Wednesday, April 12, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 3


.
శరదృతువు /Autumn
.
ఆశ్వయుజ కార్తీక మాసములలో శరదృతువు వస్తుంది. సెప్టెంబరు, నవంబరు నెలలు. వానలు పడటం తగ్గుతుంది (8, 9, 16). ప్రకాశవంతమైన వెన్నెల కాస్తుంది (12, 13). పచ్చికబయళ్ళు ఒత్తుగా ఉంటాయి. నీటి ప్రవాహాలజోరు తగ్గుతుంది (10, 17, 18). తామరలు, నీటిపక్షుల సందటి మొదలౌతుంది (2, 4, 11,15). దసరా, నవరాత్రి లాంటి పండుగలు వచ్చే ఋతువు ఇది. పంటలు కోతకు వచ్చేసమయం. మంచు కురుస్తుంది (6, 20). పగటి కాలం నిడివి తగ్గుతూ, రాత్రి దీర్ఘంగా ఉండటం మొదలౌతుంది. ఆకాశంలో తెల్లని మబ్బులు/శరత్కాల మేఘాలు కనిపిస్తాయి (19). ఆటపాటలకు, కొత్తప్రేమలకు అనువైన కాలమిది (14).
.
1
శరదృతువులో సరస్సు జలాలు
పైన మాత్రమే వేడిగా ఉండి
లోపల చల్లగా ఉంటాయి
కోపంవచ్చిన మంచివాళ్ళ హృదయాల్లా
(గాథాసప్తశతి 286)

2
చంద్రుడు రాత్రికి
కలువలు చెరువుకి
పూలగుత్తులు లతలకు
హంసలు శరదృతువుకు
ఇచ్చే బహుమతి సౌందర్యం
(ధ్వన్యాలోక – 21/లీలావాయి లో కూడా ఇలాంటిదే వర్ణన కలదు)

3
అమ్మాయీ!
నీ ప్రియుని క్షమించు, పట్టుదల విడిచిపెట్టు.
మేలైన సరకమును, మధురజ్ఞాపకాలను మిగిల్చే సయ్యాటలను
ప్రసాదించే శరత్కాలాన్ని వ్యర్ధం చేయకు
(వజ్జలగ్గ- 359) (సరకము=కల్లు)

4.
శరదృతు దేవత
ఒక కాలు చంద్రునిపై మరో కాలు
ఎగురుతోన్న హంసలబారుపై ఉంచి
చేత కలువపూలు ధరించి
ఆకాశం నుండి భూమిపైకి దిగుతోన్నది
(శృంగార ప్రకాశ – 68)

5.
ముగిసిన వానాకాలం
.
నడమంత్రపు సిరి పొందిన వ్యక్తిలా
సూర్యుడు సన్నగా బాధించటం మొదలుపెడతాడు.
కృతజ్ఞతలేని స్నేహితునిలా
జింక తన కొమ్ములను విసర్జిస్తుంది.
శుద్ధాత్ముడైన సాధువు మాటల్లా
నీళ్ళు తేటపడతాయి.
వేశ్యను ఉంచుకొన్న పేదవానిలా
మట్టి క్రమక్రమంగా పొడిబారుతుంది.
Subhashita ratnakosa of Vidyakara

6
మనం ఎన్నటికీ ఇక్కడే కలిసి జీవిద్దాం అని నమ్మించి
నన్ను విడిచి వెళ్లిపోయాడు అతగాడు
చల్లని పొగమంచు పరిచే ఈ శరదృతువులో
చంద్రునితో పోటీ పడే వెన్నెల రేకలతో
వికసించే చంద్రకాంత పూలతో
తెల్లని తంతువులతో అలరించే దిరిసెన పూలతో
పచ్చని పొదలు అలంకరించబడి ఉన్నాయి
చెలీ!
అతను ఈ విషయాల గురించి ఆలోచించడా?
(Ainkurunuru – 56)

7
ఉబ్బు రొమ్ముల యవ్వనం లాంటి వానాకాలం
వెళ్లిపోయింది
తొలిగా పూచిన రెల్లుపూవు
భూదేవి శిగలో మొలిచిన మొదటి తెల్ల వెంట్రుక వలె ఉంది
(గాథాసప్తశతి – 534)

8
మబ్బులు ఇంధ్రధనసును మింగేసాయి
పతాకంలా ప్రకాశించిన మెరుపులు నేడు కానరావు
రెక్కలతో ఆకాశాన్ని వెనక్కినెట్టిన కొంగలు లేవు
నెమిళ్ళు తలలెత్తి పైకి చూడటం మానేసాయి
(ఋతుసంహారం 3.12)

9
శరదృతువులో
కలువల మీదుగా వీచే గాలులు హాయినిస్తాయి
ఆకాశాన్ని మబ్బులు కమ్మేయవు
అన్నివైపులా సౌందర్యమే
స్వచ్ఛమైనజలాలతో, బురద ఆరిన నేలలతో భూమి
మెరిసే తారలతో, చంద్రకాంతులతో ఆకాశము
శోభిల్లుతుంది.
(ఋతుసంహారం 3.22)

10.
శరదృతువులో మెల్లమెల్లగా నదులు
తమ ఇసుక తీరాలను బయటపెట్టసాగాయి
తొలి సంగమంలో సిగ్గిల్లిన యువతులు
తన అందాలకు కొద్దికొద్దిగా తెరతీసినట్లు
(వాల్మికి రామాయణం – అరణ్యకాండ 30 వ సర్గ)

11.
రాత్రిపూట వికసించే కలువలు, క్రౌంచపక్షుల అరుపులు
పూర్తిగా పండిన వరి పొలాలు, ఆహ్లాదకరమైన గాలులు
ప్రకాశవంతమైన వెన్నెల లాంటివి
వర్షఋతువు వెళిపోయి శరదృతువు
వచ్చిందనటానికి సంకేతాలు
(వాల్మికి రామాయణం – అరణ్యకాండ 30 వ సర్గ)

12.
శరదృతు సాయింత్రపువేళ
ఏనుగుకుంభస్థలమనే చీకటిని
వెన్నెల కిరణాలనే పంజాతో చంద్రసింహం చీల్చగా
నక్షత్రాలనే ముత్యాలు రాలి చెల్లాచెదురయ్యాయి
(లీలావాయి- కౌతూహలుడు)
(ఏనుగు కుంభస్థలంలో ముత్యాలుంటాయని కవి సమయం)

13.
రెల్లుపూలతో నిండిన నేల తెల్లగా ఉంది
ఉజ్వల చంద్రకాంతితో రాత్రులు తెల్లగా ఉన్నాయి
హంసల గుంపుల వలన నదులు తెల్లగా ఉన్నాయి
ఏడాకుల చెట్ల పూలతో నిండిన వనాలు తెల్లగా ఉన్నాయి
జాజిపూలతో నిండిన తోటలు తెల్లగా ఉన్నాయి
ఋతుసంహారం – 3.3

14.
ముసలిదై ఒంగిపోయిన చెట్టు అని కూడా చూడకుండా
ఆ బీరతీగ దాన్ని ఎలా పెనవేసుకొంటుందో చూడు
తప్పంతా
మత్తెక్కించే నీలికలువల వాసనతో గుప్పుమనే శరదృతువుది
(గాథాసప్తశతి – 6.34)

15.
ప్రవాహం వెనక్కి వెళ్ళటంతో
అలల జాడలతో బయటపడ్డ ఇసుక తీరంపై
పిగిలిపిట్టల సందడి మొదలైంది.
అడవి బాతులను అతిథుల్లా ఆదరిస్తూ
కలువలను పునరుజ్జీవింపచేసిన
ఈ శరదృతువు
మేఘాలకు మాత్రం వార్ధక్యాన్ని ప్రసాదించింది
( మనొ వినొద- విద్యాకరుని సుభాషిత రత్నకోశ 268)

16.
శరత్కాల నదీతీరం తెల్లగా ఉంది
కొంగలు ఒంగి తమపొడవైన ముక్కులతో గొప్ప ఏకాగ్రతతో
చేపలు పట్టుకొవటంలో నిమగ్నమై ఉన్నాయి.
జిట్టంగి పిట్టలు బాణాల్లా దూసుకుపొతున్నాయి
తెల్లని బాతుల గుంపు దండకడియంలా అనిపిస్తూంది
చెంగలువ పూలపై తుమ్మెదల గుంపు తచ్చాడుతోంది
ఎంత మనోహర దృశ్యం ఈ శరత్కాల నదీ తీరం
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ 275)

17.
అడవి వాగులు ప్రమాదకరమైనవి
దట్టమైన రెల్లుపొదలు ఆవరించి ఉంటాయి
వాని ఇసుక ఒడ్డుపై మొసళ్ళు అటు ఇటూ
పాకిన ఆనవాళ్ళు కనిపిస్తూంటాయి
వాని బురద గుంటల వద్ద పులుల
దట్టమైన పాదముద్రలు ఉంటాయి
అడవి వాగు నీళ్ళు మాత్రం తేటగా
అద్దంలా మెరుస్తూంటాయి.
(విద్యాకరుని సుభాషిత రత్నకోశ 281)

18.
విశృంఖలంగా ప్రవహించిన నీటికి నిలకడ నేర్పి
పంటలు పండినపుడు అవి వినమ్రతతో నేలకు వంగేలా చేసి
నెమళ్ళ సౌందర్యాతిశయాన్ని అణచి - శరదృతువు
ఈ లోకానికి వినయం అనే గుణాన్ని భోదిస్తోంది
(విశాఖదత్త- సంస్కృత కవి)

19.
కారుచిచ్చు వల్ల నల్లబడ్డ వింధ్యపర్వత శ్రేణి
శరత్కాల తెల్లని మబ్బులతో కలసి
క్షీరసాగరమధన సమయంలో
ఎగసిపడ్డ పాలతుంపరలు పడ్డా విష్ణుమూర్తి లా ఉంది
(గాథాసప్తశతి - 117)

20.
కమ్ముకొన్న దట్టమైన మంచుకారణంగా
సూర్యుడు ఉదయించిన సంగతి
పక్షుల కిలకిలారావాల ద్వారా మాత్రమే తెలుస్తోంది
(అజ్ఞాత సంస్కృత కవి)
.
అనువాదం: బొల్లోజు బాబా
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment