Monday, November 14, 2022

ఒక అనాది కథ




ఒక తాగుబోతు
తన అప్రాప్త ప్రేయసికి
ఫోన్ చేసి
ఆమె కట్ చేసిన తరువాత కూడా
మోసం, ద్రోహం అంటూ
ఏవేవో మాట్లాడాడు
ఆ మాటల్లోంచి
అతని ప్రేయసి
నడుచుకొంటూ వచ్చి
అతడిమొఖాన్ని చేతుల్లోకి తీసుకొని
పెదాలపై చిన్న ముద్దు ఉంచి
నడుచుకొంటూ
ఎటో వెళిపోయింది...
***
దేవుడు మనిషిని
స్త్రీ పురుషులనే రెండు సగభాగాలుగా
విభజించి చెరో దిక్కుకూ విసిరేసాడట
తన అర్ధభాగం కొరకు
మనిషి చేసే వెతుకులాట ఇదంతా....
.
బొల్లోజు బాబా

Friday, November 4, 2022

శ్రీ అవధానుల మణిబాబు



కాకినాడసాహితీ మిత్రుల మధ్య చిరపరిచితమైన పేరు శ్రీ అవధానుల మణిబాబు. ఏదైనా అంశంపై ఎవరు మాట్లాడగలరు అని చర్చ వచ్చినప్పుడు శ్రీ మణిబాబు పేరు తప్పక వినిపిస్తుంది. వ్యక్తిగా మృధు స్వభావి. కవిగా స్వాప్నికుడు, సున్నిత భావుకుడు. అంశాన్ని తులనాత్మకంగా తూకం వేస్తూ లోతుగా మూల్యాంకనం చేయగల విమర్శకుడు. శ్రోతలను తనతో పాటూ అనుభూతి పడవలో ప్రయాణం చేయించగల చక్కని వక్త. అది ఆథ్యాత్మిక ప్రసంగమైనా, ఆధునిక కవిత్వంపై ఉపన్యాసమైనా.
శ్రీ అవధానుల మణిబాబు రాసిన పుస్తకాలు మొత్తం ఎనిమిది. వేటికవే ప్రత్యేకం. ఇతను విస్తృత అధ్యయన శీలి. ఎంత గొప్ప రచన చేసినా అంతకంత ఒదిగి ఉండటం మణిబాబు వినయం. ఇతను రచించిన అన్ని పుస్తకాలను నేడు ఆర్చైవ్. ఆర్గ్ లో అందరకూ అందుబాటులో ఉంచాడు. వాటిని అక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకొని చదువు కొనవచ్చును. క్రింద కామెంటులో లింక్ ఇచ్చాను చూడగలరు.
.
1. నాన్న...పాప...2018
.
శ్రీ మణిబాబుకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పుస్తకం. పిల్లలు ఎదుగుతూన్న దశలో మనం చూసిన ఎన్నో మధురమైన అనుభవాలను అనుభూతులుగా మలచుకొని దాచుకొంటాం వాటికి అక్షరరూపమిచ్చి గొప్ప కవితా వాక్యాలుగా సారస్వతంలో నిక్షిప్తం చేసారు శ్రీ మణిబాబు
.
పాప దీపం వెలిగించింది
ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడమంటే
ఈ రోజు కొత్తగా అర్ధమైంది
.
పైకి సౌందర్యవంతంగా కనిపిస్తున్నా రేపు ఆ పాపే తల్లై మరో పాపను వెలిగించబోతోందన్న సృష్టి రహస్యం లేదూ పై మూడు వాక్యాలలో.
.
.
2. . స్ఫురణ... స్మరణ (ప్రసంగాలు, సమీక్షలు) - 2017
.
తెలుగు సాహిత్యలోకంలో ఒక విమర్శకునిగా శ్రీ మణిబాబు స్థానాన్ని పదిల పరచిన పుస్తకమిది.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ ఇంద్రగంటి వారు ".......పలురచనలు చదివి స్వతంత్రబుద్ధితో ఆలోచించి అంచనాలు వేయగల నైపుణ్యం ఉండటం వల్ల సాహిత్య విమర్శవైపు దృష్టి పెట్టారని- ఈ వ్యాసాలు చదవడం ద్వారా నాకు అర్ధమైంది" అంటారు. సాహిత్యకృషిలో మర్రిచెట్టులా విస్తరించిన ఒక వ్యక్తి, అప్పుడప్పుడే శాఖలూనుతున్న ఒక చిన్న వ్యక్తిపట్ల వేసిన అంచనా అది. పెద్దల అంచనాలు భవిష్యత్ దర్శనాలు.
ఈ పుస్తకంలో శ్రీ గోపి, శ్రీ భగ్వాన్, శ్రీ దాట్ల, శ్రీ శిఖామణి లాంటి లబ్దప్రతిష్టులపై వ్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరిగురించి శ్రీ మణిబాబు చేసిన ప్రతిపాదనలు, పరిశీలనలు అపూర్వమైనవి.
.
.
3. అన్నవి అనుకొన్నవి (ప్రసంగాలు, సమీక్షలు) 2015
.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ రెంటాల వారు ".... మీ పఠన వైవిధ్యం బావుంది, మీరు విశాలంగా చదువుతున్నట్టున్నారు, కేవలం చదవడం మాత్రమే కాక విలువైనవీ, అందమైనవీ ఎన్నో వాక్యాలను, పద్యాలను గుర్తుపెట్టుకుంటున్నారని గమనించాను. మీ రచనలో అవి జీడిపప్పుల్లా తగిలి రుచిని పెంచుతున్నాయి. వాల్మీకిని, రూమీని, ఫ్రాయిడ్ నీ డేల్ కార్నిగిని, టాగూర్ నీ ముకుందమాలాకారుణ్ణీ.... ఆయా సందర్భాలలో మీరు ఉటంకిస్తూ వచ్చిన పద్దతి బాగుంది" అనే గమనింపు శ్రీ మణిబాబు రచనావ్యాసంగంపై కాదు, అతని మొత్తం వ్యక్తిత్వంపైనే అని భావిస్తాను. శ్రీ మణిబాబు విశ్లేషణ బలం మొత్తం అతని తులనాత్మక అన్వయంలో దాగి ఉంటుందని నా అభిప్రాయం.
ఈ పుస్తకంలో శ్రీ ఓలేటి వారి ఉపాయనము, మునిమాణిక్యం కథలు, శ్రీ ఆవంత్స సోమసుందర్ తో ఇంటర్వ్యూ, కరుణశ్రీ సాహిత్యం, అద్దేపల్లి దీర్ఘకవిత తెరలు, ఆరుద్ర లేఖా సాహిత్యం లాంటి భిన్న సాహిత్య ప్రక్రియలపై అంతే వైవిద్యభరిత విశ్లేషణా వ్యాసాలు ఉన్నాయి.
.
.
4. నేనిలా... తానలా - 2019
.
శ్రీ మణిబాబు సముద్రంతో తనకున్నఅనుబంధాన్ని"నేనిలా...తానలా" పేరుతో ఒక దీర్ఘకవితగా మలచారు. ఈ శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.
ఈ దీర్ఘకవితను మూడు భాగాలుగా విభజించుకొంటే మొదటిభాగంలో తన బాల్యం నుండి సముద్రంతో తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాదు. రెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుంది. మూడవభాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది.
.
.
5. అందినంత చందమామ - 2016
.
ఇది సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి రచనలపై చేసిన విపుల వ్యాఖ్యానం. శ్రీ సోమసుందర్ గారి వాక్యం క్లిష్టంగా ఉంటుందని విమర్శకుల అభిప్రాయం. అందినంత చందమామ అన్న పేరులోనే శ్రీ మణిబాబు ఆ విమర్శను సూచ్యప్రాయంగా చేసాడా అనిపిస్తుంది. సోముడికి పర్యాయపదం చందమామ. అలాగ, అందినంత సోమసుందర్ అని ఈ పుస్తకం పేరుని అర్ధం చేసుకోవచ్చు.
