Sunday, May 24, 2026

రిజర్వేషన్లపై....


( "ఎన్నాళ్ళిస్తారు ఈ రిజర్వేషన్లు" అంటూ మాజీ లోక్ సభ స్పీకర్ పేరుతో వైరల్ అవుతున్న కామెంటుకు నా స్పందన)
.
రిజర్వేషన్లు అనేవి ఎవరి రొట్టెముక్క వాళ్లకు దక్కే మెకానిజం. నా ముక్కా తినేస్తాను, ఎదుటివాని ముక్కా నేనే తినేస్తాననడం మోసం, అన్యాయం.
ఈ రోజు EWS రూపంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకూ ఏదో ఒక రూపంలో రిజర్వేషన్లు ఉన్నాయి. పైగా 50% “మెరిట్ కోటా” ఉండనే ఉంది. అయినప్పటికీ “మెరిట్” పేరుతో రిజర్వేషన్లపై చేసే వాదన చాలాసార్లు ఇతరుల వాటాను కూడా ఆక్రమించుకోవాలనుకొనే మెరిట్ లేనివాళ్ళు చేసే వాదన.
అసలు ఈ గోల అంతా ఎందుకు?
అన్నీ జనాభా ప్రాతిపదికన పంచితే సరిపోదా?
అప్పుడు సుమారు 56% జనాభా ఉన్న BCలకు 27% కాకుండా 56% రిజర్వేషన్లు వస్తాయి. అలాగే సుమారు 5% జనాభా ఉన్న పేద OCలకు 10% EWS కాకుండా 5% వాటా మాత్రమే వస్తుంది.
నిజమైన న్యాయం అంటే — ప్రతి వర్గానికి వారి జనాభా, వారి ప్రాతినిధ్యం మేరకు వాటా దక్కడం. నిజానికి విద్య, భూమి, ఆర్థిక వనరులు, సామాజిక గౌరవం, నెట్‌వర్కులు ఇవన్నీ తరతరాలుగా అసమానంగా పంచబడ్డాయి. వాటిని ఎలాగా ఇప్పుడు మార్చలేం. ఆ అసమానతల్ని సరిచేయడానికే రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు భారతదేశానికే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్న విధానమే.
అసమానతల కులాన్ని నిర్మూలించనంతవరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే. అంతే కాదు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగానికి కూడా విస్తరించాలి. ప్రజల సొత్తైన భూముల్ని, అడవుల్ని, గనుల్ని ఉచితంగా, ఏటా లక్షల కోట్ల రుణమాఫీలు, టాక్స్ మినహాయింపులు పొందుతున్న ప్రైవేట్ రంగం ఆ మాత్రం సామాజిక బాధ్యత ఎందుకు వహించదు? మంది సొమ్ముతో వారి సామాజిక వర్గాలే వృద్ధి చెందాలా?
బొల్లోజు బాబా

సోషల్ మీడియా ఆల్గోరిథం

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఆల్గోరిథం ఎలా సెట్ చేసారంటే, బత్తాయిలకు మేలు చేసేది మాత్రమే వైరల్ అవ్వగలదు. ఏదైనా వైరల్ అయిందంటే దానిలో బత్తాయిలకు అనుకూలంగా ఉండే అంశం ఏదో ఉందన్నమాట.... డిజిటల్ స్ట్రాటజిస్టు "పండితుల" ప్లానింగ్ అలాంటిది. పురాణకాలం నుంచీ చూస్తున్నదే ఇది.
అది - సమకాలీన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించి విపక్షాల సీరియస్‌నెస్‌ను ఒక జోక్‌గా మారుస్తోన్న కాక్రోచ్ పార్టీ ఉదంతం కావచ్చు; పేదల ప్రొటీన్ ఆహారాన్ని లాక్కొని ఎక్స్పోర్ట్ కంపనీలకు చేర్చే "బీఫ్ రక్షణ" అంశం కావొచ్చు

ఒక కామెంట్

ముస్లింలపై డా.అంబేద్కర్ అభిప్రాయాలను విభజన పూర్వ విభజనానంతర అభిప్రాయాలుగా చూడాలి. మొదటిదశలో - వందల ఏళ్ల పాలనలో హిందూ-దళిత సమస్యకు పరిష్కారం చూపలేకపోయిన పాలకులుగా ముస్లిములని చూస్తారు.
 
