Wednesday, April 30, 2008

మట్టి కనుల నాపల్లె

అపరిచిత ప్రపంచంలో బతకడం అంటే
వసంతాన్ని పారేసుకొన్న తుమ్మెద
ఎడారి కన్నులపై వాలటమే!

ఏ కరచాలనాల ప్రారంభం
ఏ ఆత్మ స్నేహాల వాకిళ్లు తెరుస్తుందో లేక
పరచుకోబోయే ఏ విష జాలం అవుతుందో
తెలియని స్థితి.

అపరిచిత ప్రపంచంలో బతకటం అంటే
జీవితాన్ని అవమానం స్థాయిలో లాగించేయటమే.
ప్రసవించే స్త్రీ, ఆ వేదనలో ఎంత ఒంటరో
అంతే ఏకాకితనం ముసురుకుంటుంది.
మహా సంద్రంలో ఒంటరి నావికుని
మనో రోదనను ఏ ప్రవచనాలు
శాంతింపచేయలేవు.

అపరిచిత ప్రపంచంలో బతకటం అంటే
మబ్బుల మద్య గుంపును కోల్పోయిన
కొంగపిల్ల తుమ్మ చెట్టుకు గాయమై
వేలాడడమే!

ప్రజా సమూహపు సానరాయిపై
గంధపు మాటల చెక్కని అరగదీసి అరగదీసి
నాగుండెకు పరిచయాల లేపనాన్ని పూద్దామంటే
గుండె కనపడదే!

ఒక వేళ
నెరళ్లు తీసిన నా పల్లె మట్టి నయనాల్లో
ఉండి పోయిందా?

3 comments:

  1. పద్యం బాగుందండీ. ఆర్ద్రంగా ఉంది. మీనించి మరిన్ని మంచి టపాల కోసం ఎదురు చూస్తుంటాం. పద్యాలే కాక మీ ఆలోచనలు కూడ పంచుకోండి.

    ReplyDelete
  2. hi babaya

    how are you
    nice to see you here

    do keep in touch
    love to my lil bro n sis
    nad hi to you and pinni

    ReplyDelete
  3. nice one great comparisions nice flow

    ReplyDelete