Saturday, April 29, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 6 - చివరి పార్టు

.
Spring/ వసంతఋతువు
.
మామిడి పూత, తుమ్మెదల ఝుంకారం, కోకిల గానం, రామచిలుకలు, తామరలు విరబూయటం, మోదుగుపూలు పుష్పించటం- వసంతఋతు లక్షణాలుగా కవులు స్థిరపరచారు. అన్నిటిలో మామిడిపూత ప్రస్తావన పదే పదే బలంగా రావటం గమనించవచ్చు. వసంతఋతువులో మరులుగొన్న యువతికి మామిడిపూతను యువకులు బహుమానంగా పంపించటం ద్వారా తమ కోర్కెను తెలపేవారు. మామిడిపూతను స్త్రీలు సిగలో తురుముకొని తమ సంసిద్ధతను తెలిపేవారు.
కొత్త ప్రేమలు చిగురించి, అనుబంధాలు బలపడే కాలంగా వసంత ఋతువును ప్రాచీన కవులు వర్ణించారు.
.
1.
గండుతుమ్మెదల ఝుంకారాల కోలాహలంతో
కోకిల గానపు జయజయ స్తుతులతో
అరణ్యమనే అశ్వాన్ని అధిరోహించి
వసంత రాజు అరుదెంచుచున్నాడు
వజ్జలగ్గ - 630

2.
ఆమె ప్రియుడు పంపిన మామిడి పూత ను చూసి
స్నేహితురాళ్ళు అసూయ చెందారు
ఆ బహుమతిని తన ప్రేమకు నివేదించుకొన్నది ఆ మృగనయని
ప్రియుడు పంపిన మామిడిపూతను చేత్తో పట్టుకొని
సుతారంగా తాకుతుంది, తదేకంగా చూస్తుంది
వాసనపీలుస్తోంది, చెక్కిళ్లపై మెత్తగా అద్దుకొంటోంది
Vakkuta – Subhashitaratnakara, vidyaakara-155

3.
ఊరంతా తుంటరి కుర్రాళ్ళు
వసంతకాలం, యవ్వనం, ముసలిభర్త, ఇప్పసారాయి
ఏంచెయ్యాలో ఎవరూ చెప్పక్కర్లేదు
చెడిపోకుండా ఉండాలంటే చావొక్కటే దారి
గాథాసప్తశతి - 197

4.
చెట్లు పూలతో
సరస్సులు తామరలతో కిక్కిరిసి ఉన్నాయి
స్త్రీలు మరులుగొల్పుచున్నారు
పరిమళభరిత గాలులతో
రాత్రులు సుఖకరముగాను
పగటి వేళలు రమ్యంగాను ఉన్నాయి
ప్రియా!
వసంతఋతువు ఎంత మనోహరము!
ఋతుసంహారము - 6.2

5.
యువతీయువకులను కలవరపెట్టే
ఐదుబాణాల మన్మధునికి వసంతం
ఈ ఐదు కాన్కలను అందిస్తుంది
దక్షిణ పవనాల మెత్తని స్పర్శ
మామిడి తొలిపూత దర్శనం
కోకిల పాట శ్రవణం
మల్లెపూల సువాసన
బాగా మాగిన సారాయి రుచి
Sarngadharapaddhati 3789

7.
ఇంకా విచ్చుకోని మోదుగుపూవులో
నెలవంకలా ఒంపుతిరిగిన కేశరం
లక్కముద్ర వేసి ఎర్రని వస్త్రంలో దాచిన
మన్మధుని ధనస్సులా ఉంది
Sarngadharapaddhati 3794

8.
మామిడి చెట్టు దట్టమైన కొమ్మల వెనుక
గుత్తులుగుత్తులుగా పూచిన పూత మధ్య
ఎక్కడో దాక్కొని
కోయిల కూస్తోందని మనకు ఇట్టే తెలిసిపోతుంది
వారిపనుల ద్వారా సజ్జనులు తెలిసినట్లు
Sarngadharapaddhati 3784

9.
మల్లెమొగ్గ చుట్టూ ఝుంకరిస్తూ తిరుగుతూన్న
మెరిసే గండుతుమ్మెద
ఐదు బాణాల మన్మధుని దాడిని సూచిస్తూ
తెల్లని శంఖం ఊదుతున్నట్లుంది
Sarngadharapaddhati 3786

10.
తామరపూవు పుప్పొడిని గ్రోలటానికై
నల్లని గండుతుమ్మెదలు కట్టిన వరుస
వసంతరాణి నడుముపై ధరించిన
మెరిసే నీలంపుమణి మేఖల వలె ఉన్నది
వజ్జలగ్గ 633

11.
ఓ సఖీ!
"దిగులు చెందకు అతను తిరిగి వస్తాడు"
అని నువ్వు ఓదార్చుతున్నప్పటికీ
నేను కలతలేకుండా ఎలా ఉండగలను ?
ఈ వసంతఋతువేళ
పసుపురంగు మామిడిపూత పుప్పొడిని అలంకరించుకొన్న
గండు కోయిల దేహం మెరిసిపోతూ
బంగారాన్ని అరగదీసే నల్లని గీటురాయిని తలపిస్తోంది
నేనేమో
అతను వచ్చివెళ్ళినప్పటినుంచీ
సిగలో ఏ పూలూ అలంకరించుకోకుండా
ఉత్తముడివేసుకొని ఉంటున్నాను
కురుంతోకై – 192

12.
అత్తా!
మామిడికొమ్మలు పూచే అవసరం లేదు
మలయమారుతం వీచే అవసరం లేదు
నా భర్త వస్తే
వసంతఋతువు వచ్చినట్టే!
గాథాసప్తశతి - 642

13.
పల్లెటూరి యువకుడొకరు
మామిడిపూతను తలపై ఉంచుకొని వెళుతోంటే
తుమ్మెదలగుంపు అతన్ని అనుసరిస్తూంది
బంధీగా చిక్కిన స్త్రీ వెనుక కుర్రకారు వెంటబడినట్లు
గాథాసప్తశతి - 431

14.
మామిడిచెట్టు పూత కొచ్చింది
మాగిన సారాయి వాసన మత్తెక్కిస్తోంది
మలయమారుతం చల్లగా వీస్తోంది
ఇలాంటప్పుడు కూడా
నాకన్నా వ్యాపారమే ఎక్కువన్నట్లు వెళిపోయాడు
నా పై ప్రేమ తగ్గిపోయిందేమో!
గాథాసప్తశతి - 197

15
అతను ఇంకా రాలేదు
వసంత ఋతువు వచ్చేసింది
యువతులు తెల్లని పూలతో ఉన్న
కానుగ చెట్టు లేత ఆకుల్ని నూరుకొని
తమ కౌమార చన్నులకు
పూసుకొంటున్నారు బలపడటానికై
Ainkurunūru 347

16.
వసంతఋతువుకి పూచిన కొండపూలతో
మాలలు అల్లుతూ
పంటను పాడుచేసే చిలుకలను తరిమే
అందమైన కళ్ళ ఆ అమ్మాయికి
నేనొకడిని ఉన్నట్లు కనీసం
తెలియనన్నా తెలియదు
ఆమెను తలచుకొంటు
అర్ధరాత్రి నిద్రలో ఏనుగు నిట్టూర్చినట్లు
నిట్టూర్చుతాను నేను.
నా హృదయం ఆమె వద్దే ఉందని
ఆమెకు కనీసం తెలుసో లేదో నాకు తెలియదు
Kurunthokai 142

17.
కాకి నల్లగా ఉంటుంది
కోకిల కూడా నల్లగా ఉంటుంది
కాకికి కోకిలకి తేడా ఏమిటి?
వసంతఋతువు వచ్చినపుడు
కాకి కాకే, కోకిల మాత్రం కోకిల
Subhashita Bruhatkosa - 9283

18.
కోకిల రెండు, మూడు సార్లు పిలిచింది
మామిడి మూడు, నాలుగు మొగ్గలు వేసింది
తుమ్మెదలు ఐదు ఆరు మోదుగు పూలను ఆస్వాదించాయి
ఎల్లెడలా ఆనందం వెల్లివిరిసింది
స్త్రీల హృదయాలు ప్రసన్నమైనాయి
విశ్వాసం చూపని తమ ప్రియుల పట్ల
బిగుసుకొన్న ముడి కొంచెం వదులైంది
నీల- విద్యాకరుని సుభాషిత రత్నకోశ 156

19.
నేరేడు కొమ్మపై వాలిన నల్లని తుమ్మెదను
ముగ్గిన పండనుకొని రామచిలుక ముక్కున కరుచుకొని
విడిచిపెట్టింది
తుమ్మెదలు కూడా రామచిలుక ముక్కుని
మోదుగ పూవుగా తలచి నేరుగా వచ్చి వాలుతున్నాయి.
రాజశేఖర - విద్యాకరుని సుభాషిత రత్నకోశ 157

20
నడుముకు కెందామర మాలలు
చెవులకు మామిడి లేచివుర్లు
చన్నులను కప్పుతూ ఎర్రని అశోకపుష్పాలు
కురులలో మాధవీ పువ్వులు
దేహమంతా పొగడపూల పుప్పొడి
- ఇదీ అమ్మాయిల వస్త్రధారణ
వసంతఋతువు
అబ్బాయిలకు ఇష్టకామ్య ప్రాప్తి కలుగజేయుగాక.
Savarni - vidyakara, subhakaratnakara – 1784

అనువాదం: బొల్లోజు బాబా
అయిపోయింది


సంప్రదించిన పుస్తకాలు
1. Tamil Love Poetry, The Five Hundred Short Poems of the Aiṅkuṟunūṟu, BY MARTHA ANN SELBY
2. THE FOUR HUNDRED SONGS OF WAR AND WISDOM An Anthology of Poems from Classical Tamil THE PURANANURU
Translated and edited by George L. Hart andvHank Heifetz
3.KURUNTOKAI Selected poems of Love by Dr. C. Rajeswari
4.. Circle of Six seasons by Martha Ann selby
5.Hala’s Sattasai by PETER KHOROCHE and HERMAN TIEKEN
6. Gadha saptasati by Radhagovinda Basak
7.ఋతుసంహారము, ఆంధ్రటీకాతాత్పర్యసహితము, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ కో
8.Ritu in sanskrit Literature by Dr. V. Raghavan
9.Love and the Turning Seasons, Andrew Schelling
9. An Anthology of Sanskrit court Poetry, Vidyakara's Subhasitaratnakosa by Daniel H H ingalls
10.Maha Subhasita samgraha by Ludwik Sternbach 8 volumes
11.https://sangamtranslationsbyvaidehicom
12. A Critical study of Kuruntokai by C. Balasubramaniyan
13.Love Stands alone, Selections from Tamil sangam poetry by M.L. Thangappa
14. వజ్జాలగ్గం, డా. కె. కమల
15. గాథాసప్తశతి, బొల్లోజు బాబా


Sunday, April 23, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 5

చలి కాలం/శిశిరఋతువు/ Winter 2
.
మాఘ, పాల్గుణ మాసములు శిశిర ఋతువు. ఇది జనవరి నుండి మార్చి మధ్యలో ఉంటుంది. చెట్లు ఆకులు రాల్చు కాలము. ఈ ఋతువులో చలి అధికంగా ఉంటుంది. ప్రాచీన సాహిత్యంలో పంటలు కోతకు వచ్చి కొత్తధాన్యంతో రైతుల గాదెలు నిండే కాలం ఇది. ఇండ్లలో స్త్రీలు ధాన్యం దంచటం కొన్ని గాథలలో కనిపిస్తుంది
నిరుపేదలు చలి ప్రతాపానికి బాధలు పడటం; భాగస్వాములకు దూరమై వియోగంతో ఉన్నవారు చలివల్ల కష్టపడటం; కొందరు ధనవంతులు పుణ్యం కొరకు ఊరిలో పదిమందికి ఉపయోగపడేలా పుణ్యాగ్ని ఏర్పాటుచేయటం చేయటం లాంటి అనేక జీవనానుభవాలు వివిధ గాథలలో కనిపిస్తాయి.
 
1.
కప్పుకునేందుకు వెచ్చని దుస్తులు
కాచుకొనేందుకు నిప్పుల కుంపటి
శీతగాలి చొరబడని ఇంటి గదులు
వేడెక్కించే జవరాండ్ర పయోధరాలు లాంటి హంగులతో
ధనవంతులు చలికాలాన్ని తరిమేయగలరు
అందుకే
అది పేదవారిపై తన ప్రతాపం చూపుతుంది
(Sarngadharapaddhathi 3937)

2
ఒకబాటసారి సాయింత్రపు వేళ
ఊరి చలిమంట వద్ద ఒళ్ళుకాచుకొని
గ్రామదేవత గుడిలో గడ్డిపరుచుకొని పడుకొన్నాడు
చలిగాలులకు అర్ధరాత్రి మెలుకువ వచ్చేసింది
ఒంటిపైని పలుచని దుస్తులు చల్లగా మారి
ఏమాత్రం వెచ్చదనం ఇవ్వటం లేదు
తెల్లవార్లూ అతను చలికి
ఆ గుడిలో అటూ ఇటూ పొర్లుతూనే ఉన్నాడు
(బాణుడు- సంస్కృత కవి)
ఊరి చలిమంట= పుణ్యాగ్ని. ఎవరో పుణ్యం కొరకు అభాగ్యులకై ఏర్పాటుచేసిన చలిమంట)
3
నేత్రాలు నా కన్నీరును దాచలేకపోతున్నాయి
ఈ దుఃఖాన్ని నేను తాళలేకున్నాను
ఈ ఒంటరితనం
ఈ శీతల రాత్రి
ఎముకలు కొరికే చలిగాలులు
భోరున కురిసే వాన
ఈగలను తరమటానికి ఆవు తలను ఆడించిన ప్రతిసారీ
దాని మెడలో గంట మోగుతోంది
ఈ ఊరిలో ఆ ధ్వనులను వింటున్నవారు
ఇంకా ఎవరైనా ఉన్నారా?”
kurunthokai 86
 
4.
మాఘమాసపు చలి సమయాలలో
పొగలేకుండా వెచ్చదనాన్ని ఇచ్చే
తన బార్య ఎత్తైన చన్నులను నమ్ముకొని
ఆ రైతు తన కంబళిని ఇచ్చేసి
ఎద్దును బదులుగా పుచ్చుకొన్నాడు
గాథాసప్తశతి – 218
 
5
చలికి అతని పళ్ళు పటపట చప్పుడు చేస్తూ
ఒణుకుతున్నాయి
చలిమంటకి దగ్గరగా ముఖాన్ని చేర్చాడు
పొగకి కన్నీరు వస్తోందని కళ్ళు గట్టిగా మూసుకొన్నాడు
చేతులు రుద్దుకొంటు ముందుకు చాచాడు
కమిలిన ఆ బాటసారి గడ్డాన్ని చూస్తే
ఊరి చలిమంటను రెండుచేతులతో
తీసుకొని తాగుతున్నాడా అనిపిస్తుంది
(sarngadharapaddhati 3934)
 
6
శీతాకాలం వస్తే ధనవంతులకు ఉత్సాహం
తమలపాకులు నములుతూ
తమ రహస్య ప్రియురాళ్లను నిమురుతూ
అంతులేని భోగాలను అనుభవిస్తారు
పేదలమైన మాకు
కప్పుకోవటానికి సరైన దుస్తులు ఉండవు
చలికి గజగజలాడుతూ మోకాళ్ళ వణుకు తప్ప
శీతాకాలం మాకు పండగ కాదు.
(అజ్ఞాత సంస్కృత కవి- Erotic poems from Sanskrit an Anthology, by Parthasarathy)
 
7
పండగ కొరకు దంచుతున్న పిండి ఎగిరిపడి
తెల్లగా మారిన ఆమె చన్నులు రెండూ
కలువపూవు లాంటి ఆమె మొఖం నీడలో
ముడుచుకు కుర్చున్న హంసల్లా ఉన్నాయి
(గాథాసప్తశతి 626)

8.
చలిగాలులకు కోతులు వణుకుతున్నాయి
గొర్రెలు, మేకలు, పశువులు చిక్కిశల్యమైపోయాయి
తరిమివేసిన కుక్క మరలా పొయ్యివద్దకు వచ్చి
మునగదీసుకొని కూర్చుంది
ఎముకలు కొరికే చలికి ఆ పేదవాడు
కాళ్ళూ చేతులూ దేహంలోపలకు లాక్కొన్న
తాబేలులా కనిపిస్తున్నాడు
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ -313)

9.
తొలకరి పంట చేతికొచ్చాకా
గాదులలో నిల్వ చేసిన ధాన్యం సువాసనలతో
ఇంటి పడుచులు రోకళ్లతో కొత్త వడ్లను దంచుతున్నపుడు
వారి చేతులు పైకి కిందకూ ఆడేవేళ వారి గాజులు చేసే చప్పుళ్ళతో
రైతుల ఇళ్ళు ఎంత సందడిగా ఉంటాయో కదా?
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -314)

10.
ప్రేమ వల్ల ఏదైతే వస్తుందో
దాన్ని చలికాలం తీసుకొచ్చింది
చర్మం పాలిపోవటం, వణికే పెదవులు
నత్తిగా మాట్లాడటం
(అలంకార రత్నాకర)

11.
ఏనుగుల గుంపులు సంచరించే అరణ్యాలలో
మంచుకురిసే పర్వతాలపై నివసించే
ఓటమి ఎరుగని బలమైన ఈటెను కలిగిన వీరునితో
లేచిపోవటం
బంధుమిత్రుల మధ్య ఎంతో సందడితో
పెళ్ళిచేసుకోవటం కన్నా గొప్పదని
భావించిందా నా కూతురు?
Ainkurunūru 379
(లేచిపోయిన కూతురుపై తల్లి చేసిన వ్యాఖ్య)

12.
నువ్వు చెలకలు పండాయి
పిట్టలు సందడి మొదలైంది
ఆవపంట ముదురు గోధుమ రంగుతేరింది
పూలు గింజలుగా మారుతున్నాయి
ఎండిన పైరు గాలికి ఊగుతుంటే
మంచు బిందువులు రాలి చెదురుతున్నాయి
బాటసారులు ఊరి మంట వద్ద చేరి
పనిలేని ముచ్చట్లు చెప్పుకొంటున్నారు
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -315)

13.
చందమామ భీతిల్లిన తరుణిమోము వలె ఉంది
బలహీనంగా ప్రకాశించే సూర్యుడు
వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి వలె ఉన్నాడు
పిడకల పొగ కొత్తపెళ్ళికూతురి మెత్తని అలకలా ఉంది
శీతకాలపు చలిగాలి
జిత్తులమారి ఆత్మీయాలింగనం వలె ఉంది
(అభినంద, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -317)

14.
ఆ రైతుల వెచ్చదనం చలిగాలులకు కరిగిపోతోంది
గడ్డిమంటను కర్రలతో కెలుకుతూ పదే పదే రగిలిస్తున్నారు
మంటలు రేగినట్లే రేగి ఆరిపోతున్నాయి
ఆవపంట గడ్డిని మండించే కొద్దీ దట్టమైన గొట్రు
కుప్పనూర్పిడి నేల నలుమూలలకూ వ్యాపిస్తోంది
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -318)

15.
చలికాలంలో ఒడ్లు దంచుతూ ఆడువారు పాడుకొనే
దంపుడు పాటలు ఎంత మనోహరంగా ఉంటాయి!
పైకి క్రిందకూ కదిలే వారి చేతి గాజులు చేసే
గలగలల శబ్దాల మధ్య సాగే పాటలు
పైకి క్రిందకూ ఊగే వారి చన్నుల లయను అనుసరిస్తూ
ఆ హుం, ఆహుం అంటూ చేసే ఊర్పులతో సాగే పాటలు
(యోగేశ్వర, విద్యాకరుని సుభాషిత రత్నకోశ -1178)

16.
వర్షాలకు, చలికి, వేడికి అతీతంగా
రోజులు వచ్చిపోతూంటాయి
కానీ అవి ఎవరికి ఏం చేయటం కొరకు వచ్చిపోతున్నాయో
మనకెవరికీ తెలియదు.
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ -1067)

17
చలికాలపు రాత్రులు ఎంతకీ తరగవు దీర్ఘమైనవి
చాన్నాళ్లుగా భర్త ఊళ్ళోనే లేడు
రాత్రుళ్ళు చక్కగా నిద్రపోవచ్చు కదా!
పగలు నిద్రపోతున్నావు; ఏమిటి సంగతీ?
గాథాసప్తశతి 66

18.
ఓ చల్లని ఉత్తరగాలులారా
మీకు శుభం కలుగుగాక!
పాము కుబుసాలను తలపించే
స్వచ్ఛమైన జలపాతాలతో
అలంకరించబడిన కొండకి సమీపంలో
గడ్డితో అల్లిన ఇళ్ళ ముందు ఉన్న
ఇప్ప చెట్లనుండి రాలిపడే పూలను
అడవి జింకల మందలు తింటూఉంటాయి
అదే నాప్రియురాలి ఊరు
ఆమెను చల్లగా చూడండి
Kurunthokai 235
 
19.
ఈ హోలీ పండుగ రోజున
రంగులు అద్దిన చన్నులతో
మద్యం ఎక్కువై ఎరుపెక్కిన కళ్ళతో
కలువపూవులు తురుముకొన్న జడతో
మామిడి చివురు దోపుకొన్న కొప్పుతో
ఓ యువతీ!
నువ్వీ గ్రామానికే ఒక శోభ.
గాథాసప్తశతి -826


(ఇంకా ఉంది)


అనువాదం
బొల్లోజు బాబా

Saturday, April 22, 2023

Kuruntokai 152



.
నన్ను లోకులు నిందిస్తారు కానీ
వారికేంతెలుసు?
తాబేలు పిల్ల గుడ్డునించి బయటకు రాగానే
తల్లిని చూస్తూ శక్తిని పొందినట్లుగా
నేనూ నా ప్రియుని చూస్తూ
జీవనేచ్ఛను పొందుతాను
అతను నాకు దూరమైన మరుక్షణం
నేనొక తల్లిలేని గుడ్డులా
కృశించి నశించిపోతాను
.
(Kuruntokai 152 - BCE రెండో శతాబ్దానికి చెందిన తమిళ కావ్యం)
అనువాదం: బొల్లోజు బాబా

Thursday, April 20, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 4



హేమంత ఋతువు/Early Winter 1
చలిమొదలయ్యే ఋతువు ఇది. మంచు కురుస్తుంది. మార్గశిర, పుష్యమాసములు. ఆంగ్ల నెలల ప్రకారం నవంబరు నుండి జనవరి మధ్యలో ఉండే కాలం. పంటలు చేతికి రావటంచే సంక్రాంతి పండుగ జరుపుకొంటారు. చలికాలం కనుక ప్రేమికులు ఒకరి వెచ్చదనాన్ని మరొకరు పంచుకొనేందుకు ఇష్టపడే కాలం ఇది.
 
1.
హేమంత ఋతువు రాకతో
లొద్దుగ చెట్లు పుష్పించాయి
వరిపైరు కోతకు వచ్చింది
సన్నగా పడుతోన్న మంచుకు
కలువలు వాడిపోతున్నాయి
కొత్తచిగుర్లతో పచ్చదం వికసిస్తోంది.
(ఋతుసంహారం – 4.1)

2.
నేలపై తివాచి కప్పినట్లున్నాయి
జింకలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి
జక్కవ పక్షులు మనోహరంగా కూస్తున్నాయి
ఈ హేమంతఋతు సౌందర్యం ఎంత రమణీయం!
(ఋతుసంహారం – 4.8 )

3.
స్త్రీలు కడియములు, వడ్డాణములు వంటి
లోహ ఆభరణాలను , పలుచని వలువలను
ధరించటానికి ఇష్టపడటంలేదు
చలి ప్రారంభమైనది కదా!
(ఋతుసంహారం – 4.3)

4.
ప్రేమసయ్యాటలో
సువాసనలు చిందించటానికి స్త్రీలు
దేహానికి మానుపసుపు పూసుకొని
చెక్కిళ్లపై కస్తూరితో మకరికా పత్రములు దిద్దుకొని
కురులకు నల్ల అగరు ధూపం వేసుకొని
ఉత్సాహముగా తయారవుతున్నారు
(ఋతుసంహారం – 4.5)
(మకరికా పత్రములు – Tattoos)

5.
చలికాలం
గుడిబయట ఒక బాటసారి
ఆరిపోయిన చలిమంట కుప్పను
ఎలుగ్గొడ్డుగా భ్రమించి
దూరంగా ఉండి కర్రతో పొడుస్తున్నాడు
(గాథాసప్తశతి – 2.9)

6.
పీలికలైన పాతకంబళి కప్పుకొని
పిడకల పొగ కంపు కొడుతూ
పొగచూరి నల్లబడిన దేహంతో
చలికి ఒణుకుతూ కనిపించే అతనిని
నిరుపేద అని ఇట్టే గుర్తుపట్టొచ్చు
(గాథాసప్తశతి -329)

7.
వాళ్ళు ముందే చెప్పారు
బండ రాయి లాంటి వక్షస్థలం కలిగిన అతను
ఎత్తైన పర్వతాలపై ఒత్తుగా పెరిగే కలువలు ఉండే చోటికి
వెళిపోతాడని, ఇక్కడ ఉండడని
మదపుటేనుగు చెవుల వలె ఊగే
మహావృక్షాల పత్రాలను
తొలిమంచు పడే ఈ ఋతువులో
చల్లని ఉత్తరగాలులు మెత్తగా స్పృశించేవేళ
నా చెంతన అతను లేకపోవటం
నాకెంతో దుఃఖకరంగా ఉంది
Kuruntokai 76

8.
మినువుల పంట పూతకొచ్చింది
వాని తొడిమెలు ఎర్రగా అడవి కోకిల
కాళ్లవలె మెరుస్తున్నాయి
జింకల గుంపొకటి చేలోపడి పంటను మేస్తూంది
సన్నగా మంచుకురుసే ఈ ఋతువు కలిగించే తాపం
తీరాలంటే అతని బిగికౌగిలే మందు.
Kuruntokai 68

9.
నా ప్రియుడు నా వెనుక నిలుచుని
నా కురులను సవరించేవాడు
నా కనుల నీరు తుడిచి ఓదార్చేవాడు
సఖీ! అతనికి ఏమయిందిప్పుడు?
రైతులు రెండవపంటకూడా తీసేసారు
చిక్కుడు పాదులు కూడా
పుష్పించ సాగాయి
చలికాలం సన్నగా మొదలైంది
అతను ఇంకా ఇంటికి చేరలేదు
సఖీ! అతనికి ఏమయింది?

