అంత తక్కువకైతే కిట్టదయ్యా
మరో రెండు రూపాయిలిప్పించండి.
లేదు లేదు, నీకు కిడితేనే ఇవ్వు
బలవంతం ఏముంది?
ఆ రాత్రి, కప్పుకంతల్లోంచి చుక్కల్ని చూస్తున్న
జాంకాయల వ్యాపారినడిగింది – భార్య
“వచ్చే వారం పిల్లాడి పుట్టిన రోజు గుర్తుందా?”
ఊరిలోని పెద్దపులిని ఎవరో చంపేసార్ట.
షట్టర్లు మూసుకొన్నాయి, తాళాలు పడ్డాయి,
లాఠీలు పగిలాయి, తుపాకులు పేలాయి.
డబ్బు డబ్బును కాపాడుకొంటూంది.
రేపేమిటన్న ప్రశ్నకు మత్తుమందిచ్చి
నిద్రపుచ్చిన పాత బట్టల వ్యాపారి
“నాకాకలిగా లేదు నువ్వుతినేసి పడుకో” అన్నాడు.
“బేరంలేదని నేటి వడ్డీ రేపుకడతానంటే ఎలా”
ఉన్నదంతా పీల్చుకుపోయింది
రోజుకు ఇరవై రూపాయిల వడ్డీ జలగ.
నిద్రకు ముందు ఆ తాళంచెవుల వ్యాపారి విన్న ఆఖరుమాటలు
“కొన్న మందులు రేపటితో అయిపోతాయి
డాక్టరు చీటి జేబులో పెడుతున్నాను
తెచ్చుకోవటం మర్చిపోవద్దు”
ఎండిన ఖర్జూరం లాంటి దేహంతో
అలంకరణ సామాన్లమ్మే ఆ ఒకనాటి ఆటకత్తె
ఎర్రటి ఎండకు తాళలేక చెట్టుకిందకు చేరింది.
“అమ్మా పుస్తకాలు తొందరగా కొనుక్కోమంటున్నారే
రేపు కొంటావా?” అనడిగిన కొడుకుకు
ఆ రాత్రామేం సమాధానం చెప్పింది?
“మామ్మా ఇవి తీసుకో” అని మిగిలిపోయిన
పళ్లని వీధి బిచ్చగత్తె కిచ్చేసి ఇంటికి
బయలుదేరాడతను చుక్కల వెలుగులో.
“నాన్నా స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉంది.
ఓ కుర్రాడు వెంటపడి వేధిస్తున్నాడు” బేలగా అంటోంది కూతురు.
“బండి ఇక్కడ ఎందుకు పెట్టావురా దొంగ వెధవా”
తన్నిన తన్నుకు బండిమీది చైనా వస్తువులు
రోడ్డుపై చెల్లా చెదురు – ట్రాఫిక్ ఆగుతుందా?
కొన్నిరోజుల తరువాత
సూర్యుని వెనుకే ఉదయించిన
మీసాలింకా రాని స్వరమొకటి ఇలా అరుస్తోంది
“జత పది జత పది జత పదీ”
బొల్లోజు బాబా
అర్థం చేసుకోవడానికి కాస్త కష్టం అనిపించినా చదివాక మనసు బరువెక్కిందండి!
ReplyDeletebolloju baba garu... meeru drugs laga tayarayyaru... chadivithe evaru fans kakunda undalekapothunnaru
ReplyDeleteసృజన గారి మాటే నాదీనూ....
ReplyDeleteఅక్కడక్కడి సీన్లు చదివినట్లుగా ఉంది. కానీ బాగుంది. :)
పేదరికం ఎంత భయంకరం గా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు కనబడింది :( మీరు రాసే కవితలు చాలా ఆలోచనలు రేకిస్తాయి
ReplyDeleteఅదరగొట్టేశేరు బాబాగారు. కానీ ఆ పాపం ఎవ్వరిదనికూడా ప్రశ్నించివుంటే ఇంకా బాగుండేది. చదివిన వాళ్ళకు మనసు బరువెక్కడంతోపాటూ, కొంచం గిల్టీ చురుక్కు కూడా తగిలేది. కానీ చాలా బాగా వ్రాశారు.