శతాధిక గ్రంధకర్త అయిన శ్రీ సోమసుందర్ ను నాకు అందినంతమేరకే నేను ఈ వ్యాసాలలో చూపించగలుగుతున్నాను అనే వినయం ఒక పక్క, ఆయన అందని చందమామ అనే శ్లేష మరో పక్కా ఇమడ్చటంగా నేను అనుకొంటాను.
ఈ వ్యాసాలన్నీ శ్రీ సోమసుందర్ ను సుందరంగా, సరళంగా ఆవిష్కరిస్తాయి.
.
.
6. పరమం - 2020
.
సుమారు ఇరవై పుస్తకాలు, వాటిలో సగం స్వతంత్ర్యరచనలు, మిగిలినవి అనువాదములు. భాసుని నాటకములు, ఆదిశంకరుని ఆత్మబోధ, క్షేమేంద్రుని చారుచర్య, పూర్ణసోమసుందరం, తిరువల్లువరు, తులసీదాసు పార్వతీ కల్యాణం, కబీరు, నామదేవుడు ఇలా భిన్నకాలాలకు చెందిన భక్తిమార్గాల అంతస్సూత్రాన్ని గుర్తెరిగి రచనలు చేసారు పరమయోగి శ్రీ మధునాపంతుల వేంకట పరమయ్య గారు. వారి రచనలను సూత్రప్రాయంగా స్పృశిస్తూ, వారి కృషికి సందర్భం వచ్చినచోటల్లా ప్రణమిల్లుతూ రాసిన వ్యాస సంపుటి పరమం.
ఆధునిక కవిత్వంపై విమర్శనా వ్యాసాలు రాసే వారు అనేకమంది. కానీ పరమయ్యగారిలాంటి వేదాంతి, పద్యకవి రచించిన ఆథ్యాత్మిక కావ్యాలను సమీక్షించటం ఒక సవాలు. శ్రీ మణిబాబు సవ్యసాచిత్వం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
.
.
7. లోనారసి - 2022
.
ఇది తాజా ప్రచురణ. వివిధ విమర్శనా వ్యాసాల సంపుటి. ఈ పుస్తకంలో శ్రీ మణిబాబు వాక్యం పదునుదేరింది. చేస్తున్న వ్యాఖ్యానాన్ని సమర్ధించటం కొరకు భిన్న రచనలలోంచి ఉటంకింపులు అలవోకగా తీసుకురావటం గమనించవచ్చు. ఈ పుస్తకంలో డా. ఎన్ రామచంద్ర గారి కుముద్వతీ తీరకథలు, శిఖామణి యానాం కథలు, పైడిపాల నూటపదహార్లు, శ్రీ మధునా పంతుల నాన్న కుర్చీ, సంగివేని రవీంద్ర చౌరస్తాలో సముద్రం, శ్రీ చందుసుబ్బారావు చందన చర్చ, విధ్వాన్ విశ్వం పెన్నేటి పాట లాంటిరచనలపై వ్రాసిన విమర్శనా వ్యాసాలు ఉన్నాయి. అన్నీ చక్కని పఠానుభవాన్ని కలిగిస్తాయి.
***
.
శ్రీ అవధానుల మణిబాబు గొప్ప సహృదయుడు. విస్తృత అధ్యయన శీలి. తను రాయాల్సిన లేదా ప్రసంగించాల్సిన పుస్తకాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు. దాని సారాన్ని అప్పటికే వచ్చిన వివిధ అటు ప్రాచీన ఇటు ఆధునికరచనలతో తులనాత్మకంగా పోల్చి ఒక అంతస్సారాన్ని పాఠకునికి చూపే ప్రతిభకలిగిన విశ్లేషకుడు.
పైన చెప్పిన పుస్తకాలను అన్నింటిని ఆర్చైవ్. ఆర్గ్ లో డౌన్ లోడ్ కొరకు అందుబాటులో ఉంచారు శ్రీ మణిబాబు.
ఆసక్తి కలిగినవారు తప్పక డౌన్ లోడ్ చేసుకోగలరు. క్రింద కామెంటు రూపంలో లింకు కలదు.

