Wednesday, March 13, 2024

ఆ గుడిలో దేవుడు లేడు – రవీంద్రనాథ్ టాగూర్

ఆ గుడిలో దేవుడు లేడు – రవీంద్రనాథ్ టాగూర్
.
“ఆ గుడిలో దేవుడు లేడు” అన్నాడు సన్యాసి
రాజుకు కోపం వచ్చింది
“లేడా! ఓ సన్యాసి, నువ్వు నాస్తికుడివా?
రత్నాలు పొదిగిన పీఠంపై బంగారు విగ్రహం
కాంతులు చిమ్ముతోంది
అదంతా ఖాళీగ ఉందని అంటావా?

“అది ఖాళీ కాదు; బదులుగా నీ రాజగర్వంతో నిండి ఉంది
అక్కడ దేవుడిని కాదు నిన్ను నువ్వు ప్రతిష్టించుకొన్నావు” సన్యాసి అన్నాడు.

రాజు ముఖం చిట్లించి “ అంబరాన్ని తాకే  ఈ గొప్పనిర్మాణంపై
ఇరవై లక్షల బంగారు నాణేలు చల్లాను,
అవసరమైన ఆగమసంబంధ పూజలు చేసి దేవతలకు సమర్పించాను
అంతగొప్ప దేవాలయంలో దేవుడు లేడని నువ్వు ఎలా చెప్పగలవు?

ఆ సన్యాసి ప్రశాంతంగా సమాధానం చెప్పాడు
“మీ ప్రజలలో రెండుకోట్లమంది 
ఘోరమైన కరువుతో బాధపడిన సంవత్సరం;
ఆకలితో ఆశ్రయం కొరకు నీవద్దకు వచ్చి, వెళ్ళగొట్టబడ్డారు,
రోడ్లపక్క, అడవులలో, శిథిల ఆలయాలలో వారు ఆశ్రయం వెతుక్కొన్నారు
అదే సంవత్సరంలో నీవు ఈ గొప్ప ఆలయ నిర్మాణానికి 
ఇరవై లక్షల బంగారు నాణాలు ఖర్చుచేసినపుడు
ఆ రోజునే దేవుడు తన తీర్పు చెప్పాడు:
“నా నివాశం శాశ్వతదీపాలతో వెలుగుతుంది
సత్యం, శాంతి, దయ, ప్రేమ లాంటి విలువలే పునాదులు.
తన స్వంత ప్రజలకు ఆశ్రయం కల్పించలేకపోయిన 
ఈ పిసినారి నిరుపేద రాజు నిజంగా నాకు ఇల్లు ఇవ్వగలనని 
అనుకొంటున్నాడా?”

ఆ రోజే దేవుడు  నీ దేవాలయం విడిచి వెళ్ళిపోయాడు
రోడ్డుపక్కన, చెట్ల క్రింద ఉన్న పేదల వద్దకు చేరాడు.
సముద్రపు నురుగ వలే నీ దేవాలయం ఖాళీగా ఉంది

కోపంతో రాజు అరిచాడు
“ఈ పిచ్చివాడిని నా రాజ్యం నుంచి బహిష్కరించండి”

సన్యాసి ప్రశాంతంగా బదులిచ్చాడు
“దైవాన్ని బహిష్కరించిన చోటునుంచి
భక్తులను కూడా బహిష్కరించండి”

మూలం: There is No God in that Temple by Rabindranath Tagore, Deeno Daan 1900.
అనువాదం: బొల్లోజు బాబా

3 comments:

  1. -

    దేవుడు లేడా గుడిలో
    కైవల్యమునకు తపించక బలిమి చూపన్
    నీవద్దాని సృజింపం
    గా! విభుడెచట కనరాడొ కలదో మివులున్‌?



    ReplyDelete
  2. -
    దేవుడు లేడా గుడిలో?
    కేవల మెచటో కలడనకే కల డాతం
    డావల నీవల విశ్వ
    మ్మే వునికియతనిది సకల మేయతనిదిగాన్



    ReplyDelete