Thursday, October 30, 2014

నీటిపొర

తాగుడు పై సదభిప్రాయం లేకపోయినా
దురభిప్రాయం మాత్రం ఉండేది కాదు
అదో పురాతన విలాసం కదాని

కానీ
మొన్నోరోజు మా కాలేజీలో
ఓ విద్యార్ధిని తండ్రి తన కూతుర్ని
నలుగురెదుటా బూతులు తిడుతూ
అవమానించినపుడు
ఆమె కనుల నీటిపొరలో
తాగుబోతు తండ్రులందరూ
దగ్ధమైపోవాలనుకొన్నాను

“కొయిటా అమ్మ నా పేర్న పంపించే
డబ్బుల కోసమే ఇదంతా” అని ఆ అమ్మాయి అన్నప్పుడు
ఆ నీటిపొరలో ఈ మద్యప్రపంచం
కొట్టుకు పోవాలనుకొన్నాను

గత ఘర్షణల గాయాల్ని చూపించినపుడు
ఆ నీటిపొరలో ఈ మదపు నేల నిలువునా
కృంగి పోవాలనుకొన్నాను

సముద్రాన్నీదటానికి
పూచికపుల్లంత నమ్మకాన్ని తప్ప
ఏమివ్వగలిగాం? ఆరోజా అమ్మాయికి
*****
మూడ్రోజుల తరువాత
ముత్యాల్లాంటి అక్షరాలతో ఎసైన్మెంట్
రాసుకొచ్చిన ఆ అమ్మాయి
కనుల నీటిపొరలో ఎన్నెన్ని సౌందర్యాలు !


బొల్లోజు బాబా

Thursday, October 23, 2014

దీపావళి


కవులు దీపాల్లాంటి వారు
దీపారాధనలో
ఒక దీపం వందదీపాలను
వెలిగించినట్లుగా
కవి ఒక ఆలోచనను
సమాజంపై చల్లి
వేనవేల చైతన్య దీపాల్ని
పండిస్తాడు
ఈ ప్రపంచంలో ఎక్కడో, ఎప్పుడో ఏదో ఓ మూలనుంచి
చీకట్లోంచో లేక ఆకట్లోంచో
కవి కాంతి బొట్లుగా కాలంలోకి ప్రవహిస్తాడు
ఆకాశం నక్షత్రయుతమౌతుంది
నేల హరితకాంతుల్ని పొందుతుంది
దారితప్పిన అలలు దీపస్థంభాన్ని కనుగొంటాయి
కవి దీపధారా లేక
దీపమే కవిధారా అనేది
ఎవరూ తేల్చలేరు
ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తూంటుంది
దీపం వ్యక్తికి దారిచూపిస్తే
కవి సమాజానికి దారి
చూపిస్తూంటాడు
అందుకే నాకెవరైనా
కవి కనిపిస్తే
నడుస్తున్న దీపావళిని
చూసినట్లుంటుంది.
బొల్లోజు బాబా
(నిన్న కాకినాడలో "తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం" ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో చదివిన కవిత)