 
భవదీయుడు
బొల్లోజు బాబా

శ్రీ దడాల రఫేల్ రమణయ్య



శ్రీ దడాల రఫేల్ రమణయ్య పోలీస్ సబ్ ఇన్ స్పెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్రెంచిపాలనకు వ్యతిరేకంగా జరిగిన విమోచన ఉద్యమంలోకి వచ్చారు. తన జీవితాన్ని "My Struggle for the Freedom of French India" పేరుతో అక్షరబద్దం చేసారు. ఇంగ్లీషులో వెలువడిన తొలి తెలుగు దళిత ఆత్మకథ ఇదే కావొచ్చు. మా కాలేజ్ లో దళిత ఆత్మకథలపై జరిగిన సెమినార్ లో వీరిపై ఒక పేపర్ కూడా సమర్పించాను.
2006 లో "శ్రీ దడాల రఫేల్ రమణయ్య జీవితం పోరాటం" పేరుతో ఒక మోనోగ్రాఫ్ రాయటం కొరకు సమాచారం సేకరించి కొంత వర్క్ చేసాను. ఆ కాగితాలు నిన్న పుస్తకాలు సర్దుతుంటే కనిపించాయి. ఆ తరువాత ఆ ప్రోజెక్టు ఎందుకో ముందుకు సాగలేదు. (వారి వారసులు మేమే రాస్తున్నాం అని చెప్పినట్లు గుర్తు). రాసినంత మేరకు ఇ.బుక్ గా రూపొందించి పబ్లిక్ డొమైన్ లో ఉంచుదామని అనుకొంటున్నాను. సమాచారం కొరకు నెట్ లో వెతుకుతోంటే యానాం విమోచనానికి సంబంధించిన ఫొటోలు జూన్ 20, 1954 నాటి ఆంధ్రపత్రికలో కనిపించాయి.
ఆ తరువాత 27 జూన్ న మరోసారి భారతదేశ జండాను ఎగరేయటం జరిగింది. ఈ ఫొటోలే నేడు ప్రచారంలో ఉన్నాయి. (చూడుడు-సూటు బూట్లతో ఉన్న మరో ఫొటో) జూన్ 13 నాడు లాగులతో, పంచెలతో ఉన్న ఆనాటి నాయకులు దిగిన ఫొటోలు చాలా అరుదైనవి.
ఆనాటి సంఘటనను నేను రచించిన "యానాం విమోచనోద్యమం" పుస్తకంలో ఇలా వర్ణించాను.
బొల్లోజు బాబా
.
అది ఆదివారం, జూన్ 13, 1954. ఆ రోజు ఉదయాన్నే శ్రీ దడాల రఫేల్ రమణయ్య, శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ యర్రా సత్యన్నారాయణ, శ్రీ కామిశెట్టి పరుశరామ్, శ్రీ కోన నరసయ్య, కాకినాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ భయంకరాచారి మరియు సుమారు ఓ వేయిమంది అనుచరులు ఒక సమూహంలా యానాంలోకి ప్రవేశ్రించారు. ఈ బృందం యానాం ఎడ్మినిస్ట్రేటర్ బంగళావైపు కదంతొక్కుతూ కదిలింది. ఆ బంగళాను ముట్టడించి అక్కడి ఫ్రెంచ్ జండాను తొలగించి భారత జండాను ఎగురవేయాలన్నది వీరి ఉద్దేశ్యం.
శ్రీ దడాల ఒక మెగాఫోన్ లో- మేము సంఖ్యాపరంగా ఎక్కువ- సాయుధలమై ఉన్నాము. మీరు ప్రతిఘటించినట్లయితే అది నిష్ప్రయోజనమౌతుంది- అని హెచ్చరిస్తూ దయచేసి సహకరించండి అని ఫ్రెంచి అధికారులను కోరుతూ ముందుకు కదిలారు. అయినప్పటికీ వినకుండా ఫ్రెంచి పోలీసులు కొన్ని చేతి బాంబులను వీరివైపు విసిరారు. అవి వీరికి దగ్గరలో పెద్ద శబ్దం చేసుకుంటూ పేలాయి. దానికి వీరంతా మన్యం వారి మేడ గోడకు ఆనుకొని రక్షణ పొందారు. దీనికి ప్రతిచర్యగా విమోచన ఉద్యమ బృందంలో ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంతో వ్యవహరించి, ఏ విధమైన పౌరనష్టం జరగకుండా ఫ్రెంచి పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను చేసారు. (శ్రీ దడాల ఆత్మకథ)
వీళ్ళ రాక తెలుసుకొన్న ఫ్రెంచి విధేయ శక్తులు తలోదిక్కుకు పరిగెట్టి దాక్కున్నారు. కొంతమంది ఎదుర్లంక, ఇతరప్రాంతాలకు పారిపోయారు. మరికొంతమంది అటకలపైన, గుళ్ళలోనూ, సురక్షితమనుకున్న ఇతరప్రాంతాలలోను తలదాచుకొన్నారు. కొంతమందైతే ఆత్మరక్షణ కొరకు తుపాకీ చెంతనుంచుకొన్నారు (రి. జర్నల్ ఆఫ్ హిస్టారికల్ సొసైటీ వాల్యూమ్ 20, 2001)
ఆ విధంగా విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటర్ బంగళాను చేరుకొని అప్పటి అడ్మినిస్ట్రేటర్ ఇన్ చార్జ్ శ్రీ శివా గారినుండి అధికారాలను స్వాధీన పరచుకున్నారు. జూన్ 13 న ఉద్యమకారులకు ఏ విధమైన ప్రతిఘటనా ఏర్పడలేదు.
అనంతరం ఉద్యమనాయకులు ఫ్రెంచ్ జండాను తొలగించి బారతదేశ మువ్వన్నెల జండాను ఎగురవేసారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి యానాం విమోచనమైందని ప్రకటించారు.
తదుపరి "యానాం విమోచనమైందని, భారత ప్రభుత్వం దీని పరిపాలన చేపట్టి, ఈ ప్రాంతాన్ని భారతావనిలో విలీనం చేసుకోవాలని, ప్రధానమంత్రి నెహ్రూకు, ఫ్రాన్స్ ప్రధానమంత్రికి, పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నరుకు టెలిగ్రాములు ఇచ్చారు.
(యానాం విమోచనోద్యమం పుస్తకం నుండి- క్రింద లింకునుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును)











you can down load here the book yanam vimochanodyamam


https://archive.org/details/yanam-vimochanyodyamam

గాంధీ



గాంధీని విభేదించటమో, అభిమానించటమో చాలా సులువు. బ్లాక్ అండ్ వైట్ అంతే. గాంధిని అర్ధం చేసుకోవటంలో- స్పెషల్ ఎలక్టొరేట్ విషయంలో ధృఢంగా నిలబడటం లాంటి కొన్ని గ్రే ఏరియాస్ అడ్డుపడతాయి
అయినప్పటికీ--- ఈరోజు గాడ్సె, సావార్కర్ భావజాలాలు పైకిరావటం రాజకీయ ప్రేరేపితం.
ఈ పనిచేసేవారు హిందూ ఐక్యతను కోరుకొంటారు తప్ప గాంధి చెప్పిన భిన్నమతాల, భారతదేశ ప్రజలందరి ఐక్యతను కోరుకోరు.
ఇలాంటి ధోరణుల వెంటబడటం మేధావులు చేయకూడని పని అని అనుకొంటాను.

Wednesday, November 2, 2022

ఇలతో అల చేసిన సంభాషణ – మణిబాబు “నేనిలా…తానలా” దీర్ఘకవిత

 ఇలతో అల చేసిన సంభాషణమణిబాబునేనిలాతానలాదీర్ఘకవిత

కొన్ని కవితావస్తువులు కవి జీవితంతో మమేకమైపోతాయివాటితో కవి సుదీర్ఘమైన ఆత్మైక ప్రయాణం చేసి ఉంటాడు. వస్తువుతో కవికి ఉన్న అనుభవాలతో అతని హృదయంనిండి పొంగిపొర్లుతూ ఉంటుందిఅలాంటి స్థితిని అనువదించటానికి  పాతిక ముప్పై పాదాలు సరిపోవుఇలాంటి నేపథ్యంలో కవి తన ఉద్వేగాలను దీర్ఘకవితగా మలుస్తాడుఅదొక అనివార్యమైన వ్యక్తీకరణ రూపంతీసుకొన్న వస్తువును దాని భిన్నపార్శ్వాలతో కవిత్వీకరించితనదైన ఒక దృక్కోణాన్ని వస్తువుకు ఆపాదిస్తూ  వ్రాసిన విస్త్రుతమైన రచననే దీర్ఘకవితగా నిర్వచించుకోవచ్చును.

