అయోతీ థాస్ ( C. Iyothee Thass , 20 మే 1845 - 5 మే 1914) దక్షిణ భారతదేశంలోని మొదటి కుల వ్యతిరేక కార్యకర్త, తమిళ పండితుడు, సిద్ధ వైద్యుడు. ద్రావిడ ఉద్యమానికి మార్గదర్శకులలో ఒకరు. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఈయన 19వ శతాబ్దం చివరలో ఆదిద్రావిడ ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలు, మతం మరియు సాహిత్య రంగాలలో కృషిచేసారు. బౌద్ధమతంలోకి మారిన వీరు- పరయ్యల (మాలల) అసలు మతం బౌద్ధమని, అందువల్ల వారుకూడా బౌద్ధమతంలోకి మారాలని ఉద్భోదించారు. 1891లో అయోతీ థాస్, రెట్టమలై శ్రీనివాసన్ అనే మరొక సంఘసంస్కర్తతో కలిసి “కులరహిత ద్రవిడ మహా జనసభ” స్థాపించారు. C. Iyothee Thass అనేది C. Ayodhya Dasa, C. Ayotthyadasa Pandithar వంటి తమిళ పేర్లకు ఇంగ్లీషు స్పెల్లింగు.
అయోతీ థాస్ ఉన్నత విద్యావంతులైన కుటుంబంలో జన్మించారు. వీరి తాత, బట్లర్ కాంతప్పన్. తన కుటుంబం తరతరాలుగా భద్రపరచుకొంటూ వస్తున్న తిరుక్కురళ్ రచనను కాంతప్పన్, Francis Whyte Ellis అనే బ్రిటిష్ ఆఫీసరుకు అందించాడు. దానివిలువ గ్రహించిన ఎల్లిస్ దొర వాటిని ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేసాడు. అలా తమిళుల సాంస్కృతిక సంపదైన తిరుక్కురళ్ వెలుగు చూసింది.
బాల్యం
అయోతీ థాస్ 20 మే 1845 న చెన్నైలో జన్మించారు. తరువాత తన తండ్రి ఉద్యోగం కారణంగా నీలగిరికి వలస వెళ్ళారు. వీరి కుటుంబం వైష్ణవాన్ని పాటించేది. అయోతీ థాస్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు కథవరాయన్.
అయోధ్య దాసర్ పండిట్ (1836-1900) అనే ఆచార్యుని వద్ద ఇతను తమిళం, ఇంగ్లీష్, పాళీభాషలు, తత్వశాస్త్రం, సిద్ధ వైద్యం లను నేర్చుకొన్నారు. తనకు జ్ఞానబుద్ధులునేర్పి జీవికను ఏర్పరచిన గురువుపై గౌరవంతో తన కథవరాయన్ పేరును అయోధ్య దాసర్‌గా మార్చుకున్నాడు.
మత దృక్ఫథం
పాతిక సంవత్సరాల వయస్సులో, అయోతీ థాస్ నీలగిరి కొండలపై నివసించే అణగారిన ప్రజలైన తోడర్లను సమీకరించాడు. 1870 లలో “అద్వైతానంద సభ” ని స్థాపించాడు. వీరి కుటుంబం వైష్ణవ సంప్రదాయాలను అనుసరించేది. ఆ కారణంగా తన కుమారులకు మాధవరాయ, పట్టాభిరామన్, జానకి రామన్, రాజారామ్ అని పేర్లు పెట్టి, బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత పుట్టిన తన కుమార్తెలకు అంబికాదేవి, మాయాదేవి అని పేర్లు పెట్టాడు.
వైష్ణవసంప్రదాయంతో మమేకమయినప్పటికీ, ఈయన ఆలోచనలు- ఆస్తికత్వం, ఆచారవ్యవహారాలు, బ్రాహ్మణ ఆధిపత్యం, మరియు మతపరమైన పెత్తందారీ పోకడలు-లాంటి అంశాలనుంచి హేతుబద్దమైన విముక్తి కొరకు అన్వేషణ చేసేవి. ఈ వెతుకులాట ఇతనిలో సొంత ఆలోచనలు, సొంత భావజాలం ఏర్పడటానికి దోహదపడింది.
