పల్లకీ ఆగిన రోజు
(ఫ్రెంచి
యానాం కథలు)
(ఈ కథ సెప్టెంబరు పాలపిట్ట పత్రికలో ప్రచురింపబడింది. గుడిపాటి గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)
యానాం, 1865
యానాంలోని పల్లీయుల ఆర్థిక పరిస్థితి బాగుండేది. అనాదిగా జలరవాణా
వారి సొంతం. యానాం నుంచి జరిగే ఎగుమతి, దిగుమతులకు జలమార్గమే ప్రధానమైన మార్గం. ఇక్కడి
నుంచి సరకులు పడవల్లో కోరంగి వద్ద నిలిచి ఉండే పెద్ద ఓడలపైకి చేరేవి. ఆ రవాణా మీదే
రాత్రింబవళ్ళు శ్రమించి చాలామంది మంచి ఆస్తిపాస్తులు సంపాదించి ధనవంతులయ్యారు.
అలా ఐశ్వర్యం సంపాదించిన
వారిలో పోతయ్య ఒకడు.
అతనికి యానాం రేవు
దగ్గర రెండు పెద్ద పడవలు ఉండేవి. మరో చిన్న పడవను రేవుదాటే వారిని తీసుకెళ్లడానికి
ఉపయోగించేవాడు. ఉదయం వెలుగు రాకముందే అతని పడవలు గోదావరి నీళ్లలోకి దిగేవి. బియ్యం,
నువ్వులు, నూనె, చేనేత వస్త్రాల మూటలు, నీలిమందు బస్తాలు, కలప సామాన్లు—ఏ సరుకు వచ్చినా కోరంగి దాకా చేర్చడం
పోతయ్య పని.
డబ్బు సంపాదించాడు. ఇల్లు పెద్దదయ్యింది. వాకిట్లో ఎద్దుల బండి నిలిచేది. ఇంట్లో ఇత్తడి పాత్రలు
పెరిగాయి. పండుగ రోజుల్లో అతను చేసే దానధర్మాల కొరకు అతని ఇంటి ముందు జనం బారులు తీరేవారు.
పోతయ్యకు ఒక కోరిక
మాత్రం మిగిలిపోయింది.
తన ఇంటి ముందు కూడా
ఒకరోజు పల్లకీ ఆగాలి.
తనకోసం కాదు. తన కొడుకు
రామన్న పెళ్లి రోజున. కొడుకు కోడలు పల్లకిలో ఊరేగాలి.
“మన దగ్గర డబ్బు ఉంది.
భూమి ఉంది. పడవలు ఉన్నాయి… మనం కూడా ఊరిలో పెద్ద మనుషులమే” అని పోతయ్య తరచూ అనుకునేవాడు.
అతని భార్య సీతమ్మ
మాత్రం ఆ మాట విన్నప్పుడల్లా భయపడేది.
“డబ్బు ఉండటం వేరు
పోతయ్యా... ఊరి కట్టుబాటు వేరు.”
పోతయ్య నవ్వేవాడు.
“ఊరి మాటతో పొట్ట నిండుతుందా?”
“అది కాదు. మనం ఏదైనా
కొత్తగా చేస్తే గొడవ పెడతారు.”
“ఎంతకాలం వాళ్లు చెప్పిందే
మనం వినాలి?” సీతమ్మ నిశ్శబ్దంగా ఉండేది.
ఆమెకు భర్త మాటలో నిజం
కనిపించేది. అతని సంపాదనతో ఇంట్లో కొరత లేదు.
ఊరిలో మాత్రం అతని అడుగులకు ఒక కనిపించని గీత ఉండేది.
రేవులో అతని పడవ ఎక్కడికైనా
వెళ్లొచ్చు.
కోరంగి దాకా వెళ్లొచ్చు. విదేశాలనుంచి వచ్చే పెద్ద ఓడల దగ్గరకు వెళ్లొచ్చు.
వారి వేల రూపాయల సరుకును
మోయొచ్చు. తాతల కాలం నుంచి దొరలతో ఏర్పడిన
సాన్నిహిత్యం వల్ల దొరలవద్ద చనువు ఉండేది.
విదేశీ దొరలతో పక్కనే కూర్చోవచ్చు కానీ
తన ఊరి పెద్దల పక్కన మాత్రం కూర్చోకూడదు. అక్కడ అతని డబ్బుకీ, పలుకుబడికీ విలువ లేదు.
తరతరాలుగా వచ్చిన ఆచారం కావొచ్చు. లోకం మారుతోంది.
దొరలు పాలకులై ఉండి కూడా తమతో పక్కన కూర్చోబెట్టుకొన్న మనిషిని, ఊరి పెద్దలు మాత్రం ఇంకా ఎందుకు దూరంగా ఉంచాలి? అది పోతయ్యకు అర్థం అయ్యేది కాదు.
ఒకరోజు రేవు దగ్గర
పడవలో కూర్చుని ఉండగా అతని కొడుకు రామన్న అడిగాడు:
“నాన్నా... మన పడవ
మీద మనమే రాజుల్లా ఉంటాం కదా?”
పోతయ్య నవ్వాడు.
“పడవ మీద ఎవరూ మనల్ని
ఆపరు.”
“అయితే ఊరిలో ఎందుకు
ఆపుతారు?”
పోతయ్య ముఖంలోని నవ్వు
ఒక్కసారిగా ఆగిపోయింది.
కొడుకు అమాయకంగా అడిగిన
ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు.
దూరంగా కోరంగి వైపు
ఒక పెద్ద ఓడ కనిపిస్తోంది.
ఆ ఓడకు సరుకులు తీసుకెళ్లడానికి
పోతయ్య పడవ సిద్ధంగా ఉంది.
అతను కొంతసేపు ఆ ఓడనే
చూస్తూ ఉన్నాడు.
నీళ్ళ మీద మనిషికి
కులం ఉండదు. నేలపైన ఎందుకు ఉంటుంది?
ఆ రోజు అతని మనసులో ఆలోచన బలపడింది.
రామన్న పెళ్లి దగ్గరపడుతోంది.
పెళ్లి సాధారణంగా జరగదు. పల్లకీ ఊరేగింపుతో జరుగుతుంది. నిశ్చయించుకొన్నాడు.
***
ఆ రోజు ఉదయం నుంచే
పెళ్ళికూతురు ఇంట్లో సందడి మొదలైంది. చిన్న ఇల్లు. మట్టి గోడలు. ఇంటి ముందర తాటాకుల
పందిరి. పందిరి గుంజలకు అరటి మొక్కలు నిలబెట్టి కట్టారు. తలుపుకి మామిడి తోరణం వేలాడుతోంది.
ఇంటి ముందు పెద్ద ముగ్గు వేశారు.
లోపల ఆడవాళ్ల హడావుడి.
“బుగ్గన చుక్క కొంచెం
పెద్దగా పెట్టండి!”
“పెళ్లికూతురి కొత్త
చీర ఎక్కడ కొన్నారు?”
“అయ్యో, ఆ పసుపు గిన్నె
అక్కడ పెట్టకండి!”
“పూలదండ వచ్చిందా?”
“వచ్చింది, ఇదిగో...
జాగ్రత్తగా పెట్టు!”
పిల్లలు పందిరి చుట్టూ
పరుగులు తీస్తున్నారు. ఎవరో పూలు దండలుగా గుచ్చుతున్నారు. ఇంకెవరో అరటి ఆకులు లెక్కపెడుతున్నారు. పిల్లలు కేరింతలు కొడుతూ ఆటలాడుకొంటున్నారు. ఆ హడావుడి
మధ్యలో పెళ్ళికూతురు సుబ్బమ్మ నిశ్శబ్దంగా కూర్చుంది.
ఆమెకు ఈ రోజు తన పెళ్లి
అని తెలుసు. అందరూ తన గురించే మాట్లాడుతుంటే, ఎవరి కళ్లలోకి చూసే ధైర్యం ఆమెకు లేదు.
తల వంచుకుని చీర కొంగును వేళ్లచుట్టూ తిప్పుకుంటోంది.
పాదాలకు పారాణి మెరుస్తోంది.
నుదుట చిన్న బొట్టు. జుట్టులో మల్లెపూలు.
పక్కనే కూర్చున్న ఒక
అమ్మాయి ఆమెను ఆటపట్టించింది.
“ఏమిటే... ఇంత సిగ్గు?
ఇంకా పెళ్లికొడుకును చూడలేదుగా!”
సుబ్బమ్మ ఒక్కసారిగా
తలెత్తి చూసి,
“ఛీ …ఊరుకో!” అంది.
ఆమె బుగ్గలు అప్పటికే
ఎర్రబడ్డాయి.
చుట్టూ ఉన్న ఆడవాళ్లు
నవ్వారు.
“చూశారా! పెళ్ళికొడుకు
అనగానే బుగ్గలు ఎర్రబడ్డాయి.”
సుబ్బమ్మ మరింతగా తల
వంచుకుంది. ఆమె గుండెల్లో మాత్రం తెలియని ఒక కొత్త సందడి మొదలైంది.
***
పోతయ్య ఇల్లు యానాంలో
పేరున్న ఇళ్లలో ఒకటి. విశాలమైన మండువాలోగిలి ఇల్లు. ముందర పెద్ద అరుగులు, లోపల చుట్టూ
గదులు, మధ్యలో ఆకాశం కనిపించే మండువా. మండువాలోగిలి చుట్టూ చెక్క స్తంభాలు, వాటికి
చెక్కిన చిన్న చిన్న అలంకారాలు.
ఆ రోజు ఇల్లు బంధువులతో
కిటకిటలాడుతోంది. దూరపు ఊళ్ల నుంచి వచ్చిన వాళ్లకు మండువాలోనే విడిది కల్పించారు. ఆడవాళ్లు
ఒకవైపు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. మగవాళ్లు పందిరి, భోజన ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
పిల్లలు మండువా చుట్టూ పరుగులు తీస్తున్నారు.
పోతయ్య మాత్రం అరుగుమీద
కూర్చుని ఇంట్లో జరుగుతున్న హడావుడిని చూస్తున్నాడు. అనుకొన్న వాళ్ళందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది అతనికి.
కష్టపడి సంపాదించిన తన సంపద ఈ రోజు కొడుకు పెళ్లి సందడిగా ఇల్లంతా కనిపిస్తుండటంతో
అతని ముఖంలో గర్వం తొణికిసలాడుతోంది.
అరుగు చివర్న కూర్చున్న
నరసయ్యతాత పోతయ్యతో “నీతండ్రి బతికుంటే ఈ రోజు చూసి ఎంత సంతోషించేవాడో” అన్నాడు.
పోతయ్య కాసేపు మౌనంగా
అతని వైపు చూశాడు.
నరసయ్య తాత మళ్లీ అలంకరిస్తున్న
పల్లకీ వైపు చూసి, “మన ఇళ్ళల్లో ఇంత పెద్ద సందడి చూడటం ఇదే మొదటిసారి,”
పోతయ్య నవ్వాడు.
“ఇది నా కొడుకు పెళ్లి
తాతా. మీ అందరి ఆశీర్వాదం ఉంటే చాలు.”
ఇంటి వాకిట్లో పల్లకీని అలంకరిస్తున్నారు. కొత్త వస్త్రాలతో కప్పి,
అంచులకు మల్లెపూల దండలు కట్టారు. లోపల దూదిపరుపుపై కొత్త తెల్లని వస్త్రం పరిచారు.
పల్లకీ మోసే నలుగురు దాన్ని ఎత్తి చూసి బరువు సరిచూశారు.
“జాగ్రత్తగా మోయాలి.
ఇవాళ మన రామన్న పెళ్లికొడుకు,” అన్నాడు పోతయ్య.
కొద్దిసేపటికి రామన్నను
పిలిచారు. కొత్త పట్టు పంచె, తెల్ల చొక్కా, భుజాన కండువా.
బంధువుల మధ్య నుంచి
ఎవరో నవ్వుతూ,
“ఏమయ్యా రామన్నా! నిన్నటి
వరకు పడవలో తిరిగేవాడివి. ఇవాళ పల్లకీలో కూర్చుంటున్నావు!”
రామన్న నవ్వాడు.
“పడవలో మనమే బరువులు
మోయాలి... పల్లకీలో మన బరువునే నలుగురు మోస్తారు!” అన్నాడు. మండువాలో నవ్వులు పూశాయి.
పల్లకీని గడప దగ్గరకు
తీసుకొచ్చారు.
“పోతయ్య కొడుకు భుజం
మీద చేయి వేసి, “పద రా... అందరూ ఎదురుచూస్తున్నారు.” అన్నాడు.
రామన్న పల్లకీలోకి
ఎక్కాడు.
పోతయ్య బంధుమిత్రులతో
కూడి పల్లకీ పక్కనే నడవడానికి సిద్ధమయ్యాడు.
నలుగురు బోయీలు పల్లకీ
బొంగులు భుజాలపైకి ఎత్తుకున్నారు.
పోతయ్య ఇంటి వాకిలి
దాటి పల్లకీ బయటికి కదిలింది.
ఆ ఇంటి సందడి వీధిలోకి
ప్రవహించింది.
పల్లకి ఊరేగింపు పడవలరేవు
వీధి దాటి పెద్ద బజారు వీధిలోకి ప్రవేశించింది.
అయితే, వీధి మలుపు
తిరిగేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎదురుగా తెల్ల దుస్తులు ధరించిన కొందరు
ఊరి పెద్దలు నిలబడి ఉన్నారు. వారి వెనుక మరికొందరు ఊరిజనం గుంపుగా చేరారు.
వాళ్లు దగ్గరకు రాలేదు.
కేవలం చూస్తున్నారు. పల్లకీ కదిలింది.
ఒక అడుగు.
రెండు అడుగులు.
మూడు అడుగులు.
పల్లకీ దగ్గరపడగానే
గుంపులోంచి ఒకడు ముందుకు వచ్చి గట్టిగా అరిచాడు.
“ఆపండి!”
పల్లకీ మోసేవాళ్లు
ఆగిపోయారు. రామన్న పల్లకీ తెరను కొద్దిగా జరిపి
బయటకు చూశాడు. పోతయ్య వెంటనే ముందుకు వచ్చి “ఏమైంది?” అని అడిగాడు.
గుంపులోని ఒక పెద్దమనిషి
పల్లకీ వైపు చూపిస్తూ,
“ఇక ఆపండి. ఈ పల్లకీ
ఇక్కడినుంచి ముందుకు పోదు.”
పోతయ్య ముఖం ఎర్రబడింది.
ఆ వ్యక్తి పల్లకీ వైపు
చూపిస్తూ “ఇది మీకు కాదు.” అన్నాడు
రామన్నకు అర్థం కాలేదు.
“ఏమిటి?”
“పల్లకీ.”
“ఎందుకు?”
“మీ కులానికి పల్లకీలో
వెళ్లే హక్కు లేదు.” పోతయ్య కొద్దిసేపు అతని ముఖం చూశాడు.
“ఎందుకు? మా కష్టార్జితంతో,
మా ఇంటి శుభకార్యం కోసం కట్టించుకున్న పల్లకీ ఇది. ఇందులో తప్పేముంది?”
“తప్పో ఒప్పో కాదు
పోతయ్యా,” అన్నాడు ఆ పెద్దమనిషి. “పల్లీయులు పల్లకీలో వెళ్లడం మన ఊరి ఆచారం కాదు.”
రామన్న పల్లకీ నుంచి
బయటికి రావాలని చూశాడు.
అతని స్నేహితుడు అడ్డుకున్నాడు.
“వద్దు. నువ్వు కూర్చో.”
గుంపులో కలకలం మొదలైంది.
“ఇంతకాలం లేని కొత్త
పద్ధతులు ఇప్పుడెందుకు?”
“వీళ్లను పల్లకీ ఎక్కనిస్తే
రేపు ఇంకెవరెవరు ఏం చేస్తారో!”
“ఊరి కట్టుబాటు ఏం
కావాలి?”
మాటలు కేకలుగా మారుతున్నాయి.
“నాన్నా, వద్దు. మనం వెనక్కి వెళ్లిపోదాం.”
పోతయ్య అతని వైపు తిరిగి
“నువ్వు దిగకు,” అన్నాడు.
అంతలో ఒక పెద్దమనిషి
ముందుకు వచ్చాడు.
“పల్లకీ విడిచిపెట్టు.
గొడవ వద్దు.”
పోతయ్య మెల్లగా అన్నాడు:
“మేమెవరినీ అవమానించడం
లేదు. నా కొడుకు పెళ్లి. అతను పల్లకీలో వెళ్తే మీకు ఎందుకు కోపం?”
ఎవరూ సమాధానం చెప్పలేదు.
ఒక క్షణం నిశ్శబ్దం.
గుంపులోంచి కొందరు
ఒక్కసారిగా పల్లకీ మీదికి దూసుకొచ్చారు. పల్లకి మోసేవాని చేతిలోని అంసపాది కర్రలు లాగేశారు. పల్లకీ ఒక వైపు వొరిగిపోయింది.
“ఆపండి!” అని రామన్న
అరిచాడు.
ఎవరో గొడ్డలితో పల్లకి బొంగుపై దెబ్బ వేసారు. పల్లకీ బొంగుమధ్యలో విరిగింది.
పల్లకి కూలిపోయింది.
రామన్న అదుపుతప్పి నేలమీద పడిపోయాడు.
అతని తలకి గాయం అయింది.
నుదుటి నుంచి రక్తం కారింది.
పూలతో అలంకరించిన పల్లకీ
దుమ్ములో పడిపోయింది. మల్లెపూలు చెల్లాచెదురై కాళ్ల కింద నలిగిపోయాయి.
పల్లకీని మోసిన వాళ్లు
వెనక్కి పరుగెత్తారు. మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి.
వీధిలో ఒక్కసారిగా
గందరగోళం.
“రామన్నా!” అని పోతయ్య
కేక వేసి కొడుకు దగ్గరకు పరిగెత్తాడు. రామన్న
కళ్లు తెరిచాడు. తండ్రిని చూసి లేవడానికి ప్రయత్నించాడు.
“నాన్నా...”
“ఏమీ మాట్లాడకు.”
పోతయ్య అతని తలను తన
ఒడిలోకి తీసుకున్నాడు. అతని చేతులకు రక్తం అంటుకుంది.
ఆ రోజు పల్లకీ అక్కడితో
ఆగిపోయింది.
గొడవ అక్కడితో ఆగలేదు.
ఎక్కకూడనివారు పల్లకీ
ఎక్కినందుకు వచ్చిన కోపం సాయంత్రానికి మరో
రూపం దాల్చింది. యానాం వీధులు సాయంత్రానికి గుంపులతో నిండిపోయాయి. ఒక్కో గుంపు పల్లీయుల
ఇళ్ల వైపు కదిలింది.
మొదట పోతయ్య ఇంటి వద్దకు
వచ్చారు.
మండువాలోగిలి ముందు
ఉదయం కట్టిన మామిడి తోరణం ఇంకా వేలాడుతూనే ఉంది.
పోతయ్య అప్పటికే రామన్న
గాయానికి మందు పూసి అతన్ని ఇంట్లో పడుకోబెట్టాడు. బయట అలజడి పెరుగుతున్న శబ్దం విని
తలుపు దగ్గరకు వచ్చాడు.
“తలుపు తీయండి!” బయట నుంచి కేక. ఎవరూ తీయలేదు.
“పల్లకీ ఎక్కే హక్కు
ఎవరిచ్చారు నీకు?” మరో కేక
“బయటికి రా!”
పోతయ్య తలుపు తీయలేదు.
కాసేపటికి తలుపు మీద
గొడ్డలి దెబ్బ పడింది.
ఛాక్! చెక్క చీలిపోయింది.
మరో దెబ్బ. ఠాక్! గడియ విరిగిపోయింది.
తలుపు ఒక్కసారిగా లోపలికి
పడిపోయింది. గుంపు మండువాలోకి దూసుకొచ్చింది.
ఒకడు మూలన ఉన్న ధాన్యం బస్తాను చింపేశాడు. నేలంతా ధాన్యం చిందింది.
మరోడు గదిలోకి వెళ్లి
ఇత్తడి బిందెలు, పాత్రలు బయటికి తీసుకొచ్చాడు. పోతయ్య అడ్డుకోవడానికి ముందుకు వెళ్లాడు.
“అవి మా ఇంటి వస్తువులు.
తీసుకెళ్లకండి.”
అతన్ని పక్కకు తోసేశారు.
అతను తూలి మండువా స్తంభాన్ని పట్టుకున్నాడు.
ఒకప్పుడు తన సంపదకు
గుర్తుగా మెరిసిన ఇత్తడి పాత్రలు ఒక్కొక్కటిగా బయటికి వెళ్తున్నాయి.
సీతమ్మ గోడకు ఆనుకుని
నిలబడి చూస్తోంది.
ఆమె ఒక్కసారిగా ముందుకు
వెళ్లి, “ఇది మా కోడలికి పెట్టడానికి కొన్నది... వదిలేయండి,” అంది.
ఎవరూ వినలేదు. ఆమె
చేతిలోంచి వెండిగిన్నె లాగేశారు.
పక్కనే ఉన్న చిన్న
గదిలో రామన్న నొప్పితో కదిలాడు. అతని తలపై కట్టిన గుడ్డ మళ్లీ రక్తంతో తడిసింది.
“నాన్నా...” అని మెల్లగా
పిలిచాడు. పోతయ్య వెనక్కి తిరిగి కొడుకు దగ్గరకు వెళ్లాడు.
ఇంట్లోని ధాన్యం చెల్లాచెదురు
చేసారు. బట్టలు బయటికి విసిరేశారు. చెక్క పెట్టెలు
పగలగొట్టారు. తాళాలు వేసిన గదుల తలుపులు కూడా బద్దలగొట్టారు.
కొందరు తీసుకెళ్లడానికి
ఏమీ దొరకకపోవడంతో వస్తువులను అక్కడికక్కడే పగలగొట్టారు. పోతయ్య పెండ్లి ఇంటిని బీభత్సం చేసారు.
ఈ ముట్టడి పోతయ్య ఇంటితో
ఆగలేదు.
పల్లీయుల నివసించే
వీధుల్లో ఇళ్ళ తలుపులు ఒక్కొక్కటిగా బద్దలయ్యాయి. ధాన్యం, పాత్రలు, ఇంట్లో దొరికిన
వస్తువులు దోచుకెళ్లారు. పడవల తాళ్లు, వలలు
కూడా వదల్లేదు.
రేవులో డబ్బు సంపాదించిన
వాళ్ల ఇళ్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొన్నారు. ఇది వారి ఇళ్లలో ఉన్న వస్తువుల మీద మాత్రమే కాదు—వాళ్లు
సంపాదించుకున్న గౌరవం మీద కూడా దాడి.
ఎక్కడ చూసినా ఆడవాళ్ల
ఏడుపులు. పిల్లల కేకలు. మగవాళ్ల అరుపులు. మధ్యమధ్యలో గుంపుల నినాదాలు.
యానాం ఆ రాత్రి పెళ్లి
పందిరి నుంచి గొడవలోకి, గొడవ నుంచి దోపిడీలోకి జారిపోయింది.
పల్లకీతో మొదలైన గొడవ,
పాత కుల కట్టుబాట్ల పేరుతో పల్లీయుల ఇళ్ల దోపిడీకి దారితీసింది.
***
సుబ్బమ్మ ఇంట్లోనే
కూర్చుంది.
పెళ్లికోసం కట్టుకున్న
కొత్త చీర ఇంకా అలాగే ఉంది. పాదాల పారాణి ఇంకా పూర్తిగా ఆరలేదు. పెళ్లి జరగలేదు.
రామన్న గాయపడి వాళ్ళ
ఇంట్లో పడుకున్నాడని తెలిసింది.
కొద్దిసేపటికి అతని
సంగతి చెప్పడానికి వచ్చినవారిని సుబ్బమ్మ తల్లి ఆత్రంగా అడిగింది.
“తెలివిలోనే ఉన్నాడా?”
“ఉన్నాడు.”
ఆమె కాసేపు ఆగి, “అయితే...
పెళ్లి?” అంది.
వచ్చినవాళ్లు ఒకరి
ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరూ మాట్లాడలేదు.
మూలన కూర్చున్న ఓ వృద్ధుడు
నెమ్మదిగా అన్నాడు:
“ఇక ఇది పెళ్లి విషయం కాదు అమ్మా... మన బతుకు విషయం.”
సుబ్బమ్మ తలెత్తి అతని
వైపు చూసింది.
“మన బతుకా?”
“అవును.”
ఆమెకు ఇంకా అర్థం కాలేదు.
“పల్లకీలో వెళ్లడం
వల్ల ఏం మారుతుంది?”
వృద్ధుడు కాసేపు ఆమెను
చూస్తూ, “నీకు పల్లకీలో వెళ్లాలని ఉండటం విషయం కాదు అమ్మా. నువ్వు పల్లకీలో వెళ్లకూడదని
ఇంకొకడు నిర్ణయించడం అసలు విషయం.”
సుబ్బమ్మ ఏమీ మాట్లాడలేదు.
తన చేతిలో ఉన్న పూలదండను
చూసింది. ఆమె దాన్ని నెమ్మదిగా పక్కన పెట్టింది.
***
ఫ్రెంచి పోలీసులు పరిస్థితిని
అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
అప్పటికే గుంపులు చాలా
చోట్లకు విడిపోయాయి. ఒకచోటికి పోలీసులు చేరేసరికి మరో వీధిలో తలుపులు బద్దలవుతున్నాయి.
కొందరు గుంపులను చెదరగొట్టడానికి ప్రయత్నించినా, వాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పరిస్థితి
అదుపులోకి రాలేదు.
యానాం పెద్దొర
Blum పరిస్థితి విషమిస్తోందని గ్రహించాడు. తక్షణమే కాకినాడ బ్రిటిష్ అధికారులకు యానాం
శాంతిభద్రతలు కాపాడే అత్యవసరంగా అదనపు బలగాలు
పంపమని స్నేహపూర్వక అభ్యర్ధన చేసాడు.
మరుసటి రోజు కాకినాడ
నుంచి 50 మంది బ్రిటిష్ పోలీసులు యానాంకు చేరుకున్నారు.
కొద్దిరోజులకు యానాంలో
పరిస్థితి కాస్త చల్లబడింది. దోపిడీకి గురైన ఇళ్లను ప్రజలు సర్దుకుంటున్నారు. గాయపడినవాళ్లు
కోలుకుంటున్నారు. పల్లకీ గొడవ మాత్రం ఇంకా ఊరిలో చర్చగానే ఉంది. పోతయ్య కులస్థులు ఎదురుదాడి
చేయడానికి చూస్తున్నారని సమాచారం అందుతోంది.
ఈ సంక్షోభానికి ముగింపు
పలకాలని యానాం ఫ్రెంచ్ అడ్మినిస్ట్రేటర్ బ్లమ్ తన కార్యాలయంలో ఇరుపక్షాల పెద్దలను పిలిపించాడు.
పెద్ద గది. మధ్యలో
పొడవాటి మేజా. ఒకవైపు పోతయ్య, అతని గాయపడిన కొడుకు రామన్న, బంధు మిత్రులు. మరోవైపు
ఊరి పెద్దలు, స్థానిక ధర్మకర్తలు.
బ్లమ్ అందరి మాటలు
శ్రద్ధగా విన్నాడు.
ముందుగా ఊరి పెద్దలు
మాట్లాడారు.
“దొరా, ఇది మా ఊరి
పాత ఆచారం. పల్లీయులు పల్లకీలో వెళ్లడం ఎప్పటినుంచో లేదు. పోతయ్య కొత్తగా ఈ పద్ధతి
మొదలుపెట్టాడు. దాంతోనే గొడవ వచ్చింది.”
బ్లమ్ పోతయ్య వైపు
చూసి, "పోతయ్యా! ఊరిలో ఇంత శాంతిభద్రతల సమస్య వస్తుందని తెలిసీ నువ్వు ఎందుకు
పల్లకీ ఊరేగింపు తలపెట్టావు? ఇది స్థానిక ఆచారాలకు విరుద్ధమని నీకు తెలీదా?" అని
ప్రశ్నించాడు.
పోతయ్య నేరుగా అతని
కళ్లలోకి చూశాడు.
దొరా, మీ ఫ్రెంచ్ సరుకులు
మోసే నా పడవలకు కులం లేదు. మీతో పక్కపక్కనే కూర్చుని బేరాలుచేసే నా వ్యాపారానికి కులం
లేదు. నా కష్టార్జితం నుంచి మీ ప్రభుత్వానికి చెల్లించే పన్నుకు కులం లేదు. మరి అన్నీ
సమానంగా ఉన్నప్పుడు... నా కొడుకు ఎక్కిన పల్లకీకి మాత్రమే కులం ఎలా అంటుకుంది? డబ్బు దగ్గర సమానం... గౌరవం దగ్గర కులమా దొరా?“
బ్లమ్ మౌనంగా అతని
మాటలు విన్నాడు.
ఊరి పెద్దల్లో ఒకడు
ముందుకు వచ్చాడు.
“దొరా, ఇది తరతరాల
ఆచారం. ఆ ఆచారం చెడిపోతే ఊరిలో ఎవరు పెద్ద, ఎవరు చిన్న అన్న తేడా తెలియకుండా పోతుంది.”
పోతయ్య వెంటనే అన్నాడు:
“మేమెవరి హక్కునీ లాక్కోలేదు. మా డబ్బుతో మా
కొడుకు పెళ్లికి పల్లకీ కట్టించుకున్నాం. మమ్మల్ని ఆపే హక్కు ఎవరికుంది? పల్లకీలో కూర్చోవడం
తప్పయితే, దానికి మా ఇళ్లను దోచుకోవడం ఏం ఆచారం? అని ధైర్యంగా సమాధానమిచ్చాడు.
బ్లమ్ మేజా మీద ఉన్న
పత్రాల వైపు చూశాడు. కొద్దిసేపు వాటిని తిరగేశాడు.
బ్లమ్ అందరి వైపు చూస్తూ
కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత తలెత్తి
అన్నాడు “మీరు అందరూ ఒక విషయం గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ చట్టాలు పౌరులందరికీ సమాన హక్కులు ఇచ్చాయి" 1857 ఫిబ్రవరి 25న పాండిచేరీ గవర్నరు డి వెర్నినాక్
ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం, కులం కారణంగా ఎవరినీ పల్లకీలో ప్రయాణించకుండా అడ్డుకోలేరు.”
గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం
నెలకొంది. ఊరి పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు.
బ్లమ్ కొనసాగించాడు:
“ఆ ఉత్తర్వు ప్రకారం
“పల్లకీలో వెళ్లడం ఏ ఒక్క కులానికీ ప్రత్యేక హక్కు కాదు. ఇకపై యానాంలో కూడా ఇదే నిబంధన
అమలులో ఉంటుంది.”
ఒక పెద్దమనిషి అసహనంగా
కదిలాడు.
“కానీ దొరా... మా సంప్రదాయం….”
బ్లమ్ అతని మాట మధ్యలోనే
ఆపేశాడు.
“మీ ఆచారాలు, మీ నమ్మకాలు
మీవే. వాటి పేరుతో చట్టాన్ని మీరడానికి వీల్లేదు.”
అతని గొంతు కఠినంగా మారింది. “ఇకపై ఎవరైనా పల్లకీని అడ్డుకున్నా, దాన్ని ధ్వంసం చేసినా,
గొడవ చేసినా పోలీసులు చర్య తీసుకుంటారు. అవసరమైతే జైలుకు పంపిస్తారు.
ఊరి పెద్దల ముఖాల్లో
అసంతృప్తి కనిపించింది.
ఎవరో మెల్లగా గొణిగాడు.
“ఇలా అయితే పాత ఆచారాలన్నీ పోతాయి...”
బ్లమ్ పట్టించుకోలేదు.
“ఇక్కడితో ఈ విషయం
ముగిసింది. ఇక యానాంలో ఎవరి పెళ్లి పల్లకీ అయినా, దాన్ని ఆపడానికి ఎవరికీ హక్కు లేదు.”
ఊరి పెద్దలు ఇష్టంలేకుండా
లేచారు. గొణుక్కుంటూ బయటికి నడిచారు.
వాళ్లు బయటికి వెళ్లగానే
పోతయ్య కూడా లేవబోయాడు.
బ్లమ్ అతన్ని ఆపాడు.
“పోతయ్యా!” పోతయ్య
వెనక్కి తిరిగాడు.
“ఇక మీదట నీ వాళ్ళు
కూడా గొడవకు దూరంగా ఉండాలి.” పోతయ్య తల వంచాడు. “అలాగే దొరా.” అన్నాడు.
ఆ తరువాత బ్లమ్ “ఏకులానికి చెందిన వారైనా తమ కుటుంబ వేడుకల సందర్భంగా
పల్లకినెక్కి పురవీధుల్లో ఊరేగవచ్చునని ఊరిలో చాలా రోజులు టముకు వేయించాడు.
****
“ఆగిపోయిన పెళ్లిని
మళ్లీ జరిపేందుకు కొద్దిరోజుల తర్వాత రెండు ఇళ్లలోనూ పందిళ్ళు వేశారు.”
మళ్లీ సన్నాయి మేళం
మోగింది. వీధి మూలల్లో మాత్రం పోలీసుల కాపలా ఉంది.
సుబ్బమ్మ కొత్త చీర
కట్టుకుంది. పాదాలకు మళ్ళి పారాణి పూసుకొంది.
జుట్టులో మల్లెపూలు పెట్టుకుంది. రామన్న తలగాయం మానింది. అతను కొత్త బట్టలు
కట్టుకుని పల్లకీలో కూర్చున్నాడు. పక్కనే సుబ్బమ్మ కూడా కూర్చుంది.
పల్లకీ నెమ్మదిగా కదిలింది.
పడవల రేవు వీధి దాటి,
గతసారి పల్లకీ విరిగిపోయిన పెద్ద బజారు వీధి మలుపు వచ్చింది.
రామన్న తెరను కొద్దిగా
జరిపి బయటికి చూశాడు.
వీధి రెండువైపులా జనం
నిలబడి ఉన్నారు.
అదే వీధి.
అదే ఇళ్లు.
అదే మనుషులు.
ఈసారి ఎవరూ గుంపులుగా
లేరు.
ఎవరూ “ఆపండి!” అని
అరవలేదు.
ఎవరూ పల్లకీ బొంగును
విరగ్గొట్టలేదు.
సన్నాయి మేళం తప్ప
ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే ఏదో పాతది కూలిపోతున్నట్టు అనిపించింది.
ఒక కట్టుబాటు ఆ రోజు మొదటిసారి తన బలం కోల్పోయింది.
పల్లకీ ముందుకు సాగింది.
సుబ్బమ్మ మెడలోని కర్పూరదండ
మెల్లగా ఊగుతోంది.
వీధి పక్కన నిలబడి
ఉన్న చిన్న పిల్లాడు తన తండ్రి చేయి పట్టుకుని అడిగాడు:
“నాన్నా... పల్లకీలో
ఇకపై ఎవరైనా కూర్చోవచ్చా?”
తండ్రి కొద్దిసేపు
పల్లకీ వైపు చూశాడు.
“అవునురా,” అన్నాడు.
పిల్లవాడు మళ్లీ అడిగాడు:
“మరి మొన్న ఎందుకు ఆపారు?”
తండ్రి దగ్గర సమాధానం
లేదు.
అతను తల తిప్పి పక్కనే
నిలబడ్డ వృద్ధుడి వైపు చూశాడు.
వృద్ధుడు నెమ్మదిగా
అన్నాడు, “మనం పల్లకీలో కూర్చోవడం వాళ్ళకు సమస్యకాదు, మనం వాళ్ళతో సమానంగా నడవటమే వాళ్ళకు
అసలు సమస్య”
గోదావరి వైపు నుంచి
ఉదయపు గాలి వీచింది. రేవులో పడవలు మెల్లగా కదులుతున్నాయి. వాటి మీద పడిన సూర్యకాంతి
నీళ్లలో మెరుస్తోంది.
రామన్న వెనక్కి తిరిగి
చూశాడు.
పల్లకీని అడ్డుకున్న
అదే వీధి.
పల్లకీని పగలగొట్టిన
అదే నేల.
కానీ ఇప్పుడు ఆ నేల
మీదుగా అతని పల్లకీ ఎవరూ అడ్డుకోకుండా వెళ్తోంది.
గాలి వీచి సుబ్బమ్మ
జడలోని మల్లెపూల వాసన పల్లకీ అంతా నిండింది.
రామన్న కళ్లుమూసుకుని ఆ వాసనను ఆస్వాదించాడు.
సుబ్బమ్మ అతన్ని గమనించి నవ్వింది.
“ఏమిటి?”
“ఏమీ లేదు... మన పెళ్లి వాసన బాగుంది.” అన్నాడు.
ఒక కొత్త ఉదయం మొదలైంది.
పల్లకీ ముందుకు కదిలినంత
మేరా మనుషుల మధ్య గీసిన గీత కూడా చెరిగిపోతోంది.
గోదావరి తన దారిలో
తాను ప్రవహిస్తూనే ఉంది. రేవులో పడవలు తమ దారిలో సాగుతూనే ఉన్నాయి.
యానాంలో మాత్రం ఆ రోజు
నుంచి—
మనుషులు కొంచెం విశాలంగా
నడవడం మొదలుపెట్టారు.
బొల్లోజు బాబా
చారిత్రక
ఆధారం: 1865లో యానాంలో మత్స్యకారుల పల్లకీ హక్కుపై
బ్రాహ్మణులు, తెలగాలతో జరిగిన ఘర్షణ, పల్లకీ ధ్వంసం, అనంతరం మత్స్యకారుల ఇళ్ల దోపిడీ,
కాకినాడ నుంచి 50 మంది కానిస్టేబుళ్ల రాక, ఫ్రెంచ్ అధికారి బ్లమ్ జోక్యం వంటి అంశాలు
1865 జూన్‌లో గవర్నర్ బొంటెంప్స్ ఫ్రెంచ్ ప్రభుత్వానికి
పంపిన నివేదికలో నమోదయ్యాయి. యానాం పెద్దొర Blum మత్స్యకారుల పక్షాన నిర్ణయం తీసుకుని,
అన్ని కులాలవారికి పల్లకీలో ప్రయాణించే హక్కును సమర్థించాడు; దీనికి 1857 ఫిబ్రవరి
25న గవర్నర్ de Vernenac జారీ చేసిన ఉత్తర్వును ఆధారంగా చూపాడు. ఈ చారిత్రక సంఘటనల
నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కథా రూపకల్పన జరిగింది.
కథలోని పోతయ్య, రామన్న,
సుబ్బమ్మ, సీతమ్మ వంటి పాత్రలు, వారి కుటుంబ జీవితం, సంభాషణలు, ప్రేమ, భావోద్వేగాలు,
వ్యక్తిగత సంఘటనలు కల్పితం.