కవి, విమర్శకులు శ్రీ అవధానుల మణిబాబు  సముద్రంతో తనకున్న అనుభంధాన్ని ఒక దీర్ఘ కవితగా మలచినేనిలాతానలాపేరుతో ఇటీవల వెలువరించారు. దీర్ఘకవితను వ్రాసేటపుడు ప్రణాళిక అవసరంలేనట్లయితే అతివిస్తరణ, శాఖాచక్రభ్రమణం కావ్యాత్మను పాడుచేస్తాయిమణిబాబు దీర్ఘకవితను చక్కని ప్రణాళికతో నడిపించాడు దీర్ఘకవితను మూడుభాగాలుగా విభజించుకొంటే మొదటి భాగంలో తన బాల్యంనుండి సముద్రంతో  తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాడురెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుందిమూడవ భాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది.   నాస్టాల్జియా, సమకాలీనత, అన్యాపదేశంగా చెప్పిన హెచ్చరికా దీర్ఘకావ్యానికి సమగ్రతను తెచ్చిపెట్టాయిదీర్ఘకవితలకు సమగ్రత ఆత్మవంటిది

దండి తనకావ్యాదర్శంలో కావ్యంలో అష్టాదశవర్ణనలు ఉండాలంటాడు.  “నేనిలాతానలాదీర్ఘకవితలో వివిధ సందర్భాలలో చేసిన - నగరం, సముద్రం, రుతువు, సూర్యోదయం, సలిలక్రీడ, విప్రలంభం, వివాహం, కుమారోదయం, దూత్యం, నాయకాభ్యుదయం అనే పదిరకాల వర్ణణలను పోల్చుకోవచ్చును. సముద్రాన్ని వస్తువును స్వీకరించి రచనలు చేసిన శ్రీ అద్దేపల్లి, శ్రీ గరికపాటి, శ్రీ రామకృష్ణ శ్రీవత్స, శ్రీ గనారా వంటి తనపూర్వకవుల ప్రస్తావనకూడా చేయటం గమనించవచ్చుఇవి కాక ఆధునిక కావ్య లక్షణాలైన సామాజిక చైతన్యం,  పర్యావరణ కాలుష్యం పట్ల వ్యాకులత, చారిత్రిక స్పృహలు అద్భుతంగా పలికాయివీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొన్నప్పుడునేనిలాతానలాదీర్ఘకవిత అటు సాంప్రదాయక, ఇటు ఆధునిక లక్షణాలను పొదువుకొన్న ఒకమిని కావ్యంగా అనిపించక మానదు. . 

***

నేనిలాతానలాకావ్యంలో పైకి కవి తన ఎదుటగా ఉన్న సముద్రంతో చేసిన సంభాషణలా కనిపిస్తున్నప్పటికీ అది మానవజాతికి, ఆద్యంతరహితమైన సాగరానికి ఉన్న అనాది అనుబంధానికి అక్షరరూపం.  

ఎందుకు నీవంటే అపేక్షఅని కవి సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా సమాధానం ఇచ్చిందట

వెర్రివాడా!

నువ్వు నా సంక్షిప్త రూపానివి

నేను నీ సమగ్ర స్వరూపాన్ని

నేను అర్ణవం

నువ్వు అక్వేరియం.

నీ భాషలో

త్వమేవాహం- అంతే.
మనిషి సముద్రానికి సంక్షిప్తరూపం అనటం నవ్యమైన ఊహపడిలేచే లేదా లేచిపడే కెరటాలు, బడబాగ్నులు, ఉప్పెనలు, నిర్జన ఒంటరితనాలు, నిగూఢతా, నిర్మలతా మనిషి లేదా మానవజాతి లక్షణాలు కూడాను


సముద్రఘోషను కవులు భిన్న సందర్భాలకు భిన్నరకాలుగా భాష్యం చెప్పి తమ ఊహలకు ఊతంగా, ఆయా సందర్భాలను ఉన్మీలనం చేసేలా వాడుకొన్నారు.  ఈ దీర్ఘకవితలో “మేము తీరంపై రాసిన రాతల్ని, ముద్రల్ని ఎందుకు చెరిపేస్తావు నువ్వు” అని సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా బదులిచ్చిందట  


చెరిపిపోవటం కాదు

వాటిని నాలో దాచుకోవటం

భాషతెలియక ఘోషనుకొంటారు గానీ

నా శబ్దాలన్నీ మీ రాతల కలవరింతలే

మీ ఆటల తలపోతలే. ---    ఇదొక నవ్యమైన ఊహ. సముద్రఘోష అనేది, సముద్రతీరంపై మనం రాసుకొన్న రాతలు, ఆడుకొన్న ఆటలే అనటం చక్కని సందర్బోచిత నిర్వచనం.  చెప్పే విషయాలలో అన్వయసారళ్యత ఎంత తేటగా ఉంటే ఆ కవిత అంత బిగిగా ఉంటుందనటానికి చక్కని ఉదాహరణ ఇది.