Kuruntokai  82

10.
చలిగాలులు మొదలయ్యాయి
మల్లెలు పూచే కాలం
కొలనుల్లో కలువలు అదృశ్యమయ్యే రోజులు
భర్తలు ఎన్ని తప్పులు చేసినా మన్నించి
అతని కౌగిలిని చేరుతున్నారు భార్యలు
పెరిగే చలిని తప్పించుకొనేందుకు
 
(ఋతుసంహారము 5.6)

11.
రైతులవద్దకు బాటసారులు ఎండుగడ్డికొరకు వచ్చి
వారిని బతిమాలుతూ పొగుడుతూంటే ఉప్పొంగిపోయి
ఉదారంగా దానం చేసి
రాత్రిపూట నెమరువేసుకొనే పశువులనుంచి వచ్చే
వేడి శ్వాసలలో వెచ్చదనాన్ని పొందుతారు వారు.
కనురెప్పల వెంట్రుకలపై మంచుబిందువులతో
వీపున ఆవపూలతో శోభిల్లే నందీశ్వరునిపై
ప్రాతఃకాలపు తొలి కిరణాలు పడి పల్లె తెల్లవారుతుంది.
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ -297)

12.
పొలంలో ఒక మూల కుందేళ్ల జంటను చూడగానే
రైతులు తోటివారిని ఆనందంతో పిలుస్తూ, కేకలు వేసుకొంటూ
కర్రలు, కొడవళ్ళు, పంగల కర్రలు చేతబూని
పంటకోయటం మానేసి వాటి వెనుక పరిగెట్టారు
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ -300)

13
చలికాలం వేడిగా ఉంటుందని కలువలకు తెలుసు
ఎందుకంటే అది వాటిని వడలిపోయేలా చేస్తుంది.
కొందరు ఎంత తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టేందుకు
ప్రయత్నించినా వారి చర్యలను దాయలేరు

గాథాసప్తశతి – 686

14.
ఇది వరకు నా స్నేహితురాలు
నీకు పచ్చి వేపపండు ఇచ్చినప్పటికీ
చాలా తియ్యగా ఉంది అనేవాడివి
ఇప్పుడు
పరంపు కొండలపై పారే
పుష్యమాసపు సెలయేటి చల్లటి నీటిని ఇస్తే
వేడిగా ఉన్నాయని, మురికిగా ఉన్నాయని
ఒంకలు పెడుతున్నావు
నువ్వు మారిపోయావు!

Kurunthokai 196
(Parambu Mountains)
(విడిచివెళిపోతున్న నాయకునితో నాయిక చెలికత్తె అంటున్న మాటలు)

15..
కమ్ముకొన్న దట్టమైన మంచుకారణంగా
సూర్యుడు ఉదయించిన సంగతి
పక్షుల కిలకిలారావాల ద్వారా మాత్రమే
తెలుస్తోంది
(అజ్ఞాత సంస్కృత కవి)

16.
అతను నన్ను పెండ్లాడినట్లు సాక్ష్యం తెమ్మంటే
ఎక్కడినించి తేను? అతనే సాక్షి.
ఆ... గుర్తొచ్చింది
కందిజువ్వలాంటి నన్నని పొడవైన ఆకుపచ్చని కాళ్ళతో
ఏటిఒడ్డున నిలుచున్న కొంగ ఒకటి ఆ సమయంలో
మమ్మల్నే తదేకంగా చూసింది.
(Kurunthokai-25)

17
ఓ పురుషోత్తముడా!
నీ కీర్తి
శీతాకాలపు రాత్రుల వలె దినదిన ప్రవర్ధమానమగుగాక!
నీ బంధుజనులకు
శీతాకాలపు సూర్యుని వలె గొప్ప ఆనందాన్ని ఇచ్చెదవుగాక!
నీ చుట్టూ ఉండే దుర్జనులకు
శీతాకాలపు చన్నీటి వలె భయం పుట్టించెదవుగాక!
నీ శత్రువులు
శీతాకాలపు కలువలవలె కృశించిపోయెదరు గాక!
(Mahasubhashita sangra 5165)

18.
చలికాలం గొప్పతనం చూడు!
చెరువు నీరు కూడా చలికి భయపడి
దళసరి తెల్లని దుప్పటి కప్పుకొన్నట్లు
దట్టమైన మంచు పొర

(Mahasubhashita sangra 3)

.
అనువాదం: బొల్లోజు బాబా
ఇంకాఉంది

Wednesday, April 12, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 3


.
శరదృతువు /Autumn
.
ఆశ్వయుజ కార్తీక మాసములలో శరదృతువు వస్తుంది. సెప్టెంబరు, నవంబరు నెలలు. వానలు పడటం తగ్గుతుంది (8, 9, 16). ప్రకాశవంతమైన వెన్నెల కాస్తుంది (12, 13). పచ్చికబయళ్ళు ఒత్తుగా ఉంటాయి. నీటి ప్రవాహాలజోరు తగ్గుతుంది (10, 17, 18). తామరలు, నీటిపక్షుల సందటి మొదలౌతుంది (2, 4, 11,15). దసరా, నవరాత్రి లాంటి పండుగలు వచ్చే ఋతువు ఇది. పంటలు కోతకు వచ్చేసమయం. మంచు కురుస్తుంది (6, 20). పగటి కాలం నిడివి తగ్గుతూ, రాత్రి దీర్ఘంగా ఉండటం మొదలౌతుంది. ఆకాశంలో తెల్లని మబ్బులు/శరత్కాల మేఘాలు కనిపిస్తాయి (19). ఆటపాటలకు, కొత్తప్రేమలకు అనువైన కాలమిది (14).
.
1
శరదృతువులో సరస్సు జలాలు
పైన మాత్రమే వేడిగా ఉండి
లోపల చల్లగా ఉంటాయి
కోపంవచ్చిన మంచివాళ్ళ హృదయాల్లా
(గాథాసప్తశతి 286)

2
చంద్రుడు రాత్రికి
కలువలు చెరువుకి
పూలగుత్తులు లతలకు
హంసలు శరదృతువుకు
ఇచ్చే బహుమతి సౌందర్యం
(ధ్వన్యాలోక – 21/లీలావాయి లో కూడా ఇలాంటిదే వర్ణన కలదు)

3
అమ్మాయీ!
నీ ప్రియుని క్షమించు, పట్టుదల విడిచిపెట్టు.
మేలైన సరకమును, మధురజ్ఞాపకాలను మిగిల్చే సయ్యాటలను
ప్రసాదించే శరత్కాలాన్ని వ్యర్ధం చేయకు
(వజ్జలగ్గ- 359) (సరకము=కల్లు)

4.
శరదృతు దేవత
ఒక కాలు చంద్రునిపై మరో కాలు
ఎగురుతోన్న హంసలబారుపై ఉంచి
చేత కలువపూలు ధరించి
ఆకాశం నుండి భూమిపైకి దిగుతోన్నది
(శృంగార ప్రకాశ – 68)

5.
ముగిసిన వానాకాలం
.
నడమంత్రపు సిరి పొందిన వ్యక్తిలా
సూర్యుడు సన్నగా బాధించటం మొదలుపెడతాడు.
కృతజ్ఞతలేని స్నేహితునిలా
జింక తన కొమ్ములను విసర్జిస్తుంది.
శుద్ధాత్ముడైన సాధువు మాటల్లా
నీళ్ళు తేటపడతాయి.
వేశ్యను ఉంచుకొన్న పేదవానిలా
మట్టి క్రమక్రమంగా పొడిబారుతుంది.
Subhashita ratnakosa of Vidyakara

