Sunday, August 9, 2009

వాళ్లీరోజు నాకోసం వచ్చారు...........*

(కె.జి. బేసిన్ సంపదను పొరుగు రాష్ట్రాలకు తరలించుకుపోవటాన్ని నిరసిస్తూ......)

భూమి నుంచి వచ్చిందేదైనా
భూమినే చేరుతుంది.
ఈ మట్టిలోంచి వచ్చి ఈ మట్టిలోకే
అదృశ్యమయ్యే ఈ మట్టి పుత్రులకెందుకు
ఈ మట్టి ఫలాలు అందటం లేదూ?

ఈ నేల నుంచి తోడిన శక్తిని
వాడెవడో తోలుకుపోవటం, మరెక్కడో
వెలుగు పువ్వులు పూయించుకోవటం
రొమ్మునుంచి బిడ్డను వేరుచేయటమే!
కోకిల కాకిపిల్లను గూడునుంచి కిందకు తొయ్యటమే!

దివిసీమ ఉప్పెనలో
ప్రాణాల్ని కోల్పోయిన ఎముకలు
ఘొల్లుమంటున్నాయి ఈ దాష్టీకానికి.
హైపర్ సైక్లోనులో తగులుకొన్న తెగులుకు
చితికి పోయిన కొబ్బరి తోటలు
బావురుమంటున్నాయి ఈ దారుణానికి.
అనాదిగా ఇక్కడి జీవితాల్ని
వరదల కొండచిలువ కబళిస్తూనే ఉంది.
తుఫానుల తాచుపాము కాటువేస్తూనే ఉంది.
ఈ నేల ప్రసాదించే అన్ని శాపాల్నీ ఇక్కడి జనం
కళ్ల కద్దుకొని భక్తిగానే స్వీకరిస్తున్నారు.
కానీ
ఈనాడు ఈ నేల ఇచ్చిన సంపదను మాత్రం
వాడెవడో వచ్చి పెద్ద గద్దలా తన్నుకుపోతున్నాడు.
వరాల్ని అసమానంగా పంచటమే నేటి రాజనీతి కామోసు..

ఈ మట్టి వాసనను తరలిస్తున్నారు
ఈ మట్టి రక్తాన్ని పిండుకుపోతున్నారు
ఈ మట్టి స్వప్నాల్ని దొంగిలిస్తున్నారు.

ఇది అనాదిగా జరుగుతున్నదే కావొచ్చు
అంతా చట్టబద్దంగానే ఉండొచ్చు
అలా చేసేవాడూ మన సహోదరుడే అవ్వొచ్చు.

అయినప్పటికీ
ప్రకృతి ఇచ్చే శాపాలు ఒకరి పాలు
వరాలు మరొకరి పాలు అంటే సహించేదెలా?
రొట్టెలో మనభాగమెంతో తేల్చమందాం.
ఈ నేల సారంతో పూచిన పూలను
ఇక్కడా పరిమళించమని శాసిద్దాం.

దూరంగా
“ఈ నేల మనదిరా... ఈ నింగి మనదిరా” పాట
ఇపుడెందుకో కొత్త అర్ధాలతో వినబడుతోంది.

బొల్లోజు బాబా


10 comments:

 1. ప్చ్ నిజం కదా, నోటి దగ్గర కూడు తన్నుకుపోయే గ్రద్దలు అన్నార్తుల కడుపు మీద తన్నే రాబందులు. లోపం వ్యవస్థది కుళ్ళిన సంఘానిదీను. హక్కులు సమభాగాలు వెరసి మీరన్న "ఈ నేల సారంతో పూచిన పూలను
  ఇక్కడా పరిమళించమని శాసిద్దాం" నిజం కావాలి... ఆ ఆకాంక్షతో...

  ReplyDelete
 2. వరాలు మన సొంతమవ్వాలని ఆశిద్దాం!!

  ReplyDelete
 3. "ఈ నేల సారంతో పూచిన పూలను
  ఇక్కడా పరిమళించమని శాసిద్దాం."
  చాలా బాగుంది బాబాగారు. ఇక్కడే పరిమళించమని కాక ఇక్కడా పరిమళించమని శాసించడం బాగుంది. మా సంపదని మేం పంచుకోడానికి సిద్దమే కానీ దోచుకోనివ్వడానికి మాత్రం కాదు అని చెప్పకనే చెపుతున్నది.

  ReplyDelete
 4. గుజరాత్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ ఆమ్యామ్యలకి అలవాటు పడ్డ మన నేతలు...
  మన సంపద తో పటు మనలని తాకట్టు పెట్టి చాలా వసంతాలు గడిచింది...
  హక్కుల కోసం, మన సంపదలో మన వాట కోసం మనమీద (on so called leaders) మనమే పోరాడి రోజు వచ్చింది...

  పోరాడితే పోఎదేముంది చీకటి రాత్రులు తప్ప ...

  I’ll give you an example: I gave a note to local leaders in Kakinada on how we can protect our energy and fight against local unemployment by participating a significant role in every Energy company in KG basin... (on March 28th, 2007) They said, they are already fighting for that and they don't need my suggestion... :-)  Baba Garu, Thanks for your poem, now I know that most of the peoples mind filled with these questions... Thanks again for touching current affairs now and then...

  - Ramesh

  ReplyDelete
 5. రొట్టెలో మనభాగమెంతో తేల్చమందాం.
  ఈ నేల సారంతో పూచిన పూలను
  ఇక్కడా పరిమళించమని శాసిద్దాం.
  ఇది నేడు భారత దేశప్రజలు తమను తాము తప్పక వేసుకోవాల్సిన ప్రశ్న.

  ReplyDelete
 6. sir chala bagundi mee kavitvam. kani yekkadi nela saram tho akkade puvvulu poiste akanda bartam mottam podota ela avutundi. em vuppen avachina kshnam desam mottam meda sanuboothi varshnichaleda.maharstra lo puttina godarini manam panchukotleda.ee akanda barata desam lo prathi kastannni prathi sukanni smanam ga panchukuntamani manam prathijna cheyyaleda.ee nela manadi,ee gas manadi ane vallandarik oka vijnapti ade notitho ee desam manadi ani eelugetti chatudam ee desa samagrataku nirlajjaga muppu teche rejakinaykullo simhalay garjiddam. kshminchandi mee bavalni kinchaparchadam naa vuddesam kadu

  ReplyDelete
 7. అనానిమస్ గారు

  మీ వాఖ్య తెలుగులో ఇలాగ చదువుకొన్నాను

  సర్
  చాలా బాగుంది మీ కవిత్వం. కానీ యెక్కడి నేల సారంతో అక్కడే పువ్వులు పూయిస్తే అఖండ భారతంమొత్తం పూదో ఎలా అవుతుంది, ఏమి ఉప్పెన వచ్చిన క్షణం దేశం మొత్తం మీద సానుభూతి వర్షించలేదా. మహారాష్ట్రలో పుట్టిన గోదావరిని మనం పంచుకోటంలేదా? ఈ అఖండ భారత దేశంలో ప్రతి కష్టాన్ని, ప్రతి సుఖాన్ని సమానంగా పంచుకుంటామని మనం ప్రథిజ్న చెయ్యలేదా. ఈ నేల మనది, ఈ గాస్ మనది అనే వాళ్లందరికి ఒక విజ్ఞప్తి అదే నోటితో ఈదేశం మనది అని ఎలుగెత్తి చాటుదాం. ఈ దేశా సమగ్రతకు నిర్లజ్జగా ముప్పు తెచ్చే రజకీయనాకుల్లో సింహలలై గర్జిద్దాం. క్షమించండి మీ భావాల్ని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు.

  అనానిమస్ గారు
  ముందుగా మీరంటున్న అభియోగం “నేల సారంతో అక్కడే పువ్వులు పూయిస్తే” అక్కడే అన్న మాట తప్పు,

  నే వ్రాసిన వాక్యాలు ఇవి
  ఈ నేల సారంతో పూచిన పూలను
  ఇక్కడా పరిమళించమని శాసిద్దాం.

  దాని అర్ధం, ఇక్కడమాత్రమే పూయించమని కాదు. ఇక్కడ కూడా పూయించమని. That makes a lot of difference. Isn’t it?

  I am not against sharing, but I am against taking away with out giving due share.

  cont....

  ReplyDelete
 8. To the rest of your argument this is my answer

  నిజమే ఉప్పెన వచ్చినప్పుడు, దేశం మొత్తం సానుభూతి చూపిస్తూంది. దానీ ఆ బాధను అనుభవించవల్సింది ఇక్కడి ప్రజలేకదా? నష్టాన్ని భరించవలసింది ఇక్కడి వాసులే కదా?

  మహారాష్ట్రలో పుట్టిన గోదావరిని పైపులైనులు వేసుకొని మనం ఇక్కడకు తీసుకు రావటం లేదు కదా? వాళ్లు వాటా వారు తీసుకోగా మిగిలిన నీటినే కదా మనం పొందుతున్నది. (ఇపుడు దానికీ లుకలుకలు మొదలవుతున్నాయి కదా)

  ఇక కొన్ని నిజాల లోకి వస్తే, కె.జి బేసిన్ లో ఉండిన గాస్ సుమారు అరవై లక్షల కోట్ల రూపాయిలవిలువ. దానిలో కనీసం పది శాతం కూడా ఇక్కడి అవసరాలకు పంచబడటం లేదు.

  రిలయన్సే కాదు, ఒ ఎన్.జి.సి కూడా ఇలాంటి ద్రోహమే చేస్తూంది గత రెండు దశాబ్దాలుగా. కోనసీమలోని చమురును, chennai రిపైనరీలకోసమై తరలించుకుపోతోంది. ఆ రిపైనరీలు ఈ ప్రాంతంలో కట్టినట్లయితే ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరుకుతుందిగా.

  ఇక్కడి గాస్ వస్తుందన్న అంచనాలతో, గుజరాత్లో ప్రతీ ఊరు ఊరికీ గాస్ గ్రిడ్ లను ఏర్పాటు చేసుకోవటం జరిగిందట. (అంటే గాస్ పంపిణీకి పైపులైన్లు). అక్కడ సిలండరు గాస్ ధర సుమారు నూట యాభై రూపాయిలకు సరఫరా చేస్తానని హామీ ఇచ్చిందట అక్కడి ప్రభుత్వం. సిలండరు మూడువందల రూపాయిలు పెట్టికొనుక్కొనే ఇక్కడి ప్రజలు ఆ గాస్ ఎక్కడి గాస్ అని ఆలోచిస్తే బాధ కలగడం అసహజమా?

  ఇదే విధమైన గొడవ అస్సాంలో జరిగినపుడు, అక్కడి ప్రజలు ప్రతిఘటించటం ధ్వారా, యాభై శాతం గాస్ ని అక్కడ అవసరాలకు వినియోగించాలని ఒప్పందం చేసుకోవటం జరిగింది.

  రాజ్యాంగంకూడా సహజవనరులవినియోగంలో స్థానికప్రజలను విస్మరించరాదని హెచ్చరిస్తుంది. మనమెన్ని ప్రతిజ్ఞలను చేసినా, రాజ్యాంగానికిలోబడే కదా.

  ఇక ఈ ప్రాంతంలోని ఉపాధికోల్పోయిన మత్సకారులకు (గ్రామాలకు గ్రామాలు ఖాలీ చేయించారు – డ్రిల్లింగ్ ప్రాంతంలో వేటనిషేదించారు), మొదట్లో అందరకూ ఫాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చి నమ్మబలికారు. (సుమారు ఇరవైవేలమందికి). అలానే construction టైమ్ లో వారికి పనిచూపించారు. కనష్ట్రక్షను పూర్తికాగానే వారిని బయటకు తోలేసారు. వాళ్లు కొన్నాళ్లు ఆందోళనచేయగా, నెలకు వెయ్యిరూపాయిలు ఉత్తినే ఇంటికి పంపించారు. (ఎంత దారుణం చూడండి, అది ముష్టిలా అనిపించటం లేదూ మీకు, అంతే కాక నాకైతే అది మనుషులపై ఉండే చులకన భావంగా అనిపిస్తూంటుంది) , ప్రస్తుతం అదీ నిలుపు చేసారు. మొత్తం ఉదంతంలో నష్టపోయింది ఎవరు స్థానికులు కాదా? మరి దీనికి పరిష్కారం ఏమిటి?
  ఏం? ఎక్కడో చెన్నై, గుజరాత్ లలో కట్టే రిపైనరీలు ఇక్కడే కట్టొచ్చుగా? కొంతమందికి ఉపాధికలుగుతుంది. ఏం? ఆ వనరులను ఇక్కడి ఫాక్టరీలకు, లేదా ఆ గాసుపై ఆధారపడే ఫాక్టరీలను ఇక్కడ నెలకొల్పే అవకాశం ఇచ్చినట్లయితే, ఇక్కడి స్థానికులకు కొంత నష్టం పూడుకోదా? ఒక ఫాక్టరీ తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒక వెయ్యికుటుంబాల జీవనం జరిగిపోదా?

  అయినప్పటికీ నా కవితలో నేనన్నమాటలివి

  ---- అంతా చట్టబద్దంగానే ఉండొచ్చు
  అలా చేసేవాడూ మన సహోదరుడే అవ్వొచ్చు.

  అన్నకవితా పాదాలు దేశసమగ్రతకు భంగం కలిగించేవిగా అనిపిస్తున్నాయా? మరొక్కసారి చదవండి.

  Think globally, act locally అన్న ఆలోచన మంచిదే కదా?

  ఇక రాజకీయాలగురించంటారా? వాటి గురించి ఎంతతక్కువ మాట్లాడుకొంటే అంతమంచిది. పైన రమేష్ గారి కామెంటు చూసారుగా?

  నా భావాల్ని కవిత ద్వారా పంచుకొన్నాను. ఇలాంటి భావస్వేఛ్చ ఖచ్చితంగా కొంతమందిలో bent of mind ని కలిగిస్తుందని విశ్వసిస్తాను.


  మరొక్క విషయం: ఈ కవిత వ్రాసినపుడు, ఎవరైనా ప్రశ్నిస్తే బాగుణ్ను అని అనుకొన్నాను. మనబ్లాగుల్లో కోస్తా బ్లాగరులు చాలామందే ఉండిఉంటారు. కానీ ఏ ఒక్కరూ బ్లాగుల్లో ఈ అంశాన్ని చర్చించక పోవటం నిరాశ కలిగించింది. కనీసం వారి వారి బ్లాగుల్లో కూడా. మీరు మీ అభిప్రాయాల్ని తెలియచేయటం సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.

  బొల్లోజు బాబా

  ReplyDelete