Wednesday, April 30, 2008

ఒకానొక రెడ్ లైట్ ఏరియా


నాలుగు రోడ్ల కూడలి
పరాకాష్టకు చేరుకున్న ఒకానొక
వికృత క్రీడ యొక్క భీభత్సావృత కూపం.


జీవితం లైంగికంగా వ్యాప్తిచెందే
అంటురోగమయిన చోట
కన్నెలు మల్లెలవుతాయి
మల్లెలు కత్తులవుతాయి.


ఇక్కడ స్త్రీ చర్మం గజాల్లెక్కనా
గంటల్లెక్కనా వ్యాపారం చేయబడుతుంది.
ఇక్కడ అసూర్యంపశ్యల మాంసం
దేహాల్లెక్కన వడ్డీకి తిప్పబడుతుంది.


వర్ణ, వర్గ, కుల, మతాలనబడే
సభ్యసమాజపు శిలాతెరలు ఇక్కడ
దేహాలమద్య కనిపించని మంచుపొరలవుతాయి.


కిలికించితాలు, చెక్కెళ్ల సిగ్గుదొంతరలు,
సుఖమనిపించే విరహాలు, పరిష్వంగ పులకింతలు,
అవన్నీ ఇక్కడి జీవన పరాజితుల
గుండెల్లో కలల శిలాజాలు.


ముత్యం భస్మమయినట్లు
స్వప్నయవ్వనం కాలిపోగానే, వాస్తవం
అనకొండాలా మృత్యుకౌగిలించుకుంటుంది.


పింప్ లు పిండుకోగా స్థనాల్లో
మిగిలింది రక్త గడ్డలొక్కటే.
నిత్యం వందల డైనోసార్ పందుల
రత్యానంతరం దేహాల్లో మిగిలింది
రోదనా ప్రవాహమొక్కటే.


ఈ కసుగాయల చెక్కిళ్లు చిదిమితే
కారేది పాలు కాదు ఎయిడ్స్ మాత్ర
ఎడారి కొమ్మలు పుష్పించేదిక
వేదనా బూడిద మాత్రమే.


ప్రపంచ ప్రాచీన వృత్తి ఇక్కడి
వ్రణ యోనులకు జీవనాధారమై
అదే మృత్యుదాతయై విరాజిల్లుతుంది.


సమాన ఆస్తి హక్కు, 30% రిజర్వేషన్ల వల్ల ఏం లాభం?
జీవన పరిస్థితులు మెరుగుపర్చాలి కానీ?
బొల్లోజు బాబా
(ఒకానొక రెడ్ లైట్ ఏరియా చూసిన చలించి)

No comments:

Post a Comment