పద వెళ్దాం - ఎవరూ నడవని ఆ దారుల వెంట
నువ్వు ప్రాణంగా ప్రేమించే
పచ్చటి క్యూబాను విముక్తం చేద్దాం!
మనతలలపై మెరిసే విప్లవ తారలు
అవమానాలన్నింటినీ తుడిచేస్తూ సాగుదాం,
విజయమైనా మరణమైనా.
మొదటి బుల్లెట్ శబ్దానికి
అడవి ఆశ్చర్యంతో మేల్కొంటుంది,
ఆ క్షణంలో... తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.
భూమి, భుక్తి, న్యాయం, స్వేచ్ఛ అంటూ
నీ గళం నలుదిక్కులా ప్రతిధ్వనించినప్పుడు,
తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.
ఆ నియంతపై పోరాటం ముగిసి,
తుది సమరానికి వ్యూహాలు సిద్ధమవుతున్నప్పుడు,
తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.
క్యూబా విసిరిన బాణం గుచ్చుకొని
ఆ క్రూరమృగం తన గాయాలను నాక్కుంటున్నప్పుడు,
గర్వంతో నిండిన గుండెలతో మేం నీ పక్కనే ఉంటాం.
బహుమతులతో ప్రలోభపెట్టే ఆ శక్తులు
మన నిజాయితీని కొల్లగొట్టలేవు
మనకు కావలసింది వాళ్ల తుపాకులు, బుల్లెట్లు, లాఠీలు...
అంతకు మించి ఏమీ వద్దు!
అమెరికా ఖండ చరిత్ర వైపు సాగే ఈ ప్రయాణంలో,
ఒకవేళ ఇనుప గుళ్ళు మనల్ని అడ్డుకుంటే...
మన గెరిల్లా అస్థికలను కప్పడానికి
క్యూబా కన్నీటి వస్త్రాన్ని ఒక్కదాన్ని కోరుతాం,
అంతకు మించి ఏమీ వద్దు!
Song to Fidel by Ernesto ‘Che’ Guevara
భావానువాదం- బొల్లోజు బాబా
***
1957లో క్యూబా విప్లవ పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో, ఎర్నెస్టో "చే" గువేరా తన సహచరుడు ఫిడెల్ కాస్ట్రోకు అంకితంగా రాసిన కవిత ఇది. ఇది విప్లవ మైత్రికి, నిబద్ధతకు, త్యాగానికి ప్రతీక. "నీ పక్కనే ఉంటాం" అనే వాక్యం ఈ కవితకు హృదయం.
ఈ కవితను ప్రస్తావించిన శ్రీ కె. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో
