Wednesday, July 21, 2010

వారిలో ఒకరు (ONE OF THEM)-- P.P. Ramachandranవారిలో ఒకరు 

స్కూలు బస్ స్టాప్ వద్ద అమ్మాయిలు
బస్సుకోసం ఎదురుచూస్తున్నారు

ఎంత ప్రయత్నించినా
వలికే దేహ సౌందర్యాన్ని
గొడుగులు, బ్యాగులు, జోళ్లు, యూనిఫార్మ్ లు 

నిలువరించలేక పోతున్నాయి.

బయటకురికే వారి హృదయాలను
వారి మాటలు, చూపులు, భంగిమలూ
ఏ మాత్రం దాచలేక పోతున్నాయి.

కళ్ళముందే బస్సులు దాటిపోతూంటే
ఆందోళన పె
రుగుతూంటుంది.
*****


వారిలో ఒకామె  ప్రభుత్వాధికారి
మరొకామె  ఓ గృహణి అవుతారు
ఇంకొకామె  దారి తప్పుతుంది.....


ఆ స్కూలు పక్కనుంచి సాగే బస్సులో
ఒళ్లో పిల్లాడ్ని పెట్టుకొని కూర్చున్న ఆమె  తన భర్తతో
"ఈ స్కూల్లోనే నేను చదువుకొన్నది" అంటోంది.


అక్కడ ఇంకా ఒకరు బస్సుకోసం
ఎదురుచూస్తూనే ఉంటారు
ఇప్పటికీ!


Source:  ONE OF THEM  --   P.P. Ramachandran

Wednesday, July 14, 2010

ప్రార్ధన


ఇప్పుడిక ఓ ఎడారిని ప్రసాదించు 

వర్షించే ఇసుకా, ప్రవహించే ఎండా
దిగంతాలవరకూ
పరచుకొన్న ఏకాంతం
నిర్జల సరోవరాల తో కూడిన
ఓ ఎడారి కావాలిపుడు.
దానికేమాత్రం తగ్గినా
ఈ ఘడియ రక్తికట్టదు.


లేదా
ఓ సముద్రాన్నిప్పించు
దేహాన్ని తేల్చుతూ ఉండేంత ఉప్పని నీరు
చుట్టూ విశాలంగా విస్తరించిన ఏకాంతం
కింద వెచ్చని బడబాగ్ని
పైన చల్లని సుడిగాలులతో కూడిన
ఓ ఉప్పని సముద్రమైనా చాలు
సరిగా సరిపోతుంది.

లేక పోతే 

ఓ రాత్రిని అనుగ్రహించు
అన్ని వైపుల్నుంచీ వీచే నల్లని గాలి
మువ్వలచేతికర్రతో సాగే నేత్రధ్వయం
స్పటికం లా వణికే  చిక్కని నీలిమా
పొదలమాటున మెరిసే కనుల ఏకాంతంతో కూడిన
రాత్రయినా చాలు సందర్భోచితంగా ఉంటుంది.

లేదా.........


బొల్లోజు బాబా

Tuesday, July 6, 2010

శిలపరశెట్టి పురస్కార సభా విశేషాలుముందు పోస్టులో చెప్పిన విధంగా శిలపరశెట్టి పురస్కార సభ ఆంధ్రాయూనివర్సిటీ తెలుగువిభాగం సమావేశమందిరంలో  జరిగింది.  ఈ సభకు ప్రముఖ కవయిత్రి, అనువాదకురాలు జగద్దాత్రి గారు అధ్యక్ష్యత వహించారు. డా. కాళీపట్నం రామారావు గారు ముఖ్య అతిధి గా వచ్చారు.  ప్రముఖ కవి విమర్శకులు శ్రీ రామతీర్ధ  గారు నా కవితా సంకలనం పై సుదీర్ఘమైన విశ్లేషణ చేసారు. కాళీపట్నం రామారావు గారి చేతులమీదుగా శ్రీరాధేయ గారికి నాకు పురస్కారాలు ప్రధానం చేయటం జరిగింది. ట్రుస్టు నిర్వాహకులైన శ్రీ సనారా గారు, శ్రీ శిలపరశెట్టి మోహన్ కుమార్ గారు ప్రసంగించారు.  ఈ కార్యక్రమం తరువాత కుమారి నికితా మోహన్ రచించిన "Penchant" అనే ఇంగ్లీషు  కవితా సంకలనావిష్కరణ జరిగింది.  ఈ పాప వయసు 12 సంవత్సరాలు. ఈ సభలో శ్రీ కొంపెల్ల, శ్రీ జోగారావు, శ్రీ గరిమెళ్ల నాగేశ్వరరావు, శ్రీ ఎల్.ఆర్. స్వామి వంటి ప్రముఖ సాహితీ వేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాకు అభినందనలు తెలియచేసిన అందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా

Saturday, July 3, 2010

నా కవితా సంకలనానికి శిలపరశెట్టి స్మారక ప్రత్యేక ప్రశంస అవార్డు

నా "ఆకుపచ్చని తడిగీతం" కవితాసంకలనం 2009 సంవత్సరానికి గాను శిలపరశెట్టి రాములు నాయుడు స్మారక  ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యింది.

ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ రాధేయ గారి "అవిశ్రాంతం"  ఉత్తమ కవితా సంపుటి పురస్కారం పొందింది. "మగ్గం బతుకు" అనే కవితాసంపుటి ద్వారా చేనేత కార్మికుల దీన స్థితిగతులను అద్భుతంగా అక్షరీకరించి లబ్ధప్రతిష్టులైన రాధేయ గారి సరసన కూర్చునే అదృష్టాన్ని కలిగించిన శిలపరసెట్టి రాములు నాయుడు ట్రస్టు  నిర్వాహకులు శ్రీ మాధవీ సనారా గారికి, న్యాయనిర్ణేతలు శ్రీ రామతీర్ధ గారికి   ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. 

సమావేశ వివరాలు

సమయం: 5:30 ని.


తేదీ: 04-07-2010

స్థలం: ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ హాలు

పురస్కార ప్రధాత:  డా. కాళీపట్నం రామారావు గారు.


నన్నింతకాలం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా

Thursday, June 3, 2010

ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవిత ప్రస్తావన .....

 ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవితల ప్రస్తావన .....

వ్యాసకర్త సాంధ్యశ్రీ గారికి   ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.పాపికొండల్నే మరో కవి దర్శించాడు. ఆ నదీ నీటి బిందువులోంచి మధుర నాదం విన్పించిందట. అక్కడి ప్రజలగుండెల్లో ఆ నదికీ ఆ కొండలకీ గొప్ప మహత్తు ఉందంటున్నారు ఆ నది పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టే చర్చి ఫాదర్‌లా జాలర్లకు చేపలు పంచుతోందంటున్నాడు. ''నదికి అడ్డంగా పెద్దకొండ / ప్రవాహం ఆగలేదు/ మలుపు తీసుకొంది/ జీవితంలానే / డామ్‌ సంకెళ్లు వేయించుకోబోతున్న / ఈ నదీ ప్రవాహాన్ని చూస్తూంటే జాలేస్తుంది/ ఇకపై కూడికలు, తీసివేతలు ప్రకారం ప్రవహించాలి / ఒక్క క్షణం ఆగానో లేదో/ నది నన్ను దాటుకొని / నవ్వు కొంటూ వెళ్లిపోయింది. -  బొల్లోజు బాబా

పూర్తి వ్యాసాన్ని ఈ క్రింది లింకులో చదవగలరు
http://www.andhraprabha.in/search/article-112855

Monday, May 17, 2010

పిడిబాకు

ప్రశాంతతను
గాయపరచే పిడిబాకు
మళ్లా ప్రత్యక్షమైంది

దెబ్బకు స్వప్నం కాస్తా వాస్తవంగా
వాస్తవం కాస్తా మహా ఎడారిగా
మహా ఎడారి కాస్తా మృగతృష్ణగా
రంగులు మార్చేసాయి

ఆ నిర్జలోష్ణ కాసారపుటొడ్డున
రాళ్లు విసురుతో నా ఆత్మ

పిడి బాకు అంచున తృష్ణా బిందువు
పిడి బాకు అంచున మృగకాంక్షా శ్వాస
అచ్చోటనే రుధిర జాతర.
నరక సౌఖ్యం, స్వర్గ బాధ పెనవేసుకొన్న
సృష్టి సౌందర్య విస్ఫొటనం కూడా అక్కడే


తలుపు భళ్లున తెరచా
ఈ సమయం లో వచ్చావేమిటీ!
అందామె ఆశ్చర్యపడుతో
నెత్తురు నింపుకొన్న నా క్షణాల్ని
చూపించా!


గాయపడ్డ నా గీతాన్ని
తన దేహంలోకి తీసుకొని
స్వస్థ పరచిందామె ....ప్రేమతో....
బొల్లోజు బాబా

Thursday, April 29, 2010

తపస్సు

చెట్ల ఆకులు
ధ్యాన ముద్రలో ఉన్నాయి
కొలను అలలు కూడా వాటిని
కలచ సాహసించటం లేదు
నీడ పొడలు నిశ్శబ్దంగా
తొంగిఛూస్తున్నాయి.
పరిమళాల సంచారం
నిలచిపోయింది.


నిశ్చల దృశ్యానికి
ఓ రికామీ తెమ్మెర
చక్కిలిగిలి పెట్టిపోయింది


పూలు అంతవరకూ బంధించిన
సుగంధాలు రివ్వున ఎగిసాయి.
కొలను అలలలలుగా తృళ్లిపడింది.
నీడపొడల అల్లరి
మళ్లీ మొదలైంది.


ఆకులు గలగలా నవ్వేసాయి
ధ్యానం ఫలించినందుకు


బొల్లోజు బాబా

Tuesday, April 13, 2010

బుడుగోయ్ గారి పాద పద్మములకు ........ బొల్లోజు బాబా

బుడుగోయ్ గారి బ్లాగులో నా గురించి వ్రాసిన బొల్లోజు బాబా గారి దివ్య సముఖమునకు... అన్న పోస్టుకు
ఈ సమాధానాన్ని బుడుగోయ్ గారి బ్లాగులో ప్రచురించటానికి బ్లాగర్ ఎర్రర్ (bX-6rscy0)వస్తుంది. కామెంట్ పోస్ట్ అవ్వటం లేదు. కనుక ఇలా పోస్ట్ చేస్తున్నాను.


బుడుగోయ్ గారికి
ముందుగా ధన్యవాదములు. బ్లాగ్లోకంలో నా పేరుతో మొదటి సారిగా ఒక పోస్టు వ్రాసినందుకు :-)

ఒకె ఇక విషయానికి వస్తే

మీరు నా నెరుడా కవితానువాదంపై చేసిన విమర్శ పట్ల నాకు అభ్యంతరాలేమీ లేవు. నేను అక్కడే ఆవిషయాన్ని స్పష్టం చేసాను. ఇక మీది అహంకార ధోరణి అని ఎందుకు అనిపించింది అంటే మీరు వాడిన ఒక వాక్యం
అది

మిగ్లినవి మరోసారి సరిచూసుకొని తిరిగి ప్రచురించండి.

ఒక సారి ప్రచురించేసాకా (బ్లాగులోనో/పత్రికలోనో) మరలా సరిచూసుకొని ప్రచురించమనటానికి మీరెవరు. విమర్శకులు విమర్శించాలంతే. ఉచిత సలహాలు అవసరమా?. దానిని ఇక రచయిత విచక్షణకు వదిలివేయాలి.
(అప్పట్లో నేచేసిన కామెంటు పూర్తిగా కనిపించటం లేదు బహుసా నా బ్రౌజర్ ప్రోబ్లమేమో. అందుకే నా మెయిల్ బాక్సులోంచి మరలా కాపీ పేస్టు చేసాను తాజాగా .)

మీకిచ్చిన సమాధానపు కామెంటు ఆఖరి వాక్యం లో-- నా జ్ఞానమో/అజ్ఞానమో అలానే ఉండనివ్వండి. :-) అని అన్నాను. నా దృష్టిలో ప్రచురించేసాకా అది ఇక నాది కాదు. ఫలానా బుడుగోయ్ అయ్యవారు చెప్పారు కదాని దానిని మార్చి తిరిగి ప్రచురించటం అంత అవమానకరం మరొకటి ఉండదు నా దృష్టిలో. నా రాతల్లో చాలామంది స్పెల్లింగ్ మిస్టేకులు చెపుతూంటారు. వాటిని కూడా నేను అలానే ఉంచేస్తుంటాను మార్చటం ఇష్టం లేక. . (ఒకటి రెండు సందర్భాలు మినహా అదీ బ్లాగు మొదలెట్టిన మొదట్లో)
నా ఉద్దేశ్యం let my ignorance also be known to others అనే.
మీ బ్లాగులోనే జరిగిన ఇస్మాయిల్ నిబద్ద అనిబద్ద కవిత్వం గురించిన చర్చలో చివరకు మీరు నన్ను సంబోదించిన తీరు (మా ప్రాంతంలో మహాప్రభో అని సంభోదించటం అవమానకరం) వల్ల మీ అభివ్యక్తి కొంచెం పంజెంట్ గా ఉంటుందని అనిపించింది.
ఇక చివరి అభియోగం

అఫ్సర్ గారు ఈనాడు మీచేత కానీ నా చేతకానీ కవి అని కితాబులిప్పించుకోవలసిన స్థితిలో లేరు. తెలుగు సాహిత్యానికి ఆయన కంట్రిబ్యూషన్ తక్కువేమీ కాదు. గత పాతిక సంవత్సరాల తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తున్న వారికి తెలుస్తుంది వారి స్థాయి.

ఇక కవిత్వమంటారా - మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అకవిత్వం అనేదే ఒక బ్రహ్మ పదార్ధం. నేను అకవిత్వం అనుకొన్న దాంట్లోంచి గొప్ప గొప్ప ప్రతీకల్ని చూపించగా విస్మయపడ్డ సందర్భాలెన్నోఎదుర్కొన్నాను. నేను గొప్ప కవిత్వం అనుకొన్న వాటిలోని అసంబద్దతల్ని, వ్యాకరణ దోషాల్ని పట్టి చూపించారు మా గురువుగారు చాలా సార్లు.
కనుక కవిత్వం అనేది ఇలాగే ఉండాలని రూల్సేమీ లేవని భావిస్తాను. మీకు నచ్చనంత మాత్రాన మీరు వాడిన పదాల ఘాటు మరీ ఇంతిలా ఉండాలా అనేది నా బాధ.మీరు వాడిన పదాలు
ఊరి చివర — బ్లాగ్లోకంలో ఆహా ఓహోలు చూసి కొన్నాను. i cant believe everyone is going gaga about this book. i found it big bore and i dont think author (cringe to call him poet) knows what is poetry inspite of publishing 4th book.\

ఆయనసలు ఓ కవి అని చెప్పటాని మీరు సిగ్గు పడుతున్నారా? నాలుగో పుస్తకం వేసేసినా ఆయనకు కవిత్వం గురించి తెలియదా?
ఇవసలు మర్యాదకరమైనా వ్యాఖ్యలా? విమర్శ పేరుతో మరీ ఇంత అహంకారం ప్రదర్శించటం మీకు ఉచితం కాదు. (ఇక్కడ ఆయన పెద్దకవా చిన్న కవా అన్న ప్రస్తావన నేను తేవటం లేదు).

కవి అనేవాడు తనకు కలిగిన భావావేశాన్ని అక్షరాలలోకి ఒంపుతాడు. దాన్ని అందుకొనేవారు అతనికెప్పుడూ ఉంటారు. మొత్తం పాఠకులందరితరపునా (ముందుగానే చెప్పాను ప్రతీ కవితకు తగిన రీడర్స్ ఉంటారు మీరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా) వకాల్తా తీసుకొని తీర్మానాలు చేయటానికి మీరెవరు?. విమర్శకునిగా మంచి చెడ్డలు చెప్పండి చాలు. అవమానించొద్దు. కవి అస్థిస్త్వాన్ని ప్రశ్నించటం ఔచిత్యం అనిపించుకోదు అహంకారమవుతుంది.

