Tuesday, November 20, 2018

కవిత్వ భాష ఆవిష్కరణ

కవిత్వ భాష పుస్తకం ఆవిష్కరణ ఖమ్మంలో, యానంలో, విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా జరిగింది.  ఆ యా సందర్భాల వివిధ ఫొటోలు.  ఇంతవరకూ వచ్చిన నా పుస్తకాల కవర్ పేజ్ లు






Sunday, July 1, 2018

గాయాల శ్వాస


CT స్కాన్ కవరును
చేతితో పట్టుకొని
ఆమె రోడ్డుపై భారంగా
అడుగులు వేస్తూ నడుస్తోంది.
సీతాకోకల తెగిన రెక్కల వానలో
వెన్నువిరిగిన అట్లాస్ లా ఆమె
స్వప్నించిన జీవితానికి
జీవిస్తోన్న స్వప్నానికి మధ్య
కన్నీటి పొరలు
నాపరాతి పొరలు
ఒక్కొక్క పొరను తవ్వుకొంటూ
ఒక్క ఆశకోసం ఒకే ఒక్క ఆశకోసం
ఆమె అన్వేషిస్తోంది
****
ఈ చేతుల్తో ఎన్నో గాయాల్ని
చిత్రించాను
ఈ గాయాన్నెందుకో
మరో కాలంలోకి
ఒంపలేకపోతున్నాను
గుండెలనిండా పురాగాయాల శ్వాస
నన్ను క్షమించు మిత్రమా!
బొల్లోజు బాబా

Monday, May 21, 2018

ఏం పని ఉంటుంది నీకూ……..


.
వెళ్తూ వెళ్తూ అతనన్నాడూ
"నే వచ్చేవరకూ
ఏం పని ఉంటుంది నీకు" అని
అతను వచ్చేసరికి
ధూళి, ఈగలు ముసిరిన నేల
బురదలో పొర్లాడిన పంది
అవతారం ఎత్తి
నట్టింట్లో తిష్టవేసి ఉంది.
నిన్నటి పూలు వాడి ఎండినా
రాల్చుకోకుండా
కొత్తమొగ్గల దుప్పటిని
కప్పుకోకుండా
మంచం మల్లెపొద
బద్దకంగా పడుకొని ఉంది
కిచెన్ సింక్ తటాకంపై
చచ్చిన చేపలు నాని ఉబ్బి
వికృతంగా తెట్టులా తేలి
పురాపరిమళాన్ని
గానం చేస్తున్నాయి.
పాపాయి జారవిడిచిన
డైపరు విదిల్చిన శకలాలను
నదులు, పర్వతాలు మైదానాలు
అలంకరించుకొన్నాయి
బట్టలపెట్టి పొట్టపగిలి
లుకలుకలాడుతూ బెకబెకలాడుతూ
బయటపడ్డ జబ్బుచేసిన సీతాకోకలు
ఇల్లు మొత్తం
క్వారీపక్కన జుత్తు నెరిసి
కాంతి నశించిన చెట్టులా ఉంది.
అతను ఇంకెప్పుడూ అలా అనలేదు!
బొల్లోజు బాబా

Thursday, May 3, 2018

నిన్ను ప్రేమించేందుకే వచ్చాను నేను - "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet

నిన్ను ప్రేమించేందుకే వచ్చాను నేను - "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet
నిన్ను గాయపరచటానికి కాదు
గతం నీ హృదయంలో మిగిల్చిన
గాయాలకు కట్టుకట్టటానికే వచ్చాను నేను
కానీ నన్ను నీవు అనుమతించటం లేదు
మరలా మరోసారి పగిలిముక్కలవుతానా అని
భయపడుతున్నావు
నేను అతనిలా కాదు
నేను వారిలా కాదు
నువ్వు అర్థం చేసుకోవాలని
ఆశిస్తున్నాను అర్ధిస్తున్నాను
నీచుట్టూ ఎత్తైన గోడను నిర్మించుకొన్నావు
నాకు తెలుసు నాకు తెలుసు
దాన్ని దాటడం కష్టమని
కానీ ఖచ్చితంగా ప్రయత్నిస్తాను
నువ్వు తలుపుతెరచి
నీ హృదయంలోకి ఆహ్వానించేవరకూ
నేను నిరీక్షిస్తాను.
మునుపెన్నడూ లేని విధంగా
నిన్ను ప్రేమించనీ నన్ను!
అనువాదం: బొల్లోజు బాబా
మూలం: "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet

Monday, April 9, 2018

ఫ్రాగ్మెంట్స్


1.
పచ్చని చెట్టుమీదకు
ఆకాశం నుండి
తెల్లని కొంగ ఒకటి
కాళ్లని ముందుకు సారించి
రెక్కల్ని లోనికి తీసుకొని
కొమ్మపై వేళ్ళను బిగిస్తూ
బివివి హైకూలా వచ్చి వాలింది
2.
ఏ చెట్టుకొమ్మలకో తగులుకొని
గబ్బిలపు రెక్క పలుచని చర్మం
చిరుగులు పడింది.
నాకు ఆకలిగా లేదు
నువ్వు తినేసి పడుకో అన్నాడతను.
3. Skin Trade
ఒట్టిపోయిన సెక్స్ వర్కరో
పట్టుబడిన నిర్భాగ్యురాలో
ఆమెవరైతేనేం!
సజీవంగానే చర్మం ఒలచబడుతుంది.
విషాదమేమంటే అప్పుడు కూడా
తెల్లతోలుకు విలువెక్కువ
4. సామాన్లు సర్దుతుంటే
పాత ఫోను కనిపించింది
ఆన్ అయింది చిత్రంగా
కంటాక్ట్స్ లో అమ్మ నంబరు
అలాగే ఉంది.
5.
అన్యధా శరణం నాస్తి... రక్ష రక్ష
యన్న ప్రార్ధన ఆ పెదవులపై
నర్తించి నర్తించి అలసిపోయింది.
దేవుడు తనగదిలో దూరి తలుపు
వేసేసుకొన్నాడు
బొల్లోజు బాబా

Saturday, April 7, 2018

Skin Trade

ఒట్టిపోయిన సెక్స్ వర్కరో పట్టుబడిన అభాగ్యురాలో ఆమె ఎవరైతేనేం! బతికుండగానే చర్మం ఒలచబడుతుంది విషాదమేమంటే అప్పుడు కూడా తెల్లతోలుకు విలువెక్కువ. దేహంపై పేదరికం చేసిన మచ్చను జీవితాంతం మోసుకుతిరుగుతుందామె 'పట్టువంటి నీ మృదువైన చర్మం వయసుని తెలియనివ్వదు' అంటూ ఎక్కడో ఎవరో ప్రశంసింపబడుతూంటారు. మరొక వ్యక్తి మూడడుగుల చర్మాన్ని ఒలిచి అతికించుకొన్న సౌందర్యం అది. ఎన్నటికీ మట్టిలో కరగదు అనుకొంటున్నారు. బొల్లోజు బాబా

Thursday, April 5, 2018

ముల్లు తీయించుకోవటం

ముల్లు తీయించుకోవటం
ఒకని పాదాన్ని మరొకరు చేతుల్లోకి తీసుకొని
లోతుగా దిగి విరిగిన ముల్లుచుట్టూ
చర్మాన్నిఉమ్ముతో శుభ్రం చేసి
పిన్నీసు మొనతో
మెల్లమెల్లగా దాన్ని పైకి లేపుతూ
బొటనవేలు చూపుడు వేలు గోర్లతో
పట్టుకొని బయటకు లాగి
అరచేతిలో ఉంచుకొని
విప్పారిన నేత్రాలకు చూపటం
కాలుతున్న చుట్టను తీసుకొని
ముల్లు చేసిన గాయానికి సెగ పెట్టటం
ఎంత గొప్ప మానవీయ అనుభవం!
చిట్టిపాదాల్ని చిగుళ్లకు ఆనించి
మునిపంటితో ముల్లును తొలగించిన
అమ్మ జ్ఞాపకం లాంటి అనుభవం.
***
నేనెప్పుడైనా ఈ ప్రపంచంతో
రోజంతా వేసారి విసుగుచెంది అలసిపోయి
ఇంటికొచ్చినప్పుడు
ఆమె తన ప్రేమప్రవాహపు చేతులతో
నా ఆలోచనలకు కళ్లెం వేసి
దేహ సౌగంధికా పరిమళంతో అల్లుకొని
మెడ ఒంపులో అందంగా అమరిన
ఆకుపచ్చని రక్తనాళాలలోకి
నన్ను పొదువుకొంటుంది ప్రతీసారీ
అపుడెందుకో నాకు
ముల్లు తీయించుకొన్న అనుభవమే
పదే పదే గుర్తుకు వస్తుంది.
బొల్లోజు బాబా

Monday, March 26, 2018

మృతుడు


అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికొచ్చేసరికి
సోఫాలో కూర్చొని పాత ఆల్బమ్ లు తిరగేస్తూ కనిపించాడు
ఆశ్చర్యం నుండి తేరుకొనేలోగా మాయమయ్యాడు
ఆ తరువాత ఎన్నోసార్లు కనిపించాడు
డైజిపామ్ కి కూడా నిద్ర పట్టక దొర్లుతూంటే
తన బొజ్జపై నన్ను పడుకోపెట్టుకొని
కథలు, పద్యాలు తన చిన్ననాటి సంగతులూ
చెపుతూండగా మధ్యలో ఎపుడో నిద్ర పట్టేసేది.
"చంటాడికి ఒళ్ళు కాలిపోతోంది" అంటూ
నన్ను భుజాలపై వేసుకొని ఆరుబయట తిప్పుతూండగా
మా అమ్మాయి నా నుదిటిపై చేయివేసి
"ఏమైంది నాన్నా" అనేది చాలాసార్లు.
నదిలో తన ప్రతిబింబాన్ని చూసుకోవటానికి
ఇక్కడిక్కడే తిరుగుతున్నాడని అనిపించేది.
ఇపుడెవరూ నమ్మటం లేదు కానీ
రేపెపుడో నేనూ అలా కనిపించినపుడు
నమ్ముతారు బహుసా!
బొల్లోజు బాబా

Sunday, March 25, 2018

కవి సంధ్య


తెల్లబడిన జుట్టు
బిగుతుకోల్పోయి
ముడుతలు పడిన చర్మము
అలసిన నేత్రాలతో
అతని రూపం
అద్దం అబద్దమాడుతోంది
అతనో
సాగర తీరాన
మెత్తని కవితావాక్యాలలాంటి
రంగురంగుల గవ్వల్ని ఏరుకొనే
విరామమెరుగని పిలగాడు
మబ్బు చెలమల్లో పడవల్ని వదిలే
స్వర్లోకపు బాలకుడు
ఆమె ఒంగుని బుగ్గలు నిమిరి
నుదుటిపై ముద్దు పెట్టింది
అందుకే కదా!
(గురువుగారు శిఖామణికి)
బొల్లోజు బాబా

Saturday, March 24, 2018

స్మృతులకు ప్రాణం పోసిన కవిత్వం


"కవిత్వం అనేది గతించిన కాలపు పరిభాష మాత్రమే కాదు, అది ఒక సృష్టి ప్రక్రియ, కలను పునర్జీవింపచేయటం, నేనెలా ఉండాలనుకొంటానో అలా నన్ను నేను పునస్థాపించుకోవటం" -- Wadih Saadeh.
Wadih Saadeh లెబనాన్ లో ఒక చిన్న కుగ్రామంలో పుట్టి పన్నెండేళ్ల వయసులో Bierut అనే ప్రాంతానికి వలసవెళ్లాడు. ఒంటరితనం, అభద్రతా ఇతన్ని కవిత్వం వైపు నడిపించాయి. అంతర్యుద్దం వల్ల నెలకొన్న భీతావహపరిస్థితుల కారణంగా స్వదేశాన్ని విడిచి ఆస్ట్రేలియా చేరుకొన్నాడు.
తన చిన్నతనంలో ఏ యుద్ధాలు లేని, ప్రకృతి సహజ సౌందర్యాలతో ప్రకాశించే ప్రశాంత లెబనాన్ ఇతని అంతరంగంలో శాశ్వతంగా నిలిచిపోయింది. యుద్ధరక్తగాయాలతో చిధ్రమైన లెబనాన్ ప్రస్తుత వాస్తవం. ఈ రెండింటి ఘర్షణే ఇతని కవిత్వానికి నేపథ్యంగా మారింది. వాదీ సాదే కవిత్వం లెబనాన్ విషాదభరిత యుద్ధాలను కవిత్వీకరిస్తుంది. ఒక్కో కవితా - సలిపేగాయంలా, చిందిన రక్తపు చారికలా, ఒక అధివాస్తవిక ప్రపంచంలా, మెత్తని కుంచెతో గీసిన ఒక వర్ణచిత్రంలా అనిపిస్తుంది. వేదనను, దుఃఖాన్ని ఎంతో సున్నితంగా వ్యక్తీకరించటం వల్ల అది మరింత చిక్కబడింది. వాదీ సాదీ ఇంతవరకూ 12 కవిత్వసంపుటలను వెలువరించారు. "A Secret Sky" కవితా సంపుటి నుంచి కొన్ని కవితల అనువాదాలు ఇవి. ఈ సంపుటిలోని కవితలన్నీ లెబనాన్ అంతర్యుద్దాన్ని బలంగా వ్యక్తీకరిస్తాయి.
హింసతో ఆత్మహత్యాసదృశ మార్గాన్ని ఎంచుకొంటున్న ఆధునిక మానవుని పోకడను ప్రశ్నించే కవిత్వం ఇది.
1. లేకపోవటం - Absence
ఆ రోజు
పార్కులో
ఒక ఓక్ చెట్టు క్రింద ఉన్న
రెండు రాతికుర్చీలు మాత్రమే
ఖాళీగా ఉన్నాయి
అవి మౌనంగా ఉన్నాయి
ఒకదాన్నొకటి
తేరిపార చూసుకొని
భోరున విలపించాయి
2. పదాలు - Words
అతను మాట్లాడిన మాటలు
కుర్చీలపైన, మంచాలమీద,
బీరువాలలో, గోడలపైనా ఉండిపోయాయి.
ఇల్లు సర్దటానికి
ఫర్నిచర్, గిన్నెలు, గోడలు
శుభ్రం చేయటానికీ
ఒక పనిపిల్లను తీసుకువచ్చారు
గోడలకు సున్నం
ఇంట్లోకి కొత్తగొంతుకల్ని
తీసుకొచ్చారు
అయినా అతని పదాలు
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
3. దళం - Leaf
వారు అతన్ని మౌనంగా మోసుకొని
అతని స్నేహితులు శయనిస్తున్న
విశాలమైన మైదానంలోకి తీసుకెళ్లారు
అక్కడన్నీ శిలువలూ, సమాధిఫలకాలు
"నేను తిరిగి వస్తాను, తాళం చెవి
పూల కుండీ క్రింద ఉంది" అన్నాడతను
ఆ పువ్వుకి చెందిన ఒక రేక
అతని చేతిలో ఇంకా ఉంది.
4. ఒక చెట్టు - A Tree
రెండడుగులు ముందుకు వేసి
అతను నిన్నపాతిన మొక్కను తాకాడు
వేలికొసలనుండి అతని రక్తం
మొక్క పసరులోకి ప్రవహించింది
అతని మనసులో ఉన్న పత్రాలు
కొమ్మలపై మొలిచాయి
వెనుతిరుగుదామని ప్రయత్నిస్తే
అతనెక్కడ నిలబడ్డాడో అక్కడే ఉండిపోయాడు
అతని కాళ్ళు వేర్లుగా మారిపోయాయి.
5. అలసిన ప్రజ - Exhausted People
అలసిన ప్రజలు బజారులో కూర్చొని
మెత్తని గాలులను వింటున్నారు
బహుసా అవి
దారితప్పిన బాటసారులవో లేక
రోడ్డుపక్క వ్యాపారం సాగించే వారివో
అలసిన ప్రజలు కలుసుకొనే ప్రదేశం అది
అక్కడ పరిచిన రాళ్ళు మానవలక్షణాల్ని పొందాయి
ఎవరైనా కనిపించకపోతే వారికోసం అవి ఏడుస్తాయి
అలసిన ప్రజలు బజారులో ఉన్నారు.
రోజురోజుకూ వారి మొఖాలు పెళుసుగా
వారి జుట్టు సాయింత్రపు బలహీనకాంతిలో
మెత్తగా మారుతోంది.
ఒకరినొకరు చూసుకొని
తాము గాజు బొమ్మలమని అనుకొన్న మరుక్షణం
వారి కళ్ళు పెళుసుగామారి
ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి.
6. జీవితం - Life
కాలక్షేపానికి
అతను ఒక కూజాను చిత్రించాడు.
కూజాలో ఒక పూవును గీసాడు
పేపరునుండి పరిమళం పైకిలేచింది
ఒక నీళ్ళ జగ్గును చిత్రించాడు
కొంచెం నీరు తాగి
మరికొంత కూజాలో పూవుపై చల్లాడు
ఒక గదిని, ఒక మంచాన్ని చిత్రించాడు
దానిపై నిద్రపోయాడు
నిద్రలేచిన తరువాత
లోతుఅందని ఒక సముద్రాన్ని చిత్రించాడు
అది అతన్ని ఈడ్చుకుపోయింది.
7. అక్కడి జీవితం - Life There
అక్కడ తన బిడ్డను పూడ్చి
అతని పక్కనే తనూ పరుండటానికి
చాన్నాళ్ళు ఎదురుచూసింది ఆమె.
చివరకు
వారామెను అదే మట్టిలోకి దించారు.
అక్కడ ఆమెకు ఒకరోజు వయసుమాత్రమే
ఆమె బిడ్డ మాత్రం
ముసలివాడయిపోయాడు
8. రాత్రి ఆపద -- Night Visit
వాళ్లు తమ పిల్లలతో
మొక్కలను కాపాడే దేవత గురించి
ఉదయాన్నే కిటికీవద్దనున్న
మల్బరీ చెట్టుపై వాలి
పాటలు పాడే కోయిల గురించి
రేపు ద్రాక్షలు అమ్మి కొనబోతున్న
కొత్తబట్టల గురించి మాట్లాడుకొంటున్నారు.
పిల్లలు నిద్రలేచాకా వారి తలగడల క్రింద
కనుక్కోబోతున్న ప్రత్యేక ఆశ్చర్యాల
గురించి కూడా మాట్లాడుకొన్నారు
కానీ కొంతమంది సాయుధులు వచ్చి
వారి కథలను ముగింపచేసి
గోడలపై ఎర్రని మరకలు చిందించి
వెళ్లిపోయారు.
9. వలస పోవటం Migration by Wadih Saadeh
వాళ్లు వెళిపోయేటపుడు ఇంటికి తాళం వెయ్యలేదు
వీధి కుక్కకోసం, పక్షులకోసం తొట్టెలో నీళ్ళు నింపిఉంచారు,
డైనింగ్ టేబుల్ పై బ్రెడ్డు, కూజానిండా నీళ్ళు ఇంకా
నిల్వచేసిన చేపల టిన్నూ వదిలి వెళ్లారు.
వెళ్ళేముందు వాళ్ళేమీ మాట్లాడలేదు
అయితే వారి నిశ్శబ్దమే ఒక ఒప్పందం
తలుపుతో, కూజాతో, టేబుల్ పై బ్రెడ్డుతో.
వారి పాదముద్రల్ని స్పర్శించే
ఒకే ఒక దయామయి కాలిబాట
ఆ తరువాతెప్పుడూ వారిని చూడలేదు
ఎంతప్రయత్నించినా.
ఒకరోజు ఉదయంనుంచి సాయింత్రం వరకూ
గోధుమ బస్తాల్ని మోసీమోసీ అలసిపోయిన ఆ బాట
వారు తమ చోటును గోడలలో విడిచి వెళ్ళటం గమనించింది.
కొన్ని చేపలు రెక్కలుఆడిస్తూ ఏవో అదృశ్యతీరాలకు
ఈదుకొంటూపోవటాన్ని సముద్రం గుర్తుచేసుకొంది.
ఒక వీధికుక్క ప్రతీ సాయింత్రమూ వచ్చి
వారి ఇంటిముందు అరుస్తూండేదని
ఆ వూరిలోనే ఉండిపోయిన కొంతమంది
చాలాకాలం చెప్పుకొన్నారు.
దేశబహిష్కృతుడిగా జీవనం, మాతృభూమిపై మమకారం అనే రెండు భావాల మధ్య సంఘర్షణ కారణంగా వాదీ సాదీ కవిత్వంలో ఆధునికోత్తర శూన్యవాదం బలంగా ప్రతిబింబిస్తుందని విమర్శకుల అభిప్రాయం. వాదీ సాదీ కవిత్వాన్ని గమనిస్తే భీభత్సాన్ని, హింసను, దుఃఖాన్ని వ్యక్తీకరించటానికి బరువైన, జుగుప్సకలిగించే పదాలను వాడాల్సిన అవసరం లేదనీ, నాజూకైన తేలికపదాలతో కూడా అంతే స్థాయి భావోద్వేగం కలిగించవచ్చని అర్ధమౌతుంది. అలా వ్రాయటం నేటికాల కవిత్వలక్షణంగా భావించాలి. "A Secret Sky లో నేను లెబనాన్ యుద్దంలో మరణించిన నా సహచరులకు ప్రాణం పోసాను" అన్న వాదీ సాదీ మాటలకు ఈ సంపుటిలోని ప్రతీ కవిత అద్దంపడుతుంది. ఈ కవితలను అరబిక్ భాషనుండి ఇంగ్లీషులోకి Anne Fairbairn అనువదించారు.
బొల్లోజు బాబా

Monday, March 19, 2018

అనంతాన్ని కల్పన చేసిన మానవుని వృత్తాంతము -- The Legend of the man who imagined the Infinite by RO HITH


అన్ని విషయాలు తెలిసిన అతను
అనంతం గురించి కల్పన చేయటం
మొదలెట్టాడు ఇంటికి వెళుతూ వెళుతూ.
నక్షత్రాల వెలుగులో
అనేక మలుపుల్లో ఎడమవైపు తిరిగి
ఇల్లుచేరే దారి తప్పాడు.
అనంతం గురించి గాఢాలోచన చేస్తూ
తన పేరు తాను మరచిపోయానని గుర్తించాడు
ఇంటిని, పేరుని మరచిపోయిన అతను
అలా నడుస్తూనే ఉన్నాడు
అనంతం గురించి చింతన చేస్తూ.
అతను తాను మానవుడినన్న వాస్తవాన్ని
అనుకోని క్షణాలలో పరిత్యజించాడు.
ఎక్కడకు వెనుదిరగాలో, ఎక్కడకు వెళుతున్నాడో
చెప్పేవారు లేక, అతను అలా అలా ముందుకే సాగిపోయాడు అనంతం గురించి ఆలోచిస్తూ.
ఈ ప్రయాణంలో ఒక దశలో తనకు
ఒక అస్తిత్వం ఉందనే సత్యాన్ని కూడా వదిలివేసాడు.
ఇంటికి బయలుదేరిన అతని వద్ద
ఇపుడు శూన్యం మాత్రమే మిగిలింది.
అతను తన ఆలోచనలలో చాలా దూరం సాగిపోయాడు
వెనక్కు తిరిగిరాలేనంతగా.
అతను అనంతం గురించే ఆలోచిస్తూ
చివరకు అనంతం గురించి కూడా మరచిపోయి
శూన్యంలో లీనమయ్యాడని వృత్తాంతం చెబుతోంది.
For Hawking -
Translation by Bolloju Baba

Tuesday, March 6, 2018

నువ్వు, నేను, ఈ జగత్తూ - You and I and the World by Werner Aspenström


నువ్వంటే ఎవరు , నేనంటే ఎవరు
ఎందుకు ఇది ఇలా ఉంది అని అడగొద్దు.
అదంతా పండితుల పని
వాళ్ళు చూసుకొంటారు.
కిచన్ టేబుల్ పై తక్కెడ ఉంచు
వాస్తవం తనని తాను తూచుకొంటుంది.
చొక్కా తొడుక్కో.
హాల్ లో లైట్ ఆర్పివేయి
తలుపు మూసేయి.
శవాలను శవాలు భద్రపరచనీ.
మనం అలా తిరిగొద్దాం
తెల్ల రబ్బరు బూట్లు వేసుకొన్న మనిషివి
నీవు
నల్ల రబ్బరు బూట్లు వేసుకొన్న మనిషిని
నేను
మన ఇద్దరిమీద పడుతున్న వాన
వాన
Source: You and I and the World Werner Aspenström (1918–1997)
అనువాదం: బొల్లోజు బాబా

Friday, March 2, 2018

బెయిల్ ఇన్


రైతు రుణం
రిజెక్ట్ అయ్యింది
ఒక
భవిష్యత్ ఎగవేతనుండి
సంస్థను రక్షించామన్న
ఆత్మతృప్తి వారికీ ఉండొద్దూ!
బతకాలి కదా .... పాపం.
బొల్లోజు బాబా

Thursday, January 25, 2018

చివరి విందు - The Last Toast - Poem by Nicanor Parra

చివరి విందు - The Last Toast - Poem by Nicanor Parra
మనకు ఇష్టమున్నా లేకున్నా
మూడు చాయిస్ లు మాత్రమే ఉన్నాయి
నిన్న నేడు రేపు
మూడు కూడా కాదు
ఎందుకంటే ఒక వేదాంతి అన్నట్టు
నిన్న అనేది నిన్నే
ఒఠి జ్ఞాపకాలలో మాత్రమే అది మనది:
రేకలన్నీ తుంచబడ్డ గులాబీ నుంచి
కొత్తగా ఏ రేకల్నీ పెరకలేం
ఆడేందుకు రెండు పేకముక్కలు
మాత్రమే ఉన్నాయి
వర్తమానము భవిష్యత్తు
ఇంకా చెప్పాలంటే రెండు కూడా లేవు
గతానికి దగ్గరగా వెళ్ళిందా
వర్తమానమూ లేనట్టే
కరిగిపోతుంది
యవ్వనంలా
చివరకు
రేపు ఒక్కటే మిగిలుంది మనకు.
నేను మధుపాత్రను పైకెత్తి
కోరుకొంటున్నాను
ఎన్నటికీ రాని రోజుకు జయం కలగాలని.
మనకు మిగిలుంది అది మాత్రమే.
అనువాదం: బొల్లోజు బాబా
Source: Last Toast - Poem by Nicanor Parra

Monday, January 22, 2018

గోదావరి జిల్లాల కవిత్వానికి కొత్త వారసుడు బొల్లోజు బాబా ******************** ఆకెళ్ళ రవిప్రకాష్

ప్రముఖ కవి విమర్శకులు శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్ గారు నా కవిత్వంపై ఎంతో ప్రేమతో చేసిన విశ్లేషణాత్మక వ్యాసం ఇది.
ఇంతవరకూ నా కవిత్వంపై వచ్చిన సమీక్షలన్నింటిలోను దీన్ని అపురూపమైనదిగా భావిస్తాను.
ఈ వ్యాసం ఈ నెల పాలపిట్ట సంచికలో ప్రచురింపబడింది.
ఇంత గొప్ప ప్రశంసకు పాత్రుణ్ణి చేసిన రవిప్రకాష్ గారికి సదా నమస్కారములతో
బొల్లోజు బాబా
--------------------------------------------------------------------------------------------------
గోదావరి జిల్లాల కవిత్వానికి కొత్త వారసుడు బొల్లోజు బాబా ******************** ఆకెళ్ళ రవిప్రకాష్
1991 నించి ఏదో ఒక కవిత్వ కాలమ్ లో తరచు తన కవిత్వం కనిపించినా బొల్లోజు బాబా తన మొదటి సంకలనం “ఆకుపచ్చని తడి గీతం” తీసుకు రాడానికి 2009 వరకు ఎదురు చూసాడు. “ సాహితీ యానం” అనే కవిత్వ blog ని అంతకు ముందే ప్రారంభించాడు. 2007 లో యానాం విమోచనోద్యమం 2012 లో ‘ ఫ్రెంచ్ పాలనలో యానాం’ అనే రెండు చారిత్రక పుస్తకాల్ని ప్రచురించాడు. “ఎడారిలో అత్తరులు” అనే సూఫీ కవులవీ, ఇరవై ప్రేమ కవితలు అని పాబ్లో నెరుడా, గాధా సప్తశతి, టాగోర్ Stray Birds ఇవన్నీ అనువాదాలు చేసాడు. 40 పైగా విమర్శనా వ్యాసాలు, ఇపుడు 2017 లో “వెలుతురు తెర” తన రెండో కవితా సంకలనం తో ముందుకొచ్చాడు. పాతికేళ్ళ యితని సాహితీ యాత్రలో గత పదేళ్ళలో అత్యంత చురుకైన కాలంగా గుర్తించవచ్చు. కవిసంగమం వంటి సామాజిక మాధ్యమాలలోనూ ఈ కవి శక్తివంతంగా భాగం తీసుకోవడం చూడొచ్చు.
తూర్పుగోదావరి జిల్లాకు మధ్యన, కోనసీమకు ఆనుకుని వున్న మునుపటి ఫ్రెంచ్ కాలనీ యానాం ఇతని సొంత వూరు. ఇతని తండ్రి గారు బొల్లోజు బసవలింగం గారు యానాం లో ప్రసిద్ధులు. ఫ్రెంచ్ భాషలో పాండిత్యం, యానాం చరిత్ర మీద అనర్గళంగా ప్రసంగించగల శక్తి, సాహిత్యం నాటకం మీద మక్కువతో బసవలింగం గారు నేను యానాం లో పనిచేసినపుడు సుపరిచితులు. ఆరోజుల్లో బాబా దరియాల తిప్ప స్కూల్లో టీచరుగా పనిచేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషనులో లెక్చెరర్ గా ఎంపికయ్యి, ఇపుడు కాకినాడ PR కాలేజి లో పనిచేయడం మనకు తెలుసు. తన తండ్రిలాగా అధ్యాపక వృత్తి, ఫ్రెంచి చరిత్ర మీద మక్కువ,సాహిత్యం, కవిత్వంలో నేర్పుకలిగి వీటన్నిటిలో, తండ్రిని మించిన తనయుడు అని చెప్పాలి. ఇప్పటికే తండ్రిగారు చేయక మిగిలి వెళ్ళిన పనులన్నీ చకచకా చక్కబెట్టారనడంలో సందేహం లేదు. సూఫీల మీద, ఖలీల్ జిబ్రాన్, టాగోర్ లాటి సాధు కవులమీద మోజు కలిగిన యితనికి తల్లిదండ్రులు “బాబా” అని సార్థక నామం ఇచ్చారనిపిస్తోంది
.
యానాం నించి బలమైన కవిగా శిఖామణి తెలుగు కవిత్వంలోకి అడుగు పెట్టిన నాటినించి, ఆ భూమి కవిత్వానికి సారవంతమైన ప్రాంతం గా సాగు చేసుకుని వచ్చాడు. శిఖామణి బొల్లోజు బాబా కి మొదటి కవిత్వ గురువు. మొదటి కవిత నించీ, ఇప్పటి వరకు శిఖామణి ఇతని మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ సామాన్యమయినది కాదు. PG చదువుతున్నప్పుడు ఇస్మాయిల్ గారిని కలిసి కవిత్వ తాత్విక చర్చ చేయడం, ఇస్మాయిల్ ఇతని లోని spark ని గుర్తించి తేలిక పదాల ద్వారా కవిత్వ రచన ఎలా చేయవచ్చో తెలియచేయడం యితని కవిత్వ జీవితంలో పెద్ద మలుపు. ఆ రకంగా ఇస్మాయిల్ వీరికి పెద్ద గురువు. ఇతను ఇస్మాయిల్ లా గా నలభైయవ పడిలో ఆలస్యంగా కవిత్వ సంకలనం తేవడం, ఆయన లాగే PR కాలేజి లో పనిచేయడం ఇవన్నీకాకతాళీయమే. గోదావరి జిల్లాల కవులు కృష్ణశాస్త్రి, తిలక్, సోమసుందర్, ఇస్మాయిల్, చిన వీరభద్రుడు, శిఖామణి లకు ఈ తరం వారసుడుగా బొల్లోజు బాబాను గుర్తించవచ్చు. గోదావరి జిల్లాల్లో చదువుకున్న వారు మాట్లాడే సహజ వ్యావహారిక భాష, సరళ మైన, సుందరమైన, శుభ్రమైన తెలుగులో కవిత్వం రాస్తున్న వారిలో బాబా ఒకరు.
కవిత్వంలో నిశ్శబ్దం:
‘ కవిత్వంలో నిశ్శబ్దం’ అనే పదం ఇస్మాయిల్ గారి ద్వారా అందరికీ చిరపరిచితమే. ఇస్మాయిల్ కవిత్వంలో నిశ్శబ్దం ఉంటుందని అందరూ అంటారు. శబ్ద ఆడంబరం (Rhetoric) లేకపోవడం అనేది మాత్రమే కాకుండా visual metaphors తో దృశ్యాల్ని కంటిముందు నిలిపి భావ ప్రకటన చేయడంలో ఇస్మాయిల్ గారిది అందెవేసిన చెయ్యి. సరళమైన, క్లుప్తమైన వ్యక్తీకరణ తో దృశ్యావిష్కరణ ద్వారా కవిత్వాన్ని సౌందర్యంతో నింపడం బాబా కవిత్వంలోకూడా పుష్కలంగా వుంది.
సౌందర్యం .. (ఆకుపచ్చని తడి గీతం)
“ సెలయేటి ఎగువన ఎవరో
నీటిలో వెన్నెల బిందువుల్ని
కలిపారు.
సెలయేరు పొడవునా వెన్నెలే
నీరు తాగలని వంగితే
దోసిట్లో చందమామ”
అక్షరాలతో గీసిన చిత్ర పటాల్లా వుంటాయి ఈ కవితలు. దృశ్యమే కవిత్వం గా మారడమే కవిత్వంలో నిశ్శబ్దం అనొచ్చు.
ఊడుపు (వెలుతురు తెర)
పట్టె తోలిన వరిచేను
ఏది మబ్బు? ఏది కొంగ ?
ఒంగున్న స్త్రీలు
వరి మొలకల్ని
అనంత నీలిమలో
గుచ్చుతున్నారు
ఏది మన్ను ? ఏది మిన్ను ?
ఈ కవితను చూస్తే కళ్ళకి నీళ్ళతో నిండిన వరిచేను దర్శనమిస్తుంది. యిలా నిశ్శబ్ద సౌందర్యం బాబా కవిత్వం నిండా పుష్కలంగా దొరుకుతుంది.
తెరుచుకున్న పద్యాలు:
తెరుచుకున్న కవితలనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఇస్మాయిల్ గారు. కవిత్వం నడకలో చివరివరకు వచ్చే సరికి కొత్త ప్రపంచంలోకి తెరుచుకున్నట్టు వుండడం ఇస్మాయిల్ గారి కవిత్వంలో చూస్తాం. బొల్లోజు బాబా కవిత్వంలో కూడా తెరుచుకునే పద్యాలు అనేకం. ఇస్మాయిల్ గారు పద్యాల్లో రెండు మూడు evolving interconnected metaphors ని, ఎంచుకుంటారు. పద్యం మొదట్లో ఒక రూపకం, చివరి భాగంలో ఒక రూపకం వాడుతూ, చివర లో ఒక metaphor నించి, ఇంకో metaphor కి కవిత నెమ్మదిగా transfer అయినప్పుడు వాడిన సరళమైన పదప్రయోగం ద్వారా చిత్తాన్ని తేలికపరిచి అనుభవాన్ని కలిగించడాన్ని తెరుచుకున్న పద్యం అంటున్నాం. ఈ రహస్యాన్ని బొల్లోజు బాబా చాలా గట్టిగా ఆకళింపు చేసుకుని తన కవిత్వంలో అద్భుతంగా నిర్వహించాడు.
‘ వెలుతురు తెర’ (వెలుతురు తెర సంపుటం లోనిది)
దారాన్ని స్రవించుకుని
కాళ్ళతో పేనుకుంటూ తనచుట్టూ తానే
గూడు నిర్మించుకునే పురుగులా
ప్రతి విద్యార్ధి తన చుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకున్నాడు
గూడులోంచి సీతాకోకచిలుక
మెత్త మెత్తగా బయట పడినట్లుగా
ఒక్కో విద్యార్ధి మాటల ప్రపంచంలోకి
మెలమెల్లగా మేల్కొన్నాడు.
కాసేపటికి కాంపస్ అంతా
రంగు రంగుల మాటల చిలుకలు
రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతో !
ఇలా బాబా కవిత్వంలో ఎన్నోతెరుచుకున్న పద్యాల్ని దర్శించవచ్చు.
కథాత్మక ధోరణి:
ఇతని కవితల్లో కథ చెప్పే ధోరణిలో కవిత్వం నిర్మించడం, అత్యంత చాకచక్యంగా కవితని నిర్వహించడం చూస్తాం. బాబా కవిత్వంలో కవితాత్మక బిగువు ఆద్యంతం సాగుతుంది. ఇతని కవితలో చాలా చోట్ల, కథని metaphor గా నిర్వహించడం చూస్తాం.
“దొరికిన దొంగ” (వెలుతురు తెర)
కొబ్బరికాయల దొంగ దొరికాడట
చెట్టుకు కట్టేసి కొడుతున్నారట
చూట్టానికి వెళ్ళాను “
ఇలా అనేక కవితలు చరిత్ర, మార్పు, చర్మం రంగు, పక్కింటబ్బాయి, ఆత్మహత్యా యత్నం, వీటన్నిటిలో కథ ద్వారా అనుభవం కలుగుతుంది.
కథాత్మక ధోరణిలో యిప్పటికే అనేక మంది రాసివున్నా, బొల్లోజు బాబా కవిత్వంలో యిది అత్యంత సహజ సిద్దంగా కనిపిస్తుంది.
నాటకీయ శైలి:
బాబా కవిత్వంలో చాలాచోట్ల కవిత రంగస్థలి మీద నడుస్తున్న నాటక ఫక్కీలో నడుస్తుంది.
చరిత్ర (వెలుతురు తెర)
“ ఈ సొరంగం చివర
వెలుతురు వుండి తీరాలి “ అన్నాడతను
“ ఒకప్పుడు ఉండేదట
చెదలు తినేసాక వెలుతురంతా
అయిపోయింది” అన్నారు కొందరు వృద్ధులు”
ఇలా సంభాషణాత్మకంగా కవిత పొరలు పొరలుగా తెరుచుకుంటుంది. నాటకీయ ఫక్కీలో ఇంత సహజంగా వచనకవితా విన్యాసం సులువైన విషయం కాదు.
Poetry of experience లో నాటకీయ ఫక్కీలో అనుభవాన్ని పాఠకుడుకి చేరవేయడం లో ఆత్మీయత వుంది. అనుభవాన్ని పాఠకులకి గాధంగా చేరవేయడానికి తన పూర్వ అనుభవ కవులు దృశ్యాన్ని, double metaphors ని వాహికగా వాడుకుంటే బొల్లోజు బాబా కాస్త ముందుకు నడిచి కథాత్మక నాటకీయత ద్వారా దృశ్యాల్ని రచింప చేసి తద్వారా అనుభవాన్ని బదలాయిస్తున్నాడు. అనుభువ కవిత్వాన్ని పాఠకులకు మరింత చేరువ చేయడానికి powerful tools ని సమకూర్చుకున్నాడు.
అద్భుత తాత్వికత
ఆకు పచ్చని తడి గీతంలో గాని, వెలుతురు తెర లో గాని, Fragments అనే పేరుతో కొన్ని కవితా ఖండికలను రాసాడు. నిర్మాణం లో గానీ, శైలి, భాష వీటన్నిటిలో మిగతా కవితల నిర్మాణం కన్నా యివి భిన్న మైనవి. హైకూల కన్నా పెద్దవి. మినీ కవితలు అనవచ్చు. సూఫీ కవులు, ఖలీల్ జిబ్రాన్, టాగోర్ వీరందరి తాత్విక ప్రభావంతో రాసినట్లే వున్నా వీటిలో లోతైన అందం వుంది. బొల్లోజు బాబా లో లోతైన తాత్వికతా చింతనకు Fragments దర్పణాలు. వీటిలో సరళత, గాఢత నన్ను పూర్తిగా వశపరుచుకున్నాయి.
సామాజిక భూమిక
బొల్లోజు బాబా కవిత్వంలో మానవతావాదం, స్వేచ్చావాదం, స్త్రీ వాదం తో కూడిన సరళ సామజిక భూమిక కనిపిస్తుంది. ఇతను సామాజికంగా rebel కాదు. కానీ, నిరంతర చింతనాశీలి. తన నిత్య జీవితంలో స్వానుభవంలోకి వచ్చిన ప్రతి విషయం గురించి సునిశితంగా, దయగా, సూక్ష్మంగా స్పందిస్తాడు. అది ఫీజు కట్టలేక చదువు మానేసిన కుర్రాడు అయినా కావచ్చు, చర్మ రంగు గురించి ఉబ్బిన కళ్ళతో బాధపడిన పాప కావచ్చు. రాత్రిపూట పారిశుభ్య పనివాళ్ళు కావచ్చు, గర్భిణీ స్త్రీలకూ ఉచితంగా సేవలందించే ఆటో ప్రకాష్ కావచ్చు, పోలవరం నిర్వాసితులు కావచ్చు, సగటు మధ్య తరగతి ఉద్యోగిగా వుoటూ, తన చుట్టూ వున్న ప్రపంచం పట్ల నిజాయితీగా, సున్నితంగా, మృదువుగా స్పందిస్తున్న ఒక దయాళువు కనబడతాడు. సామజిక స్పృహ అంటే ఇంతకన్నా ఆశించేది ఏముంటుంది ?
గుండెలు పిండేసే కవితలు
అధ్యాపకుని పాత్రలో బాబా రాసిన అన్ని కవితలూ కూడా ఒక్కొక్కటి ఒక master piece. ఆ కవితలన్నిటికీ నేను దాసోహం అయిపోయాను. “ఎందుకో తెలియటం లేదు” కనే కవితలో ఫీజు కట్టలేక చదువు మానేసిన కుర్రాడు ఆటో తిప్పుతూ ఆ ఆటో కి కూడా యాక్సిడెంట్ అయి రిక్షా తొక్కడానికి సిద్ధపడ్డ పిల్లాణ్ణి చూడలేక ఆ రోడ్ ద్వారా వెళ్ళలేక పోతాడు. అలాగే మూల్యాంకనం, సార్ గారండీ, చర్మం రంగు, నీటి పొర, యివన్నీ కంట తడి పెట్టిస్తాయి. శిఖామణి మువ్వల చేతి కర్ర లోని కొన్ని కవితల్లా నన్ను బాగా కదిలించిందీ, కరిగించిందీ వెలుతురు తెరలోని యీ కవితలే.
సమ్మోహనం
స్త్రీ పురుష బంధాలలోని చిత్రమైన shades ని బాబా చాల బాగా పట్టుకోగలిగాడు. ఈ రకమైన కోణాలు కవిత్వంలో ఇంతకు మునుపు తక్కువ చూసాను.
“ ఆమె మాత్రం చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది” అనడం చిత్రమైన భావనను కలిగించింది.
అలాగే మార్పు అనే కవితలో ఆదర్శప్రాయంగా కాలేజీలోవున్నపుడు ఎంతో అభిమానించిన ఒక అమ్మాయికి old students meet లో చూసి నిరాశ చెంది, చూడకుండా వుంటే బాగుండేది అనడం మరో చిత్రమైన భావన. శ్రీమతి పెళ్ళైన కొత్తల్లో తనకి రాసిన ప్రేమలేఖని కూతురు భలేగా వుందే అని ఆశ్చర్యంగా చూస్తుంటే, అద్భుతంగా వర్ణించిన విషయాలు కాలం గడిచినకొద్దీ బంధం ఎలా పరిణతి చెందుతుందో అద్దం పడుతుంది.
ముగింపు
యానం- గోదావరి జిల్లాల కవిత్వ వారసత్వంలో వెలుగొందిన అనేక గొప్ప కవులు కృష్ణశాస్త్రి, తిలక్, ఇస్మాయిల్, శిఖామణి వీరందరి తర్వాత తరం ప్రతినిధిగా తనదైన ముద్రతో రాస్తున్న కవి బొల్లోజు బాబా. ఇస్మాయిల్ కవిత్వ పురస్కారం అందుకోవడానికి సర్వదా అర్హుడు. ఇతను కవిగా మరింత ఎదిగి దేశ విదేశాల్లో తెలుగు కవిత్వ బావుటా ఎగురవేస్తాడని ఆశిస్తున్నాను.
-౦-



Wednesday, January 17, 2018

అరాజకీయ మేథావులు ...... Apolitical Intellectuals by Otto Rene Castillo

అరాజకీయ మేథావులు ...... Apolitical Intellectuals by Otto Rene Castillo
ఏదో ఒక రోజు
సామాన్య జనం
రాజకీయ చైతన్యం లేని
నా దేశ మేథావులను ప్రశ్నిస్తారు
తమ సమాజం విస్మరింపబడి
చలిమంటలా క్రమక్రమంగా
ఆరిపోతున్నప్పుడు
మీరేం చేసారు అని ప్రశ్నిస్తారు
వారి దుస్తుల గురించి
సుష్టుగా భోంచేసిన తర్వాత
తీసే కునుకుల గురించి
ఎవరూ ప్రశ్నించరు.
"అంతా మిథ్య" అనే వారి
వ్యర్ధ వాదనల గురించి
ఎవరూ తెలుసుకోవాలనుకోరు.
వారి ఆర్ధిక శాస్త్ర నైపుణ్యం గురించి
ఎవరూ మాట్లాడరు.
గ్రీకు పురాణాల గురించి లేదా
వారిలోని ఒకడు చనిపోతుంటే
వారెలా అసహ్యించుకొన్నారో
అనే దాని గురించి ఎవరూ ప్రశ్నించరు.
పెద్ద అసత్యం నీడన పెంచిపోషించిన
వారి అర్ధంలేని సమర్ధనల గురించి కూడా
వారినేమీ ప్రశ్నించరు.
ఆ రోజు
అరాజకీయ మేథావుల పుస్తకాలలో
కవిత్వంలో ఏనాడూ ప్రస్తావింపబడని
సామాన్యజనం వస్తారు.
ఎవరైతే వారికి
రొట్టెలు పాలు గుడ్లు అందించారో
ఎవరైతే వారి దుస్తులు కుట్టారో
ఎవరైతే వారి వాహనాలను నడిపారో
ఎవరైతే వారి కుక్కలను, తోటలను సంరక్షించారో
వారికొరకే పనులు చేసారో
వాళ్లు వచ్చి ప్రశ్నిస్తారు
"నిరుపేదలు బాధపడినపుడు
వారినుంచి లాలిత్యము, జీవము
హరించుకుపోతున్నప్పుడు
మీరేం చేసారు"? అని.
నా ప్రియమైన దేశ
రాజకీయ చైతన్యం లేని మేధావులారా!
మీ దగ్గర సమాధానం ఉండదు.
నిశ్శబ్దమనే రాబందు
మీ పేగులను పీక్కుతింటుంది
మీ దీనస్థితి
మీ ఆత్మను క్షోభపెడుతుంది
ఆరోజు
మీరు సిగ్గుతో తలదించుకొంటారు
అనువాదం: బొల్లోజు బాబా
(Otto Rene Castillo గుటమెలా దేశానికి చెందిన విప్లవకారుడు, కవి)

Saturday, January 13, 2018

ప్రయాణం.....


బస్సెక్కి నంబరు వెతుక్కొని
నా సీట్లో కూర్చొని చుట్టూ పరికించాను
బస్సు దాదాపు ఖాళీగా ఉంది
కార్నర్ కిటికీ సీట్లో ఒక స్త్రీ
ఫోన్ రింగవుతూంటే మ్యూట్ చేస్తోంది పదే పదే.
ఒక్కసారి ఎత్తింది.
కాసేపటికి ఓ నడి వయసు మనిషి వచ్చి
పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు
ఆమె మౌనంగా ఉంది చాలాసేపు
"నన్ను ఓ పదిరోజులు ప్రశాంతంగా వదిలేయ్ ప్లీజ్"
అన్న ఆమె మాటలు మాత్రం స్పష్టంగా వినిపించాయి.
అతను వెళ్ళి పోయాడు
ఆమె కనులు మూసుకొని అద్దానికి తలాన్చి కూర్చొంది
కంటి చివర నుండి కన్నీటి చారిక మెరిసింది లిప్తపాటు.
బస్సు బయలు దేరింది
ఆమె గురించే ఆలోచిస్తూ నేనూ నిద్రలోకి జారుకొన్నాను
****
కండక్టర్ కేకతో హఠాత్తుగా మెలుకువ వచ్చింది.
తెల్లవారిపోయింది....... ఏదో స్టాప్ అనుకొంటాను.
ఆమె ఒక పిల్లాడ్ని ఎత్తుకొని
మరో పిల్లను నడిపించుకొంటూ
బస్సుదిగటం కనిపించింది.
ఆశ్చర్యం వేసింది
రాత్రి లేని పిల్లలు ఎక్కడనుంచి వచ్చారా అని!
ఎవరి స్వప్నాలలోంచి
ఎవరి స్వప్నాలలోకి
ప్రవహించారు వారు!

బొల్లోజు బాబా

Friday, January 5, 2018

ఫ్రాగ్మెంట్స్


1.
అభిమాన నటుడి ఫ్లెక్సీలు
హోరెత్తించే స్పీకర్లు
తూలిపోతూ స్టెప్పులు వేస్తు న్న
టీనేజ్ పిల్లలు
దుఃఖం పొంగుకొస్తోంది.

2.
రాత్రి ఫోన్ చేసాను ఎత్తలేదేం?
24/7 సిగ్నల్స్ రిసీవ్ చేసుకోటానికి
నేను సెల్ టవర్ ని కాదు మనిషిని
అందామనుకొన్నాడా చిరుద్యోగి
"సారీ బాస్" అన్నాడు

3.
నడిచే దారిలోని ప్రపంచాన్ని తింటూ
అవసరమైనదాన్ని పీల్చుకొంటూ
వ్యర్ధాల్ని వదిలించుకొనే వానపాము
ఎలా ముందు ముందుకు పోతోందో చూడు

4.
పాటు సమయాన తీరంపై
వీచే సముద్రపు వాసనలా
ఆమె దేహ పరిమళం
చలికాలపు కాన్క

5.
సీసాకు ఉన్న అన్ని ఒంపులను
దుస్తులుగా ధరించిన ద్రవంలా
హ్రుదయం
ఈ లోకపు అన్ని వంకరలను భరించగలిగితే
ఇక కవిత్వం అవసరం ఏముంటుంది?



బొల్లోజు బాబా