ReplyDeleteరవికిరణ్ తిమ్మిరెడ్డి
టైటిల్ చాల యాప్ట్ గా ఉంది. రెక్కాడినా డొక్కాడని జీవితాలను గుండెలను స్ప్రుసించేలా వర్ణించారు. మీ కవితలని విమర్శించే అంత జ్ఞానం,అనుభవం నాకు లేవు. కానీ మీ మిగతా వాటితో పోలిస్తే ఇది వచన కవిత్వం కంటే వచన రచనకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. నేను మీ కవిత చదివిన ప్రతీసారి దాంట్లో వాడుకలు,పాదాలు, పదాలు చాలా సేపు (ఒక్కోసారి రోజులు) నాలో మెదులుతూ ఉంటాయి. ఈ కవిత లో భావం అలా ఉంది కాని కవిత (as such) అలా జ్ఞ్యప్తిలో ఉండట్లేదు.
ReplyDeleteదాదాపు 70 ఏళ్ళ వయసులో ముగ్గు రాళ్ళు కొట్టి ఇంటింటికీ తిరిగి అమ్మే నా చిన్ననాటి నేస్తం ముగ్గవ్వ గుర్తుకి వచ్చింది [నా కిడ్డీ బాంక్ డబ్బులన్నీ ఇచ్చి ఓ బుట్టన్నా కొననిదే వెళ్ళనిచ్చేదాన్ని కాదు]. అలాగే చిత్తు కాగితాలు ఏరుకునే ముసలమ్మ [నా పేరు వాళ్ళకి తెలియదు వాళ్ళవి నేనూ అడగలేదు] నా ఇంటి ముందు వచ్చిన ప్రతిసారి ఒక egg పెట్టి కప్పు పాలు తాగించి పంపేదాన్ని. లేదా అన్నం తిని వెళ్ళేది. ఒకసారి చీర, దుప్పటి కొనిస్తే రాత్రికే అమ్మేసి, సారా తాగి వచ్చి రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. నాకు బాధ తప్ప కోపం రాలేదు. ఈ మధ్య ఒక కథ చదివాను. చదువుకో అని డబ్బులిస్తే ఆ రాత్రికే జత గాళ్ళతో జల్సా చేసేసి మళ్ళీ మర్నాడు అక్కడే ప్రత్యక్షమౌతాడు. వీళ్ళందర్నీ తయారు చేసిందెవరు. వాళ్ళలో జాగృతి కలిగించేదెవరు? తీరిక లేని పరుగుల్లో తనతో పాటు వారిని నడిపించాలనే నాయకులెవరు? నా వంతు చేస్తూనే వున్నా నాకూ ఓటమి తప్పటం లేదు. నా సానుభూతిని వాడుకునేవారే కానీ అందులోని ఉద్దేశ్యాన్ని అవగతం చేసుకునేవారు తక్కువ. మీ కవితలోని పాత్రలకి వెనక వుండే కొన్ని మనుషులు నా వంటివారు. నాదీ ఆవేదన, మార్గం తోచని అయోమయం. వీళ్ళని ఎలా మనమాదిరి మార్చాలి?
ReplyDeleteచివరి పంక్తులు చదివితే, నేను ఇదివరలో వ్రాసిన ఓ కవిత గుర్తుకొచ్చింది.
ReplyDeletehttp://amtaryaanam.blogspot.com/2008/01/blog-post_3298.html
శ్రుజన గారికి, ప్రకాష్ గారికి, విశ్వప్రేమికుడు, నేస్తం గారికి థాంక్సండీ.
ReplyDeleteరవికిరణ్ గారికి మీ కవితలు ఈ మాటలో చూస్తూంటాను. ఇలా విచ్చేయటం, కామెంటటం ఆనందంగా ఉందండీ. మీ సూచనను ప్రయత్నిస్తాను.
వాసు గారికి
మీరన్నట్లు ఈ కవితలో వచనం పాళ్లు ఎక్కువే. ఏదైన ఒక విషాదకరమైన, లేదా బరువైన విషయాన్ని చెప్పేప్పుడు, కవిత్వీకరించేకొద్దీ వస్తువు గ్లామరైజ్ అయిపోయి భావతీవ్రత పలచబారుతుంది. ఇలాంటి సందర్భాలలో కవిత్వీకరణ (ఉపమానాలు, పదచిత్రాలతో) కంటే కూడా ఆ ఆలోచనను మరింత పదునుబారేలా చేయటం సముచితమని నా అభిప్రాయం. అలాంటి కవితలలో కవిత్వం కనిపించకపోవచ్చు. కానీ ఆలోచన ఉంటుంది. అది ఎంతలోతుగా గుచ్చుకొంటుందో అనేదానిపై ఆ కవిత మనుగడ ఉంటుంది.
ఇక్కడ ఈ కవితలో వివిధరకాల స్ట్రీట్ హాకర్స్ జీవితాలలో రోడ్డుపై మనకు కనిపించే ఒక దృశ్యం, ఇంటివద్ద జరిగిన దాని పర్యవసానాన్ని లింక్ చేసుకొంటూ వ్రాసినటువంటిది.. ఆ సమస్యలు కూడా మనం రోజూ అనుభవించేవే, మరీ ప్రత్యేకమైనవేమీ (మరీ సినిమా కష్టాల్లా) కాదు. వాళ్ల స్ట్రెంగ్త్స్ అన్డ్ వీక్నెసెస్ నూ గమనించవచ్చు.
మీరన్నట్లు ఇవి సీన్ లు చదువుతున్నట్లు ఉండొచ్చు. కవిత్వం లేకపోవొచ్చు. కానీ ఈ “ఆలోచన” ఆలోచింపచేస్తుందనే నేను భావిస్తాను.
ఈ క్రింది లింకులోని మరో కవితలో కూడా ఇలాంటి శైలినే చూడవచ్చు
http://sahitheeyanam.blogspot.com/2008/12/blog-post_23.html
ఉషగారికి
మీ వాఖ్యలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని నేను ఊహించుకోగలుగుతున్నాను. మీకు జోహార్లు. భౌతిక మైన మార్పుకు ముందుగా మానసికమైన వాతావరణం ఏర్పడాలి. ఇలా చర్చించుకోవటం వల్ల అల్లాంటి మానసిక వాతావరణం ఏర్పడుతుందనే భావిస్తాను.
సాయి కిరణ్ గారికి
మీ కవిత బాగుందండీ. థాంక్యూ.
బాబా గారు,
ReplyDeleteకవిత్వం లేకపోవటవేవిటండి. ఏవిటి కవిత్వవంటే. కవిత్వం ఇలాగే వుండాలని సూత్రీకరించే రోజులు ఇవికావండి. పెయింటింగ్ అంటే ఫలాని విధంగా వుండాలి అనే సూత్రీకరణ ఇప్పుడు ఎంత అసంబద్దంగా వుంటుందో, కవిత్వవంటే అలాగే పాఠ్య పుస్తలాల్లోనూ, కళాశాలల్లోనూ సూత్రీకరించిన విధంగానో, మీముందు కవులు కవిత్వీకరించిన విధంగానో వుండాలని నేననుకోను. ఒక భావాన్ని కథలా విస్తరించకుండా వీలైనంత క్లుప్తంగా ఆ భావాన్ని చదువరిలో కలగజేయటవే కవిత్వం. అది వచనం అయినందువలన దాని కవిత్వపు పవరేం తగ్గదు, సొగసు కూడా ఏవీ తరిగిపోదు. కవితకి కావాల్సిన ఒకే ఒక లక్షణం పాఠకుడి మనసులో అలజడిని సృష్టించగలగడవే అని నా ఉద్దేశం. ఆ దిశలో మీ కవిత తన పనిని అద్భుతంగా నిర్వహించిందని నా అభిప్రాయం.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
బాబా గారు, నా పట్ల మీరు కనపరిచిన అభిమానానికి ధన్యురాలను. మీ కవిత కలిగించిన స్పందనతో చిన్ననాటినుండి నన్ను కలవరపరిచి, నా ఆలోచనా తీరుని మార్చిన నా ముగ్గవ్వ - ఇదిగో ఇక్కడ అందరి ఎదుటకి తీసుకువచ్చాను. http://maruvam.blogspot.com/2009/08/blog-post_20.html
ReplyDeleteమనసుకు హత్తుకుంది.
ReplyDeleteఎక్కడెక్కడి ఙ్ఞాపకాలనో తట్టిలేపుతున్నది మీ కవిత. ఈ మధ్యనే ఎన్నకలప్పుడు నేను వ్రాసిన ఒక టపాల మధ్య భాగం కాస్త ఇలాంటి అనభవమే...
ReplyDeletehttp://gitasrujana.blogspot.com/2009/04/1.html
బాబాగారు,
ReplyDeleteరవికిరణ్ గారి చివరి అభిప్రాయమే నాదీను. మీరు లంకె ఇచ్చిన మీ మునపటి కవిత కన్నా కూడా ఇది నాకు నచ్చింది. అందులో మీ వ్యాఖ్యానం కొంత ఉంది, ఇందులో లేదు, అందుకు.
వస్తు రూపలలో రెంటిలోనూ మీరు చూపిస్తున్న వైవిధ్యం నన్ను అబ్బురపరుస్తోంది!
This comment has been removed by the author.
ReplyDeleteఆ వస్తు వైవిధ్యమే కిక్కెక్కిస్తుంది. అందులో గాఢతే మత్తెక్కిస్తుంది. అందులో తడే మనసులో ఇంకిపోతున్న చెలమని చెరువుని చేస్తుంది.
ReplyDeleteరవికిరణ్ గారు,
ReplyDeleteమీ అభిప్రాయాలకు ధన్యవాదాలు. నిజమే మీరన్నట్లు మనసులో అలజడి సృష్టించడమే సాహిత్యపరమార్ధం. థాంక్యూ వెరీ మచ్ సర్.
గీతాచార్య గారు మీ పోస్టు చదివాను. చాలా బాగుంది. థాంక్యూ
భైరవభట్ల గారు మీ పరిశీలనకు ధన్యవాదాలు. థాంక్యూ సార్.
వెంకట రమణ గారు, దిలీప్ గారు ధన్యవాదములు
బొల్లోజు బాబా
ఎండిన ఖర్జూరపు బాహ్య రూపంలా.... అస్తవ్యస్త సమాజాన్ని
ReplyDelete'ఎండిన ఖర్జూరంలా ' ..వాస్తవాల ఆవిష్కరణ .అభినందనలు బాబాజీ ...నూతక్కి
బాబా గారు,
ReplyDeleteఈ క్రింది లింకు చూడండి. ఇది కవిత కాదా?
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/aug/24vividha5
రవికిరణ్ తిమ్మిరెడ్డి
రవికిరణ్ గారు
ReplyDeleteమీరిచ్చిన లింక్ చాలా బాగుందండీ. దానిని కవిత్వం కాదని ఎవరనగలరండీ? మీరన్నట్లు మనసులో అలజడి. చిక్కదనం ఉంది. పై నా వ్యాక్యలో చెప్పినట్లుగా పదచిత్రాల గుభాళింపు, ఉపమానాల పొహళింపూ లేకపోయినా ఒక ఆలోచన సూటిగా గుచ్చుకొంటూంటుంది. అది ఖచ్చితంగా కవిత్వమే.
ఇక పోతే మీకు ఆశక్తి ఉంటే
ఈ క్రింది లింకులో కవిత్వం అంటే ఏమిటి అన్న అంశంపై నేనిదివరలో వ్రాసుకొన్న అభిప్రాయాలను చదవండి దయచేసి. (మినర్వా గారికిచ్చిన సమాధానంలో)
http://sahitheeyanam.blogspot.com/2008/12/i.html
భవదీయుడు
బొల్లోజు బాబా
బాబా గారు,
ReplyDeleteమీ పై లింకులో ఇచ్చిన మీ అభిప్రాయాన్ని చదివేను. మీ దృష్టిలో కవిత్వవంటే ఏవిటో చాలా చక్కగా, స్పష్టంగా వ్రాశారు. ఐతే ఆ అభిప్రాయంలో ఒక విషయంతో మాత్రం నేను ఏకీభవించలేను. మీరు "కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని కొందరంటారు కానీ (అంటే ఓ విప్లవాన్ని తీసుకురావటం వంటివి) నాకైతే కవిత్వం పరమావధి అందం, ఆనందం కొండొకచో ఒక దృక్పధం పట్ల పాఠకులలో ఒక బెంట్ ఆఫ్ మైండ్ ని కలిగించటమే అని అభిప్రాయపడతాను." అన్నారు.
అందం కోసవే ఐతే చక్కగా ఈ న్యూయార్కు మహానగరంలో ఎవరికో కాని కనపడని సూర్యోదయాన్ని చక్కగా ప్రతిరోజూ ఉదయం నేను పరమానందంగా చూడగలను. అందం కోసవే ఐతే మా ఇంటి దగ్గరే ఉన్న ఇ...రా షుల్మాన్ అందాన్ని అందంకోసం, ఆ అందం కలిగించే మోహం ఇచ్చే ఆనందం కోసం రోజూ కాకపోయినా అదపాదడపా చూడగలను. ఆ అందాల్ని, ఆ అందాలిచ్చే ఆనందాల్ని మాత్రవే తమలో నింపుకున్న కవితలు, చదవంగానే మరపుకొస్తాయి నాకు. చదేవేప్పుడు బాగుంటాయి, కానీ పేజి తిప్పగానే కవితకూడా మసకబారిపోతుంది.
