Wednesday, October 19, 2016

కవిత్వంలో కరుణరసం


"శృంగారే విప్రలంభాఖ్యే కరుణే చ్ ప్రకర్షవత్
మాధుర్య మార్ద్రతాం యాతియత స్తత్రాధికం మనః"
సంయోగశృంగారంలో కంటే విప్రలంభ శృంగారమునందు దానికంటే కరుణమునందు, మనసు ఆర్ధ్రత పొంది ఎక్కువ మాధుర్యాన్ని అనుభవిస్తుంది అని అర్థం.
అన్ని రసములలో కరుణరసము ఉత్తమోత్తమైనదని అంటారు. భవభూతి "కరుణరసం ఒక్కటే రసం, మిగిలిన రసాలన్నీ దాని భేదాలే" అని అంటాడు. ఆ తరువాత స్థానాలు విప్రలంబ శృంగారానికి, సంయోగ శృంగారానికి ఇవ్వబడ్డాయి.
ఇక్కడ శృంగారమంటే భౌతికమైనదే అవ్వక్కరలేదు, లౌకిక కాలుష్యము కాక శాంతిమయమైన ఆనందంగా కూడా భావించవచ్చు.
మరోలా చెప్పాలంటే ఈ మూడు రకాలను ఇలా కూడా అనుకోవచ్చు.
అనుకొన్న లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పే కవిత్వం (సంయోగ)
లక్ష్యాన్ని స్వప్నిస్తూ ఒకరకమైన విరహాన్ని అనుభవిస్తూ చెప్పే కవిత్వం (విప్రలంబ)
కవితా వస్తువు పట్ల సానుభూతి లేదా సహానుభూతిని వ్యక్తీకరిస్తూ కరుణరసార్థ్రంగా చెప్పే కవిత్వం. (కరుణ)
ఈ మూడు వర్గాలకు చెందిన మూడు కవితలను పరిశీలిద్దాం.
1.
ఉదయగీతం
దినం యవ్వనంతో ఉన్నవేళ
పెదవులు హృదయ రహస్యాల్ని
దాచలేవు.
జాజుల వాసనకు తనువు
సాంద్రరూపమౌతుంది.
ప్రణయ తేజం దేహాల్ని
ప్రకాశింపచేస్తూంటే,
జ్వలిస్తూ, దహిస్తూ,
తపిస్తూ, తరిస్తూ
వలపుల కొలిమిలో
జంటగా ద్రవించటం
సృష్టి రహస్య చామరం.
పై కవితలో ఓ ఉదయపు పూట శృంగారభావం ఉప్పొంగటం, జంటగా ద్రవించే సృష్టిరహస్య క్రియ చామరమై హాయినివ్వటం ధ్వన్యాత్మకంగా వ్యక్తమయింది.
2.
వస్తావా?
చీకటి దుప్పట్లో దూరి
దేహ దీపాల్ని
వెలిగించుకొందాం
రాత్రి హార్మోనియంపై
మోహపరిమళాల రాగాల్ని పలికిద్దాం
శీతవేళకు చిక్కకుండా
వేడి శ్వాసల్ని కప్పుకొందాం
ఒక సమాంతర కాలంలోకి
అనంతంగా ప్రవహిద్దాం
వస్తావా!
ఇక్కడ కలయిక కోసం స్వప్నించటం కనిపిస్తుంది. వియోగంలో ఉన్న హృదయం సంయోగాన్ని కోరుకొంటోంది. ఈ కవితలో వ్యక్తమయింది శృంగారేతరమైన తీవ్రమైన వాంఛగా కూడా అన్వయించుకోవచ్చు.
3.
పుట్టిన మూడునెలలకే కనుమరుగైన చిన్నారి శిశువు గురించి వ్రాసిన కవిత ఇది (కొంతభాగం)
//చిన్నప్పుడు గోటింబిళ్ళ ఆటకోసం
చిన్ని చిన్ని గోతులు తవ్వుకున్న మేము
ఈ చిన్నారి శిశువు కోసం తవ్విన గోతిని చూసి
వానలకు పైవర వరకు ఉబికొచ్చిన నూతి నీటిలా
దుఃఖం జీవితపు ఇంతపై పొరల్లోనే ఉంటుందనుకోలేదు
అంతా అయ్యాక తలో గుప్పెడు మట్టి వెయ్యమంటే
చేతులుండీ ఎవరికీ చేతులు రాలేదు
యింకా పిడికిలి విప్పని వాడి మీద
పిడికిలి మట్టి వెయ్యమని
క్రూరవిధి ఈ రోజు మమ్మల్ని శపించింది
చివరికి గుట్టపోసిన చిట్టి సమాధి మట్టిని
అటూ ఇటూ సర్దుతున్న నెపంతో
ఆ పెదనాన్న స్పృశిస్తున్నది
నిదురించిన ఆ చిన్ని ముద్దునేనని ఎందరికి తెలుసు?
నిన్నటిదాకా కేరింతలతో వాడూగిన ఉయ్యాల
ఈ రోజు తూర్పుగాలికి ఊరకనే వూగుతోంది
మా శూన్య హృదయాల్లాగే
ఎప్పటిలాగే
తెల్లవారు జామున
అలవాటుగా ఆ తల్లి బిడ్డకోసం
పక్కను తడిమితే
ఆమె ఖాళీచేతులను ఓదార్చే ధైర్యాన్ని ఎవరికుంది? (నిదురించిన చిన్నముద్దు- శిఖామణి)
కరుణ రసం చిప్పిల్లాలంటే కొంత మానసికవాతావరణాన్ని సిద్దం చేయాలి. అందుకు మూర్తచిత్రాల కల్పన అవసరమౌతుంది. అలా ఒక ఉద్విగ్న స్థితి ఏర్పడ్డాకా కవి ఒక్కో దృశ్యాన్ని విప్పుకొంటూ వస్తాడు. .
పై కవితలో చిన్నప్పటి గోటిబిళ్ల తవ్వుకొన్న గోతుల్ని చిన్నారికోసం తవ్విన పెద్దగా లోతులేని గోతితో పోల్చాడు కవి. దాన్ని తీసుకెళ్ళి మరలా వానాకాలంలో పైవరకూ వచ్చిన నూతి నీళ్ళతో పోలుస్తాడు. ఇక్కడ హృదయంలోంచి కళ్ళలోకి ఏదో దుఃఖప్రవాహం పెల్లుబుకుతున్నది అనే భావన అప్రయత్నంగానే పాఠకుని మదిలో స్పురిస్తుంది.
"పెదనాన్న/కవి స్పృశిస్తున్నది చిన్నిముద్దునే" అంటూ చెప్పిన ఆ పదచిత్రం, సాహిత్యంలో అత్యుత్తమ మూర్తభావచిత్రంగా కొనియాడబడే కాళిదాసు "గ్రీవాభంగాభిరామం........... శ్లోకం సరసన స్థానమీయదగ్గది.
ఆమె ఖాళీ చేతులను ఓదార్చే ధైర్యం ఎవరికుంది అంటాడు కవి. ఖాళీ జీవితం/హృదయం అనడు. ఆ వాక్యాలవద్ద సహృదయుని హృదయం ద్రవించకమానదు.
కరుణ రసాన్ని పండించటటానికి గొప్ప ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు కావాలి. లోతులేని వాక్యాలద్వారా కరుణరసం పలకదు.
"కరుణముఖ్యం" అని అందుకనే ఇస్మాయిల్ అన్నది . కరుణరసం ఉత్కృష్టమైనదిగా కొనియాడబడింది. ఉత్తమకవిత్వానికి చిరునామాగా నిలుస్తుంది ఎప్పటికీ.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment