Friday, March 29, 2024

వేదబాహ్యులు పుస్తకం లభించుచోటు- 9866115655

"వేదబాహ్యులు" రచయిత కాపీలు ఈ రోజు నాకు చేరాయి. ఇది నా 12 వ పుస్తకం. ప్రింట్ క్వాలిటీ బాగావచ్చింది. పబ్లిషర్ పల్లవి నారాయణ గారి వ్యక్తిత్వం, చేసేపనిపట్ల వారి అంకితభావం నాకు నచ్చుతాయి. వారికి ధన్యవాదములు.
ఈ పుస్తకరచనలో శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. వారికి సదా కృతజ్ఞుడను.
ఈ పుస్తకం వెల- రు.225/-
196 పేజీలు
లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్.వి.నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655


దయచేసి ఆదరించండి.


బొల్లోజు బాబా


Thursday, March 28, 2024

ఖాళీతనపు చప్పుడు Noise of the Emptiness by Moumita Alam


నా చివరి ప్రేమికునితో చాలా ఏళ్ళు
చాటింగ్ చేసాను
మాటలు, మాటలు, మాటలు
ఉత్త బోలు మాటలు, అబద్దాలు
అతని ఆఖరి ఫోన్ కాల్ లో
స్వరం అంతమయ్యేవరకూ
వేచిచూసాను
మొద్దుబారిన మైమరుపుతో
ఎదురుచూసాను

సిల్వియా* ఆలోచనలలో
చెప్పలేని నిశ్శబ్దమేదో ఆ గాస్ స్టవ్ మంటను
జ్వలింపచేసి ఉండొచ్చు
ఖాళీతనాన్ని ఎలా నిర్వచించాలి?
పొందికలేని, లోనికి పీల్చుకొన్న ఖాళీతనాన్ని?
సిల్వియా ఖాళీతనాన్ని
స్త్రీ అణచుకొన్న కోపంగా పిలిచారు వారు
మరి నా ఖాళీతనాన్ని ఏమని పిలుస్తారు?

ఖాళీతనం గురించి వారికేమీ తెలియదు
ఖాళీతనం అంటే చప్పుడు
బోలుగా, చీకటిగా లోతుగా ఉండే చప్పుడు
పగిలిన విస్కీసీసాల చప్పుడు
ఉక్కిరిబిక్కిరి అయిన గొంతు చప్పుడు
చేతులను చీల్చినప్పటి చప్పుడు
వారు ఎందుకు చూడలేరు
ఎంపిక అనేది ధీరవనిత ప్రత్యేకహక్కు

Source: Noise of the Emptiness, Moumita Alam
అనువాదం: బొల్లోజు బాబా

*సిల్వియాప్లాత్ - గాస్ ఓవెన్ లో తలపెట్టి ఆత్మహత్యచేసుకొన్న అమెరికన్ స్త్రీవాద కవయిత్రి

అభినందనలు! మీ మౌనం గెలిచింది - Congratulations! Your Silence Has Won! by Moumita Alam


హోలోకాస్ట్ ఒక్కసారిగా జరిగిందా
బిగ్ బాంగ్ లా?
లేదు.
అది మెల్లగా మొదలైంది
పద్దతిగా. పథకం ప్రకారం. క్రమక్రమంగా.

చరిత్రను చెరిపేశారు
మనుషులను రాక్షసులుగా మార్చారు
సమాధులని చదునుచేసారు
మాట్లాడేవారిని మాయం చేసారు
Wali Dakhani* రోడ్డుగామారింది.
రేపిస్టులు* సంస్కారులుగా కీర్తించబడ్డారు

కాలిబొగ్గుగా మారిన దేహాలు నా కలల్లో
పదే పదే కనిపించేవి.
వాటిని అడిగాను
గాస్ చాంబర్స్ లోకి వారిని నడిపించిన శక్తులేవి
నేరస్తులు ఏ పాటలు పాడుతున్నారు అని?
అవి ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం ఇచ్చాయి
మా ఇరుగుపొరుగు వ్యక్తుల మౌనం
భయంకరమైన మౌనం. వెంటాడే మౌనం..అని

ఆ మౌనం
బస్సులలో, టీవీలలో, వార్తా పత్రికలలో
వంటిళ్లలో, పార్లమెంటులో ఉన్నట్లు
బిగ్గరగా ఉంటుందా అని
అడగటానికి సాహసించలేకపోయాను

కాలిన చర్మపు వాసన ఒక అంటురోగం
నా చర్మంపై ఆ వాసన తెలుస్తోంది.
అభినందనలు!
భీకరమైన మీ మౌనానికి.
మీరే గెలిచారు.

మూలం: Congratulations! Your Silence Has Won! by Moumita Alam
అనువాదం: బొల్లోజు బాబా

*Wali Dakhani మతాతీతంగా కొలువబడే ఒక సూఫీ కవి దర్గా. గోద్రా అల్లర్లలో నేలమట్టం చేయబడి దాని స్థానంలో  తారురోడ్డు వేయబడింది. 
*బిల్కిస్ బనోని రేప్ చేసినవారు సంస్కారులని ఒక నాయకుడు అన్నాడు

Friday, March 22, 2024

 ప్రెస్ కు వెళిపోయింది. పల్లవి పబ్లికేషన్స్.

200 పేజీలు
ఆర్టిస్టు గిరిధర్ కు ధన్యవాదములు
పిక్చర్ - నాగరాజు, రాణి శిల్పం, అజంతా గుహలు
బొల్లోజు బాబా

Thursday, March 21, 2024

కవిత్వంలో నిరలంకారత

అలంకరించబడిన వచనాన్ని కవిత్వం అంటారు. సిమిలీ, మెటఫర్, సింబల్, మెటనిమి, పెర్సొనిఫికేషన్, అల్లిగొరి, అల్యూజన్, పారడాక్స్, ఐరనీ, హైపర్బొలి వంటి వివిధ అలంకారాలు కవిత్వాన్ని వచనంనుండి వేరుచేస్తాయి. వీటిని పాశ్చాత్య పరిభాషలో Tropes అంటారు.

“కవితలోఉండే వివిధ అలంకారాలను విశ్లేషించుకొని కవితకు కనక్టవటం కన్నా ఆ కవితావాక్యాలు నేరుగాఇచ్చే ఉద్వేగాన్ని అనుభూతిచెందటం మంచిపద్దతి” అంటాడు ప్రముఖజర్మన్కవి Paul Celan. కవిత్వంలో పలికే ఉద్వేగాన్ని మెటఫర్లు, ఇమేజెరీల ద్వారా కాక నిరలంకారవాక్యాల ద్వారా చెపితే, ఆ ఉద్వేగానికి పాఠకుడు తొందరగా కనెక్టుఅవుతాడని సెలాన్ అభిప్రాయంగా భావించవచ్చు.
 
ఆధునికకవిత్వంలో నేటిజీవితపు సమస్తఅంశాలు కవిత్వీకరించ బడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెప్పదలచుకొన్న అంశం సూటిగా స్పష్టంగా చెప్పటానికి కొన్నిసార్లు అలంకారాలు అడ్డు తగలవచ్చు. అలంకారాలు వస్తువును మరుగున పరచి కవిపొందిన ఉద్వేగాన్ని పాఠకునికి చేరనివ్వకుండా పక్కదారి పట్టించవచ్చు. ఒకకొత్త ఆలోచననో, బరువైన సంఘటననో, బలమైన ఉద్వేగాన్నో చెప్పదలచుకొన్నప్పుడు నిరలంకారంగా చెప్పటంకూడా ఒకమంచి కవిత్వ నిర్మాణ టెక్నిక్.
 
ప్రాంతంవాడేదోపిడిచేస్తే
దోపిడిచేసేప్రాంతేతరులను
దూరందాకా తన్నితరుముతం
ప్రాంతంవాడే దోపిడిచేస్తే
ప్రాణంతోనే పాతరవేస్తం
దోస్తుగఉండే వారితొ మేమును
దోస్తేచేస్తం – ప్రాణమిస్తం// (కాళోజి)

మహాకవి కాళోజీ వ్రాసిన పైవాక్యాలలో ఒక జాతి అంతరంగం ఆవిష్కృతమైంది. నిరలంకార వచనంలా సాగే ఆ కవితలో ఒకసమాజాన్ని ఏకంచేసేటంతటి ఉద్వేగంఉంది. ఆ ప్రాంత ప్రజలందరూ ఆ వాక్యాలను వారిమనోఫలకంపై శిలాక్షరాలుగా లిఖించు కొన్నారనటానికి సాక్ష్యం, వాటిని అనేకమంది పదేపదే తమవ్యాసాలలో కోట్ చేసుకొంటూండటమే. భావోద్వేగాలను, మానవ సంవేదనను వ్యక్తీకరించే కవిత్వానికి అలంకారాలు అవసరంలేదనటానికి మహాకవి కాళోజీ కవిత్వమే నిదర్శనంగా నిలుస్తుంది. వాక్యాలలోని అనుభూతులకు నేరుగా కనక్ట్అవ్వటం అనిPaul Celan చెప్పింది ఇలాంటి వాక్యాల గురించే.
 
“వాణ్నికన్ననేరానికి
నిన్నుతూలనాడుతున్నాను క్షమించుతల్లీ.//
అచ్చం నీలాగా – నీలాగ
ఒక అమ్మాబాబుకు పుట్టినమనిషి
అక్షరాలా మనిషేరా
వాడు మలం తిన్నాడు
ఒరేయ్నీ ఇరవైఒకటోశతాబ్దం
ఆదిమ యుగంనాటి
అజ్ఞానపు గుహలోదాక్కుందా?//
నీ దేవుడికి ఎయిడ్స్ సోకిందా?
ఇప్పుడుచెప్పరా
మళ్ళీమళ్ళీ అడుగుతున్నాను
ఒరే! లంజాకొడకా
నీ పేరు మనిషా?” (వాడే అశుద్ధమానవుడు- శిఖామణి)

ఆలయప్రవేశం చేసినందుకు 1989 లోకర్ణాటకలో ఒక దళితుడుని కొట్టి, బలవంతంగా మనిషిమలం తినిపించారన్న సంఘటననుఖండిస్తూ వ్రాసినకవిత ఇది. ఇందులో ఏ రకమైన అలంకారాలుఉండవు. పూర్తిగా వాచ్యంగా ఉంటుంది. అయినప్పటికీ మానవత్వం ఉన్న ప్రతిఒక్కరిని కదిలిస్తుంది. సాటిమానవునికి జరిగినఅమానుషావమానాన్ని ఈకవిత ఎంతో ఫెరోషియస్ గా ఎత్తిచూపుతుంది. సమాజంలో తన సహచరునికి జరిగిననీచమైన అవమానంపట్ల ఆగ్రహించి ఒకసామాజికబాధ్యతతో వ్రాసినకవితఇది. ఈ కవితపైకి క్రోధప్రకటనలా అనిపిస్తున్నా, అంతర్లీనంగా కరుణ, మానవతలుకనిపిస్తాయి. నిరలంకారంగా ఉన్నప్పటికీ గొప్పదిగా నిలిచిపోవటానికి కారణం కవితలోరక్తాన్నిమరిగించేలా ప్రవహించిన బలమైన ఉద్వేగం.


I Met A Genius- Charles Bukowski

ఈరోజు రైల్లో
నేనో మేధావినికలిసాను
ఆరేళ్ళ వయసుంటుందేమో
అతను నాపక్కనే కూర్చున్నాడు
రైలుసముద్రతీరం వెంబడివెళుతోంది
సముద్రాన్ని చూస్తూఅన్నాడతను
పెద్దఅందంగాఏంలేదని”
అవును నిజమేకదా అనిపించింది
మొదటిసారిగా ---- ( చార్లెస్ బుకొవ్స్కీ)

నిరలంకార కవిత్వాన్ని విస్తారంగా వ్రాసినకవులలో చార్లెస్బుకొవ్స్కీ ఒకరు. దైనందిన సంఘటనలు, సంభాషణలు, అనుభూతులు ఇతనికవిత్వంలో కథనాత్మక రీతిలోఅలవోకగా ఒదిగిపోతాయి. పైకవితలో “సముద్రం పెద్ద అందంగా ఏంలేదని అనేపిల్లగాడిని మేధావి అనిఅనటం”లోతైన తాత్వికతను, కొత్తదృష్టిని సూచించి ఆశ్చర్యపరుస్తుంది. కవితలో కనిపించని ఏదో మిస్టిక్నెస్ ఆకట్టుకొంటుంది. ఒకమామూలు సంఘటనను ఊహించనిమలుపుకు తిప్పి పాఠకునికి ఒకషాక్ ను కలుగచేస్తాడుకవి. నిరలంకారత వల్ల కవిత చాలా లోతుగా గుండెల్ని తాకుతుంది.
 
అలంకార రహితంగా వ్రాసేకవిత్వాన్ని పాశ్చాత్యదేశాలలో Spoken Word Poetry, Slam Poetry అని పిలుస్తున్నారు. స్పోకెన్ వర్డ్ కవిత్వాన్నిఒకఏకపాత్రాభినయం లాగా ప్రదర్శిస్తూ చదవటాన్ని అక్కడి యువతరం గొప్పచైతన్యంతో ముందుకు తీసుకు వెళుతున్నారు. కవిత్వం చదవటం అనేది ఒక Performing Art అని ప్రముఖ కవి శ్రీశివారెడ్డి అనేకసభలలో చెప్పింది బహుశా దీని గురించే కావొచ్చు.

కవి విమర్శకులు శ్రీవాడ్రేవు చినవీరభద్రుడు తన ఫేస్బుక్ పోస్ట్ చేసిన ఒకవ్యాసంలో-అమెరికాలోఉంటోన్న“భావన” అనే అమ్మాయి “Chopping Onions” శీర్షికతో ఇంగ్లీషులో వ్రాసినఒక Spoken Word Poem ను అనువదించి పరిచయంచేసారు. ఆ కవితలోంచి కొన్నివాక్యాలు ఇవి

~ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు~
నాకుబాగాగుర్తుంది నాచిన్నప్పుడోసారి
మాఅమ్మకేసి చూసి అడిగాను
'నువ్వేం చేస్తుంటావు?'అని
నీళ్ళకళ్ళతో చిరునవ్వి చెప్పిందామె
'నేను చేసేదంతా మామూలుగా మనుషులు పట్టించుకోనిదే
ఏమంత ముఖ్యంకానిది,
నేను ఇస్తాను, లాలిస్తాను, పోషిస్తాను
నువ్వు స్కూలునుంచి వచ్చేటప్పటికి నేనిక్కడుంటాను
నీకేదన్నా పెట్టి నీమీదే మనసుపెట్టుకుని ఉంటానిక్కడే.'
అప్పుడు నాకు తెలీదు
ఆకళ్ళల్లో ఆ నీళ్ళు ఉల్లిపాయలు తరిగితే వచ్చినవి కావని.// (Chopping Onions – Bhavana)


పైకవితలోఎక్కడా ఏ విధమైన ట్రోప్స్ కనిపించవు. పదిహేడేళ్ల అమ్మాయి ప్రపంచాన్ని ఒకస్త్రీ దృక్కోణంలోఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. కవిత ఆద్యంతం వాడుకభాషలో సాగుతుంది. పెద్దపెద్ద బరువైన పదాలు ఉండవు. “స్వేచ్ఛగా ఇష్టంతో కావలసిన దానిని సాధించుకోవటమే స్త్రీసాధికారత” అన్న విషయాన్ని సూటిగా, ఏ శషభిషలు లేకుండా చెప్పటం ఈ కవితా వస్తువు. ఇదేకవితను భావన ప్రదర్శిస్తూ చదివేవీడియోని కూడా యూట్యూబ్లో చూడవచ్చు. ఇదినేటి తరపు కవిత్వస్వరం, నడుస్తున్న మార్గం.

సిస్టర్అనామిక

అతని
రెండు రెక్కల్లోచేతులుఉంచి
టాయిలెట్ సీట్నుంచిలేపి
పళ్ళుతోమి స్నానంచేయించి
ఒళ్ళుతుడిచి బట్టలుతొడిగి
జాగ్రత్తగా నడిపించి
మంచంపై పడుకోబెట్టి
“మీఅబ్బాయి రమ్మంటున్నాడని అన్నారుగా
వెళ్ళొచ్చుకదా?” అందామె
మాత్రలు వెతుకుతో
నీటిపొర నిండిన కళ్ళతో
సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయాడతను
ఫోన్ కూడాచేయటం మానుకొన్న
బబ్లూగాడిని గుర్తుచేసినందుకు.