ఇవి మరేవనుకోకండి ఇలా అంటున్నానని, ప్లేబాయ్ సెన్టర్ ఫోల్డ్ చూసినట్టే, ఆ సెన్టర్ ఫోల్డ్ని మడిచిన మరుక్షణం ఆ అందాల ఆరగింపు మనసునుంచి జారిపోతుంది. పాత కాలపు అందవైన, ఆరోగ్యవైన, చక్కని గుండ్రని ఆడవాళ్ళ పెయింటింగ్ లాగా. అదే మీరు ఏ గుఎర్నికానో చూడండి, ఏ పుత్తడిబొమ్మ పూర్నమ్మనో మళ్ళా చదవండి, చిత్రం, కవితా మసకబారిపోవచ్చు, వాటిని మనం మర్చికూడా పోవచ్చు కానీ అవి ఒదిలేసిన అనుభవపు, ఆ చిత్రకారుని, కవి యొక్క అనుభూతుల మరకలు మాత్రం శాశ్వతం. అదీ కవిత్వానికి అవసరం. జీవన సౌందర్యంతోబాటు, భీభచ్చవైన జీవన వాస్తవికత కూడా పలికిన కవిత అమరమవుతుంది. తాకీ తాకకుండా మనసుని తాకే అందం, ఆనందం అనే అనుభూతుల్ని, భీబచ్చవైనదే అయినా ఆ వాస్తవికత మనసులోకి మరింతలోతుగా గుచ్చుతుంది. ఎన్నిసార్లు బతుకులో నవ్వుకున్నావో మనకు గుర్తులేకపోవచ్చు బాబాగారు, ఎన్ని సార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావో తప్పకుండా గుర్తువుంటుంది. బతుకు అలాగే సాగుతుంది. లేకపోతే కవిత కూడా తెలుగు సినిమాలా, నేలని విడిచి నాట్యమాడుతుంది. సామాజిక ప్రయోజనవంటే ఈ అన్ని అనుభూతుల్ని కలగలిపిన జీవన వాస్తవాన్ని చెప్పటవే. అదేవీ ఎర్ర పదంకాదు, వెర్రి పదం కాదు, వెలివెయ్యాల్సిన పదం కాదు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
రవికిరణ్ గారికి
ReplyDeleteనమస్కారములు
నేనిచ్చిన లింకును చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదములు.
మీ అభిప్రాయాలతో నేను నూరుశాతం ఏకీభవించలేకపోయినా, తొంభై శాతం ఏకీభవిస్తాను. ఎందుకంటే మీరు చెప్పిన విధానం చాలా చాలా కన్వింన్సింగా ఉంది.
ఆ పది శాతం ఎందుకు ఏకీభవించలేకపోతున్నానంటే, సాహిత్యం మానవజీవనగతులను మార్చివేసిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి (ఏ “లె మిజరబుల్స్” వంటి పుస్తకాలో తప్ప). అలా ఒక వాదాన్ని/ఒకే కోణాన్ని ప్రతిబింబించే కవిత్వాల పట్ల నాకు కొంత పేచీ ఉంది. అది కవి ప్రతిభను పూర్తిగా వెలికి తీయలేకపోవచ్చు (ఏ శ్రీశ్రీ వంటి వారికో మినహా). అలాంటిది పోగా పోగా చర్విత చరణమౌతాదన్న(redundancy error) భయం. అయినప్పటికీ మీరన్న” ఎన్నిసార్లు బతుకులో నవ్వుకున్నావో మనకు గుర్తులేకపోవచ్చు బాబాగారు, ఎన్ని సార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావో తప్పకుండా గుర్తువుంటుంది” అన్న మాటలు పరమసత్యం.
మానవ వైఫల్యాల్నీ, నిస్సహాయతల్నీ, వాస్తవాల్నీ, కన్నీళ్లనీ, ఆశల్నీ, సంతోషాల్నీ సాహిత్యం ప్రతింబించటం అవసరం అని నేను కూడా నమ్ముతున్నాను.
ఇక తొంభై శాతం ఒప్పుకోవటానికి మరో కారణం,
మొన్నొకసారి “పోలవరం నిర్వాసితులపై నే వ్రాసిన కవితను చూసి అఫ్సర్ గారు ఒక కామెంటు చేసారు. దానిని లోతుగా విశ్లేషించుకొన్నాక,ఎందుకో నా అభిప్రాయాలను సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని అర్ధమైంది. ఇదిగో ఇప్పుడు మరలా మీవాఖ్య ఇలా.........thank You sir
మీ అభిప్రాయాలు పంచుకొన్నందుకు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా