Sunday, October 30, 2016

కొత్త డైరీ నుంచి ఒక పేజీ A page from the New Diary by Nida Fazli

కొత్త డైరీ నుంచి ఒక పేజీ  A page from the New Diary by Nida Fazli

కాగితపు కాలెండరులో  మాత్రమే
తారీఖు మారింది
స్టీలు బెల్టు  డయల్ లో కాలం
ముందుకు కదిలింది

బొమ్మ గడియారంలోని
బొమ్మ తన ఇంటిని దాటుకొని
బయటకు వచ్చి
గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేసింది
చప్పట్లు నవ్వులు
దృశ్యాన్ని అలంకరించాయి

గెంతులేస్తున్న జింకపిల్ల
ఆయాసపడుతూ ఆఖరి బస్సు
నల్లటైర్ల క్రిందకు త్రుళ్ళిపడి
ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది

నేను ఏదైతే భయపడ్డానో
సరిగ్గా అదే జరిగింది ఈరోజు
ఈరోజు కూడా మళ్ళీ  అదే.
అంతే అంతకు మించేం జరగలేదు.

From urdu to English by Baidar Bakht
తెలుగు అనువాదం  - బొల్లోజు బాబా

Saturday, October 29, 2016

సలాములు (Salutations by Shanmukha Subbaih)

నా చిన్నప్పుడు బుర్రమీసాలు, కోరమీసాలతో చాలామంది వ్యక్తులు కనిపించేవారు.  రాజసానికో, ఆత్మవిశ్వాసానికో ప్రతీకగా ఉండేవి పైకితిప్పిన మీసాలు.  ఇప్పుడు కోర మీసాలు కలిగిఉండటం వాటిని మేలేసుకొంటూ తిరగటం వంటివి  పురా జ్ఞాపకాలు

మీసానికీ పౌరుషానికి ఉన్న కల్చరల్ లింక్ తెగిపోయింది.  బహుసా దీనికి కారణం మారిన అభిరుచులకంటే కూడా మెజారిటీ ప్రజలు స్వావలంబనను కోల్పోయి ఎవరో చేతికింద ఉద్యోగిగా బ్రతకాల్సిన ఆధునిక జీవనమేమోనని అనిపిస్తూంటుంది.

అజంతా కవిత్వంలో కనిపించే భీతావహత్వానికి ఆధునిక నగరజీవనమే ఆలంబన.  అతివినయం  అదనపు చేరిక.

జీవితాన్ని ఇలాకూడా నిర్వచించవచ్చా అని ఆశ్చర్యం కలిగించింది ఈ కవిత.

సలాములు (Salutations by Shanmukha Subbaih)

అవును అవును
నిజానికి నేను అదృష్టవంతుడిని
దేవుని దయవల్ల
నాకిద్దరు పిల్లలు
ఆశ్చర్యంగా
ఇద్దరూ అబ్బాయిలే

ఇంకా
నాకు కీళ్ళనొప్పులు
నా భార్య రోగిష్టిది
పెద్దాడికి పాపం
ఎప్పుడూ ఏదో నలత
చిన్నాడు ప్రస్తుతానికి
పరవాలేదు
కానీ రేపెలా ఉంటాడో
ఎవరికి తెలుసు?

నేను గుమస్తాని
ఇవి చాలా?
ఇంకా వివరాలేమైనా
కావాలా?

(Translated from Tamil by T.K. Doraiswamy)

అనువాదం-బొల్లోజు బాబా

Friday, October 28, 2016

బహుళత్వం


అందరూ సమానమే అన్న
ప్రాతిపదికన ప్రయాణం మొదలెడతాం
ఒకే బాటగుండా వచ్చినందుకు.
కొంతకాలం గడిచాకా
నిన్నూ నన్ను విడదీస్తున్న
తెరలేవో లీలగా తెలుస్తూంటాయి.
నువ్వెవరైతే నాకేంటి
ఇద్దరి రక్తాలు ఒకటే ఆకాశం కదా అంటూ
వాదిస్తాను ఒకానొక ఉద్విగ్న క్షణంలో
నీళ్లను వేరుచేస్తుంది హంస
దాని తూలికల అంచులవెంబడి
రక్తం బొట్లు బొట్లుగా ........
చివరకు
నువ్వు నీ నువ్వుగా, నేను నా నేనుగా
స్పష్టమౌతాం
బొల్లోజు బాబా

Saturday, October 22, 2016

రెండు పదుల దక్కనీ ఘోష!

సిద్దార్థ 1994 లో “దీపశిల” తో తెలుగు సాహితీలోకానికి వచ్చి “దీపశిల సిద్దార్థ” గా పేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడు తన ఇరవై సంవత్సరాల కవిత్వాన్ని ఒకచోటకు చేర్చి ‘బొమ్మలబాయి’ పేరుతో సంపుటిని తెచ్చారు. సిద్దార్ధ కవిత్వంలో – గొప్పజీవన కాంక్ష, ఆదిమ సౌందర్యం, వలస దుఃఖం, గ్రామ్యజీవనం వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. ఇప్పుడు వస్తున్న కవిత్వ తీరులకు పూర్తి భిన్నంగా ఉంటూ చదువరులకు సరికొత్త పఠనానుభవాన్ని కలిగిస్తుంది.
ప్రముఖ మళయాలి కవి సచ్చిదానందన్ “కవిత్వానికి సమాంతర భాష కావాలి” అంటారు. అంటే – కవిత్వంలో వాడే పదాలు తమ మామూలు అర్థాల్ని వదిలి వేరే విశిష్టార్థాల్ని ధ్వనించాలని, వాక్యాలు ఒట్టి వాచ్యంగా ఉండకుండా భిన్న పొరలలో ఒక అనుభవాన్ని దర్శింపచేయాలని ఆయన ఉద్దేశం. అలాంటి కవిత్వంలో పదాల అర్ధాలు క్రమక్రమంగా అదృశ్యమై మనోద్వేగం (Emotion) మాత్రమే మిగుల్తుంది. పదాలు అర్ధాల్ని వీడి ఉద్వేగాన్ని తొడుక్కొంటాయి. ఏ ఉద్వేగానికి కవి లోనై ఆ కవితను సృజించాడో అది యధాతధంగా స్పష్టంగా దర్శనమిస్తుంది. “సమాంతర బాష” అని సచ్చిదానందన్ అన్నది అలాంటి కవిత్వభాష గురించే. ఇది ఉత్తమోత్తమ కవిత్వాభివ్యక్తి.
తెలుగు సాహిత్యలోకంలో సమాంతరభాషలో కవిత్వం వ్రాసే అతికొద్దిమందిలో సిద్దార్థ ఒకరు.
కురిసిన వానలన్ని ఏమయిపొయ్యాయి
పక్కటెముకల ఎద్దూ ఆకాశమూ
ముచ్చటించుకొంటున్నాయి
భూమిపొరల్లో దొరికిన వొకడి అస్థిపంజరం గురించి
అందులో పడుకుని నిద్రిస్తూన్న
పచ్చచిలుక దేహం గురించి—- “వానలు సిప్తల వనాలు” అనే కవిత ఒక భయంకరమైన కరువును సమాంతర భాషలో దృశ్యమానం చేస్తుంది. ఆ అస్థిపంజరం రైతుది కావొచ్చు, అతనిలో నిద్రిస్తున్న పచ్చచిలుక అంటే అతను జీవితకాలమంతా ఎదురుచూసిన పచ్చదనం అవ్వొచ్చు. ఇక్కడ పదాల అర్ధాలు అదృశ్యమై వాక్యాలు కరువుకాలపు ఉద్వేగాల్ని ఆవిష్కరిస్తాయి.
‘బొమ్మలబాయి’ లో కనిపించే అనేక దేశీపదాలు, ప్రయోగాలు జానపద సాహిత్యరూపానికి దగ్గరగా ఉంటాయి. సమకాలీన కవిత్వరీతులతో పోల్చితే ఇది ఒక భిన్నమైన స్వరం. బండమైసమ్మ, గట్టుమైసమ్మ, ఒగ్గుకథలు, బాలసంతు, పెద్దలకు బియ్యాలివ్వటం, శివసత్తు, ప్రభలు, మల్లన్న, గండెమ్మ, జోగిని, చిందెల్లమ్మ వంటి వివిధ విషయాలు, ఒక ప్రాంత సంస్కృతికి, ఆధునీకరణ పేరుతో మార్జినలైజ్ అవుతున్న జీవనరీతులకు ప్రతీకలు. వీటిని స్మరించుకోవటం, అక్షరాలలో పదిలపరచటం నేటి కాలానికి చాలా అవసరం. సిద్దార్థ తన కవిత్వం ద్వారా ఆపని చేసినట్లు బొమ్మలబాయి నిరూపిస్తుంది.
సిద్దార్థ కవిత్వం నిండా పల్లెదనం ఉంది. అక్కడ గడిపిన బాల్యం ఉంది. ఖేదమో మోదమో అర్ధంకాని ఆధునిక జీవనముంది. తనకలలకు, జ్ఞాపకాలకు వారధిగా నిలిచి తనలోకి కవిత్వప్రవాహాల్ని ఒంపిన మహా నగరముంది.
సీమసింతకాయ నవ్వినట్టు
నల్లతుమ్మ పువ్వు పసుపై రాలినట్టు
తనకడియాల దరువులో కాలమంతా పొగిలినట్టు -(బుశ్శెడ) అంటూ పల్లె సౌందర్యాన్ని కళ్లకుకడతాడు.
సిటీ కదులుతూంటే
ఎటుతిరిగినా వొక బరువుంటుంది
నన్ను నాకుతూనే వుంటుంది
వలసపోవటం ఎంత నరకం
నా గూడుకు నేనే కిరాయి కడుతున్నాను -(సింగాడ) అంటూ నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని పట్టుకొంటాడు.
బాకీ మొత్తం/అతివాస్తవం
వొక మల్టిమీడియా బ్లూ సరస్సు
దానిపైని ఫ్లైవోవరు
పేగును కొరికే కరెంటు బిల్లు
కుత్కెలోపల వంకరగా దిగిన రేగుముల్లు// -(కర్రెసామీ జంగపోడా) వాక్యాలలో నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు. ఫ్లైవోవర్లు, హైటెక్ సిటీలతో అందంగా కనిపించినా, తీర్చాల్సిన అప్పులు, కరంటుబిల్లు కట్టలేనితనం, మహాకవి కాళోజీ “ఏం తినేట్టు లేదు, ఏం తాగేట్టు లేదు” అన్నట్టు గొంతులో దిగిన ఆకలిముల్లు….. అని ఒకానొక భీభత్స దృశ్యాన్ని చూపిస్తాడు చిన్న చిన్న పదాలలో. సిద్దార్థ కవిత్వగొప్పతనం అది.
అజంతా కవిత్వంలో పదే పదే వచ్చే భయం- రాక్షసాకారం దాల్చి రక్తం పీల్చే మహానగరం పట్ల భయకంపితుడైన వ్యక్తి వైయక్తిక అనుభవంలా అనిపిస్తుంది అంటారు నున్నా నరేష్ ఒక మిసిమి పత్రికా వ్యాసంలో. ‘బొమ్మలబాయి’ లో కూడా భయం, ఒక భీతావహ వాతావరణం అనేక కవితల్లో కనిపిస్తుంది. కానీ ఇది వైయక్తిక అనుభూతిగా కాక ఒక సామాజిక ప్రకటనలా వ్యక్తమౌతుంది.
భయం తింటున్న జాతివాణ్నని
తిట్టూ తిట్టూ నాకేమీ సిగ్గులేదు//
నా భయమో పదిజిల్లాలంత వెడల్పూ
ఏడు సముద్రాలంత లోతూ. — అంటాడు (భయచరాన). ఇక్కడ పదిజిల్లాలు అనటం ద్వారా తన సమాజపు చారిత్రికనేపథ్యాన్ని ప్రతిభావంతంగా ప్రతిబింబించగలిగాడు సిద్దార్థ. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే మలిదశ తెలంగాణా పోరాట సాహిత్యం ఇంకా ఊపందుకోని కాలం లోనే (1999) సిద్దార్థ భవిష్యత్తుని దర్శించాడు. ఆ తరువాత కాలంలో విరివిగా వచ్చిన తెలంగాణ అస్థిత్వ సాహిత్యానికి సిద్దార్థ కవిత్వం చక్కని భూమికను ఏర్పరచిందనటంలో సందేహం లేదు.
సిద్దార్థ కవిత్వాన్ని ఓపికగా చదవాలి. ఏ వాక్యమూ వాచ్యంగా ఉండదు. అంతా ధ్వనిప్రధానంగా ఉంటుంది. ఆ వాక్యాన్ని మనోలోకంలో మరోసారి చదువుకొన్నప్పుడు ఏదో దృశ్యం కనిపిస్తుంది. దాన్ని అలా మనకు మనం ఏర్పరుచుకొన్నప్పుడు గొప్ప తృప్తి ఆనందం కలుగుతాయి. ఇది ఒకరకంగా
డీకోడింగ్ చేసుకోవటం లాంటిదే. ఆ కాస్త ప్రయత్నం చేయని/చేయలేని వారికి సిద్దార్థ కవిత్వం జఠిలంగా కన్పించవచ్చు. కవిత్వం రాయటంలో కవి పడే తపనతో పోల్చుకొంటే, పాఠకుడు కూడా ఎంతోకొంత శ్రమించకపోతే కవిత్వప్రయోజనం ఎలా దక్కుతుందీ?
కినిగె పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కవిత్వం అనేది నేచర్. నేను మీడియం మాత్రమే. మన చుట్టూతా ఉండే అనేకానేక శక్తులు మన మీద దాడి చేసి, మనల్ని ఎంచుకుని, ఒక మీడియంలా వాడుకుని వదిలేస్తాయి. అప్పుడు కవిత్వం పుడుతుంది” అంటారు శ్రీ సిద్దార్థ. ఈలోకంలో చెట్టు, పుట్టా రాయి రప్పా వాగు గుట్టా వాటి పనులు నిర్వహిస్తున్నట్లే నేనూ నా పని నిర్వహిస్తున్నాను అంటూ కవిత్వాన్ని ఒక ఒక సహజమైన స్వభావంలా భావించే శ్రీ సిద్దార్థ ‘బొమ్మల బాయి’ మంచి, చిక్కని కవిత్వాన్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. ఎందుకంటే ఇది స్పందించే హృదయమున్న కవి రెండు దశాబ్దాల జీవితపు కవితాయాత్ర.
పుస్తకం పేజీలు: 208
వెల: 150/-
ప్రతులకు: 9848015364
ఈ వ్యాసం సారంగ వెబ్ పత్రికలో ప్రచురింపబడింది

Wednesday, October 19, 2016

కవిత్వంలో కరుణరసం


"శృంగారే విప్రలంభాఖ్యే కరుణే చ్ ప్రకర్షవత్
మాధుర్య మార్ద్రతాం యాతియత స్తత్రాధికం మనః"
సంయోగశృంగారంలో కంటే విప్రలంభ శృంగారమునందు దానికంటే కరుణమునందు, మనసు ఆర్ధ్రత పొంది ఎక్కువ మాధుర్యాన్ని అనుభవిస్తుంది అని అర్థం.
అన్ని రసములలో కరుణరసము ఉత్తమోత్తమైనదని అంటారు. భవభూతి "కరుణరసం ఒక్కటే రసం, మిగిలిన రసాలన్నీ దాని భేదాలే" అని అంటాడు. ఆ తరువాత స్థానాలు విప్రలంబ శృంగారానికి, సంయోగ శృంగారానికి ఇవ్వబడ్డాయి.
ఇక్కడ శృంగారమంటే భౌతికమైనదే అవ్వక్కరలేదు, లౌకిక కాలుష్యము కాక శాంతిమయమైన ఆనందంగా కూడా భావించవచ్చు.
మరోలా చెప్పాలంటే ఈ మూడు రకాలను ఇలా కూడా అనుకోవచ్చు.
అనుకొన్న లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పే కవిత్వం (సంయోగ)
లక్ష్యాన్ని స్వప్నిస్తూ ఒకరకమైన విరహాన్ని అనుభవిస్తూ చెప్పే కవిత్వం (విప్రలంబ)
కవితా వస్తువు పట్ల సానుభూతి లేదా సహానుభూతిని వ్యక్తీకరిస్తూ కరుణరసార్థ్రంగా చెప్పే కవిత్వం. (కరుణ)
ఈ మూడు వర్గాలకు చెందిన మూడు కవితలను పరిశీలిద్దాం.
1.
ఉదయగీతం
దినం యవ్వనంతో ఉన్నవేళ
పెదవులు హృదయ రహస్యాల్ని
దాచలేవు.
జాజుల వాసనకు తనువు
సాంద్రరూపమౌతుంది.
ప్రణయ తేజం దేహాల్ని
ప్రకాశింపచేస్తూంటే,
జ్వలిస్తూ, దహిస్తూ,
తపిస్తూ, తరిస్తూ
వలపుల కొలిమిలో
జంటగా ద్రవించటం
సృష్టి రహస్య చామరం.
పై కవితలో ఓ ఉదయపు పూట శృంగారభావం ఉప్పొంగటం, జంటగా ద్రవించే సృష్టిరహస్య క్రియ చామరమై హాయినివ్వటం ధ్వన్యాత్మకంగా వ్యక్తమయింది.
2.
వస్తావా?
చీకటి దుప్పట్లో దూరి
దేహ దీపాల్ని
వెలిగించుకొందాం
రాత్రి హార్మోనియంపై
మోహపరిమళాల రాగాల్ని పలికిద్దాం
శీతవేళకు చిక్కకుండా
వేడి శ్వాసల్ని కప్పుకొందాం
ఒక సమాంతర కాలంలోకి
అనంతంగా ప్రవహిద్దాం
వస్తావా!
ఇక్కడ కలయిక కోసం స్వప్నించటం కనిపిస్తుంది. వియోగంలో ఉన్న హృదయం సంయోగాన్ని కోరుకొంటోంది. ఈ కవితలో వ్యక్తమయింది శృంగారేతరమైన తీవ్రమైన వాంఛగా కూడా అన్వయించుకోవచ్చు.
3.
పుట్టిన మూడునెలలకే కనుమరుగైన చిన్నారి శిశువు గురించి వ్రాసిన కవిత ఇది (కొంతభాగం)
//చిన్నప్పుడు గోటింబిళ్ళ ఆటకోసం
చిన్ని చిన్ని గోతులు తవ్వుకున్న మేము
ఈ చిన్నారి శిశువు కోసం తవ్విన గోతిని చూసి
వానలకు పైవర వరకు ఉబికొచ్చిన నూతి నీటిలా
దుఃఖం జీవితపు ఇంతపై పొరల్లోనే ఉంటుందనుకోలేదు
అంతా అయ్యాక తలో గుప్పెడు మట్టి వెయ్యమంటే
చేతులుండీ ఎవరికీ చేతులు రాలేదు
యింకా పిడికిలి విప్పని వాడి మీద
పిడికిలి మట్టి వెయ్యమని
క్రూరవిధి ఈ రోజు మమ్మల్ని శపించింది
చివరికి గుట్టపోసిన చిట్టి సమాధి మట్టిని
అటూ ఇటూ సర్దుతున్న నెపంతో
ఆ పెదనాన్న స్పృశిస్తున్నది
నిదురించిన ఆ చిన్ని ముద్దునేనని ఎందరికి తెలుసు?
నిన్నటిదాకా కేరింతలతో వాడూగిన ఉయ్యాల
ఈ రోజు తూర్పుగాలికి ఊరకనే వూగుతోంది
మా శూన్య హృదయాల్లాగే
ఎప్పటిలాగే
తెల్లవారు జామున
అలవాటుగా ఆ తల్లి బిడ్డకోసం
పక్కను తడిమితే
ఆమె ఖాళీచేతులను ఓదార్చే ధైర్యాన్ని ఎవరికుంది? (నిదురించిన చిన్నముద్దు- శిఖామణి)
కరుణ రసం చిప్పిల్లాలంటే కొంత మానసికవాతావరణాన్ని సిద్దం చేయాలి. అందుకు మూర్తచిత్రాల కల్పన అవసరమౌతుంది. అలా ఒక ఉద్విగ్న స్థితి ఏర్పడ్డాకా కవి ఒక్కో దృశ్యాన్ని విప్పుకొంటూ వస్తాడు. .
పై కవితలో చిన్నప్పటి గోటిబిళ్ల తవ్వుకొన్న గోతుల్ని చిన్నారికోసం తవ్విన పెద్దగా లోతులేని గోతితో పోల్చాడు కవి. దాన్ని తీసుకెళ్ళి మరలా వానాకాలంలో పైవరకూ వచ్చిన నూతి నీళ్ళతో పోలుస్తాడు. ఇక్కడ హృదయంలోంచి కళ్ళలోకి ఏదో దుఃఖప్రవాహం పెల్లుబుకుతున్నది అనే భావన అప్రయత్నంగానే పాఠకుని మదిలో స్పురిస్తుంది.
"పెదనాన్న/కవి స్పృశిస్తున్నది చిన్నిముద్దునే" అంటూ చెప్పిన ఆ పదచిత్రం, సాహిత్యంలో అత్యుత్తమ మూర్తభావచిత్రంగా కొనియాడబడే కాళిదాసు "గ్రీవాభంగాభిరామం........... శ్లోకం సరసన స్థానమీయదగ్గది.
ఆమె ఖాళీ చేతులను ఓదార్చే ధైర్యం ఎవరికుంది అంటాడు కవి. ఖాళీ జీవితం/హృదయం అనడు. ఆ వాక్యాలవద్ద సహృదయుని హృదయం ద్రవించకమానదు.
కరుణ రసాన్ని పండించటటానికి గొప్ప ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు కావాలి. లోతులేని వాక్యాలద్వారా కరుణరసం పలకదు.
"కరుణముఖ్యం" అని అందుకనే ఇస్మాయిల్ అన్నది . కరుణరసం ఉత్కృష్టమైనదిగా కొనియాడబడింది. ఉత్తమకవిత్వానికి చిరునామాగా నిలుస్తుంది ఎప్పటికీ.
బొల్లోజు బాబా

Saturday, October 15, 2016

హాలుని గాథాసప్తశతికి పొసగని వ్యాఖ్యానం

సెప్టెంబరు 26 వ తారీఖున ఆంధ్రజ్యోతి వివిధలో డా. జె. కనకదుర్గ గారు, గాథాసప్తశతి పై వ్రాసిన ఒక వ్యాసంపై నా స్పందన ఈ రోజు వివిధలో వచ్చింది. ప్రచురణకు తీసుకొన్నందుకు ఎడిటర్ గారికి, భావస్ఫోరక చిత్రాన్ని గీసిన అక్బర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.




పూర్తి అన్ ఎడిటెడ్ వెర్షన్ ఇది

గాథాసప్తశతిలో బాధా తప్తసతులు - ప్రాసబాగుంది కానీ పస లేదు   

గాథాసప్తశతి అంటే జనబాహుళ్యంలో పచ్చి శృంగారరాతలు అని అపప్రథ ఉంది. దీనికి ప్రధానకారణం కొంతమంది పండితులు ఆ గాథలలోని ప్రకృతి వర్ణణలకు కూడా  శృంగారపరమైన అన్వయాలు చేయటం కావొచ్చు. నిజానికి ఏడువందల గాథలూ అలా ఉండవు వాటిలో - ప్రకృతివర్ణణలు, దేవతల స్తుతి, అపురూపసౌందర్యవతుల, యువకుల అందాల వర్ణణలు, అన్యోన్యదంపతులమధ్య జరిగే సరససల్లాపాలు,  పల్లెజీవుల ప్రణయోదంతాలు, వివిధ జీవితానుభవాలు వంటి అనేక ఆనాటి సామాజికజీవన సామస్త్యపు భిన్న పార్శ్వాలెన్నో చిన్న చిన్న ఉదంతాలరూపంలో చెప్పబడ్డాయి.  రసాత్మకంగా, ధ్వని ప్రధానంగా చిక్కనికవిత్వంతో పొటమరిస్తూ ఉండటంచే కాలక్రమేణా  ఈ గాథలు లాక్షణిక గ్రంధకర్తలకు ఉదాహరణలుగాను, కాళిదాసు వంటి మహాకవులకు ప్రేరణగాను నిలిచాయి.    

“గాథాసప్తశతిలో బాధా తప్తసతులు” అనే పేరుతో డా. జె.కనకదుర్గ గారు  వ్రాసిన వ్యాసంలో   గాథాసప్తశతి లోని స్త్రీపురుష సంబంధాల అంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ,  అందులోంచి ఒక  స్త్రీవాద కోణాన్నొకదాన్ని లేవదీసారు.  సమకాలీన కళ్ళద్దాలు పెట్టుకొని పాత సాహిత్యాన్ని చూసినపుడు రంద్రాలు మాత్రమే కాదు కంకాళాలు కూడా కనిపిస్తాయనటానికి ఈ వ్యాసమొక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ వ్యాసాన్ని డా. జె కనకదుర్గ గారు అనేక అభూతకల్పనలు, విపరీత వ్యాఖ్యానాలు, ఊహకందని విషయాలతో నింపటం వల్ల- నేడు ఎవరైనా గాథాసప్తశతి అంటే అది "ఒకనాటి స్త్రీలు తమ బాధల్ని, వేదనలను, వ్యధలను వ్యక్తీకరించటానికి వ్రాసుకొన్న మహాగ్రంథంగా భావించే ప్రమాదం ఏర్పడింది.  

ఈ వ్యాస ప్రారంభంలో .... "నాటి శాతవాహన సామ్రాజ్యంలోని స్త్రీలు తమ భావోద్వేగాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోయి తోటి స్త్రీలతో పంచుకోవటం జరిగింది. // ఉద్వేగభరితులైన స్త్రీలు తమ మానసిక వ్యథను సహబాధితులైన తోటి మహిళలతో పంచుకొన్న ప్రయత్నాలే ప్రచారం పొంది రాజైన హాలుని చెవులకు సోకినట్లు అర్ధమౌతుంది".... అంటూ ఒక గొప్ప ఊహాజనిత సిద్దాంత ప్రాతిపదికను ఏర్పరచి,  దానిపై పేకమేడలాంటి వ్యాసాన్ని నిర్మించుకొంటూ పోయారు వ్యాసకర్త.   ఈ గాథలను వ్రాసిన గాథాకారులు ఎవరో తెలుసుకొంటే పై వాక్యాలు ఎంత అజ్ఞానంతో కూడుకొన్నవో తెలుస్తుంది.  

గాథాసప్తశతి లోని 700 గాథలలో 44 హాలుని విరచితములని, మిగిలినవి సుమారు మూడువందల మంది వివిధ గాథాకారులు రచించారని పండితులు నిర్ణయించారు.  వీరిలో పదిమంది మాత్రమే గాథా కవయిత్రులు ఉన్నారు.  వారి పేర్లు అణులచ్చి, అసులద్ది,  పహయా, భేజ్జా, మాధవి, రేవా, రోహా, వద్దావహీ, వోహా, నసిస్సహ.  ( పై లెక్కలలో చిన్నచిన్న బేధాభిప్రాయాలున్నా అందరూ స్థూలంగా అంగీకరించిన వివరాలవి)

ఇక ఆ పదిమంది గాధాకవయిత్రులు మొత్తం 16 గాథలు వ్రాసినట్లు తెలుస్తున్నది.  ఈ 16 గాథలను పరిశీలిస్తే వీటిలో 5 ప్రకృతి వర్ణణలు (నల్లని దున్నపోతును ఇంద్రచాపం తన మొనతో పొడిస్తే ఆ నొప్పికి ఉరుము శబ్దం వచ్చింది - అంటూ బేజ్జా చేసిన నల్లని మబ్బు, ఉరుముశబ్దంల వర్ణణ ఎంతో హృద్యంగా ఉంటుంది ), 6 గాథలు మగని/ప్రియునిపై ప్రేమ లేదా శృంగారేచ్ఛను ప్రకటిస్తూను,  మిగిలిన   5 గాథలు వివిధ సందర్భాలకు చెప్పిన జీవితసత్యాలుగాను ఉన్నాయి.  గాథాకవయిత్రులు వ్రాసిన ఏ గాథలోనూ వ్యాసకర్త చెప్పినట్లు ......"స్త్రీ పురుష సంబంధాలలోని అసమనైతిక సంస్కృతివల్ల బాధాతప్త హృదయులైన మహిళలు తమ వ్యథను ధ్వని పూర్వకంగా, ప్రశ్నారూపంగా, దుష్టాంతాలుగా వ్యక్తీకరించుచూ నిరసనగళాన్ని వినిపించినట్లు" ఎక్కడా కనిపించదు.  ఇంతటి విపరీత వక్రీకరణకు పాల్పడటం ఒకరకంగా సాహిత్యద్రోహమే కాదు  పైత్యం కూడా.  ఒక వేళ ఈ గాథలను బాధతప్త స్త్రీలు వ్రాసుకొన్నవే, పురుషుని పేరిట ప్రచారించబడ్డాయి అంటూ భావించవలసి వస్తే- అది ఆనాటి సమాజంలో పురుషుడు స్త్రీ పట్ల చూపిన సహానుభూతిగా, ఉదాత్తగుణంగా అంగీకరించాల్సి ఉంటుంది.  ఇక అందులో అసమనైతిక సంస్కృతి ఎక్కడున్నట్లు?

ఈ వ్యాసంలో వ్యాసకర్త వాత్సాయనుని కామసూత్ర పుస్తకం గురించి ప్రస్తావించారు.  గాథాసప్తశతి, కామసూత్ర ఒకే కాలంలో రచింపకపోయినా, ఈ రెండు పుస్తకాలద్వారా ఆనాటి ప్రజలు "హాయిగా శృంగారం జరుపుకొన్నట్లు దానిగురించి ఏ శషభిషలు లేకుండా నోరారా మాట్లాడుకొన్నట్లు అర్ధం చేసుకోవాలి.     "వాత్సాయన కామసూత్రం అనేది శృంగారేచ్ఛ తగ్గిపోయిన  ప్రజలలో   కామోద్దీపన కలిగించటానికి వ్రాయబడింది" అని వ్యాసంలో సూత్రీకరించటం అవగాహనా రాహిత్యం. ఇది చదవటానికే ఎబ్బెట్టుగా ఉంది.  కామసూత్ర అనేది కామోద్దీపన కలిగించే  సెక్సు బుక్కు కాదు.  నిజానికి కామసూత్రలో 25% మాత్రమే శృంగారభంగిమలగురించిన వర్ణణలు ఉండి, మిగిలినదంతా మూడో పురుషార్ధ సాధనలో భార్య, భర్తల బాధ్యతలను నిర్దేశిస్తూ,  దాంపత్యబంధాన్ని పటిష్టం చేయటానికి శృంగారం కూడా ఒక సాధనమని తెలియచేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.  దాదాపు ఆ కాలానికే చెందిన  కౌటుల్యుని అర్ధశాస్త్రం స్త్రీకి ఆస్థిహక్కు, విడాకుల హక్కు, భరణం హక్కు వంటి వివిధ హక్కులు కల్పించినప్పటికీ  ఆమెను  పుత్రుని ఉత్పత్తి చేసే సాధనంగానే చూసింది (సెక్స్ కోసం కాదు గమనించగలరు).   బహుభార్యత్వం ఆమోదించబడింది.  ఇది ఆనాటి సమాజరీతి.   ఆ కాలానికి చెందిన సాహిత్యాన్ని అనుశీలనం చేసేటపుడు అప్పటి సమాజతీరుతెన్నులను దృష్టిలో ఉంచుకోవాలి కదా!  వ్యాసకర్త తాను చెప్పదలచుకొన్న విషయానికి తగ్గట్టుగా ఆ గాథలను ఎలా వక్రీకరించాలా అనేదానిపైనే శ్రద్ధ చూపారు తప్ప పెద్దగా అధ్యయనం చేసినట్లు కనిపించదు.  

వ్యాసంలో  ఈ గాథలు కోటి వరకూ ఉండేవని వాటినుంచి 700 హాలుడు సేకరించి సంకలనపరచాడని అన్నారు. కానీ  ప్రస్తుతం మనకు లభించేవి వెయ్యి గాథలు మాత్రమే.  1870 లో వెబర్ అనే జర్మన్ పండితుడు 700 గాథల మూలప్రతితో పాటు జనబాహుళ్యంలో ఉన్న మరో 300 గాథల్ని సేకరించాడు.  శ్రీ రాళ్ళపల్లి వారు 1931 లో ఈ వెయ్యిలోంచి కొన్ని ప్రక్షిప్తాల్ని, పునరుక్తుల్ని తొలగించి 700 గాథలను ఎంచి తెలుగులోకి అనువదించారు.   

ఈ వ్యాసకర్త ఒక చోట -- "పతియే ప్రత్యక్ష్యదైవంగా భావించమని చెప్పిన కుటుంబసంస్కృతిలో ఒదిగిన స్త్రీ తన భర్త జుట్టును కాలివేలితో పెనచి ఈడ్చుకుపోవాలనుకునేంత స్థితిలో కోపాగ్నికి గురి అవటానికి కారణం కుటుంబంలోని అసమనైతిక సంస్కృతి అని స్పష్టమవుతుంది" - అంటూ  గొప్ప అపూర్వపరిశీలన చేసారు.    స్త్రీలను అష్టవిధనాయికలు అంటూ విభజన చేసి, ఆయా రకపు స్త్రీలు ప్రవర్తించాల్సిన కొన్ని చేష్టలను నిర్ణయించి ఆ ప్రకారంగానే  కావ్యనిర్మాణం చేయటం,  అప్పటి సాహిత్యంలో కనిపించే ఒక ఆచారము, కావ్యలక్షణము.  గాథాసప్తశతిలో కూడా వివిధ అష్టవిధనాయికలు వారికి నియోగింపబడిన పనులు చేస్తూ కనిపిస్తూంటారు. గాథాసప్తశతికి వ్యాఖ్యానం వ్రాసిన గంగాధర భట్టు,  సాహిత్య మరియు శృంగార కావ్యాలను ఆధారం చేసుకొని  ఈ గాథలలో కన్పించే వివిధ స్త్రీలను-   ఖండిత, విప్రలబ్ద, విరహోత్కంఠిత, మానిని, స్వైరిణి, స్వాధీనపతిక, స్వయందూతి, కుట్టానీ, విరహిణి, ధూర్తా, కులట  అంటూ వివిధ రకాలుగా విభజించాడు.   పై గాథలో వర్ణింపబడిన స్త్రీని ఖండిత అంటారు.   శ్రీకృష్ణుడంతటి వాడినే కాలితో తన్నించారు కవులు.  అదికూడా అసమనైతిక సంస్కృతి అని అనగలరా?  అలకాగృహాలలో,  స్త్రీ తన సఖునికి  నలుగురెదుటా ఇచ్చే గౌరవాన్ని ఇవ్వక్కరలేదన్న  విషయాన్ని  ఓ గాథాకారుడు  చమత్కారంతో ఎలా వర్ణించాడో చూడండి.  

మగడెంత బ్రతిమాలినప్పటికీ
తనకోపం తగ్గలేదన్న విషయాన్ని
ఆమె బహునేర్పుగా చెప్పగలదు
ఏకాంతమందిరంలో కూడా
మగనికి మర్యాదలు చేస్తోంది  --  (88)   ఈ గాథను వ్యాసకర్త  చదివి ఉంటే పై వ్యాఖ్యానం చేసి ఉండేవారు కాదేమో

గాథాసప్తశతిని తెలుగులోకి అనేకమంది అనువదించారు.  1931 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు అంతర్జాలంలో దొరుకుతున్నాయి. 2012లో శ్రీ నరాల రామారెడ్డి, సంస్కృతమూలచ్ఛాయలను ఇస్తూ,  గాథాత్రిశతి పేరిట మూడు వందల గాథలను తెనిగించారు.  ఇటీవలి కాలంలో శ్రీ దీవిసుబ్బారావు తెలుగులోకి గాథాసప్తశతిని అనువదించారు. ఇవి ప్రస్తుతం మార్కెట్లో లభించవచ్చు.  ప్రముఖ కథకుడు శ్రీ తల్లావఝుల పతంజలిశాస్త్రి గారు కొన్ని గాథలను అనువదించారు.    కులబాలదేవుడు, గంగాధరభట్టు, శ్రీ మధురనాథ శాస్త్రి వంటి పండితులు గాథాసప్తశతిపై టీకలు వ్రాసారు. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కొన్ని సప్తశతి గాథలను కథలుగా మలచి వ్యాఖ్యానించారు. ఎవరైనా ఒక ప్రాచీన గ్రంథంపై ఒక పరిశోధనాత్మక వ్యాసం వ్రాసేముందు దానిపై వచ్చిన  వివిధ రచనలను అనుశీలన చేసి వ్రాయటం ధర్మం.  కానీ ఈ వ్యాసకర్త అలాచేసినట్లు అనిపించదు.   వ్యాసంలో  వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య గారి అనువాదం గురించి మాత్రమే ప్రస్తావించటం అలాంటి అనుమానానికి తావిస్తుంది.  పరిమిత జ్ఞానంతో  వ్యాఖ్యానాలు, తీర్మానాలు చేయటం సాహసమే! 

ఈ వ్యాసాన్ని ముగిస్తూ -- "సంధ్యవార్చాలనుకొన్న శివుడు జలభరాంజలి యందు గౌరీ మొహం కనబడేసరికి మంత్రజపం కూడా మరచి మోవిని అటు ఇటు కదిపాడని ముగిస్తూ ఆనాటి పురుషులు భోగలాలసతో ధార్మిక కర్మాచరణలను కూడా మరచి పోయారని గ్రంథాన్ని ముగింపుచేయటంతోనే హాలుడు సమాజస్థితికి అద్దం పట్టాడని అర్ధం అవుతుంది" -- అంటారు వ్యాసకర్త.  ఇంతకన్నా అన్యాయమైన భాష్యం మరొకటి మనం ఎక్కడా చూడలేం.  వ్యాసకర్త మాటలకు హాలుణ్ణి తోడు తెచ్చుకోవటం మరీ వెటకారం.  
గాథాసప్తశతి మొదటి మరియు చివరి గాథలు శివస్తుతికి సంబంధించినవి.  ఇక్కడ ఉదహరింపబడిన గాథకు శ్రీ దీవి సుబ్బారావు గారి అనువాదం ఇలాఉంది

సంధ్యవార్చేటప్పుడు దోసిటజలంలో
గౌరి ముఖం ప్రతిఫలించటం చూసి
మంత్రం మర్చిపోయి
ఊరికే పెదాలు కదుపుతున్న 
శివుడికి నమస్కరించండి   7-100

ఈ గాథలో కవి చమత్కారమంతా దోసిటజలంలో గౌరి ముఖం ప్రతిఫలించటం వద్ద ఉంది. ఎందుకంటే శివుడు అర్ధనారీశ్వరుడు కనుక.   శరీరంలో సగభాగమై ఉన్న గౌరీదేవి మొఖాన్ని అంజలిజలాలలో చూడగానే శివుడు మంత్రం మరచిపోవటానికి కారణం "భోగలాలస" కాదు  ప్రేమ అనురాగము.   అది  ఆ ఆదిదంపతుల దాంపత్యరహస్యం.  భార్యాభర్తలంటే ఒకరిలో ఒకరు లీనమై ఆదిదంపతుల్లా కలసిమెలసిజీవించాలని ఆ గాథాకారుడు కోరుకొంటున్నాడు.  అంతటి ప్రేమమూర్తి అయిన శివునికి నమస్కరించమంటున్నాడు. ఇదొక మంగళస్తుతి.   మొత్తం గాథలోని చమత్కారాన్ని, ధ్వనిని, భక్తిని వదిలేసి "ఆనాటి ప్రజలు భోగలాలసులని, విచ్చలవిడి సమాజానికి హాలుడు అద్దంపట్టాడని" అనటం ఎంతవరకూ భావ్యమో వ్యాసకర్తే ఆలోచించుకోవాలి.

డా. జె. కనకదుర్గ గారి వ్యాసంలోని మిగిలిన గాథల ఉటంకింపు,  వాటి ద్వారా చేసిన తీర్మానాలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. (గాథలను ఉటంకించేటపుడు నంబరు ఇవ్వటం సాంప్రదాయం.  దీనిని వ్యాసకర్త పాటించలేదు). ఈ గాథలలో ప్రోషితపతికలబాధలు అనేకచోట్ల కనిపిస్తాయి (భర్త దేశాంతరం వెళ్ళగా అతని రాకకోసం ఎదురుచూసే భార్యను ప్రోషితపతిక అంటారు) . అలాంటి ఒక గాథలో

చెలీ! నిజం చెప్పు
అందరికీ ఇలానే జరుగుతుందా?
మగడు దూరదేశమేగినపుడు
భార్య గాజులు పెద్దవవుతాయా?  (453) అని అని ఓ ప్రోషితపతిక ప్రశ్నిస్తుంది.  ఇలాంటి గాథలలో- ధ్వనిని, కరుణరసాన్ని, భర్తగురించి చిక్కిపోయేంత బెంగపెట్టుకొన్న ఆ స్త్రీ అనురాగాన్ని,  ఆనాటి రాజకీయ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను చూడాలి తప్ప- భార్యని ఒంటరిని చేసేసి దూరదేశాలలో వ్యాపారాల పేరుతో భర్త సుఖిస్తున్నాడని ఆరోపించటం ఎంతవరకూ  సమంజసం?

గాథాసప్తశతిలో  శృంగార రస ప్రధాన గాథలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అంతకు మించిన సౌందర్యం, తాత్వికత కలిగిన ఇతర గాథలు కూడా ఉన్నాయి.  గాథాసప్తశతి ధ్వని ప్రధాన కావ్యం. అనేక వ్యాఖ్యానాలకు ఆస్కారం ఉండే కావ్యం.  అయినప్పటికీ వ్యాసకర్త ప్రతిపాదించినట్లు ఇదేమీ అసమనైతిక సంస్కృతికి అద్దం పట్టే రచన కాదని,  వివిధ గాథలు ఆనాటి స్త్రీ పురుషుల అన్యోన్యతను చూపుతాయిని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది - ఉదాహరణకు ఓ స్వాధీన పతికకు కోపం వచ్చినపుడు ఆ భర్త ఏంచేసాడో  చూడండి--

పాదాలు పట్టుకొని
బతిమాలుతున్న భర్త వీపునెక్కి
చిన్నకొడుకు తైతెక్కలాడుతుంటే
అంత కోపంలోనూ ఆమెకు నవ్వాగలేదు (11)  -- ఇందులో అసమనైతిక సంస్కృతి ఉందా లేక దాంపత్యజీవితాన్ని హాయిగా మలచుకోవటం ఉందో డా. జె. కనకదుర్గ గారే చెప్పాలి.

బొల్లోజు బాబా

నా వెలుతురు తెర పుస్తకంపై కలిదింది వర్మ గారి కామెంట్

శివారెడ్డి గారు "బల్లోజు బాబా తెలగాణాలో పుట్టుంటే ఉత్తరాంధ్రాలో పుట్టుంటే" అన్న ఊహ చేసారు కానీ ఇతడు గోదారివాడాయె....
"వెలుతురు తెర" పుస్తక పద్యం కవి ఊహా శైలిని నిర్మాణ ప్రావీణ్యాన్ని కవి ఆశిస్తున్న మార్పుని స్పష్టపరుస్తుంది.
గోదారోడాయె కోపాన్ని కూడా మెత్తగానే చెబుతాడు. మూల్యాకనంలో ఒక గురువుగా ఒక కవిగా ఇతడు పడ్డ యాతన చదివి తీరాల్సిందే, ఎందుకో తెలియడం లేదు అన్న ఆర్ద్రత, చర్మం రంగు కవితలో కవి చూపిన నమ్మకం మనల్ని కవికి దగ్గర చేస్తాయి.
కవి, ఉపాధ్యాయుడు, మనిషి, స్వాప్నికుడు, పర్యావరణ ప్రేమికుడు, తాత్వికుడు, వెలుతురు తెర వెరసి బల్లోజుల బాబా.
చదివి దాసుకో తగ్గదీ "వెలుతురు తెర"
కలిదింది వర్మ

నాలుగు రంగులు మిగిల్చే కవిత

నాలుగు రంగులు మిగిల్చే కవిత

~ బొల్లోజు బాబా


ఏ కవితైనా అది కవియొక్క స్వీయప్రకటన. దానికి సృష్టికర్త కవే . ఆ కవితను చదువుతున్నంత సేపూ ఆ కవి మనస్సులో ఆ సమయంలో కదలాడిన భావాలే కాక, ఆ కవి హృదయసంస్కారం కూడా అంతర్లీనంగా కనిపిస్తూంటుంది. కొన్ని కవితలు తమవైన కొత్తలోకాల్ని సృష్టించి, మనల్ని చేయిపట్టుకొని వాటిలోకి తీసుకెళ్ళి అలౌకికానందాలను పంచుతాయి. కవితపూర్తయ్యాకాకూడా ఆ లోకంలోనే సంచరిస్తూ ఆ మథురభావనల్లో ఉండిపోతాం చాలాసేపు.

మానస చామర్తి వ్రాసిన “వర్ణచిత్రము” అనే కవిత చదివాకా ఎందుకో ఈ మధ్య వచ్చే కవిత్వానికి భిన్నంగా అనిపించింది.

ప్రకృతి జీవితంలోకి ఎలా ప్రవేశించాలని ప్రయత్నిస్తుందో అదే సమయంలో జీవితం ఆ సౌందర్యాన్ని పీల్చుకొని జ్ఞాపకాలుగా మలచుకొని భద్రపరచుకోవాలని ఎంతెలా ఆరాటపడుతుందో – అనే Conflict ను భలే గొప్పగా పట్టుకొందీ కవిత.

కొత్తరోజులన్నీ ఖాళీకాగితాలై అంటూ మొదలౌతుంది కవిత. ఎంత చక్కని భావన! గతకాలపు బరువులు లేకుండా తేలికగా ఎగిరే సీతాకోకచిలుకల్లా – కొత్తరోజులన్నీ తెల్లకాగితాలైతే, ఎన్నెన్ని వర్ణ చిత్రాల్ని చిత్రించుకోవచ్చో కదా అనిపించకమానదు. మంచి ఎత్తుగడకు ఉండే అడ్వాంటేజ్ ఇది. చదువరిని వేగంగా లోనికి లాక్కొంటుంది. డిసెంబరు పూవులు, ఆకుపచ్చని కొండలు, సూరీడు, చంద్రవంక అంటూ ఒక్కొక్క వర్ణచిత్రాన్నీ ఒక్కో పూలరేకలా విప్పుకొంటూ, కవిత ముగింపుకు వచ్చేసరికి ఒక రోజు కాలచక్రాన్ని పూర్తిచేస్తారు మానస గడుసుగా.

పసిమికాంతుల నెగురవేస్తూ, తెల్లగా నవ్విన చంద్రవంక, గొడుగులు పట్టే ఆకుపచ్చని కొండలు వంటి ప్రయోగాలు నవ్యమైన అభివ్యక్తి. హృద్యంగా ఉంది. What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself అంటాడు John Stuart Mill ఒక దృశ్యాన్ని చూసి చలించిన హ్రుదయం తన ఉద్వేగాల్ని తనంతతాను పదాలలోకి అనువదించుకొంటుంది సహజంగా. ఆ అనుభవం కొన్నిసార్లు పైకి ఆనందాన్నిమాత్రమే ఇచ్చేదిగా కనిపించినప్పటికీ హృదయాన్ని మార్ధవం చేసే శక్తిని లోలోపల కలిగిఉంటుంది.

హృదయసంస్కారాన్నివ్వటం కన్నా ఉత్తమోత్తమమైన సామాజికప్రయోజనం ఏముంటుంది? అందుకనే కదా కవిత్వాన్ని “హృదయసంబంధి” అని ఇస్మాయిల్ అన్నది.
“నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో” ఇలాంటి కవితలే “నాలుగు రంగులు మిగిల్చిపోతాయి” అనటానికి నేనేమాత్రం సందేహించను.
*

వర్ణ చిత్రం

-మానస చామర్తి

~
కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు రెపరెపలాడతాయి.
తైలవర్ణచిత్రమేదో గీయాలని తొందరపడతాయి
వేళ్ళు. వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు ఊదారంగు సముద్రం,
పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ
వెనుకొక లోకం గీతలుగా మెదులుతూ
చెదురుతున్న చిత్రం పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది
కుంచె జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.
చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.

Saturday, October 1, 2016

నా "వెలుతురు తెర" పుస్తకంపై శ్రీమతి జగద్దాత్రి గారు చేసిన సమీక్ష

నా "వెలుతురు తెర" పుస్తకంపై శ్రీమతి జగద్దాత్రి గారు చేసిన సమీక్ష శిరాకదంబం వెబ్ పత్రికలో వచ్చింది. ఎడిటర్, శ్రీ రామచంద్ర రావు ఎస్. గారికి, జగద్ధాత్రిగారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను (పే.నం. 29-33 లలో)

నేను సైతం : బొల్లోజు బాబా

నేటి తెలుగు కవితా జగతిలో బొల్లోజు బాబా పేరు వినని వారుండరు. ముంజేతి కంకణానికి అద్దమేలా? అని మీరనొచ్చు. కానీ ఒకోసారి ఇది అవసరం, అందుకే బొల్లోజు బాబా గురించి అతని కవిత్వం గురించి కాసిన్ని కబుర్లుచెప్పుకుందాం.

మెత్తని పారిజాత పూల పై ఆనుకుని చక్కన్ని టాగోర్ మధుర కవిత చదువుతుంటే ఎంత హాయిగా ఉంటుందో బాబా కవిత్వం అలాంటి అనుభూతిని ఇస్తుంది. బాబా ప్రకృతి ప్రేమికుడే కాదు తాను ప్రకృతిలో ఒక భాగమయి జీవించే మనిషి. ఇది ఇతని కవిత్వం బాగా తెలుపుతుంది. ఇతని మొదటి కవితా సంపుటి “ ఒక ఆకుపచ్చని గీతం”(2009) కి శిలపరసెట్టి శ్రీరాములు అవార్డ్ వచ్చింది. ఇటీవల బాబా తీసుకొచ్చిన మరో కవితా సంపుటి “ వెలుతురు తెర”. టాగోర్ రాసిన చిరు కవితలు “స్ట్రే బర్డ్స్” ను కూడా తెలుగు లోకి “స్వేచ్ఛా విహంగాలు” పేరిట అనువదించి పుస్తకంగా వెలువరించాడు. ఈ రెండు పుస్తకాలు ఇటీవలే ఆవిష్కరణ జరిగాయి. ప్రకృతిలో మమేకమయి పోయిన వాడు అయితే చిత్రాలు గీస్తాడు, లేదా కవిత్వం రాస్తాడు. చిత్రంగా బాబా చిత్రాల్లాంటి కవితలు రాస్తాడు. ఇతని తొలి కవితా సంపుటిలోనే ఈ అంశం మనకు అవగత మౌతుంది.

ఆర్తి ఆవేదన కవిత్వానికి మూల కారకాలు. అలాంటి ఆవేదనల నివేదనే బాబా కవిత్వం. ఇక వ్యక్తిగా బాబా గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. మెల్లగా మాట్లాడుతాడు , మెత్తగా నవ్వుతాడు. చూడగానే సహృదయత , జీవన మర్యాద ఉట్టి పడుతూ ఉంటాయి. నిత్య విద్యార్ధిగా తనని తాను భావించుకునే అతి సౌమ్యుడు, నిగర్వి. నచ్చిన మంచి పుస్తకాలు కవులు తాత్వికులను అనువదిస్తాడు. మనుషుల పట్ల మమతల పట్ల అధికంగా అనురాగం కలవాడు. ఇక బాబా కవిత్వం గురించి. మెరుపుల్లా వచ్చి తెగి పోతున్న ఆలోచనల్ని ఫ్రాగ్మెంట్స్ గా కవితలుగా నమోదు చేసిన ఓ దాన్లో అంటాడిలా :

“జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసిపోయింది
ఆ ముఖం పై మూడుతలన్న
దాని పాద ముద్రలే” సున్నితమైన మాటల్లో జీవితాన్ని చెప్పే కవిత ఇది.

“ నేల సంకెళ్ళను
నిత్యం తడుముకుంటూనే
వెలుగును తరుముకుంటూ
నీలాకాశం లోకి చొచ్చుకొని
పోతుంటాయి తరువులు. చెట్టుని మించిన
వ్యక్తిత్వవికాస పుస్తకం ఏది?” మొదటి పంక్తుల్లో చెట్టుని వర్ణించడం సాధారణమే అయితే చెట్టును మించిన వ్యక్తిత్వ పుస్తకం ఏది అనడం లోనే బాబా తన ముద్రను చూపించాడు. గజల్ లో షేర్ లో రెండవ పంక్తి ముక్తాయింపులో కనిపించే మెరుపు చమత్కారం లాంటిది ఈ అంశం. చెట్టును మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం లేదన్న కవి భావనకి జోహార్లు.

కొత్త కవిత్వ సంపుటి శీర్షిక కవిత :
వెలుతురు తెర
చెట్టు నీడలో కూర్చొన్న
విద్యార్ధుల గుంపు
వెలుతురు తెరలో దూకి
వైఫై సముద్రం లో తేలింది
దారాన్ని స్రవించుకొని
కాళ్లతో పెనుకుంటూ తన చుట్టూ తానే
గూడు నిర్మించుకొనే పురుగులా
ప్రతీ విద్యార్ధీ తన చుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకున్నాడు.
వైఫై లింక్ తెగింది
ఒహా! షిట్....
గూడులోంచి సీతాకొక చిలుక
మెత్త మెత్తగా బయట పడినట్లుగా
ఒక్కో విద్యార్ధీ మాటల ప్రపంచంలోకి
మెల్ల మెల్లగా మేల్కొన్నాడు
కాసేపటికి కాంపస్ అంతా
రంగు రంగుల మాటల చిలుకలు
రెక్కలల్లార్చుకొంటూ ఎగురుతో!

ఈ కవితా చదివిన వెంటనే ఏమనిపిస్తుంది? టాగోర్ , చలం , ఇస్మాయిల్ గుర్తు రావడం లేదూ? మృదుత్వం, వేదన కలబోసుకున్న ఈ మాటల్లో ఆధునిక ప్రపంచం గురించిన అంశాన్ని నేటి పరిభాషలో అభివ్యక్తి చేయడం. ఇదే బాబా కవిత్వానికి గీటు రాయి. మాటలు పాతవే ఎవరు రాసినా , వాటికద్దే భావాల పరిమళాలే ఎప్పటికప్పుడు ఒక కవిని ప్రత్యేకంగా నిలపగలిగేవి. అలాంటి ప్రత్యేక కవి బాబా అనడం లో సదేహం లేదు. ఈ కవి భావలలోనే కాదు పదాల ప్రయోగం లోనూ చలానికి వారసుడు. చలం మాటలాడేటప్పుడు , రాసేటప్పుడు కూడా “ఎగురుతో’ అంటాడు ఎగురుతూ అనడానికి బదులు. బాబా కూడా అలాగే ఎగురుతో అని రాస్తాడు. ఇది మనకి భావుకత్వానికి ఒక ప్రతీకగా కనిపిస్తుంది.

బాబా కవిత్వం లో మరొక మంచి కవిత కేవలం స్త్రీలు మాత్రమే రాయగలరు అనుకున్న కవితా అనూహ్యమైన కవిత “ ఒక హిస్టోరెక్టొమీ” ప్రముఖ కవయిత్రి హిమజ చాలా కాలం క్రితం ఇదే పేరుతో ఇదే అంశంపై కవిత రాసేరు. మళ్ళీ ఇన్నేళ్లకి బాబా కలం నుండి ఈ కవిత రావడం ఆశ్చర్యం, ఆనందదాయకం కూడా. విచ్చలవిడి గా అవసరం ఉన్నా లేకున్నా జరుగుతున్నా హిస్టెరెక్టొమీ ఆపరేషన్లు చూసిన కవి సున్నిత హృదయం స్పందించింది ఇలా :

“కారణాలెమైనా కానీ
నెలకో రక్త పుష్పాన్ని రాల్చే
వృక్షాన్ని సమూలంగా
పెకిలించారు
నాగరీకుని
వైద్య ప్రయోగశాలలో
స్త్రీ దేహమేప్పుడూ ఓ గినియా పిగ్గే!” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. స్త్రీల దేహాలపై ఈ శాస్త్ర చికిత్స చూపే ప్రభావాన్ని కూడా ఆవేదనతో చెప్తాడు బాబా. మందులు మాత్రలు , ఇప్పుడిక అద్దె గర్భాలు అన్నీ ప్రయోగాలు స్త్రీ దేహం పైననే అని వాపోతూ చివరిగా అంటాడిలా

“జరాయురహిత దేహమిపుడో
సజీవ టంకశాల కదా!” ఆవేదన కలిగించే ఈ కవిత కు స్త్రీలందరు కృతజ్ఞతలు చెప్పాలి బాబాకీ. ఆ కోల్పోయినతనం ఆ బాధ స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి విషయాన్ని తీసుకుని హృదయానికి హత్తుకునేలా రాసిన బాబాకి స్త్రీలందరి తరపునా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా.

“యానాం విమోచనోద్యమం” కూడా బాబా రచించారు. అనుక్షణం మమతల హరివిల్లులా అనవరతం ప్రేమ పొదరిల్లులా జీవితాన్ని ఆస్వాదించే కవి తన చుట్టూ ఉన్న వారికి ఆ అనురాగ సంపదను పంచిపెట్టే బాబా లాంటి కవులు నేటి యాంత్రిక యుగం లో ఆశారేఖలు.
గాధా సప్తసతి , సూఫీ పద్యాలు ఇలా ఇంకా తనకు నచ్చిన వాటిని అనువాదాలు కూడా విరివిగా చేస్తున్న బాబా కలం నుండి హృదయాలు చెమరించే కవిత్వం మరింత రావాలని ఆశతో , ఆకాంక్షతో శుభాకాంక్షలు ....ప్రేమతో జగద్ధాత్రి