6
మనం ఎన్నటికీ ఇక్కడే కలిసి జీవిద్దాం అని నమ్మించి
నన్ను విడిచి వెళ్లిపోయాడు అతగాడు
చల్లని పొగమంచు పరిచే ఈ శరదృతువులో
చంద్రునితో పోటీ పడే వెన్నెల రేకలతో
వికసించే చంద్రకాంత పూలతో
తెల్లని తంతువులతో అలరించే దిరిసెన పూలతో
పచ్చని పొదలు అలంకరించబడి ఉన్నాయి
చెలీ!
అతను ఈ విషయాల గురించి ఆలోచించడా?
(Ainkurunuru – 56)

7
ఉబ్బు రొమ్ముల యవ్వనం లాంటి వానాకాలం
వెళ్లిపోయింది
తొలిగా పూచిన రెల్లుపూవు
భూదేవి శిగలో మొలిచిన మొదటి తెల్ల వెంట్రుక వలె ఉంది
(గాథాసప్తశతి – 534)

8
మబ్బులు ఇంధ్రధనసును మింగేసాయి
పతాకంలా ప్రకాశించిన మెరుపులు నేడు కానరావు
రెక్కలతో ఆకాశాన్ని వెనక్కినెట్టిన కొంగలు లేవు
నెమిళ్ళు తలలెత్తి పైకి చూడటం మానేసాయి
(ఋతుసంహారం 3.12)

9
శరదృతువులో
కలువల మీదుగా వీచే గాలులు హాయినిస్తాయి
ఆకాశాన్ని మబ్బులు కమ్మేయవు
అన్నివైపులా సౌందర్యమే
స్వచ్ఛమైనజలాలతో, బురద ఆరిన నేలలతో భూమి
మెరిసే తారలతో, చంద్రకాంతులతో ఆకాశము
శోభిల్లుతుంది.
(ఋతుసంహారం 3.22)

10.
శరదృతువులో మెల్లమెల్లగా నదులు
తమ ఇసుక తీరాలను బయటపెట్టసాగాయి
తొలి సంగమంలో సిగ్గిల్లిన యువతులు
తన అందాలకు కొద్దికొద్దిగా తెరతీసినట్లు
(వాల్మికి రామాయణం – అరణ్యకాండ 30 వ సర్గ)

11.
రాత్రిపూట వికసించే కలువలు, క్రౌంచపక్షుల అరుపులు
పూర్తిగా పండిన వరి పొలాలు, ఆహ్లాదకరమైన గాలులు
ప్రకాశవంతమైన వెన్నెల లాంటివి
వర్షఋతువు వెళిపోయి శరదృతువు
వచ్చిందనటానికి సంకేతాలు
(వాల్మికి రామాయణం – అరణ్యకాండ 30 వ సర్గ)

12.
శరదృతు సాయింత్రపువేళ
ఏనుగుకుంభస్థలమనే చీకటిని
వెన్నెల కిరణాలనే పంజాతో చంద్రసింహం చీల్చగా
నక్షత్రాలనే ముత్యాలు రాలి చెల్లాచెదురయ్యాయి
(లీలావాయి- కౌతూహలుడు)
(ఏనుగు కుంభస్థలంలో ముత్యాలుంటాయని కవి సమయం)

13.
రెల్లుపూలతో నిండిన నేల తెల్లగా ఉంది
ఉజ్వల చంద్రకాంతితో రాత్రులు తెల్లగా ఉన్నాయి
హంసల గుంపుల వలన నదులు తెల్లగా ఉన్నాయి
ఏడాకుల చెట్ల పూలతో నిండిన వనాలు తెల్లగా ఉన్నాయి
జాజిపూలతో నిండిన తోటలు తెల్లగా ఉన్నాయి
ఋతుసంహారం – 3.3

14.
ముసలిదై ఒంగిపోయిన చెట్టు అని కూడా చూడకుండా
ఆ బీరతీగ దాన్ని ఎలా పెనవేసుకొంటుందో చూడు
తప్పంతా
మత్తెక్కించే నీలికలువల వాసనతో గుప్పుమనే శరదృతువుది
(గాథాసప్తశతి – 6.34)

15.
ప్రవాహం వెనక్కి వెళ్ళటంతో
అలల జాడలతో బయటపడ్డ ఇసుక తీరంపై
పిగిలిపిట్టల సందడి మొదలైంది.
అడవి బాతులను అతిథుల్లా ఆదరిస్తూ
కలువలను పునరుజ్జీవింపచేసిన
ఈ శరదృతువు
మేఘాలకు మాత్రం వార్ధక్యాన్ని ప్రసాదించింది
( మనొ వినొద- విద్యాకరుని సుభాషిత రత్నకోశ 268)

16.
శరత్కాల నదీతీరం తెల్లగా ఉంది
కొంగలు ఒంగి తమపొడవైన ముక్కులతో గొప్ప ఏకాగ్రతతో
చేపలు పట్టుకొవటంలో నిమగ్నమై ఉన్నాయి.
జిట్టంగి పిట్టలు బాణాల్లా దూసుకుపొతున్నాయి
తెల్లని బాతుల గుంపు దండకడియంలా అనిపిస్తూంది
చెంగలువ పూలపై తుమ్మెదల గుంపు తచ్చాడుతోంది
ఎంత మనోహర దృశ్యం ఈ శరత్కాల నదీ తీరం
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ 275)

17.
అడవి వాగులు ప్రమాదకరమైనవి
దట్టమైన రెల్లుపొదలు ఆవరించి ఉంటాయి
వాని ఇసుక ఒడ్డుపై మొసళ్ళు అటు ఇటూ
పాకిన ఆనవాళ్ళు కనిపిస్తూంటాయి
వాని బురద గుంటల వద్ద పులుల
దట్టమైన పాదముద్రలు ఉంటాయి
అడవి వాగు నీళ్ళు మాత్రం తేటగా
అద్దంలా మెరుస్తూంటాయి.
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ 281)

18.
విశృంఖలంగా ప్రవహించిన నీటికి నిలకడ నేర్పి
పంటలు పండినపుడు అవి వినమ్రతతో నేలకు వంగేలా చేసి
నెమళ్ళ సౌందర్యాతిశయాన్ని అణచి - శరదృతువు
ఈ లోకానికి వినయం అనే గుణాన్ని భోదిస్తోంది
(విశాఖదత్త- సంస్కృత కవి)

19.
కారుచిచ్చు వల్ల నల్లబడ్డ వింధ్యపర్వత శ్రేణి
శరత్కాల తెల్లని మబ్బులతో కలసి
క్షీరసాగరమధన సమయంలో
ఎగసిపడ్డ పాలతుంపరలు పడ్డా విష్ణుమూర్తి లా ఉంది
(గాథాసప్తశతి - 117)

20.
కమ్ముకొన్న దట్టమైన మంచుకారణంగా
సూర్యుడు ఉదయించిన సంగతి
పక్షుల కిలకిలారావాల ద్వారా మాత్రమే తెలుస్తోంది
(అజ్ఞాత సంస్కృత కవి)
.
అనువాదం: బొల్లోజు బాబా
(ఇంకా ఉంది)

Sunday, April 9, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 2


.
వర్షఋతువు
.
వర్షాలు పడే కాలం. శ్రావణ, భాద్రపద మాసములు. ఇంగ్లీషు నెలల ప్రకారం జూలై నుండి సెప్టెంబరు మధ్య.
వానాకాలంలో సమస్త జీవరాశికి నీరు లభిస్తుంది. ఆహారోత్పత్తి జరుగుతుంది. సంతానానికి సమృద్ధిగా ఆహారం దొరికే కాలం కనుక అడవి జంతువులకు ఈ కాలం బ్రీడింగ్ సీజన్.
అప్పట్లో కుటుంబపెద్ద భార్యా పిల్లలను గ్రామాలలో విడిచిపెట్టి నగరాలకు వెళ్ళి తమ ఉత్పత్తులను అమ్ముకోవటమో లేక అక్కడ వ్యాపారం చేయటమో లేదా తమ వృత్తిపరమైన సేవలు అందించి ధనం సంపాదించటం చేసేవాడు. వానాకాలం వస్తే వాగులు వంకలు పొంగి దారులు మూసుకుపోయి రెండు మూడు నెలలపాటు ఎక్కడివారు అక్కడ నిలిచిపోవలసి వచ్చేది. ఆ కారణంగా వానాకాలం లోపులో ఇంటికి చేరుకోవాలని అతను తొందరపడటం, ఇంటివద్ద ఆమె ఎదురుచూడటం – నెలల విరహానంతరం వారు జరుపుకొనే శృంగారం వానాకాలానికి ప్రతీకగా ప్రాచీన సాహిత్యంలో పదే పదే కనిపిస్తుంది

వానలకు ప్రకృతి శుభ్రబడి మెరిసే కొత్త అందాలతొ దర్శన మిస్తుంది. కవులు లోతైన ఉపమానాలతో వర్షఋతు సౌందర్యాన్ని దర్శింపచేసారు (1, 3, 5, 12, 13, 14, 16, 19).
పరదేశమేగిన భర్తల కొరకు ఆందోళనతో, విరహంతో ఎదురుచూసే భార్యలను కొన్ని గాథలలో చూస్తాం (2, 21).