మీరు కొంపతీసి ప్రముఖుల జాబితాలో ఉన్నారా అని అడిగారు. ఆ భ్రమలైతే నాకు లేవు. మీకేదో అనుమానం ఉన్నట్లుంది -- మీరు నా కవితను విమర్శించినందుకు మీపై ఇలా కక్ష కట్టి తిరిగి మీపై దుష్ప్రచారం చేస్తున్నానని ..... మీరు అలా అనుకొంటూ ఉంటే దానికి I cant help.

ప్రముఖులమీద మీకు ఈ fixation ఏమిటి? అని మీరడిగితే నేనేమీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఏమిచెప్పగలను? ప్రముఖుల మీదేమిటి కవిత్వం రాసే అందరిమీదా నాకు ఫిక్సేషనే. వీలైతే బ్లాగులోకంలో నేను చేసిన కొన్ని వేల కామెంట్లలో నేను ఘాటుగా విమర్సించిన (చిన్నవారినుంచి ప్రముఖుల దాకా) కామెంట్లేమైనా ఉన్నాయేమో గమనించండి. ఎందుకంటే బహుసా కవిత్వం రాసే వారే కరువవుతున్న కాలంలో ఒక మంచి వాక్యమో ఒక మంచి పదచిత్రమో కనపడితే సంబరంగానే ఉంటుంది. (కంప్యూటర్లో టైపుచేయగలిగిన వాళ్ళందరూ రాస్తున్నదంతా కవిత్వమే నన్న భ్రమలు నాకూ లేవు)

ఇక మీ ఈ పోస్టులో కూడా నాకు అహంభావం గా అనిపించిన మరో పారా గ్రాఫు

ఇది మన తెలుగులో ఒక సాంప్రదాయం. ఎడాపెడా అనువాదాలు చేయడం. ఒక నలభై, యాభై అవగానే ఓ పుస్తకం అచ్చు వేయడం, స్నేహితులతో ఒక ముందు మాట, రెండు సమీక్షలు రాయించడం, అమాయక పాఠకులు అదేదో బ్రహ్మపదార్థమని కొని చదువుకొని బోర్లా పడడం. ఇవన్నీ మొగ్గలో తుంచేయడానికే కటువుగా తిరుగు సమాధానమివ్వాల్సి వచ్చింది.

మీకు తెలుగు సాహిత్య రంగంపై పూర్తిగా అవగాహన లేదన్న విషయం పై పారాగ్రాఫు తెలియచేస్తుంది. ఈ రోజు తెలుగు కవిత్వసంకలనాలని కొనే నాధుడు కనపడటం లేదు. ఇదే విషయం చాలా చాలా చోట్ల ఉదాహరణలతో చెప్పాను. ఈ నాటికీ శ్రీశ్రీ, తిలక్, గురజాడ కిష్ణశాస్త్రిలను పట్టుకొనే పబ్లిషర్లు వేళ్లాడుతున్నారు. ప్రముఖ కవుల సంకలనాలే వందల్లో కూడా అమ్ముడు పోవటం లేదు. ఇక అక్కడక్కడా వెలువడుతున్న సంకలనాలన్నీ ఆయా కవుల చేతి చమురు తప్ప మరొకటి కాదు. కవితా సంకలనాలు అనేవి కవుల మధ్య పంచిపెట్టుకొనే కరపత్రాలు గా మారాయి అంటే అతిశయోక్తి కాదీవాళ. కవితా అనే పేరుతో అద్భుతమైన సాహితీ విలువలు కలిగిన ఒక పత్రిక ఆర్ధికవనరులు లేక మూతపడింది. మరికొన్ని చోట్ల కొంతమంది కవులు నెలకు చీటిల మాదిరిగా డబ్బులు దాచుకొని ఆడబ్బుతో ఏడాదికి ఒక కవి యొక్క సంకలనాన్ని లాటరీ పద్దతిన ఎంపిక చేసుకొని, తీసుకువస్తున్నారన్న విషయం మీకు తెలుసా?

ఒక సంకలనం తీసుకురావటం అంటే, nothing but becoming poorer by a twenty thousand అంతే అంతకు మించేమీ లేదు. మిత్రులలోను, బంధువులలోను "కవిగారు" అని పిలిపించుకోవటం అనే దురదకు చెల్లించాల్సిన మూల్యం అది. అంతకు మించి ఈ ఆంధ్రదేశంలో కవులకు జరుగుతున్న మర్యాద ఇంకేమీ లేదు. (నేను మాట్లాడుతున్నది వందమందిలో తొంభై అయిదు మంది గురించి). ఇక మిగిలిన ఆ అయిదుగురు కూడా they happend to be poets thats all. వారు కవులు కాకపోయినప్పటికీ ఇప్పుడు దక్కుతున్న గౌరవాలు దక్కించుకోగల సమర్ధులే.
మరో విషయం గమనించారోలేదో నేడు కవులుగా చలామణీ అవుతున్న వారందరూ దాదాపు, పత్రికోద్యోగులో, లేక యూనివర్సిటీ తెలుగు ప్రొఫసర్లో. కవిత్వం వారికో వృత్తి . దేవరాజు మహారాజు గారు ఈ మధ్యే ప్రపంచ కవుల అనువాదాల సంకలనాన్ని తీసుకొచ్చారు "నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది" అని. అవి ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయో మీకు తెలుసా? వీలైతే తెలుసుకోవటానికి ప్రయత్నించండి.

కవిత్వ రచన, దానిపై వచ్చే సమీక్షలు అన్నీ -- పాపం అమాయక రీడర్ని బోర్లా వేయటానికే అన్న భ్రాంతి నుండి బయటపడండి అర్జంటుగా వాస్తవ పరిస్థితులు అలా లేవు.

చివరి వాక్యంలో----ఇవన్నీ మొగ్గలో తుంచేయడానికే కటువుగా తిరుగు సమాధానమివ్వాల్సి వచ్చింది. ---- అని అనటంలోనే మీ స్థానాన్ని మీరెంత హైప్ చేసుకొంటున్నారో అర్ధం అవుతుంది. దీన్ని ఖచ్చితంగా అహంకారమనే అంటాను నేను.

బహుసా ఈ సందర్భంలో మీరు ఒక బోర్లా పడ్డ "కొనుగోలు దారుడు" అవ్వటం ఆ కవి చేసుకొన్న దురదృష్టం.
ఇక కో హం చర్చలో మీ కామెంటులోని టోన్ నాక్కొంచెం ఘాటుగా అనిపించింది. అంత క్రితమే పైన ఉటంకించిన మీ మరో కామెంటు చదివి రావటం జరిగింది. వెరసి నేచేసిన కామెంటు అది.....

వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పండి, తప్పొప్పులు సూచించండి, భావాలతో విభేదించండి. అంతే తప్ప, డిరోగేటరీ వ్యాఖ్యలు చెయ్యటం సంస్కారం అనిపించుకోదు, అవాకులు చెవాకులు అవుతాయి తప్ప.

ఎక్కడో జయప్రభ అంటుంది "వాడు ఒకానొక విమర్శకుడు, నేను ఒకే ఒక జయప్రభను" అని -- గుర్తుపెట్టుకోండి సాహిత్యంలో విమర్శకులస్థానం అదే.

అయినప్పటికీ
మీపై నా అభిప్రాయం మరోసారి ......
తెలివైన వ్యక్తే కానీ అభివ్యక్తే ఒకోసారి పచ్చిమిరపకాయ నిలువునా చీరి ముక్కులో దూర్చినట్టుంటుంది."

చాలా రోజుల తరువాత నెట్ లో కొన్ని గంటలు కూర్చోబెట్టారు. :-)
బొల్లోజు బాబా

Tuesday, March 30, 2010

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?


ఆ పదం వచ్చిన వాక్యాలు

The evolution of revenues from the duty of montrafat

....were in all likelihood exempted from the tax of montrafat.

Counseil of India to subject the weavers to the tax of Montrafat of which they had been exempted since 1817

పై వాక్యాలను బట్టి Montrafat అంటే వృత్తి పన్ను అనే అర్ధం వస్తుంది. అది కరక్టేనా? ఈ పదం ఫ్రెంచి పదమేనా? దాని పూర్తి అర్ధాన్ని దయచేసి ఎవరైనా వివరించగలరు.

I will be highly thankful to to one and all .

బొల్లోజు బాబా

Saturday, March 20, 2010

మార్చి 20 - ప్రపంచ పిచ్చుకల దినోత్సవంప్రతీ సంవత్సరం మార్చి ఇరవైన ప్రపంచ పిచ్చుకల దినంగా పరిగణించాలని పర్యావరణ వేత్తలు నిర్ణయించారు. ఈ సందర్భంగా
అంతరించిపోతున్న పిచ్చుకలపై ఇదివరలో నేరాసిన ఓ కవితను ఇక్కడమరో సారి పోస్టు చేస్తున్నాను.....


అంతరించిపోతున్న పిచ్చుకలపై........

నువ్విక్కడికి రావటం లేదంటే
ఎక్కడో ఉండే ఉంటావులే
అనుకున్నానింతకాలమూ

అక్కడా లేవట కదా! మరెక్కడికి పోయావూ?


రెక్కల టపటపల గమకాల్ని పలికిస్తూ
మెరుపు వేగంతో అటూ ఇటూ ఎగురుతో
మా పచ్చని హృదయాలపై వాలేదానివి.

ఇంటి చూరుకు వేలాడదీసిన

వరి కంకుల కుంచె ఓ నక్షత్రమై
నీకు ప్రేమగా స్వాగతం పలికేది.

నీ అవిశ్రాంత మైధున సంగీతానికి

ఊరు మొత్తం ముసిముసి నవ్వులతో
సిగ్గుపడుతూ మురిసిపోయేది.


చూరు అంచునో లేక మిద్దె కంతల్లోనో
నీవు నిర్మించుకొన్న స్వర్గంవైపు

ఎవరైనా తొంగిచూస్తే, వాని తలపై గింగిర్లు కొడుతూ,
అరుస్తూ నీవు చేసే హడావిడికి
గాలి కూడా బిత్తర పోయేది.

మట్టిలో పొర్లాడుతూ చేసిన ఇసుక స్నానాలు
చాతీపై నల్ల మచ్చతో నీ లైంగిక ద్విరూపకతా
పెరట్లో సస్యరక్షణ గావించిన నీ ఉక్కు ముక్కు
గాయపడ్డ నీ దేహాన్ని సంరక్షించిన మా బాల్యాలు
నా కిటికీ పై వాలి పాటలు పాడి తుర్రుమన్న
ఆ క్షణాలన్నీ, తమ గాలిపెదాలతో
ఈ బొమ్మల పుస్తక పుటల్ని రెపరెప లాడిస్తున్నాయి.

పెంకుటిళ్లు, నిద్ర పగుళ్లలోంచి
కారిపోయిన స్వప్నాలైన వేళ
అవని మొహంపై రసాయిన దాడి నేపధ్యంలో
సెల్ ఫోన్ రేడియేషన్ కనిపించని మృత్యువలై
నిన్నో ఎడ్రస్ లేని ఉత్తరాన్ని చేసేసిందా?

నువ్వు వస్తావని, గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
తరువాత 'మీవంతు' అంటూ
భయపెడుతూంది.

బొల్లోజు బాబా

చాలా కాలంగా పిచ్చుకలెక్కడయినా కనిపిస్తాయా అని చూస్తూనే ఉన్నాం. ఒక రోజు కనిపించిన వాటిని మా అమ్మాయి కెమారాలోబంధించింది. ఓ పిచ్చుక అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని దానితో అది దాదాపు అరగంట పైగా చేసిన హంగామాని కూడా వీడియోతీసింది మా అమ్మాయి. వాటిని మీ అందరితో ఇలా పంచుకొంటున్నాను.....ప్రస్తుతం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నా, ముందుముందు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అలా జరగకూడదని ఆశిద్దాం.

Friday, March 19, 2010

అంతే ....


ఒక చిన్న తీయని కూత చాలు
తనిక్కడ ఉంటున్నానని చెప్పటానికి

ఒక రాలిన ఈక
తనిక్కడ ఉండినట్లు చెపుతుంది.

మట్టులోని వెచ్చదనం
తనిక్కడ ఉంటుందని చెపుతుంది.

ఎంత సింపుల్ గా జీవితాలని
గానం చేయ గలుగుతున్నాయీ - పక్షులు.

సోర్సు:THE SIMPLE P.P. Ramachandran


బొల్లోజు బాబా

Saturday, March 13, 2010

చిన్న చిక్కు- Chandrakant Deotale

"నా వద్ద కొద్దిపాటి స్థలముంటే
కుమ్మరి వద్దనుంచి కొన్ని ఇటుకలను
అరువు పుచ్చుకొని
ఓ గుడెసెను నిర్మించుకొనేవాడిని
వెదురుకర్రలు మాత్రమే నా వద్ద లేవు"

అతనలా చెప్పినప్పటి నుంచీ
నేను అన్వేషిస్తూనే ఉన్నాను
కొన్ని వెదురుకర్రలు సంపాదించి అతనికిద్దామని.


అతనికి కొద్దిపాటి స్థలముంటే
అతను కుమ్మరి నుండి ఇటుకలను
అరువు తెచ్చుకోగలడు కనుక
ఓ చిన్న గుడిసె తయారయిపోయి ఉండేది.

మేమలా సాగుతుండగా
సముద్రం ఆకాశం అంతేలేని భూమి
కనిపించాయి
ఈ మూడూ ఎవరికీ చెంది లేవు
మేము వెంటనే అరిచాం
ఇది మా సముద్రం మా ఆకాశం మా భూమి అని.

ఆ మూడింటినీ
మా పిడికిళ్ళలో కానీ కళ్లల్లో
చేతులలో కానీ నింపుకోలేకపోయాం.
కనీసం ఓ ముక్క ఆకాశాన్నో ఓ చెక్క భూమినో
సముద్రాన్నో అమ్ముకోలేకపోయాం.
ఆ విధంగా మేము అనంతానికి అధిపతులయ్యాం

కానీ చిన్న చిక్కు మాత్రం అలానే
మిగిలిపోయింది మా ఇద్దరకూ.
అతనివద్ద స్థలం లేదు
నా వద్ద వెదురు కర్రలు లేవు.


మూలం:
"A Minor Difficulty With The Two Of Us" -- Chandrakant Deotale

అనువాదం: బొల్లోజు బాబా

Monday, March 8, 2010

Tightrope Dancer

Tightrope Dancer


బిగించి కట్టిన తాడు
దానిపై నా ఆట. ఆ బిగుతు తాడు.
రెండు కర్రలకు బిగించి కట్టిన ఆ సన్నని తాడుపై నా ఆట
తాడుపై నా ఆటేమిటంటే
ఈ కర్రనుంచి ఆ కర్ర వరకూ ఆడటమే.
రెండు కర్రలకూ బిగుతుగా కట్టిన
నే నాటాడే ఆ తాడుపై పడే ఫ్లడ్ లైట్ల కాంతిలో
జనాలు చూస్తూంటారు
ఆడే నన్ను కాదు
నే నిలుచున్న తాడును కాదు
తాడు కట్టబడ్డ కర్రలను కాదు
నా ఆటను చూపించే కాంతినీ కాదు
జనాలు ఆటను మాత్రమే చూస్తూంటారు.

కానీ
నేనాడే ఆట
నేను ఆట ఆడే తాడు
తాడును బిగించి కట్టిన కర్రలు
అన్నిటినీ చూపించే ఫ్లడ్ లైట్ల కాంతి
ఆ కాంతిలో
కర్రల మధ్య బిగించి కట్టబడ్డ ఆ తాడుపై
నిజానికి నేను ఆటాడటం లేదు.

తాడు ముడిని ఒదులు ఎలా చేయాలా అని
ఈ కర్ర నుండి ఆ కర్రకు నేను తిరుగుతున్నాను.
దాని పట్టు సడలించటానికి గింజుకొంటున్నాను
పారిపోదామని.
పట్టు సడలటం లేదు
రెండు కర్రల మధ్యా
అలా తిరుగుతూనే ఉన్నాను
ఏ మార్పూ లేదు.

కానీ దాన్నే ఆటగా భ్రమించి చూస్తున్నారు జనాలు
తాడును కాదు
కర్రలను కాదు
కాంతిని కాదు
తాడు బిగింపునూ కాదు
వాళ్లు
ఆటను మాత్రమే చూస్తున్నారు.

source: Vatsyayan 'Agyeya'
Tightrope Dancer

Tuesday, February 16, 2010

రెండు నిముషాల మౌనం

సోదర సోదరీ మణులారా

ఈ రోజు మరణిస్తున్నది
మరణిస్తున్న ఈ దినం కోసం
రెండు నిముషాల మౌనం

ఎగిరిపోతూన్న పక్షికోసం
నిశ్చల జలాల కోసం
మీద పడుతున్న రాత్రికోసం
రెండు నిముషాల మౌనం

దాని కోసం
కాని దాని కోసం
అయిఉండాల్సిన దానికోసం
రెండు నిముషాల మౌనం

విసిరేసిన తొక్కకోసం
నలిగిపోయిన గరిక కోసం
ప్రతీ యత్నం కోసం
ప్రతీ పధకం కోసం
రెండు నిముషాల మౌనం

ఈ గొప్ప శతాబ్దం కోసం
ఈ శతాబ్దపు ప్రతీ గొప్ప ఆలోచన కోసం
దాని గొప్ప పదాలకోసం
ఇంకా గొప్ప ఉద్దేశాలకోసం
రెండు నిముషాల మౌనం

సోదర సోదరీమణులారా
ఈ గొప్ప విజయాలకోసం


రెండు నిముషాల మౌనం
రెండు నిముషాల మౌనం

మూలం: Kedarnath Singh -- A Two-Minute Silence

బొల్లోజు బాబా

Saturday, February 13, 2010

రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్

1. రండి రండి - శ్రీ కేదార్ నాధ్ సింగ్

రండి
మీకు వీలు కుదిరినపుడు

రండి
మీకు వీలు కుదరనప్పటికీ

రండి
చేతులలో శక్తిలా
నాళాలలో రక్తంలా

రండి
కుంపట్లోని
సన్నని మౌన జ్వాలల్లా

రండి

రండి
వానల తరువాత మొలిచే
తాజా తుమ్మ ముళ్లల్లే

రాలిపోయే రోజుల్లారా
కూలిపోయే వాగ్దానాల్లారా
రండి

రండి
మంగళవారం తరువాత వచ్చే
బుధవారంలా

రండి రండి

మూలం: COME WHEN YOU FIND THE TIME - KEDARNATH SINGH2. పండు రుచి లా....

ఆకాశంలో తారలు
నీళ్లల్లో చేపలు
గాలిలో ప్రాణవాయువు

సరిగ్గా అలానే ఈ భూమిపై
నేను
నువ్వు
అనిలము
మరణము
దిరిసెన పూలు

అగ్గిపుల్ల తల
ఇంటి తలుపు
వీపుపై కురుపు
పండు రుచి

సరిగ్గా అలానే......
సరిగ్గా అలానే.......

మూలం:LIKE FLAVOUR OF FRUIT - KEDARNATH SINGH

భవదీయుడు
బొల్లోజు బాబా

Wednesday, February 10, 2010

పదాలు చలికి చచ్చిపోవు - శ్రీ కేదార్ నాధ్ సింగ్

పదాలు చలికి చచ్చిపోవు
ధైర్యం లోపించటం వల్ల చస్తాయంతే
పదాలు తడి కాలంలో
చెడిపోతాయి ఎక్కువగా

మా ఊరి ఏటిగట్టుపై
ఒకసారి నేనో పదాన్ని కలిసాను
మెరిసే ఎర్రపిట్టలా ఉందది
ఇంటికి తీసుకొచ్చాను
గుమ్మం వద్దకు చేరగానే
వింతైన బెదురు చూపులతో
నన్ను చూస్తూ చచ్చిపోయింది అది

అప్పటి నుంచీ పదాలంటే భయం నాకు
వాటి మధ్యకు వెళ్లినా వెంటనే వెనక్కు వచ్చేస్తాను
రంగు రంగుల దుస్తులు వేసుకొని
జుట్టు విరబోసుకున్న పదం నా వైపు రావటం చూస్తే
వెంటనే నా కనులు మూసేసు కొంటాను

నెమ్మది నెమ్మదిగా
ఈ ఆటను ఆనందించటం మొదలెట్టాను
నేనో రోజు గడ్డి మేటు కింద
పాములా నక్కిన ఓ అందమైన పదాన్ని
రాయితో గాయపర్చాను అకారణంగా

దాని చక్కని మెరిసే కళ్ళను
ఈ నాటికీ నేను మరచిపోలేదు

కాలం గడిచే కొద్దీ
నా భయం తగ్గసాగింది
ఈ రోజు పదాలు ఎదురైతే
కుశల ప్రశ్నలు వేసుకుంటాం

ఇపుడు నాకు
అవి దాక్కునే చోట్లెన్నో తెలిసాయి
వాటి వివిధ వర్ణాలు చాలామట్టుకు
నాకు పరిచితమయ్యాయి
సాదా పదాలు, గోధుమ చామనిచాయ రంగుల్లోను
విధ్వంశక పదాలు, లేత పసుపు పింక్ రంగుల్లోను
ఉంటాయని నేనిప్పుడు చెప్పగలను

విషాదకర, గంభీర సందర్భాలకోసం
మనం దాచుకొన్న పదాలు
వాటికుద్దేశింపబడిన సందర్భాలలో
చాలా జుగుప్స కలిగించే పదాలే కావటం
తరచూ జరిగేదే


బొత్తిగా పనికి రానివనీ
హీన వర్ణాలను తొడుక్కొన్నాయనీ
చెత్తలో పారేసిన పదాలే

నా ఆపత్కాలలో సహాయపడ్డాయన్న 
నిజాన్ని కనుగొన్నాను
ఇపుడేం చేయగలను నేను

నిన్నేం జరిగిందంటే
ఓ అరడజను సొగసైన పదాలు
చీకటి వీధిలో అకస్మాత్తుగా
నన్ను చుట్టు ముట్టాయి
భయమేసింది నాకు

మాటల్లేకుండా కొద్దిసేపు వాటిముందు
అలా నిలచుండి పోయాను, చమటతో తడుస్తో
తేరుకొని పరుగు ప్రారంభించాను
నా పాదాలు గాల్లోకి లేస్తుండగా
రక్తంలో తడిచిన ఓ చిన్నారి పదం
ఎక్కడినుంచో ఆయాసపడుతూ నన్ను చేరి
" రా, నేను నిన్ను ఇంటికి చేరుస్తాను" అంది.

మూలం: WORDS DON’T DIE OF COLD - KEDARNATH SINGH


భవదీయుడు
బొల్లోజు బాబా

Monday, February 8, 2010

దేవుడు లేకుండానే!


శ్రీ కేదార్ నాధ్ సింగ్ (1934) ప్రముఖ ఆధునిక హిందీ కవి. వీరు రచించిన Akaal Mein Saras (Cranes in Drought) సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. శ్రీ కేదార్ నాధ్ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో హిందీ భాషా ప్రొఫసరుగా పనిచేసారు.

వీరి కవిత్వం సరళంగా ఉంటూనే లోతైన భావాల్ని కలిగి ఉంటుంది. ఈయన శైలి "బహుళ స్వరాలతో సంభాషణాయుతం" గా ఉంటుందని విమర్శకులు అంటారు.
రోజూ దర్శించే దైనందిక విషయాలే వీరి కవిత్వంలో గొప్ప నిగూఢార్ధంతో, ఒక నూతన దృష్టితో వర్ణింపబడుతూంటాయి.

స్థూలంగా చెప్పాలంటే్, శిల్పం పట్ల మక్కువ కలిగిన, ప్రయోగశీలి అయిన, ఒక మానవతావాద కవిగా శ్రీ కేదార్ నాథ్ సింగ్ గారిని చెప్పుకోవచ్చు.

శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God కు స్వేచ్ఛానువాదం ఇది. మరికొన్ని వీరి కవితానువాదాలు మరోసారి........

దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
ఉదయం పదికల్లా ఈ ప్రపంచం
తన పని తాను చేసుకుపోతోంది
దేవుడు లేకుండానే!

వాహనాలు నిండిపోయాయి
జనాలు తొందరలో ఉన్నారు
ఎప్పట్లానే.

భుజానికి సంచి తగిలించుకొన్న
తపాలావాలా రోజూలానే
తిరుగుతున్నాడు
దేవుడు లేకుండానే!

బ్యాంకులు వేళకే తెరవబడ్డాయి
గడ్డి పెరుగుతూనే ఉంది
అన్ని లెక్కలూ ఎంత క్లిష్టమైనవైనా
చివరకు ఓ కొలిక్కి వచ్చేస్తున్నాయి
జీవించాల్సిన వాళ్లు
జీవిస్తున్నారు
చనిపోవాల్సిన వాళ్లు
చనిపోతున్నారు
దేవుడు లేకుండానే!

ఇదేమి వింత
రైళ్లు ఆలస్యంగానో సమయానికో
ఏదో గమ్యానికి వెళ్లటమో రావటమో
జరిగిపోతూనే ఉంది
ఎన్నికలు జరుగుతున్నాయి
ఆకాశంలో విమానాలు ఎగురుతూనే ఉన్నాయి
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
గుర్రాల సకిలింపు కొనసాగుతూంది
సాగరంలో ఉప్పు ఇంకా తయారవుతూనే ఉంది
అటూ ఇటూ పిచ్చిగా తిరిగిన పిచ్చుక
చివరకు ఎలానో
తన గూటికి తిరిగి చేరుకొంటూంది
దేవుడు లేకుండానే!

దేవుడు లేకుండానే!
నా విషాదం మునుపెన్నడూ లేనంత
చిక్కబడుతూనే ఉంది
పది సంవత్సరాల నా పాత ప్రియురాలి కురులు
ఎన్నడూ లేనంత నల్లనైనాయి
ఇంటినుంచి బయటకెళ్లి తిరిగి చేరుకోవటం
ఇంకా వ్యామోహం గానే ఉంది ఎప్పట్లానే

ఇదేమి వింత
నీరు ప్రవహిస్తూనే ఉంది
ప్రవాహం మధ్యలో చేతులు చాపి
అలా నుంచునే ఉంది వంతెన
దేవుడు లేకుండానే!

మూలం: శ్రీ కేదార్ నాథ్ సింగ్ రచించిన Even Without God
బొల్లోజు బాబా

Saturday, February 6, 2010

స్త్రీ దేహం....... పాబ్లో నెరుడా

స్త్రీ దేహమా!
తెల్లని గిరులు, ఊరువులతో
నీవు వశమయిన ప్రపంచంలా కనిపిస్తున్నావు.
ధృఢమైన నా రైతు దేహం నిన్ను దున్నుతోంది
అవని లోతుల్లోని శిశువును పైకి తీసుకు రావటానికై.

నేనో సొరంగంలా ఒంటరినై ఉండేవాడిని.
పక్షులు నాలోంచి ఎగిరేవి.
రాత్రి ముట్టడి చేసి నన్ను ముంచెత్తేది.
నే బతకటం కోసమే నిన్నో ఆయుధంగా చేసుకొన్నాను
నా ధనస్సులో బాణంలా నా ఒడిసెలలో రాయిలా.

కానీ ప్రతీకార క్షణాలు కరిగిపోయాకా
నిన్ను ప్రేమిస్తున్నట్లు గ్రహించాను.
చర్మం, మట్టి, వాంఛ, చిక్కని పాలు నిండిన దేహానివి నీవు.
ఓహ్! చనుల ధ్వయం విరహ నేత్రాలు
కటిప్రాంత ఎర్రగులాబీలు సన్నని విషాద స్వరంతో నీవు.

ఓ నా స్త్రీ దేహమా!
నీ సౌందర్యంలోనే నా మనుగడ.
నీవే నా దాహానివి, అంతే లేని నా కోర్కెవు, మారిపోయె నా మార్గానివి.

చీకటి నదీ గర్భాన
ఆధ్యంతరహితమైన దాహం ప్రవహిస్తూంటుంది.
అనంతమైన బాధ అలుపు అనుసరిస్తూంటాయి.

బొల్లోజు బాబా

పాబ్లో నెరుడా Body of woman కు స్వేచ్ఛానువాదం

Saturday, January 30, 2010

రచన (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

అమ్మా,
నాన్న బోలెడన్ని పుస్తకాలు రాస్తారని నీ వంటావు కానీ ఆయనేం రాస్తారో నాకెపుడూ అర్ధం కాదు.
సాయింత్రం వేళలో నీకు చదివి వినిపిస్తూంటారు, ఆయన చెప్పేవన్నీ నీకు అర్ధమౌతాయా?

అమ్మా! నువ్వు మాకెంతో మంచి మంచి కధలు చెపుతావు! నాన్నెందుకలా రాయరూ అని నాకు ఆశ్చర్యమేస్తుంటుంది.

రాక్షసులు, రాకుమారిలు, మాంత్రికుల గురించిన కధల్ని నాన్న నాయినమ్మవద్ద వినలేదా?
అన్నీ మరచిపోయారా?

స్నానానికి ఆలస్యమౌతుందని వందసార్లన్నా పిలుస్తావు నీవు.

ఆయనకై ఎదురుచూస్తూ నీవు భోజనాన్ని వెచ్చచేస్తూ ఉంటావా, నాన్న మాత్రం అలా రాసుకుంటూనే ఉండి ఆ విషయాన్నే మరచిపోతారు. పుస్తకాలు రాసుకోవటం అనే ఆటలో నాన్న మునిగిపోతారు.

నేనెప్పుడయినా నాన్న గదిలో ఆడుకోవటానికి వెళితే “అల్లరెక్కువయింది నీకు” అంటూ నన్ను బయటకు పిలిచేస్తావు.
నేనేదైనా చిన్న శబ్దం చేస్తే చాలు “నాన్న పనిలో ఉన్నారు” కనపడటం లేదా” అంటావు.

ఎపుడు చూసినా అలా రాస్తూ ఉండటంలో ఏమానందముందీ?
నేనెపుడైనా నాన్న పెన్ను తీసుకొని ఆయన పుస్తకంపై తను రాసినట్లుగానే అ ఆ ఇ ఈ లు రాస్తే, నన్నెందుకు కోప్పడతావు? నాన్న రాస్తుంటే ఒక్కమాట కూడా అనవు.
నాన్న అలా కట్టలు కట్టలు కాగితాల్ని వృధా చేస్తుంటే నువ్వసలు పట్టించుకోవు.
కానీ నేనెపుడైనా పడవ చేసుకోవటానికి ఒకే ఒక్క కాగితం తీసుకుంటే మాత్రం “ఎన్ని తిప్పలు పెడుతున్నావురా కన్నా” అని కోప్పడతావు.

నాన్న అలా బోల్డన్ని కాగితాలను రెండువైపులా నల్లని రాతలతో నాశనం చేయటం పట్ల నీవేమనుకొంటున్నావూ?మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని AUTHORSHIP

బొల్లోజు బాబా

Sunday, January 24, 2010

ఫ్రాగ్మెంట్స్ 5

1.
నేల సంకెళ్లను
నిత్యం తడుముకుంటూనే
వెలుగును తరుముకుంటూ
నీలాకాశం లోకి చొచ్చుకొని
పోతూంటాయి తరువులు.

చెట్టుని మించిన
వ్యక్తిత్వ వికాస పుస్తకం ఏది?

2.
జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసిపోయింది.
ఆ ముఖంపై ముడుతలన్నీ
దాని పాదముద్రలే.

3.
ఒక్క ప్రార్ధనతో
ఈ గాజుపెంకులు
తొలగిపోతాయంటే
ఆత్మను కొవ్వొత్తిలా
మండించటానికి
నెనెప్పుడూ తయారే!

కానీ బెల్లు నొక్కితే
ఈశ్వరుడు ప్రత్యక్షమౌతాడా?

4.

అందరూ ఏదో ఒకనాడు
సూదిబెజ్జంలోంచి సాగాల్సిందే
వెలుగులోకో, చీకట్లోకో!

ఆ దినాంతాన
ఇచ్చిన వాటిని
పంచావా అంటే
ఏం చెప్పాలీ?


5.
తేనెటీగ కుట్టిన బాధలో
నాకు గుర్తుకే రాలేదు
అది కాసేపట్లో
అది చచ్చిపోతుందని.


భవదీయుడు
బొల్లోజు బాబా

Thursday, January 21, 2010

భువనఘోష - పాబ్లో నెరుడా కవితానువాదాలు - పుస్తక సమీక్ష


పాబ్లోనెరుడా - కవిత్వానికొక చిరునామాగా నిలచిన పేరది. గత శతాబ్దపు ఉత్తమ ప్రపంచ కవిగా గుర్తింపబడ్డ వ్యక్తి పాబ్లో. ఆయన కవిత్వం రుచి చూడని కవి ఏ దేశంలోనూ ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో కూడా ఆయనకవిత్వానువాదాల్ని చాలామందే చేసారు. శ్రీశ్రీ, ఆవంత్స, ఇస్మాయిల్ వంటి ఆనాటి కవుల నుండి, యదుకుల భూషణ్, రవి ప్రకాష్, మందలపర్తి వంటి ఈనాటి కవుల వరకూ చాలామంది ఆ కవిత్వ సాగరంలో మునిగి తేలిన వారే! బహుసామరో పది తరాలను కూడా ప్రభావితం చేయగల సత్తా పాబ్లో కవిత్వానికుంది. చిక్కదనం వెచ్చదనంల కలబోత పాబ్లోకవిత్వం.

పాబ్లో గతించి 35 సంవత్సరములు దాటుతున్నా తెలుగులో ఆయన కవిత్వ సంకలనం లేదన్న లోటును శ్రీ విరియాలలక్ష్మీపతి గారి సంపాదకత్వంలో వచ్చిన " భువన ఘోష" (పాబ్లో నెరుడా కవిత్వానువాదాలు) తీరుస్తుంది. ఒక ప్రపంచసాహితీ పాయను తెలుగుగడ్డపై ప్రవహింపచేసినట్లయింది. దీనికి డా. ఏటుకూరి ప్రసాద్ గారు, కా. జె.వి సత్యనారాయణ మూర్తి గారు ముందుమాటలు వ్రాసారు.

భువనఘోషలో మొత్తం 95 కవితలున్నాయి. వీటిని 52 మంది ప్రముఖ కవులు అనువదించారు. ఇస్మాయిల్ శ్రీ శ్రీ ల వంటి వారు ఇదివరలో చేసిన అనువాదాలను యధాతధంగా వాడుకొన్నారు. మిగిలినవి విరియాల లక్ష్మీ పతి గారి బృహత్ ప్రయత్నమనే చెప్పుకోవాలి.

ఇక అనువాదం గురించయితే
నెరుడా కవిత్వం ఓ మహానది వంటిది. నదీ గమనాన్నో గానాన్నో అనువాదం చేయటం ఆషామాషీ కాదు. దాని ఒడ్డుననిలచి ఆ సౌందర్యాన్ని ఆనందించాలి అంతే! అలాంటి ఒక దివ్యానుభూతిని నిజాయితీగా ఈ అనువాదాలు మనముందుకు తీసుకొచ్చాయి.

ఒక మహాకవి వ్రాసిన అనేక కవితలలోకొన్నింటిని అనువదించి ఒక సంకలనంద్వారా తీసుకురావటంలో ఉండే ప్రధానసమస్య " ఎంపిక". ఈ ఎంపిక అనేది ఎలా ఉండాలంటే ఆ కవి ఫిలాసఫీనో లేక ఆత్మనో అద్దంలో చూపించే విధంగాఉండాలి. ఈ విషయంలో ఈ కవితాసంకలనం ఎందుకో పాబ్లోని ఒక కమ్యూనిష్టు కవిగా "ప్రొజెక్ట్" చేయయత్నించినట్లనిపిస్తుంది. పాబ్లో కవిత్వం బంధింపజాలని జలపాతం వంటిది. అది ఒక విశ్వజీవన గీతం. మానవమహేతిహాసం.

ఒకే కవితకు రెండు అనువాదాలు ఇవ్వటం కూడా కొంత బాధ్యతా రాహిత్యమే. (రెండూ గొప్పగా ఉన్నాయి అది వేరేవిషయం). దేవరాజు మహారాజు, చంద్రమౌళి, ఎన్. అరుణ, నిర్మలానంద, మందలపర్తి కిషోర్ వంటి వారల అనువాదాలు అద్బుతంగా ఉన్నాయి. మన అంతర్జాల మిత్రులు భూషణ్, గరికపాటి ల ఒక్కో కవిత - ముకుందరామారావు, హెచ్చార్కెల రెండేసి కవితల చొప్పున ఈ సంకలనంలో ఉన్నాయి.
అవి మంచి తెలుగు నుడికారంతో తేటగా ప్రకాశిస్తున్నాయి.

ఈ సంకలనంలో చాలా కవితలు చదువుతూంటే పాబ్లో తెలుగులో వ్రాసాడా అన్నంత ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. అది ఆయా అనువాదకుల ప్రతిభే. ఉదా: రాచకొండ నరశింహశర్మ గారి " మేమనేకమంది" (we are many) అన్నకవితను చదువుతూంటే పాబ్లో తెలుగువాక్యాల్లో ఇమిడిపోయిన తీరు విశ్మయపరుస్తుంది. ఆ కవితలోంచి కొన్ని పాదాలు

నాలో ఉన్న అనేకమందిలో
మా అందరిలో
అవసరానికి అగుపించడు
ఏ ఒక్కడైనా.
అదృశ్యమౌతారు
నా దుస్తులలో దూరి
వెళిపోతారు-ఇంకో ఊరికి ///

ఎపుడైన ఒక కొలిక్కి
నన్నునేను తెచ్చుకోగలనా ///

ఇది వ్రాస్తునపుడు
నేనిక్కడలేను
ఎంతో దూరంలో ఉన్నాను
తిరిగివచ్చేటప్పటికి
వెళ్లిపోయిఉంటాను నేను.
మీ అందరిపరిస్థితీ ఇంతేనా అని
తెలుసుకోవాలని ఉంటుంది నాకు.

పాబ్లో కవిత్వాన్ని తెలుగులో వినాలనుకుంటే ఈ పుస్తకాన్ని తప్పని సరిగా చదవాల్సిందే. పాబ్లో కవిత్వానువాదాలసంకలనం ఇంతవరకూ ఎవరూ తీసుకురాకపోవటం నిజంగా సిగ్గుచేటే. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లుగా ఇప్పటికైనా విరియాలలక్ష్మీపతిగారి కృషి వలన జరగటం గర్వించదగిన విషయం, హర్షించదగిన ప్రయత్నం.

పాబ్లో ని ప్రేమించే వారికి, పాబ్లో అంటే పడిచచ్చేవారికి, పాబ్లో అంటే ఏమీ తెలియని వారికీ కూడా నచ్చే విధంగా ఈ పుస్తకంఉంది అనటంలో సందేహం లేదు.

లభించు చోటు
విశాలాంద్ర అన్ని బ్రాంచీలు
కామ్రేడ్ జె.వి. సత్యనారాయణ మూర్తి
మార్క్సిష్టు అధ్యయన కేంద్రం
అల్లిపురం, విశాఖపట్నం 530004
ఫోన్స్: 0891 2523262

వెల : వంద రూపాయిలు.

బొల్లోజు బాబా

Wednesday, January 6, 2010

రూమీ గీతాలు

సూఫీ కవిత్వం పేరిట నేచేసిన సూఫీ గీతాల అనువాదాలు ఈ క్రింది లింకులో గమనించవచ్చు.

http://www.scribd.com/doc/23859189/Sufi-Poetry-Telugu-translations


నాకు నచ్చిన మరికొన్ని రూమీ గీతానువాదాలు ఇవి.
1
అంతులేదు.
యానానికి అంతం లేదు.
ఎన్నటికీ ముగింపు రాదు.
ప్రేమలో పడిన హృదయం
తెరుచుకోవటం నిలిపివేయగలదా?
నీవు నన్ను ప్రేమిస్తూంటే
నీవు ఒక్కసారిగా చచ్చిపోవు.
ప్రతీ క్షణం నాలో మరణిస్తూ
తిరిగి జన్మిస్తూంటావు.
నూతన ప్రేమలో మరణించు.
ఆవలి వైపున నీ దారి మొదలవుతుంది.
ఆకాశంలా మారిపో.
చేత గొడ్డలిపూని కారాగార తలుపులను చేధించు.
పారిపో!
కొత్తగా జన్మించినవానిలా ముందుకు సాగు.
పని ఇప్పుడే చేయి.
రూమీ

2
రాత్రివేళ
మనం ఒకరినొకరం గొప్ప లౌల్యంతో పెనవేసుకొంటాం
వెలుతురొచ్చాకా నువ్వు నన్ను తోసేస్తావు
నీ కురులను వెనక్కు విదిలించినట్లుగా.
నీ కనులు ఈశ్వరునితో మత్తెక్కి ఉంటాయి.
నావి నిన్ను చూస్తూ,
ఒక తాగుబోతుకు మరొకరు తోడు.
రూమీ

3
రోజంతా నీతో కలసి పాడుతూ ఉన్నాను
రాత్రి నీ తల్పం పైనే నిద్రించాను.
అది రాత్రో పగలో కూడా తెలియలేదు నాకు.
నేనెవరో నాకు తెలుసని అనుకొన్నాను
కానీ నేనే నీవు.
రూమీ

4
నేను పోగొట్టుకొన్నాను, నా ప్రపంచాన్ని, నా కీర్తిని, నా హృదయాన్ని.....
సూర్యుడు ఉదయించాడు, అన్ని నీడలు పరుగులెత్తాయి.
నేనూ వాటివెనుక పడ్డాను. అవి అందకుండా అదృశ్యమయ్యాయి......
కాంతి నా వెంటబడి వేటాడింది.
రూమీ

5
నేను రూపసిని కాను అందవికారినీ కాను.
అదీ కాదు ఇదీ కాదు.
నేను బజారులో పధికుడినీ కాను
లేక ఉద్యానవనంలో కోయిలనూ కాను.
నా గురువు నాకో పేరు పెట్టాడు కనుక
నన్ను నేను ఎలా సంభోదించుకోవాలో తెలుసంతే.
నేను బానిసనూ కానూ స్వతంత్రుడినీ కాను.
మైనాన్ని కాను లోహాన్ని కాను.
నేనెవరినీ ప్రేమించిందీ లేదు,
నన్నెవరూ ప్రేమిస్తూనూ లేరు.
నేను పాపినా లేక పుణ్యాత్ముడనా
పాప పుణ్యాలు మరొకరిద్వారా వస్తాయి
నానుంచి రావు.
ఆయన నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడకు
మారు మాట్లాడక వెళుతూంటాను. అంతే!
రూమీ

6
తలుపలా తడుతూనే ఉండు
లోపలి ఆనందం కిటికీ తెరచి
ఎవరదీ అని చూసే దాకా!
రూమీ


భవదీయుడు

బొల్లోజు బాబా


Sunday, January 3, 2010

నా కవితాసంకలనంపై శ్రీ పి.ఆర్.ఎల్. స్వామి గారి స్పందన

శ్రీ పి.ఆర్. ఎల్. స్వామి గారు యానాం కు చెందిన ప్రముఖ కవి. పాండిచేరీ ప్రభుత్వం కళాకారులకు ఇచ్చే కలైమామణి" బిరుదాంకితులు.వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరి కవిత్వం సరళంగా జీవితంలోని భిన్నపార్శ్వాలను తాకుతూ అలరింప చేస్తుంది . ఆధునిక, ప్రాచీన కవిత్వ ధారణ వీరి ప్రత్యేకత. ప్రముఖ కవుల కవితలను అనర్ఘళంగా గానం చేస్తూ అనేక ప్రదర్శనలను ఇచ్చారు. పలువురి ప్రశంసలు పొందారు.

నా కవితా సంకలనాన్ని చదివి మెచ్చుకొంటూ వారు వ్రాసి ఇచ్చిన కొన్ని వాక్యాలు ఇవి. వీటిలోని దాదాపు అన్ని పదాలు నా కవితా శీర్షికలైనప్పటికీ, దీనిని విడిగ చదివినా ఒక కవితలాగ అనిపించటం వీరి ప్రతిభకు నిదర్శనంగా, నా కవిత్వానికి లభించిన గౌరవంలా నేను భావిస్తున్నాను.

వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ......

భవదీయుడు
బొల్లోజు బాబా

తడి గీతం మీద పొడి సంతకం

మిత్రుడు......
సహృదయుడు....
బొల్లోజు బాబా వెన్నెల నావనెక్కి
ఆకుపచ్చని తడిగీతాన్ని శిల్పంలా చెక్కాడు
ఆ శబ్దానికి రాలిన పూలు
సుగంధాలను గానం చేస్తున్నాయి
కవికి అపరిచిత ప్రపంచంలో
బతకడం ఇష్టం ఉండదు.
అందుకే మట్టికనుల పల్లెతో
నిరంతరం కరచాలనం చేస్తూంటాడు.
ఇన్నాళ్లూ తనలో దాచుకున్న అనేకానేక
రహస్యాలతో పొగడ చెట్టుమీద
వెన్నెల పిట్టలా కాగితాలమీద వాలాడు.
అతని అక్షరాల సంగీతమేఘం
తేనెపాటాల్ని వర్షిస్తోంది.
అతని వాక్యాల వసంతపు మొగ్గలు
పువ్వులుగా బద్దలవుతున్నాయి.
ఖాళీ రాత్రులలోంచి ఉదయించే జ్ఞాపకాలన్నీ
హాయగా సలపడం కోసం
బాబా జీవితాన్ని పుటలు పుటలు గా పరిచాడు
అతడికి ఒకే ఒక ఆశ
పుస్తకంలోకి నడవటం
ప్రతివేకువ జామున ముళ్లగాయాలను
స్పర్శిస్తూంటాడు.
కాంక్షాతీరా వెతుకులాటలో అతడి నిరీక్షణ
ఆకాశంలోకి తెరుచుకుంటుంది.
అతని గుండెలో
సుళ్లు తిరిగే కన్నీళ్లని, ఆశల్ని, ఆవేశాల్ని
కలల తెరపై చిత్రించుకుంటాడు.
కవి "సాహితీయానాన్ని"
గాలి, చెట్టు,పిట్టా
నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.
పోలవరం నిర్వాసితులకోసం
జీవనసౌందర్యాన్నే నిర్మించగల
ఈ కవి హృదయం
ఒక సూర్యుడు
ఒక నది.

కలైమామణి పి.ఆర్.ఎల్. స్వామి