ప్రతీ సంవత్సరం మార్చి ఇరవైన ప్రపంచ పిచ్చుకల దినంగా పరిగణించాలని పర్యావరణ వేత్తలు నిర్ణయించారు. ఈ సందర్భంగా అంతరించిపోతున్న పిచ్చుకలపై ఇదివరలో నేరాసిన ఓ కవితను ఇక్కడమరో సారి పోస్టు చేస్తున్నాను.....
అంతరించిపోతున్న పిచ్చుకలపై........
నువ్విక్కడికి రావటం లేదంటే
ఎక్కడో ఉండే ఉంటావులే
అనుకున్నానింతకాలమూ
అక్కడా లేవట కదా! మరెక్కడికి పోయావూ?
రెక్కల టపటపల గమకాల్ని పలికిస్తూ
మెరుపు వేగంతో అటూ ఇటూ ఎగురుతో
మా పచ్చని హృదయాలపై వాలేదానివి.
ఇంటి చూరుకు వేలాడదీసిన
వరి కంకుల కుంచె ఓ నక్షత్రమై
నీకు ప్రేమగా స్వాగతం పలికేది.
నీ అవిశ్రాంత మైధున సంగీతానికి
ఊరు మొత్తం ముసిముసి నవ్వులతో
సిగ్గుపడుతూ మురిసిపోయేది.
చూరు అంచునో లేక మిద్దె కంతల్లోనో
నీవు నిర్మించుకొన్న స్వర్గంవైపు
ఎవరైనా తొంగిచూస్తే, వాని తలపై గింగిర్లు కొడుతూ,
అరుస్తూ నీవు చేసే హడావిడికి
గాలి కూడా బిత్తర పోయేది.
మట్టిలో పొర్లాడుతూ చేసిన ఇసుక స్నానాలు
చాతీపై నల్ల మచ్చతో నీ లైంగిక ద్విరూపకతా
పెరట్లో సస్యరక్షణ గావించిన నీ ఉక్కు ముక్కు
గాయపడ్డ నీ దేహాన్ని సంరక్షించిన మా బాల్యాలు
నా కిటికీ పై వాలి పాటలు పాడి తుర్రుమన్న
ఆ క్షణాలన్నీ, తమ గాలిపెదాలతో
ఈ బొమ్మల పుస్తక పుటల్ని రెపరెప లాడిస్తున్నాయి.
పెంకుటిళ్లు, నిద్ర పగుళ్లలోంచి
కారిపోయిన స్వప్నాలైన వేళ
అవని మొహంపై రసాయిన దాడి నేపధ్యంలో
సెల్ ఫోన్ రేడియేషన్ కనిపించని మృత్యువలై
నిన్నో ఎడ్రస్ లేని ఉత్తరాన్ని చేసేసిందా?
నువ్వు వస్తావని, గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
తరువాత 'మీవంతు' అంటూ
భయపెడుతూంది.
బొల్లోజు బాబా
చాలా కాలంగా పిచ్చుకలెక్కడయినా కనిపిస్తాయా అని చూస్తూనే ఉన్నాం. ఒక రోజు కనిపించిన వాటిని మా అమ్మాయి కెమారాలోబంధించింది. ఓ పిచ్చుక అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని దానితో అది దాదాపు అరగంట పైగా చేసిన హంగామాని కూడా వీడియోతీసింది మా అమ్మాయి. వాటిని మీ అందరితో ఇలా పంచుకొంటున్నాను.....
ప్రస్తుతం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నా, ముందుముందు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అలా జరగకూడదని ఆశిద్దాం.