వానాకాలం వచ్చేలోపు ఇంటికి చేరాలని కంగారు పడే భర్తలు (10, 20) ఉంటారు. వానలకు ఇల్లు చెడకుండా ఒక పుళిందుడు ఎలా పునర్నిర్మించుకొని జీవితాన్ని రసమయం చేసుకొన్నాడో చెప్పే 17 వ గాథ ముచ్చటకలిగిస్తుంది.

వానాకాలం అనగానే సమస్త ప్రాణకోటికి చెదిరిన గూడు, రేపెలాగడుస్తుందో తెలియని అనిశ్చితి. అవి కొన్ని గాథలలో ఆర్థ్రంగా ప్రతిబింబించాయి ( 6, 8 )

వానాకాలంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. చల్లని ఋతుపవనాలు, తీరిక వేళలు, భూమి సారవంతమై ఆహారం సమృద్ధిగా అందుబాటులోకి రావటం లాంటివి శృంగార ఉద్దీపకాలు. ఈ కాలాన్ని శృంగారం జరుపుకొనే కవిసమయంగా ప్రాచీన కవులు స్థిరపరిచారు చాలా గాథలు శృంగార నేపథ్యంతో సాగుతాయి (4, 7, 14, 15, 21, 22)

.
1.
మహారాజు మందిమార్బలంతో కదిలినట్లు
వర్షఋతువుకూడా కదులుతోంది
మదపుటేనుగులవంటి నల్లని మేఘాలతో
తళుకుల రంగుల పతాకాల్లాంటి మెరుపులతో
డంకానాదాల్ని తలపించె ఉరుముల ధ్వనులతో.
ప్రేమికులకు ఎంతో ప్రియమైన ఋతువు ఇది!
(ఋతుసంహారం – కాళిదాసు 2.1)

2.
తుఫానుకు పైకప్పు ఎగిరిపోగా
వాన నీరు గోడలవెంబడి జారుతున్నపుడు
భర్త వచ్చే రోజుకోసం గోడపై వేసుకొన్న గీతలలెక్కలు
చెరిగిపోకుండా చెయ్యి అడ్డం పెడుతుంది ఆ ఇల్లాలు
(గాథాసప్తశతి 170)

3
వాన వెలిసాకా
పచ్చరాతి సూదికి ముత్యం గుచ్చినట్లు
గరిక అంచున వేలాడుతున్న నీటి బిందువును
ఒక నెమలి తన పొడవాటి మెడను సారించి
ముక్కుతో పొడుస్తోంది
(గాథాసప్తశతి - 394)

4.
నా తల్లి నీతల్లి ఒకరికొకరు తెలియదు
నా తండ్రి నీ తండ్రి బంధువులూ కారు
కానీ నువ్వూ నేనూ
ఎలా ఒకరినొకరం కనుగొన్నాం?
మన హృదయాలు ఎర్రమట్టి వాననీరుల్లా
ఎలా ఒకదానిలో మరొకటి కరిగిపోయాయి
(Kuruntokai – 40)

5.
వర్షధారలనే పగ్గాలతో
నేలను పైకి లాక్కొందామనే
మబ్బుల ఆలోచన ఫలించకపోవటంతో
అవి ఎలా మూలుగుతున్నాయో చూడు
ఉరుముల శబ్దాలతో - (గాథాసప్తశతి - 436)

6.
వరదలో కొట్టుకుపోతున్న
చెట్టుకొమ్మ చివరన గూటిలో ఉన్న తన పిల్లలను
కాపాడాలని వరదను వెంబడిస్తోంది తల్లి కాకి - (గాథాసప్తశతి – 202)

7.
అతని మగసిరికి దక్కిన అదృష్టము
నా ఆడతనం చూపిన బరితెగింపు
ఉప్పొంగి తొంగిచూసిన గోదావరికి ఇంకా
వానాకాలపు రాత్రులకు మాత్రమే తెలుసు - (గాథాసప్తశతి 231)

8
వానకు తడిచి కంచెపై కూర్చున్న కాకులు
మురికి ముఖాలతో, సత్తువ కోల్పోయిన రెక్కలతో
వేలాడేసిన మెడలతో
కొర్రువేసినట్టు కనిపిస్తున్నాయి (గాథాసప్తశతి – 564)

9.
వానలు కురిస్తే లోకం బ్రతుకుతుంది
జీవులకు వానలే అమృతం
(తిరుక్కురళ్ 1.1.11)

10
విరహంతో కాలిపోతున్న బాటసారి దేహంపై
తొలకరి చినుకులు పడి చిటపటధ్వనులు చేస్తున్నాయి
తడి వస్తువునేదో నిప్పుల్లో వేసినట్లు (వజ్జలగ్గ – 373)

11.
కవులు పదే పదే "పరి" ఒక్కరినే
పొగుడుతారు కాని
ఈ లోకాన్ని రక్షించేది
వానలు కూడా (purananuru 107)
(వేల్ పరి -రాజు)

12.
అతను రాత్రుల పొడవు తగ్గించాడు
ప్రవహించే జలాలను దోచుకొన్నాడు
భూమిని వేడెక్కించాడు
దట్టమైన పచ్చదనాల్ని శుష్కింపచేసాడు.
ఆ సూర్యుడు ఇప్పుడు ఎక్కడికిపోయాడు?
నీటిని నింపుకొన్న మేఘాలు
నలుదిక్కులు తిరుగుతూ
మెరుపును దివిటీగా చేసుకొని
అతనికొరకు వెతుతున్నాయి
(Sarngadharapaddhati 3869)

13.
మంచు వర్షం కలిగించే చలికి
బెదిరిన ఆకాశం ఒక్క రంద్రంకూడా లేని
దళసరి మబ్బుల దుప్పటి కప్పుకొంది
(Sarngadharapaddhati 3862)

14.
మదజల వాసనకై తుమ్మెదలు ముసురుకోగా
అడవి ఏనుగుల శిరస్సులు నీలి కలువలలా ఉన్నాయి.
ఉరుముల శబ్దాలను విని
ఎక్కడో మరొక ఏనుగుల గుంపు చేస్తున్న
ఘీంకారాలు అని తలుస్తూ
ఇక్కడ ఇవి మరింత గంభీరంగా గర్జిస్తున్నాయి
(ఋతుసంహారం 2.15)

15.
మోసకారి అయిన ప్రియుని పై అలిగి
శయ్యపై అటుతిరిగి శయనించిన నాయిక
మెరుపులు ఉరుములతో భీకరమైన వర్షం
మొదలవగానే భీతిల్లి అన్నీ మరచి
అతనిని గాఢాలింగనం చేసుకొన్నది (ఋతుసంహారం 2.11)

16..
ఎవరో అల్లరి పిలగాడు బురదకాళ్లతో ఇల్లంతా తిరిగినట్లు
అడవి చిచ్చులకు పైకి లేచిన బూడిదను పూసుకొని
నిలకడలేని నీటిని మోసుకుంటూ తిరిగే మబ్బులను చూస్తే
ఎవరికి హృదయోల్లాసం కలుగదూ?
(Sarngadharapaddhati 3866)

17.
నల్లని మేఘాలతో కూడిన ఆకాశాన్ని చూసి
ఆహ్లాదకరమైన ఉరుముల శబ్దాలను విని
ఒక వేటగాడు, ఏనుగుదంతాలతో గోడలు కట్టి
జడలబర్రె చర్మంతో పైకప్పును నిర్మించి
లక్క, కస్తూరిలతో నేలను మెత్తి
పులిచర్మంపై కునుకు తీస్తున్నాడు
భార్య తన ఛాతీపై వేసిన చేతిపై చేయి ఉంచి
(Sarngadharapaddhati 3873)

18.
తొలకరివాననీరు
గడ్డి బురద నింపుకొని మెలికలు తిరుగుతూ
కొండదిగువకు వడివడిగా ప్రవహిస్తూంటే
అదాటుగా చూసిన కప్పలు దాన్ని పాముగా భ్రమించి
బెదురుతున్నాయి (ఋతుసంహారము – కాళిదాసు 2.13)