ధనుష్కోటిలో

తేలుతున్న రాయిని చూసి

ప్రత్యేకత రాయిదా? నీటిదా?

ఆలోచిస్తూ

కిటికీలోంచి చీకటిని చూస్తూ

నిదరోతున్న రైలులో

ఒక్కడినే మెలకువగా ఉన్నపుడు

సాంద్రమైనదేదో వీడగలిగితే

తేలడం నీకైనా సాధ్యమే

బెండులా తేలిక కావాలంటే

గుండె మెత్తబరచుకో

చెవి దగ్గరకొచ్చి చెప్పిపోయావ్ గుర్తుందా…! … అంటూ సముద్రం తనతో చేసిన సంభాషణను తలపోసుకొంటాడు కవి ఒకచోట.  హృదయకాఠిన్యాన్ని తొలగించుకొంటే తేలికపడతాం, మార్ధవంగా మారతాం అనే ఒక గొప్ప ప్రాపంచిక సత్యాన్ని చెప్పటానికి “ధనుష్కోటిలో తేలుతున్న రాయి” అంటూ అంతే గొప్ప సాదృశ్యాన్ని తీసుకొన్నాడిక్కడ కవి. ప్రభోధాలను నేరుగా కాక పరోక్షంగా చెప్పటం సమకాలీన కవిత్వలక్షణం. అందుకే పాఠాన్ని వాచ్యంగా కాక ప్రతీకాత్మకంగా సముద్రం బోధపరచినట్లుగా చెపుతున్నాడు. చక్కటి శిల్పవ్యూహం ఇది


నువ్వో వ్యాపార కేంద్రం

రణరంగం

కార్య క్షేత్రం

విలాస స్థానం

ఏం కావాలో పట్టుకెళ్లడం వచ్చినవాడి సత్తా

చెంబుడు నీళ్లా

ఇన్ని గులకరాళ్ళా?

ఖనిజాలా? ఇంధనాలా?

మరో దేశంపై పెత్తనమా?//

నాడైనా నేడైనా

నీటిని నెగ్గినవాడే

నేలకు రాజు  --   పై వాక్యాలలో కవి చారిత్రిక దృష్టి ద్యోతకమౌతుంది. అవి చదివినపుడు అనేకానేక దృశ్యాలు మదిలో మెదులుతాయి.   జలగండానికి భయపడి చెంబుడునీళ్ళు తీసుకొని ఒడ్డునే పవిత్రస్నానం చేసే భక్తుడో; //గజఈతగాళ్ళు ముత్యాలను శోధిస్తూంటారుఓడల్లో  వ్యాపారం జరుతూంటుంది. పిల్లగాండ్రు  మాత్రం  గులకరాళ్ళను  సేకరించి మరలా విసిరేస్తూంటారు// అనే టాగూర్ వాక్యాలో; ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయిఅంటూ భారతదేశానికి బ్రిటిష్ వారి రాకను వర్ణించిన కొప్పర్తి వాక్యాలో; భవిష్యత్తులో నీటికొరకు యుద్ధాలు జరుగుతాయన్న హెచ్చరికలో  గుర్తుకు రాకమానవుతక్కువ ఖర్చుతో లవణజలాల్ని త్రాగునీరుగా మార్చే ఆవిష్కరణకు నోబుల్ బహుమతి ఇవ్వటానికి ప్రపంచమిపుడు ఎదురుచూస్తుంది.  “నీటిని నెగ్గినవాడే నేలకు రాజువాక్యాలు కవి చారిత్రిక అవగాహనకు, సమకాలీన వాస్తవాలకు,  భవిష్యత్ దర్శనానికి అద్దంపడతాయి.  


కడుపులో ప్లాస్టిక్ నింపుకున్న

షార్క్ మృతదేహాలు

వలల నిండా జీవంలేని తాబేళ్ళు//

వేల అడుగుల క్రింద చేరిన

వ్యర్ధాలను తొలగించేది ఎవరు?

సరిదిద్దుకోలేని నీకు 

తప్పుచేసే హక్కెవరిచ్చారు?అంటూ సముద్రం పలికిన మాటలు మొత్తం దీర్ఘకావ్యానికి ఆయువుపట్టునేడు తెలుగులో పర్యావరణ విధ్వంసంపై వచ్చే కవిత్వం చాలా తక్కువ. దీర్ఘకవితలకు సంబంధించి కొల్లేరు విధ్వంసం పై ఎస్.ఆర్. భల్లం వ్రాసినకొల్లేరుదీర్ఘకవిత, అంతరించిపోతున్న పక్షులపై అద్దేపల్లి ప్రభు వ్రాసినపిట్టలేని లోకం సందర్భంలో ప్రస్తావించుకోదగినవిమణిబాబు వ్రాసిననేనిలాతానలాదీర్ఘకావ్యంలో సింహభాగం సాగర కాలుష్యాన్ని దానివల్ల కలిగిన దుష్పరిణామాలను శక్తివంతంగా ఆవిష్కరించింది. కనుక దీర్ఘకావ్యాన్ని పర్యావరణ కవిత్వంగా  భావించవచ్చు. 


ఆధునిక మానవుడు చేస్తున్న కాలుష్యం వలన మానవజాతి మనుగడ ప్రమాదంలో పడింది.  గ్లోబల్ వార్మింగ్ వలన హిమశిఖరాలు కరిగి, సముద్రమట్టాలు పెరిగి, భూమి అంతా జలమయం అయ్యే అవకాసం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  ఇదొక సాంకేతిక అంశం.  ఇలాంటి వాటిని కవిత్వీకరించటం సులభం కాదు.  ఈ అంశాన్ని ఇలా అక్షరీకరిస్తాడీ కవి.


ఇదే కొనసాగితే

నా నుండి విడివడిన భూమి

మళ్ళీ నాలో కలవడం

మరెంతో దూరంలో లేదు

అపుడు

వేదన వినిపించేందుకు

నాకు మనిషి దొరకడు

తలబాదుకొనేందుకు

ఒడ్డు మిగలదు. --- ఒక ప్రాచీన మహాఖండం కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల నేడు ఉన్న భిన్న ఖండాలుగా విడిపోయిందని పాంజియా సిద్ధాంతం చెపుతుంది.  ఆ సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా  స్పృశిస్తున్నాడిక్కడ కవి.  మానవులు ఇలాగే పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగించినట్లయితే నానుండి విడిపడిన భూమి నాలో కలిసిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు.  ఇంతవరకూ వ్రాసి వదిలేస్తే అదేమంత గొప్పవిషయం కాబోదు.  ఆ తరువాతి వాక్యాలే మణిబాబుని ఉత్తమకవి అని నిరూపిస్తాయి.  జలప్రళయం జరిగాకా సముద్రం మాట్లాడుకోవటానికి మనిషి ఉండడట, ఒడ్డూ మిగలదట. ఈ మాటల్ని సముద్రంతో అనిపించటం లోతైన కల్పన.  ఇక్కడ సముద్రాన్ని కవి ఎలా ఊహించుకొంటున్నాడు అని  ఆలోచిస్తే - ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గురువు ఇంకా ఒక నైరూప్య అనంత స్వరూపునిగా భిన్నరూపాల్లో దర్శనమౌతుంది. 

***


మొత్తం రచనను

ఇదంతా

నీలో దోసెడు నీళ్ళు తీసి

మరలా నీలోనే విడిచిపెట్టటంఅంటాడు కవి ఒకచోట. ఇది పైకి వినయంగా అనిపించినా త్వమేవాహం అని మొదట్లో అన్నమాటకు అందమైన ముక్తాయింపు.  “నేనిలాతానలాఅనే శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.

శ్రీ అవధానుల మణిబాబు కవిత్వంలో గహనమైన సిద్ధాంతాల చట్రాలుండవు. నిత్యం తనను జ్వలింపచేసే మానవానుభవాలకు తాత్విక పరిమళాలు అద్ది కవిత్వంగా మార్చటం ఇతని కవిత్వరహస్యం. జీవితానుభవాలను గ్రహించటంలో- సున్నితత్వం, కరుణ, అమితమైన ప్రేమ, హృదయ నైర్మల్యం ఇతని కవిత్వాన్ని హృద్యమైన అనుభవంలా మార్చుతాయి

రచయిత ఫోన్: 9948179437


బొల్లోజు బాబా