Tuesday, September 19, 2023

ప్రముఖ కవి, రచయిత శ్రీ బొల్లోజు బాబా ప్రత్యేక ఇంటర్వ్యూ



నేను రచించిన ప్రాచీనపట్టణాలు తూర్పుగోదావరి జిల్లా పుస్తక నేపథ్యంగా సంచిక పత్రిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు చేసిన నా ఇంటర్వ్యూ పాఠం ఇది. ఎడిటర్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా
.
ప్రముఖ కవి, రచయిత శ్రీ బొల్లోజు బాబా ప్రత్యేక ఇంటర్వ్యూ


.
1. మీరు కవి. అధ్యాపకుడు. అదీ జంతుశాస్త్రం. మీకు చరిత్ర అధ్యయనం పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ఎందుకు కలిగింది?

జ. నేను పుట్టి పెరిగింది ఒకనాటి ఫ్రెంచి కాలనీ అయిన యానాంలో. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడేళ్ళకు ఈ ఫ్రెంచికాలనీలకు స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ వారిని ఎదిరించటానికి ఎలాగైతే ఉద్యమం జరిగిందో 1954 లో ఈ ఫ్రెంచి కాలనీలలో కూడా ఉద్యమం జరిగింది. మా నాన్నగారు శ్రీ బొల్లోజు బసవలింగం అప్పుడు ఒక విద్యార్ధిగా ఆ ఉద్యమంలో పాల్గొని ఫ్రెంచి పోలీసులచే దెబ్బలు తిన్నారు. మా మిత్రుల పిచ్చాపాటి మాటల్లో ఆ చారిత్రిక సందర్భంలో మా తండ్రులు ఏవిధంగా వారి వంతు పాత్ర నిర్వహించారో ఒకసారి చర్చించుకొన్నాం. నా మిత్రుడొకరు తన తండ్రి కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆయన ఉద్యమకారులకు రహస్యంగా ఆహారం అందించేవారని చెప్పాడు. ఈ రోజు వారెవరిగురించీ ఎవరూ మాట్లాడుకోరు. ఫ్రెంచివారినుండి ఈ దేశం విమోచనం అవ్వటంలోని కొన్ని విస్మృత గాథలను, వ్యక్తులను పుస్తకరూపంలోకి తేవాలని భావించాను. అలా 2007 లో “యానాం విమోచనోద్యమం” అనే పుస్తకాన్ని రచించాను. ఇది నా మొదటి పుస్తకం. ఈ పుస్తకంలో 1954 లో ఫ్రెంచివారికి వ్యతిరేకంగా యానాంలో జరిగిన ఉద్యమవిశేషాలు, దానిలో పాల్గొన్న యానాం స్థానికుల వివరాలు, అప్పటి రాజకీయ, సాంఘిక అంశాలు, ఛాయాచిత్రాలు, వార్తా కథనాలను పొందుపరచాను. అప్పటికి చాన్నాళ్ళుగా పత్రికలలో కవితలు వస్తున్నప్పటికీ మొదటగా చరిత్ర రచన పుస్తకరూపంగా తేవటం వెనుక నేపథ్యమిది.


మానాన్నగారు స్వయంగా కవి, నాటక రచయిత. వారు “ఫ్రెంచి యానాం చరిత్ర” పుస్తకాన్ని రాయాలని భావించేవారు. అది కార్యరూపం దాల్చకుండానే 2004 లో గతించారు. వారి స్ఫూర్తితో 2011 లో “ఫ్రెంచిపాలనలో యానాం” అనే పుస్తకాన్ని రచించాను. gallica.bnf.fr అనే వెబ్ సైటునుండి యానానికి సంబంధించిన కొన్ని వందల ఫ్రెంచి డాక్యుమెంట్లను గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా ఇంగ్లీషులోకి మార్చి, వాటిని మరలా తెలుగులోకి అనువదించుకొని ఆ రచన చేసాను. అది నా రెండవ చరిత్రపుస్తకం.
 
నేను పుట్టిన ఊరు పట్ల ప్రేమ, జన్మనిచ్చిన తండ్రిపట్ల అభిమానమే నాకు చరిత్ర అధ్యయనం పట్ల ఆసక్తి కలిగేలా చేసాయని భావిస్తాను.
.
2. తూర్పు గోదావరిజిల్లా, ప్రాచీనపట్టణాలు అన్న అంశంపై పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలాకలిగింది?

జ. 2020 లో నేను “మెకంజీ కైఫియ్యతులు తూర్పుగోదావరి జిల్లా” పుస్తకాన్ని రాసాను. తూర్పుగోదావరి జిల్లా నుండి కాలిన్ మెకంజీ సేకరించిన పది గ్రామాల చరిత్రకు సంబంధించిన పుస్తకమిది. మెకంజీ కైఫియ్యతులు అనేవి స్థానికులు తాటియాకులపై వ్రాసుకొని శతాబ్దాలపాటు భద్రపరచుకొన్న చరిత్ర. వీటిలో ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, చరిత్రా అన్నీ మిళితమైపోయి ఉంటాయి. వీటిలోని విషయాలను ప్రధానస్రవంతి చరిత్రతో అనుసంధానించటానికి ప్రయత్నించాను. 
ఈ ప్రయత్నంలో తూర్పుగోదావరి జిల్లా చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేసి రాసుకొన్న నోట్సు కైఫియ్యతుల పరిధి దాటిపోయింది. చెప్పాల్సిన విషయాలు మెకంజీ కైఫియ్యతులు పుస్తకంలో చెప్పలేకపోయానన్న వెలితి నన్ను వెంటాడేది. ఆ సమయంలో ఆదిరాజు వీరభద్రరావు గారు రచించిన ప్రాచీనాంధ్రనగరములు అనే పుస్తకం చూసాను. దీనిలో కొలనుపాక, గోలకొండ, అలంపురము, వరంగల్లు లాంటి కొన్ని తెలంగాణ నగరముల చరిత్రను చాలా ఆసక్తికరంగా చెప్పారు. అదే ఒరవడిలో “తూర్పుగోదావరి జిల్లా ప్రాచీన పట్టణాలు” పుస్తకం రాయాలన్న తలంపు కలిగింది. ఆ విధంగా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన వివిధ పట్టణాల చరిత్రను భిన్నకోణాలలోంచి ఆవిష్కరించటానికి ప్రయత్నించాను.
.
3. ఈ పుస్తకం రాసేందుకు సమాచార సేకరణ ఎలా చేశారు? మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, సహాయ సహకారాల గురించి చెప్పండి.

జ. ఈ రోజు సమాచారం అపరిమితంగా లభిస్తోంది. అర్చైవ్.ఆర్గ్ లాంటి వెబ్ సైట్లలో ఒక్క క్లిక్ తో వేల పేజీల సంబంధిత సమాచారం మనముందుంటుంది. దాన్ని సమన్వయపరచుకొని ఎలా వ్యాఖ్యానించాలి అనేది చాలా సార్లు ప్రధాన ఇబ్బంది.
 
ఈ విషయంలో ప్రముఖ చరిత్రకారులు, విశ్రాంత ఆచార్యులు, కీర్తిశేషులు శ్రీ కూచిభొట్ల కామేశ్వరరావు గారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో విలువైనవి. ఒక్కో చాప్టరు రాసేముందు నేను ఇలా రాద్దామనుకొంటున్నాను అని నా స్కీమ్ వారి తో చర్చించేవాడిని. ఆయన కొన్ని సూచనలు చేసేవారు. లేదా ఏవైనా ఖాళీలుంటే చెప్పేవారు. ఉదాహరణకు- బిక్కవోలు ఊరిలో ఉన్న ఆలయసంపద గురించి చెబుతూ "అపురూప" అనే పదాన్ని వాడినందుకు.....ఎందుకు అపురూపం అనుకొంటున్నావు, వాస్తు పరంగానా, నిర్మాణ పరంగానా, వివిధ రాజులు నిర్మాణశైలుల పరంగానా ఆ తేడాలు చెప్పమని సూచించారు. వారి నిశిత గమనింపు అది.
 
ఈ పుస్తకంలో వచ్చే కొన్ని పద్యాలు, శాసనవాక్యాలకు శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి, శ్రీ రామకృష్ణ శ్రీవత్సలు తాత్పర్యసహిత వ్యాఖ్యానాలు చెప్పారు.
 
ద్రాక్షారామ శాసనాలపై కొన్ని అరుదైన పిడిఎఫ్ లను ఆంధ్రభారతి రూపకర్త శ్రీ వాడపల్లి శేషతల్పశాయి అందించారు. ఈ పుస్తకరచనలో వారి సహకారం మరువరానిది.
.
4. మీరు శిక్షణ పొందిన చరిత్ర పరిశోధకులు కారు. కేవలం ఆసక్తివల్ల చరిత్రను అధ్యయనం చేస్తున్నవారు. మీకు చారిత్రిక అంశాల ఆధారంగా వ్యాసాలు రాసేటప్పుడు మీ రచనల ప్రామాణికతను, అర్హతను ఎవరూ ప్రశ్నించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అలా ప్రశ్నించేవారికి మీ సమాధానం ఏమిటి?

జ. ఔను. నేను ఔత్సాహిక చరిత్రకారుడినే తప్ప శిక్షణపొందినవాడిని కాదు. నాకు అల్టర్నేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూల పట్ల ఆసక్తి ఎక్కువ. వాటిగురించి భిన్న వాదనలను చదువుతాను. వాటినుంచి నాదైన అవగాహనను ఏర్పరచుకొని దానిని వ్యాసాలుగా రాయటానికి ప్రయత్నిస్తాను. నా వాదనను సమర్ధించే ఉటంకింపులకు సంబంధించిన రిఫరెన్సులను ఎక్కడికక్కడ పేజినంబర్లతో సహా ఇస్తాను. తద్వారా చదివే పాఠకునికి తాను ప్రామాణిక రచనను చదువుతున్న భావన కలుగుతుంది. రచనపై విశ్వాసం ఏర్పడుతుందని అనుకొంటాను. ప్రాచీనపట్టణాలు పుస్తకంలో ఏదైనా శాసనాన్ని ఉటకించవలసి వచ్చినపుడు దాని నంబరు మాత్రమే కాక చాలాచోట్ల సంబంధిత శాసన వాక్యాన్ని కూడా ఇవ్వటం జరిగింది.
 
ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కొందరు నా రచనలతో విభేదించవచ్చు. ప్రశ్నించవచ్చు. కొన్ని సందర్భాలలో నన్ను దూషించవచ్చు కూడా. అదంతా దృక్ఫథాల మధ్య వైరుధ్యమే తప్ప నా వైఫల్యమో లేక వారి అహంకారమనో భావించను.
.
5. ప్రస్తుతం చరిత్ర విశ్లేషణలో సత్యం కన్నా దృక్పథం ప్రాధాన్యం వహిస్తోంది. ఒక వ్యక్తి రచనను అంచనా వేయటంలో కూడా దృక్పథమే ప్రాధాన్యం. అలాంటి పరిస్థితిలో అందరికీ ఆమోదయోగ్యంగా చరిత్ర రచనలు ఎలా చేస్తున్నారు?

జ. చరిత్రకు సంబంధించి మనం సత్యానికి ఎంతదగ్గరగా వెళ్ళగలము అనేదే తప్ప పూర్తి సత్యాన్ని చేరుకోలేమని భావిస్తాను.
 
నేడు చరిత్రను మూడు కోణాలలో అధ్యయనం చేస్తున్నారు
1. చరిత్రను స్థలము, కాలము, అక్కడి ప్రజల సంస్కృతులను దృష్టిలో ఉంచుకొని చూడటం
2. చారిత్రిక దస్తావేజులను ఆ దేశ స్మృతులుగా గుర్తించటం
3. వివిధ శాస్త్రాల పరస్పర సహకారం అందించుకొని చరిత్రను నిర్మించటం
పై మూడు కోణాలలోంచి చరిత్రకారులు నెరేటివ్స్ ను నిర్మిస్తున్నారు. చరిత్రలో జరిగిన వివిధ సంఘటనల ద్వారా మానవజాతి గమనం ఇలా నడిచింది అని చెప్పే కథనాలను హిస్టారికల్ నెరేటివ్స్ అంటున్నారు. స్థానిక కథనాలు, జాతీయ అంతర్జాతీయ సంఘటనలతో సంబంధాలను కలిగి ఉంటాయి. వాటిని గుర్తించగలిగినప్పుడే సరైన స్థానిక చరిత్రను నిర్మించగలం. ఇది ఒక రకంగా Civil History of Mankind. దీనిలో ఆధారాలను సేకరించటం ఒక ఎత్తు అయితే వాటిని విశ్లేషించటం మరొక ఎత్తు. ఈ విశ్లేషణలో దృక్ఫథాల పాత్రను విస్మరించలేం.
 
మనం ఎవరి పక్షాన ఉండి వ్రాస్తున్నామనేది చాలా సందర్భాలలో అత్యంత కీలకంగా మారుతుంది. బౌద్ధుల కళ్ళతో చరిత్రను చూసినపుడు హిందువులు చెడ్డగాను, హిందువుల కళ్ళతో చూసినపుడు ముస్లిములు విధ్వంసకులుగాను, అట్టడుగు వర్గాల తరపున చరిత్రరాసేటపుడు అగ్రవర్ణాలవారందరూ పీడకులుగాను చెప్పటం సహజం. కానీ చరిత్రలో భిన్న సమూహాలు రాసులుపోసినట్లు నలుపుతెలుపులుగా విడిపోయి ఉండరు. అందరినీ ఒకే శక్తి నడిపించదు. అనేక nuances ఉంటాయి. వాటిని గుర్తించగలగాలి. అన్ని దృక్ఫథాలను ఆకళింపుచేసుకొని చరిత్రరచన చేయటం చరిత్రకారుని నైతికబాధ్యత అనుకొంటాను.

అందరకూ ఆమోదయోగ్యమైన చరిత్ర రచన చేయటం అనేది కష్టం ఈ రోజుల్లో. ఈ పుస్తకంలో కూడా ఒక చోట- బుద్ధుని దేహ అవశేషాలపై బౌద్ధ స్తూపాలు నిర్మించటం అనే ఆచారం శక్తిపీఠాలకు ప్రేరణ అయి ఉండవచ్చు అన్నందుకు నా మిత్రుడొకరు తీవ్రంగా విభేధించాడు. హిందూ ఆలయాల విధ్వంసం యుద్ధోన్మాదంతో చేసినదే తప్ప మతోన్మాదం కాదని అన్నందుకు నన్ను చాలామంది ఆక్షేపించారు.
.
6. ఈ పుస్తక రచనలో ఏ పట్టణానికి సంబంధించిన వివరాల సేకరణకోసం చాలా కష్టపడాల్సివచ్చింది? అలాగే, ఈ పుస్తకంలో ఏ అధ్యాయం మీకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది? ఎందుకు?

జ. రెండు ప్రశ్నలకూ సమాధానం పిఠాపురం. నిజానికి ఈ పట్టణానికి సంబంధించి విస్తారమైన సమాచారం అందుబాటులో ఉంది. కానీ దాన్ని ఎలా సమన్వయపరచాలో తెలిసేది కాదు. అంతటి డేటాని ఆర్గనైజ్ చేసి చదివించే వచనంగా మార్చే ఆ “దారం” ఎదో దొరక్క చాలా కాలం ఇబ్బందిపడ్డాను. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక అంటూ మూడు దశలుగా విభజించి చూడమని శ్రీ కామేశ్వరరావు గారు సూచించారు. దానితో రకరకాలుగా ఉన్న సమాచారం మూడు ముక్కలుగా విడిపోవటంతో వ్యాసానికి చక్కటి శిల్పం ఏర్పడింది.
 
పిఠాపురం వ్యాసంలో హుయాన్ త్సాంగ్ పిఠాపురాన్ని సందర్శించి ఉండవచ్చునని ప్రతిపాదించాను. అలా జరిగిఉండటానికి గల సంభావ్యతను తార్కికంగా చెప్పటానికి ప్రయత్నించాను.
 
బోధగయవద్ద ఉన్న కుక్కుటపాదగిరి, మానపుర అనేచోట ఉండిన పిష్టపురిక దేవి ఆలయం లాంటివి పిఠాపుర చరిత్రకు చక్కని జోడింపు అని భావిస్తాను.
 
ఇవేకాక ఈ పుస్తకంలో ప్రస్తావించిన గుణగవిజయాదిత్యుని చారిత్రిక స్థానం, బిక్కవోలు ఆలయ శిల్పసంపద, కోరంగి సాంస్కృతిక విషయాలు లాంటివి తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో విశిష్టమైన అంశాలు అని తలుస్తాను.
.
7. తెలుగులో ఇటీవలి కాలంలో శిక్షణ పొందిన చరిత్ర పరిశోధకులకన్నా ఆసక్తితో చరిత్ర గురించి తెలుసుకుని రచనలు చేసేవారే అధికంగా కనిపిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటి? ఇలాంటి వారు చేసే విశ్లేషణలు, తీర్మానాలను ఎంతవరకు ప్రామాణికంగా పరిగనించవచ్చు?

జ. చరిత్ర అధ్యయనం ఉపాధిని ఇచ్చేదిగా లేకపోవటంవల్ల శిక్షణ పొందిన చరిత్ర పరిశోధకులుఉండటం లేదు నేడు. కళాశాల స్థాయిలో చరిత్రను ప్రధాన సబ్జెక్టుగా తీసుకొని చదివేవారే మృగ్యం. ఏదో పోటీ పరీక్షలకోసం కొన్ని తారీఖులు, దస్తావేజులు గుర్తుపెట్టుకొంటున్నారు. అంతవరకే చరిత్ర ప్రాసంగిత.
 
మీరన్నట్లు ఆసక్తితో చరిత్రగురించి తెలుసుకొని రచనలు చేసేవారే అధికం. చరిత్రరచనలను ప్రోత్సహించి అవార్డులను ప్రకటించే సంస్థలు కూడా తెలుగునాట లేవు.
 
ఏంతో కఠోరశ్రమ ఉంటే తప్ప ఒక చరిత్ర వ్యాసం రాయలేం. ఎన్నో పుస్తకాలు పరిశీలిస్తే తప్ప ఒక నూతన ప్రతిపాదన చేయలేం. అలాంటి వాటి ప్రామాణికత పక్కనపెడితే కనీసం పరామర్శ చేసేవాడే కరువయ్యారు.
 
విదేశాలలో అనేక యూనివర్సిటీలు చరిత్రకారులకు గ్రాంటులిచ్చి పుస్తకాలు రాయించుకొంటాయి. ఉదాహరణకు Wendy Doniger చికాగో యూనివెర్సిటీ, Sheldon Pollock కొలంబియా యూనివర్సిటీ, David Shulman, హెబ్రూ యూనివెర్సిటీ, Audrey Truschke, Rutgers University, Jennifer Howes, లండన్ యూనివెర్సిటీ, Cynthia Talbot, Oxford University – లాంటి సమకాలీన ఇండాలజిస్టులు ఆయా యూనివర్సిటీల ఆర్ధిక సహాయంతో భారతదేశ చరిత్రకు సంబంధించి ఎన్నో విలువైన పుస్తకాలు వెలువరించారు. చరిత్ర రచన అనేది వారికి ఒక జీవితకాల శ్రమ. ఒక మెరుగైన ఉద్యోగం. ఇక్కడ మాత్రం అదొక థాంక్ లెస్ జాబ్.
పాలకులు మాత్రం తమ రాజకీయావసరాలకు తగినట్లు చరిత్రను మార్చిరాసుకోవటం సమకాలీన విషాదం.
.
8. మీ భవిష్యత్తులో మీ రచనల ప్రణాళికలేమిటి?


జ. ప్రస్తుతం ప్రముఖ మళయాలీ కవి శ్రీ కె. సచ్చిదానందన్ కవిత్వానువాదాలను పుస్తకరూపంలో తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. డిటిపి లో ఉంది. ఇక చరిత్రకు సంబంధించి దశాబ్దకాలంగా భిన్న చారిత్రిక అంశాలపై రాసిన వ్యాసాలను సంపుటిగా తీసుకొని వద్దామనుకొంటున్నాను. అదికాక ప్రాకృత కవిత్వం లోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ వ్రాసిన వ్యాసాలను విస్తరించి పుస్తకంగా తీసుకురావాలని ఉంది.
 

(నా ముద్రిత, అముద్రిత పుస్తకాలనన్నింటి కామెంటులో ఇచ్చిన ఆర్చైవ్ ఆర్గ్ లింకు నుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును)




భవదీయుడు
బొల్లోజు బాబా



కుమ్మరి - The Potter by Mei Yaochen


.
ఇంటిముందు గుట్టగావేసిన
మట్టి మొత్తం ఖాళీ అయిపోయింది
తన ఇంటికొరకు ఒక్క పెంకు కూడా లేదు
మట్టిని ఒక్కసారైనా వేళ్ళతో తాకని వారు
చేపపొలుసుల లాంటి అందమైన పెంకులు కప్పిన
ఎత్తైన ఇళ్లలో నివసిస్తారు.
MEI YAOCHEN (1002.-1060)
.
జీవనవాస్తవికతను కవిత్వంలో పలికించిన చీనా కవి. “Today as in ancient times, it's hard to write a simple poem" అనే ఇతని వాక్యం వెయ్యేళ్ల తరువాత కూడా ప్రామాణికమైనదే.
అనువాదం: బొల్లోజు బాబా

Saturday, September 16, 2023

గోపాల్ పరిశోధన గొప్ప కాన్క....


ఆప్తులు మరణించినపుడు కవులు తమకు వారితో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరువేసుకొంటు రాసే కవితలను స్మృతి కవితలు అంటారు.

ప్రముఖ కవి, విమర్శకుడు డా. సుంకర గోపాల్ తన డాక్టరేట్ గ్రంధాన్ని "వచన కవిత్వంలో స్మృతి" పేరుతో పుస్తకంగా తీసుకొని వచ్చారు.

ఏదైనా సిద్ధాంతవ్యాసం వెర్టికల్ అధ్యయనం కాక హారిజాంటల్ అధ్యయనంతో ఉన్నప్పుడు ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది. డా.గోపాల్ సిద్ధాంత గ్రంధం హారిజాంటల్ అధ్యయనం. ఈ పుస్తక రచన కొరకు 163 కవిత్వ సంపుటాలు, 22 కవిత్వ సంకలనాలు, 12 స్మృతి సంచికలు, 17 మాసపత్రికలు, 7 పరిశోధనా గ్రంథాలు సంప్రదించారంటే ఇది ఎంత విస్త్రుతమైన అధ్యయనమో అర్ధం చేసుకొనవచ్చును.

దీనిలో 230 మంది కవులు రాసిన సుమారు ఆరువందలకు పైన వివిధ స్మృతి కవితలను ఉటంకించారు. చాలా లోతైన పరిశోధన.

ఈ స్మృతి కవితలను- కుటుంబసభ్యుల స్మృతి, ఆత్మీయుల స్మృతి, కళారంగం, సామాజిక రంగం, రాజకీయరంగం, మరలా ఒక్కోదానిలో ఏడెనిమిది విభాగాలు అంటూ ఇన్ని రకాలుగా వర్గీకరించవచ్చా అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజాయితీతో, ఎంతో శ్రమించి చేసిన పని ఇది.
తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ గ్రంధాలు పుస్తకాలుగా వచ్చినవాటిలో సినారె "ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయములు ప్రయోగములు" చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఇటీవలి కాలంలో అదే స్థాయిలో కొని దాచుకోదగినది డా. సుంకర గోపాల్ రచించిన ""వచన కవిత్వంలో స్మృతి" గ్రంధం. ఎందుకంటే దీనిలో గత యాభై అరవై సంవత్సరాలలో తెలుగు వచన కవిత్వంలో వచ్చిన స్మృతి కవితలన్నీ దాదాపు కొలువుతీరినట్లే .

ఈ పరిశోధనకు ఆచార్య డా. మేడిపల్లి రవి కుమార్ పర్యవేక్షణ వహించారు.
డా. సుంకర గోపాల్ కు అభినందనలు.

****
ఈ పుస్తకంలోని అన్ని వాక్యాలనూ ఊరడించే వాక్యమిది.
.
అంతే కదా!
మృత్యువుతో యుద్ధం చేసి
ఎవరు మాత్రం గెలవ గలరు
.
(అనుపమ, బండ్ల మాధవరావు)
.
పుస్తకము లభించు చోటు: 9492638547
వెల : 400/-
ఆసక్తి కలిగిన వాళ్ళు
9492638547 నెంబర్ కి 400/- ఫోన్ పే చేసి
చిరునామా పంపితే పోస్ట్ చేస్తారు.
Facebook ID Gopal Sunkara
బొల్లోజు బాబా

ప్రేమగీతం - Love Poem by Guan Daosheng (1262–1319)




మనిద్దరి మధ్య
గాఢమైన ప్రేమ
నిప్పులా జ్వలించే ప్రేమ
మట్టిముద్దను తీసుకొని
ఒక నువ్వుగా
ఒక నేనుగా
మలుచుతాను
అపుడు వాటిని పగులగొట్టి
కొంచెం నీటితో కలిపి పిసికి మరలా
ఒక నువ్వుగా
ఒక నేనుగా చేస్తాను

నా లో నువ్వున్నావు
నీ లో నేనున్నాను

బతుకులో నీ దుప్పటిని
చావులో నీ మట్టిని పంచుకొంటాను
.
Source: Guan Daosheng (1262–1319). చైనా కవయిత్రి, చిత్రకారిణి, ప్రభుత్వ అధికారి
అనువాదం: బొల్లోజు బాబా

Friday, September 8, 2023

అయోతీ థాస్ - దక్షిణభారత దళిత మేధావి


        అయోతీ థాస్ ( C. Iyothee Thass , 20 మే 1845 - 5 మే 1914) దక్షిణ భారతదేశంలోని మొదటి కుల వ్యతిరేక కార్యకర్త, తమిళ పండితుడు, సిద్ధ వైద్యుడు. ద్రావిడ ఉద్యమానికి మార్గదర్శకులలో ఒకరు. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఈయన 19వ శతాబ్దం చివరలో ఆదిద్రావిడ ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలు, మతం మరియు సాహిత్య రంగాలలో కృషిచేసారు. బౌద్ధమతంలోకి మారిన వీరు- పరయ్యల (మాలల) అసలు మతం బౌద్ధమని, అందువల్ల వారుకూడా బౌద్ధమతంలోకి మారాలని ఉద్భోదించారు. 1891లో అయోతీ థాస్, రెట్టమలై శ్రీనివాసన్‌ అనే మరొక సంఘసంస్కర్తతో కలిసి “కులరహిత ద్రవిడ మహా జనసభ” స్థాపించారు. C. Iyothee Thass అనేది C. Ayodhya Dasa, C. Ayotthyadasa Pandithar వంటి తమిళ పేర్లకు ఇంగ్లీషు స్పెల్లింగు.
    అయోతీ థాస్ ఉన్నత విద్యావంతులైన కుటుంబంలో జన్మించారు. వీరి తాత, బట్లర్ కాంతప్పన్. తన కుటుంబం తరతరాలుగా భద్రపరచుకొంటూ వస్తున్న తిరుక్కురళ్ రచనను కాంతప్పన్, Francis Whyte Ellis అనే బ్రిటిష్ ఆఫీసరుకు అందించాడు. దానివిలువ గ్రహించిన ఎల్లిస్ దొర వాటిని ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేసాడు. అలా తమిళుల సాంస్కృతిక సంపదైన తిరుక్కురళ్ వెలుగు చూసింది.

బాల్యం
         అయోతీ థాస్ 20 మే 1845 న చెన్నైలో జన్మించారు. తరువాత తన తండ్రి ఉద్యోగం కారణంగా నీలగిరికి వలస వెళ్ళారు. వీరి కుటుంబం వైష్ణవాన్ని పాటించేది. అయోతీ థాస్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు కథవరాయన్.
        అయోధ్య దాసర్ పండిట్ (1836-1900) అనే ఆచార్యుని వద్ద ఇతను తమిళం, ఇంగ్లీష్, పాళీభాషలు, తత్వశాస్త్రం, సిద్ధ వైద్యం లను నేర్చుకొన్నారు. తనకు జ్ఞానబుద్ధులునేర్పి జీవికను ఏర్పరచిన గురువుపై గౌరవంతో తన కథవరాయన్ పేరును అయోధ్య దాసర్‌గా మార్చుకున్నాడు.