19వ శతాబ్దం చివరలో బ్రహ్మసమాజం, ఆర్యసమాజం లాంటి సంస్థల ద్వారా హిందూమతం పునరుద్ధరణ జరగసాగింది. 1861 నుండి 1891 వరకు, క్రైస్తవులు, ముస్లిములు మినహా మిగిలిన అందరూ హిందూ లేబుల్ తో హిందువులులో బలవంతంగా చేర్చబడ్డారు.
అయోతీ థాస్ వైష్ణవ సంప్రదాయానికి మద్దతు ఇచ్చారు కానీ “హిందూ” యొక్క గుర్తింపును అంగీకరించడానికి నిరాకరించారు. “హిందూ” గుర్తింపును అంగీకరిస్తే “హిందూ” సమాజంలోని కుల నిర్మాణాన్ని అంగీకరించాలి. కుల హింసతో ఎన్నో బాధలు పడిన ఆదిద్రవిడ ప్రజలు హిందూ గుర్తింపును అంగీకరించకూడదని ఈయన భావించేవాడు. హిందూకి బదులుగా అయోతీ థాస్ ప్రత్యామ్నాయ హిందూయేతర గుర్తింపు కోసం వెతకడం ప్రారంభించాడు.
తమిళనాట భక్తి రూపాల్లో “తమిళ శైవమతం” పునరుద్ధరణకు ప్రయత్నాలు జరిగాయి. ఇది కూడా ఒక రకంగా కులతత్వాన్ని వదులుకోలేదు. “తమిళ శైవిజం” బ్రాహ్మణ వ్యతిరేకత గురించి మాట్లాడుతుంది కానీ “కుల నిర్మూలన” గురించి ఏమీ మాట్లాడదు. ఆ కారణంగా అయోతీ థాస్ తమిళ శైవమతంలో చేరలేదు.
అయోతీ థాస్ ప్రారంభించిన “కుల రహిత ద్రవిడ మహాజన సభ” తరపున ఉచిత విద్య, ఆలయ ప్రవేశం, బంజరు భూముల కేటాయింపు వంటి 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పంపగా అది 1891 జాతీయకాంగ్రేస్ పార్టీ 12 వ సమావేశంలో చర్చకు వచ్చింది కానీ ఆ డిమాండ్లు చివరికి నెరవేరలేదు.
1884 లో ఎమ్. వీరరాఘవాచారియర్, జి. సుబ్రమనియ అయ్యర్, పి ఆనందాచార్లు Madras Mahajanasabha ను స్థాపించారు. ఇది భారతదేశంలో మొదటిసారిగా స్వపరిపాలన కావాలని తీర్మానించిన చారిత్రిక సంస్థ. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పనిచేసేది. 1892లో మద్రాసు మహా జనసభ నిర్వహించిన సమావేశంలో నీలగిరి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయోతీ థాస్ కాంగ్రెస్ పార్టీకి కు పైన సమర్పించిన 10 అభ్యర్థనలను తిరిగి వీరికి సమర్పించి- శివాలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా ఆ అభ్యర్ధనను మహాజనసభ నిర్వాహక సభ్యులు నిర్ధ్వంద్వంగా తిరస్కరించి అయోతీ థాస్ ను అవమానించారు.
ఈ అవమానం అయోతీ థాస్ లో అంతర్మధనానికి దారితీసింది. మనం ఎవరం? హిందువులమా? అట్లైతే మనపై కుల దూషణలు ఎందుకు చేస్తున్నారు? అంటూ తన జాతి అస్తిత్వం గురించి ప్రశ్నించుకొంటూ ఆ క్రమంలో, వేదాలు, హిందూ మతం, బ్రాహ్మణత్వం, ఆచారాలు మొదలైనవాటిని లోతుగా అధ్యయనం చేసాడు.
ఆది ద్రావిడుల అస్తిత్వ కార్యకలాపాలు
1870వ దశకంలో, అయోతీ థాస్ నీలగిరిలోని తోడర్ మరియు ఇతర కొండ తెగలను ఏకం చేశాడు. 1875లో అద్వైతానంద సభను స్థాపించాడు. మద్రాసులో ఆది ద్రావిడుల కోసం వెసిలియన్ మిషన్ పాఠశాలను (Wesleyan Mission) నిర్వహిస్తున్న Rev. John Rathinam తో పరిచయం ఏర్పడింది. ఇతని సహాయంతో అయోతీ థాస్ 1885 లో ద్రవిడ పాండ్యన్ అనే వార్తా పత్రికను ప్రారంభించాడు.
1886 లో అయోతీ థాస్ "ఆది ద్రావిడులు "హిందువులు" కాదని భారతదేశచరిత్రలోనే అత్యంత విప్లవాత్మకమైన ప్రకటన" చేసాడు. ఆ తరువాత 1891లో ఇతను “ద్రవిడ మహాసభ”ను స్థాపించాడు 1891 జనాభా గణనలో ఆది ద్రావిడులు తమను తాము హిందువులుగా కాక "కుల రహిత తమిళులు"గా నమోదు చేసుకోవాలని కోరాడు. ఆనాటికి ఇద్ గొప్ప సాహసోపేతమైన వ్యాఖ్య.
అప్పటి ఏకైక పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ఉందని - ఒకటి ఉత్తర భారత కాంగ్రెస్, మరొకటి దక్షిణాది కాంగ్రెస్ అని, ఇది బ్రాహ్మణ కాంగ్రెస్ అని అయోతీ థాస్ విమర్శించేవారు. ఆమేరకు స్వీయఅస్తిత్వ స్పృహతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్రరాజకీయాన్ని ప్రారంభించాడు.
ఆది ద్రావిడ ప్రజలను అణిచివేసేందుకు ఏర్పడిన సాంస్కృతిక మరియు మతపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా అణగారిన ప్రజలకు నిజమైన విముక్తి లభిస్తుందని; కుల, వర్ణాలను వ్యతిరేకించే బౌద్ధమతమే అందుకు తగినదని అయోతీ థాస్ విశ్వసించాడు. బౌద్ధమతం ఆది ద్రావిడుల అసలు మతం అని, ఆదిద్రావిడ విముక్తి మరియు సాధికారతకు ప్రతిరూపం బౌద్ధమతమేనని ప్రచారం చేసేవాడు. ఆది ద్రావిడులు రాజకీయంగా అధికారం సాధించాలని కోరుకొనేవాడు.
బౌద్ధమత స్వీకరణ
అయోతీ థాస్ తన అనుచరులతో కలిసి థియొసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకప్రెసిడెంట్ Colonel H. S. Olcott ను కలుసుకుని తాను బౌద్ధమతం స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆల్కాట్ సహాయంతో, ఈయన శ్రీలంకకు వెళ్లి సింహళీ బౌద్ధ సన్యాసి సుమంగళ నాయక్ నుండి బౌద్ధదమ్మ దీక్షను స్వీకరించారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన అయోతీ థాస్ 1898లో చెన్నైలో “శాక్య బౌద్ధ సంఘాన్ని” స్థాపించి దాని శాఖలను దక్షిణ భారతదేశం అంతటా విస్తరింపచేసాడు. ఈ Sakya Buddhist Society కాలక్రమేణా "Indian Buddhist Association " గా చరిత్రలో నిలిచిపోయింది.
ద్రావిడ రాజకీయాలకు మార్గదర్శకుడు
అయోతీ థాస్ 1885లో ద్రవిడ పాండియన్‌ను పత్రికను ప్రారంభించారు. క్రీ.శ. 1886లో హిందువులలో అంటరానివారందరూ కులరహిత ద్రావిడులని ప్రతిపాదించాడు. ఆ విధంగా ద్రావిడ భావజాలానికి ఆద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయోతీ థాస్ 1891లో ద్రావిడ మహాజన సభను స్థాపించి ద్రావిడ రాజకీయాలకు మార్గదర్శకుడుగా నిలిచారు.
రచనలు
పండిట్ అయోతీ థాస్ సుమారు 25 పుస్తకాలు, 30 వ్యాసాల ధారావాహికలు, రాజకీయ వ్యాసాలు, ప్రశ్నలు మరియు సమాధానాలు వంటి కొన్ని వందల వ్యాసాలు రాశారు. ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు రాయడం ప్రారంభించిన తిరుక్కురల్ గ్రంథం ఆయన మరణంతో 55 అధ్యాయాలతో ముగిసింది. వారి రచనలలో కొన్ని ప్రముఖమైనవి
1. అంబికయ్యమ్మన్ కథ 2. ఇంద్ర జాతి చరిత్ర 3.ఇంద్ర దేశ బౌద్ధ పండుగ వివరాలు 4. శాక్య మహర్షి చరిత్ర 5. తిరుక్కురల్ దేవునికి శుభాకాంక్షలు 6.తిరువల్లువర్ చరిత్ర 7. నందన్ చరిత్ర 8. ఆధునిక కులాల్లో భయాందోళనలు 9. బుద్ధుడు రాత్రి మరియు పగలు లేని కాంతి 10. మురుగ భగవానుని చరిత్ర 11. వివాహ వివరణ 12. ప్రాచీన తమిళ భాష బుద్ధుడు ఆదివేదం 13. వేషబ్రాహ్మణ వేదాంత వివరణ
ముగింపు
C. Iyothee Thass దక్షిణభారతదేశంలోని ద్రావిడ ప్రజల హక్కులను ఆత్మగౌరవాన్ని ప్రకటించి ద్రావిడ ఉద్యమానికి ఒక పితామహునిగా నిలిచిన దళిత మేథావి. వీరు మొదట పంచమర్ మహాజన సభను స్థాపించారు. ఇది పంచముల, పరయాల హక్కులకొరకు పోరాడిన మొదటి సంస్థ. తాను బౌద్ధంలోకి మారి ఇతర దళితసోదరులనుకూడా బౌద్ధంలోకి మారమని పిలుపు ఇచ్చిన ఆచరణవాది. తాను నడిపే తమిళన్ పత్రిక దళితులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అప్పట్లో చక్కని వేదికగా నిలిచింది. అయోతీ థాస్ తమిళనాట జరిగిన ద్రవిడ ఉద్యమానికి స్ఫూర్తిగా, భారతదేశంలో జరిగిన దళితఉద్యమాలకు ప్రేరణగా నిలిచారు.
బొల్లోజు బాబా
(ఉదయనిధి మారన్ సనాతన ధర్మం పై చేసిన కామెంటును సమర్ధిస్తూ సినీ దర్శకుడు పా రంజిత్ , సంఘ సంస్కర్త అయోతీ థాస్ పండితర్ పేరును ప్రస్తావించారు. ఎవరా అని వెతకగా నెట్ లో పై సమాచారం కనిపించింది. భారతదేశ దళితఉద్యమాలకు ఈయనజీవితము, పోరాటము తాత్వికపునాదులను అందించినట్లు అనిపించింది.
పై వ్యాసానికి మూలం ఇంగ్లీషు, తమిళ వికీ పేజీలు ఇంకా కొన్ని ఇతర సైట్లు)
చాలా విలువైన విషయాలు తెలియజెప్పారు. Many thanks sir..
ReplyDeletethank you sir
Delete