Wednesday, April 30, 2008

మట్టి కనుల నాపల్లె

అపరిచిత ప్రపంచంలో బతకడం అంటే
వసంతాన్ని పారేసుకొన్న తుమ్మెద
ఎడారి కన్నులపై వాలటమే!

ఏ కరచాలనాల ప్రారంభం
ఏ ఆత్మ స్నేహాల వాకిళ్లు తెరుస్తుందో లేక
పరచుకోబోయే ఏ విష జాలం అవుతుందో
తెలియని స్థితి.

అపరిచిత ప్రపంచంలో బతకటం అంటే
జీవితాన్ని అవమానం స్థాయిలో లాగించేయటమే.
ప్రసవించే స్త్రీ, ఆ వేదనలో ఎంత ఒంటరో
అంతే ఏకాకితనం ముసురుకుంటుంది.
మహా సంద్రంలో ఒంటరి నావికుని
మనో రోదనను ఏ ప్రవచనాలు
శాంతింపచేయలేవు.

అపరిచిత ప్రపంచంలో బతకటం అంటే
మబ్బుల మద్య గుంపును కోల్పోయిన
కొంగపిల్ల తుమ్మ చెట్టుకు గాయమై
వేలాడడమే!

ప్రజా సమూహపు సానరాయిపై
గంధపు మాటల చెక్కని అరగదీసి అరగదీసి
నాగుండెకు పరిచయాల లేపనాన్ని పూద్దామంటే
గుండె కనపడదే!

ఒక వేళ
నెరళ్లు తీసిన నా పల్లె మట్టి నయనాల్లో
ఉండి పోయిందా?

Tuesday, April 29, 2008

ఓ నా మనసా

నువ్వు నన్ను ప్రేమించావు
కనుకనే ఇన్ని విజయ పుష్పాలను
నేను పూయించగలిగాను.

నీవు నా స్వప్నాలకు రెక్కలు తొడిగి ఉండకపోతే
నేనో బోంసాయ్ మొక్కగానే ఉండే వాడిని.

నువ్వు నన్ను విశ్వసిస్తున్నావన్న వాస్తవం నన్నీ
జీవన సంద్రంలో తేలుతూ ఉండేలా చేస్తుంది.

నీ జీవితంలోకి నన్ను లాగేసుకొన్నావన్న భావనే
ఈ జీవన రణ రంగంపై నన్నో
అజేయ గ్లాడియేటర్ ని చేస్తుంది.

నీ కాలంలో నా కలల ఉనికి
నా గడియారంలోంచి నిష్ఫల, నిష్క్రియా
నిముషాలను తరిమేస్తాది.

నీ ప్రతీ మాటనిండా సుమాలుంటాయి.
నా శరీరంపై నీడలా జీవించే నీ జ్జాపకాలు
ఘనీభవించిన ఓ సువాసన.

నాకు మరో దారి లేదు
నిన్ను తిరిగి ప్రేమించటంతప్ప.

బొల్లోజు బాబా

Sunday, April 27, 2008

ఆస్పత్రిలో ఓ చావు

కట్లు తెంచుకొని ఓ హంస ఎగిరి పోయింది

ఎళ్ళి పోయావా అమ్మా
బతినన్నాళ్ళూ మాకోసమే బతికి ...........
నిన్నటి దాకా ఆమెను పనిమనిషిలాగ వాడుకొన్న
ఓ కొడుకు భోరుభోరున నటిస్తున్నాడు.

మిగతా రోగుల మొహాలపై
భయం యాసిడ్డై విస్తరించింది.
చావు వాసన వైరాగ్యమై,వేదాంతమై,కర్మ సిద్దాంతమై,
వార్డంతా మంచులా పరచుకొంది.

ఓ ముసలాయన కళ్లు మూసుకొని
తనులేని ప్రపంచం ఎలాఉంటుందో
కలల తెరపై చిత్రించుకొంటున్నాడు.

నాడాలు కొట్టబడుతున్న ఎద్దులా
నిస్సహాయంగా పడున్న పక్షవాత రోగి కనుగుడ్లు
బొట్లు బొట్లై ద్రవించినయ్.... అసూయతో.

ఏయ్ అటు వెళ్లకు - అంది ఓ పురటాలు
డాక్టర్ని చేయ్యాలనుకొంటున్న తన పెద్ద కొడుకుతో.

అందరూ పోతున్నారు కానీ వీడింకా పోడు - అని
ఓ రోగి భందువు గుండె తన ద్రాక్ష గుత్తుల స్వప్నాలు
నిజమయ్యేదెపుడోనని మూలుక్కుంది.

ఇద్దరికీ ఇంకా బేరం కుదిరినట్టు లేదు
మృతురాలి భంధువు జేబు బరువుగానూ,
వార్డు బాయ్ జేబు ఖాళీగాను ఉన్నాయి.

వాసన పసిగట్టిన ఓ శవాల రిక్షా వాడు,
తలుపుమూసిన వంటింట్లోకి ఎలా వెళ్లాలో తెలీని పిల్లిలా
ఎవర్ని కదపాలో తెలీక కిటికీ వద్ద తచ్చాడుతున్నాడు.

దూరంగా ఓ బైరాగి - తోలుతిత్తి ఇది తుటులు తొమ్మిది .....'
అని తత్వం గొణుగుతూ మధ్యలో దగ్గు రాగా
దగ్గరుకు మింగుతున్నాడు.

ఆసుపత్రి పక్కనే ఉన్న గబ్బిలం గదుల లాడ్జికి
ఎదురుగుండా ఉన్న మందుల షాపుకీ
గోడకానుకుని ఉన్న రౌండ్ ది క్లాక్ హొటల్ కి
ఉప్పచేపలా వడలిన దేహంతో ఖాలీ సేసాలమ్మే ముదుసలికి
ఈ రోజుతో ఓ బేరం తగ్గిపోయింది.

దూరంగా చెట్టుపై వాలిన హంస ఓ సారి నవ్వుకొని
ఎగురుకొంటూ మబ్బుల్లో కలసిపోయింది.


బొల్లోజు బాబా

మలి సంధ్య

పెద్దవి కాని చిన్నవి కాని అవసరాలేమీ లేవు
సాకారం చేసుకోవాల్సిన కలలేమీ లేవు

సాధించాల్సిన ఆశయాలేమీ లేవు
ఏ ప్రపంచము లేని చోట వశించాలన్నది తప్ప

జాలి చూపులు, ఓదార్పు మాటలు,
పెద్దగీత తో పోల్చడాలు, ధైర్యవచనాల కు దూరంగా,

ఆలోచనలతోటి, జ్నాపకాలతోనూ
గతంతోను ఒంటరిగా వశించాలన్నది తప్ప.

బొల్లోజు బాబా

కాలం

భవిష్యత్తంటూ ఏమీ ఉండదు
అనంతమైన అవకాశాలన్నీ
వర్తమానంలోకి కుప్పకూలుతాయి.

వర్తమానమూ ఒక భ్రమే ఎందుకంటే
దాన్ని చేరగానే గతంగా మారిపోతుంది కనుక.
గతం మాత్రమే నిజంగా నిజం
జ్ఞాపకాల మచ్చలు, జీవితాన్ని నిర్ధేశించే అనుభవాలు
కళ్ల వెనుక కదలాడే నులివెచ్చని దృశ్యాలు
కళ్లు మూసేదాక వెంటాడుతూంటాయి.

బొల్లోజు బాబా

Introduction

Hai friends,
My name is Bolloju Ahmad Ali Baba, I hailed from Yanam, a union territory of Pondicherry, which was once ruled by French people. I am interested in Telugu literature. I wish to post my all scribblings and outpourings that relieved my mind in this blog soon. So this blog has been named so ie "Sahithee Yanam" (Journey of sahithyam). Hope you like it.
baba