వయసు పైబడిన తల్లితండ్రులను దగ్గర ఉండి చూసుకోలేక నర్సుల సంరక్షణలో ఉంచటం పరిపాటిగా మారింది నేడు. ఎవరికారణాలు వారికిఉంటున్నాయి. ఆ నేపథ్యంలోని ఒక సంఘటనను యధాతధంగా పైకవిత ఆవిష్కరిస్తుంది. కవిత్వాన్ని ఉద్దీపింప చేసే ఏవిధమైన ట్రోప్స్ లేవుకవితలో. పైగా చదవటానికి ఇబ్బందికలిగించే, కాలకృత్యాల వర్ణణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ- పట్టించుకోని కొడుకు గౌరవం కాపాడటానికి, “నన్ను వచ్చేయమంటున్నాడని” చెప్పుకొంటున్న ఒకవృద్ద తండ్రి మూగరోదన బలమైన ఉద్వేగమై పాఠకుని హృదయాల్నితాకుతుంది.
*****

అలంకారాలులేకుండా కూడా మంచికవిత్వం చెప్పగలుగుతున్నప్పుడు ఇకఅలంకారాల ఉపయోగంఏమిటి అన్నప్రశ్నఉదయించక మానదు. ఎంతోశక్తివంతమైన కవితావస్తువు, లోతైన కొత్తఊహలేదా గుండెలను బలంగామోదగలిగేటంతటి సత్తువ కలిగిన ఉద్వేగమూ లేకపోతే నిరలంకార కవిత్వం ఉత్తవచనంగా మిగిలిపోతుంది. త్రిపురనేని శ్రీనివాస్ “వచనమైతేలిపోతావ్” అని హెచ్చరించింది అలాంటికవిత్వం గురించే. ఉత్తవచనానికి లైన్ బ్రేకులు ఇచ్చినంత మాత్రాన అదిఏనాటికీ కవిత్వంకాలేదు

“నోటిమాటలు హృదయానుభవపు చిహ్నాలు కాగా, లిఖితపదాలు నోటిమాటల చిహ్నాలు” అంటాడు అరిస్టాటిల్. హృదయానుభవం మాటలద్వారా నేరుగా వ్యక్తీకరింపబడుతుంది. ఉచ్ఛారణలో ఎత్తుపల్లాలు, వివిధ ఉద్వేగాలను పలికించేటపుడు స్వరంలోమార్పులు, ముఖకవళికలు, హావభావాలు -ఆ హ్రుదయానుభవాన్ని స్పష్టంగా, యధాతధంగా అందించటానికి దోహదపడతాయి. కానీ అదే ఉద్వేగాన్ని లిఖితరూపంలో చెప్పవలసివచ్చినపుడు పదాలశక్తి సరిపోదు. భాష విఫలమౌతుంది. కవి అనుభవించిన ఉద్వేగం పాఠకునికి అదేస్థాయిలోఅందదు. ఈ సందర్భంలో అలంకారాలు సహాయపడతాయి.ఉద్వేగాలను అదేస్థాయిలోఅందించటానికి ఉపయోగపడతాయి.

“నొప్పిగాఉంది” అన్నప్పుడు ఆ చెపుతున్నవ్యక్తి ప్రవర్తన, హావభావాలు, స్వరంలోని వణుకు అన్నీకలిసినొప్పి తీవ్రతనుఅర్ధం చేయిస్తాయి. కానీఅదేమాటను వ్రాసినపుడు చదివేవారికి అతనినొప్పి తీవ్రత అనుభవానికిరాదు.“భరించలేనినొప్పిగాఉంది” అన్నప్పుడు కొంతఅర్ధమౌతుంది. “సూదులతోగుచ్చినట్లునొప్పిగా ఉంది” అన్నప్పుడుమరికొంతఅనుభూతికి వస్తుంది.

“కొన్ని వందలపీతలుదేహంలో సంచరిస్తూ
డెక్కలతో ఎముకల్నికరకరలాడిస్తున్నట్లు నొప్పిగాఉంది”అన్నప్పుడు పాఠకుడు ఆ దృశ్యాన్ని తనమస్తిష్కంలో కల్పనచేసుకొంటాడు. దేహంలో పీతలుతిరగడం, అవి ఎముకల్ని కొరకటంఅనే నూత్నఇమేజెస్ ను నొప్పికి మెటఫర్ చేయటంద్వారా పాఠకునిలోనొప్పి తీవ్రతను ఉద్వేగించగలుగుతాడు కవి. కవిత్వంలో ఉద్వేగాలను పలికించటానికి ఇక్కడ మెటఫర్ సహాయ పడింది. ఉద్వేగాలను పలికించటానికి భాషకుకవిత్వం మినహా వేరేదారిలేదు. సమాచారం కొరకువచనం, ఉద్వేగాలను అందించటానికికవిత్వంఅనేది అందుకనే.
***

ట్రోప్స్ లేకుండా వ్రాసిన కవిత్వంలో తీవ్రమైనఉద్వేగమో, కొత్తఆలోచనోలేకపోతే వచనమై సోలిపోతుంది. నిరలంకారకవిత్వమనేది ఒకప్రమాదకరమైన పొలిమేర. తగినంత శక్తిసామర్ధ్యాలు లేకుండా అక్కడకుప్రవేశించటం కవికికవిగా ఆత్మహత్యాసదృశం. వచనాన్ని, కవిత్వాన్నివేరుచేసేవి అలంకారాలే అన్నఅభిప్రాయంఏర్పడింది అందుకే.


బొల్లోజు బాబా
2018

కవిత్వ భాష పుస్తకం నుంచి

Sunday, March 17, 2024

ప్రాచీన భారతీయ లౌకికత

 2400 సంవత్సారాల క్రితపు భారతదేశ సనాతన ధర్మం ఇలా ఉంది......

ఒక మతానికి చెందిన వ్యక్తులు అసందర్భంగా తమమతాన్ని పొగుడుకోవటం, ఇతరమతాలను నిందించటం చేయరాదు.  పరమతానికి చెందినవారిని కూడా గౌరవించవలెను.  ఇలా చేయుటవలన తమ మతాన్ని అభివృద్ధిచేసుకోవటమే కాక ఇతరమతాలవారికి ఉపకారం కలిగించిన వారు అవుతారు.  తన వారిని స్తుతిస్తూ ఇతరమతస్తులను నిందించేవాడు తన మతానికే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. - అశోక చక్రవర్తి, XII వ శిలాశాసనము


(రానున్న "వేద బాహ్యులు" పుస్తకం నుంచి)


బొల్లోజు బాబా

Wednesday, March 13, 2024

ఆ గుడిలో దేవుడు లేడు – రవీంద్రనాథ్ టాగూర్

ఆ గుడిలో దేవుడు లేడు – రవీంద్రనాథ్ టాగూర్
.
“ఆ గుడిలో దేవుడు లేడు” అన్నాడు సన్యాసి
రాజుకు కోపం వచ్చింది
“లేడా! ఓ సన్యాసి, నువ్వు నాస్తికుడివా?
రత్నాలు పొదిగిన పీఠంపై బంగారు విగ్రహం
కాంతులు చిమ్ముతోంది
అదంతా ఖాళీగ ఉందని అంటావా?

“అది ఖాళీ కాదు; బదులుగా నీ రాజగర్వంతో నిండి ఉంది
అక్కడ దేవుడిని కాదు నిన్ను నువ్వు ప్రతిష్టించుకొన్నావు” సన్యాసి అన్నాడు.

రాజు ముఖం చిట్లించి “ అంబరాన్ని తాకే  ఈ గొప్పనిర్మాణంపై
ఇరవై లక్షల బంగారు నాణేలు చల్లాను,
అవసరమైన ఆగమసంబంధ పూజలు చేసి దేవతలకు సమర్పించాను
అంతగొప్ప దేవాలయంలో దేవుడు లేడని నువ్వు ఎలా చెప్పగలవు?

ఆ సన్యాసి ప్రశాంతంగా సమాధానం చెప్పాడు
“మీ ప్రజలలో రెండుకోట్లమంది 
ఘోరమైన కరువుతో బాధపడిన సంవత్సరం;
ఆకలితో ఆశ్రయం కొరకు నీవద్దకు వచ్చి, వెళ్ళగొట్టబడ్డారు,
రోడ్లపక్క, అడవులలో, శిథిల ఆలయాలలో వారు ఆశ్రయం వెతుక్కొన్నారు
అదే సంవత్సరంలో నీవు ఈ గొప్ప ఆలయ నిర్మాణానికి 
ఇరవై లక్షల బంగారు నాణాలు ఖర్చుచేసినపుడు
ఆ రోజునే దేవుడు తన తీర్పు చెప్పాడు:
“నా నివాశం శాశ్వతదీపాలతో వెలుగుతుంది
సత్యం, శాంతి, దయ, ప్రేమ లాంటి విలువలే పునాదులు.
తన స్వంత ప్రజలకు ఆశ్రయం కల్పించలేకపోయిన 
ఈ పిసినారి నిరుపేద రాజు నిజంగా నాకు ఇల్లు ఇవ్వగలనని 
అనుకొంటున్నాడా?”

ఆ రోజే దేవుడు  నీ దేవాలయం విడిచి వెళ్ళిపోయాడు
రోడ్డుపక్కన, చెట్ల క్రింద ఉన్న పేదల వద్దకు చేరాడు.
సముద్రపు నురుగ వలే నీ దేవాలయం ఖాళీగా ఉంది

కోపంతో రాజు అరిచాడు
“ఈ పిచ్చివాడిని నా రాజ్యం నుంచి బహిష్కరించండి”

సన్యాసి ప్రశాంతంగా బదులిచ్చాడు
“దైవాన్ని బహిష్కరించిన చోటునుంచి
భక్తులను కూడా బహిష్కరించండి”

మూలం: There is No God in that Temple by Rabindranath Tagore, Deeno Daan 1900.
అనువాదం: బొల్లోజు బాబా

Wednesday, March 6, 2024

ద్వారక గ్రాఫిక్స్

ఇటీవలి ద్వారకా పేరుమీద వచ్చిన ఒక వీడియో చూసి నిజంగా సముద్రగర్భంలో ఇన్ని నిర్మాణాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలిగింది. కొంచెం వెతకగా అవన్నీ ఫేక్ వీడియోలు, చిత్రాలు అని అర్ధమైంది.

 
అబద్దాలు పునాదులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. నిజానికి వీటిని ప్రచారంలో పెట్టేవారందరూ రాజకీయ ఐటి సెల్ ఉద్యోగులు కావొచ్చు. వాళ్ళకు ఇది జీతాలు ఇచ్చే వ్యాపకం. కానీ ఈ ఉచ్చులో సామాన్యులు, కాస్తో కూస్తో ఆలోచనకలిగిన విద్యాధికులు కూడా పడటం శోచనీయం.
ద్వారక ఒకనాటి గొప్ప అంతర్జాతీయ ఓడరేవు. అరవైయ్యవ దశకంలో అక్కడ తవ్వకాలు జరిగాయి. సముద్రగర్భంలో మానవనిర్మిత రాతిదిమ్మలు, గోడలతాలూకు రాతి ఇటుకలు లభించాయి. ఇవి ఓడరేవులో పడవలను కట్టటానికి ఉపయోగించే రాతి లంగరులుగా గుర్తించారు. (చూడుడు ఫొటో)
నేలపై జరిపిన తవ్వకాలలో 9 వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి ప్రతిమలు కనిపించాయి. బాగా లోతుగా చేసిన తవ్వకాలలో క్రీస్తుపూర్వపు రెండువేలకు చెందిన కుండపెంకులు లభించాయి. ఇంతకు మించిన పురోగతి లేదు.
 
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫొటోలు గ్రాఫిక్ వి. మోసపూరితమైన ఒక నేరేటివ్ ని నిర్మించటానికి సృష్టించినవి.

ద్వారక సముద్రగర్భ పురావస్తుశోధనలో పాల్గొన్న శ్రీ పుట్టస్వామి గుడిగర్ అనే శాస్త్రవేత్త - సోషల్ మీడియాలో, న్యూస్ చానెల్స్ లో ప్రచారం అవుతున్న ద్వారకా ఫేక్ ఫొటోలు వీడియోల పట్ల ఇలా అన్నారు--

"మాతవ్వకాలలో ఏరకమైన ఆలయ శిథిలాలు కనిపించలేదు. ఈ దేశం అబద్ధాల ఊబిలో కూరుకుపోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం మరింత దారుణంగా ఉంది".
 
బొల్లోజు బాబా






Saturday, March 2, 2024

మహాగురువు శ్రీ యర్రోజు మాధవాచార్యులు



జీవిత విశేషాలు

శ్రీ యర్రోజు మాధవాచార్యులు 1913, అక్టోబరు 22 న కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. వీరి తండ్రి శోభనాద్ర్యాచార్యులు, తల్లి రుక్మిణమ్మ. శోభనాద్ర్యాచార్యులు వేదపండితులు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉండేది. వీరు నూజివీడు జమిందారీలో స్వర్ణకార కులవృత్తిని నెరిపారు. మాధవాచార్యులుగారికి చిన్నతనంలోనే తండ్రిగారు గతించటంతో తల్లి రుక్మిణమ్మ గారి పెంపకంలోనే పెరిగారు. వీరి బాల్యం, ప్రాధమిక విద్యాభ్యాసం అంతా నూజివీడులోను, పిదప గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లోను తమ చదువు కొనసాగించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బిఎ. హానర్స్ పట్టా పొందారు.

శ్రీ మాధవాచార్యులు గుడివాడ ఎ.ఎన్.ఆర్ కళాశాలలో ఓరియంటల్ లాంగ్వేజెస్ శాఖాధిపతిగా 1950 నుండి 1966 వరకు పనిచేసారు. శ్రీ రాజా రంగయ్యప్పారావు పాఠశాలలో తెలుగు పండితునిగా సేవలందించారు. తరువాత కొంతకాలం నూజివీడు ధర్మప్పారావు కళాశాల తొలి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంతంలోని సాహిత్య, కళా రంగాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ఎందరో కళాకారులకు ఒక వేదిక కల్పించి వారిలోని ప్రతిభను పదిమందికి తెలిసేలా చేసేవారు. అలా గుడివాడలో రచయితల సంఘం, కృష్ణరాయ కళాసమితి మొదలైన సాంస్కృతిక సంస్థలు ఏర్పడటానికి దోహదపడ్డారు. గుడివాడలో కవిరాజ కళాభవనం నిర్మించటంలో వీరిపాత్ర ఎంతో ఉన్నది.[1] శ్రీ మాధవాచార్యులు గుడివాడలో ఉండగా- కోడూరు అచ్చయ్య, తుమ్మలపల్లి కామేశ్వర రావు, కఠారి సత్యనారాయణరావు, జి.ఎస్.ఆర్ ఆంజనేయులు, శ్రీమతి పువ్వుల అనసూయ, శ్రీ నెరుసు వీరాస్వామి లాంటి ప్రభృతులతో కూడి గుడివాడ కళాసమితి అనే సంస్థ ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలను,[2] ఎందరో లబ్దప్రతిష్టులతో సాహిత్య సభలు, అవధానాలను ఏర్పాటు చేసారు.

సాహిత్య కృషి

శ్రీ మాధవాచార్యులు మఘవలయము, ప్రతిమా శంబూకము, మణి ప్రవాళము, భువన విజయము, ముక్కోటి, వ్యాసాలు-ఉపన్యాసాలు వంటి వివిధ రచనలు గావించి గొప్ప కీర్తి నార్జించారు.

“మఘవ లయము” అను పద్యకృతిని ఆనాటి కళలు ఎక్సైజ్ శాఖా మంత్రి అయిన రాజా రంగయ్యప్పారావు బహద్దరు కు 1965లో అంకితమిచ్చారు

“మఘవ” అనేది మహా ఘనత వహించిన అనే వాక్యానికి సంక్షిప్తనామం. నిజాం అధినేత మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు బ్రిటిష్ ప్రభుత్వం హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదు ఇచ్చింది. దీనిని తెలుగులో “మహా ఘనత వహించిన” అని వ్రాసేవారు. 1930 ల ప్రాంతంలో నిజాం రాజును వ్యంగ్యంగా సంబోధించటానికి మఘవ అని పిలిచేవారు మఘవ లయము అంటే మహాఘనత వహించిన నిజాం రాజుయొక్క అధికార లయము (నాశనము) అని సంకేతార్ధము.

నిజాం రాజ్యాన్ని స్వతంత్ర్యభారతావనిలో విలీనం చేయటానికి జరిపిన భారతప్రభుత్వ పోలీసు చర్య ఈ మఘవలయ కావ్య వస్తువు. ఈ కావ్యంపై గోల్కొండ పత్రికలో వచ్చిన ఒక సమీక్షలో- యర్రోజు మాధవాచారి శైలి విశ్వనాథ సత్యన్నారాయణ రచనా పోకడలతో ఉన్నదని సమీక్షకుడు అభిప్రాయపడ్డాడు[3].

దుష్టుడైన ఒక వ్యక్తి నిజాం రజాకార్లతో కలిసి చెడు వర్తనుడై ప్రజలను పీడిస్తుండగా, అతని సోదరుడే అతనిని చంపివేయటం మఘవలయ కావ్యాంశము. ఈ కావ్యంలో శ్రీ మాధవాచార్యులు ఎంతో ధైర్యంగా రజాకార్ల కోపాగ్నికి గురికావచ్చునేమోనని కూడా ఆలోచించక, ఆనాడు రజాకార్లు హిందువుల పట్ల, వారి ప్రార్ధనాలయముల పట్ల జరిపిన అత్యాచారములను ఎంతో వేదనతో ఇలా వర్ణించారు. ఇవి ఆనాటి పరిస్థితులను కళ్ళకు కడతాయి.


//దివ్యస్థలంబుల దేవాలయంబుల| మధుమాంస దుర్గంధమయ మొనర్చి

విగ్రహంబుల నెల్ల విధ్వంసనము చేసి| మూత్రాభిషేకాల ముంచి యెత్తి

భూషణాదుల దొంగపోటుగా హరించిన| వాహనాలెక్కి సవారిచేసి

చేదికందినవారి సిగలెల్ల గొరిగించి| యుపవీతముల మొలకుచ్చుపోసి

యర్చకస్త్రీల గర్భాలయముల బట్టి| చెప్పరానట్టి విధముల జెఱచి చెఱచికఱకు

గుండెలు రూపులు తిరుగు మొఱకు|రక్కసుల రాజ్యమైపోయె నక్కట కట|

అయ్యవార్లనదల్సి రొయ్యలు దినిపించి|నిష్టాగరిష్టులనిచ్చి సున్తీచ్చేసి కుచ్చుటోపీలు పెట్టి మతము మార్చినారు........ అంటూ దుఃఖపడుతూ ఆనాటి హిందువుల నిస్సహాయ పరిస్థితులను, రజాకార్ల దుష్ట చేష్టలను చరిత్రలో నిక్షిప్తం చేసారు శ్రీ యర్రోజు మాధవాచార్యులు. ఇది వీరు నిర్వహించిన ఒక చారిత్రిక బాధ్యతగా నేడు గుర్తించవచ్చును.

అలాంటి క్రూరపరిస్థితులనుండి నిజాం రాజ్యాన్ని విడిపించి ప్రజలకు విముక్తికలిగించిన సర్ధార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలను మాధవాచార్యులు ఈ విధంగా స్తుతించారు


వల్లభాయి పటేలు మేధా విభవ ప్రయోగ సముదారుడ’యి

చేసిన వీర కార్యము ఫలితము త్రిలింగ విషయాభ్యుదయారున

కాంతి పూరమైనది. ఇది ఫలోదయము [4]//

***

రామాయణంలోని శంబుకవధ ఘట్టంలోని ఔచిత్య, అనౌచిత్యాలను తాత్వికంగా చర్చించిన కావ్యం ప్రతిమా శంబూకము. భువన విజయము ఏకాంకిక నాటిక.

మాధవాచార్యులు జానపద వాజ్ఞ్మయం పై పి.హెచ్.డి చేసి సమర్పించటానికి రైలులో వెళుతుంటే రజాకార్ల ఉద్యమసమయంలో జరిగిన అల్లర్లలో సూట్ కేస్ పోవటంతో ఆ పరిశోధన తాలూకు పత్రాలను పోగొట్టుకొన్నారు. అలా డాక్టరేట్ ను మిస్ అయ్యారు. ఆ లోటు తీర్చుకోవటం కొరకు ఉద్యోగవిరమణ అనంతరం హానరరీ ఫెలోషిప్ తీసుకొని “మేకా రాజా రంగారావు అప్పారావు – జీవిత చరిత్ర” అనే పరిశోధనా గ్రంధాన్ని రచించారు[5].

శ్రీ మాధవాచార్యులు గొప్ప వాక్పటిమ కలిగిన ఉపన్యాసకులు. ఆకాశవాణిలో తెలుగు సాహిత్యంపై అనేక ప్రసంగాలు చేసారు. ఈ రేడియో ఉపన్యాసాలను ఇంకా మరికొన్ని వ్యాసాలను కలిపి “వ్యాసాలు-ఉపన్యాసాలు” పేరుతో పుస్తకరూపంలో వెలువరించారు.


మహా గురువు బిరుదు ప్రధానం

మలేషియా ఆంధ్రసంఘం వారు మాధవాచార్యులను మలేషియా ఆహ్వానించారు. వీరు అక్కడ ఒక నెలరోజుల పాటు తెలుగు సాహిత్యం గురించి వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వీరికి మలేషియా ఆంధ్రసంఘం వారు “మహా గురువు” అనే బిరుదును ఇచ్చి గొప్పగా సత్కరించారు

సామాజిక సేవ

మాధవాచార్యులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942 లో బొంబాయిలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలకు తెలుగు ప్రతినిధిగా హాజరయ్యారు. స్వాతంత్ర్యానంతరం కూడా కాంగ్రెస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ- వితంతు పునర్వివాహం, అనాధప్రేత సంస్కారము లాంటి వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.

నూజివీడు జమిందారు కుమారరాజాగా ప్రసిద్ధిచెందిన మంత్రివర్యులు శ్రీ మేక రంగయప్పారావు గారితో యర్రోజు మాధవాచార్యులకు ప్రగాఢమైన స్నేహానునుబంధం ఉండేది. తన మఘవలయం కావ్యాన్ని కుమారరాజా గారికి అంకితం ఇచ్చారు. మాధవాచార్యుల ప్రోత్సాహంతోనే 1966లో శ్రీ కుమారరాజా వారు నూజివీడులో ధర్మప్పారావు కళాశాల నెలకొల్పారు[6]. ఇది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి నడుస్తూ ఉన్నది.

***

ఆంధ్రనాటక కళాపరిషత్తు 1929లో స్థాపించబడింది. 1944 లో దీనిని పునర్వవస్థీకరించే వరకూ పెద్దగా చెప్పుకోదగిన కృషి కాని తెలుగు నాటకరంగ అభివృద్ధికాని జరగలేదు. అలా ఆంధ్ర నాటక కళాపరిషత్తును పునర్వవస్థీకరించిన పెద్దలలో శ్రీ రాజా రంగయ్యప్పారావు, శ్రీ యర్రోజు మాధవాచార్యులు, కాజ వెంకట్రామయ్య, దుక్కిపాటి మధుసూదనరావు తదితరులు ముఖ్యులు. వీరందరూ పరిషత్ నిర్వహణ బాధ్యత వహించి, ఒక నియమావళిని ఏర్పరచి పరిషత్తు నిర్విఘ్నంగా, సమర్ధవంతంగా పనిచేయటానికి దోహదపడ్డారు. వీరిలో మాధవాచార్యులు క్రియాశీలకపాత్ర పోషించించారు. అప్పటినుంచి ప్రతిఏటా నాటకపోటీలు జరపటం ఆంధ్రదేశంలోని నాటకసంఘాలలో గొప్ప ఉత్తేజాన్ని, చైతన్యాన్ని నింపింది.

ఆంధ్ర నాటక కళాపరిషత్తు కార్యవర్గ కమిటీలో మాధవాచార్యులు వివిధ హోదాలలో దాదాపు 1944 నుంచి మూడు దశాబ్దాలపాటు పని చేసి తెలుగు నాటకరంగానికి తమ విశిష్టమైన సేవలను అందించారు. పలు నాటక పోటీలను నిర్వహించటం, నటులను ప్రోత్సహించటం, ప్రతిభకలిగినవారిని సన్మానించటం[7] లాంటి పనులద్వారా ఎంతో మంది ప్రతిభావంతులను సినీ నాటకరంగాలకు పరిచయం చేసారు. అలా ఈ పరిషత్తు ద్వారా వెలుగులోకి వచ్చిన రచయితలలో ఆచార్య ఆత్రేయ, భమిడిపాటి రాధాకృష్ణ, డి.వి. నరసరాజు, పినిశెట్టి, బెల్లంకొండ రామదాసు, కొండముది గోపాలరాయ శర్మ తదితరులు; నటులలో ఎన్.టి. రామారావు, రమణమూర్తి, మిక్కిలినేని, జగ్గయ్య, రావికొండలరావు, చదలవాడ, వల్లం నరసింహరావు లాంటివారు ముఖ్యులు[8].

మాధవాచార్యులు పంతొమ్మిది వందల అరవైలలో ఆంధ్రప్రదేష్ సంగీత నాటక అకాడెమీ కి మెంబరుగా తమసేవలందించారు. [9]

విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ వ్యవస్థాపన

విశ్వబ్రాహ్మణ వంశీయులకు ధర్మప్రభోదం చేయటానికి, సంఘీయులకు చేయూతనీయటం కొరకు శ్రీ మాథవాచార్యులు 1974 లో వ్యవస్థాపక సభాపతిగా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ను స్థాపించారు. దురిశేటి వెంకటరామాచార్యులు, కొండూరి వీరరాఘవాచార్యులు సంచాలకులుగా వ్యవహరించారు. ఈ సంస్థ నేటికీ గొప్ప గణనీయమైన సేవలందిస్తున్నది[10].

***
రచయితగా, సాంస్కృతిక సేవకునిగా, కళాపోషకునిగా, సంఘసేవకునిగా తన జీవితాన్ని సమాజానికి అర్పించుకొన్న శ్రీ యర్రోజు మాధవాచార్యులు 1983, ఆగస్టు 31 న నూజివీడులోని తమ స్వగృహంలో పరమపదించారు. తెలుగు నేలకు సంబంధించిన సాహిత్య, కళా విద్యారంగాలలో వీరి పాత్ర గణనీయమైనది.
బొల్లోజు బాబా

కాకినాడ









[1] గుడివాడ వైభవం, తాత రమేష్ బాబు పే.నం. 73


[2] ఆంధ్రజ్యోతి దినపత్రిక 11, ఆగస్టు 1964, పేనం. 5


[3] రి. గోలకొండ పత్రిక 12-12-1965


[4] ఉద్యమ దర్శనము, శ్రీ ముదిగొండ శివప్రసాద్. పే.నం. 334


[5] శ్రీ యర్రోజు మాధవాచార్యులు గారి కుమార్తె శ్రీమతి కల్యాణి గారు, వారి బంధువులైన ప్రొ. డా. నూతలపాటి శ్రీనివాస్ గారు ఈ వ్యాసరచనా సమయంలో అమూల్యమైన సమాచారాన్ని అందించారు.


[6] పుష్కర కృష్ణ, కృష్ణాపుష్కర విశేష సంచిక 2016, పేనం. 112


[7] విశాలాంధ్ర, దినపత్రిక 3-5-1964 , పేనం. 6


[8] ఆధునిక నాటకరంగం ఈ దశాబ్ది ప్రయోగాలు by బోయిన వెంకటేశ్వర రావు. పే.నం.317-318. అదృష్టవంతుని ఆత్మకథ, డి.వి. నరసరాజు స్వీయ చరిత్ర, పే.నం. 148


[9] The Andhra Pradesh Legislative Asbembly Debates, official Report 15th July, 1967


[10] విశ్వబ్రాహ్మణ సర్వస్వము-విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రధమ భాగము), శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు, పేనం. 288