Friday, December 23, 2011

దొరికిన దొంగ .....

కొబ్బరి కాయల దొంగ దొరికాడట
చెట్టుకు కట్టేసి కొడుతున్నారంటే
చూట్టానికి వెళ్ళాను.
అతను తల దించుకొని ఉన్నాడు
చీప్ లిక్కర్ వాసన గుప్పుమంటోంది.
వ్యసనం అతని ఆత్మను తినేసింది
ఆత్మ లేని ఆ వికార దేహం
రక్త గడ్డలా ఉంది.
వాడి కుటుంబాన్ని తల్చుకొంటే జాలనిపిచింది.
వీధికొక్కటి చొప్పున 
వెలిసిన గిలిటన్ల వేట్లకు
ఊర్లకు ఊర్లు కబేళాలుగా 
మారుతున్న దృశ్యశకలమిది.
ఉన్నది కనుక తాగుతున్నారు
తాగుతున్నారు కనుక ఉంచుతున్నాం
నరంలేనిదే నాలుక కదా!
లిక్కర్  వైద్యం  ఇన్సూరెన్స్ ఎక్స్ గ్రేషియా అంటూ
ప్రాణం చుట్టూ అన్ని
వ్యాపారాలు ముడివేసుకొన్నపుడు
జీవితం ఎంత చవకో 
అతణ్ణి చూస్తే అర్ధమౌతుంది.

“ఇది వరకు తిండి కోసం దొంగతనాలు చేసేవారు
ఇప్పుడు మందుకోసం చేస్తున్నారు” ఎవరో పెద్దాయన
గొణుక్కొంటున్నాడు.

అభివృద్ధంటే అదేనేమో!


బొల్లోజు బాబా

Thursday, December 15, 2011

The best Post of my Blog


పాత పోస్టులు చదువుతోంటే, ఎందుకో ఈ పోస్టును రీపోస్ట్ చేయాలనిపించింది.  ఇందులో జరిగిన చర్చ ఆశక్తిదాయకంగా ఉండటమే కాక, విషయపరంగా ఉన్నత ప్రమాణాలతో ఉన్నట్లు అనిపించింది. 

పోస్టు లింకు ఇక్కడ

http://sahitheeyanam.blogspot.com/2009/11/blog-post_17.htmlభవదీయుడు

బొల్లోజు బాబా

Tuesday, November 29, 2011

Russell’s viper (Vipera russellii)


Russell’s viper (Vipera russellii)

కాలేజ్ గార్డెన్ లో రెండు కొండచిలువలు తిరుగుతున్నాయని మా విద్యార్ధులు  చెప్పటంతో చూడటానికి వెళ్ళాం.  నిజానికి అవి కొండచిలువలు కావు.  అత్యంత విషపూరితమైన  రక్త పింజరలు.  ఇవి పొడపాముల జాతికి చెందినవి.  సాధారణంగా వీటిని కొండచిలువలుగా పొరపడుతూంటారు.  కొండచిలువలకు శరీరంపై మచ్చలు అడ్డదిడ్డంగా (ఒక పాటర్న్ లేకుండా/సౌష్టవరహితంగా) ఉంటాయి.  కానీ పొడపాముల మచ్చలు ఒక క్రమపద్దతిలో ఉంటాయి.  వీటి విషం హీమోటాక్సిక్ రకానికి చెందింది.  అంటే విషం రక్తం పై ప్రభావితం చూపి రక్త కణాల్ని విచ్చిన్నం చేస్తుంది.  దీని కాటు బారిన పడితే, ఆరుగంటలలోగా ఆంటివీనం ఇవ్వకపోతే, మూడు నాలుగు రోజులలో శరీరం లోని రక్తం విచ్చిన్నమై, చర్మంపై పెద్దపెద్ద ఎర్రని బొబ్బలు తేలి మరణిస్తారు.చాలా బాధాకరమైన మరణం.  

 చాలా సంవత్సరాల క్రితం నా మిత్రుడు దీని కాటుకు గురయ్యాడు. ఏదో పురుగు కుట్టి ఉంటుందని అశ్రద్ధ చేయటంతో రెండోరోజుకు చర్మం పై ఎర్రని దద్దుర్లు లేచాయి.  మూడో రోజుకు అవి పెద్దవై విస్తరించాయి.  హాస్పటల్ కి తీసుకెళితే, లాభం లేదని డాక్టర్లు చెప్పారు.  నాలుగోరోజున అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు,  అతని శరీరంపై  ఎర్రని బొబ్బలు ఎర్రగా కాల్చిన అరెశలు పేర్చినట్లుగా ఉన్నాయి.  ఆ మరునాడు అతను మరణించాడు. చాలా విషాద కరమైన మరణం.

కొండచిలువలే కదా అని వాటితో పరాచికాలాడుతున్న విద్యార్ధులను హెచ్చరించాం.  కాసేపటికి అవి మెల్లగా మరోచోటికి జారుకొన్నాయి
బొల్లోజు బాబా

 

Tuesday, November 15, 2011

మధ్యాహ్నపు నిదురలో ఓ స్వప్నం


ఎడారిలో నడుస్తున్నాను
కనుచూపు మేర చుట్టూ ఇసక
దాహంతో గొంతు మండిపోతూంది
ధూళిపడి కనులు మెరుగుతున్నాయి
గాలి వేడికి శ్వాస ఉక్కిరిబిక్కిరౌతూంది

దూరంగా
ఆకుపచ్చని దుస్తులు ధరించిన ఆమె
నా వేపు చేతులు చాచి
తన కౌగిలిలోకి ఆహ్వానిస్తోంది
ఆమెనుంచి వస్తూన్న అత్తరు వాసన దారిలో
దాహాన్ని ఓర్చుకొంటూ
వేడిని చీల్చుకొంటూ
బాధను అణుచుకొంటూ
కాల్చే ఇసుకలో నడుస్తున్నాను
పరిగెడుతున్నాను... తూలిపోతున్నాను

ఎంత పరిగెట్టినా
ఇద్దరిమధ్యదూరం తరగటం లేదు
అంతు లేని పరుగు ....
వేడి పరుగు ....
కాల్చే పరుగు ....
నెత్తుటి పరుగు.

*****
చల్లని చేతి స్పర్శకు
హఠాత్తుగా మెలకువ వచ్చింది
ఎదురుగా ఆమె మోము

ఇంతసేపు ఆమె ఒడిలో
నిద్రిస్తూ కలకంటున్నానా!

ఎంతసేపటినుంచి
నా బరువుని మోస్తూందామె?

బొల్లోజు బాబా


Sunday, October 30, 2011

My paper presentation in the centenary celebrations of Historical society of Pondicherry


పుదుచ్చేరీ లోని “హిస్టారికల్ సొసైటీ ఆఫ్ పాండిచేరీ” వారి సెంటినేరీ సెలెబ్రేషన్స్ ను పురస్కరించుకొని జరిగిన రెండురోజుల సెమినార్ లో నేను యానం తరపున పాల్గొని  Various Stone Plates of yanam of French origin పేరిట ఒక  పేపర్ ప్రెసెంట్ చేయటం జరిగింది.
దీనిని ఒక వర్జిన్ పేపర్ గా పలువురు ప్రశంసించటం జరిగింది.
ఈ అవకాసాన్ని కల్పించిన డా. నల్లం వెంకట్రామయ్య గారికి (Presedent of Historical Society of Pondicherry) నా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. 

బొల్లోజు బాబా

Wednesday, October 12, 2011

23 జనవరి, 1757 న బొబ్బిలి కోటలో ఏం జరిగింది?


           బొబ్బిలికథ ఆంధ్రనాట జనపదుల నోట అమరత్వం పొంది ప్రసిద్ధిగాంచిన గాధ.  దీనిని సి.పి. బ్రౌన్ 1832 లో మల్లెశం అనే జానపద కళాకారుడు పాడుతూండగా  వ్రాతరూపంలోకి తీసుకొచ్చాడు.  బుర్రకథ, హరికథ, నాటకం, సినిమా వంటి అనేక కళారూపాలలో బొబ్బిలియుద్ధం జీవంపోసుకొని తరతరాలుగా  ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.  ఆ వీరగాథ వర్ణణ ఈ విధంగా ఉంటుంది.

           బొబ్బిలి రాజు రంగారావుకు విజయనగర రాజైన విజయరామరాజుకు మధ్య శతృత్వం ఉండేది.  విజయరామరాజు కోరిక మేరకు, ఫ్రెంచి సేనాని బుస్సీ 23 జనవరి, 1757 న బొబ్బిలికోటను ముట్టడించాడు.  ఈ ముట్టడిలో బొబ్బిలి సైన్యం ఓడిపోయింది.  కోట లోపలకు శతృసైన్యం ప్రవేశించేలోపల బొబ్బిలి వీరులు తమ భార్యలను, తల్లులను, గర్భిణీస్త్రీలను, పిల్లలను, ముసలివారిని మొత్తం సుమారు పదివేలమందిని ప్రాణత్యాగం గావించి చివరకు వారుకూడా యుద్ధంలో మరణించారు.  కొంతమంది మంటల్లో దూకి, మరికొందరు కత్తులతో పొడుచుకొని, శత్రువుల తుపాకీలకు ఎదురెళ్ళి ఇంకొందరూ ఆత్మహత్య చేసుకొన్నారు. దీనికి ప్రతీకారంగా మూడురోజుల అనంతరం, బొబ్బిలివీరుడు తాండ్రపాపారాయుడు విజయరామరాజును చంపి పగతీర్చుకొన్నాడు.

              బొబ్బిలి యుద్ధం జరిగిన నాలుగేళ్ల అనంతరం, 1861 లో  రాబర్ట్ ఓర్మె వ్రాసిన MILITARY TRANSACTIONS OF THE BRITISH NATION IN INDOSTAN అనే పుస్తకంలో ఈ యుద్ధవివరాలు  మరియు  1832 బ్రౌన్ కథనం కూడా  జనబాహుళ్యంలో ఉన్న బొబ్బిలివీరగాధ రూపానికి దగ్గరగానే ఉంటాయి.  కానీ బొబ్బిలియుద్ధం జరిగిన రెండునెలలతరువాత వ్రాయబడ్డ ఒక రికార్డులో మాత్రం మరోలా ఉంది.


    26 మార్చి, 1757 న ఆనందరంగపిళ్ళై వ్రాసుకొన్న డైరీలో బొబ్బిలి యుద్ధం గురించి జనబాహుళ్యంలో చలామణీలో ఉన్న దానికి విరుద్దంగా ఈ విధంగా వర్ణించబడింది.  (రి.  వాల్యూం 10 - పేజీలు 334-337).

.............. బుస్సీ బొబ్బిలి కోటను ముట్టడించినపుడు, కొద్దిమంది బొబ్బిలివీరులు కోటనుండి బయటకు వచ్చి ప్రతిఘటించగా బుస్సీ సేనలు వెనుతిరిగాయి.  దీనికి ఆగ్రహించిన విజయరామరాజు తన సేనల్ని కోటవైపు మళ్ళించాడు.  వారికి బుస్సీ సేనలు  సహాయపడ్డాయి.  భీకరమైన యుద్ధం జరిగింది.  ఆ యుద్ధంలో ఇరువైపులా 8-9 వేల మంది చనిపోయారు.  కోటచుట్టూ ఉన్న కందకం రక్తంతో నిండిపోయింది.  కోట వశమయినపుడు విజయరామరాజుతో బుస్సీ “కోటలో ఒక్క చిన్న శిశువుని ప్రాణాలతో ఉంచినా ఒక శత్రువుని మిగుల్చుకొన్నట్లే” అన్నాడు.  ఆ మాటలకు విజయరామరాజు కోటలో ప్రతిఒక్కరినీ చంపివేయమని తన సైనికులను ఆజ్ఞాపించాడు.  వారు ఆ విధంగానే కోటలోని స్త్రీలను, గర్భిణులను, పిల్లలను మొత్తం పదివేలమందిని హతమార్చారు, రంగారావుతో సహా.   అలా చేయటం యూరోపియన్ పద్దతి అని వర్ణించటం జరిగింది.  గాయపడిన రంగారావు తమ్ముడికి వైద్యం చేయించమని బుస్సీతో విజయరామరాజు చెప్పాడు.  కోటపై ఫ్రెంచి జండా ఎగరవేయబడింది.  సైనికులు విజయోత్సవం చేసుకొన్నారు.  ఒకరికొకరు చక్కెర తినిపించుకొన్నారు............

            బొబ్బిలి యుద్ధం జరిగిన రెండునెలల తరువాత వ్రాయబడిన పై విషయాలు విశ్వసనీయంగానే అనిపిస్తాయి.  ఎందుకంటే మిగిలిన అంశాలైన ఎంతమంది సైనికులు పాల్గొన్నారు, కోట నిర్మాణం, ఎంతమంది చనిపోయారు, తేదీలు సమయాలు, వివిధ వ్యక్తుల వివరాలన్నీ ఒర్మె మరియు బ్రౌన్ కథనాలతో సరిపోతున్నాయి.   అంతేకాక రంగపిళ్ళైకి అనేకమంది గూఢచారులు, వార్తాహరులు ఉండేవారట.  ఏదైనా ఒక విషయాన్ని ఇద్దరు ముగ్గురు దృవీకరిస్తేకానీ  పిళ్ళై నమ్మేవాడు కాదు.

           ఒక వేళ బొబ్బిలియుద్ధం రంగపిళ్ళై చెప్పినట్లు నడిచిఉన్నట్లయితే మొత్తం ఉదంతానికి ఆయువుపట్టయిన సామూహిక ఆత్మహత్యలు అసత్యం అవుతాయి.  శతృవులు జరిపిన ఊచకోతను సామూహిక ఆత్మహత్యలుగా ప్రచారించుకోవటం ఒక రాజకీయ ఎత్తుగడలా అనుకోవాల్సివస్తుంది.

(నేను రచించిన “ఫ్రెంచిపాలనలో యానాం” అనే పుస్తకంలోని “ఆనంద రంగపిళ్ళై డైరీలలో యానాం ప్రస్తావన” అనే చాప్టరు నుంచి)

బొల్లోజు బాబా


Sunday, October 9, 2011

దేహమూ - నీడా


సూర్యుని
వేడి రక్తపు చుక్కలు
నెర్రలు తీసిన భూమి చర్మం­­­­

చలి చీకటి తాగి
మెరుస్తూన్న
ఆకాశపుటిరుకు సందులు

గోడ గడియారం
మసిలో కూరుకుపోయింది

ఎంతవెతికినా
పురుగు చిక్కదు
వేకువ పక్షికి

పంజరం
పరిశుభ్రంగానే ఉంది కానీ
గుండెనిండా
లుకలుక లాడే మురికివాడలు


దేహం కన్నా
నీడే తెలివిగా ఉంది
ఈ బూడిద లోకాన్ని
నిత్యం సందేహిస్తుంది

రుధిర క్షణాలు
చలి శ్వాసకు గడ్డ కట్టాయి
అంతా నిశ్శబ్దం
లోకం నిద్దరోతుంది
దేహాన్ని నీడ కిడ్నాప్ చేసి
మృతుల దేశంలో దించేసింది

ఆ తరువాత.........బొల్లోజు బాబా

Friday, September 30, 2011

అదే గులాబీ.....

చేతిలో రంగుల ఉత్తరం
గులాబీ పువ్వుతో
ఆ అబ్బాయి బస్సుకై
ఎదురుచూస్తున్నాడు

తను గుర్తుకొచ్చింది
ఒకనాటి
పూర్తికాని చుంబన పరిమళం
ఎదంతా పరచుకొంది

ఆ అబ్బాయి కళ్ళు
ఆగిన ప్రతి బస్సునీ
వెతుకుతున్నాయ్.


అతను అచ్చునాకులానే
ఉన్నాడనిపించింది
అవే కళ్ళు ...
అవే చూపులు ...
అదే గులాబీ ...


ఏమో నేనే
ఆ అబ్బాయినేమో!
ఆ అబ్బాయే
నేనేమో!

మరోసారి తడుముకొన్నాను
జెబులోని
గులాబీ రేకల గరగరల్ని


బొల్లోజు బాబా

Friday, September 23, 2011

ఎంతదృష్టం......

ఎంతదృష్టం!
కనులున్నాయి
కనులు కనే
కలలున్నాయి
కలలు ఆవిష్కరించే
హాయైన లోకాలున్నాయి
ఎంతదృష్టం!


గాయాల్ని
ఇముడ్చుకొనే
హృదయముంది
హృదయ గాయాల్ని
నయం చేసే
కాలం ఉంది
కాలాన్ని వేటాడే
జీవితం మిగిలే ఉంది
ఎంతదృష్టం!


అన్ని వైఫల్యాలనూ
అక్కున చేర్చుకొనే
ప్రకృతుంది
ప్రకృతి పొరల్లో
ప్రాణాన్ని గింజను చేసి
పాతిపెట్టే మృత్యువుంది
మృత్యు స్పర్శను
నిత్యం స్వప్నించే
కనులున్నాయి......
ఎంతదృష్టం!


లేకపోతేనా
ఇన్ని వైరుధ్యాలున్న లోకాన్ని
దాటటం ఎంత కష్టం!


బొల్లోజు బాబా

Monday, September 12, 2011

కవిత్వం


ఆమె వచ్చి కూర్చొంది
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం
రివ్వున వీస్తోంది

ఎక్కడి నుంచైతే నా భవిష్యత్తుని
ప్రారంభించానో ఆ పెదవులు
సన్నగా కంపిస్తున్నాయి

కానీ
ఆ నాటి కరుణ స్పందన కాదిది

ఇరువురి మౌనం
ఆ క్షణాల్ని కోసుకొంటూ సాగుతోంది
నదిని చీల్చుకొంటూ సాగే నావలా

హృదయ వేదికపై
మృత   జ్ఞాపకాల
కరాళ నృత్యం

శకలాల్ని ఒక్కొక్కటీ
ఏరుకొంటున్నాను

జారిపోతున్న చీకటినంతా
కూడదీసుకొని
"ఇక వెళ్తాను" అని లేచింది
"వెళ్ళొస్తాను" అను
"వస్తే....... వెళుతున్నానుగా!" అంది

నా నిస్సహాయ చూపుల్ని
విడిపించుకొని
ఆమె వెళిపోయింది
.............

రెండోసారీ
పునర్జన్మించాల్సినంత
జీవన కాంక్ష
ఎంతకీ కలగట్లేదు

ఇక శలవ్!

బొల్లోజు బాబా


Tuesday, May 17, 2011

ఓడంగి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)

రేవులో కలాసి మధు పడవ లంగరు వేసిఉంది
పడవంతా గోగునార తో నింపారు అనవసరంగా
చాలా కాలంగా అలానే జరుగుతూంది.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
దానికి ఓ వంద తెడ్లూ అయిదో ఆరో ఏడో తెరచాపల్నీ బిగిస్తాను
దానిని ఈ పిచ్చి బజారులవైపు నడిపించను
ఇంద్రజాలలోకపు సప్త సముద్రాలు, పదమూడు నదులవైపు నడిపిస్తాను.

అమ్మా! అలా మూల కూర్చొని నాకొరకు బాధపడకు.
రామచంద్రునిలా పద్నాలుగేళ్ళ అనంతరం రావటానికి నేను
అడవులకు పోవటం లేదు కదా!

నువ్వు చెప్పిన కధలో రాకుమారునిలా మారిపోయి
ఇష్టమైన వాటితో నా పడవను నింపుతాను.
నా మిత్రుడు చంటిని కూడా తోడ్కొని వెళతాను.
మేమిద్దరం కలసి ఇంద్రజాల లోకపు సప్త సముద్రాలను,
పదమూడునదులను వేడుకగా చుట్టివస్తాను.

ఉషాకాంతిలో మా ప్రయాణాన్ని మొదలుపెడతాము
మధ్యాహ్నం నీవు కొలనువద్ద స్నానంచేసే వేళకు
మేము మరో ప్రపంచంలో ఉంటాం.
పగడపుదీవులను దాటుకొంటో, మరుగుజ్జు లోకపు
రేవులమీదుగా ముందుకు సాగుతాం.

మేం తిరిగి వచ్చేసరికి చీకటి పడుతుంటూంది.
మా ప్రయాణపు వింతలు విశేషాల్ని నీకు చెపుతాను.

అతను తన పడవను నాకు ఇస్తేనా....
ఇంద్రజాలలోకపు సప్తసముద్రాలను, పదమూడు నదులనూ
వేడుకగా చుట్టివస్తాము.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Sailor   గీతం)Sunday, May 15, 2011

ఒక పాత కామెంటు


వెబ్ లో వెతుకుతూంటే చాన్నాళ్ళ క్రితం ఓ బ్లాగులో చేసిన ఓ కామెంటు కనపడింది.  బాగున్నట్టనిపించి ఇక్కడ పంచుకొంటున్నాను. పూర్ణిమ గారికి ధన్యవాదములతో........


Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.

– W.S. Merwin

పై కవితకు అనుసృజనగా నే  వ్రాసిన కొన్ని రూపాలు

1.నీవియోగం నన్ను చీల్చుకొంటో పోయింది.
పూమాలలోంచి దారంలా
నా హృదయం నిండా నీజ్ఞాపకాల పరిమళాలే.

2. నీవు లేని ఆ క్షణం ఒక దారమై
నా మనసనే సూది గుండా దూసుకుపోయి
నా ప్రతి ఆలోచనకూ నీవర్ణాన్నే అద్దుతోంది.

3.దారానికి సూది వేలాడినట్లుగా
నీ వియోగానికి నా హృదయం వేలాడుతోంది.
ఎంత ప్రయాణించినా నీ వృత్తంలోనే నడకలు.


ఆ పాత పోస్టు లింకు ఇక్కడ

http://pisaller.wordpress.com/2008/12/21/separation/

మాయా లోకం (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా రాజభవంతి ఎక్కడుందో ఎవరికైనా తెలిసిపోయిందంటే అది గాలిలో మాయమైపోతుంది తెలుసా!  దానికి వెండి గోడలు బంగారపు పై కప్పు ఉంటాయి.

ఏడు మండువాలున్న ఆ నగరులో రాణీగారుంటారు.  ఆమె మెడలో మణి సప్తరాజ్యాల సంపదంత విలువ.

నా రాజభవంతి ఎక్కడుందో నీకు చెప్పనా అమ్మా! ఎవరికీ చెప్పకూడదు మరి. మన మిద్దెపై మూలనున్న తులసి కోటవద్ద.

ఎవరూ దాటలేని సప్తసాగరాల సుదూర తీరంపై రాకుమారి శయనిస్తూంటుంది.  ఆమెను నేను తప్ప ఈ లోకంలో మరెవ్వరూ కనిపెట్టలేరు.

ఆమె చేతికి గాజులు, చెవులకు ముత్యాల దుద్దులు ఉంటాయి.  ఆమె కురులు నేలను తాకుతూంటాయి.

నా మంత్ర దండంతో తాకితే ఆమె నిదురలేస్తుంది.
ఆమె నవ్వితే నోటివెంట ముత్యాలు రాలుతాయి.

గొప్ప రహస్యం చెపుతాను విను అమ్మా!
మన మిద్దె పై మూలనున్న తులసికోటే ఆమె నివాసం.

ఏటి స్నానానికి నీవు వెళ్ళినపుడు నేను మిద్దె పైకి చేరి గోడల నీడలు కలుసుకొనే ఆ మూలన కూర్చుంటాను.  చిట్టిని మాత్రమే నాతో రానిస్తాను.  ఎందుకంటే కథలోని మంగలి ఎక్కడుంటాడో తనకే తెలుసు.

కథలో మంగలి ఎక్కడుంటాడనేది ఒక రహస్యం.  నీ చెవిలో చెపుతాను విను.
అతనుండేది మన మిద్దె పై మూలనున్న తులసికోటవద్ద. 

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని Fairy Land   గీతం)

బొల్లోజు బాబా

Monday, May 9, 2011

న్యాయాధిపతి (రవీంద్రుని "క్రిసెంట్ మూన్" కు తెలుగు అనువాదం)


నా చిన్నారి గురించి 
నువ్వెన్ని మాటలు చెప్పినా
నాకు తెలుసు వాని దోషాలు.
ఉత్తమమైనవాడని కాదు 
నేను వాడిని ప్రేమించేది
నా చిన్నారి శిశువు కనుక.

వాని అర్హతలను దోషాలతో తూకం వేసే మీకు
వాడు నాకెంత ప్రియమైన వాడో 
ఎలా తెలుస్తుంది?

వాడిని దండించేటపుడు 
వాడు నాలో భాగమై ఉంటాడు.

వాడికి కంటనీరు తెప్పించేటపుడు
వానితో కలసి నా  హృదయమూ ఏడుస్తుంది.

వాడిని నిందించటానికి కానీ 
దండించటానికి కానీ
నాకే అధికారముంది ఎందుకంటే
ఎవరైతే ప్రేమిస్తారో వారే శిక్షించగలరు.

(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Judge గీతం)

బొల్లోజు బాబా

Saturday, May 7, 2011

సిద్ధాంతి (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)నేనన్నానూ

"మునిమాపు వేళ నిండుచందమామ ఆ కాదంబరీ చెట్టు
కొమ్మలలో చిక్కుకున్నది.  ఎవరైనా దానిని అందుకోగలరా?" అని

పెద్దన్నయ్య నవ్వి "నాకు తెలిసి అతి పెద్ద తెలివి తక్కువ పిల్లవు నీవు, చెల్లీ!
చంద్రుడు సుదూరంగా ఉంటాడు, ఎవరైనా ఎలా పట్టుకోగలరూ?" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నువ్వెంత అమాయకుడవూ!  మనం ఆడుకొనేపుడు
కిటికీ నుండి చూస్తూ నవ్వే అమ్మ మనకు సుదూరంగా ఉందా? అని

నీవు నిజంగా తెలివి మాలిన దానవే! చందమామ పట్టేంత పెద్దవల
నీవు సంపాదించగలవా? అన్నాడు

నేనన్నానూ
"నీ చేతులతోనే పట్టుకోగలవు" అని

అన్న మళ్ళీ నవ్వి "నీవు నిజంగా వెర్రిదానవే, చందమామ దగ్గరగా వస్తే
నీకు తెలుస్తుంది అదెంత పెద్దదో" అన్నాడు

నేనన్నానూ
"అన్నయ్యా నీకు బడిలో అర్ధంలేని విషయాలేవో చెపుతున్నారు
అమ్మ మనల్ని ముద్దిడ వంగినపుడు ఆమె మోము చాలా పెద్దదిగా ఉంటుందా?

"నీవు తెలివి తక్కువ పిల్లవే" అన్న ఇంకా అంటూనే ఉన్నాడు.(మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని The Astronomer గీతం)బొల్లోజు బాబా


Saturday, February 26, 2011

నగరంలో చిరుత

నగరంలో చిరుత

జనావాసంలోకి చిరుత ప్రవేశించింది.
పాపం అది దారి తప్పి కాదు ఇటువస్తా.
తను పుట్టిన ప్రదేశాన్ని చూసుకొందామని వచ్చింది.
ఎటెళ్లాలో తెలియక ఓ ఇంటి బాత్ రూం లో దూరింది.

లక్షల విలువచేసే దాని మచ్చల చర్మం మెరుస్తోంది.
ఆ నిగారింపు తెలియకూడదని కామోసు
అది చీకటి మూలల్లోకి నక్కుతోంది.

తన ఒక్కో గోరు మూడేసి వేలని విన్నట్లుంది
గోళ్లనన్నీ లోనకు లాగేసుకొంది.

తన ఎముకలపొడి తులం వెయ్యి రూపాయిలని వినగానే
దానికి వెన్నులోంచి చలి మొదలైంది.
రక్షించండి, రక్షించండీఅని అరచింది దీనంగా.
జనాలు భయంతో పరుగులు తీసారు.

ఓ అత్యుత్సాహి దానికి కొంచెం దగ్గరగా నుంచొని
సెపియా టోన్ లో ఫొటోలు తీయించుకొంటున్నాడు.

మీడియావాడొకడు ఎక్స్ క్లూసివ్ కవరేజ్ కోసమని
దానిని కర్రతో పొడిచి కెమేరా ఆన్ చేస్తున్నాడు.
కర్రతో పొడిచి కెమేరా ఆన్ చేస్తున్నాడు .........

ఆ హడావిడిలో బాత్ రూం తలుపు గడియ ఊడింది.
ఒక ఉరుకులో అది బయటపడి
ఇక వెనక్కు తిరిగి చూడకుండా పరిగెట్టింది.
మానవ మృగాలకు దూరంగా ...  చెట్లు నరికిన అడవి వైపు.

 బొల్లోజు బాబా

Monday, February 14, 2011

ఫ్రెంచి పాలనలో యానాం..... 10


ఫ్రెంచి యానాం లో జరిగిన బానిస వ్యాపారం
  పంతొమ్మిదవ శతాబ్దం చివరవరకూ జరిగిన బానిస వ్యాపారం మానవజాతి ఎన్నటికీ చెరుపుకోలేని మరక. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనే అంశాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలియచెప్పిన ఫ్రాన్స్ ఒకానొక సమయంలో బానిస వ్యాపారంలో ప్రధాన పాత్ర వహించటం ఆశ్చర్యం కలిగించే విషయం1794 లోనే ఫ్రెంచి రిపబ్లిక్ బానిస వ్యాపారాన్ని నిషేదించిందికానీ 1802 లో నెపోలియన్ ఆ నిషేదాన్ని ఎత్తివేసాడుఈ వెసులుబాటువల్ల, 1830 లోలూయిస్ ఫిలిప్ బానిస వ్యాపారాన్ని నేరమని చట్టం తీసుకువచ్చేవరకూ, అది చట్టబద్దంగానే కొనసాగిందిఇక అనధికారికంగా 1850ల వరకూ కూడా అక్కడక్కడా నడిచిందిబానిస వ్యాపారాన్ని 1772 లోనే ఇంగ్లాండ్ నిషేదించి ఫ్రాన్స్ కంటే ముందుండటం గమనార్హంఈ విషయంలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్ వారు ఆకాలంలో ఒక విధమైన “మోరల్ పోలీసింగ్” పాత్ర పోషించారు.

ఫ్రాన్స్ కు స్థానికంగా ఈ అనాగరీకమైన బానిస వ్యాపారంపట్ల ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ, దానిని నిషేదించలేకపోవటానికి – ఫ్రెంచి కాలనీలైన రీయూనియన్ లో (మడగాస్కర్ సమీపంలో ఫ్రెంచి వారు ఆక్రమించుకొన్న ఒక ద్వీపం) మంచి లాభాల్నిచ్చే చెరకుతోటల సాగుకు వేల సంఖ్యలో కూలీలు అవసరం కావటంఆ తోటలు సమకూర్చే ఆర్ధికవనరులు ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో సుమారు యాభైలక్షల ఫ్రెంచి వారికి జీవనోపాధి కలిగించటం (1763 నాటికి) వంటివి ప్రధాన కారణాలుఅందుకనే ఫ్రెంచి ప్రభుత్వం బానిస వ్యాపారానికి సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రోత్సహించవలసి వచ్చేదిఈ కారణాల దృష్ట్యా1672 లో 10 లీవ్ర్ లు ( లీవ్ర్= ప్రాచీన ఫ్రెంచ్ కరన్సీ. ఒక లీవ్ర్ సుమారు 450 గ్రాముల వెండి విలువతో సమానం) ఉండే ఒక బానిస వెల,  1730 లో 100 లీవ్ర్ లకు, 1787 నాటికి 160 లీవ్ర్ లకు క్రమంగా చేరింది.

ఫ్రెంచి వారు తమ బానిసలను మొదట్లో ఆఫ్రికానుంచి సేకరణ జరిపినా కాలక్రమేణా ఇండియాలోని తమ కాలనీల నుంచి కూడా తరలించటం మొదలెట్టారు1760 లో ఏడాదికి సగటున 56 షిప్పులలో బానిసల ఎగుమతి జరిగేదిఒక్కో షిప్పులో మూడునుంచి నాలుగొందలమంది బానిసలు పట్టే సామర్ధ్యం కలిగుండేవి. 1767 లో చక్కెర ఉత్పత్తిలో ఫ్రెంచ్ వారు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచారురీయూనియన్ లో చెరకుతోటల్లో పనిచేసే బానిసల జీవనం కడు దయనీయంగా ఉండేదివారు రోజుకు దాదాపు ఇరవైగంటలు పనిచేసేవారుస్త్రీలు కొద్దిసంఖ్యలో ఉండేవారుకుటుంబాలు ఉండేవి కావుఆ కారణాలవల్ల మరణ రేటు అధికంగా ఉండటంతో నిరంతరం బానిసలకొరత ఉండేదిబానిసలను చేరవేసే నౌకలు  Amity”, Liberte వంటి గొప్ప పేర్లు కలిగిఉండటం దురదృష్టకరం.

యానాంలో ఫ్రెంచి వారు జరిపిన బానిస వ్యాపారానికి ఆధారాలు 1762 లో యానాం సమీపంలో కల ఇంజరం అనే గ్రామంలో నివసించే Mr.Yates అనే ఓ బ్రిటిషర్, పాండిచేరీలోని ఫ్రెంచి జనరల్ (Colo De Frene) కి వ్రాసిన ఓ లేఖ లో దొరుకుతాయి.  (Ref: Asiatic Jour. Vol. 26 No.156 –  printed in 1828 -  Chapter Slavery in India,  Page Nos 665 to 670).

యేట్స్ ఎపిసోడ్ (1762) బానిసలను  ఎక్కించుకొనే ఫ్రెంచి నౌకలు కోరంగి నుంచి బయలుదేరే తారీఖు దగ్గర పడేకొద్దీ,   బానిసలను సరఫరా చేసే మధ్యవర్తులు రకరకాల పద్దతులకు పాల్పడేవారుకొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో కరువు విలయతాండవం చేయటం వల్ల తిండిలేక చచ్చిపోవటం కంటే బానిసగా బతకడమే మేలనే ఉద్దేశ్యంతో ప్రజలుండేవారుకానీ ప్రస్తుతం కొద్దో గొప్పో తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండటంచే, బానిసల సేకరణ వారికి కష్టమై హింసాత్మక పద్దతులకు పాల్పడటం మొదలెట్టారుయానాం వీధులలో తిరిగే యాచకులను, యానాంలో సరుకుల కొనుగోలు కోసం వచ్చిన ఇతర గ్రామస్థులను పట్టి బంధించి, రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రివేళలలో ఫ్రెంచి నౌకలలోకి ఎక్కించేవారుఈ వ్యక్తులను వారికుటుంబాలనుండి అతి కిరాతకంగా విడదీయటం అనేది ఆయా ఫ్రెంచి నౌకల యజమానులైన కొద్దిమంది ఫ్రెంచి వారి కనుసన్నల్లో జరిగేది.

అలా సాగిన యేట్స్ అభియోగాలను సమర్ధిస్తూ అయిదుగురు ఇంజరం వాస్థవ్యులు లిఖిత పూర్వకంగా దృవీకరించారువీరిలో బొండాడ వెంకటరాయలు అనే ఓ వైశ్యుడు వ్రాసిన లేఖ ఈ ఉదంతంపై మరింత వెలుగును ప్రసరింపచేస్తుంది.

బొండాడ వెంకటరాయలు, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీచే గుర్తింపుపొందిన ఒక యానాం వ్యాపారిఈయన తన ఉత్తరంలో, M. de Mars, M. La Blanche  మరియు M. Ellardine అనే ముగ్గురు ఫ్రెంచినౌకల యజమానులు, యానాం నుంచి బానిసలను కొనుగోలు చేయటానికి మధ్యవర్తులను ఏర్పాటుచేసుకొని వారిద్వారా యానాంలోని ముష్టివారిని, పొరుగూరివారిని బలవంతంగా నిర్భందించి కోరంగి రేవులో నిలిపిన వారి నౌకలలోకి ఎగుమతి చేయిస్తున్నారని -  అంతే కాక యానాం చుట్టుపక్కల గ్రామాలకు మనుషులను పంపించి, అక్కడి కూలీలకు, దర్జీలకు  పని ఇప్పిస్తానని నమ్మబలికి వారిని యానాం తీసుకువచ్చి బంధించి, రాత్రివేళలలో ఎవరికీ తెలియకుండా వారిని నౌకలలోకి తరలిస్తున్నారనీ -   ప్రతిఘటించే వారి నోటిలో గుడ్డలు కుక్కి లేదా సారాయిని బలవంతంగా తాగించి ఆ నిస్సహాయస్థితిలో వారిని నౌకలలోకి మోసుకుపోవటం జరిగుతుందనీ...... అంటూ ఆనాటి సంఘటనలను వర్ణించాడు.

ఆతేరు గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మల అబ్బాయినినీలపల్లి చెందిన ఒక భోగం పిల్లని, ఏ వూరో తెలియని ఓ బ్రాహ్మణ అమ్మాయిని కూడా ఈ విధంగానే కిడ్నాప్ చేసి నౌకలోకి తరలించారుఈ ముగ్గురి విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకొన్న యానాం పెద్దొర (సొన్నరెట్) ఆ నౌక కెప్టైన్ కు ఆదేశాలు జారీ చేసి వారిని విడుదల చేయించాడు
అలా  ఆ ఫ్రెంచి నౌక ఎక్కి తిరిగొచ్చిన ఆ ముగ్గురూ, ఆ నౌకలో అనేకమంది కూలీలు, కుటుంబ స్త్రీలు, కొద్దిమంది బ్రాహ్మణులు ఉన్నారని చెప్పటంతో ఆగ్రహించిన స్థానికులు  ఆ మిగిలిన వారిని కూడా విడిపించమని సొన్నరెట్ ను అడగడం జరిగిందికానీ సొన్నరెట్ ఏ రకమైన హామీ ఇవ్వకపోవటంతో, నౌక బయలుదేరే తారీఖు దగ్గరపడుతుండడంతో, పొరుగునే ఉన్న బ్రిటిష్ అధికారులను వారు ఆశ్రయించారు.
ప్రజలవద్దనుండి వచ్చిన విజ్ఞప్తులపై విచారణ నిమిత్తం యేట్స్ యానాం వెళితే చాలామంది యానాం వాస్థవ్యులు ఆయనను చుట్టుముట్టి, సుమారు మూడువందలకు పైగా వారి బంధువులను ఎత్తుకుపోయారని గగ్గోలు పెడుతూ తమ గోడును వెళ్లబోసుకొన్నారుచిన్నపిల్లలను కూడా విడిచిపెట్టలేదని కన్నీరు మున్నీరై విలపించారుఈ మొత్తం ఉదంతంపై సొన్నరెట్ ను వివరణ కోరగా అలాంటిదేం లేదని మొదట్లో వాదించి, చివరకు కావాలంటే నౌకను తనిఖీ చేసుకోవచ్చునని అనుమతినిచ్చాడు. దరిమిలా ఒక ఫ్రెంచి అధికారి, స్కోబీ అనే ఒక ఇంగ్లీషు అధికారి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పడి నౌక తనిఖీ కి కోరంగి వెళ్ళారుకానీ నౌక కెప్టైన్ వీరిని లోనికి రాకుండా అడ్డుకొని, ఏవిధమైన వివరణలు ఇవ్వకుండా కమిటీని వెనక్కు పంపించేసి కోరంగి రేవునుండి నౌకతో సహా జారుకోవటం జరిగింది.  

యానాం పెద్దొర తన విచక్షణాధికారాలను ఉపయోగించి నౌకను నిలుపు చేసి ఉన్నట్లయితే ఆ స్థానికుల తరలింపు నివారింపబడి ఉండేదని యేట్స్, Major Wynch అనే బ్రిటిష్ అధికారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు.

పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నర్ (M.De Fresne) ఈ విషయాలనన్నీ బ్రిటిష్ గవర్నర్ జనరల్  (Lord Cornwallis) ద్వారా తెలుసుకొని, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిని అరష్టు చేసి పాండిచేరీ పంపవలసినదిగా ఆదేశాలు జారీ చేసాడుఅంతే కాక వీటిని నియంత్రించలేని తన నిస్సహాయతను కూడా (సరైన పర్యవేక్షణా యంత్రాంగం లేకపోవటం చే) తెలియ చేసాడుఅలాంటి అనుమతులకోసమే ఎదురుచూస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే కోరంగి, భీమిలిపట్నం ల వద్ద సిపాయిలను నియమించి, తీరప్రాంతంలో ఫ్రెంచి వారు జరిపే దారుణ బానిసవ్యాపారాన్ని అరికట్టటానికి పూనుకొంది.

యానాం పెద్దొర సొన్నరెట్ మాత్రం ఒక లేఖలో “ఇంగ్లీషు వారు కూడా ఈ బానిసవ్యాపారంలో ఉన్నారనీఒకసారి ఓ ఇంగ్లీషు నౌకలో బానిసలుగా తరలింపబడుతున్న 12 మంది యానాం వాసులను తాను విడిపించానని” చెప్పటం ఈ మొత్తం ఉదంతానికి కొసమెరుపు.

1793 నుండి1816 వరకు యానాం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండటం వల్ల, ఆ కాలంలో యానాంలో జరిగిన విషయాలు తెలియరావు.
  ఫ్రెంచి వారు చేసే ఈ బానిస వ్యాపారంపై బ్రిటిష్ వారి పహారా ఎంతెలా ఉండేదో 1820 లో జరిగిన ఒక సంఘటన తెలియచేస్తుంది.

La Jeune Estele అనే ఫ్రెంచి నౌకను, బ్రిటిష్ గస్తీ పడవలు వెంబడించగా ఆ నౌక కెప్టైన్ కొన్ని పీపాలను సముద్రంలోకి విసిరేయటం మొదలెట్టాడుఅలా విసిరేసిన ఒక్కో పీపాలో 12 నుండి 14సంవత్సరములు వయసుకలిగిన బానిసలు ఉండటం పట్ల యావత్ ప్రపంచం నివ్వెర బోయిందిఈ సంఘటన తరువాత బ్రిటిష్ వారి కాపలా మరింత ఉదృతమైంది.

అయినప్పటికీ ఈ కాలంలో 3211 మంది కూలీలలు పంతొమ్మిది నౌకలలో యానాం నుంచి  రీయూనియన్ కు పంపించటం జరిగిందివీరిలో అధికశాతం ఇంగ్లీషు టెరిటరీనుంచే కావటం గమనార్హం  (Article of Mr Jacques Weber: “L’emigration indienne vers les colonies francaises”)

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ ఫ్రెంచి ప్రభుత్వం పాత పద్దతులకు స్వస్థి పలికి కార్మికుల సేకరణ కొరకు కొత్తవిధానాన్ని ప్రవేశపెట్టింది.

యానాంలో కాంట్రాక్టు పద్దతిపై కార్మికుల ఎగుమతి

రీయూనియన్ లోని చెరుకు తోటలలో పని చేయటానికి కార్మికుల అవసరం రోజు రోజుకూ పెరగటం, ఇండియానుంచి కార్మికులను తీసుకోవటానికి పొరుగు రాజ్యాన్నేలే బ్రిటిష్ వారు ఎక్కడికక్కడ అనేక ఆంక్షలు విధించటం వల్ల ఫ్రెంచి ప్రభుత్వం 1828 లో కాంట్రాక్టు పద్దతి ద్వారా కార్మికులను రిక్రూట్ చేసుకోవటం మొదలెట్టిందిఫ్రెంచి ప్రభుత్వం నియమించిన ఏజెంటుకు, ఇక్కడి కార్మికునకు మధ్య జరిగే  కాంట్రాక్టు లో ఈ క్రింది హామీలుండేవి
1.       కాంట్రాక్టు కాలపరిమితి మూడు సంవత్సరాలు
2.       ప్రతి కూలీకి నెలకు ఏడు రూపాయిల జీతం ఉంటుంది.
3.       తిండి వసతి ఆరోగ్య సదుపాయాలు కల్పించబడతాయి.
4.       వారి వారి ఆచారాలను, మతపరమైన సాంప్రదాయాలను గౌరవించటం జరుగుతుంది.
5.       రాను పోను ఖర్చులను మరియు కాంట్రాక్టు ముగియకముందే అనారోగ్య లేదా ఇతర కారణాలవల్ల స్వదేశానికి వెళ్లాలనుకొనేవారి తిరుగుప్రయాణం ఖర్చులను కూడా యజమానే భరిస్తాడు.
6.       ప్రతీ కార్మికునకు ముందుగా మూడు నెలల జీతం అడ్వాన్సు గా ఇవ్వబడుతుంది.
7.       పనిలో చేరాకా ఇచ్చే జీతంలో మూడు రూపాయలకు కార్మికుని చేతికి, మిగిలిన నాలుగు రూపాయిలు ఇక్కడ అతని కుటుంబసభ్యులకు నెల నెలా అందించబడుతుంది.

కాంట్రాక్టు లోని చివరి రెందు హామీలకు యానాం వాసులేకాక పొరుగు ప్రాంతాల వారు కూడా ఆకర్షితులై అధిక సంఖ్యలో ముందుకొచ్చారు. ఆ విధంగా కంట్రాక్టు కుదుర్చుకొన్న మొత్తం 268 మంది కార్మికులు 7 ఆగష్టు, 1829 న యానాం నుంచి రీయూనియన్ కు నౌకలో బయలు దేరారు. వారిలో 197 మంది దళితులు, 27 మంది ముస్లిములు, పదముగ్గురు చేనేతకారులు, పదముగ్గురు రైతులు, అయిదుగురు ఫిషర్ మెన్, ఇద్దరు అగ్రకులస్థులు, (మిగిలిన వారి వివరాలు తెలియవు) ఉన్నారు. (రిఫరెన్స్: Personal state of Indians embarking at Yanam for Bourbon (రీయూనియన్ కు మరో పేరు) from 16 March 1828 to 6 August 1829, COR.GLE, India V.29)

యానాంలోని వీరి కుటుంబాలకు నెల నెలా ఇచ్చే చెల్లింపులను, రీయూనియన్ లోని వీరి యజమాని అయిన Mr.Argand  తరపున చెల్లిస్తానని, యానాంలో ఉండే ఫ్రెంచి ఏజెన్సీ De.Courson and Co వారు హామీ ఉంటారుమొదటి వాయిదా డిశంబరు 1829 నాటికి చెల్లించవలసి ఉందికానీ జనవరి వచ్చేసిన వారికి ఒక్కపైసా కూడా ముట్టదువారందరూ యానాం పెద్దొర అయిన Mr. De. Lesparda వద్దకు వచ్చి విన్నవించుకొంటారు.  “ఆర్గాండ్ నుంచి మాకేమీ డబ్బులు ముట్టలేదు కనుక మేము వీరికి ఏ రకమైన చెల్లింపులు చేయలేము” అని కుర్ సన్ అండ్ కో వారు చేతులెత్తేయడంతో- ఎనిమిదిరోజులుగా పస్తులతో పెద్దొర గారి బంగ్లా వద్ద ఎదురుచూస్తున్న ఆ కార్మికుల కుటుంబాలకు యానాం పెద్దొరే 17 జనవరి, 1930 నుండి కొద్దిపాటి చెల్లింపులు చేయటం మొదలెడతాడు.

ఇదిలా ఉండగాఅక్కడ రీయూనియన్ లోని చెరుకు తోటలు ఆ సమయంలో భారీ నష్టాలను ఎదుర్కోవటంతో, ఈ కార్మికులు సంతృప్తి కరంగా లేరనే సాకు చూపి ఇక్కడ కుదుర్చుకొన్న ఆర్ధిక ఒప్పందాలను నెరవేర్చలేమని తెగేసి చెప్పి, వీరిని  తిరిగి ఇండియా పంపించివేసారు అక్కడి తోటల యజమానులుఆవిధంగా యానాం లో జరిగిన కాంట్రాక్టు కార్మికుల ఎగుమతి వ్యవహారం అర్ధాంతరంగా ముగిసిపోయిందికంట్రాక్టు పద్దతి లో కల అమోదయోగ్యమైన అంశాలకు ఆశ్చర్యపడిన  బ్రిటిష్ వారు, ఈ రకపు కూలీల తరలింపును ఏవిధంగానూ ఆటంక పరచలేకపోయారు. అయినప్పటికీ ఈ పద్దతి విజయం సాధించలేక పోవటంతో మరలా మరో ఇరవై ఏళ్ల వరకూ యానాం నుంచి ఏవిధమైన వలసలూ జరిగినట్లు తెలియరాదు

కూలీల సేకరణలో ఫ్రెంచ్ వారి పై  బ్రిటిష్ వారి ఆంక్షలు: 1849
కూలీల సేకరణ, వారి తరలింపు అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారటంతో పాండిచేరీ, కారైకాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ లలో ఇదొక ప్రధాన పాత్రను వహించటం మొదలైందిఫ్రెంచ్ ప్రభుత్వం కూడా " సొసైటీ ఫర్ ఎమిగ్రేషను" అనే సంస్థకు ఈ విషయంలో సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ సొసైటీ అధిపత్ ఐన జూల్స్ బెడియర్ ప్రెయరీ ఈ వ్యాపారంలో విపరీతమైన లాభాలార్జించి  అప్పటి ఫ్రెంచ్ ఇండియాలో అత్యంత ధనికుడిగా పేర్గాంచాడు. ఒకానొక దశలో పాండిచేరీ, కారైకాలలో కూలీలు ఇక దొరకని పరిస్థితి రావటంతో, బెడియర్ కళ్ళు యానాం పై పడతాయిదరిమిలాయానాం లో కూలీల సేకరణ జరుపుకోవటానికి అనుమతిస్తూ ఫ్రెంచ్ ప్రభుత్వం  1 సెప్టెంబర్ 1849 ఉత్తర్వులు జారీ చేసి, అప్పటి యానాం పెద్దొర, జోర్డైన్ కు రెండువేల పాస్ పోర్ట్ లను పంపిస్తుంది. (రిఫరెన్స్: India card 464, D.591, and the article of Jacques Weber)
లె పికార్డ్ అనే ఫ్రెంచ్ నౌక లో బెడియర్  తన మంది మార్బలంతో11 సెప్టెంబర్ 1849 న పాండిచేరీలో బయలుదేరి  14 సెప్టెంబరుకు యానాం చేరుకొన్నాడుఈ ప్రాంతమంతా ఘోరమైన వరదలవల్ల జనజీవనం అస్తవ్యస్థమైన్ ఉండటం వల్ల   వారికి కూలీల సేకరణ పెద్ద కష్టం కాలేదు30 సెప్టెంబరు కల్లా మొదటి దఫా కూలీల సేకరణ పూర్తయ్యింది.   వారికి (అరవై మంది) యానాం పెద్దొర  జోర్డైన్  సంతకం చేసిన పాస్ పోర్టులు  జారీ చేయబడ్డాయి. వీరందరినీ కోరంగి రేవులో ఉన్న ఫ్రెంచ్ నౌకపైకి చేరుస్తుండగా మొదలైంది అసలు కధ.
1 సెప్టెంబర్ న బ్రిటిష్ అధికారి ఒక కానిస్టేబుల్ ని వేసుకొని వచ్చి ఈ కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలించబడుతున్నారా అన్న విషయం తెలుసుకురమ్మని  రాజమండ్రి కలక్టరు జారీ చేసిన ఒక ఉత్తర్వును చూపి, ఆ అరవైమంది కూలీలను ఒక్కక్కరినీ విచారించటం మొదలెట్టాడు.  2 సెప్టెంబరున కలక్టరు ప్రెన్ డెర్గాస్త్ గారే స్వయంగా వచ్చి కూలీలను ప్రశ్నించి, వారందరూ మేము ఇష్టపూర్వకంగానే వెళుతున్నామని చెపుతున్నా  సంతృప్తి చెందకబ్రిటిష్ పౌరులకు   కోరంగి రేవు నుండి విదేశాలకు వెళ్లే అనుమతి లేదన్న కారణంచే బెడియర్ తో సహా అందరినీ జగన్నాయకపురం తరలించి, అరెష్టు చేయించాడువారిని 10 సెప్టెంబరు న బ్రిటిష్  ప్రభుత్వం విడుదల చేసింది.
అవమానభారంతో పాండిచేరి వెనుతిరిగిన బెడియర్ఫ్రెంచి ప్రభుత్వం కూలీలకు జారీ చేసిన  పాస్ పోర్టులను, మరియు ఇతర చట్టపరమైన అనుమతులను బ్రిటిష్  కలక్టరు పట్టించుకోకపోవటం వల్ల తనకు జరిగిన నష్టానికి 180,000 ఫ్రాంకుల పరిహారాన్నిప్పించమని ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరతాడు.   కోరంగి రేవును తటస్థ రేవుగా(బ్రిటిష్ మరియు ఫ్రెంచి నౌకల ప్రయాణానికి) ఉంచాలని పూర్వం ఫ్రెంచి మరియు బ్రిటిష్ వారు చేసుకొన్న ఒప్పందాలను బ్రిటిష్ వారు ఉల్లంఘించారని  ఆరోపిస్తాడు కూడా.  ( దీనికి స్పందిస్తూ ఆ ఒప్పందాలేమిటి అని బ్రిటిష్ వారు అడిగినప్పుడు ఫ్రెంచి వారు ఏమీ చూపలేకపోవటం వల్ల కోరంగి రేవు పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి పోవటం ఆ తరువాత జరిగిన ఒక దురదృష్టకర పరిణామం ఫ్రెంచివారికి సంబందించి).
బెడియర్ వంటి పెద్ద వ్యాపారస్తుడికే అంత అవమానం జరిగిన తరువాత, పాండిచేరీలోని మరే ఇతర వర్తకులు యానాం లో కూలీల సేకరణ జరపటానికి  సాహసించలేదు మరో పదేళ్లవరకూ

బ్రిటిష్-ఫ్రెంచ్ ప్రభుత్వాల ఒప్పందం 1861
బెడియర్ అవమానోదంతం ఫ్రెంచి ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఫ్రెంచి రాజ్యానికి గౌరవభంగం జరిగినట్లు భావించింది.   దీనితో ఫ్రెంచి వారు బ్రిటిష్ ప్రభుత్వంతో పై స్థాయిలో చర్చలు జరిపి 1 జూలై 1861 న ఒక ఒప్పందాన్ని చేసుకొన్నారుదీనిప్రకారం బ్రిటిష్ వారి అన్నిపోర్టులనుంచీ ఫ్రెంచి వారికి కూలీలను పంపించుకొనే అధికారం పొందిందిఆయా సెంటర్లలో ఒక బ్రిటిష్ అధికారి ఉండి కూలీలను బలవంతంగా తరలించటం జరుగుతుందా అనే విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. (రిఫరెన్స్: Year book of India 1866, Pondy, Govt. printing)
ఆ విధంగా 1861 నుండి యానాంలో చట్టబద్దంగా  కూలీల తరలింపునకు మరలా తెరలేచింది1861 నుండి 1870 ల మధ్య యానాం నుండి సుమారు 3500 మంది కూలీలు రి యూనియన్ లోని చెరకుతోటలలో పనిచేయటానికి పంపించబడ్డారు. యానాం నుంచి బయలు దేరిన నౌకల కొన్నింటి వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.

సంవత్సరం
నౌక పేరు
యానాం నుండి బయలుదేరిన తారీఖు
తీసుకెళ్లిన కూలీల సంఖ్య
1862
జియాన్నె అల్బెర్ట్
డిసెంబర్ 1862
382
1863
సుజెర్
ఏప్రిల్ 1863
354
 
కానోవా
ఆగష్టు 1863
421
1864
లోర్మెల్
2 ఫిబ్రవరి 1864
255
 
లోర్మెల్ 
6 జూన్ 1864
207
1865
సుజేర్
20 జనవరి 1865
226
1866
డాగుర్రే
8 జనవరి 1866
317
 
నార్తుంబ్రియన్
5 నవంబరు 1866
418

యానాం నుంచి బయలు దేరిన నౌకల వివరాలలో పైన ఉదహరించినవి కొన్ని మాత్రమేమొత్తంమీద ఇరవై సంవత్సరాల కాలంలో యానాం నుంచి బయలుదేరిన పద్నాలుగు నౌకలలో సుమారు 3500 మంది, (ఒక్క 1866 లోనే 1264 మంది),  పాండిచేరీ నుంచి 13000 మంది కలకత్తానుంచి 9000 మంది కూలీలు రీయూనియన్ కు ఎగుమతి అయినట్లు రికార్డుల ద్వారా తెలుస్తుంది.  (రిఫరెన్స్:Mme. Mazard in her memoire de Maitrise “L’emigration indienne vers les colonies francaises from 1860 to 1880)
ఈ కాలంలో కూలీల సేకరణ  మేస్త్రీల  ద్వారా జరిగేదివీరు యానాంలోనుంచే కాక చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా కూలీలను తీసుకువచ్చి, యానాంలో కల ఏజెంట్లకు అప్పచెప్పేవారు.   అలా తీసుకురాబడ్డ కూలీలకు ముందుగా మెడికల్ చెక్ అప్ జరిగేది. చిన్నచిన్న వ్యాధుల మందులు ఇచ్చేవారువృద్దులను, పిల్లలను తీసుకొనేవారు కాదుఈ ప్రక్రియ అంతా ఒక ఇంగ్లీషు అధికారి సమక్షంలో జరిగేది. ఆయనకు ఇలా ఎంపిక చేయబడిన కూలీలు తాము ఐచ్చికంగానే జీవనోపాధి కొరకు  రీయూనియన్ కు వెళుతున్నట్లు ఒక అంగీకార పత్రాన్ని రాసిచ్చేవారు. తదుపరి ఆకూలీలకు రెండునెలల జీతం (నెలకు అయిదు రూపాయిల చొప్పున మొత్తం పది రూపాయిలు) ముందుగా చెల్లించి, నౌక బయలు దేరే తారీఖు వరకు తిండి వసతులు కల్పించటం జరిగేదిఈ మొత్తం వ్యవహారంలో ఏ రకమైన నిర్భందాలు లేవని నిర్ధారించే బ్రిటిష్ అధికారికి, నెలకు రెండువందల యాభై రూపాయిల జీతం, సరఫరా చేసిన  ఒక్కొక్క కార్మికునకు మూడురూపాయిల చొప్పున మేస్త్రీలకు, ఇరవై నాలుగు రూపాయిల చొప్పున  ఫ్రెంచ్ ఏజెంటుకు ముట్టేది
1830  లోని కాంట్రాక్టు పద్దతిలో ఒక్కొక్క కార్మికునకు నెలకు ఏడు రూపాయిల జీతం కాగా, 1860 లో మాత్రం నెలకు అయిదురూపాయిలు మాత్రమేస్త్రీలకు పిల్లలకు నెలకు రెండురూపాయిల యాభై పైసల జీతం. అప్పటి కూలీ అడ్వాన్సుగా ఇరవై ఒక్క రూపాయిల నగదు (మూడునెలల జీతం) అది 1860 లో పది రూపాయిలేఅయినప్పటికీ ఈ పద్దతిన వెళ్లటానికి యానాం వాసులే కాకశ్రీకాకుళం, ఏలూరు, మచిలీపట్నం వంటి దూరప్రాంత వాసులు కూడా వచ్చేవారు1862 లో యానాంలో Quillet, Victor de Possel et Cie" పేరుగల  ఒక ఫ్రెంచ్ ఏజెన్సీ ద్వారా ఈ కూలీల లావాదేవీలు జరిగేవి
  ఇదేసమయంలో ఇంగ్లీషువారు చేపట్టిన  రైలు మార్గాల ఏర్పాటు, సాగునీటికాలువల తవ్వకం, (దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చివరిదశకు చేరుతుంది), బీడుభూముల్ని సాగులోకి తీసుకురావటం వంటి పనులకు తీవ్రమైన కూలీల కొరత ఏర్పడటంతో ఫ్రెంచి వారు సాగిస్తున్న ఈ కూలీల ఎగుమతి కి అనేక విధాలైన ఆటంకాలను కలిగించటం మొదలు పెడతారు.   మేస్త్రీలపై ఏడాదికి పది రూపాయిల టాక్స్ విధించటం, మేస్త్రీలకు లైసన్సులు జారీ చేసి వాటిని ప్రతి సంవత్సరం మద్రాసులో ఉండే బ్రిటిష్ ఉన్నతాధికారి కౌంటర్ సైన్ చేయాలన్న నిబంధన విధించటం వంటివి వాటిలో ముఖ్యమైనవి
1866 లో యానాం నుంచి ఆఖరు సారిగా కూలీలు పంపబడతారుతరువాత అలాంటి వ్యాపారం జరగదు. 1863 లో 775మంది,   1864 లో 621 మంది,   1865 లో 184 మంది కూలీలను తరలించగా, 1865 లో మాత్రం సుమారు  1500 మంది యానాంనుంచి  పంపించబడ్డారుదీనికి కారణం 1866-67 లలో ఒరిస్సాలో  భయంకరమైన కరువు విలయతాండవం చేయటం వల్ల చాలా మంది ప్రజలు, ఇలా వలసపోవటానికి సిద్దపడినట్లు భావించవచ్చు.
 ముగింపు
ఫ్రెంచి వారు తమ అవసరాల దృష్ట్యా కూలీలను తరలించటంలో, మొదట కొన్ని అనాగరిక పద్దతులను పాటించినా (యేట్స్ ఉదంతం), కాలానుగుణంగా మానవీయ దృక్పధంతో వ్యవహరించినట్లే కనపడుతుందిమరీ ముఖ్యంగా వీరు1828 లో ప్రతిపాదించిన కాంట్రాక్టు పద్దతి ఈనాటికీ ఆదర్శప్రాయమే అనటం అతిశయోక్తి కాదు. ఫ్రెంచ్ మరియు  బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చారుఇరువురికీ మధ్య జరిగిన అనేక కలోనియల్ రాజకీయాలలో భాగంగా ఈ కార్మికుల ఎగుమతి విషయంలో ఫ్రెంచి వారిని బ్రిటిష్ వారు సమర్ధవంతంగా ఇరుకున పెట్టగలిగారు. యానాం నుంచి ఫ్రెంచి వారు కార్మికులను తరలించటం  అనేది ఈ ప్రాంతపు ఒక చారిత్రిక సత్యం
ఫ్రెంచి కరీబియన్ ద్వీపకల్పంలోని Sucre Island జజాభా ఏర్పడటంలో యానాం నుంచి 1849-1889 ల మధ్య ఎగుమతి చేయబడిన కూలీలు ప్రధాన పాత్రవహించినట్లు ఫ్రొ. జాబ్స్ వీబర్ అభిప్రాయపడ్డాడు. (రి. GHC Bulliten, 16 May, 1990, P.No. 134) అలా తరలించబడ్డ వారిలో ఎంతమంది తిరిగి వచ్చారో, ఎంతమంది అక్కడే స్థిరపడిపోయారో ........