రెండవదశలో ఈదేశంపై ప్రేమతో ఇక్కడే ఉండిపోయిన ముస్లిములను బాధితులుగా/మైనారిటీలుగా చూస్తారు. రాజ్యాంగంలో వారికి సాంస్కృతిక, మత, విద్యా పరిరక్షణ హక్కులు కల్పించారు. స్వతంత్ర భారతదేశంలో వారిపై ప్రతీకారభావ ఉండరాదని భావించారు.
  
హిందుత్వ వాదులు డా. అంబేద్కర్ ముస్లింలపై విభజనపూర్వం వెలిబుచ్చిన అభిప్రాయాలను ముందుకు తెచ్చి వాదిస్తారు అతితెలివితో....
డా. అంబేద్కర్ సత్యాన్వేషి, వాస్తవికుడు. ఈ సందర్భంలో సెలెక్టివ్ కోట్స్ ద్వారా ఆయనను నిర్వచించలేం.

Wednesday, May 13, 2026

The Banker సినిమా - Dr. B. R. Ambedkar



The Banker సినిమా చూశాను. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా బయటికి ఇది ఒక రియల్ ఎస్టేట్ కథలా కనిపించినా, నిజానికి ఇది ఆర్థిక స్వేచ్ఛ కోసం నల్లజాతీయులు చేసిన పోరాట చరిత్ర

1960లలో అమెరికాలో నల్లజాతీయులకు తెల్లవారు నివసించే ప్రాంతాల్లో ఇళ్లు అమ్మడం, అద్దెకు ఇవ్వడం దాదాపు నిషేధం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో బెర్నార్డ్ గారెట్, జో మోరిస్ అనే ఇద్దరు నల్లజాతీయులు ఒక తెల్లజాతి స్నేహితుని ముందుపెట్టి వందల కొద్దీ తెల్లజాతీయుల ఇళ్లను కొనుగోలు చేసి, వాటిని నల్లజాతీయులకు అమ్ముతారు. తర్వాత వారు బ్యాంకులను కూడా కొనుగోలు చేసి, నల్లజాతీయులకు వ్యాపార రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.

సినిమా ప్రారంభంలో ఒక పాత్ర ఇలా అంటుంది:
“నల్లవారు సంపాదించలేరు. సంపాదించినా తెల్లవారు సహించలేరు.”

అలాగే చివరికి, వారు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చట్టపరమైన లొసుగులు ఉన్నాయని సాకుగా చూపుతూ ప్రభ్హుత్వం వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, జైలుకు పంపిస్తుంది. కానీ కొన్నేళ్లకే అదే అమెరికా ప్రభుత్వం, నల్లజాతీయులు కూడా తెల్లవారి ప్రాంతాల్లో నివసించవచ్చని చట్టం తెస్తుంది..

ఈ సినిమా చూస్తున్నంతసేపూ, మన దగ్గర దళితులు, అన్యమతస్థులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం, అమ్మడం లాంటి వాటిపై పెరిగిన అనధికార నిషేధాలు గుర్తుకొచ్చాయి.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — అమెరికాలో అలాంటి చట్టాలు రావడానికి దాదాపు రెండు దశాబ్దాల ముందే, డా. B. R. Ambedkar భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికీ కులమతాలకు అతీతంగా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఆస్థిని కొనుక్కొనే హక్కును పొందుపరిచారు. ఎంత దూరదృష్టి! ఎంత క్రాంతదర్శనం!

బొల్లోజు బాబా