19.
పశులకాపర్లు వేణువులూదుతూ
ఇండ్లకు వెళుతున్నారు
లేగలను తలచుకొంటూ ఆలమందలు
వారివెనుక నడుస్తూన్నాయి
ఒక్కసారిగా
మబ్బులు ఉరుములై ధ్వనించాయి
కళ్ళముందే ఆకాశంలో
ఇంద్రచాపం విచ్చుకొంది
ఎంత అందమైన సాయింత్రం అది!
Ainthinai elupathu 22

20.
వానాకాలం సమీపిస్తుండటంతో
ఇంటికి త్వరగా చేరుకోవాలని
ఆ బాటసారి దారిని చుట్టి మూటకట్టేస్తాడు
దానిని ముక్కలు చేసి ఒక్క గుక్కలో మింగేస్తాడు.
(గాథాసప్తశతి - 696)

21.
ఎక్కడచూసినా కప్పల బెకబెక
తీయని గొంతులతో పక్షుల కిలకిలారవములు
ఆకాశం మూలమూలలా వర్షఋతువు మొదలైంది
అయినప్పటికీ
అతని రథం నన్ను చేరేందుకు ఇంకా ప్రయాణం కట్టలేదు
నా కనులు భోరున వర్షిస్తున్నాయి
Ainkurunuru 453

22
వానలో తడిసి ముద్దయి ఇంటికొచ్చిందామె
చినుకులకు కనుల కాటుక కరిగిపోయింది
నీలి రవికె తడిచి బిగుతైన చనులను కప్పుతూ
ఆమె సహజ అందాలను, ఆకృతిని చాటుతోంది
దుస్తులను మార్చుకొంటూంటే ఆమె భర్త సహాయపడుతున్నాడు
ఎంత అదృష్టవంతురాలామె!

23
ఆకాశం కనిపించదు మబ్బులు కమ్మేసాయి
నేలా కనిపించదు నీరు ముంచెత్తింది
చీకటి పడింది
ఈ రాత్రివేళ, అందరూ నిద్రిస్తుండగా
కొండదిగి మా ఇంటికి ఎలా రాగలవు?
దట్టంగా పూచిన ఏగిస పూలతో
పరిమళించే చిన్న ఇల్లు మాదేనని నీ కెలా తెలుస్తుంది?
Kuruntokai 355
(అజ్ఞాత సంస్కృత కవి)

24.
కుంభవృష్టి కురుస్తోంది
వంటచేసేందుకు పొయ్యిలోకి నిప్పు కొరకు ఇల్లాండ్రు
బురదలో వేసిన చెక్కపలకలపై అడుగులు వేస్తూ
తల తడవకుండా వెదురు బుట్ట నెత్తిపై పెట్టుకొని
అక్కా, ఒదినే అని పిలుచుకొంటూ ఇల్లిల్లూ తిరుగుతున్నారు
Suktimuktavali of Jalhana - 222
.
అనువాదం: బొల్లోజు బాబా
.
(ఇంకా ఉంది)

Saturday, April 8, 2023

మూడోకన్నీటిచుక్క కవితాసంపుటిపై ఒక ప్రశంస.....



ప్రముఖ కవయిత్రి, కథకురాలు శీలా సుభద్రాదేవి గారు నా కవితాసంపుటి "మూడోకన్నీటి చుక్క" చదివి పంపిన మెసేజ్ ఇది.

దీన్ని వారి సహృదయత, వాత్సల్యం, ఆశీస్సులుగా భావిస్తున్నాను.
మేడమ్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. ఈ పుస్తకం కావలసినవారు క్రింద కామెంటులో ఇచ్చిన లింకునుండి డౌన్లోడ్ చేసుకొనవచ్చును
.
బొల్లోజు బాబా గారూ
నమస్తే
బొల్లోజు బాబా నాకు మొదట విమర్శకుడు గానే తెలుసు. అనుకోకుండా ఇటీవల ఆయన కవితాసంపుటి " మూడో కన్నీటి చుక్క" నా చేతికి వచ్చింది. అప్పుడప్పుడు పత్రికల్లో బాబా కవితలు చదివినా నేను అంతగా పట్టించుకోలేదేమో అనిపించింది.
మూడో కన్నీటి చుక్క చదువుతూ ఆశ్చర్యపోయాను.ఈయన కవితాత్మక కథకుడా? కథనాత్మకంగా రాసే కవా?
ఇందులోని ఒక్కొక్క కవితా కథలు చెప్పింది. కథలా కనిపించి కవిత్వాన్ని పండించింది.
కుందుర్తి వచనకవిత్వంలో కథలూ,నాటికలూ,కావ్యాలూ రాయమన్నారు. ఆయన మాటలు బాబా అనుసరించారా? ఎన్నో ప్రశ్నల లోంచి కవిత్వాన్ని చదివాను.
మేకింగ్ ఛార్జీలు లేవు, ప్రవహించే వాక్యం , జీవించడమే, ప్రయాణం, ఒక apocalypse అనంతరం, చిట్టి కురివి మనకి కథలు చెప్తాయి.
నాన్నతనం, మా నాన్నా నేను ,వలసపోవడం ఈ మూడు కవితలలో ఒకప్పటి తండ్రిని, నేటి తననీ నాలుగు దశాబ్దాల దూరం ఉన్నా తమప్రవర్తనల్ని సరిపోల్చుకుంటూ కవిత్వీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.
ఆ మూడు రోజులూ, అస్తిత్వం వంటి స్త్రీ వాదకవితలున్నా 'ఏంపని ఉంటుంది నీకు ' కవిత మాత్రం ఒక మంచి స్త్రీవాదకవిత.
ఇలా కవితలన్నీ చెప్పుకునే కన్నా మూడో కన్నీటి చుక్క ని మనం కూడా చేతిలోకి తీసుకుని హత్తుకుంటే ఈ కవి ఒక కవితలో చెప్పినట్లు మరిన్ని దృశ్యాల్ని కళ్ళల్లోకి ఒంపుకుని వేడుకగా కవిత్వాన్ని పిండుకోవచ్చు.
మనసారా అభినందనలు బొల్లోజు బాబా గారూ.

-- శీలా సుభద్రాదేవి


ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును

https://archive.org/details/bolloju-babu-moodo-kanneeti-full

Thursday, April 6, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 1



భారతదేశపు ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య శీతోష్ణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఉత్తరభారతదేశంలో శీతాకాలం సుదీర్ఘంగా ఉంటే దక్షిణభారతదేశంలో వేసవికాలం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సంవత్సర కాలాన్ని ఆరు ఋతువులుగా వర్ణించటం, అటు ప్రాచీన సంస్కృత, ప్రాకృత ఇటు తమిళ సాహిత్యాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాచీన కవులు భిన్న ఋతువులను భిన్న ఉద్వేగాలను పలికించటం కొరకు నేపథ్యంగా వాడుకొన్నారు.

ఋతువర్ణన అనగానే కాళిదాసు ఋతుసంహారం వెంటనే స్ఫురిస్తుంది. సంస్కృతానికి సంబంధించి ఇదొక క్లాసిక్. అదే సమయంలో ప్రాచీన ప్రాకృత, తమిళ సాహిత్యాలలో కూడా అనేక విధాలుగా ఋతువుల వర్ణన కనిపిస్తుంది. ఇది ఆనాటి సమాజాన్ని, చరిత్రను ప్రతిబింబిస్తుంది. భిన్న ప్రాచీన కావ్యాలలో చెప్పిన ఋతువర్ణనలను తెలుగు చేయాలనే చిన్న ప్రయత్నం ఇది.
***

గ్రీష్మఋతువు

వేసవి కాలం అంటే తాళలేని వేడిమి, గాడ్పులు, ఎండి శుష్కించిన వృక్షజాలం, అడవులను దహించే కార్చిచ్చులతో పాటు ఆహ్లాదాన్నిచ్చే సాయింత్రాలు, వెన్నెల రాత్రులు, మరులు రేపే జాజుల పరిమళాలు లాంటివి కూడా ఉంటాయి. వీటన్నిటినీ ఆనాటి సాహిత్యం ప్రతిబింబించింది.
వేసవి వేడిని తట్టుకోలేక నీడలో సేదతీరే జీవుల వర్ణనలు (1, 5, 6, 17); సాయింత్రపు వేళ సహభోగితో సుఖించే సందర్భాలు (2,4,11), వేసవికాలానికి ప్రతీకగానిలిచే కార్చిచ్చు ప్రస్తావనలు ( 7, 14) కవితాత్మకంగా ఒదిగి పోయాయి.

5,8 లు ఒకే వస్తువును చెబుతున్నప్పటికీ- సప్తశతి గాథలో అది ఒక చిన్న పదునైన పదచిత్రంతో ధ్వన్యాత్మకంగా చెప్పగా, సారంగధరపద్దతి కావ్యంలోని వర్ణనలో నోరారా, ధారాళంగా వాచ్యంగా చెప్పటం ప్రాచీన భారతీయ సాహిత్యం ప్రయాణించిన రెండు భిన్న ప్రక్రియా మార్గాలను సూచిస్తాయి. 12 వ గాథ లోని ప్రశ్న, 15 వ గాథలోని ఇంటిబెంగా అనశ్వరమైనవి. 13 వగాథ ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తోన్నది.

.
1.
మధ్యాహ్నపు మార్తాండుడు నిప్పులు కురిపిస్తున్నాడు
ఆ వేడికి తాళలేక ఛాయాదేవి చెట్ల నీడకు చేరి
ఆ చల్లని తావులో తలదాచుకొంటోంది
(సారంగధరపద్ధతి – 3835-పద్నాలుగో శతాబ్దపు సంస్కృత కావ్యం)

2.
వేసవి రాత్రులలో ప్రేమికులు
పూల పరిమళాలు నిండిన మేడలపైకి చేరి
మధుపానం వల్ల మత్తెక్కిన ప్రియతముల పెదవులను గ్రోలుతూ
వీనుల విందైన వీణానాదాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తారు.
(ఋతుసంహారం 1.3 – 4 వశతాబ్దపు కాళిదాసు రచన)

3.
తెల్లని మేడలపై నిద్రించే తరుణీమణుల
మోములను చూసిన చంద్రుడు
అంతటి వర్ఛస్సు తనకు లేనందుకు వెలవెలబోయి
వేకువ వెలుగులో కరిగిపోయాడు.
(ఋతుసంహారం – కాళిదాసు 1.9)

4.
చందనము పూసిన వీవెనలనుండి వచ్చే పిల్లగాలులు
ముత్యాలను అలంకరించుకొన్న వక్షోజాల మెత్తని స్పర్శ
చెవులకు హాయిగొలిపే వల్లకీ రవములు
నిద్రిస్తోన్న మన్మధుడిని మేలుకొలుపుతున్నాయి.
(ఋతుసంహారం – కాళిదాసు 1.8 )

5.
మధ్యాహ్న సూర్యుడి ప్రతాపానికి భయపడి
నీ నీడకూడా నీ కాళ్ళక్రిందకు నక్కుతోంది
బాటసారీ!
కాసేపు ఇలా నీడలోకి రా!
(గాధాసప్తశతి 49 – ఒకటవ శతాబ్దపు హాల చక్రవర్తి సంకలనం)

6.
ఎండకు తాళలేక
జింక ఒకటి ఎండి మోడుబారిన చెట్టు క్రిందకు చేరింది
సంపదలు కోల్పోయిన సజ్జనుడు
నిస్సహాయతతో దుర్జనుని శరణుజొచ్చినట్లు
(Sarngadharapaddhati 3836)

7.
సమస్తప్రాణకోటిని బూడిద చేసిన కార్చిచ్చు
ఎండిన చెట్టుపైకెక్కి అడవిని పరికిస్తోంది
ఇంకా ఏమేం మిగిలాయా అని.
(వజ్జలగ్గ 644 – 8వ శతాబ్దానికి చెందిన జయవల్లభుడు రచించిన కావ్యం)

8.
వేసవి దినాలలో
సూర్యుని ప్రతాపం కఠినంగా ఉంటుంది
దారులను మూసేస్తుంది
మొక్కలను వాడిపోయేలా చేస్తుంది
జింకలపై కోపం చూపిస్తుంది
చెట్లను మాడ్చేస్తుంది
తుమ్మెదల వేగం మందగింపచేస్తుంది
వికసించడానికి తెగించిన మల్లెలను కసురుకొంటుంది
నదులను ఎండగడుతుంది
సముద్రాలను మరిగిస్తుంది
ఓ బాటసారీ
ఈ వేడిమిలో నువ్విలా తిరుగుతూ ఉంటే
ఎలా బ్రతగ్గలవూ?
Sarngadharapaddhati 3554

9.
మునుపెన్నడు చూడని చెరువు అడుగుభాగాన్ని
వేసవి బయలుపరచింది
పరిగె చేపలు, తాబేళ్లు ఏండకు మాడిపోతున్నాయి
అట్టకట్టిన చెరువు మట్టి రాతిఫలకలా మారింది (గాథాసప్తశతి 414)

10.
వేసవి మధ్యాహ్నం
తలుపుల కనురెప్పలు మూసుకొని
నిద్రిస్తూంది ఊరు.
ఎక్కడో తిరుగలి గరగర
ఇళ్ళు పెడుతోన్న గురకలాగ (గాథాసప్తశతి 671)

11.
తురుముకొన్న పూలు రాలుతూండగా
పన్నీటి స్నానంతో పరిమళిస్తూన్న తడిసిన ఒత్తైన కురులను
వేసవి మధ్యాహ్నపు శృంగారానంతరం అలసిన భర్త ఛాతీపై
చల్లదనం కొరకు కప్పుతోంది ఆమె (గాథాసప్తశతి – 244)

12.
నిర్జల ఎడారులకు అవతల ఉన్న దేశానికి
సంపదలకొరకు నడివేసవిలో బయలుదేరుతున్నావు
ఎత్తైన పర్వతదేశపు నా రాజా!
నిన్నుప్రేమించటానికే జీవించే స్త్రీ కి పుట్టిన
నీ మొదటి కొడుకు చిరునవ్వు కన్నా
నీవు గడించబోయే సంపదలు అంత గొప్పవా?
(Ainkurunuru 309 – నాలుగో శతాబ్దానికి చెందిన ప్రాచీన తమిళ కావ్యం)

13.
ఆమె పాలుతాగటం మానివేసింది
చెలికత్తెలతో ఆటలు కూడా.
ప్రియునితో లేచిపోయి తెలియనిదారులపై
నడవటం చాలా సులభం అని అనుకొంటూందా ఆమె?
ఆ మార్గం వెదురుపొదలతో నిండి ఉంది.
మదమెక్కిన ఏనుగు ఒకటి
గున్నంగి చెట్టును దంతాలతో పదే పదే కుమ్ముతూ
దాని ఎండిన కొమ్మలు చేసే గలగలలను
వేసవి గాడ్పులకు మాడిన కొండలపై పడుతోన్న వాన చప్పుళ్ళుగా
భ్రమపడుతోంది.
(Kuruntokai 396 - BCE రెండో శతాబ్దానికి చెందిన తమిళ కావ్యం)

14.
మొత్తం అడవిని దహించి దహించి
అలసిపోయిన కార్చిచ్చు
మైదానంలో ప్రవేశించి
గట్టునున్న రెల్లుగడ్డిని దాటుకొని
ఏట్లో దాహం తీర్చుకొంటోంది (గాథాసప్తశతి - 758)

15.
ఎన్నో పర్వతాలను, ఎన్నో భాషలను
ఎన్నో ఎండిపోయిన వేసవి దారులను
దాటుకొని ముందుకు సాగాను.
ఒకనాడు
గున్నంగి చెట్టు కొమ్మపై చెదిరిన ఈకలతో
ఉలిముక్కు కల ఒంటరి ఆడగెద్దను చూసినప్పటినుంచీ
నా ప్రియురాలు పదే పదే గుర్తుకు వస్తూన్నది
ఆమె సుగుణాలు, మెరిసే ఆమె చేతి గాజులను
ఎన్నటికీ మరచిపోలేను
(Ainkurunuru 321)

16.
నాలుక పిడుచకట్టుకుపోయిన దాహంతో
మండే సూర్యుని వేడిమిని తాళలేక
దూరంగా కనిపించే నీలిరంగు ఆకాశాన్ని నీళ్ళుగా
భ్రమపడిన జింకలు దారి తప్పి అడవికి దూరంగా సంచరిస్తున్నాయి
(ఋతుసంహార 1.11 - కాళిదాసు)

17.
సూర్యకిరణాల తాకిడికి వేడిగా మారిన ఇసుకపై
పాకలేక ఆ నాగుపాము శత్రువు అని కూడా ఎంచలేని స్థితిలో
నెమలిపింఛపు నీడలో ఏ చలనమూ లేక పడి ఉన్నది
(1.13 ఋతుసంహార – కాళిదాసు)
.
అనువాదం: బొల్లోజు బాబా
.
ఇంకా ఉంది.

Monday, April 3, 2023

@yanam



Yesterday spent nice time with school children at Veda Public School, Yanam.
Veda Public shool began creating a Brand. Hope it will reach new heights in the coming days under the direction of My college mate Sri G. Ramarao garu.
I thank directors of the school for inviting me as a guest.
Met many old pals who are in good ranks in Yanam Government.