Sunday, April 9, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 2


.
వర్షఋతువు
.
వర్షాలు పడే కాలం. శ్రావణ, భాద్రపద మాసములు. ఇంగ్లీషు నెలల ప్రకారం జూలై నుండి సెప్టెంబరు మధ్య.
వానాకాలంలో సమస్త జీవరాశికి నీరు లభిస్తుంది. ఆహారోత్పత్తి జరుగుతుంది. సంతానానికి సమృద్ధిగా ఆహారం దొరికే కాలం కనుక అడవి జంతువులకు ఈ కాలం బ్రీడింగ్ సీజన్.
అప్పట్లో కుటుంబపెద్ద భార్యా పిల్లలను గ్రామాలలో విడిచిపెట్టి నగరాలకు వెళ్ళి తమ ఉత్పత్తులను అమ్ముకోవటమో లేక అక్కడ వ్యాపారం చేయటమో లేదా తమ వృత్తిపరమైన సేవలు అందించి ధనం సంపాదించటం చేసేవాడు. వానాకాలం వస్తే వాగులు వంకలు పొంగి దారులు మూసుకుపోయి రెండు మూడు నెలలపాటు ఎక్కడివారు అక్కడ నిలిచిపోవలసి వచ్చేది. ఆ కారణంగా వానాకాలం లోపులో ఇంటికి చేరుకోవాలని అతను తొందరపడటం, ఇంటివద్ద ఆమె ఎదురుచూడటం – నెలల విరహానంతరం వారు జరుపుకొనే శృంగారం వానాకాలానికి ప్రతీకగా ప్రాచీన సాహిత్యంలో పదే పదే కనిపిస్తుంది

వానలకు ప్రకృతి శుభ్రబడి మెరిసే కొత్త అందాలతొ దర్శన మిస్తుంది. కవులు లోతైన ఉపమానాలతో వర్షఋతు సౌందర్యాన్ని దర్శింపచేసారు (1, 3, 5, 12, 13, 14, 16, 19).
పరదేశమేగిన భర్తల కొరకు ఆందోళనతో, విరహంతో ఎదురుచూసే భార్యలను కొన్ని గాథలలో చూస్తాం (2, 21).

వానాకాలం వచ్చేలోపు ఇంటికి చేరాలని కంగారు పడే భర్తలు (10, 20) ఉంటారు. వానలకు ఇల్లు చెడకుండా ఒక పుళిందుడు ఎలా పునర్నిర్మించుకొని జీవితాన్ని రసమయం చేసుకొన్నాడో చెప్పే 17 వ గాథ ముచ్చటకలిగిస్తుంది.

వానాకాలం అనగానే సమస్త ప్రాణకోటికి చెదిరిన గూడు, రేపెలాగడుస్తుందో తెలియని అనిశ్చితి. అవి కొన్ని గాథలలో ఆర్థ్రంగా ప్రతిబింబించాయి ( 6, 8 )

వానాకాలంలో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. చల్లని ఋతుపవనాలు, తీరిక వేళలు, భూమి సారవంతమై ఆహారం సమృద్ధిగా అందుబాటులోకి రావటం లాంటివి శృంగార ఉద్దీపకాలు. ఈ కాలాన్ని శృంగారం జరుపుకొనే కవిసమయంగా ప్రాచీన కవులు స్థిరపరిచారు చాలా గాథలు శృంగార నేపథ్యంతో సాగుతాయి (4, 7, 14, 15, 21, 22)

.
1.
మహారాజు మందిమార్బలంతో కదిలినట్లు
వర్షఋతువుకూడా కదులుతోంది
మదపుటేనుగులవంటి నల్లని మేఘాలతో
తళుకుల రంగుల పతాకాల్లాంటి మెరుపులతో
డంకానాదాల్ని తలపించె ఉరుముల ధ్వనులతో.
ప్రేమికులకు ఎంతో ప్రియమైన ఋతువు ఇది!
(ఋతుసంహారం – కాళిదాసు 2.1)

2.
తుఫానుకు పైకప్పు ఎగిరిపోగా
వాన నీరు గోడలవెంబడి జారుతున్నపుడు
భర్త వచ్చే రోజుకోసం గోడపై వేసుకొన్న గీతలలెక్కలు
చెరిగిపోకుండా చెయ్యి అడ్డం పెడుతుంది ఆ ఇల్లాలు
(గాథాసప్తశతి 170)

3
వాన వెలిసాకా
పచ్చరాతి సూదికి ముత్యం గుచ్చినట్లు
గరిక అంచున వేలాడుతున్న నీటి బిందువును
ఒక నెమలి తన పొడవాటి మెడను సారించి
ముక్కుతో పొడుస్తోంది
(గాథాసప్తశతి - 394)

4.
నా తల్లి నీతల్లి ఒకరికొకరు తెలియదు
నా తండ్రి నీ తండ్రి బంధువులూ కారు
కానీ నువ్వూ నేనూ
ఎలా ఒకరినొకరం కనుగొన్నాం?
మన హృదయాలు ఎర్రమట్టి వాననీరుల్లా
ఎలా ఒకదానిలో మరొకటి కరిగిపోయాయి
(Kuruntokai – 40)

5.
వర్షధారలనే పగ్గాలతో
నేలను పైకి లాక్కొందామనే
మబ్బుల ఆలోచన ఫలించకపోవటంతో
అవి ఎలా మూలుగుతున్నాయో చూడు
ఉరుముల శబ్దాలతో - (గాథాసప్తశతి - 436)

6.
వరదలో కొట్టుకుపోతున్న
చెట్టుకొమ్మ చివరన గూటిలో ఉన్న తన పిల్లలను
కాపాడాలని వరదను వెంబడిస్తోంది తల్లి కాకి - (గాథాసప్తశతి – 202)

7.
అతని మగసిరికి దక్కిన అదృష్టము
నా ఆడతనం చూపిన బరితెగింపు
ఉప్పొంగి తొంగిచూసిన గోదావరికి ఇంకా
వానాకాలపు రాత్రులకు మాత్రమే తెలుసు - (గాథాసప్తశతి 231)

8
వానకు తడిచి కంచెపై కూర్చున్న కాకులు
మురికి ముఖాలతో, సత్తువ కోల్పోయిన రెక్కలతో
వేలాడేసిన మెడలతో
కొర్రువేసినట్టు కనిపిస్తున్నాయి (గాథాసప్తశతి – 564)

9.
వానలు కురిస్తే లోకం బ్రతుకుతుంది
జీవులకు వానలే అమృతం
(తిరుక్కురళ్ 1.1.11)

10
విరహంతో కాలిపోతున్న బాటసారి దేహంపై
తొలకరి చినుకులు పడి చిటపటధ్వనులు చేస్తున్నాయి
తడి వస్తువునేదో నిప్పుల్లో వేసినట్లు (వజ్జలగ్గ – 373)

11.
కవులు పదే పదే "పరి" ఒక్కరినే
పొగుడుతారు కాని
ఈ లోకాన్ని రక్షించేది
వానలు కూడా (purananuru 107)
(వేల్ పరి -రాజు)

12.
అతను రాత్రుల పొడవు తగ్గించాడు
ప్రవహించే జలాలను దోచుకొన్నాడు
భూమిని వేడెక్కించాడు
దట్టమైన పచ్చదనాల్ని శుష్కింపచేసాడు.
ఆ సూర్యుడు ఇప్పుడు ఎక్కడికిపోయాడు?
నీటిని నింపుకొన్న మేఘాలు
నలుదిక్కులు తిరుగుతూ
మెరుపును దివిటీగా చేసుకొని
అతనికొరకు వెతుతున్నాయి
(Sarngadharapaddhati 3869)

13.
మంచు వర్షం కలిగించే చలికి
బెదిరిన ఆకాశం ఒక్క రంద్రంకూడా లేని
దళసరి మబ్బుల దుప్పటి కప్పుకొంది
(Sarngadharapaddhati 3862)

14.
మదజల వాసనకై తుమ్మెదలు ముసురుకోగా
అడవి ఏనుగుల శిరస్సులు నీలి కలువలలా ఉన్నాయి.
ఉరుముల శబ్దాలను విని
ఎక్కడో మరొక ఏనుగుల గుంపు చేస్తున్న
ఘీంకారాలు అని తలుస్తూ
ఇక్కడ ఇవి మరింత గంభీరంగా గర్జిస్తున్నాయి
(ఋతుసంహారం 2.15)

15.
మోసకారి అయిన ప్రియుని పై అలిగి
శయ్యపై అటుతిరిగి శయనించిన నాయిక
మెరుపులు ఉరుములతో భీకరమైన వర్షం
మొదలవగానే భీతిల్లి అన్నీ మరచి
అతనిని గాఢాలింగనం చేసుకొన్నది (ఋతుసంహారం 2.11)

16..
ఎవరో అల్లరి పిలగాడు బురదకాళ్లతో ఇల్లంతా తిరిగినట్లు
అడవి చిచ్చులకు పైకి లేచిన బూడిదను పూసుకొని
నిలకడలేని నీటిని మోసుకుంటూ తిరిగే మబ్బులను చూస్తే
ఎవరికి హృదయోల్లాసం కలుగదూ?
(Sarngadharapaddhati 3866)

17.
నల్లని మేఘాలతో కూడిన ఆకాశాన్ని చూసి
ఆహ్లాదకరమైన ఉరుముల శబ్దాలను విని
ఒక వేటగాడు, ఏనుగుదంతాలతో గోడలు కట్టి
జడలబర్రె చర్మంతో పైకప్పును నిర్మించి
లక్క, కస్తూరిలతో నేలను మెత్తి
పులిచర్మంపై కునుకు తీస్తున్నాడు
భార్య తన ఛాతీపై వేసిన చేతిపై చేయి ఉంచి
(Sarngadharapaddhati 3873)

18.
తొలకరివాననీరు
గడ్డి బురద నింపుకొని మెలికలు తిరుగుతూ
కొండదిగువకు వడివడిగా ప్రవహిస్తూంటే
అదాటుగా చూసిన కప్పలు దాన్ని పాముగా భ్రమించి
బెదురుతున్నాయి (ఋతుసంహారము – కాళిదాసు 2.13)

19.
పశులకాపర్లు వేణువులూదుతూ
ఇండ్లకు వెళుతున్నారు
లేగలను తలచుకొంటూ ఆలమందలు
వారివెనుక నడుస్తూన్నాయి
ఒక్కసారిగా
మబ్బులు ఉరుములై ధ్వనించాయి
కళ్ళముందే ఆకాశంలో
ఇంద్రచాపం విచ్చుకొంది
ఎంత అందమైన సాయింత్రం అది!
Ainthinai elupathu 22

20.
వానాకాలం సమీపిస్తుండటంతో
ఇంటికి త్వరగా చేరుకోవాలని
ఆ బాటసారి దారిని చుట్టి మూటకట్టేస్తాడు
దానిని ముక్కలు చేసి ఒక్క గుక్కలో మింగేస్తాడు.
(గాథాసప్తశతి - 696)

21.
ఎక్కడచూసినా కప్పల బెకబెక
తీయని గొంతులతో పక్షుల కిలకిలారవములు
ఆకాశం మూలమూలలా వర్షఋతువు మొదలైంది
అయినప్పటికీ
అతని రథం నన్ను చేరేందుకు ఇంకా ప్రయాణం కట్టలేదు
నా కనులు భోరున వర్షిస్తున్నాయి
Ainkurunuru 453

22
వానలో తడిసి ముద్దయి ఇంటికొచ్చిందామె
చినుకులకు కనుల కాటుక కరిగిపోయింది
నీలి రవికె తడిచి బిగుతైన చనులను కప్పుతూ
ఆమె సహజ అందాలను, ఆకృతిని చాటుతోంది
దుస్తులను మార్చుకొంటూంటే ఆమె భర్త సహాయపడుతున్నాడు
ఎంత అదృష్టవంతురాలామె!

23
ఆకాశం కనిపించదు మబ్బులు కమ్మేసాయి
నేలా కనిపించదు నీరు ముంచెత్తింది
చీకటి పడింది
ఈ రాత్రివేళ, అందరూ నిద్రిస్తుండగా
కొండదిగి మా ఇంటికి ఎలా రాగలవు?
దట్టంగా పూచిన ఏగిస పూలతో
పరిమళించే చిన్న ఇల్లు మాదేనని నీ కెలా తెలుస్తుంది?
Kuruntokai 355
(అజ్ఞాత సంస్కృత కవి)

24.
కుంభవృష్టి కురుస్తోంది
వంటచేసేందుకు పొయ్యిలోకి నిప్పు కొరకు ఇల్లాండ్రు
బురదలో వేసిన చెక్కపలకలపై అడుగులు వేస్తూ
తల తడవకుండా వెదురు బుట్ట నెత్తిపై పెట్టుకొని
అక్కా, ఒదినే అని పిలుచుకొంటూ ఇల్లిల్లూ తిరుగుతున్నారు
Suktimuktavali of Jalhana - 222
.
అనువాదం: బొల్లోజు బాబా
.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment