Wednesday, August 26, 2009

చేజార్చుకొన్నాం...... పాబ్లో నెరుడా

ఈ సంధ్యను కూడా మనం చేజార్చుకొన్నాం.
లోకంలోంచి నీలి రాత్రి ఊడిపడే సాయింత్రపువేళ
మనం చేతిలో చేయివేసుకొని సాగటాన్ని ఎవరూ గమనించలేదు.

ఆ దూరపు కొండల అంచులపై సూర్యాస్తమయ ఉత్సవాన్ని
నా కిటికీ లోంచి చూసాను.

ఒక్కోసారి ఒక సూర్యుని ముక్క నా చేతిలో నాణెమై మండేది.
నీకూ తెలిసిన నా విషాద హృదయంతో
నిన్ను నేను గుర్తుచేసుకొంటాను.

అప్పుడెక్కడున్నావు నీవు?
అక్కడ ఇక వేరే ఎవరున్నారూ?
ఏం చెపుతున్నారూ?
నీ వియోగంతో నే దుఖి:స్తున్నపుడు అకస్మాత్తుగా
మొత్తం ప్రేమంతా నన్ను ఎందుకు ముంచెత్తుతుందీ?

చేజార్చుకొన్న పుస్తకం ఎప్పుడూ సంధ్య పుటనే చూపిస్తూంటుంది.
నా పాదాలవద్ద తీరం, గాయపడ్డ కుక్కలా దొర్లుతుంది.

పాలరాతి శిల్పాలను అదృశ్యం చేసే వెన్నెలలోకి
నీవు సాయింత్రాల గుండా ప్రతీసారీ జారిపోతూంటావు...... ప్రతీ సారి.


బొల్లోజు బాబా

పాబ్లో నెరుడా - We Have Lost Even కు స్వేచ్చానువాదం

Saturday, August 22, 2009

సూఫీ కవిత్వం -- చివరి పార్టు

ఇతర సూఫీ కవులు

సాదాలుద్దిన్ మహ్మద్ షాబిస్తరి (1250-1320) ప్రముఖ సూఫీ కవి.

నీ హృదయమందిరాన్ని శుబ్రం చేయి.
నీ ప్రియవిభుని నివాసానికై దానిని సిద్దంచేయి.
నీవు దానినుండి బయటకు వస్తే ఆయన లోపలకొస్తారు.
నిన్ను నీవు ఖాళీ చేసుకో. ఆయన తన సౌందర్యాన్ని చూపిస్తారు.రబియా అల్ అదావియ్యా 717-801) ప్రముఖ సూఫీ కవయిత్రి. తలితండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో, రబియా బానిసత్వంలోకి నెట్టబడింది.

చాలాకాలంపాటు తన యజమానికి ఊడిగం చేసిన తరువాత రబియా, తన ఆలోచనలను, చర్యలను ఈశ్వరునివైపుకు మళ్లించుకొని గొప్ప సూఫీ కవయిత్రిగా నిలిచి, అనేక రచనలు చేసారు

తన నిబద్దత, విశ్వాసాలకు చలించి, రబియాను బానిసత్వం నుంచి విముక్తురాలిని చేసాట్ట యజమాని.


1.
నేను నిన్ను రెండు విధాలలో ప్రేమిస్తూంటాను.
ఒకటి స్వార్ధ ప్రేమ. మరొకటి ఎంతో విలువైనది.
స్వార్ధ ప్రేమలో నేను నిన్నే స్మరిస్తూంటాను.
రెండవదానిలో
నీవు తెర తొలగిస్తావు. నీ సుందర మోమును
కన్నుల పండుగగా నేనలా చూస్తూ ఉండిపోతాను.
---- రబియా

2.
ప్రభూ!
నిను నా హృదయ వల్లభునిగా చేసికొన్నాను.
కానీ నా దేహం మాత్రం తనను కోరుకొనే వారికి అందుబాటులో ఉండి
తన అతిధితో స్నేహిస్తూంటుంది.
నా హృదయవల్లభుడే నా ఆత్మకు అతిధి.
--- రబియా

నూరుద్దీన్ దిన్ అబ్దర్ రహ్మాన్ జామీ (జామీ) 1414-1492)

ఓ సాకి
ఒక మధుపాత్రిక నిచ్చి నాపై దయచూపు.
నాలోకే నేను పూర్తిగా కూరుకుపోయాను
ఒక్కసారి నానుంచి నన్ను విడుదల చేయవూ!
నేనెవరి కంటా పడకూడదనుకొంటాను
ప్రేమ తాలూకు పొగమంచు కమ్ముకొన్న ఆ అద్బుత క్షణం లో నాకు నేనే కనిపించకూడదనుకొంటాను.
ప్రభూ
నీకూ నాకూ మధ్య నేను తప్ప మరే తెరా లేదు
దయతో ఈ తెర తీయగ రావా.
జీవి జీవాన్ని ఎక్కడైతే పొందుతుందో
అట్టి శూన్యత్వాన్ని దర్శింపచేసే మహిమను
తెలియచేయవా, మిత్రమా
జామీ,
ప్రేమ నీ అన్ని అనవాళ్లనూ చెరిపేసేవరకూ
నీలో ఉండే నిన్నుని పూర్తిగా కడిగివేసేవరకూ
ఆద్యంతరహితమైన జీవితం నీకు సుదూరమే.
ప్రేమ విస్తరించుకొని ఉండేది స్థల, ప్రాంతాలలో కాదు.
ఈ ప్రదేశాలు, దేశాల నుండి బయటకు
పడే దారిని అన్వేషించు.

---- జామీ (ఈ కవితను అనువదించటంలో సూచనలు ఇచ్చి, సందేహాలు తీర్చిన శ్రీ భైరవభట్ల గారికి కృతజ్ఞతలు తెలియ చేసుకొంటున్నాను)

షిరాజ్ 1215-1292) పర్షియాకు చెందిన గొప్ప సూఫీ కవి. రోజ్ గార్డెన్, ఆర్చార్డ్ వంటి ప్రముఖ రచనలు చేసారు.

ఉదయవిహంగమా!
చిమ్మెటను చూసి ప్రేమించటం నేర్చుకో.
అది దహించుకుపోయింది. జీవితాన్ని కోల్పోయింది.
నిశ్శబ్దమైపోయింది.
ఈ వేషగాళ్లు ఆయనను అన్వేషిస్తున్నారు, అజ్ఞానులు.
జ్ఞానాన్ని పొందినవారెవరూ తిరిగి రాలేదు మరి.
---- షిరాజ్

*******************

సూఫీ కవిత్వం పేరుతో నే చేసిన ఆయా కవుల అనువాదాలను చదివి, తమ అమూల్య అభిప్రాయాలు తెలియచేసి, ప్రోత్సహించిన వారందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు

బొల్లోజు బాబా

Sunday, August 16, 2009

స్ట్రీట్ చీమలు


అంత తక్కువకైతే కిట్టదయ్యా
మరో రెండు రూపాయిలిప్పించండి.
లేదు లేదు, నీకు కిడితేనే ఇవ్వు
బలవంతం ఏముంది?
ఆ రాత్రి, కప్పుకంతల్లోంచి చుక్కల్ని చూస్తున్న
జాంకాయల వ్యాపారినడిగింది – భార్య
“వచ్చే వారం పిల్లాడి పుట్టిన రోజు గుర్తుందా?”

ఊరిలోని పెద్దపులిని ఎవరో చంపేసార్ట.
షట్టర్లు మూసుకొన్నాయి, తాళాలు పడ్డాయి,
లాఠీలు పగిలాయి, తుపాకులు పేలాయి.
డబ్బు డబ్బును కాపాడుకొంటూంది.
రేపేమిటన్న ప్రశ్నకు మత్తుమందిచ్చి
నిద్రపుచ్చిన పాత బట్టల వ్యాపారి
“నాకాకలిగా లేదు నువ్వుతినేసి పడుకో” అన్నాడు.

“బేరంలేదని నేటి వడ్డీ రేపుకడతానంటే ఎలా”
ఉన్నదంతా పీల్చుకుపోయింది
రోజుకు ఇరవై రూపాయిల వడ్డీ జలగ.
నిద్రకు ముందు ఆ తాళంచెవుల వ్యాపారి విన్న ఆఖరుమాటలు
“కొన్న మందులు రేపటితో అయిపోతాయి
డాక్టరు చీటి జేబులో పెడుతున్నాను
తెచ్చుకోవటం మర్చిపోవద్దు”

ఎండిన ఖర్జూరం లాంటి దేహంతో
అలంకరణ సామాన్లమ్మే ఆ ఒకనాటి ఆటకత్తె
ఎర్రటి ఎండకు తాళలేక చెట్టుకిందకు చేరింది.
“అమ్మా పుస్తకాలు తొందరగా కొనుక్కోమంటున్నారే
రేపు కొంటావా?” అనడిగిన కొడుకుకు
ఆ రాత్రామేం సమాధానం చెప్పింది?

“మామ్మా ఇవి తీసుకో” అని మిగిలిపోయిన
పళ్లని వీధి బిచ్చగత్తె కిచ్చేసి ఇంటికి
బయలుదేరాడతను చుక్కల వెలుగులో.
“నాన్నా స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉంది.
ఓ కుర్రాడు వెంటపడి వేధిస్తున్నాడు” బేలగా అంటోంది కూతురు.

“బండి ఇక్కడ ఎందుకు పెట్టావురా దొంగ వెధవా”
తన్నిన తన్నుకు బండిమీది చైనా వస్తువులు
రోడ్డుపై చెల్లా చెదురు – ట్రాఫిక్ ఆగుతుందా?

కొన్నిరోజుల తరువాత
సూర్యుని వెనుకే ఉదయించిన
మీసాలింకా రాని స్వరమొకటి ఇలా అరుస్తోంది
“జత పది జత పది జత పదీ

బొల్లోజు బాబాSunday, August 9, 2009

వాళ్లీరోజు నాకోసం వచ్చారు...........*

(కె.జి. బేసిన్ సంపదను పొరుగు రాష్ట్రాలకు తరలించుకుపోవటాన్ని నిరసిస్తూ......)

భూమి నుంచి వచ్చిందేదైనా
భూమినే చేరుతుంది.
ఈ మట్టిలోంచి వచ్చి ఈ మట్టిలోకే
అదృశ్యమయ్యే ఈ మట్టి పుత్రులకెందుకు
ఈ మట్టి ఫలాలు అందటం లేదూ?

ఈ నేల నుంచి తోడిన శక్తిని
వాడెవడో తోలుకుపోవటం, మరెక్కడో
వెలుగు పువ్వులు పూయించుకోవటం
రొమ్మునుంచి బిడ్డను వేరుచేయటమే!
కోకిల కాకిపిల్లను గూడునుంచి కిందకు తొయ్యటమే!

దివిసీమ ఉప్పెనలో
ప్రాణాల్ని కోల్పోయిన ఎముకలు
ఘొల్లుమంటున్నాయి ఈ దాష్టీకానికి.
హైపర్ సైక్లోనులో తగులుకొన్న తెగులుకు
చితికి పోయిన కొబ్బరి తోటలు
బావురుమంటున్నాయి ఈ దారుణానికి.
అనాదిగా ఇక్కడి జీవితాల్ని
వరదల కొండచిలువ కబళిస్తూనే ఉంది.
తుఫానుల తాచుపాము కాటువేస్తూనే ఉంది.
ఈ నేల ప్రసాదించే అన్ని శాపాల్నీ ఇక్కడి జనం
కళ్ల కద్దుకొని భక్తిగానే స్వీకరిస్తున్నారు.
కానీ
ఈనాడు ఈ నేల ఇచ్చిన సంపదను మాత్రం
వాడెవడో వచ్చి పెద్ద గద్దలా తన్నుకుపోతున్నాడు.
వరాల్ని అసమానంగా పంచటమే నేటి రాజనీతి కామోసు..

ఈ మట్టి వాసనను తరలిస్తున్నారు
ఈ మట్టి రక్తాన్ని పిండుకుపోతున్నారు
ఈ మట్టి స్వప్నాల్ని దొంగిలిస్తున్నారు.

ఇది అనాదిగా జరుగుతున్నదే కావొచ్చు
అంతా చట్టబద్దంగానే ఉండొచ్చు
అలా చేసేవాడూ మన సహోదరుడే అవ్వొచ్చు.

అయినప్పటికీ
ప్రకృతి ఇచ్చే శాపాలు ఒకరి పాలు
వరాలు మరొకరి పాలు అంటే సహించేదెలా?
రొట్టెలో మనభాగమెంతో తేల్చమందాం.
ఈ నేల సారంతో పూచిన పూలను
ఇక్కడా పరిమళించమని శాసిద్దాం.

దూరంగా
“ఈ నేల మనదిరా... ఈ నింగి మనదిరా” పాట
ఇపుడెందుకో కొత్త అర్ధాలతో వినబడుతోంది.

బొల్లోజు బాబా


Saturday, August 8, 2009

పొద్దు పత్రికలో శిఖామణి గారి చిలక్కొయ్య పుస్తకంపై నా సమీక్ష

ప్రముఖ కవి, విమర్శకుడు, శిఖామణి గారు రచించిన "చిలక్కొయ్య" అనే కవితాసంకలనం పై నేను వ్రాసిన వ్యాసం ఈ క్రింది లింకులో చదువుకొనవచ్చును.పొద్దు సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో.....

భవదీయుడు

బొల్లోజు బాబా

Wednesday, August 5, 2009

వేడుక (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)


ఓహ్ ఈ చిట్టి పరికిణీకి రంగులంటించింది ఎవరోయీ?
ఓ బుజ్జాయీ! నీ చిన్నారి చేతులకు ఎరుపు రంగు అంటుకున్నదేమీ?

ఈ తోటకు ఉదయాన్నే ఆడుకోవటానికి
చెంగు చెంగున పరుగులిడుతూ వచ్చినావు. ఇంతలోనే
ఈ పరికిణీకి రంగులంటించింది ఎవరోయీ? నా చిట్టి తల్లీ.

నా చిన్నారి మొగ్గా! నీకు నవ్వెందుకు వస్తున్నదోయీ?
గడపవద్ద నుంచుని అమ్మ నిను చూసి నవ్వుతున్నది.

చిన్నారి గొర్రెల కాపరిలా ఓ కర్ర చేతబూని నీవు చేసే నాట్యానికి
అమ్మ చప్పట్లు కొడుతూంటే, ఆమె చేతి గాజులు గలగల మంటున్నాయి.

నా చిన్నారి మొగ్గా ఎందుకు నవ్వుతున్నావోయీ?

అమ్మ మెడకు రెండు చేతులతో వేళ్ళాడుతూ
ఏమి యాచిస్తున్నావోయీ? ఓ చిట్టి యాచకా!

ఈ ప్రపంచాన్ని, ఆకాశం నుంచి కోసిన ఒక ఫలంగా చేసి
నీ చిట్టి గులాబి దోసెట్లో ఉంచితే, నీ తనివి తీరేనా?

ఏమి యాచిస్తున్నావోయీ? ఓ చిట్టి యాచకా?

నీ కాలి మువ్వల గలగలలను గాలి ఆనందంగా మోసుకు పోతోంది.

నువు దుస్తులు మార్చుకోవటం సూర్యుడు నవ్వుకుంటూ చూస్తున్నాడు.
నీవు నీ తల్లి ఒడిలో నిదురించే వేళ అంబరం పైనుంచి గమనిస్తోంది.
ఉదయం నిశ్శబ్ధంగా నీ మంచం వద్దకు చేరి నీ కళ్ళను ముద్దిడి సాగుత్దోంది.

నీ కాలి మువ్వల గలగలలను గాలి ఆనందంగా మోసుకు పోతోంది.

వెన్నెలాకాశంనుండి స్వప్నమోహిని ఎగురుకుంటూ, నిను చేర వస్తున్నది.
నీ తల్లి హృదయంలో నీ పక్కనే లోక మాత ఆశీనురాలయింది.

తారాలోక గాయకుడు నీ కిటికీ వద్ద, చేతవేణువు ధరించి నిలుచున్నాడు.

వెన్నెలాకాశం నుండి స్వప్న మోహిని ఎగురుకుంటూ నిను చేరవస్తున్నది.


బొల్లోజు బాబా

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని THE UNHEEDED PAGEANT గీతం

Saturday, August 1, 2009

నీలాపనిందలు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)


నా చిట్టితల్లీ! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
నిష్కారణంగా వాళ్లు నిన్ను తిట్టటం ఎంత దారుణం?

నీ బుగ్గలు , వేళ్లపై సిరా మరకలు చేసుకొన్నందుకు నిన్ను మురికి పిల్ల అని గేలి చేసారా?

అయ్యో రామ! తన మొహం నిండా మరకలు చేసుకొన్నందుకు
నిండు చందమామను మురికి అనే ధైర్యం చేయగలరా వాళ్ళు?

ప్రతి చిన్న విషయానికీ నిన్ను నిందిస్తున్నారు.
నిష్కారణంగా తప్పులెన్నటానికి వారెప్పు డూ సిద్దం గా ఉంటారు.

ఆటలో నీ దుస్తులు చిరిగిపోయినందుకేనా వారు నిన్ను వికారంగా ఉన్నావని అన్నది?

అయ్యో రామ! చిరిగిన మబ్బుల గుండా చిరునవ్వులు చిందించే
శరత్కాల ఉదయాన్ని వారేమని పిలుస్తారట?

వాళ్ల మాటలనేమీ పట్టించుకోకు తల్లీ!
వాళ్ల మాటలనేమీ పట్టించుకోకు!

నీ లోపాల చిట్టాను వారు తయారు చేస్తూంటారు.
నీకు మిఠాయిలంటే ఇష్టమని అందరకూ తెలుసుకదా.
దీనికే వారు నిన్ను ఆశలమారివని అంటారా?

అయ్యో రామ! సరిపోయింది. మరి నిన్ను ప్రేమించే మమ్ములనేమని పిలుస్తారో!


బొల్లోజు బాబా

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని DEFAMATION