబడతాయో!
మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు నాకు తెలిసింది.

నా ప్రియమైన బుజ్జాయీ
నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు
నాకు నిశ్చయముగా అర్ధమయింది.
ఎంతటి సంతసం ఆకాశం నుండి ఉదయకాంతిలో ప్రవహిస్తున్నదో!
నా దేహానికి వేసవి తెమ్మెర ఎంతటి హాయినిస్తుందో!
నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు తెలిసింది.

బొల్లోజు బాబా

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని
WHEN AND WHY అనే గీతం

Monday, June 1, 2009

మహాప్రస్థానం - చలం యోగ్యతాపత్రం

పిచ్చిరెడ్డి, ఎమ్‌.. విధ్యార్ధి ప్రశ్న: యోగ్యతాపత్రం చదివితే మహా ప్రస్థానం గీతాలు మరి చదవక్కరలేదు అనుకుంటా. మీరేమంటారు?
శ్రీశ్రీ జవాబు : ఏమంటాను? మీరు సార్ధకనామధేయులంటాను.

******

శ్ర్రీశ్రీ ని కాస్తంత అసహనానికి గురిచేసిన ప్రశ్న సామాన్యమైనదేమీ కాదు. కారణాలు తెలియవు కానీ మహాప్రస్థానం కొన్ని ముద్రణలను చలం యోగ్యతా పత్రం లేకుండానే ప్రచురించారు.

తెలుగు సాహిత్య చరిత్రల్లో వేళ్లపై లెక్కించదగిన కొన్ని ముందుమాటల్లో, చలం మహాప్రస్థానానికి వ్రాసిన యోగ్యతాపత్రం ముందుంటుంది.

శ్రీశ్రీ పేరు తలచుకోగానే మహాప్రస్థానం ఎలాగ గుర్తుకు వస్తుందో, మహాప్రస్థానాన్ని గుర్తుచేసుకొంటే, దానికి చలం వ్రాసిన యోగ్యతాపత్రం తలపుకు వస్తుంది. మహాప్రస్థానానికి చలం వ్రాసిన ముందుమాటను మొదట " మహాప్రస్థానానికి జోహార్లు" అని పేరుపెట్టినట్లు, దానిని శ్రీశ్రీ యోగ్యతాపత్రంగా మార్చారని అంటారు.

గీతాంజలికి వ్రాసుకొన్న ముందుమాటలో చలం ఇలా అంటాడు. "గీతాంజలి గురించి చలానికి ఏమితెలుసు? అసలు టాగోర్ కు ఏమి తెలుసు?" మొదటి ప్రశ్న వద్ద ఆహా ఏమి వినయం అనుకొంటాం. రెండో వాక్యం పూర్తయ్యేసరికి షాక్ లాంటిదేదో తగిలి, పుస్తకం ఒక్కక్షణం పక్కన పెట్టి ఆలోచించవలసిందే. అదే చలం గొప్పతనం. ఏదైనా ఒక విషయాన్ని (ఇక్కడ గీతాంజలి గొప్పతనాన్ని) చదువరి హృదయంలోకి గొప్ప ఒడుపుతో ప్రవేశపెట్టగలడు.

యోగ్యతాపత్రం కూడా అలాంటిదే. 1940 లో వ్రాసిన యోగ్యతాపత్రంలో చలం చేసిన పరిశీలనలు ఈనాటికీ నిలబడ్డాయంటే, అది ఆయన దార్శనికతకు నిదర్శనం.

కవిత్వాన్ని తూచే రాళ్లు నావద్ద లేవంటూ, అత్యంత మోడెస్టీ తో ప్రారంభించి, ఒక యుగాన్ని శాసించబోయే కవిని, ఆతని కవిత్వతత్వాన్ని గొప్పగా ఆవిష్కరిస్తాడు.

"కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా" అన్న మాటలు జీవితానికి, కవిత్వానికి ప్రామాణిక సూత్రాలే. ఇక్కడ చలం దేశభక్తి అంటున్నది, హిపోక్రిసీతో ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే కుహనా రాజకీయనాయకుల గురించేనని వేరే చెప్పుకోనక్కరలేదు. విషయం లేకుండా చెప్పిందే చెప్పుకుంటూ పోయే గాఢత లోపించే కవిత్వం గురించీను.

తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వమంటాడు చెలం. కవి తన సమాజంలో ఉన్న విషయాలను, తన అనుభవాలను కలగలిపి కవిత్వాన్ని సృష్టిస్తాడు. దాన్నే యుద్దారావమని చలం, పురిటినొప్పులని శ్రీశ్రీ అన్నారు. ఇదేమాట చలం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది.

కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీశ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ.

అప్పటి ప్రముఖ కవి అయిన కృష్ణ శాస్త్రికి శ్రీశ్రీకి ఉన్న ప్రధానమైన వ్యత్యాసాన్ని చాలా చిన్న చిన్న మాటలలో చలం చెప్పిన వాక్యాలు వారి కవిత్వతత్వాన్ని బహు లాఘవంగా ఇముడ్చుకొన్నాయనే అనుకోవచ్చు. వాక్యాలు తెలుగు సాహిత్యరంగంలో వారి సాహిత్యాలకు నిర్వచనాలవలె నిలచిపోయాయి.


సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank-account, వొట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాలమీదినుంచి యీ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖ పట్నం సముద్రంలో నల్లరాళ్ళ మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచిపెట్టి "దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? ఏమిటి వేదన పాపం?" అని కొంచెం ఆలోచిస్తారేమో!

మధ్యతరగతి ప్రజల నిర్లిప్తత, మార్పును స్వీకరించలేనితనం పై చలం సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఇవి. చలానికి ఇలాంటివారిపై అవకాసమొచ్చినప్పుడల్లా విసుర్లు విసురుతూనే ఉన్నాడు. చలాన్ని, చలం సాహిత్యాన్ని అర్ధంచేసుకోలేక అదంతా బూతంటూ ప్రచారం చేసి, చలాన్ని తెలుగునేలపై నిలువనీయకుండా తరిమేసిన వర్గమది మరి. అందుకనే బహుసా సందర్భం కుదిరినప్పుడల్లా వారి వైఖరికి వ్యతిరేకంగా, చలం తనగళాన్ని వినిపిస్తూనే సాగాడు

శ్రీశ్రీ కవిత్వాన్ని analyse చేసి, ముక్కల కింద ఎత్తి చూపి, కవీ, మనిషీ, శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్తపోకడలు, పాత influences అంటో వాటి శ్రేష్టత్వాన్ని explain చెయ్యడానికి చెలానికి అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత, కళా, నాటక, నృత్య, గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే జాయింటు సెక్రటరీ కూడా సంపాయించేవాడు కాడా

పై వాక్యాలు శ్రీశ్రీ కవిత్వం కన్నా చలం తత్వాన్ని మనకు చెపుతూంటాయి. నిజమే మరి చలం అలా చేయకపోవటం వలననే ఈనాటికీ స్మరణీయుడయ్యాడేమో! ఎంతమంది విమర్శకులు కాలగర్భంలో కలసిపోలేదు. కనీసం వారి పేర్లు కూడా తరానికి తెలీకుండా.

శ్రీశ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి, ఏమీ అర్థం కాలేదా - యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం.

చిన్నినాబొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ, గిరిగీసుకొని జీవించేవారికి, మహాప్రస్థాన గేయాలు పెద్దగా రుచించవు, సమాజంపట్ల ఇంకా నిశ్చితాభిప్రాయాలను ఏర్పరచుకోని యువకునికిచ్చినట్లయితే పుస్తక ప్రయోజనం నెరవేరుతుందని చెప్పటం శ్రీశ్రీ కవితోద్దేశ్యాన్ని పరోక్షంగా చెప్పటమే.

తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి గా శ్రీశ్రీ కవిత్వాన్ని ఆనాడే అంచనా వేయటం, చలం ద్రష్ట అనటానికి ఉదాహరణ. అలానే శతాబ్ధం శ్రీశ్రీది అని చెప్పగలిగేస్థాయిలో కవిత్వం తదనంతరం పేరుతెచ్చుకోవటం గమనార్హం.


కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకో వలసిన గతి వస్తుంది.

శ్రీశ్రీ కవిత్వం ప్రారంభరోజుల్లో చలం వ్రాసిన వాక్యాలు తరువాతకాలంలో అక్షరసత్యాలైనాయి. నలభైలనుంచి ఎనభైలవరకూ ప్రతీకొత్త కవి శ్రీశ్రీని అనుకరించాలని ప్రయత్నించినవారే. చాలామంది తుఫానులో కొట్టుకుపోయారు లేదా శ్రీశ్రీ గొడుగుక్రింద తలదాచుకొన్నారు. ఈనాటివరకూ కూడా తెలుగు సాహిత్యంలోవచ్చిన నూతన ప్రక్రియలుగా పిలవబడేవాటికి శ్రీశ్రీ ఆనాడే తన కవితలలో బీజం వేసాడన్నది ఒక విస్మయం గొలిపే విషయం. ఉదా: మినీకవిత్వం, మాండలికంలో కవిత్వం వ్రాయటం వంటివి.

ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.

అని చలం వ్రాసిన వాక్యం పై డబ్బ్దైలలో రగడజరిగింది. రుధిరజ్వాల వ్రాసిన నారాయణబాబు కవిత్వాన్ని శ్రీశ్రీ అనుకరించాడని దానిని పై వాక్యం సమర్ధిస్తుందనీ వాదోపవాదనలు జరిగాయి. నారాయణ బాబుకు శ్రీశ్రీ కి ఉన్న వైషమ్యాలు కూడా వాదనకు బలాన్నిచ్చాయి.
నారాయణ బాబు మంచికవి. కానీ శ్రీశ్రీలా ఆయన అప్రతిహతంగా తన సాహితీయానాన్ని కొనసాగించలేకపోవటం వల్ల అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇద్దరినీ పోల్చినప్పుడు, నారాయణబాబుకన్నా శ్రీశ్రీ చాలా ముందు ఉంటాడు. వివాదాన్ని అప్పట్లో రేపింది ఆరుద్ర, సోమసుందర్ వంటి ప్రముఖులు. దానివెనుకకూడా అనేక రాజకీయ కారణాలుండవొచ్చు.

మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) flower-bed పుష్పశయ్య కేసి చూస్తున్న నన్ను చూచి, " పువ్వులు పాడు పువ్వులు: ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన అంతా పువ్వులే" అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను.
"ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?"
"సంధ్య కేసి"
"ఎవరు ఆమె?"
అంటే ఏం మాట్లాడగలిగాను?

ప్రజల్లో ఉండే అరాసిక్యం గురించి చలం చెప్పిన పై మాటలలోని వ్యంగ్యం, ఆలోచనల్లో తగ్గిపోతున్న సున్నితత్వాన్ని ఎత్తిచూపుతుంది. ఇది కాలానికి మరింతబలపడిందనే అనుకోవాలి. బహుసా చలాన్ని అర్ధం చేసుకోవటంలో చాలామంది ఇక్కడే విఫలమయ్యారనిపిస్తుంది.

శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు?
ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ!

పై వాక్యాలు శ్రీశ్రీ కవితాత్మను చక్కగా ఇముడ్చుకొంటాయి. నిరాశను, విరహాల్ని గానం చేసే భావకవిత్వానికీ, కొత్తనెత్తురును ప్రవహింపచేసే శ్రీశ్రీ కవిత్వానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం అదే. అందుకనే శ్రీశ్రీ చలానికి నచ్చుతాడు. ఎంత మేన్ ఆఫ్ లిటిల్ ఫైత్ అయినప్పటికీ.

అరుగో మూల పాతగోరీల కేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు -పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు -రామాయణాలూ, శర్మిష్ఠలూ వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు, "భారతి" కి నైవేద్యంగా.
వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపొండి.

అంటూ ఇంకా పాతపదాలు, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, ఆచారాలను పట్టుకొని వేళ్లాడే కవులను,వారి శిష్య పరంపరను, చలం ఎద్దేవా చేస్తున్నాడు. (మరో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే అప్పటికింకా రామాయణ కల్పవృక్షం వ్రాయలేదు). భారతి అప్పట్లో వెలువడే సాహిత్య మాసపత్రిక. ఎనభైలలో అది నిలచిపోయింది. భారతిలో అచ్చయిందంటే అలాంటి కవిత్వానికి ఒక ప్రామాణికత, కవికో గుర్తింపు ఉండేదట. వారిని విమర్సించటం ద్వారా, శ్రీశ్రీ కవిత్వం యొక్క గొప్పతనాన్ని, నవ్యతను, అది తీసుకురాబోయే విప్లవాన్ని అన్యాపదేశంగా చలం చెప్పాడనిపిస్తుంది.

శ్రీశ్రీ కవిత్వాన్ని ఇష్టపడని వారిని సోమరులు, వృద్దులు, ఛావ లేనివారు, చాందసులు అంటూ ప్రకటించటం ఒకరకంగా పుస్తకం ఎవరికైతే చేరాలో వారికి చేర్చటానికి పన్నిన వ్యూహం లా అనిపిస్తుంది. ఆవిషయంలో చలం నూరుశాతం సఫలమయ్యాడు. ఎందుకంటే అప్పుడు పుస్తకాన్ని హృదయానికెత్తుకొన్న యువకులు, దానిపట్ల తమ నిబద్దతను చివరివరకూ కొనసాగించారనే భావించవచ్చు.
అదే క్రమంలో అప్పటి భావకవిత్వంపైనా, సాంప్రదాయ రచనలపైనా చలం సంధించిన విమర్శనాస్త్రాలు కూడా.

చలం వ్రాసిన యోగ్యతాపత్రంలో, దైవదూషణ, పూర్వకవులపై నిందలు, సొంతగొడవలు, వెటకారాలు, కృష్ణశాస్త్రి కవిత్వంపై విసుర్లు తప్ప శ్రీశ్రీ కవిత్వం గురించి ఉన్నది తక్కువేనన్న విమర్శలు ఉన్నాయి. బహుసా అలాంటి విమర్శను ముందే ఊహించి "ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు పేజీలు తిప్పేసుకోవచ్చని" ముందే చెప్పుకొంటాడు చలం.

తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం ఉన్నంతకాలమూ యోగ్యతాపత్రం కూడా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహంలేదు.

బొల్లోజు బాబా

లింకులో చలం యోగ్యతాపత్రాన్ని చదువుకొనవచ్చును