Monday, October 19, 2020

Imported post: Facebook Post: 2020-10-19T13:04:58

పాతికేళ్ళ ప్రస్థానం చదువు పూర్తయ్యాక యానాం ప్రభుత్వడిగ్రీకళాశాలలో కొన్నాళ్ళు తాత్కాలిక లెక్చరర్ గా పనిచేసాను. ఆ తరువాత అనేక పాత్రలు అనేక ఊర్లు. ఇటీవల ఆ కాలెజ్ కు వెళ్లాను. పాతికేళ్ళ క్రితం తీయించుకొన్న ఫొటో వద్ద అదే చోట్లో, కొత్తఫొటో. కాలం తెలియకుండానే భలే జారిపోయింది అనిపించింది. ముసుగులు, ముడతల మాటున ఆ నవ్వు నేడు కనిపించదు. దేహం నెమ్మదిగా శిథిలమౌతోంది. .......there is still fire in your tombs - Neruda. ఏమో ఆనాటి నిప్పు ఇంకా లోలోపల ఉందేమో... ఉందని అనుకోవాలేమో!

Saturday, October 17, 2020

Imported post: Facebook Post: 2020-10-17T18:16:56

ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు- ఒక పరిశీలన తెలుగులో సాహిత్యవిమర్శకు సంబంధించి చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. ఒక నిర్ధిష్టమైన సాహిత్యసిద్ధాంతాన్ని ప్రతిపాదించే పుస్తకాలు దాదాపు మృగ్యమనే చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో ప్రముఖ విమర్శకుడు శ్రీ సీతారంగారి వాల్ మీద ఈ అంశంపై మంచి చర్చ జరిగింది. ప్రముఖ కవి, విమర్శకులు, నవలా రచయిత శ్రీ సాగర్ శ్రీరామకవచం గారు “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” పేరిట ఒక విమర్శనాత్మకవ్యాస సంపుటిని వెలువరించారు. దీనిలో వారు సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, విమర్శచేయటానికి ఉపయుక్తంగా ఉండేలా ఒక సాహిత్యసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిని “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” అనే పేరుతో వ్యవహరించారు. ఇది ఆసక్తిదాయకంగా ఉండటమే కాక ఎంతో ఆలోచనాత్మకంగా అనిపిస్తుంది. కవిత్వంలో వస్తువు అంటే చెప్పబడిన అంశమని, శిల్పం అంటే చెప్పిన విధానమని సాధారణ నిర్వచనాలు. అంతే కాక ఈ రెండిటినీ విడదీయలేమనీ, వస్తువుకు తగ్గ శిల్పం అదే అమరుతుంది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంటే తీవ్రమైన ధిక్కారాన్ని పలికించటానికి “ఒరేయ్ లంజాకొడకా…” (శిఖామణి) అనే ప్రయోగం, దుఃఖపెట్టే వియోగభారాన్ని చెప్పటానికి “నీవులేవు నీ పాట ఉంది… (తిలక్) లాంటి లలితకోమల వ్యక్తీకరణలు వస్తు శిల్పాల ఆధారితను నిరూపిస్తాయి. ఒక రచనలోని వస్తు శిల్పాల మధ్య ఉండే సంబంధం, వాటి స్వరూపాల గురించి శ్రీరామకవచం గారు లోతైన చర్చ చేసారు ఈ పుస్తకంలో. *** ప్రచ్ఛన్న అంటే దాగి ఉండిన లేదా రహస్యంగా ఉండిన అని అర్ధం. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు అంటే రచనలో కనిపించకుండా తెలుస్తూండే వస్తు శిల్పాలు అని. ఒక రచనలో పైకి కనిపించే వస్తువు వెనుక మరో వస్తువు, దానిని అనుసరిస్తూ మరో వస్తువు అదే విధంగా పైకి కనిపించే శిల్పం వెనుక మరో శిల్పం దాగి ఉంటుందని ఈ సిద్ధాంతకర్త ప్రతిపాదన. ఇలా కనిపించని వస్తుశిల్పాల సమాశ్రయమే ఆ రచన మొత్తం పాఠకునిలో కలిగించే రసస్పందన అంటారు. అంటే రచనలో పైకి కనిపించే వస్తు, శిల్పాలకు అతీతంగా అంతర్గతంగా భిన్న వస్తువులు శకలాలు శకలాలుగా, భిన్న శిల్ప రీతులు ఛాయలు ఛాయలుగా విస్తరించి ఉండి ఆ రచనను పండిస్తాయని చెపుతారు. ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సిద్ధాంత నిర్వచనం వారిమాటల్లోనే…. వస్తువు యొక్క వస్తువు ప్రచ్ఛన్న వస్తువు! శిల్పం యొక్క శిల్పం ప్రచ్ఛన్న శిల్పం! ఇదే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రచ్ఛన్న రహస్యయాత్ర రచనలో… అది తొవ్వి తీయాల్సిన అవసరం ఎంతో వుంది…! భవిష్యత్తు విమర్శకి దాగిన పునాది ఇక్కడే ఉంది. అదే ప్రచ్ఛన్న సహిత్య అనాది రచనా చరిత్ర అవుతుంది. – సాగర్ ఒక కవి ఒక వస్తువును తీసుకొని దానికి సాహిత్యరూపం ఇచ్చేటపుడు ఆ వస్తువు స్వభావాన్ని సంపూర్ణంగా అర్ధం చెసుకోవాలి. ఆధునిక కాలంలో ఆ వస్తువు పరిణామశీలతను గుర్తించగలగాలి. అలా చేసినపుడే ఆ వస్తువుకు ఆ రచనలో కనిపించని ఆ వస్తువు యొక్క నీడలకు (ప్రచ్ఛన్న వస్తువు) మధ్య సమన్వయం ఏర్పడుతుంది. లేనట్లయితే అది కవియొక్క అజాగ్రత్తకి, అమాయకత్వానికి ఉదాహరణగా నిలబడుతుంది. ప్రచ్ఛన్న వస్తువు పొరలుపొరలుగా నిర్మితమైనప్పుడు గొప్ప మార్గం ఆవిష్కరింపబడుతుంది. రచనా నిర్మాణ క్రమంలో ప్రచ్ఛన్న వస్తువు ప్రధాన వస్తువుకి నీడలుగా, జాడలుగా విస్తరించి తత్ఫలితంగా రచన అద్భుత స్థాయికి చేరుకొంటుంది. శిల్పం కూడా ఇదే పద్దతిని అనుసరించి, పైకి కనిపించే శిల్పం ప్రచ్ఛన్న శిల్పశకలాలుగా విడిపోయి భిన్న అనుభూతులకు తావిస్తుంది. ఒక కవి శిల్పనిర్వహణా రీతికి అతని సాంస్కృతిక వారసత్వం అవినాభాజ్యంగా ఉంటుందనే ప్రతిపాదన విలువైనది. *** ఒక రచనలో కనిపించే ఏకసూత్రతను పట్టుకొని పాఠకులకు విప్పిచెప్పటానికి సాహిత్యసిద్ధాంతాలు దోహదపడతాయి. ఒక వాచకాన్ని ఎలా చూడాలో చెప్పటం సాహిత్యసిద్ధాంతం ముఖ్యోద్దేశంగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే కళ్లద్దాల వంటివి. శ్రీరామకవచం గారు తాను ప్రతిపాదించిన “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” సిద్ధాంతం ద్వారా, ఒక రచనలో పైకి కనిపించే వస్తువు వెనుక కనిపించని వస్తువులు అనేకం ఉండొచ్చునని, అదే పైకి చూపిస్తున్న శిల్పం వెనుక రహస్యమైన శిల్పశకలాలు ఉంటాయని, ఆ రచనను అర్ధం చేసుకోవాలన్నా, విమర్శించాలన్నా ఈ లోపలి పొరలను కూడా దర్శించవలసి ఉంటుందని చెపుతున్నారు. తెలుగు సాహిత్యం వస్తువాదకవిత్వానికి పెద్దపీటవేసి శిల్పాన్ని తృణీకరించిందని, వస్తు,శిల్పాల మధ్య వైరుధ్యాలు ఉండవని అనటం ద్వారా తెలుగు సాహిత్యానికి తీవ్ర నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఎండుకట్టెలో అగ్ని దాగి ఉన్నట్లు, నువ్వు గింజల్లో నూనె ఉన్నట్లు ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు చీకటివెలుగుల మాదిరి చలన నియమాలతో సాహిత్యంలో ప్రవర్ధిల్లుతాయి అంటారు. శ్రీరామకవచం గారు ఈ పుస్తకంలో తమ సిద్ధాంతాన్ని అప్లై చేసి కొన్ని విపులమైన ఉదాహరణలు ఇచ్చి ఉంటే బాగుండేది. *** ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు సిద్ధాంతం సాహిత్యవిశ్లేషణలో ఒక నూతన ఆవిష్కరణ. ప్రతీ ఆవిష్కరణా పూర్వరీతుల భుజాలపై నిలబడకుండా శూన్యంలోంచి రాలేదు. అలాగే ఈ సిద్ధాంతంలో మన పూర్వీకులు నిర్వచించిన రస సిద్ధాంతంలో కనిపిచే స్థాయీ భావాలు, సంచారీ, వ్యభిచారీ భావాలు లాంటి ఊహలను కొన్ని పోల్చుకొనవచ్చును. వాటిని ఆలంకారికులు వస్తు, శిల్పాలకు కాక రససిద్ధిని నిర్వచించటం కొరకు వినియోగించారు. అది వేరే సంగతి. ఒక కవితలో వాచ్యార్ధాన్ని ఆ కవిత Extension గాను, ధ్వనిపూర్వక అర్ధాన్ని Intension గాను గుర్తించాలంటాడు అలన్ టాటె. ఈ రెండు సమపాళ్లలో బింబప్రతిబింబాలుగా, బిగుతుగా, ఒకదానితో ఒకటి పోటీపడేటట్లుగ ఉండే స్థితికి ఆ రెండు పదాలలోని ప్రిఫిక్స్ లను తొలగించి Tension అని పేరుపెట్టాడు. కవిత్వానికి కవిత్వశక్తినిచ్చేది Tension మాత్రమే అంటాడు. ఇది కూడా శ్రీరామకవచంగారు చెపుతోన్న వస్తు, శిల్ప శకలాల నిర్వచనానికి దగ్గరగా అనిపిస్తుంది. ఈ పోలికలు ఈ రచయిత కృషిని తక్కువ అంచనా వేయటంగా కాక ప్రతిపాదిత సిద్ధాంతపు విస్తృతిగా అర్ధంచేసుకోవాలి. శ్రీరామకవచంగారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రీతి, విశ్లేషించిన తీరు ఆమోదయోగ్యంగా ఉన్నది. ఇంతవరకూ తెలుగు సాహిత్యచరిత్రలో ఇది నేను ప్రతిపాదిస్తున్న సాహిత్యసిద్ధాంతం అని ఎవరూ ప్రకటించుకొన్న దాఖలాలు కనిపించవు. ప్రాత్య, పాశ్చాత్య సిద్ధాంతాలను సమన్వయపరుస్తూనో లేక దిగుమతి చేసుకొనో వచ్చిన వివరణలే తప్ప. ఆ రకంగా ఇది గొప్ప ప్రయత్నం. ప్రతి తెలుగు కవి, విమర్శకుడు తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ కోణంలోంచి కూడా సాహిత్యాన్ని దర్శించే దృష్టిని ఏర్పరుచుకోవటం అవసరం. *** ఈ పుస్తకాన్ని మూడు అధ్యాయాలుగా విభజించారు. మొదటి అధ్యాయంలో “ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు” సిద్ధాంతాన్ని చాలా విపులంగా చర్చించారు. మిగిలిన రెండు భాగాలలో సాహిత్యంపై, విమర్శపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు. చాలా అభిప్రాయాలు సమకాలీన సాహిత్యరీతులను, అపసవ్యతలను ప్రతిబింబించాయి. చాల విలువైన, వివాదాస్పదం అయ్యేటటువంటి అంశాలను కూడా ఏ శషభిషలకు తావివ్వకుండా చర్చించారు. వీటిలో వివిధ అస్తిత్వవాద ఉద్యమాలు గురించి; కీర్తివెంట పరుగులెత్తే వారిపై; ప్రాచీనతకు నవ్యత్వం సాధించే అవసరతపైనా; ప్రవచనకారులుగా మారిన సాహిత్యకారులపై; ఆధునిక విమర్శ మన లాక్షణికుల సిద్ధాంతాలను గుడ్డిగా తిరస్కరించటం పట్లా; శకలీకరణ పాలకవర్గాలకు ఉపయోగపడింది అనటం లాంటి స్టేట్మెంట్స్ చాలా లోతైనవి. వాటిని రచయిత ఎలా సమర్ధించారన్నది తెలుసుకోవాలనుకొనే వారు పుస్తకాన్ని చదివాల్సిందే. “పోస్ట్ మోడర్నిజం సిద్ధాంతపరిచయం” పేరిట ఉన్న వ్యాసంలో ఆ సిద్ధాంతం యొక్క చారిత్రిక పరిణామాన్ని, అది తీసుకొచ్చిన మార్పులను చాలా గొప్పగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం కవులకు, విమర్శకులకు కరదీపికగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. బొల్లోజు బాబా పుస్తకం లభించు చోటు ఫోన్: 9121683515 ప్రచురణ నవ్యాంధ్ర రచయితల సంఘం విజయవాడ.

Tuesday, October 13, 2020

Imported post: Facebook Post: 2020-10-13T11:21:08

Congratulations to Koduri Vijaykumar Anil Danny Merci Margaret Metta Nageswara rao You all stand in the path of the best.... and deserve much more accolades... Kavi Yakoob annaa... You are a miracle for telugu poetry. May God give you more strength to Shine like a pole star in showing the path to the poetry sailers Bolloju Baba

Monday, October 12, 2020

Imported post: Facebook Post: 2020-10-12T01:19:23

Timeline of 17000+ Years of Unbroken Indian Civilization | Nilesh Nilkanth Oak మహాభారతం క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల క్రితం జరిగిందా? . భారతదేశ చరిత్రకు సంబంధించిన కాలక్రమణికను నిర్ణయించటంలో మూడు స్రవంతులు కనిపిస్తాయి. 1. క్రీపూ 1500-2000 మధ్యజరిగిన ఆర్యుల ఆక్రమణ సిద్ధాంతం ఆ కాలంలోనే భారతదేశ ప్రాచీనచరిత్ర అంతా జరిగిందని ప్రతిపాదిస్తుంది. ఇటీవలి కాలంలో దొరుకుతున్న అనేక ఆధారాల కారణంగా ఈ దేశప్రాచీనత నాలుగువేల సంవత్సరాల కన్నా పురాతనమైనదని అందరూ అంగీకరించారు. 2. క్రీపూ. 800-6000 మధ్య కాలం భారతదేశ చరిత్ర నిర్మించబడిందని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. వేదాలు, రామాయణ, మహాభారతాలు, బుద్ధుడు, జైనులు, వివిధ ఆరాధనా కల్ట్ లు – అన్నీ ఈ కాలానికి చెందినవే అని బలంగా నమ్ముతారు. 3. పురాణాలలో చెప్పబడిన కల్పాలు, మన్వంతరాలు, యుగాలు వాటి లెక్కలతో చరిత్రకాలక్రమణికను నిర్మించాలని సనాతనులు భావిస్తారు. ఇది లక్షల సంవత్సరాలనుండి కోట్ల సంవత్సరాలకు విస్తరించి ఉండే వ్యవధిగా తేలటం, దీనికి సమాంతరమైన ఇతర ఆధారాలు లేకపోవటం, అంతేకాక యుగాన్ని నిర్ణయించటానికి దాదాపు 30 రకాల నిర్వచనాలు ఉండటం వల్ల దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో తెలియని స్థితి ఉండటంతో చరిత్రకారులు ఈ యుగ సిద్ధాంతం పట్ల మౌనం వహించారు. *** ప్రాచీన ఘటనలు జరిగిన కాలాన్ని నిర్ణయించటంలో ఖగోళశాస్త్రం యొక్క ప్రాధాన్యతను యూరోపియన్ చరిత్రకారులు కూడా గుర్తించారు. కానీ తొలత ఆర్యుల రాకవల్ల, రెండవసారి మా రాక వల్ల భారతదేశం అభివృద్దిచెందింది, అనే ఆలోచనా ధోరణి వల్ల మన ప్రాచీన చరిత్రను నాలుగువేల సంవత్సరాలకే పరిమితం చేసారు. నేడు ఆర్కియాజికల్, పాలియంటలాజికల్, ఓషనోగ్రాఫికల్, సాటిలైట్ స్టడీస్, భూగర్భ, వాతావరణ అధ్యయనాలు, జన్యుపరిశోధనలు ఇంకా మరెన్నో ఇతర రంగాలనుంచి లభిస్తోన్న ఆధారాల సహాయంతో భారతదేశ చరిత్ర ప్రాచీనత నాలుగువేల సంవత్సరాలకు మాత్రమే పరిమితం కాదని అర్ధం చేసుకోగలుగుతున్నాం. ఈ అన్ని శాస్త్రాల ఆధారాలకన్నా ఖగోళశాస్త్రం అందించే ఆధారాలు ఎంతో విలువైనవి. ఎందుకంటే గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు లాంటివి అన్నీ ఒక నిర్ధిష్టమైన క్రమపద్దతిలో సంచరిస్తాయి. కొన్ని వేల సంవత్సరాల వెనుకకు వెళ్ళి ఏ రోజున ఎన్నిగంటల ఎన్ని నిముషాలకు ఒక గ్రహణం వచ్చింది అని క్షణాలపై లెక్కించటానికి (celestial movements) ఈ రోజు అనేక కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం అనాదిగా Lunisolar కేలండరను (సూర్యచంద్రులను ప్రమాణంగా తీసుకోవటం) అనుసరించటం వల్ల, మన గ్రంధాలలో చెప్పిన పంచాంగవివరాల ఆధారంగా వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఖచ్చితమైన తేదీలను నిర్ణయించటానికి వీలవుతుంది. ఇది వేరే ఏ ఇతర ప్రపంచ సంస్కృతులలోను కనిపించని విషయం. ఈ రంగంలో Nilesh Nilkanth Oak లోతైన కృషి చేసి When Did the Mahabharata War happened, Historic Rama, Bhishma Nirvana లాంటి పరిశోధనాత్మక పుస్తకాలు వ్రాసారు. . మహాభారతం ఎప్పుడు జరిగింది? “అరుంధతీ నక్షత్రం వసిష్ట నక్షత్రం ముందు నడుస్తున్న” సమయంలో మహాభారత యుద్ధం జరిగిందని మహాభారతంలో ఉన్నది. ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు వసిష్ట నక్షత్రాన్ని Mizar అని, అరుంధతిని Alcar అంటారు. కానీ ఈ నాటి ప్రమాణాలప్రకారం అరుంధతి నక్షత్రం వసిష్ట నక్షత్రం వెనుక నడుస్తుంది. ఈ నక్షత్రాల స్థానాలు శాశ్వతం కావు వేలసంవత్సరాల వ్యవధిలో నిర్ధిష్టమైన, లెక్కించగలిగిన మార్పులకు గురవుతూ వస్తాయి. Astronemer predictions Voyager 4.5 సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఏ కాలంలో అరుంధతి నక్షత్రం, వసిష్ట నక్షత్రానికి ముందర నడిచిందో లెక్కించవచ్చు. ఆ ప్రకారం దాన్ని క్రీపూ. 11091 – 4508 మధ్యకాలంగా గుర్తించారు. దీని ఆధారంగా మహాభారత యుద్ధం ఈ రెండు సంవత్సరాల మధ్య జరిగి ఉండొచ్చని భావించటం శాస్త్రీయం. Nilesh Nilkanth Oak దీన్ని సుమారు భారతంలోని సుమారు 200 ఇతర పంచాంగపరమైన అంశాలతో పోల్చి చూసి మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 5561 సంవత్సరంలో జరిగిందని ప్రతిపాదించాడు. అదే విధంగా రామాయణం నుంచి సుమారు 500 వివిధ పంచాంగపరమైన వివరాలను విశ్లేషించి రామ రావణ యుద్ధం క్రీస్తుపూర్వం 12209 లో జరిగిందని ప్రతిపాదించాడు. ఆర్యల రాక సిద్ధాంతాన్ని ఉగ్గుపాలతో చదువుకోవటం వల్ల క్రీపూ రెండువేల సంవత్సరాలకంటే ముందు జరిగిన భారతదేశ చరిత్రను ఊహించటమే సాహసంగా భావించే మనకు రామాయణం క్రీపూ పన్నెండువేల సంవత్సరాలు క్రితం జరిగింది అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ చరిత్రలో అంతకన్నా ప్రాచీనమైన - క్రీపూ ఇరవైవేల సంవత్సరాలనాటి చైనీస్ Oracle Bones, క్రీపూ పదివేల సంవత్సరాలకు చెందిన టర్కీలోని Göbekli Tepe నగరం, క్రీపూ మూడువేల సంవత్సరాలనాటి Sumerian Clay Cone రాజ్యాంగం లాంటి అంశాలెన్నో ఇటీవల బయటపడుతూ చరిత్రకారులు తమ టైమ్ లైన్స్ ను సరిచూసుకోవలసిన అవసరతను ఎత్తిచూపుతున్నాయి *** Nilesh Nilkanth Oak వాదనను సమర్ధించే ఆధారాలు . A. ఖగోళశాస్త్ర పరిజ్ఞానం ప్రకారం క్రీస్తుపూర్వం 31 జనవరి 5560 న భీష్ముడు నిర్యాణం చెందాడని Nilesh ఈ క్రింది విధంగా ప్రతిపాదించాడు. ఈ అంశాలన్నీ వెరిఫైయబుల్ విషయాలంటాడు. 1. భీష్ముడు ఉత్తరాయణం రావటానికి 92 రోజుల ముందు అంపశయ్యపై ఒరిగాడు – ఇది క్రీపూ 8000-3700 మధ్య కావొచ్చు. 2. భీష్ముడు యుద్ధంలో కూలిపోయిన రోజు మార్గశిర శుక్ల పక్ష 9 – ఇది క్రీపూ 7285-5125 మధ్య కావొచ్చు 3. పై రెండు అంశాలే కాక మరో రెండువందల ఇతర పంచాంగ విషయాలను కూడా పరిగణలోకి తీసుకొంటే భీష్మనిర్యాణం జరిగినది క్రీపూ 31 జనవరి 5560 గా లెక్కగట్టారు. B. హైడ్రాలాజికల్ ఆధారాలు: మహాభారతంలో సరస్వతి నది గురించిన ప్రస్తావనలు వందకు పైగా ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రవహిస్తున్నట్లు, కొన్ని చోట్ల ఎండిపోయినట్లు (అంతర్ధీయతే) చెప్పబడింది. రామాయణంలో సరస్వతీనది జీవనదిగా చెప్పబడింది. సట్లెజ్ నది పశ్చిమం వైపు ప్రవహిస్తున్నట్లు చెప్పబడింది. అదే రుగ్వేదకాలంలో సరస్వతి చాలాగొప్ప మహానదిగా చెప్పబడింది (అంబితమే నదీతమే దేవితమే సరస్వతి). సరస్వతి నదికి సట్లెజ్ నది ఒకప్పుడు నీటిని అందించేది. రుగ్వేదకాలానికి సరస్వతి ఒక మహానది. (రుగ్వేదకాలం క్రీపూ 17000+ గా నీలేష్ లెక్కించారు. రుగ్వేదంలోని 6,3,7 మండలాలు ప్రాచీనమైనవి కాగా, 5,8,9 మండలాలు రామాయణకాలానికి చెందినవని 10 వ మండలం మహాభారతకాలనికి చెందినదని రుగ్వేదంలోని మొదటి మండలం రకరకాలమార్పులు, చేర్పులు పొందుతూ వచ్చిందని అంటారు.) హైడ్రలాజికల్ అధ్యయనాల ప్రకారం సట్లెజ్ నది క్రీపూ 13000 లో తన దిశ మార్చుకొని పశ్చిమం వైపుకు ప్రయాణించటం మొదలెట్టడంతో సరస్వతినదికి హిమాలయసానువులనుండి నీరు అందటం ఆగిపోయింది. అందుకనే క్రీస్తుపూర్వం పన్నెండువేలలో జరిగిన రామాయణకాలానికి సరస్వతి నది ఒక మహానదిగా చెప్పబడలేదు. నీటి సరఫరా లేక సరస్వతి నది క్రమేపీ క్షీణించటం మొదలై క్రీస్తుపూర్వం 3000 నాటికి పూర్తిగా ఎండిపోయింది. అందుకనే క్రీపూ 5500 నాటి భారతంలో సరస్వతి నది కొన్ని చోట్ల ప్రవహిస్తున్నట్లు కొన్నిచోట్ల ఎండిపోయినట్లు వర్ణనలు కనిపిస్తాయి. సరస్వతీ నది ప్రవాహ పరిణామం రుగ్వేద, రామాయణ, మహాభారత వర్ణనలతో సరిపోలుతుంది. C. Oceonography ఆధారాలు మహాభారతయుద్ధ కాలం క్రీపూ 5561 అనుకొంటే, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆ తరువాత 36 సంవత్సరాలకు అంటే క్రీపూ 5525 నాటికి ద్వారకానగరం సముద్రంలో మునిగిపోవాలి. అలా జరిగినట్లు నేటికి ద్వారక నగర శిథిలాలు గుజరాత్ వద్ద సముద్రంలో కనిపిస్తున్నాయి. దీనికి బలపరిచే ఆధారాలు ఓషనోగ్రపీ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఐస్ ఏజ్ ముగిసాక ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు క్రమక్రమంగా పెరగటం మొదలైంది. మెక్సికో వద్ద క్రీపూ 5600 లో 6.5 మీటర్ల సముద్రమట్టం పెరిగింది. టర్కీ వద్ద క్రీపూ 5550 లో సముద్రమట్టాలు అనూహ్యంగా పెరిగి అప్పటివరకూ మంచినీటి సరస్సుగా ఉన్న బ్లాక్ సీని ఉప్పునీటితో నింపేసాయి. ఇక ఇండియా వద్దకు వచ్చేసరికి క్రీపూ 6000 లో 15 మీటర్లు క్రీపూ 5000 లో 8 మీటర్లు సముద్రమట్టాలు పెరిగినట్లుగా ఓషనోగ్రపీ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈ సమయం ద్వారక క్రీపూ 5525 సముద్రంలో మునిగిపోయిన సంఘటనతో సరిపోతుంది. D. Seismological ఆధారాలు క్రీపూ 5540 లో గుజరాత్ లో పెను భూకంపం వచ్చినట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ సమయంలో సముద్రమట్టం 15 మీటర్లు పెరగటం కూడా జరిగింది. ఇది భారతంలో చెప్పబడిన క్రీపూ 5525 తో సరిపోవటం గమనార్హం. E Genetic ఆధారాలు సుమారు లక్ష సంవత్సరాలక్రితం ఆఫ్రికానుండి మొదటి మానవుడు భారతఖండాన్ని చేరుకొన్నాడని అనుకొంటే - ఆ తరువాత ఇక్కడినుంచి బయటకు వలసలు ఎక్కువగా జరిగాయి తప్ప చాలాకారం వరకూ చెప్పుకోదగ్గ వలసల ద్వారా భారతదేశంలోకి ఇతరులు వచ్చారని Y క్రోమోజోముకి సంబంధించిన జన్యుపరమైన అధ్యయనాలలో ఏ విధమైన ఆధారాలు లభించలేదు. ఆ తరువాత రెండువేల సంవత్సరాల క్రితం వచ్చిన శకులు, హూణులు, వెయ్యేండ్లక్రితం వచ్చిన ముస్లిముల వలసలు ద్వారా కొత్తవ్యక్తుల జన్యువులు భారతీయ జన్యు అధ్యయనాల్లో రికార్డు అయ్యాయి. ఈ జన్యు అధ్యయన ఫలితాలు ఆర్యుల ముట్టడి సిద్ధాంతాన్ని తునియలు చేసింది. *** . భారత, రామాయణాలు మన సంస్కృతిలోనే కాదు చరిత్రలో కూడా భాగమని నమ్ముతాను. చరిత్రకానట్లయితే అన్ని డిటైల్స్, పాత్రలు, ప్రాంతాలు, వ్యక్తులను అంతగొప్పగా కల్పించటం అసంభవం అని అనుకొంటాను. అంతే కాదు…. నా దృష్టిలో తులసీరాముడు ప్రొజెక్ట్ చేసిన శ్రీరామ్ వేరు, చారిత్రిక రామాయణం వేరు. మన సంస్కృతిని వేలసంవత్సరాల వెనక్కు పుష్ చేయటం మనకు గొప్పగా అనిపించవచ్చు. కానీ నీలేష్ చెప్పిన పద్దతి శాస్త్రీయంగా అనిపిస్తోంది. చక్కని ఉపన్యాసకుడు కావటం వల్ల చాలా గొప్పగా ప్రెసెంట్ చేసాడు. చాలా అంశాలను సహేతుకంగా చెప్పినట్లు అనిపించింది. నిజానికి నిన్న జరిగిన విషయాలలోంచే నిర్ధిష్టమైన సత్యాలను ఆవిష్కరించలేం. అలాంటిది ఇన్ని వేల సంవత్సరాల తరువాత ఇలాగే జరిగింది అని చెప్పటం అరొగెన్స్ అవుతుంది. బహుశా అందుకనే Nilesh Nilkanth Oak తాను చెబుతున్న ఈ లెక్కలు ప్రతిపాదనలు మాత్రమే అని, అవి తప్పు అని నిరూపించినట్లయితే సంతోషించేవారిలో తాను ఒకడినని అని ప్రకటిస్తున్నాడు. ఆ మాటలు నచ్చాయి. వీలైతే ఈ లింకులో అతని ఉపన్యాసం వినండి. తరువాత ప్రశ్నోత్తరాల సెషన్ కూడా… https://www.youtube.com/watch?v=3tsyzrDg2n4 బొల్లోజు బాబా

Friday, October 9, 2020

Imported post: Facebook Post: 2020-10-09T18:55:17

ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ విజేత Louise Glück కవిత్వం . 1968లో Louise Glück ఇరవైదేండ్ల వయసులో Firstborn అనే కవిత్వసంపుటిని వెలువరించింది. ఆమె కవిత్వం ఆనాటి సమకాలీన-ఆధునిక సరిహద్దులను చెరిపేస్తూ, సరళమైన భాష, తక్షణ జీవితానుభవాలు, సార్వజనీన అప్పీల్, కథనాత్మక శైలి, ఐతిహ్యసంబంధ, మానవవిషాదం, కన్ఫెషనల్ ధోరణి లాంటి అంశాలతో అందరినీ ఆకట్టుకొంది. ఆమె కవిత్వం ఆ తరువాతి కాలంలో మరింత చిక్కబడింది. Louise Glück కవిత్వాన్ని ఇరవయ్యోశతాబ్దపు సాహిత్యప్రపంచంలో ఎక్కడ పెట్టాలి అని విమర్శకులు తర్జనబర్జన పడ్డారు. సాహిత్యవిమర్శలో ఒక కవిస్థానాన్ని అకడమిక్ గా, కళాపరంగా, చారిత్రాత్మకంగా మూల్యాంకనం చేయటంలో – అస్తిత్వరాజకీయాలు, వివిధ భావవాద స్కూల్స్, ఉద్యమాలు, శిబిరాలు నిర్ణయాత్మకంగా ఉండేవి. కానీ ఈమె కవిత్వం అన్నిరకాల వాదాలలో, ఉద్యమనేపథ్యాలలో, శిబిరాలలో- పగుళ్ళలోకి పరుచుకొనే పాదరసంలా ఒదిగిపోవటమే దానికి కారణం వైయక్తిక అనుభవాలను మాత్రమే చెప్పే కన్ఫెషనిస్టు కవిత్వ ధోరణిని, తమ వర్గ సంస్కృతిని మాత్రమే కవిత్వీకరించే అస్తిత్వవాద ధోరణిని సమ్మిళితం చేసి ఒక సార్వజనీన కవిత్వపాయను లూయిస్ గ్లగ్ నిర్మించుకొన్నదని విమర్శకులు నేడు గుర్తించారు. లూయిస్ కవిత్వంలో కోర్కెలు, ఆశలు, ప్రేమ, గాయాలు, దుఃఖం, వేదన, జీవనకాంక్ష, వ్యాఖ్యానం, ఆత్మకథనాత్మకత, ప్రకృతి, కాలం, దైవీకదర్శనం లాంటివి పదే పదే వచ్చే థీమ్స్. ఈమె కవిత్వంలో Social Prophecy కన్న Spiritual Prophecy అధికం. ఇది సమకాలీన కవిత్వరీతులకు భిన్నమైన స్వరం. లూయిస్ తనను ఒక జ్యుయిష్ అమెరికన్ కవిగానో, ఒక స్త్రీవాద కవిగానో, ఒక ప్రాకృతిక కవిగానో గుర్తింపబడటానికి ఇష్టపడలేదు. “in-betweenness” తన లక్షణమని చెప్పుకొన్నది. తనకవిత్వంలోని అనుభవాలన్నీ తనలోపలి అనుభవాలే తప్ప వెలుపలి అనుభవాలు కాదని లూయిస్ ఒకచోట విస్పష్టంగా పేర్కొంది. *** Louise Glück వ్రాసిన కొన్ని కవితలకు నేను చేసిన అనువాదాలివి. . Lost Love by Louise Glück నా సోదరి ఈ భూమిపై సంపూర్ణజీవితాన్ని జీవించింది పుట్టింది, చనిపోయింది. మధ్యలో ఒక్క చూపు, ఒక్క వాక్యం ఇక్కడ విడిచివెళ్లలేదు అందరు శిశువుల్లానే ఆమె కూడా ఏడ్చింది. పాలు తాగ నిరాకరించింది మా అమ్మ మొదట్లో తనబిడ్డ తలరాతను మార్చటానికి ప్రయత్నించింది తరువాత చరిత్రను. నా సోదరి చనిపోయాకా మా అమ్మ హృదయం మెడకి వేలాడే ఇనుప బిళ్ళలా చల్లగా గడ్డకట్టింది నా సోదరిదేహం ఒక అయిస్కాంతంలా మారి మా అమ్మ హృదయాన్ని భూమిలోకి లాక్కుని అక్కడ దాన్ని తిరిగి మొలకెత్తించాలని యత్నించేదేమోనని ఒక్కోసారి నాకు అనిపించేది. పుట్టగానే చనిపోయిన తన సోదరిపై వ్రాసిన ఒక కవిత ఇది. చాలా సామాన్యమైన సంసారిక దుఃఖం ఇది. కానీ చెప్పనలవికాని మానవ వేదన. ఇది చావుని గ్లోరిఫై చేయటం కాదు. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన తల్లి ఉద్వేగానికి ఇచ్చిన అక్షర రూపం. ఈ కవితలో “తరువాత చరిత్రను” అన్న రెండు పదాలలో- ఆ తల్లి జరిగిపోయిన విషయాన్ని తలచుకొని ఎంతెలా దుఃఖించిందో అంతటి పెనువేదనా ఇమిడిపోయింది. *** అర్ధరాత్రి - MIDNIGHT by Louise Glück గాయపడ్డ హృదయమా! మాట్లాడు ఎంత తెలివిమాలిన పనిచేస్తున్నావో నీకు అర్ధమౌతోందా garage లో చెత్తమధ్య కూర్చొని ఏడుస్తూ ఉండటం. అది నీపని కాదు. నీపని అంట్లుతోమటం చిన్నతనంలో పెంకెతనం చూపినట్లుగానే ప్రవర్తిస్తున్నావు నీ క్రీడా స్ఫూర్తి, ఉదాసీన వైఖరి ఎక్కడకు పోయాయి? విరిగిన కిటికీ అద్దంపై వెన్నెల వాలింది పలుచని వేసవి వెన్నెల మెత్తని గుసగుసలతో భూమి తియ్యగా సిద్దమైంది-- నీ భర్తతో సంభాషించే పద్దతి ఇదా- ఫోన్ చేస్తే ఎత్తకపోవటం; హృదయం గాయపడినప్పుడు garage లో ఒంటరిగా కూర్చోవటం? నువ్వే నేనైతేనా... భవిష్యత్తు ఊహిస్తాను మరో పదిహేనేళ్ళ తరువాత ఏదో ఓ రాత్రి అతని గొంతుక అలసిపోతుంది; నువ్వు ఫోన్ ఎత్తకపోతే, మరొకరు ఎవరో ఎత్తుతారు. . పై కవితలో లూయిస్ పలికించిన ఐరనీ అసమాన్యమైనది. కానీ ఇదే కఠినమైన జీవన వాస్తవికత. నీ పని అంట్లు తోమడం అనే వాక్యం ఈ కవిత మొత్తానికి గరిభనాభి లాంటిది. దాంపత్యజీవితంలో ఉండే ఇంటిమసీ ఒక నిషిద్ద వస్తువు స్త్రీవాదానికి సంబంధించి. దాన్నీ లూయిస్ గమ్మత్తుగా ఉపయోగించుకొందీ కవితలో. “in-betweenness” అంటే ఇదేనేమో! *** Saints by Louise Glück మా కుటుంబంలో ఇద్దరు సన్యాసినులు ఉండేవారు మా మేనత్త, అమ్మమ్మ కానీ వారి జీవితాలు భిన్నమైనవి మా అమ్మమ్మ చివరివరకూ ప్రశాంతంగానే ఉండింది. నిశ్చలజలాలపై నడిచే వ్యక్తిలా అనిపించేది కారణాలు తెలియవు కానీ ఏనాడు ఏ సముద్రపు అలలూ ఆమెను తాకలేదు మా మేనత్త కూడా అదే మార్గంలో నడిచింది కానీ ఆమెపై కెరటాలు ఉవ్వెత్తున విరుచుకుపడేవి గాయపరిచేవి. ఆత్మసంభంద విషయాలకు విధి ఒక్కోలా స్పందిస్తుంది కాబోలు మా అమ్మమ్మ జాగ్రత్తపరురాలు, సంప్రదాయవాది అందుకే బాధలను తప్పించుకొని ఉంటుంది. మా మేనత్త అన్ని కష్టాలు ఎదుర్కొంది ఒక్కో కెరటం వెనక్కు వెళుతూ వెళుతూ ఆమె ప్రేమించే ఎవరినో ఒకరిని తీసుకొని పోయేది. అయినప్పటికీ ఆమె సముద్రాన్ని ఒక దుష్టశక్తిగా అనుకోదు. ఆమెకు సముద్రం ఒక సముద్రం అంతే. తీరాన్ని తాకినప్పుడల్లా విలయాన్ని సృష్టించితీరాల్సిందే. . పై కవిత చాలా ఆలోచనల్ని కలిగిస్తుంది. సంప్రదాయక విలువలు గొప్పవని చెపుతోందా కవయిత్రి ఇక్కడ; సముద్రం దేనికి ప్రతీక కాలానికా, ఆధునికతకా, స్త్రీజీవితంలో ఎదురయ్యే పురుషునికా; . ఆత్మసంభంద విషయాలు ఏమిటి? (Original-which is how Fates respond to a true spiritual nature). ఎన్నిరకాల భాష్యాలు చెప్పుకొన్నా ఈ కవితలోని స్వరం భిన్నమైనది. సమకాలీన ధోరణులకు వ్యతిరిక్తప్రవాహం వంటిది *** . కలయిక - The Encounter by Louise Glück నువ్వు మంచం వద్దకు వచ్చి కూర్చొని నన్ను తేరిపారచూస్తూ నా మొఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దాడతావు. కరిగిన మైనం నుదిటిపై తెలుస్తుంది నాకు అది అక్కడ ఒక మచ్చను మిగల్చాలి అని కోరుకొంటాను నిన్ను ప్రేమించటం అంటే నాకంతే తెలుసు ఎందుకంటే దహింపబడి, ఏదో ముద్రవేయించుకొని చివరలో దేన్నో పొందాలని వాంఛిస్తాను నేను... నా దుస్తులు తొలగిస్తాను నా చెక్కిళ్లపై ఎరుపుదనం అలా నిప్పులదారిలో ప్రయాణించి భృకుటిపై చల్లని నాణెమై కుదురుకొంటుంది. అదే అనుభవాన్ని పొందిన నువ్వూ నా పక్కనే పడుకొని నా ముఖాన్ని చేతులతో తడుముతావు నేను నిన్ను ఎంతగా కోరుకొన్నానో నీకూ అర్ధమౌతుంది మనకు ప్రతీసారీ తెలుస్తూనే ఉంటుంది... నీకూ నాకూ దీనికి సాక్ష్యం నా దేహమే. . తెలుగునాట ఇలాంటి మానవానుభవాల్ని వ్యక్తీకరించటాన్ని బూతుగా ముద్రలు వేసారు గత మూడు, నాలుగు దశాబ్దాలుగా. ఇలాంటి అభివ్యక్తులను తీరిక వర్గాల కవిత్వంగా, సామాజిక స్పృహలేని ఉత్త కాల్పనిక సాహిత్యంగా ఇంకొంచెం ముందుకు పోయి దోపిడీ వర్గాలకు దోహదపడే కవిత్వంగా తీర్మానాలు చేసారు చాలామంది విమర్శకులు. మానవానుభవాల్ని వ్యక్తీకరించటమే కవిత్వ లక్ష్యంగా, ప్రయోజనంగా నేడు ప్రపంచం గుర్తించింది. in-betweenness, inclusivity, simplicity నేటి కవిత్వరీతి. తెలుగు కవులు ఈ bastion ను అందిపుచ్చుకొంటారా ఇంకా తాము గీసుకొన్న వృత్తాలలోనే ఉండిపోతారా అనేది కాలమే తేల్చాలి. బొల్లోజు బాబా

Wednesday, October 7, 2020

Imported post: Facebook Post: 2020-10-07T15:43:51

ఎవరి వద్దనైనా Itihas: journal of andhra pradesh archives Vol. 5.1 year: 1977 ఉంటే షేర్ చెయ్యగలరా? ప్లీజ్

Friday, October 2, 2020

Imported post: Facebook Post: 2020-10-02T13:49:59

నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం (ఈ వ్యాసంలోని కొంతభాగం కవిసంధ్య పత్రికలో ప్రచురణ అయినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. వ్యాసం పెద్దది. రెండుభాగాలుగా పోస్ట్ చేద్దామనిపించింది, థాట్ కంటిన్యూటీ ఉండాలని… ఇలా) అఫ్సర్ తాను నలభై ఏళ్ళుగా వెలువరించిన కవిత్వాన్ని “అప్పటినుంచి ఇప్పటి దాకా” పేరుతో ఇటీవల పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు. దీనికి రాసుకొన్న ముందుమాటలో “వొక కవి రాస్తున్న కవిత్వమంతా, వొకే గాటన కట్టేయడం కుదురుతుందా?” అని ప్రశ్నిస్తాడు. 660 పేజీల ఈ సంపుటిని చదివినతరువాత కూడా పై ప్రశ్నకు అవుననో కాదనో సమాధానం దొరకదు. అందునా శిల్పరీత్యా, వస్తురీత్యా, అభివ్యక్తిరీత్యా నిత్యచలనశీలత కలిగిన అత్యాధునికుడైన అఫ్సర్ లాంటి కవి గురించి చెప్పటం మరీ కష్టం. ఈ మొత్తం బృహత్ గ్రంధాన్ని చదివినపుడు మాత్రం ఆ కవితలన్నింటినీ కలుపుతున్న కనిపించని దారాలేవో లీలగా తారాడుతాయి. ఆధునిక కవిత్వం వైయక్తికంగా ఉంటూనే వేదనను పలికించటం ప్రధానలక్షణంగా కలిగి ఉంది. స్వీయానుభవాలను ఇంటలెక్చువల్ గా కవిత్వీకరించే కవులను Confessional Poets అని విమర్శకులు విభజించారు. ఈ తరహా కవిత్వంలో కవి తన వ్యక్తిగత జీవితానుభవాలలోంచి కొన్ని రాజకీయ, సామాజిక సత్యాలను ఆవిష్కరిస్తాడు. అంటే ఆ కవిత్వం ఏకకాలంలో వైయక్తికము, సామాజికమూ అవుతుంది. కన్ఫెషన్ అంటే పూర్తిగా కవికిమాత్రమే సంబంధించిన ఒక అనుభవాన్ని సమాజపరం చేయటం. ఈ చేసే క్రమంలో ఈ సమాజం ఎలా ఉండాలని ఆశించాడో, ఎలా ఉందో అనే భిన్న అంశాల మధ్య వైరుధ్యాలను వెలికి తీస్తాడు. అఫ్సర్ తనజీవితంలో ఎదుర్కొంటున్న సంఘర్షణలను, వేదనలను నిజాయితీగా కవిత్వీకరించాడు. ఆ కోణం లోంచి చూసినపుడు అఫ్సర్ Confessional Poet గా కనిపిస్తాడు. ఏది వ్యక్తిగతమూ, ఏది సామాజికము అని సరిహద్దులు చెరిపేస్తుందీ నాలుగు దశాబ్దాల కవిత్వం. చారిత్రిక, రాజకీయ, సామాజిక వాస్తవాలు వ్యక్తిగత సర్కిల్ ను దాటి ఆధునిక మానవ జీవితాన్ని పోతపోసాయి. అస్తిత్వం కోసం చేసిన అన్వేషణలో ఈ కవిత్వం స్థానీయత పరిధులను దాటిన మానవ అస్తిత్వవేదనను బలంగా ప్రతిబింబించింది. ఇది లోపలనించి మొదలై వెలుపలి సామాజిక వాస్తవికతతో తలపడుతుంది. వ్యాకులత, దుఃఖం, నిస్సహాయత, ధిక్కారం, పరాధీనత, శాంతికాముకత లాంటి ఉద్వేగాలు అంతర్లీనంగా వాక్యాల వెనుక ప్రవహిస్తూంటాయి. 1. మెటొనిమీ అఫ్సర్ కవిత్వ బలం నలభై ఏళ్ళలో అఫ్సర్ కవిత్వం పొందిన పరిణామం - శిల్పరీత్యా సాంద్రపడటం, వస్తురీత్యా సార్వజనీనతను పొందటం, మానవానుభవం సహజత్వాన్ని సంతరించుకోవటం. అతనే వినిపించకపోయినా అతని పాట వినిపిస్తుంది మెల్లిగా కదిలి తుఫానై చుట్టుముడుతుంది జ్ఞాపకమై నడుస్తున్న నిన్ను వెంటాడి వేదిస్తుంది రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా (సైగల్ – 1985) వొక మేఘఘర్జననీ యింకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెనువాన// ప్రాణం ఉగ్గబెట్టుకొన్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకొన్నానా, పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేదాకా, నా జహాపనా (భూపేన్ హజారికా కొరకు -2018) సుమారు ముప్పై అయిదు సంవత్సరాల వ్యవధితో ఇద్దరు గాయకుల గురించి రాసిన కవితా వాక్యాలివి. సైగల్ కవితలో “తిలక్ తనం” కనిపిస్తుంది. అందం, ఆనందం పరమావధిగా ఉంది. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా పై ఇటీవల వ్రాసిన వ్రాసిన ఆ రెండో కవితలో శిల్పం సాంద్రపడింది. పాటను మేఘఘర్జన, గుండెపగులుల సమ్మేళనం, లోపలి వాన అంటూ మెటఫరైజ్ చేయటం టాప్ క్లాస్ వ్యక్తీకరణలు. ఎడతెగని దుఃఖం, వ్యాకులత నిండిన కవి మనఃస్థితిని “పెనువాన”, “చీకటిపరుగు” లాంటి పదాలు సూచిస్తున్నాయి. ఇదంతా అఫ్సర్ నలభై ఏళ్ళలో “తిలక్ తనం” నుంచి “అఫ్సర్ తనం” వరకూ చేసిన ప్రయాణం. *** అఫ్సర్ డిక్షన్ లో సిమిలీ కన్నా ఇమేజెరీ, మెటాఫర్ కన్నా మెటొనిమీ ప్రముఖంగా కనిపిస్తుంది. “ఏకాంతం” అనే కవితలో ఏకాంతపు స్థితికి “గది” ని మెటొనిమీ (ప్రతీకాత్మకత) చేస్తాడు. //లోనికి రమ్మని చేతులు చాస్తుంది గది// ఎంతకీ చేతులు వెనక్కు లాక్కోదు గది గదిగోడల మీద అక్కడక్కడా నెత్తుటి మరకలు/ గది నాకంటే వొంటరిదనుకోను నాకోసమే చేతులు చాచాల్సిన అవసరమూ లేదు// (ఏకాంతం – 1985) పై కవితలో గది అన్న పదం చోటులో ఏకాంతం అన్నపదం ఉంచుకొని చదువుకొన్నప్పుడు ఈ కవిత సౌందర్యం అర్ధమౌతుంది. ఇక్కడ కవి, ఏకాంతగది అనో గదిఏకాంతమనో మెటఫరైజ్ చెయ్యడు. ఏకాంతం అనే కవితా వస్తువును గదితో మెటొనిమీ చేసాడు. కవితను విప్పే తాళం చెవి టైటిల్ లో ఉంచాడు. మెటొనిమీ అనేది అత్యున్నతమైన ఒక కవిత్వీకరణ పనిముట్టు. అందుకనే కవిత్వం “మెటఫర్ నుండి మెటొనిమీకి ప్రయాణించాలి” అంటాడు మో. ఈ మొత్తం కవితలను చదివాకా అఫ్సర్ కవిత్వబలం మెటొనిమీ లోనే ఉందనిపిస్తూంటుంది. ఈ మెటొనిమిలో ఉన్న ప్రమాదం ఏమిటంటే కవి ఉద్దేశించిన ప్రతీకను పాఠకుడు గుర్తించలేకపోయినట్లయితే అది అయోమయానికి దారితీస్తుంది. అఫ్సర్ కవిత్వంపై ఈ తరహా విమర్శ లేకపోలేదు. 2. అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం ప్రతీ కవికి కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. అజంతా కవిత్వంలో మృత్యుఊహలు, ఇస్మాయిల్ కవిత్వంలో పిట్ట, చెట్టు ప్రస్తావనలు వంటివి. అఫ్సర్ కవిత్వంలో కూడా “మాట-మాట్లాడు కోవటం, వాన-వర్షించటం” లాంటి విషయాలు పదే పదే వస్తూంటాయి. వచ్చిన ప్రతీ సారీ కొత్త అర్ధంలో, కొత్త కోణంలో, కొత్త మెటానొమికాభివ్యక్తితో దర్శింపచేయటం కవి ప్రతిభ. చాలా చోట్ల “మాటను” ను లోపలిప్రపంచానికి; “వాన” ను బయటిప్రపంచానికి ప్రతీకలుగా చేయటం గమనించవచ్చు. మాటలకేం, ఇసుకవేసినా రాలనన్ని మాటలు// ఎటుచూసినా మాటల వర్షమే కుంభవృష్టి కురుస్తున్నా నా మీద ఒక్కచినుకూ తడవదే/ ఈ మాటల ఊరేగింపులో నా మాటెవరికీ వినిపించదే!/ నా గొంతులో మాటుకాసి మాటని ఎవరో నులిమేస్తున్నారు/ నా లోపలి మాట మూడంకె వేసింది (నాకు మాటివ్వండి – 1991). చుట్టూ కుండపోతగా కురిసే మాటల వర్షంలో తడుస్తున్న కవికి సొంత మాటలు మూగపోయాయి అంటున్నాడు. చలం చెప్పిన అంతర్ బహిర్ ప్రపంచాల యుద్ధారావం ఇది. ఊహకు వాస్తవానికి మధ్య దూరాన్ని ఈ కవిత పట్టుకొంటుంది. కవిత చివర్లో “గుండెకు సిజేరియన్ చేసైనా సరే ఒక స్వచ్ఛమైన శిశువులాంటి మాట” ఒకటి కావాలంటాడు కవి. మాటకి అక్షరానికి చెమట చేతుల మోటుదనం కావాలిక!// (యానాం వేమన ఏమనె-1992). కవిత్వం మట్టివాసనను, కన్నీటి జాడలను ప్రతిబింబించాలని అంటున్నాడు. తెలుగు దళితకవిత్వాన్ని చిక్కబరచిన “చిక్కనవుతున్న పాట” రావటానికి మూడేళ్ల ముందు రాసిన వాక్యాలివి. అఫ్సర్ తన కాలానికి చాలా ముందే ఉన్నాడనటానికి “యానాం వేమన ఏమనె” కవిత చక్కని సాక్షిగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ కవితానంతర కాలంలో మహోత్తుంగ తరంగాల్లా ఎగసిన దళిత, బహుజన, మైనారిటీ కవిత్వాలలో ఈ కవితాత్మే శత సహస్ర రూపాలతో సంచరించటం ఒక చారిత్రక పరిణామం. మాట రాలిపోయినపుడే కవిత్వమంతా శిథిలమయిపోయింది (వొకానొక అసందర్భం 2009). ఇక్కడ మాటను వాస్తవం చెప్పటం అనే అర్ధంలో వాడతాడు కవి. వాస్తవాన్ని కప్పిపుచ్చే కవిత్వం మృతప్రాయం అని చెపుతున్నాడు. అనేక కవితల్లో స్వీయ అస్తిత్వానికి, వ్యక్తీకరణకు, ఆలోచనలకు, అంతర్మధనానికి మాటను పర్యాయపదం చేయటాన్ని గమనించవచ్చు. కొన్ని ఉదాహరణలు… */లోగొంతుకల్ని/తోడిపోసే చేదలేదుగా చేతుల్లో/వొక తెగిపడిన మాటనో/వొక రాలిపడిన కేకనో/ తెగనరక్కు దేన్నీ (తెగిపడేవి మాటలే -2009) */మాటలొ ఏముందనుకుంటాం కానీ/మాటలోనే అంతా వుంది/అన్నిట్నీ కప్పడం నేర్పుతుంది/దుఃఖం సంతోషంలాగ/సంతోషం దుఃఖంలాగ/అసహనం సహనంలాగ/ ద్వేషం ప్రేమలాగా పలుకుతుంది. (పసి కాళ్ళు నీవీ నావీ) */నిండు చీకట్లో/నిలువెత్తు మల్లెలా/నడుచుకుంటూ వస్తావు నువ్వు. పడవనిండా కొన్ని మాటలూ/ఇంకా కొన్ని అరవిరిసిన నవ్వులూ నింపుకొని (గట్లు తెగినాక -2013) */నిజానికి మాటలసంచీ ఖాళీ అవ్వనే అవ్వదు/అయినా సరే/వెళ్ళిపోవాలి కదా/తలోదారి తలోదిక్కూ తలో రెక్కా అయిపోయి (వుండనా, మరి – 2015) కవిగా అఫ్సర్ వ్యక్తీకరణలో కనిపించే మరొక అబ్సెషన్ ‘వాన’. తనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలకు వానను ప్రతీకాత్మకంగా వాడుతున్నాడని అర్ధమౌతుంది. వాన వెలిసిన చీకట్లో అతని చివరిస్నానం గురించి ఆలోచిస్తో వస్తున్నాను కడిగిన ముత్యంలాంటి అతని వొంటిమీద ఎండిన నెత్తుటి చారికలగురించి మానని గాయాల తెరుచుకున్న నిజాలగురించి వొళ్లంతా కళ్లయిన ఎదురుచూసిన తల్లిగురించి పదహారేళ్ళ కాళ్ళకింద హఠాత్తుగా చీలిపోయిన భూమిగురించీ// (చివరి స్నానం -1997). మత కలహాలలో చంపబడ్డ యువకుని గురించిన కవిత అది. గంభీర విషాదంగా సాగుతుంది. కవిత “వాన వెలిసిన చీకట్లో” అంటూ మొదలౌతుంది. ఇక్కడ వానను లోకం సాగించిన మారణకాండకు ప్రతీకచేయటాన్ని గమనించవచ్చు. భిన్నకాలాలలో, భిన్న సందర్భాలకు వ్రాసిన అనేక కవితల్లో వాన ప్రస్తావన చేసినచోటల్లా ఖాళీల్లోకి పాదరసం బిందువులు కుదురుకున్నట్లుగా ఒదిగిపోవటం గమనిస్తాం. ప్రతీచోటా బయటజరుగుతున్న విషయాన్ని చెప్పటానికి వానను ప్రతీకగా వాడుకొంటున్నట్లు అర్ధమౌతుంది. కొన్ని ఉదాహరణలు… */ఎన్ని వానలు చూళ్ళేదనీ?/ప్రతీవానా/మళ్ళీ అదేదో కొత్తవాసనేస్తుంది (సగమే గుర్తు – 2006) */చడీ చప్పుడూ లేకుండా/అలా కురుస్తూనే వుంది వాన/ఎప్పుడు ఎలా కురిసినా వొకేలా వుండటమే తెలుసు వానకి (నీరెండలో వూరు – 2008) */యీ వానా యీ జీవితం/నన్ను యెంతలా తడుపుతున్నాయో కూడా చూసుకోను/ వానకు కురవటం వొక్కటే తెలిసినట్టు/నాకు పరిగెత్తడం మాత్రమే తెలిసినట్టు (నీదికాని వాన -2013) */అక్కడ నువ్వు యింకా కురుస్తున్నావో లేదో కాని/యిక్కడ నేనింకా తడుస్తూనే వున్నాను (అక్కడి వానలో నేను -2015) */తొలకరివాన/కొండల్ని తలబాదుకునీ బాదుకునీ/ఏడుస్తుంది/వితంతువులు/ చేతులారా గాజులు పగలగొట్టుకొంటున్నట్టు ( శ్రీనగర్ లో మొహర్రం ) ఒక కవి నలభైఏళ్ళపాటు వ్రాసిన సుమారు 600 పేజీల కవిత్వంలో పదే పదే వచ్చిన ఒక పదాన్నో, పదబంధాన్నో వెలికితీసి చూపటం మర్యాదకాకపోవచ్చు. కానీ చెప్పిన ప్రతీచోటా కవి కొత్తగా చెప్పాడని, ఆయా సందర్భాలకు అద్భుతంగా సింక్ చేసాడని, అక్కడ ఆ పదాలు తప్ప వేరే పదాలు పొసగవనే సంగతి చెప్పటానికే ఇదంతా. 3. నలభై ఏళ్ళ వర్తమానం అనన్యత కొరకు చేసిన అనంతమైన పెనుగులాటే అఫ్సర్ కవిత్వం మొత్తం. తాను ఈ సమాజానికి అన్యుడనని అంగీకరించలేకపోవటం ఒక వైపు, తనను ఎందుకు అన్యుడిగా ఈ సమాజం భావిస్తున్నదో అంటో అన్వేషించుకొనే ప్రక్రియ మరో వైపు. ఈ రెండు దృవాల మధ్యా నలిగే హృదయఘర్షణ సంక్లిష్టంగా ఉంటుంది. అఫ్సర్ కవిత్వం పట్ల ప్రధానంగా వినిపించే విమర్శ సంక్లిష్టత. ఈ నేపథ్యంలోంచి తన పరాధీనతను గానం చేస్తాడు అఫ్సర్. ఒక మైనారిటీ కవి అవటం వలన అతనిపై అదనపు భారం ఉంటుంది. అందరికీ చక్కగా కుదురుకొన్న వ్యవస్థలో అఫ్సర్ ను ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది. మనచుట్టూ రక్తమాంసాలతో సంచరించే ఇండియన్ కు, సమకాలీన రాజకీయాలు నిర్మిస్తోన్న ఆదర్శ భారతీయునికి మధ్య పెరిగిపోతున్న అగాధం గురించి అఫ్సర్ కవిత్వం మాట్లాడుతుంది. ఒక అరాచక కట్టుకథ వాస్తవ రూపం దాల్చటం పట్ల సగటు మనిషి పొందే భీతిని పట్టుకొంటుంది. ఈ కవి ఈ నేల యొక్క శతాబ్దాల సామరస్యానికి ప్రతినిధి. తను పుట్టిన నేలపై “లవ్ హేట్” బంధాన్ని కలిగి ఉన్నాడు. */ఉన్నచోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని/ఎక్కడెక్కడో అంటీముట్టని బట్టలా/ విసిరేయొద్దంటాను/నా నవ్వులు నా ఏడ్పులూ/నా అవమానాలు నా అనుమానాలు/నా మానభంగాలు హత్యలూ/అన్నీ మీవి కూడా అంటాను (నాకే జన్మభూమీ లేదు) */ఒకే ఆకాశం గొడుగు కింద/మనిద్దరం/నీకో సగం నాకో సగం కాదు/అంతా మనకోసమే//ఇక్కడే/ ఈ ఆకాశం కిందనే నన్నుండనివ్వు (ఆకాశం వొడిలో) -- అనే వాక్యాలలో ఈ కవి నేను ఈ దేశానికి చెందినవాడినే, నేను అన్యుడను కాను నేనూ మీలోని వాడినే నన్నువేరుగా చూడకండి అన్న వేడికోలు స్పష్టంగా వినిపిస్తుంది. *సరిహద్దులు లేవు లేవు నాకు అని/రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని/భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని/నడుస్తూ పరిగెత్తుతూ వుంటా// నమ్మరా నన్ను నమ్మరా/ నా పేరుచివర మహమ్మదో అహమ్మదో షేకో/సయ్యదో/ ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా// అనే వాక్యాలలో పలికే విషాదం తన అనన్యతను నిరూపించుకోవటం కొరకు కవి పడుతున్నవ్యధను వ్యక్తీకరిస్తాయి. */పచ్చపచ్చని నా వొంటిమీద/రాజకీయాలు చేస్తున్నప్పుడు/యా అల్లాహ్/కనీసం నన్ను బతికించలేకపోయావు/కనీసం నీ కళ్ళయినా చమర్చాయా? (ఒక ఖడ్గం స్వగతం -1996) అంటూ దేవుడినే ప్రశ్నిస్తాడు ఒక నిస్సహాయ స్వరంతో. ఇలాంటి కవితలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమూహపు Psyche ను నిక్షిప్తం చేస్తాడు. ఇవి ఆయా స్థలకాలాదులకు సంబంధించిన ఆ సమూహపు రాజకీయ అభిప్రాయాలుగా భావించవచ్చు. 4. హిస్టారికల్ నేరేటివ్ అఫ్సర్ ఇంతవరకూ వెలువరించిన రక్త స్పర్శ, ఇవాళ, వలస, ఊరి చివర, ఇంటివైపు అనే అయిదు కవితాసంపుటులలోని కవితలను ఈ సమగ్ర సంపుటిలో పొందుపరిచారు. ఈ కవితలను అన్నింటిని ఏకబిగిని చదివినపుడు ఒక Historical narrative అంతర్లీనంగా కనిపిస్తుంది. ఈ నేరేటివ్ లో నాలుగు దశాబ్దాల అభిరుచులు, పఠనాసక్తులు, రాజకీయ, సామాజిక నేపథ్యాలు పరిస్థితులు ఉంటాయి. ఒక పరిణామ క్రమం లీలగా గోఛరిస్తుంది. 1985 లో వచ్చిన “రక్తస్పర్శ” కవితలలో ముస్లిం అస్తిత్వవాద కవితలు కనిపించవు. అలాగని అప్పట్లో మతవాదం లేదని చెప్పలేం కానీ ఆ తరువాత కాలమంతటి కల్లోలంగా లేదనవచ్చు; కనీసం కవిత్వానికి సంబంధించి. 1992 బాబ్రి మసీదు విధ్వంసానికి ముందు జరిగిన హిందువుల పోలరైజేషన్ ప్రక్రియను “ఇవాళ” కవితా సంపుటిలోని కర్ఫ్యూ, సంక్షోభగీతం, ఇదే నా జాతీయగీతం, గాంధీగారి రెండో చెంప, దూరం, నాకు మాటివ్వంటి వంటి కవితలు వ్యక్తీకరిస్తాయి. “మనసారా అందర్నీ ప్రేమిస్తానని మాటివ్వబోతాను/నా కళ్ళమీద ఒక పంజాబ్ మరో మీరట్/తీతువుల్లా వాలిపోతాయి// అనే వాక్యాలద్వారా ఒక శాంతికాముక ముస్లిం కోరుకొనేదేమిటో, పొందుతున్నదేమిటో; విస్పష్టంగా చెపుతాడు అఫ్సర్. మతరాజకీయాలు పెచ్చరిల్లుతున్న సందర్భంలో వాటిని ఎదుర్కోవటంలో విఫలమైన కమ్యూనిష్టుపార్టీలపై చేసిన విమర్శను “దేవుడు మరణించలేదు” అనే కవితలో గమనించవచ్చు. “ఇవాళ” సంపుటిలోని- చిన్నప్పటి సంగీతం, చిన్నప్పటి చెరువు లాంటి కవితల్లో కవి నాస్టాల్జియాలోకి జారిపోతాడు నిస్సహాయుడై. ఆ తరువాత 1999 లో “వలస” సంపుటి వచ్చినకాలం కల్లోలభరితం. అస్తిత్వవాద ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. అగర్ జిందో మె హై, ఇఫ్తార్ సైరన్, ఉష్ మాన్, నాకే జన్మభూమీ లేదు, రెండో విభజన, అజా, నహి మాలూమ్ లాంటి కవితలలో తన మైనారిటీ అస్తిత్వాన్ని నిర్ధ్వంద్వంగా చెప్పుకొన్నాడు. అలాగని అఫ్సర్ కవిత్వంలో రక్తం వచ్చేలా ముక్కుబద్దలు కొట్టేలాంటి మైనారిటీ కవిత్వవాక్యాలు కనిపించవు. షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వటంద్వారానే ఒక వాదాన్ని పలికించాలనుకోవటం ఇతని విధానం కాదు. చెప్పిందంతా ఒక ఆత్మనివేదనగానే చెప్పాడు. మతం పేరుచెప్పి మనిషి చేసే తప్పించుకోలేని తప్పిదాలను ఒక అండర్ స్టేట్ మెంట్ లా సటిల్ గా ఆవిష్కరిస్తాడు. ఇది అఫ్సర్ ను ఇతర మైనారిటీ కవులనుండి వేరుచేస్తుంది. మనువాదపోకడలను ఎదుర్కోవటానికి దళిత, ముస్లిమ్ ల ఐఖ్యతను నేడు చాలామంది కోరుకొంటున్నారు. కారం చేడు దాడులపై వ్రాసిన “ఊరవతలి దుఃఖం”, దళితుల శిరోముండనం పై వ్రాసిన “శిరోముండనం” లాంటి కవితలద్వారా దళిత, ముస్లిం ల ఐఖ్యతను తొంభైలలోనే ప్రతిపాదించాడు అఫ్సర్. 2009 లో వచ్చిన “ఊరిచివర” సంపుటి నాటికి సమాజం ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధికవిధానాలు, చిక్కబడిన మతరాజకీయాలతో సంక్షుభితమై ఉంది. పొట్టచేతపట్టుకొని చేసే వలసలు అనివార్యమయ్యాయి చాలామందికి. అందుకే ఇలా అంటాడు “కడుపే దేశం/ఎంగిలి మెతుకే కల//వెళ్ళిపోవాల్సిందే ఎక్కడికైనా/ఎడారి దేహంలోకి రాకుండా!/దేహం/ఇసుక దిబ్బ కాకుండా// అని. ఇదే కాలంలో ఉవ్వెత్తున లేచిన తెలంగాణా ఉద్యమంతో అఫ్సర్ ఆ ప్రాంత కవిగా మమేకమయ్యాడు. తెలంగాణ 2002, తెలంగాణా 2009 కవితల్లో తెలంగాణా ఆత్మను పలికించాడు. మెరుగైన ఉపాధికొరకు అమెరికా వెళ్ళాకా అక్కడినుంచి అంతర్జాతీయంగా వివక్షకు గురౌతున్న ముస్లిం అస్తిత్వాన్ని దర్శించాడు. తానొక దేశద్రిమ్మరి గా అభివర్ణించుకొన్నాడు “జంగమం” అనే కవితలో. నల్లా నల్లాని నవ్వు, “డౌన్ టౌన్-కొన్ని స్వగతాలు” “తోలుమందం” లాంటి కవితలలో అమెరికాలో వర్ణవివక్షను అనుభవించే నల్లజాతీయుల వేదనతో సహానుభూతి చెందాడు. 2018 లో వచ్చిన “ఇంటి వైపు” సంపుటిలో చిత్రంగా ఏదో వ్యాకులత, ఇంటివైపు బెంగ నిండిన కవితలు కనిపిస్తాయి. నాస్టాల్జియా పొంగిపొర్లుతుంది. ఎక్కువ కవితలు గుండెలు పిండే నేరేటివ్ పద్దతిలో నడుస్తాయి. కొన్నింటిని ప్రేమకవితలుగా పోల్చుకోవచ్చు. కవిగా మరింత మార్మికతలోకి జారిపోయాడు. సందర్భాలకు రాసిన కవితలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలామట్టుకు కన్ఫెషనల్ పొయెమ్స్. ఇది పరిణితా లేక అలసిపోవటమా అనే సందిగ్ధం కలుగుతుంది. మొత్తంమీద ఆరువందల పేజీల కవిత్వంలో కనిపించే హిస్టారికల్ నేరేటివ్- కవి జీవించిన సమాజాన్ని, జీవితాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ముగింపు నాలుగు దశాబ్దాలుగా కవిత, వ్యాసం, కాలమ్, ఎడిటర్, విమర్శ ఏదో రూపంలో అక్షరమై మనకు అనేక దారుల్లో అఫ్సర్ ఎదురవుతూనే ఉన్నాడు. ఆధునికజీవనంలో అనివార్యమౌతున్న వలసలు, విచ్చిన్నమౌతున్న మానవసంబంధాలు, వివిధ జీవనో ఉద్వేగాలను ఒక కవిగా పలికిస్తూనే, ఒక ముస్లిం కవిగా తన అస్తిత్వాన్ని, సమకాలీన రాజకీయ యవనికపై తనసమూహానికి జరుగుతున్న అన్యాయాలను పదునుగానే పలికించాడు. Exile లో ఉంటూ కూడా తన మూలాల్ని, సంస్కృతిని, వ్యక్తుల్ని చెరిపేసుకోలేదు. నిజానికి ప్రవాసంలోనే మూలాల విలువ అర్ధమౌతుంది. ఇతనికి జ్ఞపకాలే ఏకకాలంలో వర్తనమానము భవిష్యత్తూ కూడా. ఈ ప్రపంచాన్ని మెదడు పాయింటాఫ్ వ్యూ లోంచి, హృదయం పాయింటాఫ్ వ్యూ లోంచి దర్శించటం అఫ్సర్ కవిత్వ ప్రయాణం. సత్యాన్ని ఆవరించి ఉన్న నివురుపొరలను ఒక్కొక్కటి వొలుచుకొంటూ నిప్పులపై నడుస్తాడు. ఒక్కోసారి కాంక్రీట్ వ్యక్తీకరణలతో జ్వలించటం, ఒక్కోసారి ఆబ్ స్ట్రాట్ ఊహలతో సోలిపోవటం అఫ్సర్ కవిత్వ శైలి. కాంక్రిట్, ఆబ్ స్ట్రాక్ట్ లు పక్కపక్కనే నిలబెట్టి ఇంతే కదా జీవితం అని మెటఫరైజ్ చేస్తాడు. కవి అన్నవాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సత్యాన్ని జేబులో దాచుకొని రావాలి. ఒక కొత్త పదం, ఒక కొత్త వాక్యం, ఒక కొత్త పదచిత్రంగా బద్దలవ్వాలన్న రహస్యం తెలిసిన వాడు అఫ్సర్ అందుకనే నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఒక కంటిన్యూటీ, దృక్కోణం, స్వరం, తీవ్రతా స్పష్టంగా తెలుస్తూంటాయి. అఫ్సర్ జీవనానుభవాల కవి. కళ, జీవితము పెనవేసుకుపోయిన జీవనానుభవాలు. ఇతని కవిత్వం ఎంత ఆర్థ్రంగా ఉంటుందో, ఇతరులపై వ్రాసిన ఎలిజీలు, భిన్న సందర్భాలకు వ్రాసిన సంఘటనాత్మక కవితలు కూడా అంతే తడితడిగా తగుల్తాయి. afsar@40 కావొచ్చు గాక ఇప్పటికీ పసితనం, యవ్వనం పచ్చిపచ్చిగానే నిలుపుకొని అనుభవాలను కళ్లతో, చెవులతో, చర్మంతో, హృదయంతో లోలోపలకి పీల్చుకొని అక్షరాలుగా, వాక్యాలుగా పలవరించే మనకున్న మనసున్న మంచి కవి. “అప్పటినుంచి ఇప్పటి దాకా” అఫ్సర్ కవిత్వం తప్పక చదవాల్సిన పుస్తకం. దాచుకొని మరలా మరలా చదువుకోవాల్సిన పుస్తకం. బొల్లోజు బాబా 1/3/2020