మత దృక్ఫథం
        పాతిక సంవత్సరాల వయస్సులో, అయోతీ థాస్ నీలగిరి కొండలపై నివసించే అణగారిన ప్రజలైన తోడర్లను సమీకరించాడు. 1870 లలో “అద్వైతానంద సభ” ని స్థాపించాడు. వీరి కుటుంబం వైష్ణవ సంప్రదాయాలను అనుసరించేది. ఆ కారణంగా తన కుమారులకు మాధవరాయ, పట్టాభిరామన్, జానకి రామన్, రాజారామ్ అని పేర్లు పెట్టి, బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత పుట్టిన తన కుమార్తెలకు అంబికాదేవి, మాయాదేవి అని పేర్లు పెట్టాడు.
వైష్ణవసంప్రదాయంతో మమేకమయినప్పటికీ, ఈయన ఆలోచనలు- ఆస్తికత్వం, ఆచారవ్యవహారాలు, బ్రాహ్మణ ఆధిపత్యం, మరియు మతపరమైన పెత్తందారీ పోకడలు-లాంటి అంశాలనుంచి హేతుబద్దమైన విముక్తి కొరకు అన్వేషణ చేసేవి. ఈ వెతుకులాట ఇతనిలో సొంత ఆలోచనలు, సొంత భావజాలం ఏర్పడటానికి దోహదపడింది.
        19వ శతాబ్దం చివరలో బ్రహ్మసమాజం, ఆర్యసమాజం లాంటి సంస్థల ద్వారా హిందూమతం పునరుద్ధరణ జరగసాగింది. 1861 నుండి 1891 వరకు, క్రైస్తవులు, ముస్లిములు మినహా మిగిలిన అందరూ హిందూ లేబుల్ తో హిందువులులో బలవంతంగా చేర్చబడ్డారు.
        అయోతీ థాస్ వైష్ణవ సంప్రదాయానికి మద్దతు ఇచ్చారు కానీ “హిందూ” యొక్క గుర్తింపును అంగీకరించడానికి నిరాకరించారు. “హిందూ” గుర్తింపును అంగీకరిస్తే “హిందూ” సమాజంలోని కుల నిర్మాణాన్ని అంగీకరించాలి. కుల హింసతో ఎన్నో బాధలు పడిన ఆదిద్రవిడ ప్రజలు హిందూ గుర్తింపును అంగీకరించకూడదని ఈయన భావించేవాడు. హిందూకి బదులుగా అయోతీ థాస్ ప్రత్యామ్నాయ హిందూయేతర గుర్తింపు కోసం వెతకడం ప్రారంభించాడు.
తమిళనాట భక్తి రూపాల్లో “తమిళ శైవమతం” పునరుద్ధరణకు ప్రయత్నాలు జరిగాయి. ఇది కూడా ఒక రకంగా కులతత్వాన్ని వదులుకోలేదు. “తమిళ శైవిజం” బ్రాహ్మణ వ్యతిరేకత గురించి మాట్లాడుతుంది కానీ “కుల నిర్మూలన” గురించి ఏమీ మాట్లాడదు. ఆ కారణంగా అయోతీ థాస్ తమిళ శైవమతంలో చేరలేదు.
        అయోతీ థాస్ ప్రారంభించిన “కుల రహిత ద్రవిడ మహాజన సభ” తరపున ఉచిత విద్య, ఆలయ ప్రవేశం, బంజరు భూముల కేటాయింపు వంటి 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పంపగా అది 1891 జాతీయకాంగ్రేస్ పార్టీ 12 వ సమావేశంలో చర్చకు వచ్చింది కానీ ఆ డిమాండ్లు చివరికి నెరవేరలేదు.
        1884 లో ఎమ్. వీరరాఘవాచారియర్, జి. సుబ్రమనియ అయ్యర్, పి ఆనందాచార్లు Madras Mahajanasabha ను స్థాపించారు. ఇది భారతదేశంలో మొదటిసారిగా స్వపరిపాలన కావాలని తీర్మానించిన చారిత్రిక సంస్థ. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పనిచేసేది. 1892లో మద్రాసు మహా జనసభ నిర్వహించిన సమావేశంలో నీలగిరి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయోతీ థాస్ కాంగ్రెస్ పార్టీకి కు పైన సమర్పించిన 10 అభ్యర్థనలను తిరిగి వీరికి సమర్పించి- శివాలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా ఆ అభ్యర్ధనను మహాజనసభ నిర్వాహక సభ్యులు నిర్ధ్వంద్వంగా తిరస్కరించి అయోతీ థాస్ ను అవమానించారు.
    ఈ అవమానం అయోతీ థాస్ లో అంతర్మధనానికి దారితీసింది. మనం ఎవరం? హిందువులమా? అట్లైతే మనపై కుల దూషణలు ఎందుకు చేస్తున్నారు? అంటూ తన జాతి అస్తిత్వం గురించి ప్రశ్నించుకొంటూ ఆ క్రమంలో, వేదాలు, హిందూ మతం, బ్రాహ్మణత్వం, ఆచారాలు మొదలైనవాటిని లోతుగా అధ్యయనం చేసాడు.

ఆది ద్రావిడుల అస్తిత్వ కార్యకలాపాలు
                1870వ దశకంలో, అయోతీ థాస్ నీలగిరిలోని తోడర్ మరియు ఇతర కొండ తెగలను ఏకం చేశాడు. 1875లో అద్వైతానంద సభను స్థాపించాడు. మద్రాసులో ఆది ద్రావిడుల కోసం వెసిలియన్ మిషన్ పాఠశాలను (Wesleyan Mission) నిర్వహిస్తున్న Rev. John Rathinam తో పరిచయం ఏర్పడింది. ఇతని సహాయంతో అయోతీ థాస్ 1885 లో ద్రవిడ పాండ్యన్ అనే వార్తా పత్రికను ప్రారంభించాడు.
        1886 లో అయోతీ థాస్ "ఆది ద్రావిడులు "హిందువులు" కాదని భారతదేశచరిత్రలోనే అత్యంత విప్లవాత్మకమైన ప్రకటన" చేసాడు. ఆ తరువాత 1891లో ఇతను “ద్రవిడ మహాసభ”ను స్థాపించాడు 1891 జనాభా గణనలో ఆది ద్రావిడులు తమను తాము హిందువులుగా కాక "కుల రహిత తమిళులు"గా నమోదు చేసుకోవాలని కోరాడు. ఆనాటికి ఇద్ గొప్ప సాహసోపేతమైన వ్యాఖ్య.
        అప్పటి ఏకైక పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ఉందని - ఒకటి ఉత్తర భారత కాంగ్రెస్, మరొకటి దక్షిణాది కాంగ్రెస్ అని, ఇది బ్రాహ్మణ కాంగ్రెస్ అని అయోతీ థాస్ విమర్శించేవారు. ఆమేరకు స్వీయఅస్తిత్వ స్పృహతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్రరాజకీయాన్ని ప్రారంభించాడు.
        ఆది ద్రావిడ ప్రజలను అణిచివేసేందుకు ఏర్పడిన సాంస్కృతిక మరియు మతపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా అణగారిన ప్రజలకు నిజమైన విముక్తి లభిస్తుందని; కుల, వర్ణాలను వ్యతిరేకించే బౌద్ధమతమే అందుకు తగినదని అయోతీ థాస్ విశ్వసించాడు. బౌద్ధమతం ఆది ద్రావిడుల అసలు మతం అని, ఆదిద్రావిడ విముక్తి మరియు సాధికారతకు ప్రతిరూపం బౌద్ధమతమేనని ప్రచారం చేసేవాడు. ఆది ద్రావిడులు రాజకీయంగా అధికారం సాధించాలని కోరుకొనేవాడు.

బౌద్ధమత స్వీకరణ
        అయోతీ థాస్ తన అనుచరులతో కలిసి థియొసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకప్రెసిడెంట్ Colonel H. S. Olcott ను కలుసుకుని తాను బౌద్ధమతం స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆల్కాట్ సహాయంతో, ఈయన శ్రీలంకకు వెళ్లి సింహళీ బౌద్ధ సన్యాసి సుమంగళ నాయక్ నుండి బౌద్ధదమ్మ దీక్షను స్వీకరించారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన అయోతీ థాస్ 1898లో చెన్నైలో “శాక్య బౌద్ధ సంఘాన్ని” స్థాపించి దాని శాఖలను దక్షిణ భారతదేశం అంతటా విస్తరింపచేసాడు. ఈ Sakya Buddhist Society కాలక్రమేణా "Indian Buddhist Association " గా చరిత్రలో నిలిచిపోయింది.

ద్రావిడ రాజకీయాలకు మార్గదర్శకుడు
    అయోతీ థాస్ 1885లో ద్రవిడ పాండియన్‌ను పత్రికను ప్రారంభించారు. క్రీ.శ. 1886లో హిందువులలో అంటరానివారందరూ కులరహిత ద్రావిడులని ప్రతిపాదించాడు. ఆ విధంగా ద్రావిడ భావజాలానికి ఆద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయోతీ థాస్ 1891లో ద్రావిడ మహాజన సభను స్థాపించి ద్రావిడ రాజకీయాలకు మార్గదర్శకుడుగా నిలిచారు.

రచనలు
పండిట్ అయోతీ థాస్ సుమారు 25 పుస్తకాలు, 30 వ్యాసాల ధారావాహికలు, రాజకీయ వ్యాసాలు, ప్రశ్నలు మరియు సమాధానాలు వంటి కొన్ని వందల వ్యాసాలు రాశారు. ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు రాయడం ప్రారంభించిన తిరుక్కురల్ గ్రంథం ఆయన మరణంతో 55 అధ్యాయాలతో ముగిసింది. వారి రచనలలో కొన్ని ప్రముఖమైనవి

1. అంబికయ్యమ్మన్ కథ 2. ఇంద్ర జాతి చరిత్ర 3.ఇంద్ర దేశ బౌద్ధ పండుగ వివరాలు 4. శాక్య మహర్షి చరిత్ర 5. తిరుక్కురల్ దేవునికి శుభాకాంక్షలు 6.తిరువల్లువర్ చరిత్ర 7. నందన్ చరిత్ర 8. ఆధునిక కులాల్లో భయాందోళనలు 9. బుద్ధుడు రాత్రి మరియు పగలు లేని కాంతి 10. మురుగ భగవానుని చరిత్ర 11. వివాహ వివరణ 12. ప్రాచీన తమిళ భాష బుద్ధుడు ఆదివేదం 13. వేషబ్రాహ్మణ వేదాంత వివరణ

ముగింపు
        C. Iyothee Thass దక్షిణభారతదేశంలోని ద్రావిడ ప్రజల హక్కులను ఆత్మగౌరవాన్ని ప్రకటించి ద్రావిడ ఉద్యమానికి ఒక పితామహునిగా నిలిచిన దళిత మేథావి. వీరు మొదట పంచమర్ మహాజన సభను స్థాపించారు. ఇది పంచముల, పరయాల హక్కులకొరకు పోరాడిన మొదటి సంస్థ. తాను బౌద్ధంలోకి మారి ఇతర దళితసోదరులనుకూడా బౌద్ధంలోకి మారమని పిలుపు ఇచ్చిన ఆచరణవాది. తాను నడిపే తమిళన్ పత్రిక దళితులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అప్పట్లో చక్కని వేదికగా నిలిచింది. అయోతీ థాస్ తమిళనాట జరిగిన ద్రవిడ ఉద్యమానికి స్ఫూర్తిగా, భారతదేశంలో జరిగిన దళితఉద్యమాలకు ప్రేరణగా నిలిచారు.

బొల్లోజు బాబా





(ఉదయనిధి మారన్ సనాతన ధర్మం పై చేసిన కామెంటును సమర్ధిస్తూ సినీ దర్శకుడు పా రంజిత్ , సంఘ సంస్కర్త అయోతీ థాస్ పండితర్ పేరును ప్రస్తావించారు. ఎవరా అని వెతకగా నెట్ లో పై సమాచారం కనిపించింది. భారతదేశ దళితఉద్యమాలకు ఈయనజీవితము, పోరాటము తాత్వికపునాదులను అందించినట్లు అనిపించింది.
పై వ్యాసానికి మూలం ఇంగ్లీషు, తమిళ వికీ పేజీలు ఇంకా కొన్ని ఇతర సైట్లు)

The Journey began.....


My son, Basava Sridhar joined MBBS course.

The Journey began.....

Baba