Tuesday, March 30, 2010

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?

మిత్రులారా, దయచేసి ఎవరైనా Montrafat అనే పదానికి అర్ధం చెప్పగలరా?


ఆ పదం వచ్చిన వాక్యాలు

The evolution of revenues from the duty of montrafat

....were in all likelihood exempted from the tax of montrafat.

Counseil of India to subject the weavers to the tax of Montrafat of which they had been exempted since 1817

పై వాక్యాలను బట్టి Montrafat అంటే వృత్తి పన్ను అనే అర్ధం వస్తుంది. అది కరక్టేనా? ఈ పదం ఫ్రెంచి పదమేనా? దాని పూర్తి అర్ధాన్ని దయచేసి ఎవరైనా వివరించగలరు.

I will be highly thankful to to one and all .

బొల్లోజు బాబా

Saturday, March 20, 2010

మార్చి 20 - ప్రపంచ పిచ్చుకల దినోత్సవం



ప్రతీ సంవత్సరం మార్చి ఇరవైన ప్రపంచ పిచ్చుకల దినంగా పరిగణించాలని పర్యావరణ వేత్తలు నిర్ణయించారు. ఈ సందర్భంగా
అంతరించిపోతున్న పిచ్చుకలపై ఇదివరలో నేరాసిన ఓ కవితను ఇక్కడమరో సారి పోస్టు చేస్తున్నాను.....


అంతరించిపోతున్న పిచ్చుకలపై........

నువ్విక్కడికి రావటం లేదంటే
ఎక్కడో ఉండే ఉంటావులే
అనుకున్నానింతకాలమూ

అక్కడా లేవట కదా! మరెక్కడికి పోయావూ?


రెక్కల టపటపల గమకాల్ని పలికిస్తూ
మెరుపు వేగంతో అటూ ఇటూ ఎగురుతో
మా పచ్చని హృదయాలపై వాలేదానివి.

ఇంటి చూరుకు వేలాడదీసిన

వరి కంకుల కుంచె ఓ నక్షత్రమై
నీకు ప్రేమగా స్వాగతం పలికేది.

నీ అవిశ్రాంత మైధున సంగీతానికి

ఊరు మొత్తం ముసిముసి నవ్వులతో
సిగ్గుపడుతూ మురిసిపోయేది.


చూరు అంచునో లేక మిద్దె కంతల్లోనో
నీవు నిర్మించుకొన్న స్వర్గంవైపు

ఎవరైనా తొంగిచూస్తే, వాని తలపై గింగిర్లు కొడుతూ,
అరుస్తూ నీవు చేసే హడావిడికి
గాలి కూడా బిత్తర పోయేది.

మట్టిలో పొర్లాడుతూ చేసిన ఇసుక స్నానాలు
చాతీపై నల్ల మచ్చతో నీ లైంగిక ద్విరూపకతా
పెరట్లో సస్యరక్షణ గావించిన నీ ఉక్కు ముక్కు
గాయపడ్డ నీ దేహాన్ని సంరక్షించిన మా బాల్యాలు
నా కిటికీ పై వాలి పాటలు పాడి తుర్రుమన్న
ఆ క్షణాలన్నీ, తమ గాలిపెదాలతో
ఈ బొమ్మల పుస్తక పుటల్ని రెపరెప లాడిస్తున్నాయి.

పెంకుటిళ్లు, నిద్ర పగుళ్లలోంచి
కారిపోయిన స్వప్నాలైన వేళ
అవని మొహంపై రసాయిన దాడి నేపధ్యంలో
సెల్ ఫోన్ రేడియేషన్ కనిపించని మృత్యువలై
నిన్నో ఎడ్రస్ లేని ఉత్తరాన్ని చేసేసిందా?

నువ్వు వస్తావని, గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
తరువాత 'మీవంతు' అంటూ
భయపెడుతూంది.

బొల్లోజు బాబా

చాలా కాలంగా పిచ్చుకలెక్కడయినా కనిపిస్తాయా అని చూస్తూనే ఉన్నాం. ఒక రోజు కనిపించిన వాటిని మా అమ్మాయి కెమారాలోబంధించింది. ఓ పిచ్చుక అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని దానితో అది దాదాపు అరగంట పైగా చేసిన హంగామాని కూడా వీడియోతీసింది మా అమ్మాయి. వాటిని మీ అందరితో ఇలా పంచుకొంటున్నాను.....



ప్రస్తుతం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నా, ముందుముందు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అలా జరగకూడదని ఆశిద్దాం.

Friday, March 19, 2010

అంతే ....


ఒక చిన్న తీయని కూత చాలు
తనిక్కడ ఉంటున్నానని చెప్పటానికి

ఒక రాలిన ఈక
తనిక్కడ ఉండినట్లు చెపుతుంది.

మట్టులోని వెచ్చదనం
తనిక్కడ ఉంటుందని చెపుతుంది.

ఎంత సింపుల్ గా జీవితాలని
గానం చేయ గలుగుతున్నాయీ - పక్షులు.

సోర్సు:THE SIMPLE P.P. Ramachandran


బొల్లోజు బాబా

Saturday, March 13, 2010

చిన్న చిక్కు- Chandrakant Deotale

"నా వద్ద కొద్దిపాటి స్థలముంటే
కుమ్మరి వద్దనుంచి కొన్ని ఇటుకలను
అరువు పుచ్చుకొని
ఓ గుడెసెను నిర్మించుకొనేవాడిని
వెదురుకర్రలు మాత్రమే నా వద్ద లేవు"

అతనలా చెప్పినప్పటి నుంచీ
నేను అన్వేషిస్తూనే ఉన్నాను
కొన్ని వెదురుకర్రలు సంపాదించి అతనికిద్దామని.


అతనికి కొద్దిపాటి స్థలముంటే
అతను కుమ్మరి నుండి ఇటుకలను
అరువు తెచ్చుకోగలడు కనుక
ఓ చిన్న గుడిసె తయారయిపోయి ఉండేది.

మేమలా సాగుతుండగా
సముద్రం ఆకాశం అంతేలేని భూమి
కనిపించాయి
ఈ మూడూ ఎవరికీ చెంది లేవు
మేము వెంటనే అరిచాం
ఇది మా సముద్రం మా ఆకాశం మా భూమి అని.

ఆ మూడింటినీ
మా పిడికిళ్ళలో కానీ కళ్లల్లో
చేతులలో కానీ నింపుకోలేకపోయాం.
కనీసం ఓ ముక్క ఆకాశాన్నో ఓ చెక్క భూమినో
సముద్రాన్నో అమ్ముకోలేకపోయాం.
ఆ విధంగా మేము అనంతానికి అధిపతులయ్యాం

కానీ చిన్న చిక్కు మాత్రం అలానే
మిగిలిపోయింది మా ఇద్దరకూ.
అతనివద్ద స్థలం లేదు
నా వద్ద వెదురు కర్రలు లేవు.


మూలం:
"A Minor Difficulty With The Two Of Us" -- Chandrakant Deotale

అనువాదం: బొల్లోజు బాబా

Monday, March 8, 2010

Tightrope Dancer

Tightrope Dancer


బిగించి కట్టిన తాడు
దానిపై నా ఆట. ఆ బిగుతు తాడు.
రెండు కర్రలకు బిగించి కట్టిన ఆ సన్నని తాడుపై నా ఆట
తాడుపై నా ఆటేమిటంటే
ఈ కర్రనుంచి ఆ కర్ర వరకూ ఆడటమే.
రెండు కర్రలకూ బిగుతుగా కట్టిన
నే నాటాడే ఆ తాడుపై పడే ఫ్లడ్ లైట్ల కాంతిలో
జనాలు చూస్తూంటారు
ఆడే నన్ను కాదు
నే నిలుచున్న తాడును కాదు
తాడు కట్టబడ్డ కర్రలను కాదు
నా ఆటను చూపించే కాంతినీ కాదు
జనాలు ఆటను మాత్రమే చూస్తూంటారు.

కానీ
నేనాడే ఆట
నేను ఆట ఆడే తాడు
తాడును బిగించి కట్టిన కర్రలు
అన్నిటినీ చూపించే ఫ్లడ్ లైట్ల కాంతి
ఆ కాంతిలో
కర్రల మధ్య బిగించి కట్టబడ్డ ఆ తాడుపై
నిజానికి నేను ఆటాడటం లేదు.

తాడు ముడిని ఒదులు ఎలా చేయాలా అని
ఈ కర్ర నుండి ఆ కర్రకు నేను తిరుగుతున్నాను.
దాని పట్టు సడలించటానికి గింజుకొంటున్నాను
పారిపోదామని.
పట్టు సడలటం లేదు
రెండు కర్రల మధ్యా
అలా తిరుగుతూనే ఉన్నాను
ఏ మార్పూ లేదు.

కానీ దాన్నే ఆటగా భ్రమించి చూస్తున్నారు జనాలు
తాడును కాదు
కర్రలను కాదు
కాంతిని కాదు
తాడు బిగింపునూ కాదు
వాళ్లు
ఆటను మాత్రమే చూస్తున్నారు.

source: Vatsyayan 'Agyeya'
Tightrope Dancer