Saturday, October 15, 2016

నాలుగు రంగులు మిగిల్చే కవిత

నాలుగు రంగులు మిగిల్చే కవిత

~ బొల్లోజు బాబా


ఏ కవితైనా అది కవియొక్క స్వీయప్రకటన. దానికి సృష్టికర్త కవే . ఆ కవితను చదువుతున్నంత సేపూ ఆ కవి మనస్సులో ఆ సమయంలో కదలాడిన భావాలే కాక, ఆ కవి హృదయసంస్కారం కూడా అంతర్లీనంగా కనిపిస్తూంటుంది. కొన్ని కవితలు తమవైన కొత్తలోకాల్ని సృష్టించి, మనల్ని చేయిపట్టుకొని వాటిలోకి తీసుకెళ్ళి అలౌకికానందాలను పంచుతాయి. కవితపూర్తయ్యాకాకూడా ఆ లోకంలోనే సంచరిస్తూ ఆ మథురభావనల్లో ఉండిపోతాం చాలాసేపు.

మానస చామర్తి వ్రాసిన “వర్ణచిత్రము” అనే కవిత చదివాకా ఎందుకో ఈ మధ్య వచ్చే కవిత్వానికి భిన్నంగా అనిపించింది.

ప్రకృతి జీవితంలోకి ఎలా ప్రవేశించాలని ప్రయత్నిస్తుందో అదే సమయంలో జీవితం ఆ సౌందర్యాన్ని పీల్చుకొని జ్ఞాపకాలుగా మలచుకొని భద్రపరచుకోవాలని ఎంతెలా ఆరాటపడుతుందో – అనే Conflict ను భలే గొప్పగా పట్టుకొందీ కవిత.

కొత్తరోజులన్నీ ఖాళీకాగితాలై అంటూ మొదలౌతుంది కవిత. ఎంత చక్కని భావన! గతకాలపు బరువులు లేకుండా తేలికగా ఎగిరే సీతాకోకచిలుకల్లా – కొత్తరోజులన్నీ తెల్లకాగితాలైతే, ఎన్నెన్ని వర్ణ చిత్రాల్ని చిత్రించుకోవచ్చో కదా అనిపించకమానదు. మంచి ఎత్తుగడకు ఉండే అడ్వాంటేజ్ ఇది. చదువరిని వేగంగా లోనికి లాక్కొంటుంది. డిసెంబరు పూవులు, ఆకుపచ్చని కొండలు, సూరీడు, చంద్రవంక అంటూ ఒక్కొక్క వర్ణచిత్రాన్నీ ఒక్కో పూలరేకలా విప్పుకొంటూ, కవిత ముగింపుకు వచ్చేసరికి ఒక రోజు కాలచక్రాన్ని పూర్తిచేస్తారు మానస గడుసుగా.

పసిమికాంతుల నెగురవేస్తూ, తెల్లగా నవ్విన చంద్రవంక, గొడుగులు పట్టే ఆకుపచ్చని కొండలు వంటి ప్రయోగాలు నవ్యమైన అభివ్యక్తి. హృద్యంగా ఉంది. What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself అంటాడు John Stuart Mill ఒక దృశ్యాన్ని చూసి చలించిన హ్రుదయం తన ఉద్వేగాల్ని తనంతతాను పదాలలోకి అనువదించుకొంటుంది సహజంగా. ఆ అనుభవం కొన్నిసార్లు పైకి ఆనందాన్నిమాత్రమే ఇచ్చేదిగా కనిపించినప్పటికీ హృదయాన్ని మార్ధవం చేసే శక్తిని లోలోపల కలిగిఉంటుంది.

హృదయసంస్కారాన్నివ్వటం కన్నా ఉత్తమోత్తమమైన సామాజికప్రయోజనం ఏముంటుంది? అందుకనే కదా కవిత్వాన్ని “హృదయసంబంధి” అని ఇస్మాయిల్ అన్నది.
“నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో” ఇలాంటి కవితలే “నాలుగు రంగులు మిగిల్చిపోతాయి” అనటానికి నేనేమాత్రం సందేహించను.
*

వర్ణ చిత్రం

-మానస చామర్తి

~
కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు రెపరెపలాడతాయి.
తైలవర్ణచిత్రమేదో గీయాలని తొందరపడతాయి
వేళ్ళు. వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు ఊదారంగు సముద్రం,
పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ
వెనుకొక లోకం గీతలుగా మెదులుతూ
చెదురుతున్న చిత్రం పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది
కుంచె జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.
చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.

No comments:

Post a Comment